
తల్లీ కూతుళ్లపై విచక్షణారహితంగా కత్తితో దాడి
తల్లి అక్కడికక్కడే మృతి.. కూతురి పరిస్థితి విషమం
కొద్ది రోజులుగా యువతికి వేధింపులు
పెళ్లి ఆలస్యం చేస్తున్నారని కక్షకట్టి దారుణం
ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైఎస్ జగన్
మధురవాడ (విశాఖ)/శ్రీకాకుళం క్రైమ్/బూర్జ/వీరఘట్టం/సాక్షి, అమరావతి : పెళ్లికి నిరాకరించారన్న కారణంతో తల్లీ కూతుళ్లపై ప్రేమోన్మాది విచక్షణారహితంగా దాడి చేశాడు. తల్లి మృతి చెందగా, కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. సీపీ శంఖబ్రత బాగ్చి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పార్వతీపురం మన్యం జిల్లా దేవుదళ సమీపంలోని పెద్దపుర్లికి చెందిన నక్కా రాజు బతుకు తెరువు కోసం రెండేళ్ల క్రితం మధురవాడకు వచ్చి, కార్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. భార్య గృహిణి. ఇద్దరు పిల్లలు. కుమార్తె దీపిక (20) ఆరేళ్ల క్రితం వీరఘట్టం మండలం పనసనందివాడలోని తన పిన్ని ఇంటికి ఓ కార్యక్రమానికి వెళ్లింది.
ఎదురింట్లో ఉంటున్న దమరసింగి నవీన్ (26) పరిచయమయ్యాడు. నవీన్ డిగ్రీ పూర్తి చేసి, ఖాళీగా ఉంటున్నాడు. దీపిక విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాలలో మైక్రోబయాలజీ పూర్తి చేసి, నర్సింగ్ చేస్తోంది. ఈ క్రమంలో దీపికను పెళ్లి చేసుకుంటానంటూ ఆమె తల్లిదండ్రులపై నవీన్ తీవ్రంగా ఒత్తిడి తెస్తున్నాడు. ఇతడి ప్రవర్తన సరిగా లేకపోవడంతో పెళ్లి ఆలస్యం చేస్తూ వచ్చారు. దీంతో పెళ్లికి అంగీకరించకపోతే చంపేస్తానని కూడా పలుమార్లు బెదిరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అతడి జీవితం నాశనం అయిపోతుందని దీపిక తండ్రి రాజు ఆలోచించాడు. అదే ఆ కుటుంబానికి తీరని శోకం మిగిల్చింది.
ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం12 గంటలకు కొమ్మాది జంక్షన్ హైవేకు కూతవేటు దూరంలో ఉన్న స్వయంకృషి నగర్‌లో బాధితుల ఇంటికి నవీన్ వచ్చాడు. కొన్నాళ్ల తర్వాత పెళ్లి చేస్తామని చెప్పడంతో విచక్షణ కోల్పోయి వాదనకు దిగాడు. ఓ దశలో ఉన్మాదంతో ఊగిపోతూ 1.30 గంటలకు తల్లీ కూతుళ్లపై చాకుతో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో నక్కా లక్ష్మి (47) అక్కడికక్కడే మృతి చెందగా, దీపికకు చేయి, మెడ ఇతర భాగాలపై తీవ్ర గాయాలై, స్పృహ తప్పింది. ఆ వెంటనే నిందితుడు పరారయ్యాడు. కాసేపటికి స్పృహలోకి వచ్చిన దీపిక తల్లి చలనం లేకుండా ఉండడాన్ని గమనించింది.
సహాయం కోసం ఎంత ప్రయత్నించినా ఎవరూ అందుబాటులోకి రాలేదు. మేడ మీద నుంచి అతికష్టంగా కిందికి వచ్చి ఆర్తనాదాలు చేయడంతో పక్కనే ఉన్న వ్యక్తి ఫోన్ చెయ్యడంతో పీఎంపాలెం ఎస్‌ఐ కె.భాస్కరరావు సంఘటనా స్థలికి చేరుకుని రక్తం మడుగులో ఉన్న దీపికను ద్విచక్ర వాహనంపై దగ్గర్లోని గాయత్రి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.
మెరుగైన వైద్యం కోసం మెడికవర్ ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు. నిందితుడు నవీన్ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు ఐదు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టి, శ్రీకాకుళం జిల్లా బూర్జ నుంచి వీరఘట్టం వెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. మేజి్రస్టేట్ ముందు హాజరు పరుస్తామని చెప్పారు.
ఉలిక్కిపడిన పనసనందివాడ
ఈ ఘటనతో నవీన్ స్వగ్రామం పనసనందివాడ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీపికతో కొన్నేళ్లుగా పరిచయం ఉన్నప్పటికీ, కొద్ది రోజులుగా వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరితో ఫోన్‌లో మాట్లాడినా అనుమానిస్తూ వచ్చాడు. ఓ దశలో ఆ యువతిపై చేయి కూడా చేసుకున్నాడు. దీంతో కొద్దిరోజులుగా అతనితో పెళ్లి జరిపించడంపై యువతి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో పది రోజులుగా అతని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చివరకు కడతేర్చేందుకు పూనుకున్నాడు.

వీరఘట్టం ఎస్‌ఐ జి.కళాధర్ గ్రామానికి చేరుకుని నవీన్ తల్లిదండ్రులు జ్యోతి, అన్నారావుల నుంచి వివరాలు సేకరించారు. కాగా, నిందితుడిని గంటల వ్యవధిలో పట్టుకున్నందుకు పోలీసులను విశాఖ డీఐజీ గోపినాథ్ జెట్టి, శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి అభినందించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
కూటమి సర్కారుపై వైఎస్ జగన్ మండిపాటు
విశాఖపట్నంలో ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, మహిళల మాన ప్రాణాలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరంలో వేదింపులు తాళలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మరువక ముందే విశాఖలో ప్రేమోన్మాది దాడిలో యువతి తల్లి నక్కా లక్ష్మి ప్రాణాలు కోల్పోవడం, యువతి దీపిక ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లక్ష్మి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు.