టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుది ఎప్పుడూ ద్వంద్వ వైఖరే. ప్రతిపక్షంలో ఉంటే.. పూర్తి స్వేచ్ఛ కావాలంటారు. స్వయంగా కార్యకర్తలను రెచ్చగొడతారు. కళ్లేదుటే పార్టీ కార్యకర్తలు పోలీసులపై దాడులు చేసినా కిమ్మనరు. కానీ.. అధికారంలో ఉంటే మాత్రం సీన్ రివర్స్ అయిపోతుంది. ముఖ్యమంత్రిగా తనను ఎవరూ కించిత్ మాట అనకూడదు. సోషల్ మీడియా కూడా ఏ రకమైన విమర్శ చేయకూడదు. వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారు. తండ్రి ఇలా ఉంటే.. కుమారుడు ఇంకోలా ఉండేందుకు అవకాశం లేదన్నట్లు లోకేష్ కూడా రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు! ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే...
ఐదురోజుల క్రితం వైస్సార్‌సీపీ రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలని సంకల్పించింది. కానీ.. ఈ కార్యక్రమం కోసం సిద్ధమవుతున్న పార్టీ శ్రేణులు, నేతలను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించేశారు. పలుచోట్ల నేతలను గృహ నిర్భంధంలో పెట్టారు. వీటిని ఎదుర్కొంటూ కొందరు వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆందోళన చేశారు. రైతులూ వీరికి మద్దతుగా నిలిచారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులు పడుతున్న ఇక్కట్లు ఇన్ని,అన్నీ కావు. వరికి గిట్టుబాటు ధరలు లేవు సరికదా.. ధాన్యం కొనుగోళ్లలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఫలితంగా ధాన్యం వర్షానికి తడిచి మొలకెత్తి పోతూండటంతో రైతులు నిస్సహాయ స్థితిలో పడిపోతున్నారు. ప్రభుత్వం ధాన్యం దాచుకునేందుకు కనీసం గోనె సంచులను కూడా సమకూర్చ లేకపోతోందని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు తేమశాతం నెపం చెప్పి బస్తాకు రూ.200 నుంచి రూ.400లు తగ్గించి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.
సమస్య ఎక్కడ ఉంటే అక్కడకు తాను వెళతానని బీరాలు పలికిన చంద్రబాబు రైతుల కళ్లాల వద్దకు మాత్రం వెళ్లడం లేదు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కొన్ని చోట్ల పర్యటిస్తే రైతులు ఆయనను నిలదీశారు. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి సమస్యలు పెద్దగా లేవని, రైతు భరోసా కేంద్రాలు బాగా పని చేశాయని రైతులు వివరిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం జగన్ తీసుకువచ్చిన వ్యవస్థలను విధ్వంసం చేసే క్రమంలో రైతు భరోసా కేంద్రాలను నీరుకారుస్తోంది. అలాగని ప్రత్యామ్నాయాలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో రైతులిప్పుడు మిల్లర్ల దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్ టైమ్ లో పెట్టుబడి సాయం రైతు భరోసా కింద రైతులకు రూ.13,500ల చొప్పున నిర్దిష్ట విడతలలో అందించేవారు. తాము అధికారంలోకి వస్తే రూ.20 వేలు ఇస్తామని కూటమి నేతలు ఊదరగొట్టారు. కానీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతున్నా బాబు, పవన్ కళ్యాణ్‌లు ఎవ్వరూ దీని ఊసే ఎత్తడం లేదు. గతంలో ఉన్న ఉచిత బీమా సదుపాయం కూడా ఇప్పుడు రైతులకు లేకుండా పోయింది. తుపానుకు దెబ్బతిన్న పంటలకు పరిహారం అంతంతమాత్రంగానే అందుతోందని చెబుతున్నారు.
టమోట రైతులు కూడా రూపాయికి కిలో చొప్పున అమ్ముకోవాల్సి వస్తోంది. జగన్ పాలనలో ధరల స్థిరీకరణ నిధి ద్వారా ధరలు గణనీయంగా పడిపోకుండా అడ్డుకోగలిగేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇలాంటి అనేక సమస్యలపై వైసీపీ నేతలు వినతిపత్రాలు ఇవ్వబోతే వాటిని స్వీకరించడానికి ఏమి ఇబ్బంది వచ్చిందో అర్థం కాదు. పార్టీ నేతలు వైఎస్ అవినాశ్ రెడ్డి, సతీష్ రెడ్డి మల్లాది విష్ణు తదితరులను గృహ నిర్భంధం చేసినట్లు వార్తలు వచ్చాయి. అనేక పోలీస్ స్టేషన్లలో వైసీపీ కార్యకర్తలు, నేతలను నిర్భంధించారు. పలు కలెక్టరేట్ల వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దీనినే ప్రజాస్వామ్యం అనుకోండని చంద్రబాబు ప్రభుత్వం చెబుతోంది. దీనినే స్వేచ్చ అని భావించాలని చెబుతున్నారు. ఈ పాటి చిన్న నిరసననే అణచి వేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదంటే ప్రభుత్వం ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రైతులలో ఉన్న అసంతృప్తి బయటపడుతోందని భయపడుతోందని అర్థం. హామీల అమలుపై నిలదీస్తారన్న ఆందోళన కావచ్చు.
ఏపీలో పోలీసులు ఈ రకంగా అనేక సందర్భాలలో వైసీపీ వారిని అణచివేయాలని చూస్తున్నారు. పులివెందుల సమీపంలోని వేముల ఎమ్.ఆర్.ఓ. ఆఫీస్ వద్ద నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి టీడీపీ వారి అరాచకాలను కవర్ చేయడానికి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ వారు దాడి చేశారు. కెమెరాను ధ్వంసం చేశారు. రిపోర్టర్లపై దౌర్జన్యం చేశారు. ఇంతకాలం పోలీసులు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై జులుం ప్రదర్శించారు. ఇష్టారీతిన కేసులు పెట్టారు. వారిని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్ కు తిప్పుతున్నారు. ఇప్పుడు జర్నలిస్టులను కూడా వేధించడం ఆరంభించినట్లుగా ఉంది. చంద్రబాబు లక్షణం ఏమిటంటే తాను జర్నలిస్టులతో బాగున్నట్లు కనిపించడానికి యత్నిస్తారు. అదే టైమ్ లో తన వైఫల్యాలను రాసే జర్నలిస్టులను మాత్రం రకరకాలుగా ఇబ్బందులు పెడుతుంటారు.
జగన్ టైమ్ లో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి ఎల్లో మీడియా పచ్చి అబద్దాలు రాసినా, అదే మీడియా స్వేచ్ఛ అని ప్రచారం చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తన సూపర్ సిక్స్ హామీల గురించి ప్రశ్నించే సోషల్ మీడియా కార్యకర్తలను, జర్నలిస్టులను వేధిస్తున్నారు. ఈ సందర్భంలో పలువురిపై వ్యవస్థీకృత నేరాల సెక్షన్ లను కూడా ప్రయోగించడానికి వెనుకాడడం లేదు. నిజానికి సోషల్ మీడియాకు చట్టంలోని ఆ నిబంధనలు వర్తించవు. ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. గత పదేళ్లలో ఒకటికి మించి ఛార్జిషీట్లు ఎవరిపైన అయినా ఉంటే, వాటిని మెజిస్ట్రేట్ పరిగణనలోకి తీసుకుంటే, అప్పుడు ఈ సెక్షన్లు వర్తిస్తాయని తెలిపింది. అయినా చంద్రబాబు ప్రభుత్వంలోని పోలీసులు మాత్రం చట్టంతో తమకు నిమిత్తం లేనట్లు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్లు వార్తా కథనాలు వస్తున్నాయి. కొన్నిసార్లు పోలీసులే కిడ్నాపర్ల అవతారం ఎత్తి, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకుపోతున్నారని చెబుతున్నారు.
కొద్ది రోజుల క్రితం గుంటూరులో ప్రేమ్ కుమార్ అనే కార్యకర్తను తెల్లవారుజామున నంబర్ ప్లేట్ లేని కారులో వచ్చి భయపెట్టి తీసుకుపోయారట. దీని గురించి మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. చంద్రబాబు ప్రభుత్వం ఎంత అణగదొక్కాలని చూసినా, వైసీపీ కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున బయటకు వచ్చి పోలీసులను ఎదుర్కున్నారు. రైతులకు ఇచ్చిన హామీల గురించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట మాత్రంగా ప్రస్తావించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కుంటున్నది చంద్రబాబు ,పవన్ కళ్యాణ్‌ల ప్రభుత్వమేనేమో!
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment