
డిబేట్
నాలుగు సంవత్సరాల అమ్మాయి తన తల్లిని ‘అమ్మా... నన్ను తిరిగి నీ గర్భంలోకి తీసుకొని తెల్లగా పుట్టించగలవా?’ అని అడిగింది. తల్లి ఆశ్చర్యంగా చూసి ‘ఎందుకమ్మా?’ అని అడిగింది. ‘నల్లపిల్ల అంటూ నన్ను అందరూ వెక్కిరిస్తున్నారు’ కళ్లనీళ్లతో చెప్పింది ఆ అమ్మాయి. ‘రంగుది ఏముందమ్మా! నువ్వు చదువుకొని పెద్ద స్థాయిలో ఉంటే రంగు గురించి ఎవరూ మాట్లాడరు’ అన్నది ఆ తల్లి ఓదార్పుగా.
కట్ చేస్తే.... ఆ అమ్మాయి కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిలాంటి పెద్ద పదవిలోకి వచ్చింది. అయినా నల్లటి ఆమె ఒంటి రంగును హేళన చేస్తూ అయిదు దశాబ్దాలుగా ఆమెను బాధిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తన ఆవేదనకు అక్షర రూపం ఇచ్చి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు కేరళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శారదా మురళీధరన్.
‘నలుపు’ అనే ముద్ర వేసి వెక్కిరించడంపై శారదా మురళీధరన్ గొంతు విప్పారు. ‘ఇది విశ్వం యొక్క సర్వవ్యాప్త సత్యం అయినప్పుడు ఆ రంగును ఎందుకు కించపరుస్తున్నారు?’ అంటూ ప్రశ్నించారు. వర్ణ, లింగ వివక్షకు సంబంధించిన కామెంట్స్‌పై ఫేస్‌బుక్‌లో ఆమె పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.
శారదకు ఎంతోమంది నుంచి మద్దతు వెల్లువెత్తింది.‘ నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్ని కీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’ అంటారు శారద.
శారద 1990 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. ఆరేళ్ల పాటు ప్రతిష్ఠాత్మకమైన ‘కుటుంబ శ్రీ’కి నేతృత్వం వహించారు. ఆ తర్వాత జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్‌లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. పంచాయితీ రాజ్ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.
త్రివేండ్రం జిల్లా కలెక్టర్‌గా, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కమిషనర్‌గా... ఇలా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించారు. గత సంవత్సరం భర్త డాక్టర్ వేణు నుంచి కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయినా సరే... ‘నలుపు’ పేరుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెక్కిరింపులు ఎదురవుతూనే ఉన్నాయి. కేరళ చీఫ్ సెక్రటరీగా తన భర్త నుంచి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన రంగుతో పోల్చుతూ, ఆ పదవికి మీరేం సరిపోతారు? అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేశారు.
వారి కామెంట్స్‌లో నలుపు రంగును తక్కువ చేసి వెక్కిరించడం ఉంది. ఆడవాళ్లకు పెద్ద పదవులు ఎందుకు? అనే పురుషాధిపత్య భావజాలం ఉంది. ఈ నేపథ్యంలోనే తన మనసులోని ఆవేదనను ఫేస్‌బుక్ పోస్ట్‌లో పెట్టారు శారద. ఆ పోస్ట్‌పై మొదట్లో కొందరి కామెంట్స్ చూసిన తరువాత ఆ పోస్ట్‌ను డిలీట్ చేశారు. ‘మీ పోస్ట్ నేపథ్యంలో చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’ అని శ్రేయోభిలాషులు చెప్పడంతో మరోసారి పోస్ట్ చేశారు. రీ–షేర్ చేసిన తరువాత ఆమె పోస్ట్‌కు మద్దతుగా ఎన్నో కామెంట్స్ వచ్చాయి. శారద ధైర్యసాహసాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమెను ప్రశంసించిన వారిలో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్షనేత సతీశన్ కూడా ఉన్నారు.
‘నల్లరంగు కారణంగా నేను ఇతరుల కంటే తక్కువ అనే భావన నాలో ఉండేది. నా పిల్లలు మాత్రం నలుపు అంటే అందం అంటారు. నల్లజాతి వారసత్వాన్నికీర్తించారు. నేను గమనించని చోట అందాన్ని వెదుక్కుంటూ వచ్చారు. వారి మాటలు నలుపు వర్ణం విలువను, అందాన్ని గుర్తించేలా చేసింది’
Comments
Please login to add a commentAdd a comment