‘ఔట్’ సోర్సింగ్!
– డిపాజిట్లు , పీఎఫ్ నష్టపోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
– వర్సిటీ చెల్లింపులకు, అందించే జీతాలకు పొంతన కుదరని వైనం
– స్వాహా చేసి ఉడాయించిన ఏజెన్సీ నిర్వాహకుడు
– నూతన ఏజెన్సీకి కట్టబెట్టినా.. మూడు నెలలుగా అందని జీతాలు
ఎస్కేయూ: ఎస్కేయూలో ఉద్యోగాల కల్పన పేరుతో అందినకాడికి దోచుకున్నారు. ఔట్ సోర్సింగ్ ముసుగులో రూ. లక్షలు కొల్లగొట్టి ఉడాయించారు. శ్రమ దోపిడీతో ఉద్యోగులకు చివరకు మిగిలింది నిరాశే!
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లలో భద్రతా నిమిత్తం 2015 ఆగస్టులో తొలి దశలో 40 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. అనంతరం మరో 20 మంది నియామకం చేపట్టారు. వీరందరి నిర్వహణ బాధ్యతను వెంగమాంబ ఏజెన్సీకి అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు.
ప్రకటించిన వేతనంలోనూ కోత
సెక్యూరిటీ గార్డుగా ఎంపిక చేసిన ప్రతి ఒక్కరితో విధుల్లో చేరేందుకు ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.25 వేలు కట్టించుకున్నారు. నియామకం సమయంలో ఒక్కొక్కరికి నెలకు రూ.10,200 వేతనం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా నెలకు రూ. 6,700 చొప్పున అందిస్తూ వచ్చారు. పీఎఫ్, ఇతరత్రా పన్నుల పేరుతో నిర్ధేశిత జీతం కన్నా రూ. 3,500 తక్కువ చెల్లించారు. తమకు తక్కువ జీతం అందుతోందంటూ పలువురు వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ కింద పనిచేసేవారి బాధ్యత వర్సిటీది కాదంటూ, ఏదైనా ఏజెన్సీ నిర్వాహకులతో తేల్చుకోవాలని అధికారులు స్పష్టం చేయడంతో గత ఏడాది సెక్యూరిటీ గార్డులు ఆ మేరకు నిర్వాహకుడిని నిలదీశారు. ఆ సమయంలో వారికి సర్ది చెప్పిన నిర్వాహకుడు నవంబర్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రతి నెలా వ్యత్యాసం ఉన్న రూ. 3,500, రూ.25 వేలు డిపాజిట్ మొత్తం స్వాహా అయినట్లు తెలుసుకున్న సెక్యూరిటీ గార్డుల వేదనకు అంతులేకుండా పోతోంది. ఉద్యోగులను వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు మోసం చేయడంతో .. కార్తికేయ ఏజెన్సీకు సెక్యూరిటీ గార్డులను అప్పగించారు. అయినప్పటికీ ఈ సంస్థ కూడా ఎవరికీ మూడు నెలలుగా జీతాలు అందించలేదు.
ఉదయం పూట కూలీ పనికి
ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనంతపురంలో కమ్మీ పనికి వెళుతున్నాను. రూ. 150లు ఇస్తారు. గతంలో ఉన్న ఏజెన్సీ కట్టించుకున్న రూ. 25 వేలు డిపాజిట్, పీఎఫ్ మొత్తాన్ని ఇవ్వలేదు. నిర్వాహకుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. వర్సిటీ అధికారులు మా మీద దయతలచి సహకరిస్తున్నారు.
– సురేంద్ర, సెక్యూరిటీ గార్డు
సెంట్రింగ్ పని చేస్తున్నా
మూడు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో డ్యూటీ ఒక షిప్టు చేసి, మరో షిప్టులో సెంట్రింగ్ పనికి వెళుతున్నాను. వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు తక్కువ జీతం ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు. మా సమస్యలను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పరిష్కరిస్తామన్నారు. మా ఉద్యోగాలు కొనసాగించి. మరో ఏజెన్సీకి అప్పగించి ఉద్యోగాలు నిలబడేలా చేశారు.
– ఆదిశేషయ్య. సెక్యూరిటీ గార్డు.
పీఎఫ్ అందలేదు
పీఎఫ్ , ఇతరత్రా అలవెన్సులు వెంగమాంబ ఏజెన్సీ వారు ఇవ్వకుండా స్వాహా చేశారు. ప్రతి నెలా రూ.3,500 జీతం తక్కువగా ఇచ్చారు. పైగా రూ.25 వేలు డిపాజిట్‌ను తిరిగి ఇవ్వలేదు.
– వన్నూరప్ప, సెక్యూరిటీ గార్డు