
అప్పటిదాక భారత్ పాక్‌ల మధ్య చక్కటి సానుకూల వాతావరణంతో ఆహ్లాదంగా ఉన్నాయి. ఇరుదేశాల మధ్య ఏవో కొద్దిపాటి ఘర్షణలు ఉన్నా..శాంతియుత జీవన విధానానికే పెద్దపీట వేస్తూ..ఇన్నాళ్లు భారత్ సంయమనం పాటిస్తూ వచ్చింది. ఆ ఒక్క ఘటన.. భారత్ ఆగ్రహం కట్టలు తెంచుకునేందుకు కారణమైంది. ఆ దెబ్బతో సరిహద్దులు, ఒప్పందాలు..అన్ని క్యాన్సిల్ అయ్యాయి. ఆ అమానుష ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేయడమే గాక పాక్‌ని కళ్లర్రజేసే పరిస్థితికి తీసుకొచ్చింది. ఆ దేశం పెంచి పోషించిన ఉగ్రవాదమే కష్టాలు తెచ్చిపెట్టింది. పైగా ప్రపంచం ముందు దోషిలా నిలబెట్టింది. కానీ ఈ చర్యలతో అల్లాడుతున్న అమాయక జనం వెతలు చూస్తే..కడుపుతరుక్కుపోతోంది. అందుకే పెద్దలు అంటుంటారు..ఏ పనిచేసినా.. ముందు ఒక్క క్షణం ఆలోచించు..లేదంటే దాని పర్యవసానం ఏ పరిస్థితికి తీసుకొస్తుందో ఊహకందదని." ఇప్పుడు ఆ స్థితినే పాక్ ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు.
ఏ రెండు దేశాల మధ్య ఘర్షణ వచ్చినా..ఇబ్బంది పడేది సామాన్య ప్రజలే అనేది జగమెరిగిన సత్యం. అదే మూడు రోజులక్రితం జరిగిన పహల్గామ్ సంఘటన మరోసారి రుజువు చేసింది. ఆ ఘటనతో భారత్ పాక్‌ల మధ్య సార్క్ వీసా హక్కులు రద్దు అయ్యాయి. అలాగే వాఘా సరిహద్దులు మూసేయడం జరిగింది. దీంతో పిల్లల చికిత్స కోసం వచ్చిన పాకిస్తాన్ తల్లిదండ్రుల బాధలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది.
తమ కంటిపాపల కోసం భారత్‌కు వస్తే.. హఠాత్తుగా ఉన్నపళంగా వెనక్కి వెళ్లిపోమని దేశాల నుంచి ఆదేశాలు వస్తుంటే.. ఏం పాలుపోక దిక్కుతోచని స్థితిలో విలపిస్తున్న ఆ దృశ్యాలు ఎవ్వరినైనా కంటతడిపెట్టిస్తాయి. వారి గాథలు ఎలా ఉన్నాయంటే..ఒక పాకిస్తానీ తండ్రికి ఇద్దరు పిల్లలు పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతో బాధపడుతున్నారు. "ఇక్కడైతే ఆధునాతన వైద్య చికిత్స ఉంటుందని డిల్లీకి వచ్చాడు. మరో వారం రోజుల్లో ఆపరేషన్ జరగనుంది. అందుకు అక్కడ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సహకరిస్తున్నారు. కానీ ఈ అనూహ్య పరిణామం కారణంగా షాక్‌కి గురయ్యాం. ఇక్కడ ఉండటానికి..చికిత్సకు చాలా ఖర్చు అయ్యిందంటూ వేదనగా ఓ పాక్ తండ్రి చెబుతున్నాడు.
మరొక పాకిస్తానీ వ్యక్తి తన కొడుకు గుండె ఆపరేషన్ కోసం హైదరాబాద్ వచ్చామని, రెండు రోజుల్లో సర్జరీ అని కన్నీటిపర్యంతమయ్యాడు. ఒక్కొక్కరిది ఒక్కే విధమైన వేదన. అయితే వారంతా ఇక్కడ వారికి హృదయం ఉంది, ఎలాగైనా ఇరుదేశాలను అభ్యర్థిస్తాం తమ పిలల్లకు సర్జరీ అయ్యేంతవరకు ఉండనివ్వమని అని ధీనంగా చెబుతున్నారు.
అయితే వారందర్నీ భారత పోలీస్ యంత్రాంగం, విదేశాంగ కార్యాలయం వెంటనే భారత్ నుంచి బయలుదేరాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా, పాకిస్తాన్‌లో ఉన్న 100 మందికి పైగా భారతీయ పౌరులు గురువారం భారతదేశానికి తిరిగి రాగా, భారత్‌లో ఉన్న 28 మంది పాకిస్తానీయులు వాఘా సరిహద్దు మూసేయడంతో తిరిగి భారత్‌లోకే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ఏదీఏమైనా..ఒక్క దుశ్చర్య ఎంతమందిని బాధల్లోకి నెట్టేసిందనేందుకు ఈ ఉదంతమే ఉదహరణ.
(చదవండి: సలుపుతున్న రాచపుండు! చివరి దశలోనే ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు)