
సాక్షి, తిరుమల: తిరుమలలో మరో అపచారం వెలుగు చూసింది. శ్రీవారి దర్శనానికి ముగ్గురు భక్తులు పాదరక్షలతో మహా ద్వారం వరకు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. వీరు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి పాదరక్షలు ధరించి వచ్చారు. అయితే, మూడు ప్రాంతాలలో తనిఖీ చేసిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వీరిని గుర్తించకపోవడం గమనార్హం.
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలో భద్రతాలోపం మరోసారి బయటకు వచ్చింది. భక్తులు ఏకంగా చెప్పులు వేసుకుని మహా ద్వారం వరకు రావడం అధికార నిర్లక్ష్య ధోరణికి అద్దం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి వీరు పాదరక్షలు ధరించి మహా ద్వారం వరకు చేరుకున్నారు. వీరు వచ్చిన మార్గంలో టీటీడీ విజిలెన్స్ అధికారుల తనిఖీలు ఉన్నప్పటికీ ఇంత దూరం పాదరక్షలతో ఎలా వచ్చారని పలువురు భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో భద్రతా తీరు, టీటీడీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు.. ఈ ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా భూమన మాట్లాడుతూ.. ‘తిరుమలలో భద్రత డొల్ల మరోసారి బయట పడింది. పాద రక్షలు వేసుకుని మహా ద్వారం వరకు భక్తులు వెళ్ళారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తోంది. శ్రీవాణి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహా ద్వారం వరకు పట్టించుకోలేదు. మేజోళ్ళుకు అనుమతి ఉంది అని ఏ బోర్డులో తీర్మానం చేశారో చెప్పండి. తిరుమల కొండపై జరుగుతున్న అపచారాలు గురించి చెప్తుంటే వితండ వాదనలు చేస్తున్నారు. తిరుమల కొండపై ప్రక్షాళన చేస్తామని చెప్పిన తర్వాతనే ఇవన్నీ జరుగుతున్నాయి.

రాష్ట్రపతి కూడా ఈ సాహసం చేయలేదు, చెప్పులు వేసుకుని మహాద్వారం వరకు ఏనాడు రాలేదు. భద్రత డొల్లతనం ఏమిటి అన్నది తెలుస్తోంది. టీటీడీలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోశాలలో ఆవులు చనిపోయాయి, దీనికి ప్రత్యక్ష సాక్షాలు ఉన్నాయి. జేసీబీలతో వెళ్ళి పూడ్చిన కళేబరాలు త్రవ్వి మీడియా సమక్షంలో బయటపెడదాం. టీటీడీ పాలకమండలి వెంటనే రాజీనామా చేయాలి డిమాండ్ చేస్తున్నా. దీనికి కారణమై సెక్యూరిటీ, ఇతర అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. తిరుమల భద్రత ఎంత అధ్వాన్న పరిస్థితికి వెళ్ళింది అనేది తేట తెల్లమైంది. తిరుపతి గోశాలలో గోవులు చనిపోయాయి అని చెప్తే, మాపై ఎదురు దాడి విమర్శలు చేస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.