
టీమిండియా మొట్టమొదటి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ కపిల్ దేవ్ (Kapil Dev). ఈ దిగ్గజ ఆల్‌రౌండర్ సారథ్యంలో 1983 నాటి వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో వెస్టిండీస్‌ను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోని (MS Doni) నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్‌కప్, 2013 చాంపియన్స్ ట్రోఫీని భారత్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలో సుదీర్ఘ విరామం తర్వాత గత రెండేళ్ల కాలంలో మరో రెండు ప్రపంచకప్ టైటిళ్లను టీమిండియా తన ఖాతాలో వేసుకుంది. రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీలో టీ20 ప్రపంచకప్-2024.. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 ట్రోఫీలను కైవసం చేసుకుంది.
సూర్యకుమార్ యాదవ్‌కు పగ్గాలు
ఇక పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ వారసుడిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) హార్దిక్ పాండ్యా పేరును ప్రకటిస్తుందనుకుంటే.. సూర్యకుమార్ యాదవ్‌కు పగ్గాలు అప్పగించింది.
మరోవైపు.. వన్డేలకు, టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతుండగా.. ఆయా ఫార్మాట్లలో శుబ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా అతడికి డిప్యూటీలుగా వ్యవహరిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జరుగనుండగా.. వన్డే వరల్డ్‌కప్ 2027లో జరుగనుంది.
నా ఎంపిక మాత్రం హార్దిక్ పాండ్యానే
ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల క్రికెట్ టీమిండియాకు సరైన కెప్టెన్ ఎవరన్న అంశంపై దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. ‘‘నా వరకు హార్దిక్ పాండ్యానే టీమిండియా వైట్‌బాల్ కెప్టెన్‌గా ఉండాలి. ఈ పదవికి చాలా మంది పోటీలో ఉన్నారని తెలుసు.
అయితే, నా ఎంపిక మాత్రం హార్దిక్ పాండ్యానే. అతడు యువకుడు. వచ్చే రెండు ఐసీసీ ఈవెంట్ల కోసం అతడి చుట్టూ జట్టు నిర్మిస్తే బాగుంటుంది. నిజానికి పాండ్యా టెస్టు క్రికెట్ కూడా ఆడితే బాగుంటుంది.
కానీ అతడు చాలా కాలంగా రెడ్ బాల్ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అందుకే టీమిండియాకు మూడు ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్ల అవసరం ఏర్పడింది’’ అని కపిల్ దేవ్ అన్నాడు. ‘మైఖేల్’తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
గాయాల బెడద ఎక్కువని పక్కన పెట్టారు
అయితే, హార్దిక్‌ను కాదని సూర్యను టీ20 కెప్టెన్‌గా నియమించిన సమయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇందుకు గల కారణాన్ని వెల్లడించాడు. పేస్‌బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్‌కు గాయాల బెడద ఎక్కువని.. అతడి లాంటి అరుదైన ఆటగాడిని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే కెప్టెన్సీ భారం మోపలేదని స్పష్టం చేశాడు.
కపిల్ దేవ్ మాత్రం ఇలా
కానీ.. కపిల్ దేవ్ మాత్రం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో సూర్య, శుబ్‌మన్‌లను కాదని హార్దిక్ పాండ్యా పేరును మరోసారి కెప్టెన్సీ ఆప్షన్‌గా తెరమీదకు తీసుకురావడం విశేషం. కాగా టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్నారు. తదుపరి జూన్‌లో ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో జాతీయ జట్టు తరఫున విధుల్లో చేరనున్నారు.
ఇక క్యాష్ రిచ్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా గతేడాది నియమితుడైన హార్దిక్ పాండ్యా.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్-2024లో పద్నాలుగు మ్యాచ్‌లకు హార్దిక్ సేన కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో మూడు ఓడిపోయింది.