
పేరెంటింగ్
ఐఏఎస్ అధికారిణి, ఇద్దరు పిల్లల తల్లి అయిన దివ్య మిట్టల్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ‘నేను ఒక ఐఏఎస్ అధికారిణి ని. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఢిల్లీలో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎమ్) బెంగళూరులో చదివాను. వీటిని సాధించడానికి చాలా కష్టపడ్డాను. కానీ, నా ఇద్దరు చిన్నారి కూతుళ్లను పెంచే క్రమంలో సవాళ్లను ఎదుర్కోవడానికి ఏదీ నన్ను సిద్ధం చేయలేదు..’ అంటూ ఆ పోస్ట్‌లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఉద్యోగం చేసే అమ్మల శాతం పెరుగుతోంది. అదే సమయంలో పిల్లల పెంపకం పట్ల సరైన జాగ్రత్తలు తీసుకుంటున్నామా అనే ఆందోళనా పెరుగుతోంది. కాలానికి అనుగుణంగా వస్తున్న మార్పులను నేటి తల్లులు ఎలా సమతుల్యతను సాధించాలో నిపుణులు సూచిస్తున్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు మనం ‘అమ్మా’ అని పిలుస్తాం. ఈ పిలుపు తల్లీ బిడ్డ జీవితాంతం పంచుకునే అనుబంధానికి స్పష్టమైన సూచన. ప్రాచీన కాలం నుండి సమాజంలో మహిళలు పిల్లల సంరక్షకులుగా పరిగణించబడ్డారు. వారి విధి ఇంటికి, ఇంట్లోని వారిని జాగ్రత్తగా చూసుకోవడానికి మాత్రమే పరిమితమయ్యింది. దీంతో తల్లులు ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలనే ఈ భావన పిల్లలను వారి జీవితాల్లో, అభివృద్ధిలో సురక్షితంగా ఉంచింది. నేడు సమాజంలో తల్లులు ఇంటి పనుల నిర్వహణలోనూ, పిల్లల సంరక్షణలోనూ రెండు పాత్రలను పోషిస్తున్నారు. పిల్లల సంరక్షణలో తండ్రుల వాటా పెరిగినప్పటికీ మహిళలు ఇప్పటికీ వారి ఇంట్లో మొదటి సంర క్షకులుగా ఉంటున్నారు.
విజయవంతమైన మార్పు
ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ ఉమెన్ గురించి చేసిన అధ్యయనాల్లో దాదాపు 73 శాతం మంది మహిళలు 30 ఏళ్ల వయసులో తమ పిల్లలను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను విడిచిపెట్టారని, 27 శాతం మంది కొంతకాలం తర్వాత తిరిగి వచ్చారని గమనించారు. వారిలో దాదాపు 16 శాతం మంది తమ వృత్తిపరమైన పని జీవితంలో అధికారులుగా ఉన్నారు. కాబట్టి తల్లులుగా ఉన్న మహిళలు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను విజయవంతంగా మార్చుకుంటున్నారని కూడా స్పష్టమైంది.‘ఉద్యోగినిగా డబ్బు సంపాదిస్తూ పిల్లలకు కావల్సినవి సమకూర్చగలుగుతున్నాను. కానీ, వారిని సక్రమంగా పెంచగలుగుతున్నానా..’ అనుకునే తల్లులకు సాంకేతికత వరంగా మారింది. సమయానుకూలంగా వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఎంచుకోవచ్చు.
సానుకూల ప్రభావాలు
→ ఉద్యోగ తల్లిదండ్రులిద్దరూ ఇంట్లో రెండు పని చక్రాలతో తమ జీవితాలు సజావుగా నడుస్తున్నట్టు చూస్తారు. ఉన్నత విద్యను పొందగల సామర్థ్యం, భౌతిక, సౌకర్యవంతమైన జీవితాన్ని గడపగల సామర్థ్యం కారణంగా వారు మరింత సంతృప్తికరమైన జీవితాలను గడుపుతారు. ఇప్పుడు ఉద్యోగాల్లోకి వెళ్లే మహిళలు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, కెరీర్ అవకాశాలను సరైన ప్యాకేజీలతో అందుకుంటున్నారు.
→ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం ప్రకారం పనిచేసే తల్లుల కుమార్తెలు వారి తల్లులకంటే 23శాతం ఎక్కువ సంపాదిస్తారని తెలిసింది. మరోవైపు పనిచేసే తల్లుల కుమారులు బాధ్యతాయుతమైన పెద్దలుగా ఎదుగుతారు. వారి ఆఫీసుల్లో లింగ సమానత్వాన్ని ఇష్టపడతారు. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సవాళ్లను గౌరవిస్తారు. వారు భవిష్యత్తులో తమ కుమార్తెలకు అద్భుతమైన తండ్రులుగా కూడా పెరుగుతారు.
→ తమ తల్లి జీవితంలోని దుఃఖకరమైన రోజులనూ చూసి ఉంటారు. అంతేకాదు తమ తల్లి పట్టుదల, దృఢ సంకల్పం వారు మానసికంగా, ఆర్థికంగా తమ సామర్థ్యాల మేరకు తమను తాము ముందుకు తీసుకెళ్లేలా చేస్తాయి. అన్నింటికంటే వారు హీరోలలో తమ తల్లిని ఒక షీ–రో గా చూస్తారు.
మెరుగైన సమయ నిర్వహణ
→ పనిచేసే తల్లులు ప్రతిరోజూ తమ పిల్లలతో కనీసం ఒకటి లేదా రెండు గంటలు గడపగలిగేలా సమయాన్ని ప్లాన్‌చేసుకోవాలి. ఇది ఒక దినచర్యగా అనుసరించాలి. వేర్వేరు పనులను షెడ్యూల్ చేయడం, వాటిని సమయానికి పూర్తి చేయడం అనే మీ అలవాటు మీ పిల్లలు అదే అడుగు జాడల్లో నడవడానికి ఒక ఉదాహరణగా ఉపయోగపడుతుంది.
→ పిల్లలు టైమ్‌టేబుల్‌కు కట్టుబడి ఉండటానికి కూడా ప్రోత్సహిస్తుంది. పిల్లలు మీ పనిని పూర్తి చేయడంలో సహకరిస్తున్నందుకు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది.
→ కాలక్రమంలో పిల్లల సమయ నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఇది వారి మెరుగైన జీవితానికి సహాయపడుతుంది. అంతేకాదు, పిల్లలతో మరింత నాణ్యమైన సమయాన్ని గడపడానికి సహాయపడుతుంది.
రోజువారీ జీవన విధానంలో ముఖ్యమైన వాటికి సమయం ఇస్తూ, తమ పనిని బ్యాలెన్స్ చేసుకుంటూ, చేస్తున్న పని గురించి పిల్లలకు క్లారిటీ ఇవ్వడం వల్ల మెరుగైన ప్రయోజనాలను పొందుతారు.
హద్దులు అవసరం
పని, కుటుంబంతో పాటు వ్యక్తిగత అవసరాలకూప్రాముఖ్యం ఇవ్వండి. శారీరక, భావోద్వేగ శ్రేయస్సు కోసం స్వీయ సంరక్షణ అవసరం అనేది గుర్తుంచుకోవాలి. రోజులో పిల్లలకోసమే అన్నట్టుగా కొంత సమయం గడపండి. ఆ సమయంలో ఏదైనా పని నైపుణ్యాలు నేర్పించాలా, చదువు పట్ల దృష్టి పెట్టాలా, ఆనందంగా ఉంచడానికిప్రాధాన్యత ఇవ్వాలా.. ఇలా దేనికది బేరీజు వేసుకోవాలి. సహాయకులుగా ఉండేవారి మద్దతు ఎలా అందుతుందో చెక్ చేసుకోండి. వృత్తిపరమైన వృద్ధికి, తల్లి పాత్రకు విలువనిచ్చేవారిని సహాయకులుగా ఉండేలా చూసుకోండి. ప్రతి ఒక్కరూ జవాబుదారీతనం తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి. ప్రతి ఒక్కరూ పనులు చేసేలా, బాధ్యత తీసుకునే కుటుంబ వాతావరణాన్ని సృష్టించండి.
–ప్రొ÷. పి.జ్యోతిరాజ, సైకాలజిస్ట్, లైఫ్ స్కిల్ నిపుణులు
అమ్మా, నువ్వే నా హీరో..
నా పెద్ద కూతురికి 8 ఏళ్లు. ప్రపంచం గురించి ఇప్పటికే భిన్నమైన ఆలోచనలను చేస్తుంటుంది. ఎదిగే క్రమంలో ఆమె ఆలోచనల కాంతిని మసకబారనివ్వం. కొన్నిసార్లు పని ఒత్తిడిలో చాలా అలసిపోయినట్టుగా ఉంటుంది. ఆ అలసటలో ఏడుపు వచ్చేస్తుంటుంది కూడా. అలాంటప్పుడు నా కూతురు నన్ను కౌగిలించుకుని, ‘నువ్వు నా హీరోవి‘ అని చెబుతుంది. అంటే, పిల్లలు మనల్ని గమనిస్తారు. వారు మన వైఫల్యాల నుండి దృఢంగా ఎలా ఉండాలో నేర్చుకుంటారు. పడిపోవడం సహజమే అని ఆమెకు చూపించండి, ఆపై లేవండి. నా ఉద్యోగం నాకు ఇది నేర్పింది.
ఏది జరిగినా నువ్వు స్థిరంగా ఉంటావని చూపించండి. మాతృత్వంలో తమకు తాము వేసుకునే ప్రశ్నల్లో కొంత అపరాధ భావనతో నిండి ఉంటాయి. నేను పిల్లలకు సరైనదే ఇస్తున్నానా, ఏమైనా తప్పులు చేస్తే.. ఇలాంటివి తలెత్తుతుంటాయి. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీ సొంత మార్గంలో ప్రయాణిస్తూ ఆమె దేనినైనా వెంబడించగల ప్రపంచాన్ని నిర్మిస్తున్నారని గుర్తించాలి. తనను తాను క్షమించుకుంటూ ముందుకు సాగడం కూడా చాలా ముఖ్యం. మీకు ఒకరి కంటే పిల్లలు ఎక్కువమంది ఉంటే ఆ బాధ్యత పది రెట్లు పెరుగుతూనే ఉంటుంది. అందుకని, పిల్లలను ప్రేమించడం కంటే కూడా న్యాయంగా ఉండడటం ముఖ్యం.
– దివ్యా మిట్టల్
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి