out sourcing
-
సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత
అమరావతి, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. డీఎస్సీ రిక్రూట్మెంట్ నేపథ్యంలో.. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. డీఎస్సీ నుంచి గురుకులాల 1,143 పోస్టులు మినహాయించాలన్నది వాళ్ల ప్రధాన డిమాండ్. పదిహేనేళ్లుగా ఔట్ సోర్సింగ్ విధానంలో తాము పని చేస్తున్నామని, ఇప్పుడు డీఎస్పీ నోటిఫికేషన్ ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, పరీక్ష రాయడానికి తమకు ఏజ్ లిమిట్ కూడా దాటిపోయిందని అంటున్నారు వాళ్లు. శనివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎదురుచూశామని, అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చామని టీచర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుకు తమ సమస్య వివరించిన తరువాతే కదులుతామని అంటున్నారు వాళ్లు. -
ఉద్యోగాలు 4... దరఖాస్తులు 675!
అనంతపురం: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ పర్యవేక్షణకు సంబంధించి నాలుగు కాంట్రాక్ట్/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం 675 దరఖాస్తులు అందినట్లు డీఈఓ కె.శామ్యూల్ తెలిపారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మధ్యాహ్న భోజన పథకం డేటా అనలిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. మరుగుదొడ్ల నిర్వహణ నిధి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ పోస్టుకు మొత్తం 166 దరఖాస్తులు, డేటా ఆపరేటర్ ఉద్యోగానికి 199 దరఖాస్తులు, మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించి డేటా అనలిస్ట్‌కు 122 మంది, డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 188 మంది దరఖాస్తు చేశారు. (చదవండి: ఆస్తి కోసం అంధురాలిపై హత్యాయత్నం) -
కదం తొక్కిన కార్మికులు
హిమాయత్‌నగర్: ఔట్ సోర్సింగ్ కార్మికుల ధర్నాతో గురువారం బల్దియా ప్రధాన కార్యాలయం దద్దరిల్లింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఔట్సోర్సింగ్ కార్మికులను ఎన్‌ఎంఆర్‌లుగా గుర్తించి పర్మనెంట్ చేయాలని, ఆరోగ్య భద్రతకు హెల్త్ కార్డు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలు చెల్లించాలని, బయోమెట్రిక్ మిషన్లను జీహెచ్ఎంసీనే నేరుగా కొనాలనే తదితర డిమాండ్లతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ (బీజేపీ) మజ్దూర్ సెల్ పిలుపు మేరకు ఉద్యోగ, పారిశుద్ధ్య, ఎంటమాలజీ, వెటర్నరీ, పార్క్ సెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెక్షన్ విభాగాల కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు రెండు గంటల పాటు కార్యాలయం లోపల కార్మికులు బైఠాయించారు. అవుట్ సోర్సింగ్ కమిషనర్ లోకేష్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ట్రాన్స్పోర్ట్ సెక్షన్ నుంచి తీసేసిన 700 మందిని విచారణ జరిపి వారిని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. బయోమెట్రిక్ కారణంగా కట్ అయిన డబ్బులు తిరిగి ఇస్తామన్నారు. ఎంటమాలజీ విభాగంలో ఉన్న ఖాళీలను నియమించేందుకు, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు ఉదిరి గోపాల్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్ రావు, ఔట్ సోర్సింగ్ విభాగం అధ్యక్షుడు రాము తదితరులు పాల్గొన్నారు. (చదవండి: హైదరాబాద్‌కు పాడ్ కార్స్, రోప్‌వేస్) -
సీఎం జగన్‌పై ఎమ్మెల్యేల ప్రశంసలు
