చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ తోడుదొంగలు | Ap minister Gudivada Amarnath Fires on chandrababu and pawan kalyan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ తోడుదొంగలు

Published Sat, Sep 16 2023 10:03 PM | Last Updated on Sat, Sep 16 2023 10:04 PM

Ap minister Gudivada Amarnath Fires on chandrababu and pawan kalyan - Sakshi

స్కిల్డ్‌ దొంగను కాపాడేందుకు లోకేశ్, పవన్‌ ఆరాటపడుతున్నారని, అందులో భాగంగానే  ఢిల్లీ మీడియాతో లోకేశ్‌ సొల్లు కబుర్లు చెబుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. మీ తండ్రి అవినీతిపై దర్యాప్తు సంస్థలు పిలుస్తుంటే.. చర్చంటూ సవాళ్లేమిటి లోకేశ్?.. ఏ తప్పూ చేయకపోతే అసెంబ్లీకొచ్చి చర్చించే దమ్ముందా? అని సవాల్‌ విసిరారు. ఇక పవన్‌కళ్యాణ్‌ నకిలీ కాపు అని, ఆయన ఏనాడూ కాపు ఉద్యమాలకు సహకరించలేదని  మండిపడ్డారు.  వంగవీటి హత్య, ముద్రగడపై వేధింపుల్లో చంద్రబాబు కుట్రను ప్రశ్నించలేదని, జనసేన కేడర్‌ను జెండాకూలీలుగా మార్చాడని, టీడీపీలో జనసేన విలీనమే ములాఖత్‌ ప్రకటన రహస్యమని స్పష్టీకరించారు.

విశాఖపట్నం: నగరంలోని సర్యూట్‌హౌస్‌లో ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే..

ఈడీ, ఐటీ, సీఐడీలతో చర్చించు
ఢిల్లీలో నిన్న నారా లోకేశ్‌ జాతీయమీడియాతో మాట్లాడాడు. తన తండ్రి చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ స్కామ్ కేసుకు సంబంధించి వివరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురించి ప్రస్తావించాడు. చంద్రబాబు ఏ తప్పూ చేయకుండానే రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నారని.. జగన్‌ గారితో  తాను చర్చించేందుకు సిద్ధమంటూ లోకేశ్‌ ఛాలెంజ్‌ విసిరాడు. అయితే, ఆయనతో చర్చకు ఏ స్థాయి వ్యక్తి ముందుకొస్తారనేది పక్కనబెడితే.. చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ముందు వారిని ఈడీ అరెస్టులతో పిలిచింది. ఒకపక్కేమో ఇన్‌కం ట్యాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ షోకాజ్ నోటీసులు ఇచ్చి పిలుస్తుంటే.. మరోపక్క సీఐడీ సాక్ష్యాధారాలతో సహా జైలుకు పంపింది.

తండ్రీకొడులు కుంటిసాకులతో..
ఒకపక్కన కేంద్ర దర్యాప్తు సంస్థలతో పాటు సీఐడీ చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ను అవినీతిపై నోరు విప్పాలని  నోటీసులిస్తుంటే..  మరి, వాటి సంగతి తేల్చాలి కదా..?. సీఐడీ పిలుస్తుంటేనేమో.. నేను సమాధానం చెప్పను. నాకు సంబంధం లేదు. నాకు నోటీసులివ్వలేదు. గవర్నర్‌ గారికి చెప్పి నన్ను అరెస్టు చేస్తున్నారా..లేదా..? స్పీకర్‌ చెప్పి నన్ను అరెస్టు చే స్తున్నారా..? అంటూ చంద్రబాబు వితండవాదం చేశాడు. అదేవిధంగా ఐటీశాఖ కూడా బాబూ.. నువ్వు ఆదాయపన్ను లెక్కల్లోకి రాని రూ.118 కోట్లు బొక్కేశావు.

రాష్ట్ర ఖజానా నుంచి కాంట్రాక్టర్‌లకు చెల్లింపుల్లో లంచాలకు సంబంధించి కొట్టేసిన మొత్తానికి సరైన లెక్కలతో సమాధానం చెప్పాలంటూ నోటీసులిస్తే.. దానికి సమాధానం చెప్పడు. లోకేశ్‌ కూడా నోరుమెదపడు. 2020 నుంచి కేంద్ర ఐటీశాఖ నుంచి నోటీసులు వస్తూనే ఉన్నాయి. వాటికి సంబంధించి ఏవేవో కుంటి సాకులు చెబుతూ రిప్లైలు ఇచ్చినా.. వాటినన్నింటినీ ఐటీశాఖ తోసిపుచ్చింది తెలిసిందే. మరోవైపు ఏపీలో జరిగిన స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఇప్పటికే అనేమందిని విచారించింది. అరెస్టులు కూడా చేసింది. రేపోమాపో చంద్రబాబు, లోకేశ్‌ను కూడా విచారణకు పిలుస్తుంది. అయితే, సమాధానం చెప్పుకోవాల్సిన చోట నోరువిప్పకుండా.. తండ్రీకొడుకులు పనికిమాలిన కబుర్లు మాట్లాడుతున్నారు.

నువ్వెంత..నీ బతుకెంత..?
రాష్ట్రంలో ప్రజలను అడ్డంగా దోచుకుని తిని అవినీతి ఆధారాలతో నీ తండ్రి జైలుకెళ్తే.. నువ్వేమో నాతో చర్చకు ఫలానా వాళ్లు రావాలంటూ జాతీయమీడియాతో మాట్లాడతావా లోకేశ్‌..? అసలు, అక్కడిదాకా వెళ్లి నీ తండ్రికి పట్టిన గతి గురించి మాట్లాడుకోవడానికి సిగ్గనిపించడం లేదా..? ఒకటీ రెండు కాదు. అక్షరాలా రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకు తిన్న పందికొక్కులు నువ్వు, నీతండ్రి. అందుకే, ఇన్నాళ్లకు మీ పాపం పండి ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు మీ భరతం పట్టేందుకు సిద్ధమయ్యాయి. నువ్వేమో ముఖ్యమంత్రితో చర్చించాలంటున్నావు. లోకేశ్‌.. నీ బతుకేంటి.? నీ స్థాయేంటి..? అని హెచ్చరిస్తున్నాను. 

నీ తండ్రి అవినీతిని ఒప్పుకున్నావా..?
రిపబ్లిక్‌ టీవీలో నిన్న లోకేశ్‌ మాట్లాడుతూ.. ఒక అద్భుతమైన పోలిక చెప్పాడు. ఏదైనా బ్యాంకు బ్రాంచిలో తప్పు జరిగితే బ్యాంకు ఛైర్మన్‌ను అరెస్టు చేస్తారా..? అంటూ లోకేశ్‌ ప్రశ్నించాడు. అంటే, సిల్క్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు సంబంధించి రూ.371 కోట్లు కుంభకోణం జరిగిందని లోకేశ్‌ ఒప్పుకున్నట్టే కదా..? ఈ దోపిడీకి గురైన ప్రజాధనం మొత్తం అటూఇటూ తిరిగి చంద్రబాబు ఖాతాకు చేరాయని ఆధారాలు చెబుతున్నాయి.

అంటే, నీ తండ్రి అవినీతికి పాల్పడ్డాడంటూ ఒప్పుకున్నట్టే కదా..? అని లోకేశ్‌ను ప్రశ్నిస్తున్నాను. ఈ స్కామ్‌కు సంబంధించి ప్రభుత్వ అధికారులపై ఐదు పర్యాయాలు చంద్రబాబు వత్తిళ్లకు గురిచేసినట్లు నోట్‌ఫైల్స్‌ చెబుతున్నాయి. అయితే, ఈ తండ్రీకొడుకులు మాత్రం తమకేమీ తెలియదని రూ.371 కోట్ల ప్రజల సొమ్మును కొట్టేసి సుద్ధపూసల్లా మాట్లాడుతున్నారు. దొంగలెప్పుడూ తామెలాంటి తప్పు చేయలేదనే మాటే అంటారు. కానీ, చట్టం ముందు అందరూ సమానమేనని గుర్తించాలి. చట్టం దొంగల్ని సమాజం ముందుకు తెస్తుందని తెలుసుకోవాలి. 

చంద్రబాబు దేశంలోనే రిచ్‌ ఎమ్మెల్యే
దేశవ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలందరిలోకెల్లా నాల్గో ధనవంతుడైన ఎమ్మెల్యేగా చంద్రబాబు రికార్డుల్లోకి ఎక్కాడు. ఇది నా సొంతంగా చెబుతున్న మాట కాదు. తన ఎన్నికల అఫిడవిట్‌లోనే రూ.683 కోట్ల విలువైన ఆస్థి తనపేరిట ఉన్నట్లు చంద్రబాబు స్వయంగా చెప్పుకున్నాడు. మరి, ఇదే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కేవలం 2 ఎకరాల పొలం మాత్రమే ఉండేది. ఆ రెండెకరాల రాజకీయ ప్రస్థానం రూ.683 కోట్లకు ఎలా పెరిగిందని మేం అడుగుతున్నాం. అధికారాన్ని అడ్డంపెట్టుకుని మీరు దోచేసిన రూ.లక్షల కోట్లు గురించి కాకుండా.. మీరు అధికారికంగా చెప్పిన రూ.కోట్లపైనే ప్రశ్నిస్తున్నాను. దీనికి చంద్రబాబు గానీ.. ఆయన సుపుత్రుడు లోకేశ్‌ గానీ సమాధానం చెప్పాలి.

