
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి అనుగ్రహంతోనే తాను రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యానని.. అలాంటి తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఎవరూ నమ్మరని టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. అలిపిరి వద్ద స్వామివారి విగ్రహానికి అపచారం జరిగిన పరిణామంపై ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు.
అలిపిరి వద్ద ఘోర అపచారం జరిగింది. అది చెబితే నాపై కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఆది శ్రీవారి విగ్రహం కాదని.. శనీశ్వర విగ్రహం అని అంటున్నారు. శిల్పి చెక్కి పడేశాడని నిరక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. శంఖు చక్రాలు ధరించిన విగ్రహం శని విగ్రహం ఎలా అవుతుంది?. శని విగ్రహానికి విల్లు, బాణం ఉంటుంది. కాబట్టి.. అది ముమ్మాటికీ శ్రీ మహావిష్ణువు విగ్రహమే.
నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైంది. ఏడాదిన్నర కాలంగా మీరు ఏమి చేస్తున్నారు?. వైఖానస ఆగమ సత్రం తెలియని వాళ్ళు నాపై అసత్యాలు మాట్లాడుతున్నారు. ఒక్కసారి అవకాశం ఇస్తేనే దైవానుగ్రహంతో బోర్డు సభ్యులయ్యాం అని మీరు చెప్పుకుంటున్నారు. అదే స్వామివారి అనుగ్రహంతో రెండుసార్లు చైర్మన్, మూడుసార్లు బోర్డు సభ్యుడిని అయ్యాను నేను. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినా వాస్తవాలే చెబుతుంటాను నేను.

హిందూ ధర్మం పట్ల పూర్తి నమ్మకం ఉన్నవాడిని. కాబట్టి నాపై ఎన్నిసార్లు.. ఎంత దుష్ప్రచారం చేసినా ఎవ్వరు నమ్మరు. రాజకీయాలు కంటే నాకు హిందూ ధర్మ పరిరక్షణే నాకు ముఖ్యం. నేను నాయకుడ్ని కాదు.. స్వచ్ఛమైన హిందువును అని భూమన ఉద్ఘాటించారు.