రోహిత్ శర్మ (PC: Mumbai Indians X)
టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) భవితవ్యం విషయంలో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. మెజారిటీ మంది విశ్లేషకులు, కామెంటేటర్లు చెప్పినట్లుగా ‘హిట్‌మ్యాన్’ ముంబై ఇండియన్స్‌ను వీడలేదు.
కెరీర్ ఆరంభం నుంచి తనకు అండగా నిలబడ్డ ఫ్రాంఛైజీతో కొనసాగేందుకే అతడు మొగ్గుచూపాడు. రోహిత్ అభిమానులకు కూడా ఇది ఒకరకంగా షాకిచ్చిందనే చెప్పవచ్చు.
కాగా ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై ఇండియన్స్ విడుదల చేసిన రిటెన్షన్ జాబితాలో రోహిత్ శర్మకు చోటు దక్కిన విషయం తెలిసిందే. అయితే, టాప్-3లో మాత్రం అతడికి స్థానం ఇవ్వలేదు ముంబై. తమ ప్రాధాన్య ఆటగాళ్లలో రోహిత్‌ను నాలుగో ప్లేయర్‌గా అట్టిపెట్టుకుంది. దీంతో మరోసారి అతడి ఫ్యాన్స్ ఫ్రాంఛైజీపై మండిపడుతున్నారు.
అందుకే వారికి పెద్దపీట
ఈ నేపథ్యంలో తాను నాలుగో ప్లేయర్‌గా ఉండటంపై రోహిత్ శర్మ స్పందించాడు. అంతర్జాతీయ టీ20ల నుంచి తాను రిటైర్ అయిన కారణంగా తనకు అదే సరైన స్థానమంటూ.. ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని సమర్థించాడు. జాతీయ జట్టుకు ఆడుతున్న క్రికెటర్లకే మొదటి ప్రాధాన్యం దక్కుతుందని.. అందుకే ఫ్రాంఛైజీ వాళ్లకు పెద్దపీట వేసిందని చెప్పుకొచ్చాడు.
ఇది సరైన నిర్ణయమని తానూ నమ్ముతున్నానన్న రోహిత్.. కోరుకున్న ఆటగాళ్లను వేలంలోకి వదిలేసి మళ్లీ కొనుక్కోవడం కష్టమని పేర్కొన్నాడు. ఇక గత రెండు- మూడేళ్లుగా తమ జట్టు స్థాయికి తగ్గట్లుగా రాణించలేకోయిందని.. ఈసారి మాత్రం పొరపాట్లు పునరావృతం కానివ్వమని చెప్పాడు.
ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్ర
ముంబై తరఫున తాను చాలా ఏళ్లుగా క్రికెట్ ఆడుతున్నానని.. సహచర ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును మెరుగైన స్థితిలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపాడు.
ట్రోఫీలు గెలవడంలో ముంబై ఇండియన్స్‌కు ఘనమైన చరిత్ర ఉందన్న రోహిత్ శర్మ... క్లిష్ట పరిస్థితుల్లోనూ పోరాటపటిమ కనబరిచి గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నాడు. కాగా అంబానీల సారథ్యంలోని ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా వ్యవహరించిన రోహిత్ శర్మ జట్టును ఏకంగా ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపాడు.
అనూహ్య రీతిలో రోహిత్‌పై వేటు
తద్వారా క్యాష్ రిచ్ లీగ్‌లో ఈ ఘనత సాధించిన తొలి సారథిగా చరిత్రకెక్కాడు. అయితే, ఈ ఏడాది అనూహ్య రీతిలో ముంబై కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించి.. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాను నియమించింది.
గుజరాత్ టైటాన్స్ నుంచి హార్దిక్‌ను ట్రేడ్ చేసుకుని మరీ జట్టు పగ్గాలు అప్పగించింది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులు ఫ్రాంఛైజీతో పాటు హార్దిక్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ఈ ఏడాది అట్టడుగున ముంబై
రోహిత్ సైతం చాలాసార్లు మైదానంలోనే తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కనిపించింది. జట్టు రెండు వర్గాలుగా విడిపోయిందన్న వార్తలకు బలం చేకూరుస్తూ ముంబై ఇండియన్స్ ఐపీఎల్-2024లో వరుస ఓటములు చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లకు గానూ నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది.
ఈ పరిణామాల నేపథ్యంలో రోహిత్ ముంబైని వీడతాడని.. ముంబై సైతం అతడిని విడిచిపెడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ చర్చలకు ఫ్రాంఛైజీ గురువారం చెక్ పెట్టింది. వేలానికి ముందు తాము అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో రోహిత్ ఉన్నట్లు ప్రకటించింది.
ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు
1. జస్‌ప్రీత్ బుమ్రా(టీమిండియా ప్రధాన పేసర్)- రూ. 18 కోట్లు
2. సూర్యకుమార్ యాదవ్(టీమిండియా టీ20 కొత్త కెప్టెన్)- రూ. 16.35 కోట్లు
3. హార్దిక్ పాండ్యా(టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్)- రూ. 16.35 కోట్లు
4. రోహిత్ శర్మ(టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్)- రూ. రూ. 16.30 కోట్లు
5.తిలక్ వర్మ(టీమిండియా రైజింగ్ స్టార్)- రూ. 8 కోట్లు.
వరల్డ్‌కప్ జట్టులో
టీమిండియాకు టీ20 ప్రపంచకప్-2024 అందించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తన పదవి నుంచి వైదొలగడంతో పాటు అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. ఇక ముంబై తాజాగా రిటైన్ చేసుకున్న బుమ్రా, హార్దిక్, సూర్య అతడి సారథ్యంలోని విన్నింగ్ టీమ్‌లో సభ్యులే.
చదవండి: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల
Comments
Please login to add a commentAdd a comment