టీమిండియా ఆటగాళ్లపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammad Kaif) ఘాటు విమర్శలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వీరులు అనిపించుకుంటే సరిపోదని.. టెస్టుల్లో కూడా సత్తా చాటితేనే విలువ ఉంటుందని పేర్కొన్నాడు.
తదుపరి పాకిస్తాన్ మీద వన్డే మ్యాచ్ గెలిచేసి.. ఆహా ఓహో అని పొగిడించుకునేందుకు భారత క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారని.. అయితే, అంతకంటే ముందు టెస్టుల్లో ఎలా మెరుగుపడాలో ఆలోచించాలంటూ కైఫ్ చురకలు అంటించాడు.
అందని ద్రాక్షగా డబ్ల్యూటీసీ ట్రోఫీ
కాగా 2019లో తొలిసారిగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(World Test Championship- డబ్ల్యూటీసీ) ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ క్రమంలో 2019-21 సీజన్‌లో విరాట్ కోహ్లి కెప్టెన్సీలో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన టీమిండియా.. టైటిల్ పోరులో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది.
అనంతరం.. 2021-23 సీజన్‌లోనూ రోహిత్ శర్మ సారథ్యంలో తుదిపోరుకు అర్హత సాధించింది. అయితే, ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో చిత్తుగా ఓడి ట్రోఫీని చేజార్చుకుంది. ముచ్చటగా మూడోసారీ ఫైనల్ చేరి.. ఈసారి కచ్చితంగా డబ్ల్యూటీసీ ట్రోఫీని సాధిస్తుందని అభిమానులు భావించగా.. రోహిత్ సేన తీవ్రంగా నిరాశపరిచింది.
తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురై.. అనంతరం బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల్లోనూ 3-1తో ఓడిపోయింది. తద్వారా డబ్ల్యూటీసీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించింది.
చాంపియన్లమని అంతా పొగుడుతారు
ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ మాట్లాడుతూ భారత ఆటగాళ్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ‘‘ఫిబ్రవరి 23న.. చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్‌ను ఓడించడం ద్వారా టీమిండియా ప్రశంసలు అందుకుంటుంది.
అపుడు.. మనం వైట్‌బాల్ క్రికెట్‌లో చాంపియన్లమని అంతా పొగుడుతారు. అయితే, భారత్ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ గెలవాలంటే మాత్రం మనకొక పటిష్టమైన టెస్టు జట్టు అవసరం ఉంది. సీమింగ్ ట్రాకులపై ఎలా ఆడాలో మనవాళ్లు నేర్చుకోవాలి.
చేదుగా ఉన్నా ఇదే నిజం
మనం కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రమే వీరులం అనిపించుకుంటున్నాం. చేదుగా ఉన్నా ఇదే నిజం. కానీ.. మనం టెస్టుల్లో బాగా వెనుకబడి ఉన్నాం. ఒకవేళ టీమిండియా డబ్ల్యూటీసీ గెలవాలనుకుంటే మాత్రం ఆటగాళ్లంతా దేశవాళీ క్రికెట్ ఆడాలి.
టర్నింగ్ ట్రాకుల(స్పిన్ పిచ్)పై సత్తా చాటడంతో పాటు.. సీమింగ్ ట్రాకులపై కూడా ప్రాక్టీస్ చేయాలి. లేదంటే.. డబ్ల్యూటీసీ టైటిల్ గురించి మర్చిపోవాల్సిందే’’ అని కైఫ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
గంభీర్ తప్పేమీ లేదు
అదే విధంగా.. కివీస్, కంగారూ జట్ల చేతిలో ఘోర పరాభవాలకు కేవలం హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను మాత్రమే బాధ్యుడిని చేయడం సరికాదని కైఫ్ అన్నాడు. ‘‘ఆస్ట్రేలియా చేతిలో 3-1తో ఓటమి... మనకొక మేలుకొలుపు లాంటిది. ఇప్పటి నుంచి టెస్టు క్రికెట్‌పై మరింత ఎక్కువగా దృష్టి సారించాలి. ఈ ఓటములకు గౌతం గంభీర్ ఒక్కడే బాధ్యుడు కాడు.
ఆటగాళ్లంతా రంజీల్లో ఆడాలి. కానీ అలా చేయకుండా.. ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడకుండా.. నేరుగా బరిలోకి దిగుతామంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి’’ అంటూ కైఫ్ ఆటగాళ్లపై విమర్శనాస్త్రాలు సంధించాడు. కాగా టీమిండియా తదుపరి ఇంగ్లండ్‌తో స్వదేశంలో టీ20, వన్డే సిరీస్‌లు ఆడనుంది. అనంతరం .. ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీతో బిజీ కానుంది.
చదవండి: CT 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన ఎప్పుడంటే? స్టార్ ప్లేయర్‌కు ఛాన్స్!
Khari khari baat.. Kadwa sach#TestCricket #BGT #AUSvIND#CricketWithKaif11 pic.twitter.com/WXFJY9aLSq
— Mohammad Kaif (@MohammadKaif) January 5, 2025
Comments
Please login to add a commentAdd a comment