Sri Sathya Sai District
-
జెడ్పీ నిధులపై తమ్ముళ్ల కన్ను
లేపాక్షి: జెడ్పీ నిధులు కాజేసేందుకు అధికార పార్టీ నాయకులు కన్నేశారు. గ్రామీణా ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆరు నెలల కిందట మండాలనికి జెడ్పీ నుంచి రూ. కోటి నిధులు మంజూరయ్యాయి. మొదటి విడతలో రూ.40 లక్షల నిధులతో పనులు చేసిన ఓ అధికార పార్టీ నాయకుడు నిధులు మంజూరు చేయించుకున్నాడు. రెండో విడతలో వచ్చిన రూ. 64 లక్షల జెడ్పీ నిధులు సైతం తనకే దక్కాలంటూ ఆయనతోపాటు ఆయన వర్గీయులు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే అదే పార్టీకి చెందిన మరోవర్గం వారిని అడ్డుకుంటున్నారు. మండలంలోని కంచిసముద్రం పంచాయతీలో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా ఉన్న విబేధాలు భగ్గుమంటున్నాయి.అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడున్న రెండు వర్గాల నాయకులు సర్పంచ్‌ను డమ్మీ చేశారు. పంచాయతీకి మంజూరైన జిల్లా పరిషత్ నిధులను చేజిక్కించు కోవడానికి హిందూపురం పట్టణానికి చెందిన ఓ నాయకుడు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సర్పంచ్‌ను కాదని పనులు చేయడానికి అధికారులతో కుమ్మక్కై తీర్మాణాలు కూడా చేయించాడు. టీడీపీలో మరో వర్గం నాయకులు స్థానికంగా ఉండే నాయకులే పనులు చేయాలని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు పనులు చేయడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, విభేదాలు చోటు చేసుకునే అవకాశం వుందని సర్పంచ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో రెండు వర్గాల మద్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి. పంచాయతీలో సమావేశం కంచిసముద్రం పంచాయతీలో జెడ్పీ నిధులతో పనులు చేయడానికి శనివారం సమావేశం ఏర్పాటు చేసారు. వార్డు సభ్యులు అందరూ అత్యవసర సమావేశానికి హాజరు కావాలని పంచాయతీ కార్యదర్శి అజెండా కాపీలను జారీ చేశారు. అయితే 12 మంది వార్డు సభ్యుల్లో నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అజెండాలో ఉన్న అంశాలను కార్యదర్శి సభ్యులకు చదివి వినిపించకుండా సంతకాలు తీసుకున్నారు. వారు సంతకాలు చేసిన వెంటనే తీర్మానం చేశామనే సాకుతో వెళ్లి పోయారు.దళిత సర్పంచ్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా? అధికార పార్టి నాయకుడు హిందూపురం పట్టణానికి చెందిన గ్రీన్ పార్కు నాగరాజుతో పాటు ఆయన అనుచరులు దళిత మహిళా సర్పంచ్ అయిన నన్ను ప్రతి విషయంలోను అగౌరవ పరుస్తున్నారు. పంచాయితీ నిధులు కేటాయింపుల్లో తన ప్రమేయం లేకుండా వ్యవహరిస్తున్నారు. దళిత మహిళ సర్పంచ్‌కు ఇచ్చే గౌరం ఇదేనా సర్పంచ్ గంగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొన్నారు. -
రుణానికి సువర్ణ అవకాశం
హిందూపురం అర్బన్: బంగారం.. ఇప్పుడు అందరికీ అత్యవసర నిధి. అందుకే ధర భగ్గుమంటున్నా కొనేందుకు జనం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. చాలా మంది బంగారు ఆభరణాలు ఒంటిపై ఉంటే సమాజంలో గౌరవంగా చాలా మంది భావిస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలోనూ ఆదుకునే అత్యవసర నిధిగా భావిస్తున్నారు. అందుకే ధర ఎంతగా ఎగబాకినా...కొనేందుకు జనం మొగ్గుచూపుతున్నారు. బంగారం చేతిలో ఉంటే క్షణాల్లో రుణం.. ఏదైనా రుణం కావాలంటే బ్యాంకులకు వెళితే.. సవాలక్ష నిబంధనలు చెబుతారు. కొన్నిసార్లు నెలల తరబడి తిరిగినా రుణం మంజూరు కాని పరిస్థితి. కానీ ‘గోల్డ్ లోన్’(Gold loan) అలా కాదు. చేతిలో బంగారు నగలుంటే చాలు బ్యాంకర్లు, ఫైనాన్స్ సంస్థలు క్షణాల్లో రుణం మంజూరు చేస్తున్నారు. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు కోసం ‘గోల్డ్ లోన్’ తీసుకొంటున్నారు. గ్రామగ్రామానా వెలిసిన సంస్థలు.. ‘గోల్డ్ లోన్’ వ్యాపారం భారీగా జరుగుతుండగా... హిందూపురం, ధర్మవరం, కదిరి లాంటి పట్టణాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు వెలిశాయి. అవసరానికి అప్పులు పుట్టని చాలామంది ‘గోల్డ్‌లోన్’ తీసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ‘ప్రైవేట్’ వ్యక్తుల వద్ద తీసుకునే రుణానికి వడ్డీ కొండంత ఉండటంతో చాలా మంది బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలను సంప్రదిస్తున్నారు.బ్యాంకులతో పాటు ప్రైవేటు సంస్థలు బంగారం నాణ్యతను బట్టి లోన్ మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 10 గ్రాముల బంగారానికి రూ.52 వేలకుపైగా రుణం ఇస్తున్నారు. పైగా తక్కువ వడ్డీలకే రుణాలు మంజూరవుతుండటంతో చాలా మంది ‘గోల్డ్‌లోన్’ తీసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రధాన బ్యాంకులతో పాటు సహకార సంఘ బ్యాంకులు, ముత్తూట్ మనీ, మణప్పరం, శ్రీరామ్ చిట్స్ తదితర సంస్థలు విరివిగా ‘గోల్డ్‌లోన్’ మంజూరు చేస్తున్నాయి. కొందరైతే బంగారాన్ని కుదవపెట్టి లోన్ తీసుకొని దాని ద్వారా వ్యాపారాలు చేస్తుండటం విశేషం. లాకరు అద్దె ఎందుకనీ... డబ్బున్న వారు సైతం బంగారాన్ని లాకర్లలో ఉంచడం తగ్గించేశారు. అదే బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకొని ఇతర రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. లేదంటే తీసుకున్న రుణంలో 90 శాతం మొత్తం నెలలోపు తీర్చేస్తున్నారు. మిగిలిన 10 శాతం మొత్తాన్ని ఏడాది తర్వాత వడ్డీతో కలిపి కట్టేస్తున్నారు. మళ్లీ బంగారాన్ని లోన్ కోసమంటూ బ్యాంకుల్లో పెట్టేస్తున్నారు. దీంతో జిల్లాలో ప్రధాన పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లోని వివిధ బ్యాంకు శాఖల్లో కిలోల కొద్దీ బంగారం నగలు ఉంటున్నాయి. గోల్డ్ రుణాలు పొందేవారి సంఖ్య పెరుగుతుండటంతో బ్యాంకుల్లోని సేఫ్ లాకర్లలో నగల మూటలూ పెరిగిపోతున్నాయి. నెలకు రూ.12 కోట్ల పైమాటే⇒ జిల్లా వాసులు ప్రస్తుతం బ్యాంకులు, వివిధ ప్రైవేటు సంస్థల్లో నెలకు రూ.12 కోట్ల దాకా బంగారంపై రుణాలు తీసుకుంటున్నారు. గతంలో ఈ మొత్తం రూ.9 కోట్లలోపే ఉండేది. సంక్షేమ పథకాలు అమలుకాకపోవడం, ఇతరత్రా కారణాల వల్ల ప్రజల చేతిలో డబ్బు ఉండడం లేదు. దీంతో అవసరాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. ⇒ 80 శాతం మంది బ్యాంకుల్లోనే తాకట్టు పెడుతున్నారు. మిగిలిన 20 శాతం ప్రైవేటు సంస్థల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందుతున్నారు. ⇒ బంగారు రుణాలపై బ్యాంకులు 8.5 శాతం నుంచి 9 శాతం వరకు, ప్రైవేటు సంస్థలు 10 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ⇒ గ్రామీణం, పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లోనూ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు పొందేవారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది.⇒ హిందూపురానికి చెందిన నరేష్ చిరు ఉద్యోగి. ఇద్దరు పిల్లల చదువు కోసం రూ.3 లక్షలు అవసరం కాగా, పలువురి వద్ద రుణం కోసం ప్రయత్నించినా... ఫలితం లేకపోయింది. మరోమార్గం లేక తన భార్య నగలను తాకట్టు పెట్టి బ్యాంకులో రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా జీతం వచ్చినప్పుడు వాయిదాలు చెలిస్తున్నాడు. అవసరానికి బంగారం లేక పోతే పిల్లలను చదివించడం కష్టమయ్యేదంటున్నాడు.⇒ ధర్మవరానికి చెందిన బాలాజీకి అత్యవసరంగా డబ్బు అవసరమైంది. ఎవరినైనా అడగాలంటే మొహమాటం.. అడిగినా ఇస్తారో లేదోనన్న అనుమానం. దీంతో భార్యతో చర్చించి చివరకు బంగారు నగలతో బ్యాంకుకు వెళ్లి ‘గోల్డ్ రుణం’ తీసుకున్నాడు.⇒ పుట్టపర్తికి చెందిన శిరీష్ కు ఇటీవలే వివాహమైంది. అత్తింటివారు తనకూ భార్యకు బంగారు నగలు చేయించారు. వాటిని ఇంట్లో పెట్టుకునేందుకు ధైర్యం చాలడం లేదు. బ్యాంకుకు వెళ్లి లాకర్ అడగ్గా...అందుబాటులో లేదన్నారు. పైగా ఏడాదికి అద్దె భారీగా చెల్లించాలని చెప్పారు. దీంతో శిరీష్ నగలను బ్యాంకులో పెట్టి రుణం తీసుకున్నాడు. నెలలో 90 శాతం మొత్తం రుణం చెల్లించాడు. మిగతా 10 శాతానికి వడ్డీ లాకర్ అద్దె కంటే తక్కువే అయ్యింది.⇒ ఇలా అవసరానికి ఒకరు..భద్రపరిచేందుకు మరికొందరు బ్యాంకుల ద్వారా ‘గోల్డ్ లోన్’ తీసుకుంటున్నారు. ఎవరి వద్దా చేయిచాపాల్సిన అవసరం లేకుండా ఏ ఆర్థిక అవసరం వచ్చినా ‘గోల్డ్’వైపు చూస్తున్నారు. -
ఎమ్మెల్సీ కల్పలతారెడ్డికి వైఎస్ జగన్ పరామర్శ
శ్రీ సత్యసాయి జిల్లా: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో కల్పలతారెడ్డి మేనకోడలు భూమిక దుర్మరణం చెందారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ సానుభూతి తెలిపారు. -
స్వచ్ఛమైన తేనెకు చిరునామా చిల్లకొండయ్యపల్లి
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇది కూడా అలాంటి ఊరే. ఈ ఊరు పేరు చెబితే చాలు నోరూరుతుంది. తియ్యని పిలుపు రారమ్మంటుంది. అదే తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి (Chillakondaiahpalli). వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంతో నష్టపోయిన రైతులు (Farmers) ఉపాధి కోసం అడవి బాట పట్టారు. కొండ, గుట్టలెక్కుతూ తేనె (Honey) సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు.ఉదయమే సద్దిమూట కట్టుకుని అందరూ పొలం బాట పడితే సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం (Tadimarri Mandal) చిల్లకొండయ్యపల్లి యువకులు మాత్రం అడవిబాట పడతారు. కొండ, గుట్ట, చెట్టు, చేమ చుట్టేస్తూ సేకరించిన స్వచ్ఛమైన తేనెను విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. గ్రామంలోని 25 కుటుంబాలు తేనె సేకరణను ఉపాధిగా మలచుకున్నాయి. 15 ఏళ్లుగా... తేనె సేకరణే వృత్తిగాదాదాపు 15 సంవత్సరాలుగా తేనె సేకరణనే వృత్తిగా పెట్టుకుని చిల్లకొండయ్యపల్లి యువత జీవనం సాగిస్తోంది. అప్పట్లో వ్యవసాయ పనులు లేక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు కాటమయ్య అనే వ్యక్తి తొలిసారిగా తేనె సేకరణను ఉపాధిగా మార్చుకున్నాడు. అనంతరం అదే బాటలో కొందరు యువకులు పయనించారు. అయితే వీరు సేకరించిన తేనెకు సరైన మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతుండడంతో అప్పట్లో మహాత్మాగాంధీ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న రామలింగప్ప స్పందించి, గిట్టుబాటు ధరతో తేనె కొనుగోలు చేసేలా చెన్నకొత్తపల్లిలోని ధరణి స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదిర్చాడు. ప్రస్తుతం సంస్థ కిలో తేనెను రూ.400 చొప్పున కొనుగోలు చేస్తుండగా... స్థానికంగానే ఇతరులకు రూ.500తో విక్రయిస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కు తున్నారు. ఉమ్మడి జిల్లాలో చిల్లకొండయ్యపల్లి తేనెకు మంచి గిరాకీ ఉంది.అన్నం పెడుతున్న అడవి.. మండలంలోని దాడితోట బీట్ పరిధిలో కునుకుంట్ల, చిల్లవారిపల్లి, దాడితోట గ్రామాలతో పాటు పుట్లూరు మండలం ఎల్లుట్ల పరిధిలో సుమారు 3,534 హెక్టార్లలో రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. రిజర్వు ఫారెస్టులో అటవీ అధికారులు నారేపి, ఎర్రచందనం, తవసీ తదితర మొక్కలు భారీగా నాటారు. ఇప్పుడా మొక్కలు పెద్ద వృక్షాలై తేనెపట్టులకు ఆవాసాలుగా మారాయి. ఫలితంగా రిజర్వు ఫారెస్టు ఎందరికో ఉపాధి వనరుగా మారి అన్నం పెడుతోంది. ముంగార్ల కాలం అనువైనది.. తేనె సేకరణకు ముంగార్ల కాలం అనువైనది. జూన్ ప్రారంభంతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో అడవులు, తోటలు పచ్చదనం సంతరించుని పుష్పాలు వికసిస్తాయి. ఆ పుష్పాల్లోని మకరందం కోసం వచ్చే తేనెటీగలు సమీపంలోనే తేనెపట్టులను ఏర్పాటు చేసుకుంటాయి. ఏడాదిలో 9 నెలల పాటు తేనె సేకరణలో ఇక్కడి యువకులు నిమగ్నమవుతారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.చదవండి: పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలుతేనె సేకరణలో కష్టాలు ఎన్నో.. తేనె ఎంత రుచిగా ఉంటుందో దానిని సేకరించడమంటే అంతకు రెట్టింపు కష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయినా చిల్లకొండయ్యపల్లి యువకులు కష్టాలను లెక్కచేయడం లేదు. కళ్లముందు తేనె పట్టు కనిపిస్తే చాలు వెంటనే సేకరణలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో ముళ్లకంపలు గుచ్చుకున్నా, తేనెటీగలు కుట్టినా తమ పట్టు మాత్రం వదలరు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా... తేనెటీగలు కుట్టి తీవ్ర అస్వస్థతకు లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని యువత తెలుపుతోంది. -
ధర్మవరంలో ఉద్రిక్తత.. టీడీపీ-బీజేపీ నేతల మధ్య ఘర్షణ
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు మైనార్టీ నేత జమీన్ సిద్ధమవ్వగా, జమీన్ చేరికను టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మైనార్టీ నేత జమీన్ ఫ్లెక్సీలను పరిటాల శ్రీరామ్ వర్గీయులు చించివేశారు. ఈ క్రమంలో టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో రెండు స్కార్పియో వాహనాలు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.మరో వైపు, సామాన్యులపై కూడా టీడీపీ నేతల అనుచరులు రెచ్చిపోతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రధాన అనుచరుడు దాదు.. శివమాలధారణలో ఉన్న బలిజ శ్రీనివాసులు అనే ఆటోడ్రైవర్‌పై అకారణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాళ్లతో తన్నుతూ అవమానించాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం చోటు చేసుకుంది.బాధితుడి కథనం మేరకు.. పెనుకొండ దర్గాపేటకు చెందిన దాదు కారులో వస్తూ స్థానిక దర్గా సర్కిల్లో అతని ఫ్లెక్సీకి ఎదురుగా శ్రీనివాసులు ఆటో నిలిపి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆటో పక్కన పెట్టాలని హూంకరించాడు. ఆటో పక్కన పెడతానని అతను చెబుతుండగానే.. దాదు ఆగ్రహంతో ఊగిపోతూ ‘లం.. కొడకా’ అని దూషిస్తూ చెప్పుల కాలితో తన్నుతూ దాడి చేశాడు. అక్కడున్న వారు సముదాయించినా అతను వినకుండా విచక్షణారహితంగా కొట్టాడు.సమాచారం అందుకున్న బలిజ సంఘం, వీహెచ్‌పీ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వివాదం ముదరడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవన్.. వివిధ మండలాల ఎస్ఐలను రప్పించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, ఏఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో ఆనంద్‌కుమార్ పెనుకొండ చేరుకున్నారు. వివాదాన్ని సద్దుమణచడానికి ప్రయత్నించినా ఆందోళనకారులు శాంతించలేదు. ఇదీ చదవండి: బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు -
నిర్లక్ష్యం ఊడలు.. మర్రికి చెదలు!
తిమ్మమ్మమర్రిమాను... 669 సంవత్సరాల చరిత్ర. 8.15 ఎకరాల్లో విస్తరించి... 1350కిపైగా ఊడలతో వ్యాపించింది. ప్రపంచంలోనే అతిపెద్ద మర్రిమానుగా ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. కానీ అభివృద్ధికి మాత్రం ఆమడదూరంలో నిలిచింది. దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తున్నా.. కనీస సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం కావడంతో తిమ్మమ్మ మర్రిమాను ఖ్యాతికి చెదలు పడుతోంది ఎన్పీకుంట: సత్యసాయి జిల్లాలోని నంబులపూలకుంట (ఎన్పీకుంట) మండలం గూటిబైలు గ్రామంలోని తిమ్మమ్మమర్రిమాను చరిత్ర అమోఘం. అభివృద్ధి మాత్రం దారుణం. అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన ఈ అతిపెద్ద మర్రిమాను గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా సౌకర్యాలు కరువయ్యాయి. మర్రిమాను చరిత్ర.. దిగువగూటిబైలు గ్రామానికి చెందిన తిమ్మమాంబ భర్త బాలవీరయ్యతో కలిసి 1355లో సతీసహగమనం చేసినట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. ఆ సమయంలో చితికి నాలుగు వైపులా నాటిన ఎండు మర్రిగుంజల్లో ఈశాన్యం వైపు నాటిన గుంజ చిగురించి, నేడు మహావృక్షంగా మారి చరిత్ర పుటల్లోకి ఎక్కింది. 8.15 ఎకరాల్లో విస్తరించి ఉన్న తిమ్మమ్మమర్రిమాను కర్ణాటక రాష్ట్రానికి చెందిన జర్నలిస్ట్ సత్యనారాయణ అయ్యర్ కృషి ఫలితంగా 1989లో గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కించుకుంది. సౌకర్యాలు కరువు.. తిమ్మమ్మమర్రిమాను గురించి తెలుసుకుని పొరుగు రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతో ఆసక్తితో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడిదాకా వచ్చిన వారికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకుని తిరుగుముఖం పడుతున్నారు. కనీసం తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేకపోవడంతో వెంటనే వెళ్లిపోతున్నారు. మరోవైపు పర్యవేక్షణ కరువై ఊడలు కూడా చెదలు పడుతున్నాయి. అటవీశాఖ ఆదీనంలోకి తీసుకున్నా.. 1990వ సంవత్సరంలో తిమ్మమ్మమర్రిమాను అటవీ అభివృద్ధి శాఖ ఆ«దీనంలోకి తీసుకుంది. పార్కు, షెడ్డు ఏర్పాటు చేసి కొన్ని వన్యప్రాణులను తీసుకువచ్చి అందులో ఉంచింది. సమీపంలోని 27 ఎకరాలు కూడా సేకరించింది. కానీ ఆ తర్వాత నిర్వహణ గురించి పట్టించుకోలేదు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. పార్కులో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగాయి. వన్యప్రాణుల షెడ్డులో జింకలు, కుందేళ్లు, నెమళ్లు మాత్రమే ఉన్నాయి. భూమి కోత.. ఊడలకు చెదలు.. గతంలో దట్టమైన ఆకులతో మర్రిమాను కళకళలాడుతూ ఉండేది. పర్యాటకులు కూడా మర్రిమాను కింద సేదతీరేవారు. అటవీశాఖ ఆ«దీనంలోకి తీసుకున్నాక చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎప్పుడో ఉన్నతాధికారులు వచ్చినప్పుడు మాత్రం శుభ్రత చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం మర్రిమాను లోపలిభాగంలో కొన్ని చోట్ల భూమి కోతకు గురైంది. భూసారం తగ్గి ఆకులు రాలిపోవడంతో పాటు, చెట్టు సైతం నేల వాలింది. మరికొన్ని చోట్ల ఊడలకు చెదలు పట్టింది. వెంటనే ప్రభుత్వాలు తిమ్మమ్మమర్రిమాను సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పర్యాటకులు కోరుతున్నారు.అభివృద్ధి పనులు డిమాండ్ ఇలా.. » తిమ్మమాంబ అమ్మవారి దర్శనం అనంతరం పర్యాటకులు మర్రిమాను పరిసర ప్రాంతంలో సేద తీరడం కోసం పార్కు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. » పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని వణ్యప్రాణులను తీసుకురావడం, ఆటస్థలాన్ని అభివృద్ధి చేయాలి. » పర్యాటకుల కోసం విశ్రాంతి భవనం, నీటి, మరుగుదొడ్ల వసతి కల్పించాలి. రోజూ అన్నదాన కార్యక్రమం నిర్వహించాలి. మర్రిమాను పరిసర ప్రాంతాల్లో వివిధ రకాల పూలమొక్కలు పెంచి అందంగా తీర్చిదిద్దాలి. » మర్రిచెట్టు ఉన్న విస్తీర్ణంలో మీటరు ఎత్తున కొత్త మట్టిని తోలించి, వాలిన ఊడలను సంరక్షించాలి. » తిమ్మమ్మమర్రిమానుకు పడమర వైపున ఓబుళదేవరగుట్టపై 10 ఏళ్ల క్రితం టీటీడీ వారు వెంకటేశ్వస్వామి ఆలయం నిర్మించారు. కానీ ఇంత వరకు విగ్రహప్రతిష్ట చేయలేదు. దీంతో ఆ ఆలయ ప్రదేశం అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారింది. వెంటనే విగ్రహ ప్రతిష్ట చేసి ఆలయంలో పూజలు ప్రారంభిస్తే ఈప్రాంతానికి భక్తుల రాక పెరుగుతుంది. వసతులు కల్పించాలి మేము ఏటా మర్రిమానును సందర్శిస్తాము. గతంలో బాగుండేది. ప్రస్తుతం సౌకర్యాలు లేవు. అమ్మవారిని దర్శించి వెళ్లాల్సి వస్తోంది. మధ్యాహ్న సమయంలో భోజన వసతి కూడా ఉండదు. పిల్లలు ఆడుకోవడానికి పార్కు, ఆటస్థలం అభివృద్ధి చేయాలి. నీటి, భోజన వసతి కల్పిస్తే బాగుంటుంది. అలాగే మర్రి ఊడలు చెదలు పట్టకుండా కాపాడాలి. – సి.నాగార్జునరెడ్డి, యాత్రికుడు, అనంతపురంసౌకర్యాలు కరువు తిమ్మమ్మమర్రిమాను దర్శనానికి వస్తే ఇక్కడ కనీస సౌకర్యాలు లేవు. అమ్మవారి దర్శనం తరువాత సేద తీరడానికి అవకాశమే లేదు. మరుగు దొడ్లు, విశ్రాంతి భవనాలు లేవు. ఆటస్థలంలో క్రీడాపరికరాలు ఏవీ లేవు. అలాగే మర్రిమాను కింద సేదదీరే ఏర్పాట్లు లేకపోవడంతో దూరం నుంచే చూసి వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. – రవికుమార్, యాత్రికుడు, అనంతపురం -
ఉప్పెనలా ఊబకాయం
సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన 3వ తరగతి విద్యార్థి 46 కిలోల బరువు ఉన్నాడు. జంక్‌ఫుడ్ అతిగా తినడంతోనే బరువెక్కినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మిగతా విద్యార్థులతో సమానంగా క్రీడల్లో పాల్గొనలేకపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఊబకాయం కారణంగా చలాకీతనం కోల్పోయాడని అంటున్నారు.రెండు వారాల క్రితం తొమ్మిదో తరగతి చదివే ఓ విద్యార్థి బస్సులో ప్రయాణిస్తూ.. పుట్టపర్తి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యాడు. తోటి ప్రయాణికులు సాయం చేసి.. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. షుగర్ లెవెల్స్ పడిపోయినట్లు నిర్ధారించారు. ఊబకాయమే సమస్యకు కారణమని వైద్యులు తేల్చారు. బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నారంటారు. కానీ అధిక భారం అలాగే కొనసాగితే వారికి వారే భారం కావడం ఖాయం. అంతేకాదు పలు అనారోగ్య సమస్యల బారిన పడే ప్రమాదమూ ఉంది. జీవనశైలిలో మార్పుల కారణంగా భవిష్యత్తులో ఊబకాయుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.సాక్షి, పుట్టపర్తి: ఊబకాయం.. ప్రతి వందలో 20 మందిని తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సమస్య. శారీరక వ్యాయామం తగ్గటం, ఆహార నియమాలు పాటించకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి విధానంతో ఇప్పుడు చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఊబకాయులుగా మారుస్తోంది. బాల్యంలోనే ఊబకాయం వస్తే చలాకీతనం కోల్పోతారు. చిన్న వయసులోనే అనేక మానసిక సమస్యలు ఎదుర్కొంటారు. శారీరకంగా అనేక ఇబ్బందులు పడుతారు. వయసుకు తగిన బరువు ఉంటే చాలని.. అధిక బరువు అనర్థాలకు దారి తీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఊబకాయల్లో సమస్యలు ఇవే.. ⇒ఊబకాయం ఉన్న పిల్లలు సహచరుల నుంచి తరచూ అవహేళనకు గురవుతారు. ఫలితంగా మానసికంగా డిప్రెషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉంది. ⇒ఊబకాయం ఉన్న పిల్లలు చలాకీతనం కోల్పోవడం కారణంగా క్రీడల్లో రాణించలేరు. కనీసం అవకాశాలు రావడం కూడా కష్టమే. ⇒అందరితో పాటు వ్యాయామం చేయాలనుకున్నప్పటికీ.. కాసేపటికే అలసిపోతారు. శ్వాస తీసుకోలేక ఇబ్బంది పడుతారు. ⇒మానసిక ఒత్తిడి కారణంగా చదువులో వెనుకబడే అవకాశం ఉంది. విద్యలో ఉన్నత స్థానాలకు వెళ్లడం కష్టమే. ⇒టీనేజీలోకి వచ్చేసరికి మరింత డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఫలితంగా అందరిలో కలవకుండా ఒక్కరే ఉండేందుకు ఇష్టపడతారు. ⇒ప్రీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్ చిన్న వయసులోనే దరి చేరుతాయి. ఫలితంగా జీవితాంతం వైద్యుల పర్యవేక్షణలో ఉండాల్సిన పరిస్థితి. ⇒ఊబకాయం కారణంగా స్కిన్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా సోకే ప్రమాదం ఉంది.ఊబకాయం ఇలా..⇒ జంక్‌ఫుడ్, బయట ఆహారం ఎక్కువగా తీసుకోవడం, పిజ్జా, బర్గర్, నూడిల్స్ తినడం కారణంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ⇒జంక్‌ఫుడ్ టేస్ట్ డిఫరెంట్‌గా ఉండటంతో ఎక్కువ మోతాదులో తీసుకుని బరువు పెరుగుతారని వైద్యులు చెబుతున్నారు. ⇒ కదలిక లేని జీవన విధానంతో బరువు పెరుగుతున్నట్లు స్పష్టం అవుతోంది. బిజీ షెడ్యూల్లో చాలామంది నడవడం తగ్గించి వాహనాలను వినియోగిస్తున్నారు. ⇒ టీవీ, సెల్‌ఫోన్ చూస్తూ.. మోతాదుకు మించి భోజనం తినేస్తున్నారు. ఫలితంగా మనిషి సాధారణం కంటే బరువు పెరిగే అవకాశం ఉంది. ⇒ తల్లిదండ్రులు ఊబకాయులైనా పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందని పలు అధ్యయనాలు తేల్చాయి. జన్యుపరమైన కారణాల రీత్యా కూడా ఊబకాయం రావచ్చని అంటున్నారు.వ్యాయామం తప్పనిసరిఊబకాయం ఉన్న వారిలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారంలో రెండు , మూడుసార్లు జంక్‌ఫుడ్ తింటే ఊబకాయం వచ్చే అవకాశం ఉంది. బయటి ఆహారం తినడమూ కారణంగా చెప్పవచ్చు. పిల్లల బరువు పెరుగుతున్నట్లు గుర్తిస్తే తల్లిదండ్రులు వారిని క్రమం తప్పకుండా వాకింగ్‌కు తీసుకెళ్లాలి. జంక్ ఫుడ్ బదులు ఆరోగ్యకర ఆహారం తీసుకునేలా చేయాలి. – డాక్టర్ ప్రతాప్, హిందూపురంజీవనశైలి మార్పులతో.. జంక్ ఫుడ్ బదులు ప్రత్యామ్నాయం ఆలోచించాలి. నిత్యం వ్యాయామం చేయలేని వారు ఇతర మార్గాల్లో శారీరక బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అవతలి వ్యక్తి అవహేళన చేసినప్పుడు డిప్రెషన్‌కు లోను కాకూడదు. పిల్లల బరువు తగ్గే విషయంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కీలకం. జీవన శైలిలో మార్పులతో ఊబకాయం నుంచి బయట పడవచ్చు. – డాక్టర్ రాజశేఖర్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ఇలా చేస్తే మేలు.... జంక్‌ఫుడ్‌ను వీలైనంత వరకు తగ్గించాలి టీవీ, సెల్‌ఫోన్ చూసే సమయం తగ్గించాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి తల్లిదండ్రులు శ్రద్ధతో పిల్లలతో వాయింగ్ చేయించాలి ఊబకాయం ఉన్న పిల్లలను రెగ్యులర్‌గా హెల్త్ చెకప్ చేయించాలి -
ఇవాళ సత్యసాయి జిల్లాలో గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన
-
శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీలో వర్గపోరు
-
కూటమి నేతల మధ్య ‘మట్టి’ రగడ
«సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ‘మట్టి వార్’ తారాస్థాయికి చేరింది. ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఆదివారం మట్టిని అక్రమంగా తవ్వుతున్న టీడీపీ నాయకులకు చెందిన జేసీబీని జనసేన నాయకులు ధ్వంసం చేశారు. ఇక్కడ మట్టిని తాము తప్ప మరెవ్వరూ తవ్వకూడదని జనసేన నాయకులు హెచ్చరించినట్లు తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ధర్మవరం మండలం రేగాటిపల్లిలో జనసేనకు చెందిన ముఖ్య నేత ఆ«ధ్వర్యంలో జేసీబీ, హిటాచీ వాహనాలతో పెద్ద ఎత్తున అక్రమంగా మట్టి తవ్వి ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోజూ రూ.లక్షల్లో ఆదాయం గడిస్తున్నారు. మట్టి కోసం ఈ పంచాయతీ దరిదాపుల్లోకి ఇతరులెవరినీ రానీయకుండా సదరు జనసేన నేత హుకుం జారీ చేస్తున్నారు. ఇదే పంచాయతీకి చెందిన పలువురు టీడీపీ నాయకులు తాము కూడా ఎన్నికల్లో కూటమి గెలిచేందుకు కృషి చేశామని, తామూ మట్టి తవ్వుకుంటామని పలుమార్లు జనసేన కీలక నేతకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. అయితే టీడీపీ నాయకులు ఆదివారం సొంతంగా జేసీబీతో రేగాటిపల్లి కొండ సమీపంలో మట్టి అక్రమ తవ్వకాలకు పూనుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన తమ పార్టీకి చెందిన పదిమందిని పంపి దౌర్జన్యం చేయించారు. మట్టి తవ్వుతున్న జేసీబీపై రాళ్ల వర్షం కురిపించి ధ్వంసం చేయించారు. ఇంత గొడవ జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించినట్లు సమాచారం. ఆ తర్వాత తీరిగ్గా రెండు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీన్ని తీవ్ర అవమానంగా భావించిన టీడీపీ నాయకులు తమ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి అక్కడే ఈ మట్టి గొడవ తేల్చుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. కాగా, మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి, ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా, ఈ విషయంలో కూటమి నాయకులు గొడవపడుతున్నా పోలీస్, మైనింగ్ అధికారులు కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
రాష్ట్రంలో అరాచక పాలన
సాక్షి, పుట్టపర్తి: ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కరువైంది. బాలికలు బతకాలంటేనే భయం భయంగా గడపాల్సి వస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి సమీపంలోని పేపరు మిల్లు వద్ద ఓ కుటుంబంలోని ఇద్దరు మహిళలపై శనివారం తెల్లవారుజామున కొందరు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పండుగ రోజున ఓ కుటుంబం అన్యాయానికి గురైతే ప్రభుత్వానికి పట్టదా? బాధితులను పరామర్శిద్దామని సాటి మహిళలుగా నేను (ఉషశ్రీచరణ్), దీపిక హిందూపురం ఆస్పత్రి వద్దకు వెళ్తే.. పోలీసులు లోపలికి అనుమతించలేదు.బాధితులను పరామర్శించాలంటే అధికారంలోనే ఉండాలా? చట్టం మీ చుట్టమా? చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాలేజీ బాత్ రూముల్లో వీడియోలు తీసి బయటకు వదిలేస్తున్నారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పొట్ట కూటి కోసం వచ్చే కుటుంబాలపై గ్యాంగ్ రేప్ చేస్తున్నారు..’ అంటూ వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు.సోమవారం సాయంత్రం ఆమె పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, హిందూపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త టీఎన్ దీపిక తదితరులతో కలిసి పుట్టపర్తిలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులును కలిసి గ్యాంగ్ రేప్ విషయమై మాట్లాడారు. నిందితులను త్వరగా పట్టుకుని.. కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఎందుకు సరైన రీతిలో స్పందించలేదని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణగా దిశ చట్టం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. మహిళలకు అన్యాయం జరగకుండా ఎస్ఓఎస్ ద్వారా రక్షణ కోరే అవకాశం ఉండేదని చెప్పారు. ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. మొన్న ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లిని కిడ్నాప్ చేసి హత్య చేశారు, అంతకుముందు పుంగనూరు, నంద్యాలలోనూ మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూశాయి, ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గంలో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. -
ఏపీలో దారుణం .. అర్ధరాత్రి అత్తా కోడలిపై లైంగిక దాడి
-
సత్యసాయి జిల్లాలో వాటర్ వర్కర్స్ నిరసన
-
దివ్యాంగ బాలికపై లైంగిక దాడి.. ఆపై ఆత్మహత్య
ఎన్పీకుంట: దివ్యాంగ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి.. ఆపై తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన శ్రీసత్యసాయి జిల్లా ఎన్పీకుంట మండలం సారగుండ్లపల్లిలో జరిగింది. కదిరి డీఎస్పీ శ్రీలత, రూరల్ సీఐ నాగేంద్ర కథనం ప్రకారం... సారగుండ్లపల్లికి చెందిన పి.జనార్దన (36) తన భార్యను పుట్టినిల్లు అయిన తనకల్లు మండలం కొక్కంటిక్రాస్లో వదిలి ఆదివారం రాత్రి స్వగ్రామానికి బైక్‌పై తిరుగు పయనమయ్యాడు. మార్గమధ్యంలోని కొత్తమిద్ది గ్రామంలో వినాయక మండపం వద్ద రాత్రి 8 గంటల సమయంలో ఆడుకుంటున్న దివ్యాంగురాలైన 17 ఏళ్ల బాలికను కంపచెట్లలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న చిన్న పిల్లలు కేకలు వేయడంతో పారిపోయాడు. బాధితురాలి తండ్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో జనార్దనపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అతని ఆచూకీ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే..జనార్దన తన స్వగ్రామంలో నిర్మాణంలో ఉన్న తన ఇంట్లోని వంట గదిలో ఉరి వేసుకుని మృతి చెంది ఉండటాన్ని సోమవారం ఉదయం తల్లి గమనించింది. కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఎన్పీకుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా పోలీసులు మృతుడిని పరిశీలించగా చేతికి, వేలుకు ఇంకు అంటి ఉండటాన్ని గమనించి ఘటన స్థలంలో వెతకగా సూసైడ్‌నోట్ లభించింది. తన మృతికి ఎవరూ కారణం కాదని అందులో రాసి ఉన్నట్లు ధ్రువీకరించారు. ఇరువురి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
కానిస్టేబుల్ నిర్వాకం అడ్డంగా దొరికిపోయాడు
-
ప్రేమ పేరుతో వంచన
హిందూపురం అర్బన్: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు ఓ బాలిక (16)ను ప్రేమ పేరుతో లొంగదీసుకుని గర్భవతిని చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గోళ్లాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు రాజేష్ ఇటీవల జరిగిన అదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త సతీష్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. అతను ఈ కేసులో ప్రస్తుతం జైల్లో రిమాండ్‌లో ఉన్నాడు. రాజేష్ రిమాండ్‌కు వెళ్లకముందు గ్రామానికి చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో నమ్మించాడు. శారీరకంగా లొంగదీసుకొని గర్భవతిని చేశాడు.రెండు రోజుల క్రితం బాలిక కడుపునొప్పిగా ఉందని తల్లిదండ్రులకు చెప్పడంతో కర్ణాటక రాష్ట్రం గౌరీబిదనూరు ఆస్పత్రికి తీసుకెళ్లి చూపించారు. వైద్యులు పరీక్షించి ఆమె గర్భవతి అని తేలి్చ.. అక్కడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బాలికను అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు. చిక్‌బళ్లాపుర ఎస్పీ కార్యాలయం నుంచి కేసును సోమవారం హిందూపురం అప్‌గ్రేడ్ పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. దీంతో అప్‌గ్రేడ్ సీఐ ఆంజనేయులు బాధిత బాలికను గౌరీబిదనూరు నుంచి హిందూపురం తీసుకువచ్చి స్థానిక ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. ఆమె గర్భిణి అని నిర్ధారణ కావడంతో రాజే‹Ùపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో టీడీపీ నేతల దాష్టీకం
-
స్కూల్ హెడ్ మాస్టర్ కు టీడీపీ నేతల బెదిరింపులు
-
శభాష్.. సోహన్వికా
సాక్షి, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన బాలిక సోహన్వికారెడ్డి తైక్వాండో పోటీల్లో అదరగొట్టింది. ఆదివారం బెంగళూరులో నిర్వహించిన సౌత్ జోన్ సబ్ జూనియర్స్ తైక్వాండో విభాగంలో బంగారు పతకాన్ని సాధించింది. తలుపుల మండలం గంజివారిపల్లెకు చెందిన గుణరంజన్రెడ్డి కుమార్తె సోహని్వకా రెడ్డి చిన్నప్పటి నుంచి క్రీడలపై ఆసక్తిని కనబరుస్తోంది. -
పుట్టపర్తిలో సత్యసాయి జాతీయ క్రికెట్ లీగ్
ప్రశాంతి నిలయం: సత్యసాయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత మానవతా విలువలను,సేవా స్ఫూర్తిని చాటుతూ ఆదర్శవంతమైన జీవితం సాగించాలని భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ పిలుపునిచ్చారు. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి మహాసమాధి చెంత ‘సత్యసాయి జాతీయ క్రికెట్ లీగ్’ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. మురళీ కార్తీక్‌తోపాటు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ రాజు తదితరులు ట్రోఫీని, క్రికెట్ లీగ్ పోటీల బుక్‌లెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
నల్లచెరువు: శ్రీసత్యసాయి జిల్లా, నల్లచెరువు మండలం, పెద్దయల్లంపల్లి వద్ద శనివారం రాత్రి 13 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా అటవీ శాఖ అధికారి రవీంద్రరెడ్డి ఆదేశాల మేరకు పెద్దయల్లంపల్లి జాతీయరహదారిపై అటవీశాఖ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో మదనపల్లి నుంచి కదిరి వెళ్తున్న కారును గుర్తించారు.అధికారులు వాహనాలను తనిఖీ చేస్తున్నారని గమనించిన ఇద్దరు దుండగులు కొద్దిదూరంలో కారు ఆపి పరారయ్యారు. అధికారులు కారును తనిఖీ చేయగా.. 13 ఎర్రచందనం దుంగలు లభించాయి. వీటి విలువ రూ.2 లక్షలకు పైగానే ఉంటుందని తెలిపారు. వాహనం నంబర్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తనిఖీల్లో డిప్యూటీ రేంజ్ అధికారి రామచంద్ర నాయక్, సెక్షన్ అధికారి రామచంద్రారెడ్డి, ఎఫ్‌బీఓలు నాగరాజు, హరిప్రసాద్, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
శ్రీసత్యసాయి జిల్లాలో టీడీపీ నేతల కబ్జా పర్వం
-
టీడీపీకి ఓటు వేయని వారికి పెన్షన్ కట్..