
ఎన్టీఆర్, సాక్షి: సవాళ్లు , ప్రతిసవాళ్లతో వేడెక్కిన తిరువూరు టీడీపీ రాజకీయం.. ఇప్పుడు ఉత్కంఠ రేకెత్తిస్తోంది. టీడీపీ అధిష్టానానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఇచ్చిన డెడ్‌లైన్ శనివారం ముగిసిపోయింది. దీంతో తర్వాత ఏం జరగనుందా? అనే చర్చ నడుస్తోంది.
టీడీపీ నేత, మాజీ ఏఎంసీ ఛైర్మన్ ఆలవాల రమేష్ రెడ్డిపై లైంగిక ఆరోపణలు రావడంతో.. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ కొలికపూడి డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకుగానూ అధిష్టానానికి 48 గంటల డెడ్‌లైన్ విధించారాయన. శనివారం ఆ గడువు కాస్త ముగిసిపోయింది. దీంతో రాజీనామా చేస్తారా? అనేది చూడాలి.
మరోవైపు.. రెండు కోట్లు ఇవ్వనందుకే ఎమ్మెల్యే కొలికపూడి తనను టార్గెట్ చేశాడని రమేష్ రెడ్డి ఆరోపించడం పార్టీ కేంద్ర కార్యాలయంలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే మొదటి నుంచే కొలికపూడి తీరుపై అసంతృప్తిగా ఉన్న అధిష్టానం.. ప్రత్యేకంగా పార్టీ కేడర్ ద్వారా తిరువూరు నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయనపై వేటు పడవచ్చనే చర్చా నడుస్తోంది.
దీంతో తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బహిరంగ చర్చకు రావాలంటూ ప్రత్యర్థులకు కొలికపూడి సవాల్ విసరగా.. పార్టీ కేడర్ అందుకు ధీటుగా స్పందించింది. తాడే పేడో తేల్చుకుందాం రమ్మంటూ.. బోసుబొమ్మ సెంటర్లో చర్చకు కొలికపూడిని ఆహ్వానించింది. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే వర్సెస్ కేడర్ సవాళ్ల నేపథ్యంలో.. బోసుబొమ్మ సెంటర్లో పోలీసులు భారీగా మోహరించారు. అలాగే.. సవాల్ విసిరిన కంచెపోగు ప్రసాద్ , డేవిడ్ లను హౌస్ అరెస్ట్ చేశారు.
