sri krishnadevaraya university
-
ఎస్కేయూలో వైఎస్సార్ విగ్రహం తొలగింపు
అనంతపురం: తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడికి తలొగ్గిన శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) ఉన్నతాధికారులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అవమానకర రీతిలో తొలగించారు. కులం, మతం, ప్రాంతం చూడకుండా విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడంతో పాటు లక్షలాది విద్యార్థులకు ఉచిత విద్యనందించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని విశ్వవిద్యాలయంలో ప్రతిష్టించాలని గతంలో విద్యార్థులు, అధ్యాపకులు కోరారు. దీనికి గతేడాది సెప్టెంబర్‌లో జరిగిన పాలకమండలి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి, వర్సిటీ క్యాంపస్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు వర్సిటీ నయా పైసా ఖర్చు చేయలేదు. ఎనిమిది మంది అసోసియేట్ ప్రొఫెసర్లు ఇచ్చిన నిధులతో విగ్రహాన్ని ప్రతిష్టించారు. అయితే.. తాజాగా టీడీపీ అధికారంలోకి రావడంతో ఎస్కేయూలోని వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించాలని టీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కె.హుస్సేన్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎంవీ లక్ష్మయ్యలను గురువారం డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రంలోపు విగ్రహాన్ని తొలగించాలని, లేదంటే రాజీనామా చేసి వెళ్లిపోవాలంటూ అల్టిమేటం జారీ చేశారు. దీంతో హడలిపోయిన వీసీ, రిజిస్ట్రార్ గురువారం సాయంత్రమే హడావుడిగా పాలకమండలి సమావేశాన్ని నిర్వహించారు. పాలక మండలి సభ్యుల్లో సింహభాగం వైఎస్సార్ విగ్రహం తొలగించడానికి సమ్మతించలేదు. అయినప్పటికీ వర్సిటీ ఉన్నతాధికారులు ఏకపక్షంగా శుక్రవారం ఉదయమే విగ్రహాన్ని తొలగించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆ వెంటనే పొక్లెయిన్‌తో విగ్రహాన్ని తొలగించారు. విగ్రహం తీసుకెళ్లాలని దాని ఏర్పాటుకు ఆర్థిక సాయం చేసిన అసోసియేట్ ప్రొఫెసర్లను కోరారు. వారు సమ్మతించలేదు. దీంతో విగ్రహాన్ని తమ తోటలో భద్రంగా పెట్టుకుంటామని ఓ వైఎస్సార్సీపీ నాయకుడు చెప్పడంతో ఆక్కడికి తరలించారు. టీడీపీ బెదిరింపులకు భయపడి, వర్సిటీ ఉన్నతాధికారులు విగ్రహాన్ని తొలగించడం పలు విమర్శలకు తావిచ్చింది.టీడీపీ నేతల వైఖరి అప్రజాస్వామికంఎస్కేయూలో వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడం అప్రజాస్వామికం. గతంలో విగ్రహాల తొలగింపు సంస్కృతి లేదు. విద్యా వ్యవస్థ బలోపేతానికి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో ఎందరో పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకునేందుకు వైఎస్సార్ కృషి చేశారు. ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఎస్కేయూలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు టీడీపీ నేతల ఒత్తిడితో విగ్రహాన్ని తొలగించడం గర్హనీయం. అనంతపురం జేఎన్టీయూలో ఎన్టీఆర్ ఆడిటోరియం నిర్మించి, ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినా వైఎస్సార్సీపీ పాలనలో ఏనాడూ ఆ విగ్రహాన్ని తొలగించే ప్రయత్నం చేయలేదు. ఇందుకు భిన్నంగా టీడీపీ నేతలు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించడం దారుణం. ప్రజలకు మేలు చేసేందుకు ఎన్నికల్లో గెలిపిస్తే, టీడీపీ నేతలు కక్ష సాధింపులకు, అప్రజాస్వామిక చర్యలకు పాల్పడుతున్నారు. ఎస్కేయూలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని యథాస్థానంలో ఏర్పాటు చేయాలి. ఇందుకోసం న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం.– మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రారామిరెడ్డి -
పరిశోధన.. వేదన
హేమలత ఎంబీఏ విభాగంలో ఎగ్జిక్యూటివ్ కోటాలో అడ్మిషన్ పొందడానికి ఎనిమిది నెలల కిందట ఆసక్తి ప్రదర్శించారు. సంబంధిత విభాగం గైడ్ ఆమోదం తెలిపారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేశారు. అయితే అకడమిక్ స్టాండింగ్ కమిటీ ఆమోదం పొందలేదు. కారణమేమిటంటే పది నెలల నుంచి అకడమిక్ స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించలేదు. దీంతో పీహెచ్డీ అడ్మిషన్ పొందని పరిస్థితి నెలకొంది. ఒక్క ఎగ్జిక్యూటివ్ కోటాలోనే కాదు. ఇండస్ట్రీ కోటా.. ఇంటర్నల్ పీహెచ్డీ అడ్మిషన్ల పరిస్థితీ ఇంతే. ఇలా అన్ని కోటాలోనూ పీహెచ్డీ అడ్మిషన్లు జరపని కారణంగా పరిశోధన విద్యార్థులకు దిక్కుతోచని స్థితి నెలకొంది. ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) పీహెచ్డీ అడ్మిషన్లలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. నిర్థిష్టమైన సమయంలో పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించకపోవడంతో ప్రోగ్రామ్ కాల పరిధి ఆలస్యం అనివార్యం కానుంది. పీహెచ్‌డీలో కనీసం మూడు సంవత్సరాలు, గరిష్టంగా ఐదు సంవత్సరాలు కాల వ్యవధి ఉంటుంది. ఈ నేపథ్యంలో అడ్మిషన్లు ఆలస్యం కావడంతో కాలయాపన తప్పనిసరి. జేఎఆర్ఎఫ్ (జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్)కు ఎంపికైన పరిశోధన విద్యార్థులు పీహెచ్డీ అడ్మిషన్ కాకపోవడంతో ఫెలోషిప్ చేజారే పరిస్థితి నెలకొంది. నిర్థిష్టమైన సమయంలో పీహెచ్డీ పూర్తి చేస్తే పోస్ట్‌డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్) ప్రాజెక్ట్ దరఖాస్తుకు ఆలస్యం అయ్యే పరిస్థితి ఉంటుంది. నాణ్యమైన పరిశోధనలే విశ్వవిద్యాలయం గుర్తింపుకు గీటురాయి. ఈ క్రమంలో ఎస్కే యూనివర్సిటీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అయిన పరిశోధనలను విస్మరించడంతో న్యాక్ (నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్) పాయింట్లలోనూ, గ్రేడింగ్‌లోనూ వెనుబాటుతనం తప్పనిసరి పరిస్థితి ఎదురుకానుంది. గతంలో న్యాక్ గ్రేడింగ్‌లో వెనుకబడడంతో రూ.100 కోట్ల రూసా (రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్షా అభియాన్) నిధుల స్థానంలో రూ. 20 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. గైడ్ల కొరతతో సతమతం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో మొత్తం 120 బోధన పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. న్యాయపరమైన చిక్కులు ఏర్పడడంతో భర్తీ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. తాజాగా 70 మంది ప్రొఫెసర్లు ఉన్నారు. ఒక్కో ప్రొఫెసర్‌కు ఐదుగురు ఫుల్‌టైం, ముగ్గురు పార్ట్‌టైం స్కాలర్లను కేటాయిస్తున్నారు. అరకొరగా ప్రొఫెసర్లు ఉన్నప్పటికీ అకడమిక్ స్టాండింగ్ కౌన్సిల్, రీసెర్చ్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు క్రమంగా జరగకపోవడంతో ఆశించిన స్థాయిలో పీహెచ్డీ అడ్మిషన్లు కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు పీహెచ్డీ అడ్మిషన్లకు రీసెర్చ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ను రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తున్నారు. ప్రశ్నపత్రాలు కఠినంగా ఉండడంతో పాటు మైనస్ మార్కుల నిబంధన ఉండడంతో అర్హత సాధించలేని పరిస్థితి నెలకొంది. దీంతో పీహెచ్డీ అడ్మిషన్లు ఆశించిన స్థాయిలో లేవు. కనీసం పార్ట్‌టైం పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించడంలోనూ తాత్సారం చేస్తుండడంతో పరిశోధన పడకేసిందనే వాదన వినిపిస్తోంది. -
డిగ్రీ ప్రశ్నపత్రం లీకేజీ కలకలం!
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటలకు ఐదవ సెమిస్టర్ సబ్జెక్టు అయిన ఇంగ్లిష్ ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కలకలకం రేగింది. నిర్దేశించిన పరీక్ష సమయం కంటే అర గంట ముందు ఆన్లైన్లో ప్రశ్నపత్రాన్ని పంపుతారు. ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ద్వారా ఆయా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాళ్లు అరగంట ముందు ప్రశ్నపత్రాన్ని డౌన్లోడ్ చేసుకుని విద్యార్థులకు అందజేస్తారు. అయితే బుధవారం మధ్యాహ్నం 1:45 ప్రశ్నపత్రం వాట్సప్‌లో హల్చల్ చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. గోరంట్ల, ఓడీ చెరువులోని డిగ్రీ పరీక్షల కేంద్రం నుంచి ప్రశ్నపత్రం లీకైనట్లు ప్రచారం జరుగుతోంది. వాట్సప్‌లో ప్రశ్నపత్రం వచ్చిన సమయాన్ని బట్టి బుధవారం మధ్యాహ్నం ప్రశ్నపత్రం లీకైనట్లు రూఢీ అవుతోంది. పేపర్ లీక్ కాలేదట! నిర్దేశించిన సమయం కంటే అరగంట ముందు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ద్వారా ప్రశ్నపత్రాలను ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మధ్యాహ్నం రెండు గంటలకైతే 1:30 గంటలకే విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి చేరుకుంటారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రం 1:45 నిమిషాలకు బయటకు వచ్చినట్లయితే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు కాదని ఎస్కేయూ ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు పేర్కొన్నారు. గోరంట్ల, ఓడీచెరువులోని డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాలను గురువారం సందర్శించి విచారణ చేపడతామన్నారు. ప్రశ్నపత్రం లీకైనట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. చర్యలు తీసుకోవాలని వినతి ప్రశ్నపత్రం లీక్‌కు కారణమైన డిగ్రీ కళాశాల యాజమాన్యాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. ఈ మేరకు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులుకు బుధవారం వినతిపత్రం అందచేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు డాక్టర్ శ్రీధర్ గౌడ్, కుళ్లాయి స్వామి, వేమన, నరసింహ, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అస్మదీయుడికి అందలం
సాక్షి, అనంతపురం(ఎస్కేయూ) : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఉన్నతాధికారులు అస్మదీయులను అందలం ఎక్కిస్తున్నారు. ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాలతో లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో స్టాటిస్టికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఉద్యోగికి ఇటీవల గ్రేడ్–3 పదోన్నతి కల్పించారు. గ్రేడ్ –3 పదోన్నతి సైతం సీఏఎస్ ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేశారు. సీఏఎస్ (కెరీర్ అడ్వాన్సెమెంట్ స్కీం) ఇంటర్వ్యూలు కేవలం బోధన సిబ్బందికి నిర్వహించాలి. కానీ దేశంలోని ఏ వర్సిటీ కూడా సీఏఎస్ ఇంటర్వ్యూల ద్వారా రీసెర్చ్కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌ను గ్రేడ్–3 కేడర్‌కు ఎంపిక చేయలేదు. కానీ ఎస్కేయూలో మాత్రం అందుకు భిన్నంగా గ్రేడ్–3కి ఎంపిక చేశారు. త్వరలోనే ఇదే సీఏఎస్‌ల ద్వారా గ్రేడ్–4 అంటే అసోసియేట్ ప్రొఫెసర్ హోదాను కల్పించనున్నారు. గ్రేడ్–3 హోదాతో పాటు ఆర్పీఎస్(రివైజ్డ్ పే స్కేలు)ను అమలు చేశారు. దీంతో ఇప్పటికే రూ.16 లక్షలు లబ్ధి చేకూరింది. అర్హత లేని వ్యక్తికి అక్రమంగా పదోన్నతి కల్పించడంతో జీతంతో పాటు అదనంగా రూ.16 లక్షలు అరియర్స్ రూపంలో దండుకున్నారు. లేని అంశాలను జోడించి ఆమోదముద్ర.. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 14 ప్రకారం రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని, సెలెక్షన్ గ్రేడ్–3 వరకు పదోన్నతి కల్పించామని ఎస్కేయూ ఉన్నతాధికారులు పాలకమండలిలో లేని అంశాలను జోడించి చెప్పి ఆమోదముద్ర వేయించుకున్నారు. జీఓలో ఉన్న అంశాలు.. పేర్కొన్న అంశాలు వాస్తవ విరుద్ధాలు. పాలకమండలిని, ప్రభుత్వాన్ని బురిడీ కొట్టించి లక్షలు కాజేశారు. జీఓ –14 ఏం చెబుతుందంటే .... రాష్ట్ర బ్లాక్‌గ్రాంట్ పరిధిలో ఉద్యోగం చేస్తున్న ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో.. వారు యూజీసీ పే స్కేల్ 1996 పరిధిలో ఉంటే .. వారికి గ్రేడ్–3 పదోన్నతి కల్పించవచ్చు. ఆర్పీఎస్ అందించవచ్చు. సీఏఎస్కూ అర్హులే. ఇక ఫ్యాకల్టీలోనూ వెకేషన్, నాన్ వెకేషన్ అని రెండు రకాలున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం పనిచేస్తూ యూజీసీ స్కేల్స్ పొందుతున్న వారు, వేసవి తదితర సెలవులు ఉన్న వారు వెకేషన్ ఫ్యాకల్టీకి కిందకు వస్తారు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో పనిచేస్తున్న వారు నాన్ వెకేషన్ ఫ్యాకల్టీ పరిధిలో ఉంటారు. అయితే రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జీఓ 14 ప్రకారం ఫ్యాకల్టీ ఎలా అవుతారో ఎస్కేయూ ఉన్నతాధికారులకే తెలియాలి. ఫ్యాకల్టీ అనే పదం స్పష్టంగా ఉన్నప్పటికీ నాన్ ఫ్యాకల్టీ ఉద్యోగి అయిన స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు ఎలా గ్రేడ్–3 పదోన్నతి కల్పించారని, సీఏఎస్‌ల ద్వారా ఇంటర్వ్యూలకు ఎలా అర్హత సాధించారో.. ఉన్నతాధికారులు బహిరంగంగా బదులివ్వాలని ఉద్యోగులు, విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఆడిట్ అక్షింతలు సీఏఎస్ ద్వారా గ్రేడ్–3 హోదా పొందేందుకు అనర్హులని... జీఓ 14 ప్రకారం ఫ్యాకల్టీ పరిధిలోకి రీసెర్చ్ కమ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రారని .. స్టేట్ ఆడిట్ అధికారి అక్షింతలు వేశారు. ఆడిట్ అభ్యంతరం తెలపకుండా ..ఆమోదిస్తే తన ఉద్యోగం పోవడం ఖాయమని ..ఫైలును వెనక్కి పంపినట్లు తెలిసింది. జీఓ 14లో ఫ్యాకల్టీ అనే పదానికి రీసెర్చ్ కమ్ స్టాటస్టికల్ ఆఫీసర్ అనర్హుడని.. కరాఖండిగా తేల్చిచెప్పారు. అదే ఆడిట్ అధికారి గత నెలలో పదవీ విరమణ చేశాడు. దీంతో తిరిగి ఆడిట్‌కు ఫైలు పంపారు. ఆడిట్ ఆమోదం పొందితే .. సదరు ఉద్యోగి ఎస్కేయూ కామర్స్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా వచ్చేందుకు అవరోధం తొలిగినట్లే. వాస్తవానికి ఫ్యాకల్టీ కింద పరిగణించబడి.. అర్హత ఉన్న వారిని జీఓ 14 ప్రకారం అనర్హులని చెప్పి ఎలాంటి పదోన్నతి కట్టబెట్టకపోవడం కొసమెరుపు. -
బయటపడ్డ ఎల్లో మీడియా బాగోతం
సాక్షి, అనంతపురం : సచివాలయ ఉద్యోగాల ప్రశ్నాపత్రాలపై అసత్య కథనాలు ప్రసారం చేస్తున్న ఎల్లో మీడియాపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. శ్రీకృష్ణ దేవరాయ వర్సిటీ ఎదుట ఆంధ్రజ్యోతి పత్రికా ప్రతులను దహనం చేసి నిరసన తెలియజేశాయి. ఎస్కే వర్సిటీలో హార్టికల్చర్ పేపర్ రూపొందించారంటూ ఎల్లో మీడియా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఎస్కే వర్సిటీ సిబ్బంది స్పందించింది. తమ వర్సిటీలో హార్టికల్చర్ విభాగం, ప్రొఫెసర్లు లేనప్పుడు పేపర్ ఎలా రూపొందిస్తామని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు అసత్య కథనాలు ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికపై చర్యలు తీసుకోవాలని ఎస్కే వర్సిటీ సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ మాట్లాడుతూ..‘ ప్రశ్నాపత్రం తయారు చేయకపోయినా చేసినట్టు చూపారు. ఎస్కే వర్సిటీలో అసలు సచివాలయ ప్రశ్నా పత్రాలు రూపొందించలేదు. ఉద్యోగాల ప్రక్రియలో మాకు ఎలాంటి బాధ్యతలు అప్పగించలేదు’ అని స్పష్టం చేశారు. ఇక ఆంధ్రజ్యోతి పత్రికపై మండిపడిన విద్యార్థి సంఘాలు.. ఆ పత్రిక ప్రతులను దహనం చేశాయి. ఈ క్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై ఇటుకలపల్లి పోలీసు స్టేషనులో ఫిర్యాదు నమోదైంది. -
విద్యార్థిని బలిగొన్న టిప్పర్
ఎస్కేయూ: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం సమీపంలోని ఇటుకలపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆదివారం రాత్రి రోడ్డు దాటుతున్న ఎంఏ సోషియాలజీ విద్యార్థి బాలకృష్ణ(22)ను టిప్పర్ రూపంలో మృత్యువు కబళించింది. తమ కళ్లెదుటే ఘోరం జరిగిపోవడంతో తోటి విద్యార్థులు తల్లడిల్లిపోయారు. బాధ్యులపై చర్యలు తీసుకుని, విద్యార్థి కుటుంబాన్ని ఆదుకోవాలని సోమవారం ఎస్కేయూ వద్ద జాతీయరహదారిపై బైఠాయించారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగించారు. రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి ఎస్కేయూ వద్ద రోడ్డు వెడల్పు పనులు చేపట్టిన నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ (ఎన్ఎస్సీ) సంస్థ కనీసం సూచిక బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. సూచిక బోర్డుల ఏర్పాటులో తాత్సారం ప్రదర్శించడం వలన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే టిప్పర్ ఢీకొని ఎస్కేయూ విద్యార్థి బాలకృష్ణ దుర్మరణం చెందాడు. ఇందుకు నితిన్‌సాయి కన్స్ట్రక్షన్స్ సంస్థ బాధ్యత వహిస్తూ మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్‌చౌదరికి చెందిన టిప్పర్‌ను వెంటనే అదుపులోకి తీసుకుని డ్రైవర్‌ను అరెస్ట్ చేయాలని నినదించారు. భగ్గుమన్న విద్యార్థులు వందలాదిమంది విద్యార్థులు ఎస్కేయూ ప్రధాన ద్వారం ఎదురుగా ఉన్న ఫ్లైఓవర్‌పై బైఠాయించారు. విద్యార్థి బాలకృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. నాలుగు గంటలపాటు ఆందోళన చేయడంతో జాతీయ రహదారిపై వాహనాలు స్తంభించిపోయాయి. 8 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. చివరకు ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఆందోళనను విరమించారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో శాంతించారు. కార్యక్రమంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ లింగారెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్, కాంతి కిరణ్, అంకే శ్రీనివాసులు, హేమంత్‌కుమార్, ఎంఎస్ఎఫ్ నాయకులు తిరుపాల్, ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు. దామవాండ్లపల్లిలో విషాదం నల్లచెరువు: ‘అయ్యో ఎంత పని చేస్తివి దేవుడా.. కుమారుడిని ఉన్నత స్ధానంలో చూడాలనుకుంటిమే. ఇంతలోనే ఎంతపని చేస్తివయ్యా’ అంటూ బాలకృష్ణ తల్లిదండ్రులు రోదించిన తీరు కలచివేసింది. నల్లచెరువు మండలం దామవాండ్లపల్లికి చెందిన వెంకటరమణ, బయమ్మ దంపతుల చిన్నకుమారుడు బాలకృష్ణ ఆదివారం రాత్రి ఎస్కేయూనివర్సిటీ వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం గ్రామానికి తీసుకురావడంతో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఎస్కేయూ కుంభకోణాలపై కేసు
అనంతపురం, ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలపై హైకోర్టులో కేసు దాఖలు కావడం...న్యాయమూర్తి విచారణకు స్వీకరించడంతో పాటు వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో అక్రమార్కుల్లో వణుకు పుడుతోంది. ఎస్కేయూలో జరిగిన అధికార దుర్వినియోగం, అవినీతిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పిటీషనర్ చేసిన విన్నపాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. ఎస్కేయూలో జరిగిన కుంభకోణాలను ఇప్పటికే ‘సాక్షి’ వరుస కథనాలను ప్రచురించిన సంగతి విధితమే. అవుట్‌సోర్సింగ్‌లో అధికార దుర్వినియోగం ఎస్కేయూలో భర్తీ చేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో నియమ, నిబంధనలను విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 151కి విరుద్ధంగా భర్తీ చేశారని పిటీషనర్ పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదనీ, రోస్టర్ పాయింట్లు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఉద్యోగాల్లో కాకుండా ఇష్టానురీతిగా భర్తీ చేశారనీ, తొలుత పాలకమండలి అనుమతి లేకుండానే నేరుగా ఉద్యోగాలు భర్తీ చేసి, లేబర్ డిపార్ట్మెంట్లో లేని ఏజెన్సీకి కట్టబెట్టారని పిటిషన్లో పేర్కొన్నారు. వాస్తవానికి చెల్లించాల్సిన జీతాలు మొత్తం కంటే అదనంగా ఏజెన్సీ నిర్వాహకుడికి అప్పటి వీసీ ప్రొఫెసర్ కే. రాజగోపాల్, రిజిస్ట్రార్ సుధాకర్ బాబు చెల్లించారనీ, వీరిద్దరిపైన చర్యలు తీసుకోవాలని కోరారు. నిబంధలకు విరుద్ధంగా వెంగమాంబ ఏజెన్సీకి, కార్తికేయ ఏజెన్సీకి లక్షలాది రూపాయలు చెల్లించారనీ, ఈ అంశాలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని పిటీషనర్లు «హైకోర్టు ధర్మాసనానికి గురువారం విన్నవించారు. దీంతో జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాససనం పిటీషనర్లు ఆధారాలతో సహా వివరాలు ఇస్తున్నపుడు.. ఎందుకు చర్యలు తీసుకోలేదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల్లోగా వివరాలతో సహా కౌంటర్ దాఖలు చేయాలన్నారు. పనిచేయకున్నా.. జీతాలు ఎస్కేయూ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే విమర్శలు ఉన్న నేపథ్యంలో విధులు నిర్వహించే విషయంలోనూ విమర్శలు లేకపోలేదు. గార్డెనర్ పేర్లతో ఉద్యోగాలు కల్పించినా... వారు ఎక్కడ విధులు నిర్వహిస్తారో.. ఎంత మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో.. ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. పాలకమండలి కేవలం 69 మందికి మాత్రమే అనుమతి ఇస్తే.. 130 మంది విధులు నిర్వహిస్తున్నట్లు జీతాలు చెల్లిస్తున్నారు. ఉద్యోగులు విధులకు హాజరయినట్లు హాజరుపట్టీ సైతం లేకుండా జీతాలు చెల్లిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు నెలల నుంచీ విన్నపాలు హైకోర్టు మెట్లెక్కిన పిటిషనర్లు..ఎస్కేయూలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీలో అక్రమాలు జరిగాయని గవర్నర్ నుంచి ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ వరకు ఆరు నెలల నుంచి అనేక దఫాలుగా వినతి పత్రాలు అందించారు. అయితే ఎవరూ చర్యలు తీసుకోకపోవడంతో తాజాగా హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. ఎస్కేయూలో ప్రహరీ నిర్మాణంలోనూ అవినీతి జరిగిందనీ, టెండర్లు ఒకరికి దక్కితే...పనులు మరొకరు చేస్తున్నారనీ, కిలో మీటర్ ప్రహరీ నిర్మాణానికి రూ.1.30 కోట్లు ఖర్చు పెడుతురని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దూరవిద్య విభాగంలోనూ విద్యార్థులతో కోట్లాది రూపాయలు ఫీజులు కట్టించుకుని.. పరీక్షలు పెట్టకుండా.. ఆ నిధులను ఇతర పనులకు మళ్లించారని విన్నవించారు. -
అక్రమాలపై కదలిక!
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం సర్దుబాటు చర్యలకు దిగింది. వర్సిటీలో జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అధికార దుర్వినియోగం, పాలనాపరమైన రహస్యాల్లో గోప్యత పాటించకపోవడం, ఉద్యోగ నియామకాల్లో ఏకపక్ష నిర్ణయాలపై ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాల రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే క్రమంలో వర్సిటీలో అక్రమాలపై విద్యార్థి సంఘాలు ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించడం... ఒకే సామాజిక వర్గం వారికి, అస్మదీయులకు లబ్ధి చేకూరే విధంగా వ్యవహరించిన ఎస్కేయూ ఉన్నతాధికారుల వైఖరిపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపైనా అసంతృప్తి చెలరేగుతోంది. ఈనేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రెటరీ సైతం ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కీలకమైన ఉన్నతాధికారి వ్యవహార శైలిపై ఆయన ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పాలకమండలి సభ్యులు సైతం ఉన్నతాధికారుల వైఖరిపై అసంతృప్తిగా ఉన్నారు. వీరు ఇచ్చిన నివేదిక సైతం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిఘా వర్గాల నుంచి సమాచారం ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాల నేపథ్యంలో వర్సిటీ జరిగిన అవినీతి, అక్రమాలపై నిఘా వర్గాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సమాచారాన్ని కోరినట్లు తెలిసింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి అదనపు చెల్లింపులు, అక్రమ నియామకాలు, రాష్ట్ర ప్రభుత్వం ముసుగులో చేసిన అక్రమాలు, అధికార దుర్వినియోగంపై నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారాన్ని సేకరించినట్లు సమాచారం. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఇప్పటికే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌కు ‘సాక్షి’ వరుస కథనాల కటింగ్లను పంపుతున్నారు. దీంతో గవర్నర్ కార్యాలయ వర్గాలుసైతం ప్రత్యేక దృష్టి సారించాయి. వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని త్వరలో దాఖలు చేయనున్నట్లు విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. మృతి చెందిన ఉద్యోగి కుటుంబానికి అన్యాయంపై నిరసన ఎస్కేయూలో పాతికేళ్లు ఉద్యోగం చేసి మరణించిన టైం స్కేలు ఉద్యోగి రామచంద్ర కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం కల్పించాలనే డిమాండ్‌తో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. వీరికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలిచింది. దీంతో వర్సిటీలోని ఉద్యోగులు, విద్యార్థులు వైఎస్సార్సీసీకి దగ్గరయ్యారు. దీనిపై నిఘా వర్గాల ద్వారా సమాచారం పొందిన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించకపోతే చర్యలు తప్పవని అక్షింతలు వేయడంతో.. ఉద్యోగుల దీక్షను బలవంతంగా అణచివేశారు. ఛాన్స్లర్ దృష్టికి తీసుకెళతాం ఎస్కేయూలో అవినీతి, అక్రమాలు, అధికార దుర్వినియోగాన్ని ఛాన్సలర్ దృష్టికి తీసుకెళతాం. అవుట్సోర్సింగ్ ఏజెన్సీ వ్యవహారంలో అక్రమాలు, పరీక్షల విభాగంలో అవకతవకలు, దూరవిద్యలో డీడీల గోల్మాల్, ఇండస్ట్రీ కోటాలో అడ్డుగోలుగా పీహెచ్డీ అడ్మిషన్ల వ్యవహారంపై గవర్నర్‌కు విన్నవిస్తాం. ‘సాక్షి’లో వచ్చిన కథనాల ఆధారంగా.. దర్యాప్తు చేయించి చర్యలు తీసుకోవాలని కోరతాం. – జీవీ లింగారెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఎస్కేయూ విద్యార్థులకు అస్వస్థత
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయరాయ విశ్వవిద్యాలయంలో ఆదివారం కలకలం రేగింది. క్యాంపస్‌లోని మందాకిని, పినాకిని హాస్టళ్లలో మధ్యాహ్నం పలావ్ అన్నం తిన్నారు. కెమిస్ట్రీ, ఫార్మసీ, ఎలక్ట్రానిక్స్ విద్యార్థుల్లో 20 మంది సాయంత్రానికల్లా అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన తలనొప్పి, వాంతులు, విరేచనాలు, జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న వారిని వర్సిటీ అంబులెన్స్ ద్వారా అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. వీరిలో 15 మంది ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని, మిగిలిన ఐదుగురికి వైద్య చికిత్సలు అందిస్తున్నామని డాక్టర్లు పేర్కొన్నారు. బాధిత విద్యార్థులను హాస్టల్ వార్డెన్ ప్రొఫెసర్ జ్యోతివిజయ్‌కుమార్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు కాంత్రికిరణ్, అంకె శ్రీనివాస్, హేమంత్‌కుమార్, ఆవుల రాఘవేంద్రరెడ్డి, వెంకీయాదవ్ తదితరులు పరామర్శించారు. -
అవినీతి కొండ.. వెంగమాంబ
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం యంత్రాంగం అవినీతి ఊబిలో కూరుకుపోయింది. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవంగా చెల్లించాల్సిన జీతాలు కంటే.. అధికంగా చెల్లించి ఏజెన్సీ నిర్వాకుడి మీద అభిమానం చాటుకుంది. వర్సిటీ ప్రధాన ఖాతా నుంచి నిధులు ఏజెన్సీ నిర్వాహకుడి ఖాతాలో అధికంగా జమ చేసింది. ఈ అవినీతి అక్రమాల వ్యవహారాన్ని ప్రొఫెసర్ల కమిటీ నిర్ధారించింది. ఎస్కేయూ: ఎస్కే యూనివర్సిటీలో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న వెంగమాంబ సెక్యూరిటీ సర్వీసెస్‌కు అప్పగించిన విధానం, జీతాలు చెల్లింపు, విధివిధానాలు, నియమ నిబంధనలను పరిశీలించి సమగ్ర దర్యాప్తు చేయడానికి పాలకమండలి ఉప కమిటీని 2017 మార్చి 8న నియమించారు. ఈ ఉపకమిటీలో ప్రొఫెసర్ బి.ఫణీశ్వరరాజు, ప్రొఫెసర్ ఎ.మల్లికార్జునరెడ్డి, ప్రొఫెసర్ జి.శ్రీధర్ (మాజీ రెక్టార్) సభ్యులుగా ఉన్నారు. 2015 ఆగస్టు 10 నుంచి 2016 డిసెంబర్ 31 వరకు వెంగమాంబ ఏజెన్సీకి జమ చేసిన జీత మొత్తాల వివరాలను కమిటీ అధ్యయనం చేసింది. ఏజెన్సీలో పనిచేసే ఉద్యోగుల పీఎఫ్, ఈఎస్ఐ వివరాలు సరైనవేనా అనే అంశంపై కమిటీ ప్రత్యేకంగా లేబర్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఎక్సైజ్ విభాగాలను సందర్శించి మరీ పరిశీలించింది. సమగ్రంగా అధ్యయనం చేసిన కమిటీ అదే ఏడాది మార్చి 18న నివేదిక సమర్పించింది. ఇందులో ప్రధానంగా అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ కింద పనిచేసే ఉద్యోగుల జీతాల క్లెయిమ్ బిల్లులు, కమిటీ సిఫార్సులను పొందుపరిచింది. బోగస్ సంస్థల పేరుతో గోల్మాల్ ఏదైనా ఏజెన్సీ టెండర్ దక్కించుకోవాలంటే కచ్చితంగా కార్మిక శాఖలో పేరు నమోదు చేసుకోవాలి. కానీ వెంగమాంబ ఏజెన్సీ చట్టబద్ధత లేని సంస్థ అని కమిటీ స్పష్టం చేసింది. ఆరు కొటేషన్లను ప్రధానంగా తీసుకుని అందులో ప్రామాణికతలు గల ఏజెన్సీ సంస్థకు అప్పగించాలి. కానీ ఆరు కొటేషన్లు తిరుపతికి చెందిన ఏ మాత్రం చట్టబద్ధత లేని కంపెనీల పేరుతో బురిడీ కొట్టించి ఏజెన్సీ దక్కించుకుందని కమిటీ చివాట్లు పెట్టింది. మొదట 40 మంది ఉద్యోగులు అవసరమని టెండర్ ఖరారు చేసుకుని.. తర్వాత ఉద్యోగుల సంఖ్యను 69కు పెంచారు. జీతాల చెల్లింపుకు సంబంధించి జీఓ 43, జీఓ 151లను పాటించలేదు. ప్రభుత్వ సంస్థలు, వర్సిటీల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీ జీతాల చెల్లింపునకు ఈ జీఓల ప్రకారం తప్పనిసరిగా విధివిధానాలు పాటించాలి. కేవలం అవగాహన ఒప్పందంలో పొందుపరిచిన అంశాల ప్రకారం జీతాల చెల్లింపు అడ్డుగోలుగా జరిగాయని కమిటీ ఏకరువు పెట్టింది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పైగా ఏజెన్సీ నిర్వాహకుడికి భారీగా లబ్ధి చేకూరింది. కమిటీ సిఫార్సులే పట్టించుకోలేదు.. ‘ఏజెన్సీ నిర్వాహకుడి వ్యవహారం అప్పటికే వివాదాస్పదం కావడంతో కమిటీ నివేదిక ఇచ్చే ముందు ఆరు నెలల జీతాలు చెల్లింపు చేయలేదు. దీంతో ఏజెన్సీకి ఇవ్వాల్సిన రూ.30.54 లక్షలు జీతాలు నిలిపివేయండి. వాస్తవానికి ఏజెన్సీకి అవగాహన ఒప్పందం ప్రకారం చెల్లించాల్సిన మొత్తం రూ.75,25,554. కానీ రూ.81,89,278 చెల్లించారు. ఉదారంగా రూ. 6,63,724 అదనంగా చెల్లించారు (కమిటీ నివేదిక ఇచ్చిన కాలం వరకే ). ఇంకా రూ.30.54 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇందులో నుంచి అధికంగా చెల్లించిన రూ. 6,63,724 రికవరీ చేయాలి. అనంతరం తక్కిన మొత్తాన్ని ఏజెన్సీ ద్వారా కాకుండా నేరుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించండి’ అని కమిటీ స్పష్టం చేసింది. కానీ ఒక్క నయాపైసా రికవరీ చేయలేదు. కమిటీ సిఫార్సు చేసినప్పటికీ, నివేదిక సమగ్రంగా ఇచ్చినప్పటికీ, ఏకంగా రూ.30,54,000ను ఏజెన్సీ నిర్వాహకుడికి చెల్లించేసి తమ ఉదారతను చాటుకున్నారు. నివేదికపై పాలకమండలిలో చర్చేదీ? ‘ఉద్యోగికి సంబంధించిన పీఎఫ్ చందాను ప్రతి నెలా ఏజెన్సీ నిర్వాకుడు జమ చేయలేదు. ఏజెన్సీ నిర్వాహకుడు స్వాహా చేసిన పీఎఫ్ మొత్తం రూ.6,82,201, ఈఎస్ఐ చందా కింద ఉద్యోగులకు దక్కాల్సిన మొత్తం రూ.2,70,038. పీఎఫ్, ఈఎస్ఐ మొత్తంతో పాటుగా వర్సిటీ అదనంగా చెల్లించిన రూ.6,63,724ను రికవరీ చేయండి. పీఎఫ్, ఈఎస్ఐ చందాలను ఉద్యోగుల ఖాతాల్లోకి జమ చేయండి. వర్సిటీకి రావాల్సిన అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన రూ.30.54 లక్షల్లో రికవరీ చేయాల’ని ఉప కమిటీ స్పష్టం చేసినప్పటికీ ఖాతరు చేయలేదు. ఇందులో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ నివేదికపై పాలకమండలి సమావేశంలో చర్చించలేదు. నివేదికను తొక్కిపెట్టి మౌనం వహిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెల్లించాల్సిన మొత్తం రూ.30.54 లక్షలు చెల్లించి ఏజెన్సీ నిర్వాకుడి మీద ఒక క్రిమినల్ కేసు పెట్టి చేతులు దులుపుకోవడం కొసమెరుపు. -
మేధావుల నిలయం.. బుర్రలు కలుషితం
నన్ను ఉన్నతాధికారిగా నియమించండి. మన సామాజిక వర్గానికి అండగా నిలుస్తా. మనోళ్ల ఎదుగుదలకు దోహదపడతా. ప్రస్తుత ఉన్నతాధికారి పదవీకాలం ముగుస్తోంది. ఆయన్నే కొనసాగిస్తే మన పనులేవీ కావు. కొత్త వాళ్లు వస్తే మన సామాజిక వర్గం ఉద్యోగులకు మేలు జరగదు. ‘అన్న’కు చెప్పండి.– ఎస్కేయూ ఉన్నతోద్యోగి మెయిళ్ల సారాంశం ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ. మేధావులకు నిలయమైన ఈ ఆలయం కుల పిచ్చితో కలుషితమవుతోంది. విద్యార్థులకు దిశానిర్దేశం చేసే అధ్యాపకులే తప్పుదారి ఎంచుకోవడం చర్చనీయాంశమవుతోంది. నేను.. మనం.. వర్గం.. దిశగా సాగుతున్న వర్సిటీ రాజకీయాలతో యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలుగుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. కులం ప్రాతిపదికన సాగుతున్న అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో వీటన్నింటినీ మౌనంగా భరిస్తున్న యూనివర్సిటీ వాతావరణంఒక్కసారిగా వేడెక్కింది. తాజాగా ఓ ఉన్నతోద్యోగి సాగించిన ‘మెయిల్’ రాయబేరాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ఉన్నత స్థాయి పోస్టును దక్కించుకోవడంలో భాగంగా సాగిన ఈ బాగోతం కాస్తా ఇప్పుడు రచ్చకెక్కింది. యూనివర్సిటీలకు షాడో చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తున్న ‘అన్న’ను రంగంలోకి దింపి.. తద్వారా ఆ ఉన్నతోద్యోగి లబ్ధి పొందడంతో పాటు ఆ సామాజిక వర్గం ఉద్యోగులకు అండగా నిలుస్తున్న తీరు యూనివర్సిటీని కుదిపేస్తోంది. యూనివర్సిటీ పాలనా వ్యవహారాల్లోని రహస్య అంశాలను మెయిల్ చేయడం.. పాలకమండలి మినిట్స్‌ను సైతం చేరవేస్తున్న ఉన్నతోద్యోగి తీరు వివాదాస్పదంగా మారింది. మేధావులకు నిలయమైన విశ్వవిద్యాలయంలో వెలుగులోకి వచ్చిన ఆశ్రిత పక్షపాతం అందరినీ నివ్వెరపరుస్తోంది. ♦ మెయిళ్ల సారాంశం గతంలో ఎస్కేయూ ప్రశ్నపత్రాలను చెన్నైలోని ప్రతిష్టాత్మక ప్రింటింగ్ ప్రెస్‌లో తయారు చేసేవాళ్లు. అయితే ఎస్కేయూ యాజమాన్యం ఉన్నట్లుండి ఆ బాధ్యతలను హైదరాబాద్‌లోని ఓ ప్రెస్‌కు కట్టబెట్టారు. ఇందులో లక్షల్లో లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పాలకమండలిలో జరిగిన చర్చా వివరాలను మీకు మెయిల్ ద్వారా పంపుతున్నాను. పరిశీలించగలరు. హైదరాబాద్ కంపెనీ ఎక్కువ మొత్తం కోట్ చేయడంతో నిధుల దుర్వినియోగం జరిగింది. కానీ ప్రొఫెసర్ల అంతర్గత కమిటీ నిధుల దుర్వినియోగానికి ఆస్కారం లేదని తెలిపింది. అదంతా వాస్తవం కాదు. కంపెనీని మార్చడంతో నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఉంది. ప్రొఫెసర్ల అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదికను మెయిల్‌కు జతపరిచాను.. చూడగలరు. ♦ మొదటి దఫా మెయిల్. ప్రస్తుత ఉన్నతాధికారి పదవీ కాలం ముగిసంది. అలాగే కొనసాగిస్తే వర్సిటీ పాలన గాడి తప్పుతుంది. మన సామాజిక వర్గానికి చెందిన వారికి ఉన్నతాధికారి పదవిని అప్పగిస్తే మొత్తం పాలనంతా మన చేతుల్లోకి వస్తుంది. ఇతర సామాజిక వర్గానికి చెందిన వారిని ఉన్నతాధికారిగా నియమించేందుకు వీసీకి ఎలాంటి అవకాశం కల్పించకూడదు. నా ఆశ.. నా శ్వాస పార్టీని, మన సామాజిక వర్గానికి అండగా నిలిచేందుకే కృషి చేస్తాను. ♦ రెండో మెయిల్ చట్టవిరుద్ధంగా నియమింపబడిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని, హైకోర్టును తప్పుదోవ పట్టించే విధానాలను అవలంబిస్తున్నారు. తరువాత నియామకాలకు ఇవి పెద్ద అవరోధంగా మారాయి. వీళ్ల పద్ధతుల్ని అడ్డుకోవాలి. మన సామాజిక వర్గం, మన పార్టీ బలోపేతం అయ్యేలా తమరు చొరవ చూపించాలి. అందుకు నన్ను ఉన్నతాధికారిగా నియమించేలా సిఫార్సు చేయండి. ♦ ఇదీ మూడో మెయిల్ : రూ.7లక్షల నిధులకు రెక్కలు యూనివర్సిటీలో అసోసియేట్, ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సంబంధించి గతేడాది నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందుకు సంబంధించి ఇంటర్వ్యూల నిర్వహణ, ఇంటర్వ్యూ చేసే నిపుణులకు సంబంధించి టీఏ, డీఏ ఖర్చులకు రూ.7 లక్షలను ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ సూపరింటెండెంట్‌కు అందచేశారు. వాస్తవానికి సెక్షన్ హెడ్ అయిన డిప్యూటీ రిజిస్ట్రార్‌కు ఖర్చు చేసే అధికారాన్ని అప్పగించాలి. కానీ అతను రెండు రోజులు సెలవులో ఉన్న కారణంగా సూపరింటెండెంట్‌కు రూ.7 లక్షల చెక్‌ను అందచేశారు. పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ల పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. దీంతో ఈ మొత్తం చెల్లించాలి. కానీ 8 నెలలు గడుస్తున్నప్పటికీ రూ.7 లక్షలు ఏమయ్యాయో తెలియని పరిస్థితి. యూనివర్సిటీలో చక్రం తిప్పుతున్న సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. -
'కుల'కలం!
ఎస్కేయూ: నియామకాలు.. పదోన్నతులు.. వేతనాల పెంపు.. ఒక్కటేమిటి, ఎస్కేయూలో అడ్డగోలు నిర్ణయాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. ఇదంతా ఒక ఎత్తయితే.. కుల కుంపటి రేపుతున్న చిచ్చు వివాదాలకు కారణమవుతోంది. ఒక సామాజిక వర్గం ఉద్యోగులకే పెద్దపీట వేస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇతర సామాజిక వర్గాల ఉద్యోగులను పక్కనపెడుతూ.. అనుకూలమైన వారిని గుట్టుచప్పుడు కాకుండా అందలం ఎక్కిస్తున్నారు. రెండు నెలల క్రితం దూరవిద్య బీఈడీ విభాగంలో అడ్హాక్ అసోసియేట్ ప్రొఫెసర్‌ను నియామకం పూర్వాపరాలను పరిశీలిస్తే ఉన్నతోద్యోగులు ఎంతగాదిగజారి వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. ఒకే అంశంపై 45 నిమిషాల చర్చ రాయలసీమ వర్సిటీ రిజిస్ట్రార్‌పై భౌతిక దాడికి పాల్పడిన అడ్హాక్ అసోసియేట్ ప్రొఫెసర్‌పై చర్యల విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్కేయూ ప్రొఫెసర్లతో అంతర్గత కమిటీ నియమించి నివేదిక సిద్ధం చేశామని.. అసోసియేట్ ప్రొఫెసర్‌ను వెంటనే సస్పెండ్ చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించారు. వాస్తవానికి అడ్హాక్ అసోసియేట్ ప్రొఫెసర్‌పై చర్యలంటే ఉద్యోగం నుంచి తొలగించాలి. కానీ సస్పెన్షన్‌తో చేతులు దులుపుకోవడం గమనార్హం. ఇంతటితో ఆగలేదు.. రెండు నెలలు తిరక్కుండానే తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పెద్ద ఎత్తున పైరవీలు మొదలుపెట్టారు. గత నెల 31న నిర్వహించిన పాలకమండలి సమావేశం రెండు గంటల పాటు సాగితే.. 45 నిముషాలు అసోసియేట్ ప్రొఫెసర్‌ను ఎందుకు తిరిగి ఉద్యోగంలోకి తీసుకోకూడదనే విషయంపైనే కావడం గమనార్హం. అడ్డగోలు నిర్ణయాలు ♦ ఎస్కేయూ ఇంజినీరింగ్ విభాగంలో ఓ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగికి అడ్డగోలుగా పదోన్నతి కల్పించారు. అసిస్టెంట్ ఇంజినీర్‌గా పదోన్నతి కల్పించాలంటే తప్పనిసరిగా డిప్లమో/ఇంజినీరింగ్ చదివి ఉండాలి. కానీ ఐటీఐ పూర్తి చేసిన ఉద్యోగికి ఏకంగా అసిస్టెంట్ ఇంజినీర్‌గా పదోన్నతి కట్టబెట్టారు. వాస్తవానికి ఇతని నియామకమే రోస్టర్ పాయింట్‌కు విరుద్ధం కావడం గమనార్హం. ♦ అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారికి ఏకంగా అసోసియేట్ ప్రొఫెసర్ హోదా కల్పించారు. వాస్తవానికి బోధన సిబ్బందికి మినహా తక్కిన వారికి అడ్వాన్సెమెంట్ స్కీం(సీఏఎస్) ద్వారా పదోన్నతి కల్పించరాదు. అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారి స్థాయి నుంచి మూడింతల హోదాతో సమానమైన అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయి కట్టబెట్టారు. జీతభత్యాలు అదే తరహాలో అందేలా ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నారు. సీఏఎస్ ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకోకపోతే.. అదే రోజే దరఖాస్తు చేసుకోమని కబురు పెట్టారు. దీంతో ఇంటర్వ్యూలో ఏమీ చెప్పకపోయినా.. అర్హత కల్పించారు. ఇదే తరహాలోనే మరో ఇద్దరు అధికారులు లైబ్రరీలో ఉన్నారు. కానీ వారికి ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడం గమనార్హం. కనీసం సీఏఎస్కు దరఖాస్తు చేసుకోనివ్వకపోగా.. ఇంక్రిమెంట్లు ఇవ్వలేదు. కారణం వీరు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కాకపోవడమేననే తెలుస్తోంది. పట్టని టీచింగ్ అసిస్టెంట్ల వేదన తమను విధుల్లోకి తీసుకోవాలని గత 20 రోజులుగా టీచింగ్ అసిస్టెంట్లు దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఉద్యోగం ఇస్తారా? లేదా అనే విషయం పక్కనబెడితే.. దీక్షలో స్పృహ కోల్పోయి అస్వస్థతకు లోనైన ఓ మహిళ టీచింగ్ అసిస్టెంట్‌ను కనీసం ఉన్నతాధికారులు పరామర్శించిన పాపాన పోలేదు. ఓ సామాజిక వర్గం ఉద్యోగులకు లేని అధికారాలను కట్టబెడుతున్న ఉన్నతోద్యోగులు.. ఇలాంటి చిరుద్యోగుల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. విచారణ చేపడతాం దూరవద్య అసోసియేట్ ప్రొఫెసర్ రత్నప్ప చౌదరి నియామకంపై విచారణ చేపడతాం. రాయలసీమ యూనివర్సిటీలో రిజిస్ట్రార్‌పై దాడికి సంబంధించి కేసు పత్రాలను పరిశీలించి తదుపరి చర్యలు చేపడతాం. రెండవ దఫా ప్రొఫెసర్ల కమిటీని నియమిస్తాం.– ఎంసీఎస్ శుభ, ఇన్చార్జి వీసీ, ఎస్కేయూ -
నా కన్నీళ్ళే నా సాహిత్యం..!
ఎస్.కె. యూనివర్సిటీ తెలుగు విభాగంలో 1983–85 మధ్య పాఠాలు చెప్పిన ప్రొఫెసర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్టులో నిష్ణాతులు. వీరిలో నాకు అత్యంత ఇష్టమైన వాళ్లలో ఒకరు రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి, మరొకరు కొలకలూరి ఇనాక్ సార్లు. రచనా పథంలో ఇద్దరివీ రెండు వేర్వేరు దార్లు. కానీ వీరిద్దరూ సమాజ రచయితలు. అభ్యుదయ రహదార్లు. మా ఇనాక్సారు మాట్లాడుతుంటే ఆధునిక వచన కావ్యాన్ని వింటున్నట్లుగా ఉండేది. ఆయన వచనం అద్భుతం. ఆయన రాసినా, మాట్లాడినా, చదివినా ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఆయన పాఠం చెబుతున్నప్పుడు ధారాళంగా వచనాన్ని ప్రయోగించి పిల్లల్ని సమ్మోహనులుగా చేసేవారు. ‘మునివాహనుడు’ అన్న నాటకం దగ్గర్నుంచి ‘ఊరబావి’ క«థల వరకు ఆయన రచనలు జీవితం నుంచి వచ్చినవి. అట్టడుగు కులాలపై, అందునా కింది కులాలైన మాల, మాదిగల పట్ల అగ్రవర్ణ దురహంకారాలు, అంటరానితనాలు, అవమానాలు, ఆధిపత్యాలు, వెలివేతల నుంచి, వెలివాడల నుంచి నడుచుకుంటూ తెలుగు సాహిత్య విశ్వపీఠం మీదకు వచ్చారు. అట్టడుగు వర్గాల జీవితం ఎన్ని బాధలు పెడు తుందో ఆ బాధలన్నింటిని అనుభవించి కొలకలూరి ఒక క«థగా, కవి తగా, పద్యంగా, పాటగా, నాటకంగా రచనలయ్యారు. అగ్రవర్ణ ఆధిపత్యంపై కొలకలూరి ఎక్కుపెట్టిన సాహిత్య మహాస్త్రమే ‘ఊరబావి’. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్‌గా ఎంతో కాలం పనిచేశారు. తిరుపతి ఎస్.వి.యూనివర్సిటీ వీసీగా పనిచేశారు. కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ లాంటివి ఎన్నో అవార్డులు పొందారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో దళిత బహుజన ప్రతిఘటనకు సంబంధించిన తొలి సాహిత్య ఆనవాళ్లు ఇనాక్ సాహిత్యంలో ఉన్నాయి. అప్పటి వరకు వచ్చిన సాహిత్యంలో దళిత జీవిత చిత్రణ మాత్రమే చేశారు. ‘ఊరబావి’ కథలో దళిత ప్రతిఘటనను చెప్పిన తొలిదళిత సాహితీవేత్త ఇనాక్. ‘ఊరబావి’ క«థలన్నీ ప్రతిఘటనా ప్రతి రూపాలుగా నిలుస్తాయి. ఆ ప్రతిఘటనాస్వరాన్ని తర్వాత దళిత సాహిత్యం అందిపుచ్చుకుంది. ఇనాక్ 1954లో ‘ఉత్తరం’ అన్న దళిత కథతో రచనా రంగంలోకి ప్రవేశించారు. 1969లో ‘ఊరబావి’ క«థలు రాశారు. ‘నా కన్నీళ్లే నా సాహిత్యం’ అని చెప్పుకున్న ఇనాక్ ‘ఈ సమాజం భయం పునాదిపై నిర్మించబడింది. దీన్ని కూల్చివేసి భయంలేని సమాజాన్ని నిర్మించుకోవాలి’ అని చెబుతారు. ఇప్పటికి ఇనాక్ 96 పుస్తకాలు, 300 క«థలు రాశారు. దళితులు, గిరిజనులు, బహుజనులు, ముస్లిం మైనార్టీలు, సమాజంలో సగభాగమైన మహిళల చుట్టూతా ఇనాక్ రచనలు నిండి ఉంటాయి. ఈయన రచనల్లో ఆధిపత్య శక్తులపై నేరుగా దాడులు చేసినట్లుగా ఉండదు. బహుజనుల విజయం కోరతాడు. వీళ్లు గెలవాలంటారు. ఇనాక్ ఏ రచనలో కూడా పీడిత వర్గాలు ఓడిపోవటం చెప్పడు. దళిత, బహుజన, గిరిజన, మైనార్టీలు ఓటమిలో కూడా తలెత్తుకొని తిరుగగలిగే ధైర్యాన్నిస్తూ సాహిత్యసృష్టి చేశారు. 64 ఏళ్ల క్రితం తొలికథ ‘ఉత్తరం’లో ఇనాక్ కన్నీళ్లతో సమాజాన్ని చూశారు. ఇపుడు ఆ కన్నీళ్లు ఆరి పోయి చూసే క్రొత్త సమాజం రాబోతుంది. ఇపుడు దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ, మహిళా సాహిత్యంలో ఒక్క ఇనాక్ లేడు. వందల మంది ఇనాక్లున్నారు. ఇది పెద్దమార్పు. ఇనాక్ ఆధునిక ఆది దళిత బహుజన ప్రతిఘటనా స్వరం. ఆయన బహుజన పక్షంవైపు స్పష్టంగా నిలబడి సాహిత్య విమర్శచేశారు. కథలు రాశారు. కవిత్వం రాశారు. తన కన్నీళ్లనే తన కావ్యాలుగా ఆవిష్కరించిన దళిత బహుజన సాహిత్యశిఖరం కొలకలూరి ఇనాక్. ఇనాక్సారూ, నువ్వు నూరేళ్లూ జీవించూ.. (కొలకలూరి ఇనాక్ 80వ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లోని త్యాగరాయగానసభలో ఈ నెల 6 నుంచి 12 వరకు రోజూ సాయంత్రం 6 గంటలకు సాహితీ సప్తాహం సందర్భంగా) జూలూరు గౌరీశంకర్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ‘ 94401 69896 -
ఆర్యూ పీజీ సెట్ ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం
సాక్షి, కర్నూలు(గాయత్రి ఎస్టేట్) : రాయలసీమ యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ సోమవారం ఆర్యూ లైబ్రరీ హాల్లో ప్రారంభమైంది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి.అమర్నాథ్ ప్రక్రియను ప్రారంభించారు. వర్సిటీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీనివాసరావు పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధ్రువపత్రాల పరిశీలన ప్రశాంతంగా సాగింది. అనంతపురం ఎస్కేయూ పరిధిలో డిగ్రీ చదివి ఆర్యూ పీజీ సీట్ రాసి మంచి ర్యాంకులు వచ్చిన విద్యార్థులకు నిరాసే మిగిలింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో విద్యార్థులు డిగ్రీ ధ్రువపత్రాలను తెచ్చుకో లేకపోయారు. మంచి ర్యాంకులు తెచ్చుకున్న ఐదుగురు విద్యార్థులు నిరాశతో వెనుదిరిగారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ సబ్జెక్టుకు 22, బాటనీ సబ్జెక్టుకు 117, కంప్యూటర్ సైన్స్‌కు 113, బయోటెక్నాలజీ సబ్జెక్టుకు 19 మంది మొత్తం 271 మంది విద్యార్థుల ధ్రువపత్రాలను పరిశీలించామని పీజీ సెట్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయకుమార్ పేర్కొన్నారు. ఎంఈడీ కోర్సు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీని మార్చినట్లు పేర్కొన్నారు. జూలై 31వ తేదీ ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరిశీలించడం జరుగుతుందన్నారు. వెబ్ఆప్షన్లు ఆగస్టు 1వ తేదీన ఇచ్చుకోవచ్చన్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటలకు కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, మధ్యాహ్నం 1.30 గంటలకు ఇంగ్లిష్, ఓఆర్ అండ్ ఎస్‌క్యూసీ సబ్జెక్టులకు సంబంధించి అన్ని కేటగిరీల వారు 1 నుంచి చివరి ర్యాంకు వరకు హాజరు కావాలన్నారు. అవకాశం కల్పించండి ఆర్యూ పీజీసెట్ కౌన్సె లింగ్‌కు అవకాశం కల్పించాలి. మాది ప్యాపిలి మండలం నల్లమేకల పల్లి గ్రామం. యాడికి వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదివాను. నాకు ఆర్యూ పీజీసెట్‌లో 27వ ర్యాంకు వచ్చింది. ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విడుదల చేయక పోవటంతో నాకు ఆర్‌యూలో పీజీ చేరే అవకాశం లేకుండా పోతోంది. వర్సిటీ అధికారులు స్పందించి అవకాశం కల్పించి ఉన్నత విద్య చదువుకోడానికి అవకాశం ఇవ్వాలి. – వెంకటకృష్ణారెడ్డి, ఫిజిక్స్ 27వ ర్యాంకు -
ఎస్కేయూ వీసీ ఎవరో?
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 11వ ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) నియామక ప్రక్రియ ప్రారంభమైంది. ఉపకులపతి పదవికి అర్హులైన వారిని ఎంపిక చేయడానికి ముగ్గురు సభ్యులతో అన్వేషణ కమిటీ (సెర్చ్ కమిటీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 11న నియామకం చేస్తూ జీఓ జారీ చేసింది. కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం తరపున నామినీగా ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ ఆదిత్యనాథ్ దాస్, ఎస్కేయూ పాలకమండలి తరఫు నామినీగా ప్రొఫెసర్ పి.జార్జ్ విక్టర్ (మాజీ ఉపకులపతి, ఆదికవి నన్నయ్య వర్సిటీ, రాజమహేంద్రవరం), యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తరఫు నామినీగా ప్రొఫెసర్ హెచ్‌సీఎస్ రాథోర్ (సెంట్రల్ వర్సిటీ ఆఫ్ సౌత్ బిహార్, పాట్నా, బిహార్) సభ్యులుగా ఉన్నారు. కమిటీ సభ్యులు జూన్ ఐదో తేదీన విజయవాడలో సమావేశమై ఒక్కొక్కరు ఒక్కో పేరు ప్రతిపాదిస్తారు. ఇందులో నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు గవర్నర్ /ఛాన్సలర్ ఉపకులపతిగా నియమిస్తారు. ఎస్కేయూ పదో ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ పదవి గడువు జూన్ 22తో ముగియనుంది. అయితే ఆయన రెండు నెలల ముందుగానే పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వం ఏప్రిల్ 25న ఉపకులపతి రాజీనామాను ఆలస్యంగా ఆమోదించింది. ఇన్చార్జ్ ఉపకులపతిగా ప్రొఫెసర్ ఎంసీఎస్ శుభను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. జూన్ 22లోపే కొత్త ఉపకులపతిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలు ఎన్నికల నేపథ్యంలో ఆరు నెలల ముందు ఎలాంటి నియామకాలూ చేపట్టకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ఉపకులపతి పదవులు ఖాళీ అయిన అన్ని వర్సిటీలకు నియమించాలని ప్రభుత్వం భావించింది. ఎవరిని వరించెనో..? ఎస్కేయూ వీసీ పదవికి 148 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 23 మంది ఎస్కేయూ ప్రొఫెసర్లు ఉన్నారు. వాస్తవంగా పదేళ్లు ప్రొఫెసర్‌గా పనిచేసిన అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలి. కానీ ఔట్‌స్టాండింగ్ కింద పదేళ్ల అనుభవం లేని వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చునని నిబంధన విధించడంతో ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్‌బాబు దరఖాస్తు చేసుకున్నారు. పదో ఉపకులపతిగా ఉన్న రాజగోపాల్ ఓపెన్ కేటగిరికి చెందిన వారు. దీంతో తాజాగా బీసీ, ఎస్సీ,ఎస్టీ కేటగిరి వారికి అవకాశం కల్పించనున్నారు. బీసీ కేటగిరి వారికి అవకాశం కల్పిస్తే ప్రస్తుతం ఇన్చార్జ్ ఉపకులపతిగా ఉన్న ఆచార్య ఎంసీఎస్ శుభ పేరును పరిశీలించే అవకాశం ఉంది. ఎస్కేయూ ఉపకులపతి పదవి ఎలాగైనా సాధించాలనే ప్రయత్నంలో జేఎన్టీయూ అనంతపురం ప్రొఫెసర్లు కూడా తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిడి తీసుకవస్తున్నారు. ఆశావహులు ఎవరి స్థాయిలో వారు పైరవీలు మొదలుపెట్టారు. ప్రభుత్వం మాది అని చెప్పుకునే సామాజిక వర్గం వారు ఈ దఫా అయినా తమ వారికి ఉపకులపతి పదవి దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు. సొంత యూనివర్సిటీ ప్రొఫెసర్లకు ఉపకులపతి పదవి ఇవ్వకూడదనే నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల నుంచి పాటిస్తోంది. దీంతో ఇతర వర్సిటీ ప్రొఫెసర్లకే ఉపకులపతి పదవి వరించనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. -
కరువు సీమకు కల్పతరువు..
సాక్షి, అనంతపురం : ప్రతిష్టాత్మక సెంట్రల్ యూనివర్శిటీ జిల్లాలో ప్రారంభం కానుంది. యూనివర్శిటీ ఏర్పాటుకు కేంద్రం నుంచి నిధులు మంజూరయ్యాయని, ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభిస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శాశ్వత భవనాలను నిర్మించేంత వరకు తరగతులను తాత్కాలికంగా ఎస్కేయూ, జెఎన్‌టియూ క్యాంపస్‌లో నిర్వహిస్తామని తెలిపారు. గత విద్యాసంవత్సరం నుంచే సెంట్రల్ యూనివర్శిటీ తరగతులు ప్రారంభించాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ కార్యరూపం దాల్చలేదు. తరగతుల నిర్వహణకు సరైన స్థలాన్ని గుర్తించాలని కమీషనర్ పాండాదాస్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఉన్నతాధికారులతో చర్చించి విధివిధానాలు ఖరారు చేయాలని సూచించారు. దేశంలోని సెంట్రల్ యూనివర్శిటీలకు ఏ మాత్రం తీసిపోని విధంగా యూనివర్శిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే జిల్లాలో సంప్రదాయ కోర్సులు నిర్వహిస్తున్న శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, సాంకేతిక విద్యను అందిస్తున్న జెఎన్‌టియూ ఉన్నాయి. సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటుతో జిల్లాలో మూడు యూనివర్శిటీలు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేయనున్నాయి. కురువు సీమను విద్యా సీమగా చూడాలన్నదే మా లక్ష్యమని మంత్రి తెలిపారు. -
ఎస్కేయూలో ఐదుగురిపై వేటు
ఎస్కేయూ: ఎస్కేయూ డిగ్రీ ఫలితాల తప్పిదాలపై ప్రొఫెసర్ల కమిటీతో సమగ్ర దర్యాప్తును ఆదేశించినట్లు వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన ప్రొఫెసర్ల కమిటీ ప్రాథమిక నివేదిక ఆధారంగా తొలి దశలో పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు. సాప్ట్వేర్ కరెప్ట్ కావడంతో తప్పిదాలకు ఆస్కారం ఏర్పడిందని, త్వరలో ఆటోమోటీవ్ సాప్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కమిటీ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత తుది ఫలితాలను ప్రకటిస్తామన్నారు. అనంతరం ఎవరికైనా అనుమానాలు ఉంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్‌కు ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా అనుమతిస్తామన్నారు. ఉద్యోగుల పెన్‌డౌన్ డిగ్రీ ఫలితాల్లో తప్పిదాలకు బాధ్యుల్ని చేస్తూ ఐదుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేయడం పెద్ద దుమారానికి దారి తీసింది. తప్పు చేసిన వారిని వదిలిపెట్టి.. ఏ తప్పూ చేయని తమపై చర్యలు ఎలా తీసుకుంటా రంటూ సస్పెండ్ అయిన ఉద్యోగులు వాపోయారు. వారికి సంఘీభావంగా పరీక్షల విభాగం ఎదుట ఉద్యోగులందరూ ఆందోళనలకు దిగారు. మొదట కంప్యూటర్లో నమోదు చేసి, ఫలితాలు విడుదల చేసిన తర్వాత ట్యాబులేషన్‌లో మార్కులు నమోదు చేశారని ఉద్యోగులు వివరించారు. ఫలితంగా తప్పిదాలకు ఆస్కారం ఏర్పడిందన్నారు. ట్యాబులేషన్‌పై తమ సంతకాలు లేవని పరీక్షల విభాగం ఉద్యోగులు స్పష్టంచేశారు. నిరసన తెలుపుతున్న ఉద్యోగులతో దర్యాప్తు కమిటీ ఛైర్మెన్ ప్రొఫెసర్ రెడ్డి వెంకటరాజు చర్చలు జరిపారు. విద్యార్థుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పెన్‌డౌన్‌ని విరమించుకోవాలని సూచించారు. వర్సిటీ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొనడంతో ఉద్యోగులు ఆందోళన విరమించారు. -
పరీక్ష రాసినా ఫలితంలేదు!
ఎస్కేయూ :శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విడుదల చేసినా ఫలితంలేకపోతోంది. విద్యార్థులకు తప్పుల తడకన మార్కులు వస్తున్నాయి. కాలం చెల్లిన సాఫ్ట్‌వేర్‌తో సమస్య వస్తోంది. ఫలితాలు విడుదలైనప్పుడు పాస్ అయిన విద్యార్థులు ఫెయిల్ అని, ఫెయిల్ అయిన వారు పాస్ అయినట్లు వస్తోంది. గైర్హాజరైన వారు సైతం ఏకంగా ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాలుగేళ్లుగా ఇదే తంతు.. ఈ ఏడాది 40 వేల మంది సెమిస్టర్ ఫరీక్షలు రాశారు. ఇందులో అధికశాతం విద్యార్థుల మార్కులు జంబ్లింగ్ అయ్యాయి. ఏటా ఇలానే జరుగుతున్నా సమస్య పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశీలించకుండానే ఫలితాలు విడుదల : డిగ్రీ 5వ సెమిస్టర్లో మార్కుల నమోదులో తప్పిదాలు చోటు చేసుకోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న వర్సిటీ యాజమాన్యం ముగ్గురు ప్రొఫెసర్లతో కూడిన కమిటీని సమగ్ర దర్యాప్తునకు నియమించింది. ప్రొఫెసర్ రెడ్డి వెంకటరాజు కన్వీనర్‌గా ఉన్న కమిటీలో ప్రొఫెసర్ ఏవీ రమణ, ప్రొఫెసర్ చింతా సుధాకర్ సభ్యులుగా ఉన్నారు. కమిటీ సమగ్ర దర్యాప్తు ప్రారంభించింది. ఫలితాల్లో వ్యత్యాసం : అవార్డు షీట్ (ఎగ్జామినర్ వేసిన మార్కులు) ఆధారంగా చెక్‌లిస్ట్‌లో మార్కులు పొందుపరుస్తారు. చెక్‌లిస్ట్‌లోని మార్కుల ఆధారంగా ట్యాబులేషన్‌లో మార్కులు నమోదవుతాయి. అనంతరం మార్క్స్‌కార్డులు ప్రింట్ అవుతాయి. చెక్‌లిస్ట్‌లో ఉన్న మార్కులకు ట్యాబులేషన్‌లో నమోదైన మార్కులకు వ్యత్యాసం అధికంగా ఉంది. మూడో సబ్జెక్టులో నమోదైన మార్కులు తక్కిన అన్ని సబ్జెక్టులకూ యథాతథంగా పునరావృతమయ్యాయి. ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయితే తక్కిన అన్ని సబ్జెక్టుల్లోనూ ఫెయిల్ అయినట్లే. ఈ విధంగా మార్కులు నమోదు అయినట్లు కమిటీ నిర్ధారణకు వచ్చింది. వాస్తవానికి ఫలితాలు విడుదలకు ముందు చెక్‌లిస్ట్‌లోని మార్కులు, ట్యాబులేషన్‌లోని మార్కులను పరిశీలించిన తర్వాత ఫలితాలు విడుదల చేయాలి. కాలం చెల్లిన సాప్ట్వేర్ : 2015లో సెమిస్టర్ విధానం అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇదే పరిస్థితి తలెత్తుతోంది. మార్కుల నమోదు వినియోగిస్తున్న సాఫ్ట్వేర్ కాలం చెల్లింది. అయినా దాన్నే వాడుతున్నారు. గతంలో ఏడాది పరీక్షలు కాబట్టి..తక్కువ డేటాబేస్ సరిపోయేది. ప్రస్తుతం సెమిస్టర్ విధానం కొనసాగుతోంది. అయినా వర్సిటీ సాఫ్ట్వేర్ సామర్థ్యాన్ని పెంచలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డిజిటలైజేషన్ విధానంలో పరీక్షల విభాగంలో పూర్తిగా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందనే భావన వ్యక్తమవుతోంది. రెండు సార్లు ఫలితాలువిడుదల చేసినా... డిగ్రీ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. విద్యార్థులందరూ ఫలితాలు చూసుకున్నారు. ఫలితాలు తప్పులతడక వచ్చాయని ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం తిరిగి ఫలితాలు విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన ఫలితాలు పరీక్షలకు గైర్హాజరయిన వారు సైతం ఉత్తీర్ణత చెందినట్లు వచ్చింది. దీంతో సమస్య మొదటికొచ్చింది. కమిటీ అవార్డు షీట్‌లోని ప్రతి విద్యార్థీ మార్కులను పరిశీలిస్తోంది. వారం రోజుల్లో మొత్తం అన్నీ మార్కులను పరిశీలించి.. తుది ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
ఉదయం పాస్.. సాయంత్రానికి ఫెయిల్
కదిరి: ఎస్కేయూ డిగ్రీ ఫలితాలు విద్యార్థులను అయోమయంలో పడేశాయి. సోమవారం డిగ్రీ చివరి సంవత్సరం ఫలితాలు విడుదల కాగా ఉదయం ఉత్తీర్ణులైనట్లు చూపించిన ఫలితాలు... సాయంత్రంలోపు మారిపోయి ఫెయిల్ అయినట్లు చూపించాయి. ఇందుకు నిరసనగా డిగ్రీ విద్యార్థులు స్థానిక వేమారెడ్డి కూడిలి సమీపంలో కదిరి–హిందూపురం రహదారిపై రాత్రి సమయంలో గంటపాటు బైఠాయించారు. అదే సమయంలో అశోక్, అజయ్, ప్రతీష్, రవితేజ, త్యాగి, శ్రీకాంత్ అనే ఐదురుగు డిగ్రీ విద్యార్థులు అక్కడే సమీపంలోని సెల్ టవర్ ఎక్కి దూకేస్తామంటూ గట్టిగా కేకలు వేశారు. విద్యార్థులు రాస్తారోకోతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పట్టణ ఎస్ఐ హేమంత్ కుమార్ సంఘటనా స్థలానికి వచ్చి విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. అక్కడి నుంచి టవర్ దగ్గరకు చేరుకుని టవర్‌పైకి ఎక్కిన విద్యార్థులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి వారు దిగేలా చేశారు. -
సెల్‌ఫోన్ సర్వీసింగ్ లో ఉచిత శిక్షణ
ఎస్కేయూ: రూడ్సెట్ సంస్థలో అక్టోబర్ 4 నుంచి సెల్‌ఫోన్ సర్వీసింగ్, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ పి.వెంకటరమణ ఓ ప్రటకనలో తెలిపారు. 10 వ తరగతి ఆపైన విద్యార్హత ఉన్న వారు శిక్షణకు అర్హులన్నారు. శిక్షణాకాలంలో ఉచిత వసతితో పాటు భోజనం అందిస్తామన్నారు. ఆసక్తి గలవారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హామీ కార్డు, 4 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకురావాలన్నారు. పూర్తి వివరాలకు 08554–255925 నెంబర్‌కు సంప్రదించాలన్నారు. -
ముగిసిన గ్రూప్–బీ పోటీలు
అనంతపురం సప్తగిరిసర్కిల్: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల గ్రూప్–బీ క్రీడా పోటీలు శుక్రవారంతో ముగిశాయి. రెండు రోజులుగా స్థానిక ఎస్ఎస్బీఎన్ ఇండోర్ స్టేడియం, ఎస్కేయూ క్రీడా మైదానంలో నిర్వహించిన పోటీల్లో యూనివర్శిటీ పరిధిలోని క్రీడా జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా స్థానిక కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమానికి ఎస్కేయూ స్పోర్ట్స్ బోర్డు సెక్రెటరీ జెస్సీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడల ద్వారా ఉన్నతస్థాయికి చేరుకోవచ్చన్నారు. జయాపజయాలను సమానంగా తీసుకోవాలని సూచించారు. అనంతరం విజేత జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాగత్రిశూలపాణి, పీడీలు చంద్రమోహన్, ప్రసాద్, శ్రీరాం, జబీవుల్లా, హేమంత్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. విజేతలు బ్యాడ్మింటన్: విన్నర్స్–ఎస్ఎస్బీఎన్, రన్నర్స్–ఎస్కేయూ ఫుట్‌బాల్: విన్నర్స్–ఆర్ట్స్ కళాశాల, రన్నర్స్–రైపర్ కళాశాల బాస్కెట్‌బాల్: విన్నర్స్–ఆర్ట్స్ కళాశాల, రన్నర్స్–ఎస్ఎస్బీఎన్. -
నేటి నుంచి ఎస్కేయూ క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరిసర్కిల్: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల గ్రూప్(బి) క్రీడా పోటీలు అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎస్కేయూ రిజిస్ట్రార్ సుధాకర్‌బాబు హాజరుకానున్నారని అన్నారు. -
ఏడేళ్లుగా మూతపడిన ‘స్కియాడ్’
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు స్థానికంగా లభించని శిక్షణ - అప్పులు చేసి వేలాది రూపాయలు వెచ్చిస్తున్న వైనం ఎస్కేయూ: అనంతపురంలోని బీసీ స్టడీ సర్కిల్ పక్కనే ఏర్పాటు చేసిన స్కియాడ్ (శ్రీకృష్ణదేవరాయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అకడమిక్ డెవలప్మెంట్ సెంటర్) ఏడేళ్లుగా మూతపడే ఉంది. గ్రూప్ - 1, 2 డీఎస్సీ, బ్యాంక్ ఉద్యోగాలు లాంటి పోటీ పరీక్షలకు సంబంధించి శిక్షణ తీసుకోవాలంటే వేలాది రూపాయలు చెల్లించాల్సి వస్తుండటంతో కరువు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్లకు ఉపశమనం కలిగించే ఉద్దేశ్యంతో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ఎస్సీ, ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ, వృత్త్యంతర శిక్షణతోపాటు వసతి కల్పించడం, మెటీరియల్ అందించడం తదితర సదుపాయాలను ఈ సెంటర్ ద్వారా కల్పిస్తూ వచ్చారు. దీని నిర్వహణకు అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తూ వచ్చింది. పర్యవేక్షణ బాధ్యతలను మాత్రం ఎస్కేయూకు అప్పగించి వర్సిటీ ప్రొఫెసర్‌ను స్కియాడ్ కో-ఆర్డినేటర్‌గా నియమించారు. మొదట్లో ఇది మంచి సేవలు అందించింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో ఏడేళ్ల నుంచి దీనిని మూసేశారు. ఫలితంగా పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు వేలాది రూపాయలు అప్పులు చేసి హైదరాబాద్, విశాఖపట్టణం నగరాలకు వెళ్లి శిక్షణ తీసుకోవాల్సి వస్తోంది. స్కియాడ్ కో-ఆర్డినేటర్లు, ఎస్కేయూ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వడంలో విఫలం కావడం వల్లే నిధులు మంజూరు కాలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. కమిటీ నివేదికతోనైనా మోక్షం వచ్చేనా? స్కియాడ్ స్థితిగతులపై నివేదిక సమర్పించేందుకు ఎస్కేయూ పాలకమండలి సభ్యుడు డాక్టర్ ఎం.బాబు అధ్యక్షతన ఈ ఏడాది ఓ కమిటీని నియమించారు. ఇందులో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంవీ లక్ష్మయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రభాకర్ సభ్యులుగా ఉన్నారు. నిధుల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, భవనాలు ఆధునికీకరించాలని, సిబ్బందిని నియమించాలని పలు సిఫార్సులు, సూచనలు చేస్తూ కమిటీ నివేదిక తయారు చేసింది. రెండు వారాల కిందట దానిని వర్సిటీ ఉన్నతాధికారులకు అందించింది. -
‘ఔట్’ సోర్సింగ్!
– డిపాజిట్లు , పీఎఫ్ నష్టపోయిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు – వర్సిటీ చెల్లింపులకు, అందించే జీతాలకు పొంతన కుదరని వైనం – స్వాహా చేసి ఉడాయించిన ఏజెన్సీ నిర్వాహకుడు – నూతన ఏజెన్సీకి కట్టబెట్టినా.. మూడు నెలలుగా అందని జీతాలు ఎస్కేయూ: ఎస్కేయూలో ఉద్యోగాల కల్పన పేరుతో అందినకాడికి దోచుకున్నారు. ఔట్ సోర్సింగ్ ముసుగులో రూ. లక్షలు కొల్లగొట్టి ఉడాయించారు. శ్రమ దోపిడీతో ఉద్యోగులకు చివరకు మిగిలింది నిరాశే! శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని హాస్టళ్లలో భద్రతా నిమిత్తం 2015 ఆగస్టులో తొలి దశలో 40 మంది సెక్యూరిటీ గార్డులను నియమించారు. అనంతరం మరో 20 మంది నియామకం చేపట్టారు. వీరందరి నిర్వహణ బాధ్యతను వెంగమాంబ ఏజెన్సీకి అప్పగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రకటించిన వేతనంలోనూ కోత సెక్యూరిటీ గార్డుగా ఎంపిక చేసిన ప్రతి ఒక్కరితో విధుల్లో చేరేందుకు ముందు సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.25 వేలు కట్టించుకున్నారు. నియామకం సమయంలో ఒక్కొక్కరికి నెలకు రూ.10,200 వేతనం చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా నెలకు రూ. 6,700 చొప్పున అందిస్తూ వచ్చారు. పీఎఫ్, ఇతరత్రా పన్నుల పేరుతో నిర్ధేశిత జీతం కన్నా రూ. 3,500 తక్కువ చెల్లించారు. తమకు తక్కువ జీతం అందుతోందంటూ పలువురు వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఏజెన్సీ కింద పనిచేసేవారి బాధ్యత వర్సిటీది కాదంటూ, ఏదైనా ఏజెన్సీ నిర్వాహకులతో తేల్చుకోవాలని అధికారులు స్పష్టం చేయడంతో గత ఏడాది సెక్యూరిటీ గార్డులు ఆ మేరకు నిర్వాహకుడిని నిలదీశారు. ఆ సమయంలో వారికి సర్ది చెప్పిన నిర్వాహకుడు నవంబర్ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ప్రతి నెలా వ్యత్యాసం ఉన్న రూ. 3,500, రూ.25 వేలు డిపాజిట్ మొత్తం స్వాహా అయినట్లు తెలుసుకున్న సెక్యూరిటీ గార్డుల వేదనకు అంతులేకుండా పోతోంది. ఉద్యోగులను వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు మోసం చేయడంతో .. కార్తికేయ ఏజెన్సీకు సెక్యూరిటీ గార్డులను అప్పగించారు. అయినప్పటికీ ఈ సంస్థ కూడా ఎవరికీ మూడు నెలలుగా జీతాలు అందించలేదు. ఉదయం పూట కూలీ పనికి ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనంతపురంలో కమ్మీ పనికి వెళుతున్నాను. రూ. 150లు ఇస్తారు. గతంలో ఉన్న ఏజెన్సీ కట్టించుకున్న రూ. 25 వేలు డిపాజిట్, పీఎఫ్ మొత్తాన్ని ఇవ్వలేదు. నిర్వాహకుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. వర్సిటీ అధికారులు మా మీద దయతలచి సహకరిస్తున్నారు. – సురేంద్ర, సెక్యూరిటీ గార్డు సెంట్రింగ్ పని చేస్తున్నా మూడు నెలలుగా జీతాలు అందలేదు. దీంతో డ్యూటీ ఒక షిప్టు చేసి, మరో షిప్టులో సెంట్రింగ్ పనికి వెళుతున్నాను. వెంగమాంబ ఏజెన్సీ నిర్వాహకుడు తక్కువ జీతం ఇచ్చి మమ్మల్ని మోసం చేశాడు. మా సమస్యలను వర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. పరిష్కరిస్తామన్నారు. మా ఉద్యోగాలు కొనసాగించి. మరో ఏజెన్సీకి అప్పగించి ఉద్యోగాలు నిలబడేలా చేశారు. – ఆదిశేషయ్య. సెక్యూరిటీ గార్డు. పీఎఫ్ అందలేదు పీఎఫ్ , ఇతరత్రా అలవెన్సులు వెంగమాంబ ఏజెన్సీ వారు ఇవ్వకుండా స్వాహా చేశారు. ప్రతి నెలా రూ.3,500 జీతం తక్కువగా ఇచ్చారు. పైగా రూ.25 వేలు డిపాజిట్‌ను తిరిగి ఇవ్వలేదు. – వన్నూరప్ప, సెక్యూరిటీ గార్డు -
28లోపు కోర్సు ఫీజు చెల్లించాలి
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో రెండో సంవత్సరం విద్యనభ్యసిస్తున్న వారు ఈ నెల 28 లోపు కోర్సు ఫీజు చెల్లించాలని ఆ విభాగం డైరెక్టర్ ప్రొఫెసర్ బి.వి.రాఘవులు తెలిపారు. సప్లిమెంటరీ విద్యార్థులు కోర్సు, పరీక్ష ఫీజును ఎస్బీఐ, ఆంధ్రాబ్యాంకు డిమాండ్ డ్రాప్టు రూపంలో చెల్లించాలని సూచించారు. -
ఎస్కేయూను అగ్రగామిగా తీర్చిదిద్దుదాం
ఎస్కేయూ(అనంతపురం): శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రస్థాయిలో అగ్రగామిగా నిలుపుదామని వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ అన్నారు. 71 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం ఎస్కేయూ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం వీసీ మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలనను అంతమొందించడానికి మహనీయులు చేసిన కృషిని మరువలేనిదన్నారు. దేశంలోని స్టేట్ వర్సిటీలలో కేవలం ఒక్క ఎస్కేయూకు మాత్రమే అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ దక్కిందన్నారు. విద్యార్థుల సంక్షేమమే అంతిమధ్యేయంగా కృషి చేస్తామన్నారు. క్యాంపస్ స్కూలు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో ఎస్కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ భాషల అభ్యసనపై ఆర్డీటీతో ఒప్పందం
బుక్కరాయసముద్రం: నూతన సాంకేతికతను అలవర్చుకున్నప్పుడే మానవ వనరులు అభివృద్ధి చెందుతాయని శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ ఉపకులపతి డాక్టర్ కె.రాజగోపాల్ అన్నారు. శాస్త్ర సాంకేతిక శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రంగంలో నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలన్నారు. విదేశీ భాషల అభ్యసనపై ఆర్డీటీ సంస్థతో వర్సిటీ యాజమాన్యం ఒప్పందం కుదుర్చకుంది. ఈ సందర్భంగా స్థానిక సిద్ధరాంపురం రోడ్డు సమీపంలో ఉన్న ఆర్డీటీ పాఠశాలలో విదేశీ భాషల అభ్యసనపై తరగతులను బుధవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వంద యూనివర్సీటీల జాబితాలో ఎస్కేయూకు చోటు దక్కిందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధికి వర్సిటీ పలు చర్యలు చేపట్టిందని అన్నారు. ఇందులో భాగంగానే విదేశీ భాషల అభ్యసనకు విద్యార్థులను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయన్నారు. ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్ మాట్లాడుతూ.. తమ సంస్థ ఆధ్వర్యంలో విదేశీ భాషలపై 2012 నుంచి ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికి వెయ్యి మందికి పైగా అభ్యర్థులు విదేశీ భాషపై పట్టు సాధించి, దేశ, విదేశాల్లోని పలు కార్పొరేట్ కంపెనీల్లో ఉన్నత శ్రేణి ఉద్యోగాల్లో చేరారని తెలిపారు. పేద విద్యార్థులకు ఆర్డీటీ మంచి భవిష్యత్తు కల్పిస్తోందని, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. స్పానీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇంగ్లిష్ తదితర భాషలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై కూడా ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు వివరించారు. ఏడాదిపాటు కొనసాగే ఈ శిక్షణ కార్యక్రమంలో అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు ఆర్డీటీ సమకూరుస్తుందని అన్నారు. ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఎస్కేయూ ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయనుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ డైరెక్టర్లు చంద్రశేఖర్ నాయుడు, దశరథరాముడు, నిర్మల్ కుమార్, రీజనల్ డైరెక్టర్లు నారాయణరెడ్డి, మహబూబీ, ప్రమీల కుమారి, వన్నూరప్ప ఏటీఎల్ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విదేశీ భాషల్లో డిప్లొమో కోర్సులు
ఎస్కేయూ: ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్టు) సహకారంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లో డిప్లొమో కోర్సులు అందించడానికి ఎస్కేయూతో ఆర్డీటీ ప్రతినిధులు సంప్రదింపులు జరుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆర్డీటీ ప్రతినిధులు సోమవారం ఎస్కేయూను సందర్శించారు. ఈ కోర్సులు ఆర్డీటీ నిర్వహిస్తుంది. పరీక్షలు, సర్టిఫికెట్లు ఎస్కేయూ నిర్వహిస్తుంది. ఆర్టీటీ, ఎస్కేయూల మధ్య బుధవారం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిసింది. -
ఎస్కేయూలో యోగా డిప్లొమా కోర్సు
ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో యోగా డిప్లొమా కోర్సును 2017–18లో అందుబాటులోకి తీసుకరావాలని వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. వర్సిటీలోని పాలకభవనంలో శనివారం స్పోర్ట్స్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వీసీ అధ్యక్షత వహించి మాట్లాడారు. యోగా కోర్సుకు సంబంధించి త్వరగా సిలబస్ రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. వినూత్నమైన పద్దతులు నిర్వహించకపోవడం వల్ల విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ చూపలేదన్నారు. అంకితభావంతో కృషి చేస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. అవసరమైన సదుపాయాలన్నీ కల్పిస్తాం.. విద్యార్థులు క్రీడల పట్ల మక్కువ పెంపొందేలా ప్రోత్సాహాలు కల్పించాలన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ కార్యక్రమాలను వెంటనే ముమ్మరం చేయలన్నారు. క్రీడలను వర్సిటీ విద్యా ప్రణాళికలో భాగం చేయాలన్నారు. అనంతరం రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్ మాట్లాడుతూ.. వర్సిటీలో స్పోర్ట్స్ కల్చర్ పెరిగే విధంగా ఈ రంగంలోని సెలబ్రటీలను ఆహ్వానించాలన్నారు. అనంతరం 2017–18లో జరిగే క్రీడాపోటీల షెడ్యూల్‌ను ఆమోదించారు. -
ప్రతి కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ
ఎస్కేయూ: ర్యాగింగ్ లేని క్యాంపస్‌గా గతంలో ఉన్న పేరును నిలబెట్టాలని అధికారులకు ఎస్కేయూ ఉపకులపతి ఆచార్య కె. రాజగోపాల్ అన్నారు. ర్యాగింగ్ నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ఎస్కేయూలోని పాలక భవనంలో గురువారం ఆయన సమీక్షించారు. ర్యాగింగ్ నిరోధానికి తక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎడ్యుకేషన్ కళాశాలల ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆరుగురు ప్రొఫెసర్లతో కూడిన యాంటీ ర్యాగింగ్ కమిటీ స్క్వాడ్ ఏ హాస్టల్‌నైనా తనిఖీ చేసి ర్యాగింగ్‌కు పాల్బడే వారిపై చర్యలు తీసుకుంటుందన్నారు. ర్యాగింగ్‌కు పాల్బడితే జరిగే దుష్పరిణామాలపై పోస్టర్లను అన్ని విభాగాలు, హాస్టళ్లలో ప్రదర్శించాలన్నారు. ప్రతి మహిళా వసతి గృహంలో విద్యార్థులకు అందుబాటులో ఓ డిప్యూటీ వార్డెన్ ఉంటారన్నారు. ర్యాగింగ్‌కు సంబంధించిన సమాచారం ఇవ్వాలనుకునే వారి కోసం సలహాల పెట్టెలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు, సైన్స్ క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వి.రంగస్వామి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.రాఘవేంద్ర రావు, వార్డెన్ ప్రొఫెసర్ వి.రంగస్వామి, ఎస్ఈ వి.మధుసూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్కేయూకు అటల్ ఇంక్యుబేషన్
ఐదేళ్లలో రూ.10 కోట్లు మంజూరు చేయనున్న నీతి అయోగ్ – విశ్వ ప్రమాణాలతో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం –ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(ఎస్కేయూ)లో అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం ఏర్పాటుకు అనుమతి లభించినట్లు వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ వెల్లడించారు. వర్సిటీలోని పాలకభవనంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నాణ్యమైన విద్య, పరిశోధనలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకతను సంతరించుకొన్న వర్సిటీ అరుదైన ఖ్యాతి సొంతం చేసుకుందన్నారు. జాతీయ స్థాయిలో 13 అటల్ ఇంక్యుబేషన్ కేంద్రాలకు అనుమతి లభించిదన్నారు. ఇందులో ఎస్కేయూ ఒకటి కావడం గర్వకారణమన్నారు. సెంట్రల్, స్టేట్ వర్సిటీ, ఐఐటీ, ఐఐఎం సంస్థలు పోటీ పడ్డప్పటికీ, ఒక్క ఎస్కేయూకే అటల్ ఇంక్యుబేషన్ కేంద్రం దక్కిందన్నారు. ఈ కేంద్రానికి వచ్చే ఐదేళ్లలో రూ.10 కోట్ల నిధులను నీతి అయోగ్ అందిస్తుందన్నారు. భావితరాలకు విలువైన మేథోసంపత్తి జాతీయ స్థాయిలోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, గ్రాడ్యుయేట్లు , పోస్టు గ్రాడ్యుయేట్లు ఎవరైనా ఇంక్యుబేషన్ సెంటర్లో తమ ఆవిష్కరణలకు భాగస్వామ్యం అందిస్తుందని వీసీ పేర్కొన్నారు. సృజనాత్మకమైన నూతన ఆవిష్కరణలు.. ఉత్పత్తి దిశగా చేయాలనుకునేవారికి ఇంక్యుబేషన్ సెంటర్ దోహదం చేస్తుందన్నారు. విశ్వ ప్రమాణాలతో వినూత్న ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. అటల్ ఇంక్యుబేషన్లో నమోదైన ఆవిష్కరణలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా పరిశ్రమలకు రాయితీలు లభిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఏర్పడిన ఇంక్యుబేషన్ కేంద్రంతో ఎస్కేయూకు జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపచేశామన్నారు. ఎస్కేయూ అగ్రగామిగా నిలపడానికి సమష్టి సహకారంతో కృషి చేస్తున్నామన్నారు. ఇంక్యుబేషన్ మంజూరుకు సహకరించిన పాలకమండలి సభ్యుడు మనోహర్‌రెడ్డి, వర్సిటీ స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ నాగభూషణ రాజు, ఏపీ ఐటీ సలహాదారు జేఏ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కే.సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
సజావుగా ఏపీసెట్
ఎస్కేయూ: ఏపీసెట్ (ఆంధ్రప్రదేశ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)–2017 ఆదివారం అనంతపురం నగరంలోని 13 కేంద్రాల్లో సజావుగా నిర్వహించినట్లు రీజనల్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎ.మల్లికార్జునరెడ్డి అన్నారు. మొత్తం 7,934 మంది అభ్యర్థులకు గాను 5,900 మంది అభ్యర్థులు హాజరయ్యారన్నారు. కాగా ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, ఎస్వీ డిగ్రీ కళాశాల, ఎస్ఎస్బీఎన్ , అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాల, ఎస్కేయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, దూరవిద్య డైరెక్టర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు, సెట్ రీజనల్ కో ఆర్డినేటర్ ఎ.మల్లిఖార్జునరెడ్డి తదితరులు పరిశీలించారు. -
జావా , డాట్నెట్ కోర్సులకు ఉచిత శిక్షణ
ఎస్కేయూ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్కేయూలో మూడు నెలల పాటు ఉచిత శిక్షణా కోర్సులు నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ మేనేజర్ టీ.హెచ్. విన్సెంట్ తెలిపారు. ఈ తరగతులకు హాజరైన అభ్యర్థులకు సర్టిఫికెట్తో పాటు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి రోజూ నాలుగు గంటలు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు www.joskills.appssdc.inవెబ్‌సైట్‌నందు తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలు కోసం 9490978868, 7801031771 నెంబర్లు ద్వారా సమాచారం తెలుసుకోవచ్చు. -
1 నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ దూరవిద్య పరీక్షలు ఆగస్టు 1 నుంచి జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షల విభాగం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆగస్టు 1న పౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, 2న సైకాలజీ ఆఫ్ టీచింగ్ అండ్ లర్నింగ్, 3న స్కూల్ మేనేజ్మెంట్ అండ్ ఇష్యూస్ మేనేజ్మెంట్ , 4న ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ ( ఐసీటీ) ఎడ్యుకేషన్, 5, 6, 7న టీచింగ్ మెథడ్స్ పరీక్షలు జరగనున్నాయి. -
నేటితో ముగియనున్న ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్
ఎస్కేయూ : ఏపీ ఐసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన శనివారంతో ముగియనుంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం , ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన సర్టిఫికెట్ల పరిశీలనకు 850 మంది హాజరయ్యారు. గత నాలుగు రోజులు కంటే శుక్రవారం అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారని ఎస్కేయూ హెల్ప్‌లైన్ సెంటర్ క్యాంప్ ఆఫీసర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. -
ఐసెట్ కౌన్సెలింగ్‌కు పోటెత్తిన విద్యార్థులు
ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి ఐసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా గత మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలనకు గురువారం విద్యార్థులు పోటెత్తారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం, ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రాల్లో 721 మంది అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో 411 మంది అభ్యర్థులు హాజరుకావడంతో గురువారం రాత్రి 10 గంటల వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని క్యాంప్ ఆఫీసర్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. 15న ఐసెట్ కౌన్సెలింగ్ పూర్తికానుంది. -
14న ఎస్కేయూలో క్యాంపస్ ఇంటర్వ్యూలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 14న క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ టి.హెచ్.విన్సెంట్ తెలిపారు. బహుళజాతి సంస్థ అయిన బీఎస్పీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రతినిధులు ఇంటర్వ్యూ చేస్తారని పేర్కొన్నారు. ఎస్కేయూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో రాత పరీక్ష నిర్వహిస్తామన్నారు. 2015, 2016, 2017 విద్యాసంవత్సరాల్లో బీకాం, ఎంకాం, ఎంబీఏ ఉత్తీర్ణులైన వారు ఇంటర్వ్యూలో పాల్గొనడానికి అర్హులన్నారు. ఇతర వివరాలకు 94909 78868, 78010 31771 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చన్నారు. -
11 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్
ఎస్కేయూ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్–2017 కౌన్సెలింగ్ ఈ నెల 11 నుంచి నిర్వహిస్తున్నట్లు ఎస్కేయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 15న కౌన్సెలింగ్ ముగుస్తుందన్నారు. ఎస్కేయూ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్ల కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు. -
ముగిసిన తొలివిడత కౌన్సెలింగ్
ఎస్కేయూ : ఎస్కేయూసెట్–2017 కౌన్సెలింగ్‌కు విద్యార్థుల హాజరు శాతం పెరిగింది. గత నెల 19న ప్రారంభమైన కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగిసింది. ప్రారంభంలో పీజీ సీట్లు భారీగా మిగిలిపోయాయని భావించారు. ఆతర్వాత విద్యార్థుల హాజరుసంఖ్య పెరిగింది. దీంతో అనుబంధ కళాశాలల యాజమాన్యాలకు ఊరట లభించింది. మొత్తం 3,403 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. జూలై 8 నుంచి రెండో దఫా కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందన్నారు. వెబ్ ఆప్షన్ల ఇవ్వడానికి ఆదివారం అర్ధరాత్రి వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఎస్కేయూ క్యాంపస్ కళాశాలల్లో అందుబాటులో 1,084 సీట్లు అందుబాటులో ఉండగా, అనుబంధ పీజీ కళాశాలల్లో 3,490 సీట్లు, మొత్తం 4,574 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అందులో సర్టిఫికెట్ల పరిశీలనకు 3,403 మంది అభ్యర్థులు హాజరుకాగా 3,090 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి 2వతేదీ (1వతేదీ ఉన్నప్పటికీ ఒక రోజు పొడిగించారు)చివరి తేదీగా నిర్ణయించారు. రెండో దఫా కౌన్సెలింగ్ ఈనెల 8వతేదీ ప్రారంభం అవుతుంది. -
జులై 17 నుంచి తరగతుల నిర్వహణ
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్, సైన్స్ క్యాంపస్ కళాశాలల్లో జులై 17 నుంచి పీజీ తరగతులు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ సీఎన్ కృష్ణా నాయక్, ప్రొఫెసర్ రంగస్వామి తెలిపారు. జులై 3 నుంచి తరగతులు పునప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, వర్సిటీలో ఏర్పడిన తాగునీటి ఎద్దడి నేపథ్యంలో వాయిదా వేశామన్నారు. బోధన సిబ్బంది మాత్రం జులై 3 నుంచే హాజరు కావాలన్నారు. ఇదిలా ఉండగా, హాస్టళ్లలో చేపడుతున్న మరమ్మతులను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్, రిజిస్ట్రార్ కె.సుధాకర్‌బాబు పరిశీలించారు. గడువులోపు చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. -
నేటితో ముగియనున్న తొలివిడత కౌన్సెలింగ్
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలలు, పీజీ అనుబంధ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ - 2017 తొలి దఫా కౌన్సెలింగ్ శుక్రవారంతో ముగియనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు శుక్రవారం సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహిస్తామన్నారు. జులై 6వ తేదీలోపు ఆన్లైన్ విధానం ద్వారా సీట్లు కేటాయిస్తామన్నారు. -
కూడేరులో ఎనర్జీ వర్సిటీ
– తాత్కలికంగా జేఎన్టీయూలో సెప్టెంబర్ నుంచి తరగతులు – జేఎన్టీయూ ఇన్చార్జ్ వీసీ కె.రాజగోపాల్ వెల్లడి జేఎన్టీయూ : జిల్లాలోని కూడేరు వద్ద ఎనర్జీ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు వర్సిటీ భవన నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తదితర అంశాలపై ఎనర్జీ యూనివర్సిటీ ప్రతినిధుల బుధవారం జేఎన్టీయూ ఇన్చార్జ్ వీసీతో సంప్రదింపులు జరిపారు. కార్యక్రమంలో జేఎన్టీయూ ఇన్ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ కే.రాజగోపాల్ , ఏఐసీటీఈ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ఎస్ మంతా, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకర్‌బాబు, జేఎన్టీయూ రెక్టార్ డి.సుబ్బారావు, రిజిస్ట్రార్ కృష్ణయ్య, ఈసీ మెంబర్ సి.శశిధర్, ప్రొఫెసర్ బి.ప్రహ్లాదరావు తదితరులు పాల్గొన్నారు. జేఎన్టీయులో తరగతులు.. ఎనర్జీ యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్, తరగతులు జేఎన్టీయూ (అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాలలోనే నిర్వహించేందుకు అనుమతి ఇచ్చామని ఇన్చార్జ్ వీసీ కె.రాజగోపాల్ తెలిపారు. తరగతి గదులకు అవసరమయ్యే భవనాలు, ల్యాబ్ సదుపాయాలు కల్పిస్తామన్నారు. సెప్టెంబర్ నుంచి ఎనర్జీ వర్సిటీ తరగతులు జేఎన్టీయూ (అనంతపురం) ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభమవుతాయన్నారు. -
జూలై 1న ముగియనున్న వెబ్ ఆప్షన్ల గడువు
ఎస్కేయూ : ఎస్కేయూ సెట్ –2017 కౌన్సెలింగ్‌లో భాగంగా మంగళవారం కామర్స్ సబ్జెక్టు విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగింది. 29న సర్టిఫికెట్ల పరిశీలన ముగుస్తుంది. 30న ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు సర్టిఫికెట్ల పరిశీలన , జూలై 1న 30 సబ్జెక్టులకు సంబంధించిన తొలిదఫా కౌన్సెలింగ్ వెబ్ ఆప్షన్ల గడువు ముగుస్తుంది. జులై 4, 5, 6 తేదీలలో ఆన్లైన్లో పీజీ సీట్లను కేటాయిస్తారు. ఇదిలా ఉండగా ఎంకాం సీట్లను 120కి పెంచారు. తాజా కౌన్సెలింగ్‌లో కొత్తగా మూడు పీజీ కళాశాలల్లో ఎంకాం కోర్సును ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. -
ఎస్కేయూ అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్‌గా లక్ష్మీరాంనాయక్
ఎస్కేయూ : వర్సిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా డాక్టర్ లక్ష్మీరాంనాయక్‌ను నియమితులయ్యారు. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు ఆయన ఫైనాన్స్ ఆఫీసర్‌గా ఉన్నారు. పదవీకాలం ముగియగానే సీనియర్ డిప్యూటీ రిజిస్ట్రార్ హోదాలో పరీక్షల విభాగానికి బదిలీ చేశారు. ఫైనాన్స్ ఆఫీసర్ స్థాయి కంటే తక్కువ హోదా కావడంతో ఉన్నతాధికారులు నూతనంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టును క్రియేట్ చేశారు. వర్శిటీ ఏఓ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ టు వీసీ (ఓఎస్డీ టు వీసీ) విభాగంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విధులు నిర్వహిస్తారు. -
అయోమయంలో ‘దూర’ విద్యార్థులు
- అందని ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు - అధికారుల మధ్య సమన్వయలోపం ఎస్కేయూ : ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ జారీ విషయంలో సందిగ్ధం నెలకొనడంతో డిగ్రీ పూర్తి చేసి పీజీల్లో ప్రవేశించాలనుకొనే వర్సిటీ దూరవిద్య విభాగం విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఎస్కేయూ క్యాంపస్ కళాశాల, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుళకు డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. అయితే ముఖ్యమైన టీసీ (ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ ) జారీ అంశంలో స్పష్టతలేదు. సమన్వయ లోపం.. డిగ్రీ , పీజీ (రెగ్యులర్), డిగ్రీ , పీజీ (దూరవిద్య) విభాగాలు గతంలో వేర్వేరుగా కార్యకలాపాలు నిర్వహించేవి. అప్పట్లోనే గందరగోళం ఉంది. కానీ ఈ రెండు విభాగాలకు ఒకే గూటికి చేర్చి ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్‌ను నియమించారు. దూరవిద్య విభాగంలో అడ్మిషన్లకు ఒక డైరెక్టర్, పరీక్షలు నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాలు ప్రకటన అంశాలను ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్‌కు అప్పగించారు. ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం లోపించింది. ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్‌ను ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వాలని అడిగితే దూరవిద్య డైరెక్టర్ వద్దకు వెళ్లాలని చెబుతున్నారని.. దూరవిద్య విభాగంలో వెళ్లి అడిగితే..పరీక్షలు నిర్వహించేది ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ కాబట్టి అక్కడే అడగాలని బదులుస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. విద్యార్థుల ఇక్కట్లు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 14వేల మంది విద్యార్థులు డిగ్రీ ఫైనలియర్ ఉత్తీర్ణులయ్యారు. సింహభాగం డిగ్రీ సర్టిఫికెట్లు ఆయా అధ్యయన కేంద్రాలకు పంపారు. అయితే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు పంపకపోవడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురవుతున్నారు. ఈ వివాదం తేలే వరకు ఎస్కేయూసెట్, ఇతర వర్సిటీలలో పీజీ అడ్మిషన్ పొందే విద్యార్థులకు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, మైగ్రేషన్ సర్టిఫికెట్ల అంశంలో వెసులుబాటు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. -
కొనసాగుతున్న ఎస్కేయూసెట్ కౌన్సెలింగ్
ఎస్కేయూ : పీజీ ప్రవేశాలు నిమిత్తం నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ –2017 సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతోంది. రూరల్ డెవలప్మెంట్ విభాగంలో 185 మంది విద్యార్థులకు గాను, 87 మంది, సోషల్ వర్క్‌లో 204 మందికి గాను 104 మంది, సోషియాలజీ విభాగానికి 69 మంది అభ్యర్థులకు గాను 40 మంది, తెలుగు విభాగంలో 278 మందికి గాను 166 మంది అభ్యర్థులు ఆదివారం హాజరైనట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. 29 వరకు సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. 30న ప్రత్యేక కేటగిరి అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకవాలని కోరారు. -
సమాజానికి ఉపయోగపడేలా సిలబస్
ఎస్కేయూ : సమాజానికి , విద్యాలయానికి విద్యార్థి వారధిగా సిలబస్ ఉండాలని ఎస్కేయూ వీసీ కె.రాజగోపాల్ అన్నారు. ఎస్కేయూలో గురువారం డిగ్రీ కోర్సుల సిలబస్ రూపకల్పనపై బోర్డ్ ఆఫ్ స్టడీస్ సమావేశమైంది. కార్యక్రమానికి వీసీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠ్యాంశాల్లో మార్పు చేర్పులు చేశారు. వీసీ మాట్లాడుతూ సమాజంపై అవగాహన కల్పించే విధంగా సామాజిక ప్రాజెక్టుల్లో విద్యార్థులు పాల్గొనేలా కర్రికులమ్‌ను రూపొందించాలన్నారు. విద్యార్థులు భావవ్యక్తీకరణ నైపుణ్యాలు పెంపొందించే విధంగా సిలబస్, విద్యాబోధన ఉండాలన్నారు. సీడీసీ డీన్ వేణుగోపాల్‌రావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో రెక్టార్ హెచ్.లజిపతిరాయ్, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ జే.శ్రీరాములు, ఫైనాన్స్ ఆఫీసర్ ఎంఏ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
కొనసాగుతున్న సర్టిఫికెట్ల పరిశీలన
ఎస్కేయూ : ఎస్కేయూ సెట్ (2017) కౌన్సెలింగ్‌లో భాగంగా నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన రెండో రోజూ కొనసాగింది. కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్సెస్ విభాగాలకు సంబంధించి మొత్తం 679 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 381 మంది హాజరైనట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. కౌన్సెలింగ్‌కు అన్ని రకాల ఒరిజినల్ సర్టిఫికెట్లు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. -
కొంత మోదం.. మరికొంత ఖేదం.!
– ఎస్కేయూ వీసీ ఆచార్య కె.రాజగోపాల్ పదవీ కాలానికి రేపటితో రెండేళ్లు – భర్తీ చేయని టీచర్ పోస్టులు – ప్రైవేట్ సెక్యూరిటీ నియామకంతో నిధులు వృథా – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో ఉద్యోగాల కల్పన శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (ఎస్కేయూ) వైస్ చాన్స్‌లర్‌గా ఆచార్య కె. రాజగోపాల్ బాధ్యతలు చేపట్టి గురువారంతో రెండు సంవత్సరాలు పూర్తి కానున్నాయి. ఈ రెండేళ్లలో కంపెనీలు ఆశించిన రీతిలో అభ్యర్థుల్లో నైపుణ్యాభివృద్ధి కల్పనకు దోహదపడేలా ఆయన పలు చర్యలు చేపట్టారు. ఆయన చేపట్టిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా రాబోవు రెండేళ్లలో ఇదే ఒరవడి కొనసాగితే అద్భుత ఫలితాలు ఉంటాయనడంలో సందేహం లేదు. సాధారణ డిగ్రీతోనే టీసీఎస్ కంపెనీలో 380 మంది ఉద్యోగాలు దక్కించుకున్నారంటే ఈ సెంటర్ పనితీరు ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ రెండేళ్లలో ఎస్కేయూ అభివృద్ధి పథంలో కొనసాగడంతో పాటు మరికొంత వెనుకబాటు కూడా ఉండడం గమనార్హం. - ఎస్కేయూ మౌలిక వసతుల కల్పనకు నిధుల వెల్లువ – రాష్ట్రీయ ఉచ్ఛారతా శిక్షా అభియాన్ పథకం (రూసా) ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.20 కోట్ల మేర నిధులు అందించింది. దీంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు – పాలక భవనంలో వీసీ, రెక్టార్ , రిజిస్ట్రార్ల ఛాంబర్లు ఆధునీకరించారు – ఇంజినీరింగ్ విభాగంలో అమ్మాయిలకు, అబ్బాయిలకు రెండు ప్రత్యేక హాస్టళ్ల నిర్మాణానికి అనుమతి – అన్ని హాస్టళ్లలో మరుగుదొడ్ల ఆధునికీకరణ – ప్రత్యేకంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు డైరెక్టర్ నియామకం. రెండు దఫాలుగా రీసెట్ నిర్వహణ, తాజాగా ఆన్లైన్ విధానం ద్వారా రీసెట్ విజయవంతం – జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహించడంతో మాస్‌కాపీయింగ్‌కు అడ్డుకట్ట. నూతనంగా ప్రశ్నపత్రాలను ఆన్లైన్ విధానం ద్వారా పరీక్ష కేంద్రాలకు పంపే ప్రక్రియ విజయవంతం ఉద్యోగాల కల్పన – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి 270 మంది వివిధ కంపెనీల్లో, టీసీఎస్‌లో 380 మందికి ఉద్యోగాలు దక్కేలా చేశారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్స్ స్కిల్స్, డిజటల్ డిజైన్, సీ లాంగ్వేజ్, సాప్ట్వేర్ టెస్టింగ్, వంటి కోర్సులపై ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు – గత రెండేళ్లలో 640 మంది విద్యార్థులకు రైల్వే, బ్యాంకింగ్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించారు – రెండు దఫాలుగా ఉచితంగా స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ తరగతులు – రెండు దశాబ్దాలుగా నోటిఫికేషన్‌కు నోచుకోక పోయిన నాన్‌టీచింగ్ పర్మినెంట్ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ ప్రక్రియ చేపట్టారు. మొత్తం 72 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు విభజించినా.. ఫలితం శూన్యం ఇంజినీరింగ్ కళాశాలల్లో అడ్హాక్ లెక్చరర్లను నియామకాన్ని పారదర్శకంగా చేపట్టారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ఫార్మసీ కళాశాలకు అనుమతి పొందారు. లా కళాశాలకు బార్ కౌన్సిల్ అనుమతి మంజూరుకు చొరవ చూపారు. క్యాంపస్‌లో ఆర్ట్స్, సైన్స్ కళాశాలను వేరు చేసి ఇద్దరేసి ప్రిన్సిపళ్లు, వైస్ ప్రిన్సిపళ్ల నియామకం చేసినా... పాలనా పరంగా జాప్యం చోటు చేసుకుంటోంది. నూతనంగా హాస్టల్ మేనేజర్స్‌ను నియమించినప్పటికీ... నాణ్యమైన ఆహారం అందించడంలో విఫలమయ్యారు. దీంతో తిరిగి హాస్టల్ మేనేజర్స్‌ను రద్దు చేసి.. యథాతథంగా వార్డెన్స్‌ను నియమించారు. ఆర్థిక వనరులు వృథా ఆర్థిక సంస్కరణలతో వర్సిటీ అభివృద్ధి గాడిలో పడింది. వర్సిటీ ప్రతిష్ట రాష్ట్ర, జాతీయ స్థాయిలో పెరిగింది. ఎన్ఐఆర్ఎఫ్ (నేషనల్ ర్యాంకింగ్ ప్రేమ్ వర్క్)లో తొలి సారిగా 100 లోపు ర్యాంకు వచ్చింది. అయితే కొన్ని విధానాల అమలులో ఆర్థిక వనరులు వృథా అయ్యాయన్న ఆరోపణలూ లేకపోలేదు. వర్సిటీలోని హాస్టళ్లు, ఇతర కార్యాలయాల్లో 70 మంది ప్రైవేటు భద్రతా సిబ్బందిని నియమించారు. దీంతో ఏటా రూ.84 లక్షలు ఖర్చు అవుతోంది. వాస్తవానికి ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి చెల్లించే మొత్తానికి, ఉద్యోగులకు ఏజెన్సీ వారు చెల్లించే జీతాలకు భారీ వ్యత్యాసం ఉన్నా చర్యలు తీసుకోలేదనే విమర్శలున్నాయి. టెండర్ల ద్వారా ఔట్సోర్సింగ్ ఏజెన్సీకి కట్టబెట్టకపోవడం వివాదాలకు దారితీసింది. ఔట్ సోర్సింగ్ నిర్వాహకుడు ఉద్యోగుల పీఎఫ్ మొత్తాన్ని కాజేసి పత్తా లేకుండా పోయాడు. ఏజెన్సీ నిర్వాహకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. గతేడాది న్యాక్ పర్యటన నిమిత్తం లక్షలాది రూపాయలు అభివృద్ధి నిధులు మంజూరు చేశారు. తొందరగా పూర్తి చేయాలనే ఆత్రుతతో నామినేషన్ పద్దతి మీద పనులు కట్టబెట్టారు. ఇవి కూడా వివాదస్పదమయ్యాయి. యూజీ పరీక్షల విభాగం పూర్తిగా భ్రష్టుపట్టిపోయిందనేది నిష్ఠూర సత్యం. రెండేళ్ల క్రితం పరీక్షలకు గైర్హాజరైన వారు సైతం ఉత్తీర్ణులయ్యారు. 2016–17 క్యాంపస్‌లో అన్ని విభాగాలకు బయోమెట్రిక్ విధానం అమలు చేసినప్పటికీ.. ప్రస్తుతం ఏ ఒక్క పరికరం కూడా పనిచేయలేదు. దీంతో రూ.3.19 లక్షల నిధులు వృథా అయ్యాయి. 2016–17 విద్యాసంవత్సరంలో దూరవిద్యకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఫలితంగా కోట్లాది రూపాయల ఆదాయాన్ని వర్సిటీ కోల్పోయింది. విదేశీ వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు: ఎస్కేయూకు వీసీగా ఉన్న సమయంలోనే ఎస్వీ, యోగివేమన వర్సిటీలకు ఇన్ఛార్జ్ వీసీగా కె.రాజగోపాల్‌ను నియమించారు. తాజాగా జేఎన్టీయూ(ఎ)కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఎస్కేయూపై పూర్తి సమయాన్ని కేటాయించకపోడంతో రెండో ఏడాదిలో వర్సిటీ పురోగతి ఆశాజనకంగా లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. 30 దేశీయ, విదేశీ వర్సిటీ, పారిశ్రామిక సంస్థలతో ఉపాధి అవకాశాల మెరుగు, నైపుణ్యాల పెంపుదలకు అవగాహన ఒప్పందాలు జరిగాయి. అయితే ఇవి అమలు జరిగిన దాఖలాలు లేవు. అవగాహన ఒప్పందాలు జరగడమే తప్ప వీటి వల్ల విద్యార్థులకు లబ్ధి చేకూరలేదనే విమర్శలూ ఉన్నాయి. -
సజావుగా సర్టిఫికెట్ల పరిశీలన
ఎస్కేయూ : వర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన సజావుగా సాగింది. తొలిసారిగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియను ప్రవేశపెట్టారు. రెక్టార్ హెచ్.లజపతిరాయ్ ప్రథమ ర్యాంకు సాధించిన విద్యార్థినికి స్క్రాచ్ కార్డును అందచేశారు. కౌన్సెలింగ్ కేంద్రంలో సౌకర్యాలను పరిశీలించారు. డైరెక్టర్ ఆఫ్ అడ్మిష¯Œ్స బీవీ రాఘవులు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాళ్లు సీఎ¯ŒS కృష్ణా నాయక్, వి.రంగస్వామి, సెరికల్చర్ విభాగాధిపతి ఎస్.శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అలంకారప్రాయంగా బయోమెట్రిక్ పరికరం
ఎస్కేయూ: వర్సిటీలోని పలు విభాగాల్లో విద్యార్థులు, అధ్యాపకుల హాజరు నమోదుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ పరికరాలు నిరుపయోగంగా మారాయి. ఆధార్‌తో అనుసంధానం చేసిన బయోమెట్రిక్ మిషన్లు ద్వారా హాజరు నమోదు చేయాలని ఉన్నత విద్యా మండలి గతేడాది ఆదేశాలు జారీ చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ రావాలంటే ప్రతి విభాగంలోనూ బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి అని స్పష్టం చేశారు. దీంతో 2016 అక్టోబర్‌లో 35 బయోమెట్రిక్ పరికరాలను రూ.3.15 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఉన్నత విద్యామండలి అన్ని వర్సిటీలకు ఒకే సర్వర్‌ను అనుసంధానం చేయడంతో బయోమెట్రిక్ పరికరాలు పనిచేయలేదు. ప్రతి బయోమెట్రిక్ పరికరానికి ఏయిర్టెల్ సిమ్‌లను అటాచ్‌చేశారు. దీంతో ఇవి పనిచేసినా, చేయకున్నా ప్రతి నెలా వేలాది రూపాయలు బిల్లులు చెల్లించాల్సి వస్తోంది. 2013లోనూ బయోమెట్రిక్ పరికరాలు కొనుగోలు చేసినప్పటికీ అవి పనిచేయలేదు. ఆధార్ అనుసంధానం తప్పనిసరి అని స్పష్టం చేయడంతో తిరిగి గతేడాది 35 పరికరాలను కొనుగోలు చేశారు. ఇవి కూడా పనిచేయడంలేదు. -
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన
4,775 మంది విద్యార్థులు హాజరు జేఎన్టీయూ: ఎంసెట్–2017 కౌన్సెలింగ్‌లో భాగంగా 8 నుంచి నిర్వహిస్తున్న సర్టిఫికెట్ల పరిశీలన శనివారం పూర్తి అయింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురంలో 2365 మంది, ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రంలో 2410 మంది మొత్తం 4,775 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. అయితే రాష్ట్రంలోని ఏ హెల్ప్‌లైన్ సెంటర్లో నైనా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యే వెసులుబాటు ఉంది. దీంతో కచ్చితమైన సమాచారం తెలియాల్సి ఉంది. అనంతపురం జిల్లాలో 6,700 ఇంజినీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. తాజా కౌన్సెలింగ్‌లో ఆశించినంత స్థాయిలో సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యార్థులు హాజరుకాలేదు. అనంతపురం జిల్లాలో మూడు ఇంజినీరింగ్ కళాశాలలకు డిమాండ్ అధికంగా ఉంది. వీటిలో ఇప్పటికే యాజమాన్య కోటాలో ఉన్న ఇంజినీరింగ్ సీట్లు పూర్తిగా భర్తీ అయ్యాయి. 20వ తేదీ వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి చివరి తేదీగా నిర్ణయించారు. 21, 22 తేదీలలో వెబ్ ఆప్షన్లు మార్చుకోవడానికి వెసులుబాటు కల్పించారు. 25న సీట్లు భర్తీ కానున్నాయి. -
పీజీ డీఐఎస్ఎంకు దరఖాస్తుల ఆహ్వానం
ఎస్కేయూ : పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ఇంటిగ్రేటేడ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ (పీజీ డీఐఎస్ఎం) కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, రక్షా అకాడమీ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా డిప్లమో కోర్సును సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. కామర్స్, లా, మేనేజ్మెంట్, సైన్సెస్ డిగ్రీలో 50 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన వారికి కొడికొండ చెక్‌పోస్టు వద్ద గల రక్షా అకాడమీలో ఏడాది పాటు శిక్షణ ఇస్తారు. ఆర్మీ, పోలీసు ఫోర్స్‌లలో ఉద్యోగాలు సాధించడానికి ఈ డిప్లమో కోర్సు దోహదపడుతుంది. -
ఎస్కేయూ కాన్వొకేషన్ నోటిఫికేషన్ విడుదల
– జులై 20 వరకు దరఖాస్తుకు అవకాశం – ఆగస్టులో స్నాతకోత్సవం ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం 18వ స్నాతకోత్సవం(కాన్వొకేషన్) ఆగస్టులో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం విడుదల చేశారు. విద్యార్థులకు ఈ నెల 20 నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి జులై 20 చివరి తేదీగా నిర్ణయించారు. తొలిసారిగా కాన్వొకేషన్ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఫీజును సైతం ఆన్లైన్లోనే చెల్లించాల్సి ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఆన్లైన్ బ్యాంకింగ్, మీ సేవ ద్వారా ఫీజు చెల్లించొచ్చు. దరఖాస్తు పూర్తయ్యి, ఫీజును చెల్లించిన తర్వాత హార్డ్‌కాపీని ‘ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్, ఎస్కేయూ, అనంతపురం ’ చిరునామాకు రిజిష్టర్ పోస్టు ద్వారా పంపాలి. 2014, 15, 16 విద్యా సంవత్సరాల్లో డిగ్రీ, పీజీ (రెగ్యులర్, దూరవిద్య), ఎం.ఫిల్, పీహెచ్డీ (రెగ్యులర్) పూర్తి చేసిన వారికి కాన్వొకేషన్ డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. వీరే కాకుండా అంతకుముందే ఉత్తీర్ణతులై.. కాన్వొకేషన్ సర్టిఫికెట్ తీసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే..వారు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు, ఆన్లైన్ దరఖాస్తు తదితర పూర్తి వివరాలను ఠీఠీఠీ.టజుunజీఠ్ఛిటటజ్టీy.్చఛి.జీn అనే వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. స్నాతకోత్సవాన్ని ఆగస్టులో ఏ తేదీన నిర్వహిస్తారనే విషయాన్ని గవర్నర్ ముందస్తు అనుమతితో వెల్లడించనున్నారు. -
డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యాయత్నం
తేలని‘ఫలితం’ ఎస్కేయూ: రాయదుర్గానికి చెందిన ఓ యువకుడు అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో బీఎస్సీ చదివాడు. పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఎస్కేయూలోని పరీక్షల విభాగంలో సప్లిమెంటరీ పరీక్ష ఫీజు కట్టి మరోసారి పరీక్షలు రాశాడు. 2016 నవంబర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. కానీ ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు మాత్రం ఫలితాలు ప్రకటించలేదు. కారణం ఆరా తీస్తే కామన్ సర్వీసెస్ ఫీజు చెల్లించలేదన్న సమాధానం వచ్చింది. వాస్తవానికి అతను ఏటా రూ. 1,050 యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ ఫీజును అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు చెల్లించాడు. కానీ వారు వర్సిటీకి చెల్లించకపోవడంతో డిగ్రీ ఫలితాలు అనౌన్స్డ్ లేటర్ కింద చూపారు. బకాయిలు చెల్లించేంతవరకు ఫలితాలు, మార్క్స్ కార్డులు జారీ చేసేది లేదని వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు స్పష్టం చేశారు. ఆరునెలల పాటు వర్సిటీ చుట్టూ తిరిగిన యువకుడు బుధవారం నేరుగా అనంతపురం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఛాంబర్ వద్దకు చేరుకొని ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నం చేశాడు. అప్రమత్తమైన ఆర్ట్స్ కళాశాల సిబ్బంది అతన్ని అడ్డుకున్నారు. వెంటనే ఆర్ట్స్ కళాశాల జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఎస్కేయూ పరీక్షల విభాగం వద్దకు చేరుకుని బాధిత విద్యార్థికి న్యాయం చేసేందుకు పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేశారు. ఇలా ఈ యువకుడు ఒక్కడే కాదు.. జిల్లాలోని డిగ్రీ కళాశాలల వైఖరితో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ఎంతో మంది ఉన్నారని తెలుస్తోంది. విద్యార్థితో కట్టించుకొన్నప్పటికీ.. డిగ్రీ కోర్సులు చదువుతున్న ప్రతి విద్యార్థితోనూ .. యూసీఎస్ ఫీజులు కట్టించుకుంటున్నప్పటికీ అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు సకాలంలో వర్సిటీకి ఫీజులు చెల్లించిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థుల ఫలితాలు నిలుపుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తోంది. వర్సిటీ నిర్ధారించిన మొత్తం కంటే అదనంగా ఫీజులు కట్టించుకుంటున్నప్పటికీ .. వర్సిటీకి చెల్లించడంలో తాత్సారం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
ఎస్కేయూ వీసీకి సాంబయ్య పురస్కారం
ఎస్కేయూ : ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ సాంబయ్య పురస్కారాన్ని అందుకున్నారు. గుంటూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ నెల 11న నిర్వాహకులు పురస్కారాన్ని వీసీకి అందజేశారు. విద్య, వైద్య, వైజ్ఞానిక సేవా రంగాల్లో విశిష్టమైన సేవలు అందించిన వారికి సీహెచ్ సాంబయ్య స్మారక పురస్కారాన్ని ఏటా అందిస్తున్నారు. ఈ ఏడాదికి ఎస్కేయూ వీసీని ఎంపిక చేశారు. విద్యా రంగంలో ఎనలేని సేవలు అందించి, పాలనదక్షులుగా ఎస్కేయూను ప్రగతి పథంలో నడిపిస్తున్నారని వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్‌ను పలువురు అభినందించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
రూ.8.70 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
ఎస్కేయూలో పాలకమండలి సమావేశం ఎస్కేయూ: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం సోమవారం వీసీ కె.రాజగోపాల్ అధ్యక్షతన వర్సిటీలో నిర్వహించారు. సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. పరీక్షల విభాగం అదనపు నూతన భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు, మెకానికల్ విభాగంలో షెడ్ నిర్మాణానికి రూ.50 లక్షలు , పాలిమర్ సైన్సెస్ విభాగంలో తరగతి గది నిర్మాణానికి రూ. 26.50 లక్షలు, మహిళా వసతి గృహం నూతన భవన నిర్మాణాకి రూ.2.81 కోట్లతో చేపడుతున్న పనులకు పాలకమండలి ఆమోదం తెలిపింది. హాస్టల్స్‌లో ఎలక్ట్రికల్ వైరింగ్‌కు రూ. 10.70 లక్షలు ఖర్చుపెట్టాలని ప్రతిపాదించగా పాలకమండలి సమ్మతించింది. 21 మంది ఆఫీస్ అసిస్టెంట్లకు సంబంధించి నోషన్ ఇంక్రిమెంట్స్, 2010 రీవైజ్డ్ పే స్కేలు అందివ్వడానికి అభ్యంతరాలు ఏమీలేవని పాలకమండలి సభ్యులు అభిప్రాయపడ్డారు. వీరితో పాటుగా నలుగురు సూపరింటెండెంట్లకు నోషన్ ఇంక్రిమెంట్స్ జారీ చేయనున్నారు. ఇదిలాఉండగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పర్యటించి సేవ చేయడానికి మార్కులు కేటాయించాలని రెక్టార్ హెచ్.లజిపతిరాయ్ పాలకమండలి సభ్యలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆయా సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను ఎంచుకొని విద్యార్థులను– సమాజానికి అనుసంధానం చేస్తే వర్సిటీ లక్ష్యం నెరవేరుతుందన్నారు. రిజిస్ట్రార్ సుధాకర్ బాబు పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ ఏ.మల్లిఖార్జునరెడ్డి, ఎండ్లూరి ప్రభాకర్, ప్రొఫెసర్ బి.ఫణీశ్వర రాజు, ముచ్చుకోట బాబు, ఎం. రామయ్య, బి.నాగజ్మోతిర్మయి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : దూరవిద్య పీజీ, డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 103 పరీక్ష కేంద్రాల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆన్లైన్ ద్వారా ప్రశ్నాపత్రాలు పంపనున్నట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జే.శ్రీరాములు తెలిపారు. పరీక్ష ప్రారంభమయ్యే గంట ముందు ఆన్లైన్ ద్వారా ప్రశ్నపత్రాలను ఈ మెయిల్‌కు పంపుతామన్నారు. ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ ద్వారా ప్రిన్సిపల్స్ ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష ముగిసిన వెంటనే జవాబుపత్రాలు రిజిస్టర్ పోస్టు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఇందులో అలసత్వం వహించే పరీక్ష కేంద్రాలపై చర్యలు తీసుకుంటామన్నారు. -
నేడు వర్సిటీల్లో పాలకమండలి సమావేశాలు
ఎస్కేయూ/జేఎన్టీయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ అనంతపురం పాలకమండలి సమావేశాలు సోమవారం వేర్వేరుగా నిర్వహించనున్నారు. నూతన పాలక మండలి ఏర్పాటైన తరువాత ఆయా వర్సిటీలలో నిర్వహించడం ఇదే రెండో సారి . ఎస్కేయూ పాలకమండలి సమావేశం ఉదయం 10 గంటలకు, జేఎన్టీయూ పాలక మండలి సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. ఎక్స్ అఫీషియో సభ్యులైన ఐఏఎస్ అధికారులు సమావేశాలకు హాజరుకాలేమని సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అందుబాటులో ఉన్న సభ్యులతో సమావేశాలు నిర్వహించనున్నారు. -
ఎస్కేయూ సెట్ ఫలితాలు విడుదల
– వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశ పరీక్షలు – 18 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన – వీసీ ప్రొఫెసర్ కె. రాజగోపాల్ వెల్లడి ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ కళాశాలల్లో పీజీ ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన ఎస్కేయూసెట్ – 2017 ఫలితాలను ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్ ఆదివారం విడుదల చేశారు. మొత్తం 30 విభాగాలకు గాను 6,595 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, 6,186 మంది అర్హత (93.80 శాతం) సాధించారని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి పీజీ ప్రవేశ పరీక్షలు ఆన్లైన్ విధానం ద్వారా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇన్స్టంట్ పరీక్ష రాసే విద్యార్థులకు వెసులుబాటు కల్పించే నేపథ్యంలో 18 నుంచి సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుందని చెప్పారు. డిగ్రీ ఇన్స్టంట్ పరీక్ష 10న నిర్వహిస్తారన్నారు. వెబ్ ఆప్షన్ల ద్వారా విద్యార్థులకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకోవచ్చునన్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్లు స్పష్టం చేశారు. ఫలితాలు , ర్యాంకు కార్డులను ఠీఠీఠీ.టజుuఛీ్చౌ.జీn ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. రాత పరీక్షలు పూర్తీ అయిన 48 గంటల్లోనే ఫలితాలు విడుదలకు కృషి చేసిన డీఓఏ ప్రొఫెసర్ రాఘవులను అభినందించారు. కార్యక్రమంలో రెక్టార్ ప్రొఫెసర్ హెచ్. లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు, జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమణ, పీఆర్వో డాక్టర్ పి.బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విభాగాల వారీగా మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థులు విభాగం పేరు అడల్ట్ ఎడ్యుకేషన్ చేతన్‌కుమార్ కురుబ బయో కెమిస్ట్రీ లక్ష్మీ వెంకట చక్రపాణి బయోటెక్నాలజీ గౌసియాబేగం షేక్ బోటనీ లోకనాథ్‌రెడ్డి.జీ కెమిస్ట్రీ గోవర్ధన్.సి కామర్స్ సంతోష్‌కుమార్.డి కంప్యూటర్ సైన్సెస్ మనీష దిబ్బల ఎకనామిక్స్ శ్రావణి ఎం. మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరన్న మాణిక్యాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ శివకుమార్ .డి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ హర్షిత.కె ఇంగ్లీష్ మనోజ్‌కుమార్ ఎస్ జియాగ్రఫీ దివాకర్ గొర్ల జియాలజీ ఈశ్వరయ్య.కె హిందీ సాయిలీల హిస్టరీ హరికృష్ణ.వి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ మంగ్లేనాయక్ రమావత్ మేథమేటిక్స్ ప్రవీణ్ కుమార్ .యు మైక్రోబయాలజీ నషీమా సయ్యద్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఆనంద్.బీ ఫిజిక్స్ ఇంద్రాణి. జే పొలిటికల్ సైన్సెస్ అబ్దుల్లా షేక్ పాలిమర్ సైన్సెస్ జాహ్నవి ఘంటసాల రూరల్ డెవలప్మెంట్ లక్ష్మీనారాయణ సెరికల్చర్ దాసరి హరీష్‌కుమార్ సోషల్ వర్క్ తరుణీ ప్రియా పాటిల్ సోషియాలజీ వంశీ కృష్ణ ఎన్ స్టాటిస్టిక్స్ శ్రావణి ఇద్దే తెలుగు శ్రావణి పులగూర జువాలజీ దీపిక ఎం –మొత్తం 30 విభాగాలకు గాను 12 విభాగాల్లో మహిళలు మొదటి ర్యాంకు సాధించి ప్రతిభను చాటారు. –ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 100 మార్కులకు 99 మార్కులు సాధించిన ఆనంద్ తొలిర్యాంకు దక్కించుకొన్నాడు. -
చేజారిన ‘డెబ్’ గుర్తింపు
–2016–17 విద్యాసంవత్సరం దూరవిద్యకు నోటిఫికేషన్ లేనట్లే –30 వేల మంది విద్యార్థులు పొరుగు వర్సిటీల్లో ప్రవేశం - ఎస్కేయూకు రాబడి నష్టం రూ. 25 కోట్లు – అధికారుల తీరుపై విమర్శలు ఎస్కేయూ : నిధుల సమీకరణకు అంతర్గత వనరులు పెంచుకొని తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకోవాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియమం. అందుకు తగ్గట్టు బోధన, బోధనేతర ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి గ్రాంట్ రూపంలో రాష్ట్ర బడ్జెట్లో కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో ఎస్కేయూకు సింహభాగం ఆదాయం దూరవిద్య విధానం ద్వారా వస్తోంది. ఈ ఆదాయం నుంచి అభివృద్ధి పనులతోపాటు, వర్సిటీ స్వయంగా చేపట్టిన నియామకాలకు సంబంధించిన జీతాలూ చెల్లిస్తున్నారు. ఇంత ప్రాముఖ్యమున్న దూరవిద్య విభాగానికి సకాలంలో డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో , న్యూఢిల్లీ ) గుర్తింపు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహించారు. దీనివల్ల దూరవిద్య ద్వారా అభ్యసించిన విద్యార్థులకు అందజేసే సర్టిఫికెట్లకు గుర్తింపు లభిస్తుంది. మీనమేషాలు.. గత 17 సంవత్సరాల కిందట దూరవిద్య విభాగాన్ని ఎస్కేయూలో ఏర్పాటు చేశారు. 2012, 13,14 సంవత్సరాల్లో దూరవిద్య విభాగం అడ్మిషన్లు గణనీయమైన స్థాయికి చేరాయి. అదేస్థాయిలో ఆదాయం పెరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 220 అధ్యయన కేంద్రాల ద్వారా ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటి స్ధానంలో నిలిచిన దూరవిద్య విభాగానికి డెబ్ గుర్తింపునకు దరఖాస్తు చేయడంలో మీనమేషాలు లెక్కించారు. దీంతో 2016–17 విద్యాసంవత్సరానికి గుర్తింపురాక 30 వేల మంది విద్యార్థుల అడ్మిషన్లకు బ్రేక్ పడింది. ఫలితంగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో అందాల్సిన రూ. 25 కోట్ల రాబడిని వర్సిటీ కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బలోపేతంగా ఉన్న దూరవిద్య విభాగం క్రమంగా బలహీనమవుతోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పొరుగు వర్సిటీలకు తరలిన విద్యార్థులు 2016–17 విద్యాసంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వలేమని అధికారులు స్పష్టం చేయడం వేల మంది విద్యార్థులు పొరుగునున్న వర్సిటీల వైపు దృష్టి సారించారు. అక్కడ విద్యార్థులు ప్రవేశాలు పొందితే వర్సిటీలో పీజీ అయితే రెండు సంవత్సరాలు, డిగ్రీ అయితే మూడు సంవత్సరాలు ఫీజులను ఎస్కేయూ కోల్పోయినట్టయింది. కాగా మేల్కొన్న అధికారులు 2017–18 విద్యాసంవత్సరానికి డెబ్ అనుమతి కోసం ప్రయత్నించగా వచ్చే వారం డెబ్ అధికారులు ఎస్కేయూకు రానున్నారు. అనుమతి లభిస్తే 2017–18 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ కోర్సులకు నోటిఫికేషన్ విడుదల చేస్తారు. -
5 నుంచి దూరవిద్య పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానం ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం లేటరల్ ఎంట్రీ ద్వారా డిగ్రీ , ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ , ఎంబీఏ, ఎంసీఏ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఈనెల 5 నుంచి పరీక్షలు జరుగుతాయని ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె.శ్రీరాములు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ పరీక్షలు ఈనెల 12న, పీజీ పరీక్షలు ఈనెల 11న ముగియనున్నట్లు తెలిపారు. -
సజావుగా ఎస్కేయూ సెట్
ఎస్కేయూ : పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ - 2017 శుక్రవారం సజావుగా ముగిసింది. ఎంఎల్ఐఎస్సీ, పొలిటికల్ సైన్సెస్ ప్రవేశరాత పరీక్షలను ఎస్కేయూ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్‌బాబు పరిశీలించారు పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించిన ఎస్కేయూ సెట్ నిర్వాహకులను రెక్టార్, రిజిస్ట్రార్ అభినందించారు. ఇదిలా ఉండగా అడల్ట్ ఎడ్యుకేషన్‌కు 56, హిందీకి 32, ఎంఎల్‌ఐఎస్సీకి 190, పొలిటికల్ సైన్సెస్‌కు 407 మంది అభ్యర్థులు హాజరయ్యారు. -
రీవాల్యుయేషన్ దరఖాస్తుకు 18న తుదిగడువు
ఎస్కేయూ : డిగ్రీ ఫైనలియర్ రెగ్యులర్ , మొదటి, రెండో సంవత్సరం సప్లమెంటరీ విద్యార్థులు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి 18న తుది గడువుగా నిర్ణయించినట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె.శ్రీరాములు గురువారం తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ. 350 ఫీజు నిర్ణయించినట్లు తెలిపారు. ఒక్కో పేపర్‌కు ప్రత్యేకంగా ఫీజు చెల్లించాలన్నారు. ఎస్కేయూ ఎస్బీఐలో తీసిన చలానాలు మాత్రమే చెల్లుబాటవుతాయన్నారు. 10న ఇన్స్టంట్ పరీక్ష : డిగ్రీలో ఒకే దఫా ఉతీ్తర్ణులై ఒక సబ్జెక్టు ఫైనలియర్లో ఫెయిల్ అయిన విద్యార్థికి ఇన్స్టంట్ పరీక్ష ఈ నెల 10న నిర్వహించనున్నారు. ఫీజు రూ. 1500గా నిర్ణయించారు. తుది గడువు ఈ నెల 6 తో ముగియనుంది. -
రెండు రోజుల్లో ఎస్కేయూ సెట్ ఫలితాలు
ఎస్కేయూ : పీజీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న రాత పరీక్ష ఫలితాలు రెండు రోజుల్లో విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు తెలిపారు. పరీక్ష పూర్తయిన సబ్జెక్టులకు ‘ కీ ’వెరిఫికేషన్ పూర్తి అయిందన్నారు. రాత పరీక్షలు శుక్రవారం ముగిస్తాయన్నారు. ఇదిలా ఉండగా , గురువారం పరీక్ష కేంద్రాన్ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీఎన్ కృష్ణా నాయక్ పరిశీలించారు. -
ఎంత రాసినా సున్నా మార్కులే!
- ఎస్కేయూ డిగ్రీ ఫైనలియర్ ఫలితాల్లో వైచిత్రి - మొదటి, రెండో సంవత్సరంలో 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత - అయినా ఫైనలియర్లో సున్నా మార్కులే - మూల్యాంకనం తీరుపై విద్యార్థుల విస్మయం - రెక్టార్ పర్యవేక్షణలో పునఃపరిశీలన ఎస్కేయూ : - అనంతపురం నగరానికి చెందిన రామాంజినేయులు ఎస్కేయూకు అనుబంధంగా ఉన్న ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చదివాడు. బీఎస్సీ మొదటి సంవత్సరంలో 69 శాతం, రెండో ఏడాది 72శాతం మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. ఫైనలియర్లో మాత్రం స్టాటిస్టిక్స్‌లో కేవలం రెండు మార్కులు వచ్చాయి. పరీక్ష బాగా రాశానని, కావాలంటే జవాబుపత్రం చూడాలని అతను అంటున్నాడు. - ఇదే కళాశాలలో చదివిన బి.ఆంజనేయులు (బీఎస్సీ - స్టాటిస్టిక్స్) మొదటి, రెండో సంవత్సరం 69 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. ఫైనలియర్లో మాత్రం మూడు సబ్జెక్టులు ఫెయిలయ్యాడు. స్టాటిస్టిక్స్‌లో ఏడు మార్కులే వచ్చాయి. ఇతనికి హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఫైనలియర్లో ఫెయిల్ కావడంతో ఉద్యోగం చేజారే ప్రమాదముంది. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేస్తే ఫలితాలు ప్రకటించడానికి రెండు నెలలు పడుతుంది. తాను పరీక్ష బాగా రాసినా ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదంటూ ఆంజనేయులు వాపోతున్నాడు. వీరిద్దరే కాదు.. జిల్లా వ్యాప్తంగా చాలామంది విద్యార్థులకు ఇదే పరిస్థితి ఎదురైంది. డిగ్రీ ఫైనలియర్ ఫలితాల్లో సింహభాగం విద్యార్థులకు సున్నా మార్కులు రావడం విస్మయం కలిగిస్తోంది. మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయా? లేక కంప్యూటర్లో మార్కుల నమోదు సందర్భంగా పొరపాట్లు చేశారా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. గత రెండేళ్లుగా ఎస్కేయూ పరీక్షల విభాగం పనితీరుపై విమర్శలొస్తున్నాయి. గత ఏడాది ఇంటర్నల్ మార్కుల నమోదులో తప్పిదాలు జరగడంతో వేలాది మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. దీంతో ఆ తప్పిదాలను సవరించారు. మరోవైపు ఉత్తీర్ణత బాగా తగ్గడంతో గతేడాది 15 మార్కులు అందరికీ అదనంగా కలిపి (గ్రేస్ మార్కులు) ఫలితాలు ప్రకటించారు. సిలబస్‌లో లేని ప్రశ్నలతో తంటా 2015–16 విద్యా సంవత్సరం నుంచి ఎస్కేయూ డిగ్రీ కోర్సుల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరాల్లో ఉన్న విద్యార్థులకు మాత్రం పాత పద్ధతి (వార్షిక పరీక్షలు)లోనే పరీక్షలు నిర్వహించారు. నూతన విద్యా సంవత్సరం (2017-18) నుంచి పాతపద్ధతికి పూర్తిగా స్వస్తి చెప్పనున్నారు. ఇకమీదట పరీక్షలన్నీ సెమిస్టర్ విధానంలోనే ఉంటాయి. ఇకపోతే ఈసారి పాతపద్ధతిలో ఫైనలియర్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రశ్నలు కఠినంగా ఇవ్వటంతో పాటు సిలబస్‌లో లేని వాటినీ ఇచ్చారు. దీనివల్ల మార్కులు తగ్గాయని విద్యార్థులు వాపోతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఫలితాలు సవరించాలనే డిమాండ్లు అధికమవుతున్నాయి. దీంతో రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్ పర్యవేక్షణలో ఫలితాలను పునఃపరిశీలిస్తున్నారు. ఏయే సబ్జెక్టులు సమస్యాత్మకంగా ఉన్నాయో.. ఆయా బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్లను సంప్రదించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మూల్యాంకనంలో ఎలాంటి తప్పిదాలూ లేవు మూల్యాంకనంలో ఎలాంటి తప్పిదాలకూ అవకాశం లేదు. ఎవరైనా రీవాల్యుయేషన్, రీ కౌంటింగ్, పర్సనల్ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జామినర్ వేసిన మార్కులు తప్పుగా నిర్ధారణ అయితే తక్షణ చర్యలు తీసుకుంటాం. విద్యార్థికి న్యాయం చేస్తాం. ఇప్పటి వరకు వచ్చిన పర్సనల్ వెరిఫికేషన్‌లో ఎలాంటి తప్పిదాలూ కనపడలేదు. –ప్రొఫెసర్ జె.శ్రీరాములు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్, ఎస్కేయూ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ఎస్కేయూ : డిగ్రీ ఫైనలియర్ ఫలితాల్లో తప్పిదాలకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు గురువారం ఎస్కేయూ పరీక్షల విభాగాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించి ఆందోళన చేపట్టారు. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జె.శ్రీరాములుతో వాగ్వాదానికి దిగారు. ఫస్టియర్, సెకండియర్‌లో గణనీయమైన మార్కులు సాధించిన విద్యార్థులకు కూడా ఫైనలియర్లో సున్నా మార్కులు రావడం ఏమిటని ఎస్ఎఫ్ఐ నాయకుడు కొండన్న నిలదీశారు. అనంతరం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. మార్కులు తక్కువ వచ్చిన వారి వివరాలు ఇవ్వాలని, జవాబు పత్రాలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ ఎస్కేయూ శాఖ అధ్యక్షుడు ముస్తఫా, జిల్లా సెక్రటరీ రమేష్, నాయకులు సూర్య చంద్ర, డీవైఎఫ్ఐ నాయకుడు ఆంజినేయులు తదితరులు పాల్గొన్నారు. -
రేపటితో ముగియనున్న ఎస్కేయూ సెట్
ఎస్కేయూ : వర్సిటీ క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఎస్కేయూ సెట్–2017 శుక్రవారం ముగియనున్నాయి. బుధవారం కామర్స్ పరీక్ష జరగడంతో విద్యార్థులు పోటెత్తారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని బుధవారం ఉదయం జరిగిన సమీక్షా సమావేశంలో రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ బీవీ రాఘవులు కూడా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, పరీక్ష కేంద్రాలను బుధవారం సాయంత్రం సెషన్లో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు పరిశీలించారు. -
డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు విడుదల
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫైనలియర్ (రెగ్యులర్/ సప్లిమెంటరీ) పరీక్షా ఫలితాలను వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రాజగోపాల్ సోమవారం విడుదల చేశారు. బీఏ 68.59 శాతం, బీఎస్సీ 48.01, బీకాం 35.54, బీబీఎంలో 72.24 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వెల్లడించారు. స్కూసెట్లో ర్యాంకులు సాధించే విద్యార్థులు పీజీ ప్రవేశాలకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే డిగ్రీ ఫలితాలను ముందే విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ప్రొఫెసర్ హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.సుధాకర్ బాబు, ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ జె.శ్రీరాములు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎంఏ ఆనంద్, డిప్యూటీ రిజిస్ట్రార్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
5న ఎస్కేయూ పాలకమండలి సమావేశం
ఎస్కేయూ : వర్సిటీ పాలక మండలి సమావేశం జూన్ 5న వర్సిటీలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఎజెండా రూపొందిస్తున్నారు. నూతన పాలకమండలి ఏర్పాటైన తరువాత రెండో దఫా ఎస్కేయూలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలు చర్చించనున్నారు. -
‘కౌశల్య వికాస్యోజన’ కింద వివిధ కోర్సుల్లో శిక్షణ
ఎస్కేయూ : ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన పథకం కింద వివిధ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్కేయూ సమీపంలోని ఆది ఫౌండేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎం.ఆంజనేయులు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కోర్సు అనంతరం ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. శిక్షణతోపాటు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. అర్హులైన నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పూర్తివివరాలకు ఫోన్ : 08554–255433, 78423 26156, 91604 25798లో సంప్రదించాలన్నారు. రంగం కోర్సుల వివరాలు అర్హత ఐటీ/ఐటీఈఎస్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పది ఉత్తీర్ణత జూనియర్ సాప్ట్వేర్ డెవలపర్ బీఎస్సీ కంప్యూటర్స్, బీకాం కంప్యూటర్స్, బీటెక్, ఎంసీఏ ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ టెక్నీషీయన్ కంప్యూటింగ్ అండ్ ఇంటర్ ఫెరిఫరల్స్ ఫీల్డ్ టెక్నీషియన్ – నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్ డిప్లమో సీసీటీవీ ఇన్సలేషన్ టెక్నీషియన్ ఐటీఐ డీటీహెచ్ సెట్ఆఫ్ బాక్స్ ఇన్స్టలార్ అండ్ సర్వీస్ టెక్నీషియన్ పది ఉత్తీర్ణత రిటైల్ సేల్స్ అసోసియేట్ పది ఉత్తీర్ణత బ్యాంకింగ్ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్స్– అకౌంట్స్ పేయబుల్ అండ్ రిసీవబుల్ బీకాం బిజినెస్ కరస్పాండెంట్ పది ఉత్తీర్ణత -
ఆన్లైన్ ద్వారా ఫీజుల వసూలు
ఎస్కేయూ: దూరవిద్య విభాగంలో ఆన్లైన్ విధానం ద్వారా కోర్సు ఫీజులు వసూలు చేయనున్నామని డైరెక్టర్ ప్రొఫెసర్ వెంకటనాయుడు తెలిపారు. ‘ చెక్కు నొక్కేసీ.. ఆపై బుకాయింపు ’ అనే శీర్షికతో సాక్షిలో శనివారం కథనం ప్రచురితమైంది. ఈ అంశంపై ఆయన స్పందించారు. రూ.39 లక్షల డీడీ (డిమాండ్ డ్రాప్టు)లు సకాలంలో బ్యాంకుకు పంపడంలో సిబ్బంది అలసత్వంతో వెనక్కు వచ్చాయి. ఎస్కేయూ వీసీ ప్రొఫెసర్ కె.రాజగోపాల్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సుధాకర్ బాబు ఆదేశాలతో గడువు ముగిసిన డీడీలను ఆయా బ్రాంచుల బ్యాంకులకు పంపి రీవ్యాలిడేట్ చేయించామన్నారు. దీంతో రూ.39 లక్షలు వర్సిటీకి ఆదా అయిందన్నారు. ఆన్లైన్ విధానం ద్వారానే అడ్మిషన్లు ప్రక్రియ చేపట్టనున్నామన్నారు. -
రిజిస్ట్రార్ సంతకం ఫోర్జరీ
ఎస్కేయూ : దూరవిద్యా కేంద్రం స్టడీ సెంటర్ నిర్వాహకుడు ఎస్కేయూ రిజిస్ట్రార్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఉదంతం శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్టడీ సెంటర్ల అఫిలియేషన్‌ను ప్రతి ఏటా రెన్యువల్ చేసుకోవాలి. ఇందులో భాగంగా స్టడీ సెంటర్‌ను నిర్వహిస్తున్న కళాశాల వివరాలు, బిల్డింగ్ డ్యాకుమెంట్స్, ల్యాండ్ డ్యాకుమెంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల బాండ్లు తదితర వాటిని అందివ్వాలని దూరవిద్య డైరెక్టర్ కోరారు. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన ఒక స్టడీ సెంటర్ నిర్వాహకుడు ఏకంగా రిజిస్ట్రార్ సంతకాన్ని ఫోర్జరీ చేసుకొని అఫిలియేషన్స్ డాక్యుమెంట్స్ అందించారు. మోసాన్ని పసిగట్టిన దూరవిద్య డైరెక్టర్ ఏకంగా స్టడీసెంటర్ గుర్తింపును రద్దు చేశారు. -
అధికారుల పాపం..
- వికలాంగ విద్యార్థులపై వివక్ష – యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన – సుప్రీం కోర్టు ఆదేశాలు బేఖాతరు –ర్యాంపులు , ప్రత్యేక మరుగుదొడ్లు లేని వైనం. – ఏటా యూజీసీ నిధులు దారి మళ్లింపు ఎస్కేయూ : వర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో వికలాంగ విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో అధికారుల ఉదాశీనతగా వ్యవహరని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. వర్సిటీలోని నాలుగు క్యాంపస్ కళాశాలలో ఫిజికలీ చాలెంజ్డ్ విద్యార్థులు పీజీ, పీహెచ్డీ, బీఈడీ , లా, ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఎంఫిల్ కోర్సులు చేస్తున్నారు. భారత ప్రభుత్వం 2006లో ప్రకటించిన జాతీయ వికలాంగ విధానం అమలులో భాగంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వర్సిటీ సమగ్ర సమీక్ష జరపాలి. అయితే వీరి సంక్షేమానికి ఆ దిశగా బడ్జెట్ కేటాయింపులు ఇంత వరకు వర్సిటీ నామమాత్రంగానైనా కేటాయించిన దాఖలాలు లేవు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పాలక భవనం మినహా : తరగతులు, ల్యాబ్, గ్రంథాలయాల్లో ఎక్కడ కూడా ర్యాంప్స్ లేని పరిస్థితి నెలకొంది. గతేడాది ఏప్రిల్ 29న ఎస్కేయూకు న్యాక్ కమిటీ రావడతో హడావుడిగా పాలకభవనానికి ర్యాంపు సౌకర్యం కల్పించారు. వికలాంగ విద్యార్థులకు అన్నింటా సౌకర్యాలు కల్పించాలని గతేడాది నవంబర్‌లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. లైబ్రరీలో ప్రత్యేకంగా వీరి కోసం ఏర్పాటు చేసిన సెల్‌ను పూర్తిగా మూసేశారు. వాటిలో ఏర్పాటు చేసిన 7 కంప్యూటర్లు రెండు సంవత్సరాలుగా పనిచేయడం లేదు. మెస్ బిల్లుల్లో మినహాయింపు లేదు.. ఉస్మానియా, కాకతీయ లాంటి విశ్వవిద్యాలయాల్లో వికలాంగ విద్యార్థులకు మెస్ బిల్లులో పూర్తి మినహాయింపు ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ జీవో 27 ప్రకారం ఏపీలోని వర్సిటీల్లో దీనిని అమలు చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. ఉన్నత విద్యాశాఖ ఈ మేరకు విశ్వవిద్యాలయాలు అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినా ఫలితం లేదు. ప్రత్యేక వసతి ఏదీ ... ?.. విశ్వవిద్యాలయాల్లో వీరికి చేయూత నివ్వడానికి ప్రత్యేక వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దేవాలయం కన్న శౌచాలయం మిన్న అని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మరుగుదొడ్లను నిర్మాణం చేస్తుంటే వీరి కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మించలేదు. యూజీసీ నిధుల దారి మళ్లింపు.. దృష్టి లోపం (విజువల్) వారికి కేటాయించే సహాయకులకు అందించే మొత్తం (స్కైబ్)కు ఏడాదికి రూ. 2 వేలు చొప్పున ఇవ్వాలి. వీరి కోసం ప్రత్యేకించి పరికరాల పంపిణీకి ఏడాదికి రూ.8 లక్షలు యూజీసీ (యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ ) నుంచి నిధులు మంజూరు అవుతున్నాయి. వీరికి ఉపయోగించాల్సిన నిధులను దారిమళ్లించి ఇతరత్రా అవసరాలకు వినియోగించారు. మూడేళ్లుగా ఆందోళనలు చేస్తున్నాం.. మూడు సంవత్సరాలుగా మా డిమాండ్ల కోసం ఆందోళనలు నిర్వహించాము. అధికారుల్లో ఎలాంటి చలనం లేదు. ఎస్కేయూ మినహా తక్కిన వర్సిటీలలో కేవలం రూ.10లు నామమాత్రం ఫీజుతో పూర్తిగా మెస్‌బిల్లుల మినాహాయింపు వెసులుబాటు కల్పిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం, రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన జీవోలను కూడా పట్టించుకోలేదు. –కొంకా మల్లిఖార్జున, పీహెచ్డీ విద్యార్థి , ఎస్కేయూ. -
29 నుంచి ఎస్కేయూసెట్
ఎస్కేయూ : వర్సిటీలోని క్యాంపస్ కళాశాలలు, అనుబంధ పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎస్కేయూసెట్ –2017 ఈ నెల 29 న ప్రారంభంమై జూన్ 2న ముగుస్తుంది. డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్ల కార్యాలయంలో శుక్రవారం అడ్వైజయిరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ బీవీ రాఘవులు అధ్యక్షత వహించారు. సమావేశంలో రాత పరీక్షల షెడ్యూల్‌ను ఆమోదించారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ జే.శ్రీరాములు, ఆచార్య ఎస్ .శంకర్ నాయక్, డీఓఏ జాయింట్ డైరెక్టర్ రమణ, డిప్యూటీ డైరెక్టర్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. షెడ్యూలిలా.. 29న పాలిమర్ సైన్సెస్, సెరికల్చర్, స్టాటిస్టిక్స్, మైక్రోబయాలజీ, ఎలక్ట్రానిక్స్, జాగ్రఫీ, బోటనీ, ఇన్స్ట్రుమెంటేషన్, జియాలజీ 30న కెమిస్ట్రి, సోషల్ వర్క్, మేథమేటిక్స్, సోషియాలజీ, ఫిజిక్స్, రూరల్ డెవలప్మెంట్, బయోకెమిస్ట్రి. 31న ఎంఈడీ, కంప్యూటర్ సైన్సెస్, ఎంపీఈడీ, బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, కామర్స్ , జూన్ ఒకటిన తెలుగు, ఇంగ్లిష్, హిస్టరీ, జువాలజీ, 2న పొలిటికల్ సైన్సెస్, ఎంఎల్ఐఎస్సీ, హిందీ, అడల్ట్ఎడ్యుకేషన్ పరీక్షలు జరుగుతాయి. -
లబ్‘డెబ్’
–డెబ్ గుర్తింపు వస్తేనే సర్టిఫికెట్లు చెల్లుబాటు –ఇప్పటికే కోర్సు పూర్తిచేసిన విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం –డీఎల్, గ్రూప్–2, గ్రూప్–3 సన్నద్ధమయ్యే వారిలో ఆందోళన ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య విభాగానికి డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) గుర్తింపు ఓ మిస్టరీగా మారింది. దూరవిద్య అందించే డిగ్రీ పట్టాల విశ్వసనీయతకు డెబ్ గుర్తింపు తప్పనిసరి. వివిధ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పించేందుకు ప్రతి ఏటా డెబ్ గుర్తింపు జారీ చేస్తుంది. రెండు విద్యా సంవత్సరాల్లో దూరవిద్య ద్వారా అందజేసిన డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లకు డెబ్ అనుమతి తీసుకోలేదు. అయినప్పటికీ 72 వేల మంది విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. దీంతో ఈ సర్టిఫికెట్లు తీసుకొన్న విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే డెబ్ అనుమతిస్తేనే కోర్సు పూర్తయి ఉత్తీర్ణత అయినట్లు నిర్ధారిస్తారు. పదోన్నతులు, ఉద్యోగాలు పొందిన విద్యార్థులు సర్టిఫికెట్లు చెల్లుబాటు కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సన్నద్ధమయ్యే వారికి నిద్ర కరువు : డిగ్రీ అర్హతతో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహిస్తున్న గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రూప్–2 ప్రిలిమినరీ పూర్తి అయింది. వచ్చే నెలలో మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి. పీజీ పూర్తిచేసి నెట్, సెట్ అర్హతతో డిగ్రీ కళాశాల లెక్చరర్లు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకొన్నారు. జూన్‌లో డీఎల్ పరీక్ష ఉంది. కాగా డెబ్ గుర్తింపు లేకపోవడంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. మేలుకొలుపు : 2015 సంవత్సరం నుంచి డెబ్ గుర్తింపు అనుమతి కోసం అధికారులు దరఖాస్తు కూడా చేయలేదు. తాజాగా నూతన నోటిఫికేషన్ జారీకి ప్రయత్నాలు చేయడం, విద్యార్థుల నుంచి ఒత్తిడి అధికంగా ఉంది. నూతనంగా నియమించిన రెక్టార్ హెచ్.లజిపతిరాయ్ను డెబ్ గుర్తింపు కోసం ఇటీవల ఢిల్లీకి దరఖాస్తు పంపారు. మరో దఫా ఢిల్లీకి వెళ్లి డెబ్ అనుమతి కోసం ప్రయత్నం చేయాల్సి ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఎవరిది బాధ్యత : ఏళ్ల తరబడి నిరీక్షణ తర్వాత అరకొర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో రాత పరీక్షలు సమీపిస్తుండడంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలకు అనర్హులైతే డెబ్ గుర్తింపు తీసుకరావడంలో విఫలమైతే ఎవరు బాధ్యత వహిస్తారని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. -
ఎస్కేయూ రీసెట్ ఫలితాలు విడుదల
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం క్యాంపస్ కళాశాలల్లో ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించిన రీసెట్–2016 ఫలితాలు శనివారం విడుదల చేశారు. ఎస్కేయూలో వీసీ ఆచార్య కె.రాజగోపాల్, రెక్టార్ ఆచార్య హెచ్.లజిపతిరాయ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.సుధాకర్‌బాబు, ఆర్అండ్డీ డీన్ ఆచార్య చింతా సుధాకర్ ఫలితాలను విడుదల చేశారు. వీసీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఆన్లైన్ విధానంలో రీసెట్ నిర్వహించిన ఘనత ఎస్కేయూకు దక్కిందన్నారు. మొత్తం 2,560 మంది దరఖాస్తు చేసుకోగా, 1,646 మంది పరీక్ష రాశారని తెలిపారు. వీరిలో 856 మంది అర్హత సాధించారన్నారు. కార్యక్రమంలో క్యాంపస్ కళాశాలల ప్రిన్సిపాళ్లు ఆచార్య సీఎన్ కృష్ణానాయక్, ఆచార్య వి.రంగస్వామి, పీఆర్వో డాక్టర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
లోకల్, నాన్‌లోకల్ సమస్య పరిష్కరించండి
ఎస్కేయూ : పంచాయితీ సెక్రెటరీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లో లోకల్–నాన్‌లోకల్ అంశాన్ని అస్పష్టంగా పేర్కొన్నారని ఎస్కేయూ విద్యార్థి జేఏసీ ఆరోపించింది. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఆందోళన నిర్వహించారు. పంచాయితీ సెక్రెటరీ రాత పరీక్షలకు పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకున్న జిల్లాకే లోకల్ వర్తిస్తుందని అభ్యర్థుల సెల్ఫోన్లకు మెసేజ్ పంపారని విమర్శించారు. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు అక్కడి పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకుంటే, హైదరాబాద్ లోకల్ కింద పరిగణస్తున్నారని ఆరోపించారు. కర్నూలు జిల్లా విద్యార్థులు అనంతపురంలో పరీక్ష కేంద్రం ఎంపిక చేసుకుంటే , అనంతపురం లోకల్ కింద, కర్నూలును నాన్‌లోకల్ కింద చూపిస్తుండడంతో ఉద్యోగాలు దక్కకుండా కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతికిరణ్, భానుప్రకాష్ రెడ్డి, రవినాయక్, జయచంద్రా రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకులు పులిరాజు, జీవీఎస్ చిన్న శంకర్‌నాయక్, సురేష్ నాయక్ , గ్రూప్–3 అభ్యర్థులు పాల్గొన్నారు. -
15 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
–36 వేల మంది పరీక్షలకు దరఖాస్తు –తొలిసారిగా ఆన్లైన్ ప్రశ్నాపత్రాలకు వాటర్‌మార్క్ విధానం అమలు ఎస్కేయూ : వర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ మొదటి, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి రెండో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహరణకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 36 వేల మంది విద్యార్థులు సెమిస్టర్ పరీక్షలకు దరఖాస్తు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న డిగ్రీ పరీక్షల్లో (సంవత్సరానికి ఒక్క సారి జరిపే) అనుబంధ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు అక్రమాలకు పాల్పడి ప్రశ్నాపత్రాలను సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతున్న నేపథ్యంలో వివాదస్పదమైంది. దీంతో సెమిస్టర్ పరీక్షలు పకడ్భందీగా జరిపేందుకు ఎస్కేయూ పరీక్షల విభాగం అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. పటిష్టంగా అమలు చేయగలిగితే : తొలిసారిగా ప్రశ్నాపత్రాన్ని ఆన్లైన్ విధానం ద్వారా పంపే పద్ధతికి శ్రీకారం చుట్టారు. గతంలో నేరుగా ప్రశ్నాపత్రాన్ని పరీక్ష కేంద్రాలకు చేరవేసే విధానంలో వర్సిటీ అబ్జర్వర్ సమక్షంలో ప్రశ్నాపత్రాలు తీసేవారు. కానీ తాజాగా ఎన్క్రిప్టెడ్ పాస్‌వర్డ్‌ను వర్సిటీ పరీక్షల విభాగం ఉన్నతాధికారులు నేరుగా ఆయా కళాశాలల ప్రిన్సిపాల్ అధికార మెయిల్‌కు, సెల్‌ఫోన్ నెంబర్‌కు మెసేజ్ పంపుతారు. ఈ పాస్వర్డ్ ద్వారా గంట ముందు ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేసుకొని విద్యార్థులకు అందివ్వాల్సి ఉంటుంది. జంబ్లింగ్ విధానం అయినప్పటికీ , విద్యార్థులను పరీక్షలకు అరగంట ముందు వరకు కళాశాల వద్ద ఉంచుకొని ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలు అన్నీ విద్యార్థులకు తెలియపరిచి .. కేవలం 15 నిమిషాల ముందు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి పంపుతున్నారు. ప్రధానంగా అనంతపురం నగరంలో డిగ్రీ కళాశాలలు దగ్గరగా ఉండడంతో ఈ విధానం సులువుగా అమలుచేస్తున్నారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రశ్నాపత్రం వచ్చిన వెంటనే విద్యార్థులకు ప్రశ్నలు తెలియపరచడం, జంబ్లింగ్ పడ్డ కేంద్రానికి విద్యార్థులను నేరుగా కళాశాల బస్సుల్లోనే తరలిస్తూ.. విద్యార్థులకు పూర్తిగా సహకారాలు అందిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వ్యాట్సాప్ ద్వారా ప్రశ్నాపత్రాలు చేరవేయడంతో గత వారం బీకాం ఫైనలియర్ ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ప్రశ్నాపత్రానికి వాటర్‌మార్క్ విధానంను సెమిస్టర్ పరీక్షలకు అమలు చేస్తున్నారు. దీంతో వాట్సాప్, తదితర సామాజిక మాధ్యమాల్లో ఏ కళాశాల నుంచి ప్రశ్నాపత్రం బయటకు వెళ్లిందో ..పసిగట్టే అవకాశం ఉంది . ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ కళాశాలలకు ఇవ్వకముందే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరే విధంగా పరీక్షల విభాగం అధికారులు ఆదేశాలు జారీ చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. -
ముగిసిన రీసెట్
ఎస్కేయూ : వర్సిటీ ఎంఫిల్, పీహెచ్డీ ప్రవేశాలకు నిర్వహించిన రీసెట్–2016 ఆదివారం ముగిసింది. తొలిసారిగా ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 64 శాతం మంది విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలకు హాజరైనట్లు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డీన్ చింతా సుధాకర్ తెలిపారు. ఆదివారం పరీక్ష కేంద్రాన్ని వీసీ కె.రాజగోపాల్ పర్యవేక్షించారు. రీసెట్ సబ్జెక్టులకు సంబంధించి సోమవారం ‘కీ’ని పరిశీలిస్తారు. -
నలుగురు విద్యార్థుల డీబార్
ఎస్కేయూ : వర్సిటీ పరిధిలోని నిర్వహిస్తున్న డిగ్రీ పరీక్షల్లో శనివారం నలుగురు విద్యార్థులు డీబార్ అయినట్లు పరీక్షల విభాగం జాయింట్ డైరెక్టర్ రామ్మూర్తి తెలిపారు. గుత్తిలోని ఎంఎస్ డిగ్రీ కళాశాలలో మాస్ కాపీయింగ్ పాల్పడుతుండగా చర్యలు తీసుకున్నామన్నారు.