సాక్షి, తాడేపల్లి: ఔట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పారదర్శకతే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ‘ఏపీ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్’ (ఆప్కాస్)ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్ సుధాకర్ బాబు పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై ప్రశంసలు కురిపించారు. పాదయాత్రలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధలు, కష్టాలు తెలుసుకున్న వైఎస్ జగన్ వారి కష్టాలు తీర్చడానికి ఆప్కాస్ ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు పాలనలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం నిరుద్యోగులు లంచాలు ఇచ్చి ఇబ్బందులు పడేవారని జోగి రమేష్ గుర్తు చేశారు. ఉద్యోగంలో చేరినా జీతాలు సమయానికి రాక తీవ్ర తీవ్ర కష్టాలు పడ్డారని తెలిపారు. టీడీపీ హయాంలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు వందల కోట్ల రూపాయలు తీనేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం అవకాశం కల్పించే విధంగా సీఎం నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. అందులోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నారని వెల్లడించారు. బీసీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు కాల్వ శ్రీనివాసులు, యనమల రామకృష్ణుడు అనడం విడ్డూరంగా ఉందని జోగి రమేష్ వ్యాఖ్యానించారు. రూ.151 కోట్ల అవినీతికి పాల్పడ్డ అచ్చెన్నాయుడిని అరెస్టే చేస్తే తప్పా? అని ఆయన ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు దోచుకున్న సొమ్ములో చంద్రబాబు, లోకేష్‌కు వాటా ఉందని అన్నారు. మచిలీపట్నంలో బలహీన వర్గాల నేతగా ఎదుగుతున్న మోకా భాస్కర్ రావును హత్య చేయించారని ఎమ్మెల్యే ఆరోపించారు. చంద్రబాబు ప్రోద్బలంతోనే కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో మోకా భాస్కర్ రావు హత్యకు కుట్ర జరిగిందని పేర్కొన్నారు. వెంటనే కొల్లు రవీంద్రను అరెస్టు చేయాలని జోగి రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. (చదవండి: మరో హామీని నెరవేర్చిన సీఎం జగన్) దేవినేనివి పనికిమాలిన మాటలు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, దాని ద్వారానే వారికి జీతాలు పంపిణీ చేయడం అద్భుతమైన చర్య అని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డబ్బులు ఇస్తేనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగం వచ్చేదని విమర్శించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. సీఎం వైఎస్ జగన్ పనితీరు చూసి ఇతర రాష్ట్రాలు ఆశ్చర్య పోతున్నాయని అన్నారు. దేవినేని ఉమా పనికిమాలిన వాడని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు విమర్శించారు. అందుకే అన్నీ పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దల గురించి తెలుగుదేశం నాయకులు పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నారని, ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని సుధాకర్‌బాబు హెచ్చరించారు. (చదవండి: కళాఖ్యాతి.. గడప దాటి) -
ఆప్కాస్‌ను ప్రారంభించిన సీఎం జగన్
-
‘ఔట్’ సోర్సింగ్!
– డిపాజిట్లు , పీఎఫ్ నష్టపోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు – వర్సిటీ చెల్లింపులకు, అందించే జీతాలకు పొంతన కుదరని వైనం – స్వాహా చేసి ఉడాయించిన ఏజెన్సీ నిర్వాహకుడు – నూతన ఏజెన్సీకి కట్టబెట్టినా.. మూడు నెలలుగా అందని జీతాలు ఎస్కేయూ: ఎస్కేయూలో ఉద్యోగాల కల్పన పేరుతో అందినకాడికి దోచుకున్నారు. ఔట్ సోర్సింగ్ ముసుగులో రూ. లక్షలు కొల్లగొట్టి ఉడాయించారు. శ్రమ దోపిడీతో ఉద్యోగులకు చివరకు మిగిలింది నిరాశే! శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లలో భద్రతా నిమిత్తం 2015 ఆగస్టులో తొలి దశలో 40 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. అనంతరం మరో 20 మంది నియామకం చేపట్టారు. వీరందరి నిర్వహణ బాధ్యతను వెంగమాంబ ఏజెన్సీకి అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రకటించిన వేతనంలోనూ కోత సెక్యూరిటీ గార్డుగా ఎంపిక చేసిన ప్రతి ఒక్కరితో విధుల్లో చేరేందుకు ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.25 వేలు కట్టించుకున్నారు. నియామకం సమయంలో ఒక్కొక్కరికి నెలకు రూ.10,200 వేతనం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా నెలకు రూ. 6,700 చొప్పున అందిస్తూ వచ్చారు. పీఎఫ్, ఇతరత్రా పన్నుల పేరుతో నిర్ధేశిత జీతం కన్నా రూ. 3,500 తక్కువ చెల్లించారు. తమకు తక్కువ జీతం అందుతోందంటూ పలువురు వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ కింద పనిచేసేవారి బాధ్యత వర్సిటీది కాదంటూ, ఏదైనా ఏజెన్సీ నిర్వాహకులతో తేల్చుకోవాలని అధికారులు స్పష్టం చేయడంతో గత ఏడాది సెక్యూరిటీ గార్డులు ఆ మేరకు నిర్వాహకుడిని నిలదీశారు. ఆ సమయంలో వారికి సర్ది చెప్పిన నిర్వాహకుడు నవంబర్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రతి నెలా వ్యత్యాసం ఉన్న రూ. 3,500, రూ.25 వేలు డిపాజిట్ మొత్తం స్వాహా అయినట్లు తెలుసుకున్న సెక్యూరిటీ గార్డుల వేదనకు అంతులేకుండా పోతోంది. ఉద్యోగులను వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు మోసం చేయడంతో .. కార్తికేయ ఏజెన్సీకు సెక్యూరిటీ గార్డులను అప్పగించారు. అయినప్పటికీ ఈ సంస్థ కూడా ఎవరికీ మూడు నెలలుగా జీతాలు అందించలేదు. ఉదయం పూట కూలీ పనికి ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనంతపురంలో కమ్మీ పనికి వెళుతున్నాను. రూ. 150లు ఇస్తారు. గతంలో ఉన్న ఏజెన్సీ కట్టించుకున్న రూ. 25 వేలు డిపాజిట్, పీఎఫ్ మొత్తాన్ని ఇవ్వలేదు. నిర్వాహకుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. వర్సిటీ అధికారులు మా మీద దయతలచి సహకరిస్తున్నారు. – సురేంద్ర, సెక్యూరిటీ గార్డు సెంట్రింగ్ పని చేస్తున్నా మూడు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో డ్యూటీ ఒక షిప్టు చేసి, మరో షిప్టులో సెంట్రింగ్ పనికి వెళుతున్నాను. వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు తక్కువ జీతం ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు. మా సమస్యలను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పరిష్కరిస్తామన్నారు. మా ఉద్యోగాలు కొనసాగించి. మరో ఏజెన్సీకి అప్పగించి ఉద్యోగాలు నిలబడేలా చేశారు. – ఆదిశేషయ్య. సెక్యూరిటీ గార్డు. పీఎఫ్ అందలేదు పీఎఫ్ , ఇతరత్రా అలవెన్సులు వెంగమాంబ ఏజెన్సీ వారు ఇవ్వకుండా స్వాహా చేశారు. ప్రతి నెలా రూ.3,500 జీతం తక్కువగా ఇచ్చారు. పైగా రూ.25 వేలు డిపాజిట్‌ను తిరిగి ఇవ్వలేదు. – వన్నూరప్ప, సెక్యూరిటీ గార్డు -
ఔట్సోర్సింగ్ సిబ్బంది విలీనంపై స్టే
హైకోర్టులో విద్యుత్ సంస్థలకు చుక్కెదురు ► తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు విలీన ప్రక్రియ వద్దు ► ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగానే కొనసాగించుకోవచ్చు ► వారికి ఏకమొత్తంగా వేతనాలు చెల్లించండి ► ఈ దశలో సిబ్బందిని రోడ్డున పడేయలేమన్న కోర్టు ► కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ సంస్థలకు ఆదేశం ► విచారణ నాలుగు వారాలకు వాయిదా సాక్షి, హైదరాబాద్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విలీనం విషయంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థలకు హైకోర్టులో చుక్కెదురైంది. ఔట్సోర్సింగ్ సిబ్బంది విలీనంపై కోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంత వరకు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విలీనం చేసుకోవద్దని విద్యుత్ సంస్థలను ఆదేశించింది. వారిని ఇప్పటివరకు కొనసాగించిన విధంగానే ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగించాలని స్పష్టం చేసింది. అయితే కాంట్రాక్ట్ ఏజెన్సీలతో సంబంధం లేకుండా వారికి ఏకమొత్తంగా (కన్సాలిడేటెడ్) వేతనాలను చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యుత్ సంస్థలను ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిస్థాయిలో విచారణ జరపకుండా విలీనమైన ఉద్యోగులందరినీ రోడ్డుపాల్జేసి, వారి పొట్టకొట్టలేమని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. తమ సంస్థల్లో పనిచేస్తున్న సుమారు 21 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను విలీనం చేసుకోవాలన్న విద్యుత్ సంస్థల నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన శ్రావణ్‌కుమార్ అనే నిరుద్యోగి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం అండతో దొడ్డిదారి నియామకాలు.. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ... కాంట్రాక్టు ఎంప్లాయిస్ సర్వీసుల్ని క్రమబద్ధీకరణ చేయొద్దని గతంలో హైకోర్టు పేర్కొంటే.. విద్యుత్ సంస్థలు విలీనం (అబ్జార్బ్) అనే పద ప్రయోగంతో క్రమబద్ధీకరణ చేశాయన్నారు. జూన్ 29న జరిగిన విచారణ సమయంలో విద్యుత్ సంస్థల తరఫు న్యాయవాది.. క్రమబద్ధీకరణ ప్రక్రియకు చాలా సమయం ఉందని, ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసుల పరిశీలన నిమిత్తమే కమిటీలను ఏర్పాటు చేశామేగానీ ఇప్పటికిప్పుడు క్రమబద్ధీకరణ జరగబోదని ఇచ్చిన హామీని గుర్తుచేశారు. కానీ అందుకు భిన్నంగా దాదాపు 21 వేల మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది సర్వీసుల్ని క్రమబద్ధీకరించారని ఆయన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్మిక సంఘాల సమాఖ్యతో రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవి ఓ కొలిక్కి వచ్చాకే విలీన నిర్ణయంపై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలుపుతారని చెప్పినట్లు గత విచారణలో హైకోర్టుకు విద్యుత్ సంస్థలు చెప్పిన దానికి భిన్నంగా పరిణామాలు ఉన్నాయని చెప్పారు. విద్యుత్ సంస్థల తీరు వల్ల నిరుద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయన్నారు. ప్రభుత్వం అండతో విద్యుత్ సంస్థలు దొడ్డిదారిన నియామకాలు చేశాయన్నారు. గతేడాది డిసెంబర్ 4వ తేదీకి ముందు నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరికి విద్యుత్ సంస్థలతో సంబంధమే లేదన్నారు. వారిని కాంట్రాక్ట్ ఏజెన్సీలే నియమించుకున్నాయి తప్ప విద్యుత్ సంస్థలు కాదని వివరించారు. విలీనాన్ని ఎలా సమర్థించుకుంటారు? ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల విలీనాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ)ని కోరింది. ఎన్ని సంవత్సరాల నుంచి సేవలందిస్తున్న వారిని విలీనం చేసుకుంటున్నారని, 2016 డిసెంబర్ 4వ తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించడానికి కారణాలు ఏమిటని ప్రశ్నించింది. ఈ వివరాలన్నీ సమర్పించేందుకు ఏజీ స్వల్ప వాయిదా కోరడంతో ధర్మాసనం అందుకు అంగీకరిస్తూ తిరిగి సాయంత్రం నాలుగు గంటలకు విచారణను ప్రారంభించింది. దోపిడీని అడ్డుకునేందుకే... కాంట్రాక్ట్ ఏజెన్సీలు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను దోపిడీ చేస్తున్నాయని ఏజీ ప్రకాశ్‌రెడ్డి ధర్మాసనానికి తెలిపారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకే ఆ ఉద్యోగులను విలీనం చేసుకుంటున్నామని చెప్పారు. 20,903 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సర్వీసుల్ని క్రమబద్ధీకరించాలని విద్యుత్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయని తెలిపారు. వీరిలో గత మూడేళ్లుగా పని చేస్తున్న 3 వేల మందితోపాటు పదేళ్లకుపైబడి పనిచేసే వారూ ఉన్నారని చెప్పారు. వీరికి రూ.22 వేలు, రూ.18 వేలు, రూ.15 వేలు, రూ.13 వేల చొప్పున నాలుగు గ్రేడ్లలో వేతనాలు చెల్లిస్తున్నారన్నారు. ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, ఇతర విద్యార్హతలున్న వీరంతా రెగ్యులర్ ఉద్యోగుల్లాగే రోజుకు 8 గంటల చొప్పున విధులు నిర్వహిస్తున్నారని కోర్టుకు నివేదించారు. ఇకపై తెలంగాణ ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు చేపట్టబోదని ఏజీ వెల్లడించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, విలీనం పేరుతో ఇలా మూకుమ్మడిగా ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించడం సరికాదని వ్యాఖ్యానించింది. ఇది సుప్రీంకోర్టు చెప్పినట్లు దొడ్డిదారి నియామకమే అవుతుందని వ్యాఖ్యానిస్తూ.. ఔట్సోర్సింగ్ సిబ్బంది విలీన ప్రక్రియను చేపట్టొద్దని విద్యుత్ సంస్థలను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
‘ఔట్‌సోర్సింగ్‌ను అడ్డుకోవాలి’
బెల్లంపల్లి : సింగరేణి యాజమాన్యం ఐదు బొగ్గు గనుల ఔట్‌సోర్సింగ్‌కు రంగం సిద్ధం చేసిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) ప్రధానకార్యదర్శి వి.సీతారామయ్య తె లిపారు. గురువారం మందమర్రి ఏరియా శాం తిఖని గనిపై నిర్వహించిన గేట్‌మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. బొగ్గు గనులను ప్రైవేట్‌పరం చేయాలనే కుతూహలం యాజ మాన్యంలో పెరిగిందన్నారు. గనుల ప్రైవేటీకరణతో భవిష్యత్‌లో సింగరేణికి, కార్మికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులుంటాయని తెలిపారు. గనుల ఔట్‌సోర్సింగ్‌ను కార్మికులు తీ వ్రంగా ప్రతిఘటించాలని పేర్కొన్నారు. గుర్తిం పు సంఘం టీబీజీకేఎస్ కార్మికుల సమస్యలను తీర్చడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. టీబీజీకేఎస్‌లో గ్రూపుల ఆధిపత్యం పెరగడంతో కార్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయని విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం సమ్మె చేసిన కార్మికులకు ఇంతవరకు బకాయిలు చెల్లించిన పాపాన పోలేదని ధ్వజమెత్తారు. పదో వేజ్‌బోర్డు కోసం కోల్ ఇండియా యాజమాన్యం కమిటీని ఏర్పాటు చేయడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందన్నారు. వేజ్‌బోర్డు కమిటీని ఏర్పాటు చేసి త్వరితగతిన డిమాండ్లు నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు. మెరుగైన వేతన ఒప్పందం కోసం ఏఐటీయూసీ కృషి చేస్తోందన్నారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బెల్లంపల్లి బ్రాంచి కార్యదర్శి ఎం.వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు దాగం మల్లేశ్, సహాయ కార్యదర్శి తిరుపతిగౌడ్, ఫిట్ సెక్రెటరీ ఎస్.మల్లేశ్, నాయకులు చిలుక రాజనర్సు, రాజేశం తదితరులు పాల్గొన్నారు. -
అను‘గృహం’ దక్కేనా!
జన్మభూమి కమిటీ ఆమోదంతోనే ‘ఇందిరమ్మ’ బిల్లులు నిలువ నీడ లేని బడుగు జీవుల సొంతింటి కల కరిగిపోతోంది. మొండి గోడలు వీరి పేదరికాన్ని వెక్కిరిస్తుండగా.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం సవాలక్ష నిబంధనలతో ముప్పుతిప్పలు పెడుతోంది. టీడీపీ సర్కారు తన మార్కు కనిపించేందుకు చేస్తున్న ప్రయత్నం ‘ఇందిరమ్మ’ గృహ లబ్ధిదారుల పాలిట శాపంగా మారుతోంది. జియో ట్యాగింగ్ ప్రక్రియ ప్రహసనం కాగా.. బిల్లుల విడుదలకు జన్మభూమి కమిటీ ఆమోదం తప్పనిసరి చేయడం మొదటికే మోసం తీసుకొస్తోంది. కొనసాగుతున్న జియో ట్యాగింగ్ ప్రక్రియ ఔట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లకు ఉద్యోగాల బెంగ ఆధార్ లింకుతో బిల్లుల మంజూరు ఆలోచనలో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో లబ్ధిదారులు కర్నూలు(అర్బన్): జిల్లాలో మూడు విడతల ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా 3.40 లక్షల గృహాలు పూర్తి కాగా.. 44వేల గృహ నిర్మాణాలు వివిధ దశలో ఉన్నట్లు అధికారుల లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇందులో 16వేలు రూఫ్, లెంటల్ లెవల్లో ఉన్నాయి. వీటన్నింటికీ పెండింగ్ బిల్లులు మంజూరు కావాలంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం నియమించిన జన్మభూమి కమిటీలు పరిశీలించి ధ్రువీకరించాల్సి ఉంది. వీరి నివేదికలను మండల స్థాయి ప్రత్యేకాధికారి జిల్లా గృహ నిర్మాణ సంస్థ.. అక్కడి నుంచి ప్రభుత్వానికి పంపనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాకే పెండింగ్‌లోని బిల్లులు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకంలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయాలని నిర్ణయించింది. జిల్లాలో గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు మాత్రం 84 శాతం పూర్తయినట్లు చెబుతుండటం గమనార్హం. క్షేత్ర స్థాయిలో ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేయడంలో వర్క్ ఇన్స్పెక్టర్ల పాత్ర కీలకం. జిల్లా గృహ నిర్మాణ సంస్థలు ఇప్పటి వరకు 160 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది పని చేస్తుండగా.. వీరందరితో ఈనెల 31 వరకే పని చేయించుకోవాలని గతలంలోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో సిబ్బందిలో ఉద్యోగం పట్ల అభద్రతా భావం నెలకొంది. ప్రభుత్వ గడువు దగ్గరపడుతున్న కొద్దీ వీరు విధుల పట్ల శ్రద్ధ కనపర్చకపోగా.. ఉద్యోగం కాపాడుకోవడంలో భాగంగా ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో జియో ట్యాగింగ్ ఈ నెలాఖరులోపు పూర్తి కావడం అనుమానమేనని తెలుస్తోంది. జియో ట్యాగింగ్ పూర్తయిన వెంటనే బిల్లులు విడుదలవుతాయని అధికారులు చెబుతుండగా.. ఈ ప్రక్రియ ఓ పట్టాన కొలిక్కి రాకపోవడం లబ్ధిదారులను ఆందోళనకు గురి చేస్తోంది. బిల్లుల చెల్లింపులో జాప్యం గత ఏడాది నుంచి ఇప్పటి వరకు ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకానికి సంబంధించిన బిల్లుల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. సమైక్యాంధ్ర ఉద్యమాలు, వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఎలాంటి బిల్లులు విడుదల కాని పరిస్థితి. కాగా రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బిల్లులు విడుదలవుతాయని అందరూ భావించినా, ప్రభుత్వం జియో ట్యాగింగ్‌ను ఏర్పాటు చేయడంతో బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతోంది. ఆన్లైన్లో జనరేట్ చేసిన బిల్లులు రూ.33 కోట్లు కాగా, ఇంకా జనరేట్ కాని బిల్లులు దాదాపు రూ.20 కోట్లు ఉండొచ్చని అధికారులే చెబుతున్నారు. కాగా ప్రస్తుతం రేషన్‌కార్డు వ్యాప్ నెంబర్ కాకుండా ఆధార్ లింకుతో బిల్లులను మంజూరు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులకు ఆధార్ అనుసంధానం చేయడంలో జాప్యం చోటు చేసుకుని బిల్లుల చెల్లింపు మరింత ఆలస్యం కానుంది. ఎమ్మెల్యేలకు జియో ట్యాగింగ్ సీడీలు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్న జియో ట్యాగింగ్‌కు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలకు సీడీల రూపంలో అందించనున్నారు. ఈ మేరకు జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. అనుమానం ఉన్న ప్రాంతాలకు సంబంధించిన సీడీలను పరిశీలించేందుకు వీలుగా వీటిని అందిస్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా సమాచారం కోరితే హార్డ్‌కాపీలను కూడా అందించేందుకు చర్యలు చేపడుతున్నారు.