రోహిత్ శర్మ- జస్‌ప్రీత్ బుమ్రా- సూర్యకుమార్ యాదవ్(PC: BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ ముంబై ఇండియన్స్(Mumbai Indians) గతేడాది ఘోర పరాభవాన్ని చవిచూసింది. పద్నాలుగు మ్యాచ్‌లలో కేవలం నాలుగే గెలిచి.. పాయింట్ల పట్టికలో అట్టడుగున పదో స్థానంలో నిలిచింది. స్టార్ ప్లేయర్లు ఉన్నా పేలవ ప్రదర్శనతో చతికిలపడి అవమానభారంతో లీగ్ దశలోనే నిష్క్రమించింది.
అయితే, ఈ దుస్థితికి యాజమాన్యమే కారణమని ముంబై ఇండియన్స్ అభిమానులే విమర్శల వర్షం కురిపించారు. ఐపీఎల్-2024 ఆరంభానికి ముందు అంబానీల సారథ్యంలోని ముంబై జట్టు.. తమ కెప్టెన్‌ను మార్చడమే ఇందుకు ప్రధాన కారణం. ముంబై ఫ్రాంఛైజీకి ఘనమైన చరిత్ర ఉంది.
రోహిత్ శర్మ సారథ్యంలో
క్యాష్ రిచ్ లీగ్‌లో అత్యధిక సార్లు ట్రోఫీ గెలిచిన జట్టుగా ముంబై నిలిచింది. రోహిత్ శర్మ(Rohit Sharma) సారథ్యంలో ఏకంగా ఐదుసార్లు టైటిల్ సాధించి.. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. అయితే, గత సీజన్ ఆరంభానికి ముందు రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించిన మేనేజ్‌మెంట్..అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ట్రేడ్ చేసుకుని మరీ.. పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
పాండ్యాకు అవమానాలు
రోహిత్ శర్మ ఫ్యాన్స్‌తో పాటు.. ముంబై జట్టు అభిమానులు కూడా ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయారు. దీంతో హార్దిక్ పాండ్యా మైదానంలోకి రాగానే అతడిని కించపరిచేలా పెద్ద ఎత్తున గోల చేశారు. ముంబై సొంత గ్రౌండ్ వాంఖడేలోనూ హార్దిక్‌కు ఇలాంటి చేదు అనుభవాలు తప్పలేదు. రోహిత్ కూడా అభిమానులను వారించకుండా మిన్నకుండిపోవడం అనుమానాలకు తావిచ్చింది.
రోహిత్ టీమ్ వర్సెస్ హార్దిక్ అనేలా
హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేయడం రోహిత్ శర్మకు ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. రోహిత్‌తో పాటు.. అతడి తర్వాత కెప్టెన్ పదవిని ఆశించిన జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా హార్దిక్‌తో పొసగడం లేదనే వార్తలు గుప్పుమన్నాయి.
ఫలితంగా ముంబై ఇండియన్స్ డ్రెసింగ్‌రూమ్‌లో విభేదాలు తలెత్తాయంటూ వదంతులు వ్యాపించాయి. అయితే, మైదానంలో రోహిత్, బుమ్రా, సూర్య ఒక జట్టుగా కనిపించడం.. హార్దిక్ పాండ్యా ఒంటరిగా ఉండటం వీటికి బలాన్ని చేకూర్చాయి.
ఫలితంగా వరుస ఓటముల రూపంలో ముంబై ఇండియన్స్ భారీ మూల్యమే చెల్లించింది. అయితే, ఈసారి మాత్రం అలాంటి పొరపాటును పునరావృతం చేయకూడదని ముంబై యాజమాన్యం భావిస్తోందట.
ప్రధాన ఆటగాళ్లకు ముంబై ఇండియన్స్ స్ట్రాంగ్ వార్నింగ్!
ఇందుకోసం ఇటీవలే ప్రత్యేకంగా ఓ సమావేశం కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని మనస్ఫూర్తిగా అంగీకరించాలని.. అతడికి అన్ని వేళలా అండగా నిలవాలని జట్టులోని ప్రధాన ఆటగాళ్లతో మేనేజ్‌మెంట్ పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి.
అదే విధంగా.. ఆటగాళ్లంతా కలిసికట్టుగా ఉండి.. జట్టు ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యంగా పనిచేయాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు.. హార్దిక్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా అతడిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లు సమాచారం.
కాగా తనను కెప్టెన్‌గా తప్పించిన ముంబై ఇండియన్స్‌తో రోహిత్ శర్మ బంధం తెంచుకుంటాడనే ప్రచారం జరుగగా.. అతడు మాత్రం అనూహ్య రీతిలో అదే ఫ్రాంఛైజీతో కొనసాగేందుకు నిర్ణయించుకున్నాడు.
రోహిత్ మళ్లీ ముంబైతోనే..
ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు ముంబై రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో రోహిత్ కూడా ఉండటం విశేషం. జస్‌ప్రీత్ బుమ్రా(రూ. 18 కోట్లు), సూర్యకుమార్ యాదవ్(రూ. 16.35 కోట్లు),హార్దిక్ పాండ్యా(రూ. 16.35 కోట్లు), రోహిత్ శర్మ(రూ. రూ. 16.30 కోట్లు), తిలక్ వర్మ(రూ. 8 కోట్లు)లను ముంబై అట్టిపెట్టుకుంది.
కాగా గత సీజన్ ఆఖరి మ్యాచ్‌లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. హార్దిక్ పాండ్యాకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్-2025లో మొదటి మ్యాచ్ ఆడకుండా అతడిపై నిషేధం పడింది.
చదవండి: ఆసీస్‌తో టెస్టుల్లో అతడిని ఆడించాల్సింది.. ద్రవిడ్ ఉన్నంత వరకు.. : భజ్జీ
Comments
Please login to add a commentAdd a comment