
టీమిండియా వరుస వైఫల్యాలపై భారత మాజీ బౌలర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) హెడ్‌కోచ్‌గా ఉన్నంతకాలం అంతా బాగానే ఉందని.. కానీ గత ఆరునెలల కాలంలో జట్టు ఇంతగా దిగజారిపోవడం ఏమిటని ప్రశ్నించాడు. మ్యాచ్ విన్నర్లుగా అభివర్ణిస్తూ జట్టుకు భారమైనా కొంతమందిని ఎందుకు కొనసాగిస్తున్నారో అర్థం కావడం లేదన్నాడు.
ట్రోఫీ గెలిచిన తర్వాత ద్రవిడ్ గుడ్‌బై
ఇప్పటికైనా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాలని భజ్జీ సూచించాడు. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్ ఉన్నవారిని నిర్మొహమాటంగా పక్కనపెట్టాలని సలహా ఇచ్చాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup 2024)లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. ద్రవిడ్ కోచింగ్ బాధ్యతల నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మాజీ బ్యాటర్ గౌతం గంభీర్ హెడ్‌కోచ్ పదవిని చేపట్టాడు.
ఘోర పరాభవాలు
అయితే, గౌతీ మార్గదర్శనంలో టీమిండియా ఇప్పటి వరకు చెప్పుకోగదగ్గ విజయాలేమీ సాధించకపోగా.. ఘోర పరాభవాలు చవిచూసింది. శ్రీలంక పర్యటనలో భాగంగా వన్డే సిరీస్‌ను ఆతిథ్య జట్టుకు కోల్పోవడంతో పాటు.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టుల్లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy)లోనూ పరాజయాన్ని మూటగట్టుకుంది.
కంగారూల చేతిలో 3-1తో ఓడిపోయి.. పదేళ్ల తర్వాత తొలిసారి ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని ఆసీస్‌కు సమర్పించుకుంది. ఈ నేపథ్యంలో ఇంటా.. బయటా వైఫల్యాల పరంపర కొనసాగిస్తున్న టీమిండియాపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్భజన్ సింగ్ స్పందిస్తూ.. సెలక్టర్లు కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశాడు. ‘స్టార్ల’ కోసం అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran) వంటి వాళ్లను బలిచేయవద్దని హితవు పలికాడు.
ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది
ఈ మేరకు.. ‘‘గత ఆరు నెలల్లో.. టీమిండియా శ్రీలంక చేతిలో ఓడిపోయింది. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై 3-1తో సిరీస్ ఓటమిని చవిచూసింది. రాహుల్ ద్రవిడ్ ఉన్నంత వరకు అంతా బాగానే ఉండేది.
అతడి మార్గదర్శనంలో టీమిండియా ప్రపంచకప్ గెలిచింది. కానీ... ఆ తర్వాత అకస్మాత్తుగా ఏమైంది? ప్రతి ఒక్క ఆటగాడికి తనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. ఒకవేళ కొంతమందిని మ్యాచ్ విన్నర్లుగా భావిస్తూ తప్పక ఆడించాలనుకుంటే.. కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేలను కూడా జట్టులోకి తీసుకోండి. ఎందుకంటే.. భారత క్రికెట్‌లో వాళ్ల కంటే పెద్ద మ్యాచ్ విన్నర్లు ఎవరూ లేరు.
అభిమన్యు ఈశ్వరన్‌ను ఆడించాల్సింది
ఇప్పటికైనా బీసీసీఐ సెలక్టర్లు కఠిన వైఖరి అవలంభించాలి. సూపర్‌స్టార్ ఆటిట్యూడ్‌ను పక్కనపెట్టండి. అభిమన్యు ఈశ్వరన్‌ను ఆస్ట్రేలియా పర్యటనకు తీసుకువెళ్లారు. కానీ.. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. ఒకవేళ అతడికి అవకాశం ఇచ్చి ఉంటే.. కచ్చితంగా సత్తా చాటేవాడు.
సర్ఫరాజ్ ఖాన్ విషయంలోనూ ఇలాగే జరిగింది. తదుపరి ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు ఆడాల్సి ఉంది. అప్పుడు మాత్రం ప్రదర్శన బాగున్న ఆటగాళ్లనే ఎంపిక చేయండి. కీర్తిప్రతిష్టల ఆధారంగా సెలక్షన్ వద్దు’’ అంటూ హర్భజన్ సింగ్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశాడు. హిందుస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతూ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
కాగా ఆసీస్‌తో సిడ్నీలో ఆఖరిదైన ఐదో టెస్టులో ఓడిన టీమిండియా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025 ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది. తదుపరి 2025-27 సీజన్‌లో తొలుత ఇంగ్లండ్ టూర్‌లో భాగంగా ఐదు టెస్టుల సిరీస్‌లో తలపడనుంది.
చదవండి: CT 2025: శుబ్‌మన్ గిల్‌పై ‘వేటు’?.. అతడికి ప్రమోషన్?