జింబాబ్వేతో రెండో టెస్టులో అఫ్గనిస్తాన్ విజయం సాధించింది. ఆతిథ్య జట్టును 72 పరుగుల తేడాతో ఓడించి.. సిరీస్‌ను 1-0తో కైవసం చేసుకుంది. కాగా మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు అఫ్గన్ క్రికెట్ జట్టు జింబాబ్వే(Afghanistan tour of Zimbabwe, 2024-25) పర్యటనకు వెళ్లింది.
పరిమిత ఓవర్ల సిరీస్‌లు కైవసం
ఈ క్రమంలో హరారే వేదికగా తొలుత టీ20 సిరీస్‌ను 2-1తో గెలిచిన అఫ్గన్.. వన్డే సిరీస్‌ను కూడా 2-1తో నెగ్గింది. అనంతరం బులవాయోలో టెస్టు సిరీస్ మొదలుకాగా.. తొలి మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ క్రమంలో అఫ్గన్- జింబాబ్వే(Zimbabwe vs Afghanistan) మధ్య గురువారం మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది.
ధీటుగా బదులిచ్చినా
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన అఫ్గనిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 157 పరుగులకే ఆలౌట్ అయింది. ఇందుకు జింబాబ్వే ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 243 పరుగులు సాధించింది. సికందర్ రజా(61), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్(75) అర్ధ శతకాలతో రాణించగా.. సీన్ విలియమ్స్ 49 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురి పోరాటం కారణంగా అఫ్గన్ కంటే.. జింబాబ్వే 86 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
అయితే, రెండో ఇన్నింగ్స్‌లో హష్మతుల్లా బృందం పొరపాట్లకు తావివ్వలేదు. రహ్మత్ షా(Rahmat Shah) భారీ శతకం(139)తో చెలరేగగా.. ఇస్మత్ ఆలం(101) కూడా శతక్కొట్టాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా అఫ్గన్ 363 పరుగులు చేయగలిగింది. తద్వారా జింబాబ్వేకు 278 పరుగుల టార్గెట్ విధించింది.
13 నిమిషాల్లోనే ఖేల్ ఖతం
లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే తడబడ్డ జింబాబ్వే.. ఆదివారం నాటి నాలుగో రోజు ఆట పూర్తయ్యేసరికి.. ఎనిమిది వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. తద్వారా విజయానికి 73 పరుగుల దూరంలో నిలిచింది.
అయితే, అఫ్గన్ స్పిన్నర్ల ధాటికి ఆఖరి రోజు ఆటలో కేవలం 13 నిమిషాల్లోనే మిగిలిన రెండు వికెట్లు కోల్పోయి.. 205 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో అఫ్గన్ 72 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఏడు వికెట్లతో చెలరేగగా.. జియా ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు.
అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర
2017లో అఫ్గనిస్తాన్ టెస్టు జట్టు హోదా పొందింది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడగా.. ఇది నాలుగో విజయం. అదే విధంగా జింబాబ్వేపై రెండోది. కాగా 2021లోనూ జింబాబ్వేతో అఫ్గనిస్తాన్ రెండు టెస్టుల్లో తలపడగా.. 1-1తో నాటి సిరీస్ డ్రా అయింది. అయితే, ఈసారి మాత్రం అఫ్గనిస్తాన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వేపై రెండో టెస్టులో గెలిచి.. తొలిసారి ద్వైపాక్షిక టెస్టు సిరీస్ విజయాన్ని సొంతం చేసుకుంది.
చదవండి: Ind vs Pak: ఆరోజు టీమిండియాపై ప్రశంసల వర్షం ఖాయం: కైఫ్ సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment