బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(Border Gavaskar Trophy) సిరీస్‌లో చెత్త ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది టీమిండియా. ముఖ్యంగా బ్యాటింగ్ వైఫల్యం కారణంగా దాదాపు దశాబ్దం తర్వాత ఈ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. కంగారూ గడ్డపై 3-1తో ఓడి రిక్తహస్తాలతో స్వదేశానికి పయనమైంది.
బౌలర్‌గా, కెప్టెన్‌గా రాణించి
ఇక ఆసీస్‌తో ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా గెలిచిందంటే అందుకు కారణం జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే. పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) గైర్హాజరీలో ఈ ఫాస్ట్‌బౌలర్ భారత జట్టును ముందుకు నడిపించాడు. పేసర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఆసీస్ గడ్డపై టీమిండియాకు అతిపెద్ద టెస్టు విజయం(295 పరుగుల తేడాతో) అందించాడు.
వెన్నునొప్పి వేధించినా
అయితే, ఆ తర్వాత రోహిత్ శర్మ తిరిగి వచ్చినా టీమిండియా ఇదే జోరును కొనసాగించలేకపోయింది. బ్యాటర్‌గా, సారథిగా రోహిత్ విఫలం కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో ఆఖరిదైన ఐదో టెస్టు నుంచి అతడు స్వచ్చందంగా తప్పుకోగా.. బుమ్రా మరోసారి పగ్గాలు చేపట్టాడు. వెన్నునొప్పి వేధించినా జట్టును గెలిపించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాడు.
కానీ సిడ్నీ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియాకు భంగపాటు తప్పలేదు. మ్యాచ్‌తో పాటు సిరీస్‌లోనూ ఓటమిని చవిచూసింది. బుమ్రా లేకపోయి ఉంటే.. టీమిండియా ఆసీస్ చేతిలో 5-0తో వైట్‌వాష్‌కు గురయ్యేదని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడంటే.. ఈ సిరీస్‌లో అతడి ప్రాధాన్యం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు.
పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా?
ఈ నేపథ్యంలో ఇప్పటికే పేస్ దళ నాయకుడిగా ఉన్న బుమ్రా.. త్వరలోనే పూర్తిస్థాయి టెస్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టనున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. వన్డేల్లోనూ రోహిత్ వారసుడిగా బుమ్రా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గిల్‌పై వేటు.. బుమ్రాకు ప్రమోషన్?
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా రోహిత్ శర్మకు బుమ్రా డిప్యూటీగా వ్యవహరించనున్నట్లు సమాచారం. కాగా శ్రీలంక పర్యటన 2024 సందర్భంగా వన్డే, టీ20లలో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ). అయితే, ఏదేని కారణాల వల్ల రోహిత్ దూరమైతే.. గిల్ ఇప్పటికప్పుడు కెప్టెన్‌గా వ్యవహరించే పరిణతి సాధించలేదని మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అందుకే బుమ్రాను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాలనే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే.. సిడ్నీ టెస్టు నుంచి రోహిత్ శర్మ తప్పుకొన్న తర్వాత.. వన్డే కెప్టెన్సీకి అతడు దూరం కానున్నాడనే వదంతులు వచ్చాయి. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించనున్నారనే ఊహాగానాలు వినిపించాయి.
ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌లు
కాగా చాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు టీమిండియా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. ఇందులో భాగంగా ఐదు టీ20లు, మూడు వన్డేల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. అయితే, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు బుమ్రా దూరంగా ఉండనున్నట్లు సమాచారం. వెన్నునొప్పి కారణంగా అతడు విశ్రాంతి తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఫిబ్రవరి 19 నుంచి చాంపియన్స్ ట్రోఫీ-2025 మొదలుకానుంది. పాకిస్తాన్ ఈ మెగా వన్డే టోర్నీకి ఆతిథ్యం ఇస్తుండగా.. టీమిండియా మ్యాచ్‌లు మాత్రం తటస్థ వేదికైన దుబాయ్‌లో జరుగుతాయి. హైవోల్టేజీ పోరు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరుగనుంది.
చదవండి: 13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం.. రషీద్ ఖాన్ మాయాజాలం.. అఫ్గన్ సరికొత్త చరిత్ర
Comments
Please login to add a commentAdd a comment