బాబు దొరికిపోవడం ఖాయం | KSR Interview With Pragna Bharati Chairman Dr. Tripuraneni Hanuman Chowdary | Sakshi
Sakshi News home page

Published Wed, May 9 2018 2:07 AM | Last Updated on Wed, May 9 2018 3:37 PM

KSR Interview With Pragna Bharati Chairman Dr. Tripuraneni Hanuman Chowdary - Sakshi

కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రజ్ఞాభారతి చైర్మన్‌ త్రిపురనేని హనుమాన్‌ చౌదరి

కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రజ్ఞాభారతి చైర్మన్‌ త్రిపురనేని హనుమాన్‌ చౌదరి
ఓటమి భయంవల్లో తనపై ఉన్న కేసులపై దాడులు జరుగుతాయన్న భీతి వల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విపరీత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని ప్రజ్ఞాభారతి చైర్మన్‌ త్రిపురనేని హనుమాన్‌ చౌదరి స్పష్టం చేశారు. కేంద్రాన్ని, మోదీని టార్గెట్‌ చేసుకుని మరీ బాబు విమర్శిస్తున్నప్పుడు చంద్రబాబును కూడా కేంద్రం టార్గెట్‌ చేయవచ్చని, అలా జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఫిరాయింపులకు ప్రస్తుతం ఎవరూ అతీతులు కాదని, వైఎస్సార్సీపీ మాత్రం ఇతర పార్టీల నేతలను తమ పదవులకు రాజీనామా చేయించిన తర్వాతే తనలోకి చేర్చుకుంటోందంటే వైఎస్‌ జగన్‌ని శ్లాఘించాల్సి ఉంటుందన్నారు. జనం తనను విశ్వసించడం లేదని తేలిపోయింది కనుకే చంద్రబాబులో అభద్రతా భావం పెరిగిపోయిందంటున్న త్రిపురనేని హనుమాన్‌ చౌదరి అభిప్రాయం ఆయన మాటల్లోనే...

ఈమధ్య మీరు చాలా ఆవేదనతో ఉన్నట్లున్నారు?
చెప్పలేనంత ఆవేదన ఉంది. 21 రోజులు పార్లమెంటును స్తంభింపజేసి పారేసిన తర్వాత అయినా ప్రధాని నరేంద్రమోదీ తన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఒప్పించుకుని వారందరితో మాట్లాడిన తర్వాత తనను వ్యతిరేకించినవారినే ఎండగట్టవచ్చుగదా. అదేమీ చేయకుండా, విదేశీ యాత్రలకు వెళ్లిపోయారంటేనే చాలా బాధగా ఉంది. మీరు చేసే గొడవ తప్పు. అందులో వాస్తవాలు లేవు అని చెప్పాల్సిన బాధ్యత ప్రధానికి లేదా?

ప్రధాని ఎందుకలా చేశారంటారు?
ఎందుకంటే.. ఇంట్లో ఈగల మోత. బయట పల్లకీల మోత. ప్రపంచమంతా నీకు మంచి నాయకుడని సర్టిఫికెట్‌ ఇస్తుంది. ఆ స్థాయిని సంపాదించుకుంటున్నప్పుడు పార్లమెంటరీ విధానాన్ని బలపర్చకుండా అలా వెళ్లిపోయారే అని మోదీపై బాధ.

చంద్రబాబు ఇప్పుడెలా ఉన్నాడని మీ భావన?
చెప్పరాని, వర్ణించడానికి వీలులేని పద్ధతిలో ఉన్నాడు. నాలుగేళ్లు బీజేపీతో బంధం పెట్టుకున్న తర్వాత ఎందుకీ స్టెప్‌ తీసుకున్నాడు? నాకు బాబుపై ఒకటే సందేహం. కాంగ్రెస్‌తో కలిశారు. బీజేపీతో కలిశారు. కమ్యూనిస్టులతో కలిశారు. టీఆర్‌ఎస్‌తో కలిశారు. ఇన్నిపార్టీలతో, ఇంతమందితో కలిశారు కదా. వీళ్లను దేనికి ఉపయోగించుకున్నారు అని ఆలోచించగా.. బాబు తన గొప్పతనం కోసం ఉపయోగిం చుకుంటున్నారేమో అనిపిస్తుంది. తన అభద్రతా భావమే దీనంతటికీ కారణమనిపిస్తుంది.

బాబులో ఆ భయం, ఆ అభద్రత పునాది ఏమిటి?
గతంలో ఒకటికి రెండుసార్లు పార్టీపరంగా. ఎన్నికల్లో ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారని బాబును అప్పట్లోనే అడిగితే మీబోటి వాళ్లు చెప్పడం వల్లే ఓడిపోయాను అన్నారు. అభివృద్ధికోసం ఇలా చెయ్యండి, ఇలా చెయ్యకండి, జిమ్మిక్కులు, ప్రజాకర్షణ పథకాల జోలికి పోవద్దని సలహా చెప్పాం. దాంతో అభివృద్ధి అని పదే పదే చెప్పి ఓడిపోయాను. ప్రజలకు కావలసింది లల్లూ ప్రసాద్‌ కానీ డెవలప్‌మెంట్‌ కాదు. ఇక నుంచి డెవలప్‌మెంట్‌ను ఎజెండా కింద చెప్పను. గెలవడమే నాకు ఇక ముఖ్యం అని అప్పట్లోనే చాలా కచ్చితంగా చెప్పారు చంద్రబాబు. 

చంద్రబాబులో ఆ అభద్రత ఎక్కడినుంచి వచ్చింది?
బీజేపీతో, మోదీతో, పవన్‌ కల్యాణ్‌తో కలిసి వైఎస్సార్సీపీపై పోటీ చేస్తేనే కేవలం 5 లక్షల ఓట్లు మెజారిటీ వచ్చింది టీడీపీకి. అలాంటిది ఇప్పుడు బీజేపీ వద్దనుకుంటే, పవన్‌ కల్యాణ్‌ వేరేచోటికి వెళితే చంద్రబాబు గెలుస్తాడా? అదే అభద్రతా భావం పుట్టుకొచ్చినట్లుంది.

మోదీని బాగా వెనుకేసుకొచ్చిన బాబు ఇప్పుడు దాడి చేస్తున్నారే?
దాన్నే భయోత్పాతం అంటారు. ఎప్పుడైతే భయం ఉంటుందో ఇలాం టివన్నీ వస్తాయి. 

ఓటమి భయమేనా, లేక కేసులపై దాడి జరుగుతుందనే భయం కూడానా?
అది కూడా జరుగుతుంది మరి. జరగవచ్చు కూడా. సీబీఐ అంటే, ఈడీ అంటే ప్రభుత్వ కీలుబొమ్మలవుతున్నాయని తెలుసుకదా. ఎంపిక చేసుకుని మరీ వాళ్లు దాడి చేస్తున్నారు కదా. మరి ఇప్పటివ్యవస్థలో తప్పులు చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? నాతోసహా పన్నులు ఎగవేయకుండా ఎవడైనా నిజాయితీగా ఉన్నాడా? అదే భయకారణమవుతుంది కదా.

బాబు ఏ కేసులో ఎక్కడ దొరికే అవకాశం ఉంది? 
సరైన సమయంలో, సరైన వ్యూహంతో మేం బయటకు వస్తాం అని మీరనుకుంటున్నప్పుడు ఇతరులకు కూడా అలాంటి సమయాలు, అలాంటి వ్యూహాలు ఉంటాయి కదా. అలాగే సమయం చూసుకుని వారు కూడా రావచ్చు. అది ఎప్పుడు ఉపయోగించాలో వాళ్లకూ తెలుసు కదా? అందుకే ఆ భయం.

ఏపీలో అవినీతిపై బీజేపీ దాడి చేస్తోంది కదా?
ఒక ఎమ్మెల్యేకి కృష్ణాజిల్లాలో గెలవాలంటే 50 కోట్లు అవసరం పడుతోందిప్పుడు. అంత డబ్బు ఎక్కడినుంచి వస్తోంది? అందుకనే పోలవరం ఖర్చు ఇంతింతై వటుడింతై అన్నట్లుగా 7 వేలకోట్ల నుంచి 17 వేల కోట్ల నుంచి 85 వేల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదంతా అవినీతి కాదా? కేవలం పునరావాసం కోసమే రూ. 20 వేల కోట్లు పెడతారా?

ఫిరాయింపులను వ్యతిరేకిస్తారా, ప్రోత్సహిస్తారా?
ఫిరాయింపులు చేయడం మంచిది కాదు. నిజమే కానీ ఫిరాయింపులు చేయని వారున్నారా? చంద్రబాబు ఎన్నిసార్లు ఫిరాయించారో తెలుసు కదా. కంచే చేసు మేస్తున్నప్పుడు దాన్ని ఏవరాపగలరు? ఎవరైనా పార్టీలో చేరాలంటే తమ పదవులకు రాజీనామా చేసి మరీ చేరవచ్చు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి చేరాలని ఎవరైనా అనుకుంటే వారంతా రాజీనామా చేసి మళ్లీ గెలిచి వెళితే బాగుండేది. 

వైఎస్‌ జగన్‌ ఫిరాయింపులకు వ్యతిరేకం కదా? 
అందరూ ఫిరాయింపులు చేస్తున్నారు కదా. దానికి భిన్నంగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోందని అంటున్నారు. దానికి వైఎస్‌ జగన్‌కి నిజంగా అభినందనలు తెలుపుతాను. ఇతర పార్టీల నుంచి తనవద్దకు వచ్చినవారి చేత రాజీనామాలు ఇప్పించిన తర్వాతే చేర్చుకున్నారంటే, అది చాలా సరైన పద్ధతి. అందుకే నేను ఆయనను శ్లాఘిస్తున్నాను. ఐ రియల్లీ కంగ్రాచ్యులేట్‌ జగన్‌. ఆయన నిజాయితీని మనం ఖచ్చితంగా శ్లాఘించాల్సిందే.

చంద్రబాబును జనం విశ్వసిస్తున్నారా?
జనంలో తనకు విశ్వసనీయత ఉందని ఆయన అనుకుంటున్నారు. కాని అది ఆయనకు లేదనే నా భావన. ఆ నమ్మకమే ఆయనకు ఉంటే ఆ అభద్రత ఎందుకొచ్చింది? జనం విశ్వసించే ఉంటే రెండుసార్లు ఎందుకు పార్టీ ఓడిపోయింది?
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement