
రోహిత్ శర్మతో హార్దిక్ పాండ్యా (PC: IPL)
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya)పై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ప్రశంసలు కురిపించాడు. అవమానాలను దిగమింగుకుని.. సింహంలా అతడు తిరిగి వచ్చాడని కొనియాడాడు.
మానసికంగా తనను వేదనకు గురిచేసినా.. అద్భుత ప్రదర్శనతో తన విలువను చాటుకున్నాడని.. భారత్ రెండు ఐసీసీ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)-2025లో సరికొత్త హార్దిక్ పాండ్యాను చూడబోతున్నారని.. ముంబై ఇండియన్స్‌ను అతడు ఈసారి ప్లే ఆఫ్స్‌లో నిలుపుతాడని కైఫ్ ధీమా వ్యక్తం చేశాడు.
అవహేళనలు
కాగా గతేడాది హార్దిక్ ముంబై ఇండియన్స్ సారథిగా ఎంపికైన విషయం తెలిసిందే. ముంబైకి ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ (Rohit Sharma)ను కాదని.. హార్దిక్ పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు.
సొంత మైదానం వాంఖడేలోనూ అతడిని దూషిస్తూ పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు. హార్దిక్ కనిపిస్తే చాలు అవహేళనలతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతినేలా ప్రవర్తించారు.
ఈ క్రమంలో ముంబై గతేడాది పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో హార్దిక్ కెప్టెన్సీపై మరోసారి విమర్శలు తీవ్రమయ్యాయి.
అయితే, ఈ చేదు అనుభవాల నుంచి త్వరగానే కోలుకున్న హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్-2024లో సత్తా చాటాడు. జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలకంగా వ్యవహరించాడు.
అంతేకాదు.. తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా టైటిల్ గెలవడంలోనూ హార్దిక్‌ది కీలక పాత్ర. ఈ నేపథ్యంలో భారత మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్.. హార్దిక్ పాండ్యా బయోపిక్ గనుక తెరకెక్కితే గత ఏడాది కాలం ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని వ్యాఖ్యానించాడు.
పంటిబిగువన భరిస్తూ..
‘‘మనసుకైన గాయాలను పంటిబిగువన భరిస్తూ.. అతడు ముందుకు సాగాడు. అభిమానులే అతడిని హేళన చేశారు. కొంతమంది అతడి గురించి చెడుగా ఆర్టికల్స్ రాశారు. ఓ ఆటగాడిగా ఇన్ని బాధలను భరిస్తూ ముందుకు సాగడం అంత తేలికైన విషయం కాదు.
అతడు ఆ నొప్పిని మర్చిపోలేడు. జట్టు నుంచి తప్పిస్తే ఆ బాధ కొన్నాళ్లే ఉంటుంది. కానీ.. అభిమానులే ఇంతలా అవమానిస్తే తట్టుకోవడం కష్టం. ఓ ఆటగాడికి ఇంతకంటే మానసిక వేదన మరొకటి ఉండదు.
సింహంలా పోరాడి గెలిచాడు
అయితే, అతడు కుంగిపోలేదు. సింహంలా పోరాడి గెలిచాడు. టీ20 ప్రపంచకప్-2024 ఫైనల్లో హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర వీరుడిని అవుట్ చేశాడు. చాంపియన్స్ ట్రోఫీలో జంపా బౌలింగ్‌లో సిక్సర్లు బాదాడు.
బంతితో, బ్యాట్‌తో రాణించి భారత్ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఒకవేళ అతడి బయోపిక్ తీస్తే.. గత ఏడాది కాలం అందరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. సవాళ్లను, గడ్డు పరిస్థితులను అధిగమించి ఎలా ముందుకు సాగాలో తెలుస్తుంది.
పాండ్యా తన బలాన్ని గుర్తించాడు. అందుకే ఇంత గొప్పగా పునరాగమనం చేశాడు. ఐపీఎల్-2025లో అతడు ముంబైని తప్పక ప్లే ఆఫ్స్ చేరుస్తాడు’’ అని కైఫ్ హిందుస్తాన్ టైమ్స్‌తో వ్యాఖ్యానించాడు.
కాగా మార్చి 22న ఐపీఎల్ పద్దెనిమిదవ ఎడిషన్ ప్రారంభం కానుండగా.. ఆ మరుసటి రోజు ముంబై తమ తొలి మ్యాచ్ ఆడనుంది. మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌ను ఢీకొట్టనుంది. అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో అతడి స్థానంలో టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment