
విశాఖ జిల్లా,సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారణంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలను విద్యార్థులు రాయలేకపోయారు. పెందుర్తి అయాన్ డిజిటల్ జేఈ విద్యార్థులకు పవన్ కాన్వాయ్ అడ్డుగా వచ్చింది. దీంతో పరీక్షా కేంద్రానికి విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వెళ్లారు. పరీక్ష రాయకుండానే ముప్పై మంది విద్యార్థులు వెనుదిరిగారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
పెందుర్తిలో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ ఉదయం 8.30 జరగనుండగా.. పవన్ కాన్వాయ్ కారణంగా పరీక్షా కేంద్రానికి 8.32కి వచ్చారు. ఆ రెండు నిమిషాలు కూడా పవన్ వస్తున్నారని పోలీస్ అధికారులు ట్రాఫిక్ నిలిపివేశారని, లేదంటే పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకునే వారమని విద్యార్థులు మీడియాకు తెలిపారు.
పవన్ కళ్యాణ్ వస్తున్న మార్గంలోనే ఎగ్జామ్ సెంటర్ ఉంది. పవన్ వస్తున్నారనే కారణంతో ప్రొటోకాల్ దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారు. కాబట్టే రెండు నిమిషాల ఆలస్యంతో పరీక్షా కేంద్రానికి వచ్చామని, ఆలస్యమైందని అధికారులు తమని పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదని విలపిస్తున్నారు. ఈ విషయంలో పవన్ జోక్యం చేసుకుని ఆ 30 మంది విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
