
Photo Courtesy: BCCI/IPL
వరుస ఓటముల నేపథ్యంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్‌కోచ్ డానియల్ వెటోరి (Daniel Vettori) కీలక వ్యాఖ్యలు చేశాడు. తాము దూకుడైన బ్యాటింగ్ విధానానికే కట్టుబడి ఉంటామని.. అయితే, పరిస్థితులకు తగ్గట్లుగా ప్రణాళికలు అమలు చేయడం ముఖ్యమని పేర్కొన్నాడు. తాను, తమ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (Pat Cummins) ఇలాంటి పరాజయాలకు భయపడే రకం కాదని.. త్వరలోనే తిరిగి పుంజుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు.
కాగా గతేడాది ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కమిన్స్ బృందం.. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఏకంగా ఫైనల్ వరకు చేరింది. అయితే, ఆఖరిపోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇక ఈ ఏడాది టీమిండియా స్టార్లు మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్ రాకతో మరింత పటిష్టంగా మారిన రైజర్స్.. ఆటలో మాత్రం తేలిపోతోంది.
వరుసగా నాలుగు ఓటములు!
ఐపీఎల్-2025 (IPL 2025)లో తమ ఆరంభ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ఘన విజయం సాధించిన సన్‌రైజర్స్.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఆదివారం నాటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో పరాజయం తర్వాత రైజర్స్ కోచ్ డానియల్ వెటోరి మీడియాతో మాట్లాడాడు.
మా బ్యాటింగ్ శైలి మారదు
ఈ సందర్భంగా.. ‘‘దూకుడుగా బ్యాటింగ్ చేయాలన్న మా శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అయితే, పరిస్థితులను కూడా మేము బాగా అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి జట్ల బౌలింగ్ విభాగం పట్ల గౌరవం కలిగి ఉండాలి. వారి వ్యూహాలను అర్థం చేసుకునేలా ప్రణాళికలు రచించుకోవాలి.
ప్రణాళికల అమలులో విఫలం
మా జట్టులోని ముగ్గురు టపార్డర్ బ్యాటర్ల కోసం వివిధ రకాల ప్రణాళికలు సిద్ధం చేసినా.. సరైన సమయంలో వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారన్నది వాస్తవం. అయితే, నేనైనా.. ప్యాట్ అయినా.. మా కెరీర్‌లో భయపడిన సందర్భాలు లేవు.
అయితే, వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం స్వాగతించదగ్గ విషయం కాదని మాకూ తెలుసు. ఈ పరాజయాలు కచ్చితంగా ఈ సీజన్‌లో మా లక్ష్యాలను దెబ్బతీసే అవకాశం లేకపోలేదు’’ అని వెటోరి చెప్పుకొచ్చాడు. కాగా ఆదివారం ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన సన్‌రైజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది.
టైటాన్స్ చేతిలో చిత్తుగా ఓడి
ఓపెనర్లు అభిషేక్ శర్మ (18), ట్రవిస్ హెడ్ (8)తో పాటు వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (17) పూర్తిగా విఫలమయ్యారు. ఇక నితీశ్ రెడ్డి (31), క్లాసెన్ (19 బంతుల్లో 27), కమిన్స్ (9 బంతుల్లో 22) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో రైజర్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది.
ఈ క్రమంలో.. రైజర్స్ విధించిన నామమాత్రపు టార్గెట్‌ను 16.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు కోల్పోయి గుజరాత్ టైటాన్స్ ఛేదించింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(61), వాషింగ్టన్ సుందర్ (49), షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (35 నాటౌట్) అదరగొట్టారు. ఇక అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుని రైజర్స్‌ని దెబ్బ కొట్టిన టైటాన్స్ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (4/17)కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
చదవండి: ఇలా వచ్చి.. అలా వెళ్లారు.. అసలేం చేస్తున్నారు? కావ్యా మారన్ రియాక్షన్ వైరల్
3️⃣ wins on the trot 💙
A commanding 7️⃣-wicket win over #SRH takes #GT to the second spot in the #TATAIPL 2025 points table 🆙
Scorecard ▶ https://t.co/Y5Jzfr6Vv4#SRHvGT | @gujarat_titans pic.twitter.com/tYB1Dt5mdd— IndianPremierLeague (@IPL) April 6, 2025