
Photo Courtesy: BCCI
టీమిండియా దిగ్గజం ప్రశంసలు
ఐపీఎల్-2025 (IPL 2025)లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. వరుస పరాజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కొట్టడం అద్భుతమని కొనియాడాడు. ఇందుకు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కెప్టెన్సీ ప్రధాన కారణమని గావస్కర్ ముంబై సారథిని ప్రశంసించాడు.
గతేడాది చేదు అనుభవాలు
కాగా గతేడాది ముంబై ఇండియన్స్, హార్దిక్ పాండ్యాకు చేదు అనుభవం ఎదురైన విషయం తెలిసిందే. ఐదుసార్లు జట్టును చాంపియన్‌గా నిలిపిన రోహిత్ శర్మను కాదని పాండ్యాకు పగ్గాలు అప్పగించడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. మైదానం లోపలా, వెలుపలా అతడిని హేళన చేస్తూ నిరుత్సాహపరిచారు.
ఖేల్ ఖతమే అనుకున్నవేళ
ఈ క్రమంలో గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగు గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడగున పదో స్థానంతో సీజన్‌ను ముగించింది. తాజా ఎడిషన్‌లో తొలి ఐదు మ్యాచ్‌లలో నాలుగు ఓడిపోయింది. దీంతో ముంబై ఖేల్ ఖతమే అని అనుకున్న సమయంలో.. ఊహించని రీతిలో పుంజుకుంది.
అంతా హార్దిక్ వెంట ఉన్నారు
వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. ఈ నేపథ్యంలో సునిల్ గావస్కర్ ముంబై జట్టు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ తీరును కొనియాడాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘గతేడాది సొంత జట్టు అభిమానుల నుంచే హార్దిక్‌కు మద్దతు లేదు.
కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముంబై ప్రేక్షకులు, ముంబై జట్టు మద్దతుదారులు అంతా హార్దిక్ వెంట ఉన్నారు. ప్రతి ఒక్కరు టీమ్‌ను గెలిపించాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో తడబడినా ముంబై అద్భుత రీతిలో తిరిగి పుంజుకుంది.
హార్దిక్ ఈసారి అలా చేయడం లేదు
హార్దిక్ పాండ్యా ప్రభావం ఈసారి గట్టిగానే ఉంది. అతడు తన భావోద్వేగాలను మైదానంలో ఎక్కువగా కనిపించకుండా దాచేస్తున్నాడు. మిస్‌ఫీల్డ్ అయినప్పుడు, క్యాచ్‌లు జారవిడిచినపుడు ఫీల్డర్లకు మరేం పర్లేదు అన్నట్లుగా మద్దతుగానే ఉంటున్నాడు.
ఒకవేళ కెప్టెన్ ఇలాంటపుడు అతిగా స్పందిస్తే.. ఫీల్డర్ కూడా డీలాపడిపోతాడు. అయితే, హార్దిక్ ఈసారి అలా చేయడం లేదు. అందుకే ముంబై ఇంత త్వరగా తిరిగి రేసులోకి వచ్చింది. అయినా.. వాళ్లకు ఇది అలవాటే. ముంబై ఇండియన్స్ అభిమానిగా ఆ జట్టు విజయపరంపర కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని సునిల్ గావస్కర్ పేర్కొన్నాడు.
ధనాధన్
కాగా ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ ఇప్పటికి పన్నెండు మ్యాచ్‌లు పూర్తి చేసుకుని ఏడు గెలిచింది. పద్నాలుగు పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతున్న హార్దిక్ సేన.. మిగిలిన రెండు మ్యాచ్‌లలో గెలిచి సగర్వంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టాలని పట్టుదలగా ఉంది.
ఇక హార్దిక్ పాండ్యా వ్యక్తిగత ప్రదర్శన విషయానికొస్తే.. పదకొండు ఇన్నింగ్స్‌లో 158 పరుగులు చేసిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. పదమూడు వికెట్లు కూడా పడగొట్టాడు. మరోవైపు.. పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ 510 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.
చదవండి: రోహిత్ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం.. మామగారి వెనుక దాక్కున్న రితిక!