
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ఏపీలో పరిస్థితులు పూర్వపు బీహార్‌ను తలపిస్తున్నాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రతిఒక్కరూ ఆలోచించుకోవాలన్నారు. పాపిరెడ్డిపల్లిలో టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని మంగళవారం.. వైఎస్ జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘లింగమయ్య హత్యతో పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, శాంతి భద్రతలు దిగజారాయి. చంద్రబాబు ఎంత భయపెట్టినా, ప్రలోభాలు పెట్టిన ఎంపీపీ ఎన్నికల్లోవైఎస్సార్‌సీపీ గెలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అడుగడుగునా దౌర్జన్యాలకు పాల్పడ్డారు’’ అని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
‘‘చంద్రబాబుకు బలం లేదని స్థానిక ఎన్నికలను అడ్డుకున్నారు. 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 చోట్ల వైఎస్సార్‌సీపీ గెలిచింది. చంద్రబాబుకు అనుకూలంగా లేదని 7 చోట్ల వాయిదా వేయించారు. టీడీపీ ఎమ్మెల్యే, తనయుడు, రామగిరి ఎస్‌ఐ దౌర్జన్యాలు చేశారు. లింగమయ్య హత్య కేసును నీరుగార్చుతున్నారు. లింగమయ్య హత్యపై కంప్లైంట్ వాళ్లే రాసుకొచ్చారు. లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్రలు వేయించారు. లింగమయ్య కొడుకు ఫిర్యాదును పక్కన పెట్టారు. తమకు అనుకూలమైన వారినే సాక్షులుగా పెట్టారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లోనూ దౌర్జన్యాలు చేశారు. ఏకంగా పోలీసుల ఆధ్వర్యంలో కూటమి నేతలు కిడ్నాలు చేశారు. రామకుప్పం ఎంపీపీ ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేశారు’’ వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.