ఆధారాలతో అడ్డంగా దొరికిన దొంగ బాబు
ఎక్కడో ఉన్న ఒక కంపెనీని తెరమీదికి తెచ్చి.. ఏపీలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో యువతకు శిక్షణతో పాటు ఉద్యోగాల కల్పనకు సంబంధించి 90 శాతం పెట్టుబడి పెడుతుందని చెప్పారు. ప్రభుత్వం మాత్రం 10 శాతం వాటా పెట్టాలన్నారు. తీరా 90 శాతం పెట్టుబడి పెట్టాల్సిన కంపెనీ నుంచి ఒక్క పైసా రాకుండానే ప్రభుత్వ ఖజానా నుంచి 10 శాతం చెల్లింపులు చేసుకున్నారు. అంటే, రూ.371 కోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. సీమెన్స్‌ కంపెనీ పేరిట అబద్ధాలు చెప్పి.. ప్రభుత్వ సొమ్మును అప్పన్నంగా కాజేయడానికి పన్నిన చంద్రబాబు పన్నాగమిది.

ఇంతా దోచుకుని మేం కొట్టేసినట్టు ఆధారాలేంటి..? అని తండ్రీకొడుకుల బుకాయింపులు. ఇదేమన్నా హెరిటేజ్‌ ఫ్రెష్‌లో టమాటాల్ని కొంటే ఇచ్చే రసీదులా..? లంచాలకు రసీదులెక్కడుంటా యి..? దర్యాప్తు సంస్థల విచారణలో ఆధారాలన్నీ బయటపడతాయని లోకేశ్‌ తెలుసుకోవాలి. ఏపీలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ గురించి తామెలాంటి ఒప్పందం చేసుకోలేదని.. ఎదురుపెట్టుబడి పెట్టి తామెలాంటి ప్రాజెక్టులు చేపట్టిన దాఖల్లాలేవంటూ సీమెన్స్‌ సంస్థ అధికారికంగా చెప్పింది. మరి, చంద్రబాబు తెరమీదికి తెచ్చిన సీమెన్స్‌ బోగస్‌ ఒప్పందాన్ని ఏమంటారు..? అది అవినీతి కార్యక్రమం కాదా..? అని అడుగుతున్నాను. కనుక, చంద్రబాబు స్కిల్‌స్కామ్‌లో ఆధారాలతో దొరికన దొంగ అని స్పష్టమైంది. 

13చోట్ల సంతకాలతో అడ్డంగా దొరికాడు
చంద్రబాబు అరెస్టు తర్వాత ఆయనతో పాటు న్యాయవాదులు, లోకేశ్, టీడీపీ నాయకులు ఎక్కడా.. తాము అవినీతికి పాల్పడలేదని చెప్పలేదు. కుంభకోణం జరిగిన మాట వాస్తవమే గానీ.. ఈ కేసులో మమ్మల్ని అరెస్టు చేయడానికి పరిమితులు, పరిధులు వర్తిస్తాయంటూ అడ్డదిడ్డంగా ‘లా’ పాయింట్లు పీకుతున్నారు. లోకేశ్‌ నిన్న జాతీయమీడియాతో మాట్లాడుతూ.. మా నాన్న ఎక్కడా సంతకం చేయలేదని చెబుతున్నాడు.

స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌తో బోగస్‌ కంపెనీల ఒప్పందాలు గానీ.. రాష్ట్ర ఖజానా నుంచి రూ.371 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఫైళ్లల్లో మొత్తం 13 చోట్ల చంద్రబాబు సంతకాలున్నట్లు సీఐడీ ఆధారాల్ని కోర్టుకు సైతం సమర్పించింది. మరి, ఆయనకెలాంటి సంబంధం అంటదని లోకేశ్‌తో పాటు పచ్చమీడియా కూడా ఎలా వాదిస్తుంది..? అని అడుగుతున్నాను. ఆ సంతకాలు కూడా బాబువి కాదు.. ఫోర్జరీ చేశారని దీనిపై కూడా రేపోమాపో మరో అబద్ధాన్ని కూడా వీళ్లంతా ప్రచారం చేస్తారేమో.. అంతటి అసాధ్యులే వీళ్లు.

అసెంబ్లీకొచ్చి చర్చించే దమ్ముందా..?
 ఏదిఏమైనా చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాల్లో ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ స్కామ్‌ అనేది కేవలం ఒక తీగమాత్రమే.. ఇంకా కదలాల్సిన డొంక చాలా ఉందని మరోమారు గుర్తుచేస్తున్నాను. రూ.371 కోట్ల ప్రజాధనాన్ని కొట్టేసేందుకే చంద్రబాబు సూత్రధారిగా, పాత్రధారిగా వ్యవహరించినట్లు సీఐడీ అన్నీ ఆధారాలతోనే అరెస్టు చేసింది. ఏసీబీ కోర్టు కూడా సీఐడీ వాదనలతో ఏకీభవించింది కనుకే చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్‌ జైలుకెళ్లాల్సి వచ్చింది.

దీనిపై ఇప్పటికైనా తండ్రీకొడుకులతో పాటు తెలుగుదేశం పార్టీ స్పష్టమైన సమాధానం చెప్పాలి. ప్రజాధనం కొట్టేసినందుకు రాష్ట్రప్రజలకు క్షమాపణలు చెప్పి.. చట్టపరంగా శిక్ష అనుభవిస్తామని నేరాన్ని అంగీకరించాలని మేం డిమాండ్‌ చేస్తున్నాం. తామేమీ అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాలంటే రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ స్కామ్‌పై చర్చించే దమ్మూధైర్యం ఉందా..? అని ఆ పార్టీ నేతలకు సవాల్‌ విసురుతున్నాను. 

నకిలీ కాపు పవన్‌కళ్యాణ్
కాపు ఉద్యమాలకు ఏనాడు సహకరించని నకిలీ కాపు పవన్‌కళ్యాణ్‌. ఇదే చంద్రబాబు కుట్రలతో వంగవీటి మోహనరంగా హత్యకు గురైనప్పుడు గానీ.. ముద్రగడ పద్మనాభం గారిలాంటి వాళ్లు తీవ్రమైన వేధింపులకు గురైనప్పుడూ ఏరోజూ పవన్‌కళ్యాణ్‌ స్పందించలేదు. ఆయా సందర్భాలపై ఆయన మాట్లాడింది కూడా లేదు. అలాంటి వ్యక్తి ఈరోజు కాపు నాయకుడిగా చెలామణి అవుతూ టీడీపీకి సపోర్టు చేయాలని పిలుపునిస్తే కాపుసోదరులెవరూ పట్టించుకోరు. అసలు, ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌ను పూర్తిగా కాపులు పక్కనబెట్టారు. 

జెండా కూలీలుగా జనసైనికులు
వెనకటికెవరో ఎప్పుడో జరిగిన పెళ్లికి ఇప్పుడు భజంత్రీలన్నాడంట.. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రకటనలు అలా ఉన్నాయి. అవినీతి కేసులో జైలుకెళ్లిన చంద్రబాబుతో ఆయన ములాఖత్‌ అయ్యాడు. జైలు బయటకొచ్చి తామిద్దరం మిలాఖత్‌ అయ్యామంటున్నాడు. ఆ రెండు పార్టీల పొత్తు గురించి ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది..?ఒక తండ్రికి ఉత్తపుత్రడితో పాటు దత్తపుత్రుడి ఆట గురించి  మా నాయకుడు జగన్‌ గారు ఎప్పట్నుంచో చెబుతూనే ఉన్నారు. చంద్రబాబు దత్తపుత్రుడైన పవన్‌కళ్యాణ్‌ లేటెస్టుగా టీడీపీతో పొత్తు అన్నంతమాత్రానా ఏమీ ఊడిపడేదిలేదు. పైగా, జనసేన నాయకులు, కేడర్‌కు ఇన్నాళ్లకు కళ్లు తెరుచుకున్నాయి. పవన్‌కళ్యాణ్‌పై అభిమానంతో ఆ పార్టీ కార్యకర్తలు పనిచేస్తుంటే.. ఆయన మాత్రం చంద్రబాబుకు బానిసత్వం చేస్తున్నారనే చర్చ మొదలైంది. తాము టీడీపీని భుజానికెత్తుకునే జెండాకూలీలుగా ఉండబోమని జనసేన సైనికులంటున్నారు.

విలీనం చేయడానికి సరికొత్త ఎత్తుగడ..
జనసేనను టీడీపీలో విలీనం చేయడానికి ఇది సరికొత్త ఎత్తుగడగా చంద్రబాబు, పవన్‌లు పథక రచన చేశారంటూ ఇరుపార్టీల కేడర్‌ భావిస్తుంది యధార్థమే..అయితే, బాబును భుజానికెత్తుకుంటే పవన్‌కళ్యాణ్‌ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగానే మారబోతుందనడంలో సందేహం లేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement