
హార్దిక్ పాండ్యా (PC: MI)
జట్టులో ‘ముగ్గురు కెప్టెన్ల’ను కలిగి ఉండటం తనకు అదనపు బలమని ముంబై ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్యా (Hardik Pandya) హర్షం వ్యక్తం చేశాడు. భిన్న ఫార్మాట్లలో టీమిండియాను ముందుకు నడిపించిన వ్యక్తుల నుంచి తాను తప్పక సలహాలు, సూచనలు తీసుకుంటానని పేర్కొన్నాడు. అంతిమంగా జట్టును విజేతగా నిలపడమే తమ లక్ష్యమని హార్దిక పాండ్యా పేర్కొన్నాడు.
ఈసారి తాను రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతున్నానన్న హార్దిక్ పాండ్యా... ఈసారి అభిమానుల నుంచి సానుకూల స్పందన మాత్రమే కోరుకుంటున్నానని తెలిపాడు.
కెప్టెన్‌గా సూర్య
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) పద్దెనిమిదవ ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న విషయం తెలిసిందే. కోల్‌కతా నైట్ రైడర్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుండగా.. ముంబై మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది.
అయితే, గతేడాది స్లో ఓవర్ రేటు కారణంగా హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ నిషేధం పడగా.. ఐపీఎల్-2025 ఆరంభ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ముంబై కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన పాండ్యా.. ఈ ఏడాది తాము కచ్చితంగా అనుకున్న ఫలితాన్ని రాబడతామని ధీమా వ్యక్తం చేశాడు.
రోజురోజుకూ పెరుగుతుందే తప్ప తగ్గదు
‘‘నేను చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నా. అప్పుడు కూడా గెలుస్తామనే నేను విశ్వసించాను. అయితే, నేను ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీలో ఆడాను. నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయింది, కాన్ఫిడెన్స్ గురించి నన్ను అడిగితే.. రోజురోజుకూ అది పెరుగుతుందే తప్ప తగ్గదు.
ముగ్గురు టీమిండియా కెప్టెన్లు.. అది నా అదృష్టం
ఇక మా జట్టులో నాతో పాటు మరో ముగ్గురు కెప్టెన్లు ఉండటం ఒక రకంగా నా అదృష్టం అని చెప్పాలి. నాకు అవసరమైనపుడు వారి అనుభవాన్ని ఉపయోగించుకుంటా. టీమిండియాను మూడు ఫార్మాట్లలో భిన్న రీతిలో నడిపించిన వారి అనుభవం నాకు కచ్చితంగా అదనపు బలమే.
నాకు వారు ఎల్లవేళలా మద్దతుగా ఉంటారు. క్లిష్ట పరిస్థితుల్లో నా భుజం తట్టి నన్ను ముందుకు నడిపిస్తారు. మేమంతా కలిసి అనుకున్న రీతిలో జట్టును ముందుకు తీసుకువెళ్తాం’’ అని హార్దిక్ పాండ్యా బుధవారం నాటి మీడియా సమావేశంలో పేర్కొన్నాడు.
కాగా టీమిండియా వన్డే, టెస్టు సారథి రోహిత్ శర్మతో పాటు.. టెస్టుల్లో రోహిత్ గైర్హాజరీలో కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న జస్‌ప్రీత్ బుమ్రా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.
ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు
ఇదిలా ఉంటే.. ముంబై అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘నేను టాస్ కోసం వెళ్లినపుడు.. బ్యాటింగ్‌కి వెళ్లినపుడు నన్ను చీర్ చేయండి. సిక్సర్ బాదితే గట్టిగా అరవండి. వాంఖడే స్టేడియంలో నాకు ముంబై రంగులు తప్ప ఇంకేమీ కనిపించవద్దు’’ అని హార్దిక్ పాండ్యా పేర్కొన్నాడు.
కాగా ఐదుసార్లు ట్రోఫీ అందించిన రోహిత్ శర్మను తప్పించి ముంబై ఫ్రాంఛైజీ గతేడాది పాండ్యాకు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.
అయితే, అతడి రాకతో రోహిత్, బుమ్రా, సూర్య అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ముంబై గతేడాది దారుణంగా విఫలమైన నేపథ్యంలో.. ఆటగాళ్ల మధ్య సమన్వయ లోపమే ఇందుకు కారణమనే విమర్శలు వచ్చాయి. గతేడాది ముంబై పద్నాలుగింట కేవలం నాలుగే గెలిచి పాయింట్ల పట్టికలో పదో స్థానంలో నిలిచింది.
చదవండి: BCCI: విరాట్ కోహ్లి ఘాటు విమర్శలు.. స్పందించిన బీసీసీఐ
Comments
Please login to add a commentAdd a comment