స్ఫూర్తి
‘మన దేశంలో పేదలు కలలు కనగలరు. వాటిని నిజం చేసుకోగలరు’ అనే మాట ఎన్నో సందర్భాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటి నుంచి వినిపించింది. పేదరాలైన జయమ్మ కల కన్నది. ‘నా కష్టాన్ని చూసి నలుగురు మెచ్చుకుంటే చాలు’ నలుగురు ఏం ఖర్మ... సాక్షాత్తూ రాష్ట్రపతిభవన్ ఆమె కష్టాన్ని గుర్తించింది.
‘నీ భర్త ఏం పనిచేస్తాడు?’ అనే ప్రశ్నకు... జయమ్మ చెప్పిన జవాబుకు అవతలి వ్యక్తి ముఖం అదోలా మారిపోయేది. మాటల్లో చిన్న చూపు కనిపించేది.
నెల్లూరుకు చెందిన జయమ్మ ఔట్‌సోర్సింగ్ పారిశుధ్య కార్మికురాలు. దీంతోపాటు భర్తతో కలిసి సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులు చేస్తుంది.
‘చేయడానికి మీకు ఈ పనే దొరికిందా తల్లీ’ అని వెక్కిరించిన వాళ్లు ఎందరో! అయితే ఏ రోజూ చేస్తున్న పనిపట్ల నిర్లక్ష్యం, విముఖత జయమ్మలో కనిపించలేదు. ఆమె రెక్కల కష్టం వృథా పోలేదు. వృత్తి పట్ల జయమ్మ అంకితభావానికి గుర్తింపుగా దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఆహ్వానం అందింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇస్తున్న విందులో పాల్గొనబోతోంది జయమ్మ.
‘పెద్దోళ్లకు అందరూ చుట్టాలే. పేదోళ్లకు కష్టాలే చుట్టాలు’ అంటుండేది జయమ్మ తల్లి రాజమ్మ.
ఆ ఇంటికి కష్టాలు కొత్త కాదు. కష్టపడడం కొత్త కాదు. నెల్లూరు నగరంలోని ఉమ్మారెడ్డిగుంట ప్రాంతానికి చెందిన జయమ్మ తన తల్లిదండ్రులకు సాయంగా రోజువారీ కూలిపనులకు వెళ్తుండేది. ‘ఏ పనీ లేకుండా ఇంట్లో కూర్చోవడం కంటే పనికి పోవడమే నాకు ఇష్టం’ అంటున్న జయమ్మకు ‘శ్రమ’ అనేది చిన్నప్పటి నేస్తం.
జయమ్మకు రమేష్‌తో వివాహం జరిగింది. రమేష్ మొదట్లో సెప్టిక్‌ట్యాంక్ వాహనానికి డ్రైవర్‌గా వెళ్తుండేవాడు. పదేళ్లపాటు డ్రైవర్‌గా పనిచేసిన అనుభవంతో తానే సొంతంగా ఓ సెప్టిక్ ట్యాంకర్ సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేసి క్లీనింగ్ పనులు చేసుకుంటూ కుటుంబ పోషణ చేసేవాడు. ఇద్దరు పిల్లలు స్కూల్‌కి వెళ్లే వయస్సు వచ్చేవరకు గృహిణిగా ఉన్న జయమ్మ ఆ తరువాత భర్త చేసే సెప్టిక్ ట్యాంకు క్లీనింగ్ పనులకు తాను కూడా తోడుగా వెళ్తుండేది.
చిన్నచూపు చూసినా..
భూగర్భ డ్రైనేజీ పారిశుధ్య పనులకు వెళ్లే జయమ్మను తోటివారే చిన్నచూపు చూసేవారు. అవేమీ పట్టించుకోకుండా భర్తకు చేదోడువాదోడుగా ఉండేది. క్లీనింగ్ సమయాల్లో చర్మవ్యాధుల బారిన పడేది. ఈ దంపతుల కష్టాన్ని చూసిన ‘నవజీవన్ ’ అనే స్వచ్ఛంద సంస్థ నాలుగేళ్ల క్రితం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ షూరిటీతోపాటు ఎన్ ఎస్‌కేఎఫ్‌డీ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకు రుణం మంజూరు చేయించింది. రూ.10 లక్షల సబ్సిడీతో రూ.32 లక్షలు విలువైన కొత్త సెప్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ వాహనాన్ని మంజూరు చేయించడంతో వారికి సొంతవాహనం సమకూరింది. దీంతో దంపతులిద్దరూ సొంత వాహనంతో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కార్పొరేషన్ అధికారుల సహకారంతో నగరంలోని ఎన్నో నివాసాల్లో సెప్టిక్‌ట్యాంక్ క్లీనింగ్ పనులు చేస్తున్నారు.
అన్ని అంశాల్లో మంచి మార్కులు
కేంద్ర ప్రభుత్వ ఎన్ ఎస్‌కేఎఫ్‌డీసీ (నేషనల్ సఫాయి కర్మచారీస్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్) పథకం లబ్ధిదారు అయిన జయమ్మ సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనానికి యజమాని అయింది. పథకాన్ని ఏ మేరకు సద్వినియోగం చేసుకున్నారు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా, సకాలంలో ఈఎంఐ కడుతున్నారా, లోడ్‌ను ఎక్కడంటే అక్కడ డంప్ చేస్తున్నారా లేక ప్రభుత్వం చూపిన పాయింట్‌లోనే డంప్ చేస్తున్నారా... ఇలాంటి అంశాలతో పాటు తగినవిధంగా జీవనోపాధి పొందుతున్నారా.. పోలీస్ స్టేషన్‌లో ఏమైనా కేసులు నమోదయ్యాయా... ఇలా ఎన్నో అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ అధికారులు. అన్నింట్లో మంచి మార్కులు రావడంతో జయమ్మ కృషికి గుర్తింపు లభించింది. రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చింది.
ఆ నమ్మకంతోనే...
‘నమ్మిన పని ఎప్పుడూ మోసం చేయదు అనే మాట ఎన్నోసార్లు విన్నాను. ఆ నమ్మకంతోనే ఎంతమంది వెక్కిరించినా పట్టించుకోలేదు. మా ఆర్థిక స్థాయికి సెఫ్టిక్ ట్యాంకర్ క్లీనింగ్ బండికి సొంతదారులమవుతామని అనుకోలేదు. కష్టపడితే ఆ కష్టమే మనల్ని ముందుకు తీసుకువెళుతుంది’ అంటూ ఆత్మవిశ్వాసం నిండిన గొంతుతో అంటుంది జయమ్మ.
జీవితంలో మర్చిపోలేని రోజు
మేము చేసే వృత్తి తప్పుడు పనేం కాదు. మా రెక్కల కష్టాన్నే నమ్ముకుని పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. అందులోనే మాకు సంతృప్తి ఉంది. ఎవరేమి అనుకున్నా మేము ఎప్పుడూ బాధపడలేదు. నా భర్తకు తోడుగా సాయంగా వెళ్లి క్లీనింగ్ పనులు చేస్తున్నా. గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆహ్వాన పత్రిక రావడం జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఎంతో సంతోషంగా ఉంది.
– జయమ్మ
– చిలక మస్తాన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment