సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: ధర్మవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణ జరిగింది. మంత్రి సత్యకుమార్ సమక్షంలో బీజేపీలో చేరేందుకు మైనార్టీ నేత జమీన్ సిద్ధమవ్వగా, జమీన్ చేరికను టీడీపీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ వ్యతిరేకిస్తున్నారు. దీంతో మైనార్టీ నేత జమీన్ ఫ్లెక్సీలను పరిటాల శ్రీరామ్ వర్గీయులు చించివేశారు. ఈ క్రమంలో టీడీపీ- బీజేపీ నేతల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ ఘటనలో రెండు స్కార్పియో వాహనాలు, మూడు బైకులు ధ్వంసమయ్యాయి. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.
మరో వైపు, సామాన్యులపై కూడా టీడీపీ నేతల అనుచరులు రెచ్చిపోతున్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ప్రధాన అనుచరుడు దాదు.. శివమాలధారణలో ఉన్న బలిజ శ్రీనివాసులు అనే ఆటోడ్రైవర్‌పై అకారణంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. కాళ్లతో తన్నుతూ అవమానించాడు. ఈ ఘటన శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో శనివారం చోటు చేసుకుంది.
బాధితుడి కథనం మేరకు.. పెనుకొండ దర్గాపేటకు చెందిన దాదు కారులో వస్తూ స్థానిక దర్గా సర్కిల్‌లో అతని ఫ్లెక్సీకి ఎదురుగా శ్రీనివాసులు ఆటో నిలిపి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆటో పక్కన పెట్టాలని హూంకరించాడు. ఆటో పక్కన పెడతానని అతను చెబుతుండగానే.. దాదు ఆగ్రహంతో ఊగిపోతూ ‘లం.. కొడకా’ అని దూషిస్తూ చెప్పుల కాలితో తన్నుతూ దాడి చేశాడు. అక్కడున్న వారు సముదాయించినా అతను వినకుండా విచక్షణారహితంగా కొట్టాడు.
సమాచారం అందుకున్న బలిజ సంఘం, వీహెచ్‌పీ నాయకులు అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వివాదం ముదరడంతో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ రాఘవన్.. వివిధ మండలాల ఎస్‌ఐలను రప్పించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ రత్న, ఏఎస్పీ శ్రీనివాసులు, ఆర్డీవో ఆనంద్‌కుమార్ పెనుకొండ చేరుకున్నారు. వివాదాన్ని సద్దుమణచడానికి ప్రయత్నించినా ఆందోళనకారులు శాంతించలేదు.
ఇదీ చదవండి: బరితెగించిన టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు
Comments
Please login to add a commentAdd a comment