
సాక్షి, తిరుపతి జిల్లా: జనసేన నేతల్లో శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ పదవి ఎంపిక చిచ్చు రేపుతోంది. జనసేన కొట్టే సాయిని చైర్మన్ పదవికి ఎంపిక చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. డిప్యూటి సీఎం పవన్ కళ్యాణ్‌కు శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇంఛార్జ్ వినుత కోట బహిరంగ లేఖ రాశారు. శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్‌కు ఇవ్వడంపై అభ్యంతరం తెలిపిన వినుత.. పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.
‘'కొట్టే సాయి ప్రసాద్‌కు పదవి ఇవ్వడాన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. మహిళలంటే గౌరవం లేని వ్యక్తికి ఛైర్మన్ పదవి ఇవ్వడం సరికాదు. నాపై జరిగిన రాజకీయ కుట్రలో ప్రధానమైన వ్యక్తుల్లో సాయి ప్రసాద్ ఒకడు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలను జనసేన కార్యాలయానికి పంపించాను. మీ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరుతున్నాను. త్వరలో అన్ని ఆధారాలతో మీడియా ముందుకు వస్తాను’’ అంటూ వినుత బహిరంగ లేఖలో పేర్కొన్నారు.

