శ్రేయస్‌ అయ్యర్‌... సారథిగా సూపర్‌ | Shreyas Iyer is the only captain to have taken three teams to the IPL final | Sakshi
Sakshi News home page

శ్రేయస్‌ అయ్యర్‌... సారథిగా సూపర్‌

Jun 5 2025 2:18 AM | Updated on Jun 5 2025 2:04 PM

Shreyas Iyer is the only captain to have taken three teams to the IPL final

మూడు జట్లను ఐపీఎల్‌ ఫైనల్‌కు చేర్చిన ఏకైక కెప్టెన్‌

బ్యాటింగ్‌లోనూ అసాధారణ ప్రదర్శన

భవిష్యత్తు భారత సారథిగా మన్ననలు  

ధోనీ మాదిరిగా వ్యూహరచనలో మేటి... కోహ్లి తరహాలో దూకుడులో ఘనాపాటి... రోహిత్‌ను అనుకరిస్తున్నట్లు అనిపించినా... అతడికి అతడే సాటి! ‘అతడి చేయి పడితే రాయి కూడా రత్నంలా మెరుస్తుంది’... అన్న రీతిలో దశాబ్ద కాలానికి పైగా ‘ప్లే ఆఫ్స్‌’ మొఖం చూడని జట్టును తుదిపోరుకు చేర్చిన ఘనుడతడు! ఐపీఎల్‌ చరిత్రలో మరే సారథికి సాధ్యం కాని విధంగా మూడు వేర్వేరు జట్లను తుదిపోరుకు తీసుకెళ్లిన మొనగాడతడు! అందుబాటులో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ జట్టును నడిపించడంలో నేర్పరి అతడు! మనం ఇంతసేపు చెప్పుకున్నది... ఈసారి ఐపీఎల్‌ ట్రోఫీ గెలవకపోయినా తన నాయకత్వ చతురతతో అందరి మనసులు గెలిచిన పంజాబ్‌ కింగ్స్‌ సారథి శ్రేయస్‌ అయ్యర్‌ గురించే!! 

ధోనీ, రోహిత్‌ కూడా కెప్టెన్‌లుగా మూడు కంటే ఎక్కువ ఐపీఎల్‌ ఫైనల్స్‌ ఆడినా... ఆ ఇద్దరూ ఒకే జట్టును నడిపించారు. కానీ గత ఐదేళ్లలో అయ్యర్‌ మూడు వేర్వేరు ఫ్రాంఛైజీలకు తుదిపోరు మజా చూపాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇప్పటి వరకు ఆడిన ఏకైక ఫైనల్‌ శ్రేయస్‌ సారథ్యంలోనే కాగా... పదేళ్ల విరామం అనంతరం గతేడాది కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ముచ్చటగా మూడో కప్పు అందించింది కూడా అయ్యరే. పంజాబ్‌కు ట్రోఫీ కట్టబెట్టలేకపోయినా...  సారథిగా మాత్రం సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. ‘బాధ్యత సగం మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది తప్పక కప్పు గెలుస్తాం’ అని ఫైనల్‌ అనంతరం ధీమా వ్యక్తం చేసిన అయ్యర్‌... భారత జట్టు భవిష్యత్తు నాయకత్వంపై భరోసా పెంచుతున్నాడు!!

సాక్షి, క్రీడావిభాగం : 2024 ఐపీఎల్‌ ఫైనల్లో సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌ను చిత్తుచేసి... కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టు మూడోసారి కప్పు కైవసం చేసుకుంది. కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ ట్రోఫీ అందుకున్నా... ఆ సమయంలో భారత మాజీ ఓపెనర్‌ గౌతమ్‌  గంభీర్‌ కేకేఆర్‌ జట్టు మెంటార్‌గా ఉండటంతో క్రెడిట్‌ అంతా అతడికే దక్కింది. తదనంతర పరిణామాల్లో గంభీర్‌ టీమిండియా హెడ్‌కోచ్‌గా ఎదగగా... సమర్థ నాయకుడిని కేకేఆర్‌ వేలానికి వదిలేసింది. 

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు... ఈసారి లీగ్‌ దశ దాటలేకపోవడమే గాక... పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంటే... వేలంలో భారీ ధర పెట్టి శ్రేయస్‌ను దక్కించుకున్న పంజాబ్‌ రెండోసారి రన్నరప్‌గా నిలిచింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు శ్రేయస్‌ సారథ్య సామర్థ్యాన్ని వివరించేందుకు.

దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిర్లక్ష్యం వహించినందుకు బీసీసీఐ కాంట్రాక్టు కోల్పోవడం... అపార ప్రతిభ ఉన్నా ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక కాకపోవడం ఇవన్నీ పక్కన పెడితే... అతడిలో గొప్ప నాయకుడు ఉన్నాడని తాజా ఐపీఎల్‌ నిరూపించిందింది.  

ఆటగాడిగా అదుర్స్‌... 
ఈ సీజన్‌లో 17 మ్యాచ్‌లాడిన శ్రేయస్‌ 50.33 సగటుతో 604 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగి 175.07 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు రాబట్టాడు. అతడి గణాంకాలను అంకెల్లో కొలవడం కష్టమే! సీజన్‌ ఆరంభంలో గుజరాత్‌తో జరిగిన పోరులో సెంచరీకి సమీపించినా... జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేయడంతోనే అయ్యర్‌ తీరు అందరినీ ఆకట్టుకుంది. 

అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 19 ఓవర్లు ముగిసేసరికి 220 పరుగులు చేసింది. అయ్యర్‌ 42 బంతుల్లో 97 పరుగులు చేసి సెంచరీకి సమీపించాడు. చివరి ఓవర్‌లో స్ట్రయికింగ్‌లో ఉన్న శశాంక్‌ సింగ్‌ దగ్గరకు వెళ్లి ‘నా శతకం గురించి ఆలోచించకు. జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయి’ అని దిశానిర్దేశం చేశాడు. 

ఆ ఓవర్‌ మొత్తం ఆడిన శశాంక్‌ 23 పరుగులు రాబట్టగా... అయ్యర్‌ అజేయంగా నిలిచాడు. స్పిన్‌ను సమర్థవంతంగా ఆడతాడనే గుర్తింపును మరింత పెంచుకుంటూ... ఈసారి మిడిల్‌ ఓవర్స్‌లో భారీ షాట్లతో విరుచుకుపడి పరుగులు రాబట్టాడు. అందుకే సీజన్‌ మొత్తంలో 43 ఫోర్లే కొట్టిన అయ్యర్‌... 39 సిక్స్‌లతో అత్యధిక సిక్స్‌లు కొట్టిన వారి జాబితాలో నికోలస్‌ పూరన్‌ (40) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.  

ముంబైపై అసమాన పోరాటం 
ఇక క్వాలిఫయర్‌–2లో ముంబై ఇండియన్స్‌పై శ్రేయస్‌ ఆడిన ఇన్నింగ్స్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే. బుమ్రా యార్కర్లను ఎదుర్కొనేందుకు మహామహులు ఇబ్బంది పడుతున్న తరుణంలో అతడు దాన్ని షార్ట్‌థర్డ్‌ మ్యాన్‌ దిశగా తరలించిన తీరు చూసి తీరాల్సిందే. ఆశలే లేని స్థితిలో అద్భుత పోరాటం కనబర్చిన ఈ ముంబైకర్‌... జట్టును  ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు.

‘అయ్యర్‌ అవుట్‌ అయినప్పుడే... పంజాబ్‌ పరాజయం ఖాయమైంది’ బెంగళూరుతో ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా ప్రతి ఒక్కరి నోట వినిపించిన మాట ఇదే. అంతలా అభిమానుల నమ్మకాన్ని సంపాదించుకున్న శ్రేయస్‌... చేతి వరకు వచ్చిన కప్పు చేజారుతున్నా కాస్త కూడా చలించలేదు. చిరకాల కల నెరవేరడంతో ప్రపంచ మేటి ఆటగాడు విరాట్‌ కోహ్లి చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తుంటే... సుదీర్ఘ కాలం ఫ్రాంఛైజీకి ప్రాతినిధ్యం వహించినా.. జట్టును విజేతగా నిలపలేకపోయిన ఏబీ డివిలియన్స్, క్రిస్‌ గేల్‌ వంటి దిగ్గజ ప్లేయర్లు సంబరాల్లో భాగమైపోయారు. 

ఇక ఆర్‌సీబీ అభిమానుల ఆనందానికైతే అవధులే లేవు! తన చుట్టూ ఇంత జరుగుతున్నా కనీసం ముఖ కవలికల్లో సైతం మార్పు కనబడని అయ్యర్‌ నింపాదిగా వచ్చే ఏడాది చూసుకుందాం అన్నట్లు ముందుకు సాగిపోయాడు.  

భవిష్యత్తు వన్డే కెప్టెన్‌! 
మైదానం బయట నుంచి పాంటింగ్‌ జట్టును తీర్చిదిద్దితే... ఆ వ్యూహాలను గ్రౌండ్‌లో ఆచరణలో పెట్టడంలో అయ్యర్‌ విజయవంతమయ్యాడు. బౌన్సీ పిచ్‌పై కైల్‌ జెమీసన్‌తో బ్యాక్‌ ఆఫ్‌ ది లెంత్‌ బంతులు వేయించడం... ముంబైతో మ్యాచ్‌లో వైడ్‌ యార్కర్లు వేసే విధంగా విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌కు దిశానిర్దేశం చేయడం... అవసరమైనప్పుడు ‘నకల్‌ బాల్స్‌’ వేసే విధంగా ప్రోత్సహించడం ఇలా... ఒకటా రెండా సీజన్‌ ఆసాంతం శ్రేయస్‌ కెప్టెన్సీలో తనదైన పదును చూపాడు. 

క్వాలిఫయర్‌–2లో శశాంక్‌ సింగ్‌ నిర్లక్ష్యంతో రనౌట్‌ అయన సందర్భంలో సారథిగా అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అయ్యర్‌... ప్రియాన్‌‡్ష, ప్రభ్‌సిమ్రన్‌ వంటి యువ ఆటగాళ్లను పెద్దన్నలా వెన్నుతట్టి ప్రోత్సహించాడు. ఐపీఎల్‌ జరుగుతున్న సమయంలోనే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ కోసం భారత జట్టును ఎంపిక చేయగా... అందులో అయ్యర్‌ పేరు లేకపోవడం చూసి పంజాబ్‌ కోచ్‌ పాంటింగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 

అయినా దాన్ని పెద్దగా పట్టించుకోని శ్రేయస్‌... గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ‘నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు... ఫలితం గురించి ఆలోచించకు’ అన్న రీతిలో ఐపీఎల్‌పైనే దృష్టి పెట్టాడు. ప్రస్తుతం టెస్టు, టి20 జట్లలో రెగ్యులర్‌ ఆటగాడు కాని 30 ఏళ్ల అయ్యర్‌... వన్డేల్లో మాత్రం రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌ తర్వాత నాయకత్వ రేసులో ముందు నిలవడం ఖాయమే!  

Advertisement
 
Advertisement
Advertisement