
పాకిస్తాన్ వేదికగా ఫిబ్రవరి 19న మొదలైన చాంపియన్స్ ట్రోఫీ-2025(Champions Trophy) ఎడిషన్ మార్చి 9న దుబాయ్‌లో ముగిసింది. టైటిల్ పోరులో న్యూజిలాండ్‌తో తలపడ్డ టీమిండియా జయకేతనం ఎగురవేసి ట్రోఫీని ముద్దాడింది. గ్రూప్ దశలో మూడు.. సెమీస్, ఫైనల్ గెలిచి అజేయంగా ఈ వన్డే టోర్నమెంట్‌ను ముగించింది.
ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది. ఈ పదకొండు మంది సభ్యుల జట్టులో భారత్ హవా కొనసాగింది. టీమిండియా నుంచి ఈ జట్టులో ఏకంగా ఐదుగురు క్రికెటర్లు స్థానం సంపాదించారు.
పాకిస్తాన్‌కు మొండిచేయి
మరోవైపు.. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి గెలుపన్నదే లేకుండా నిష్క్రమించిన పాకిస్తాన్‌కు మొండిచేయి ఎదురైంది. అంతేకాదు.. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ జట్ల నుంచి కూడా ఒక్క ఆటగాడూ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించలేకపోయాడు.
ఇక టీమిండియా తర్వాత న్యూజిలాండ్ నుంచి అత్యధికంగా నలుగురు ఐసీసీ ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకున్నారు. అదే విధంగా అఫ్గనిస్తాన్ నుంచి ఇద్దరు ఇందులో ఉన్నారు.
అయితే, ఇందులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు మాత్రం చోటు దక్కకపోవడం గమనార్హం. ఈ జట్టుకు సారథిగా కివీస్ నాయకుడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.
నాలుగు వికెట్ల తేడాతో ఓడించి
కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ పోటీపడగా.. టీమిండియా, కివీస్ సెమీస్ చేరాయి. గ్రూప్-బి నుంచి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, అఫ్గనిస్తాన్ బరిలో దిగగా.. ఆసీస్, ప్రొటిస్ జట్లు సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టాయి.
ఈ క్రమంలో తొలి సెమీస్ మ్యాచ్‌లో భారత్- ఆసీస్‌ను... రెండో సెమీస్‌లో కివీస్ ప్రొటిస్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో రోహిత్ సేన సాంట్నర్ బృందాన్ని నాలుగు వికెట్ల తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది.
ఈ మ్యాచ్‌లో 76 పరుగులతో రాణించిన భారత సారథి రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. మొత్తంగా రెండు శతకాల సాయంతో 263 పరుగులు సాధించిన కివీస్ యువ ఆటగాడు రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కింది.
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ‘టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్’
రచిన్ రవీంద్ర(న్యూజిలాండ్), ఇబ్రహీం జద్రాన్(అఫ్గనిస్తాన్), విరాట్ కోహ్లి(ఇండియా), శ్రేయస్ అయ్యర్(ఇండియా), కేఎల్ రాహుల్(ఇండియా), గ్లెన్ ఫిలిప్స్(న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్(అఫ్గనిస్తాన్), మిచెల్ సాంట్నర్(కెప్టెన్, న్యూజిలాండ్), మ్యాట్ హెన్రీ(న్యూజిలాండ్), వరుణ్ చక్రవర్తి(ఇండియా)
12వ ఆటగాడు: అక్షర్ పటేల్(ఇండియా)
చాంపియన్స్ ట్రోఫీ-2025లో వీరి ప్రదర్శన
👉రచిన్ రవీంద్ర- రెండు శతకాల సాయంతో 263 రన్స్. స్పిన్ బౌలర్‌గానూ రాణించిన రచిన్. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపిక
👉ఇబ్రహీం జద్రాన్- ఒక సెంచరీ సాయంతో 216 పరుగులు. ఇంగ్లండ్‌పై అఫ్గన్ గెలుపొందడంలో కీలక పాత్ర
👉విరాట్ కోహ్లి- ఒక శతకం సాయంతో 218 పరుగులు. పాకిస్తాన్‌పై అజేయ సెంచరీ. వన్డేల్లో అత్యంత వేగంగా పద్నాలుగు వేల మార్కు అందుకున్న క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు.
👉శ్రేయస్ అయ్యర్- రెండు అర్ధ శతకాల సాయంతో 243 రన్స్. టీమిండియా చాంపియన్‌గా నిలవడంతో కీలక మిడిలార్డర్ బ్యాటర్‌గా రాణింపు.
👉కేఎల్ రాహుల్- 140 పరుగులు. వికెట్ కీపర్‌గానూ సేవలు.
👉గ్లెన్ ఫిలిప్స్- 177 పరుగులు. రెండు వికెట్లు, ఐదు క్యాచ్‌లు.
👉అజ్మతుల్లా ఒమర్జాయ్- 126 రన్స్, ఏడు వికెట్లు.
👉మిచెల్ సాంట్నర్- 4.80 ఎకానమీతో తొమ్మిది వికెట్లు
👉మహ్మద్ షమీ- 5.68 ఎకానమీతో తొమ్మిది వికెట్లు. ఇందులో ఓ ఫైవ్ వికెట్ హాల్.
👉మ్యాట్ హెన్రీ- 5.32 ఎకానమీతో పది వికెట్లు
👉వరుణ్ చక్రవర్తి- 4.53 ఎకానమీతో తొమ్మిది వికెట్లు
👉అక్షర్ పటేల్- 4.35 ఎకానమీతో ఐదు వికెట్లు.
చదవండి: అతడు మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడు.. ఓడినా గర్వంగానే ఉంది: కివీస్ కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment