ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తిన ఎస్కేయూ
– పక్కా వ్యూహంతో విజయవంతంగా ఆందోళనలు
–జేఏసీ నాయకుల అరెస్ట్.. విడుదల
ఎస్కేయూ (అనంతపురం) : ప్రత్యేక హోదా సాధన కోసం ఎస్కేయూ యువత కదం తొక్కింది. గురువారం ఉదయం నుంచి ఏ మాత్రం సందడి లేకుండా నిర్మానుష్యంగా ఉన్న ఎస్కేయూ క్యాంపస్ సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా హోరెత్తింది. అప్పటికే భారీ స్థాయిలో పోలీసు బలగాలు మోహరించినప్పటికీ చేసేదేమీలేక వారు కూడా మౌనం వహించాల్సి వచ్చింది. దీంతో కొవ్వొత్తుల ర్యాలీ విజయవంతమైంది. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద నుంచి ఇంజినీరింగ్ కళాశాల ప్రధాన ద్వారం వరకు భారీ ర్యాలీని చేశారు.
నాటకీయ పరిణామాలు
ఎస్కేయూలో గణతంత్ర దినోత్సవ కార్యక్రమాలు ముగియగానే .. ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్‌యాదవ్ ప్రత్యేక హోదా జేఏసీ నాయకులను బైండోవర్ చేశారు. వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు జీవీ లింగారెడ్డి, భానుప్రకాష్‌రెడ్డి, జేఏసీ నాయకులు డాక్టర్ ఎన్‌ఆర్ సదాశివారెడ్డి, పులిరాజులను అరెస్ట్ చేశారు. హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటే మీరే బాధ్యత వహించాలంటూ సొంత పూచీకత్తుతో విడుదల చేశారు. మధ్నాహ్నం భోజనం ముగిసిన తరువాత విద్యార్థులు ఎవరి తరగతి గదుల్లోకి వారెళ్లిపోయారు. సాయంత్రం ఆరు గంటలకు వ్యూహం ప్రకారం జాతీయ రహదారిపై మూకుమ్మడిగా వచ్చి ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తించారు.
కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. అనంతరం పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ డాక్టర్ ఎన్‌ఆర్ సదాశివారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి డి. జగదీష్ , జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లికార్జున, పద్మావతి, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు క్రాంతికిరణ్, భానుప్రకాష్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, ఎమ్మార్పీస్ ఎంఎస్ రాజు, ఎన్‌ఎస్‌యూఐ పులిరాజు, బీసీ ఉద్యోగ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏంఏ లక్ష్మణరావు, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయపాల్ యాదవ్, కొంకా మల్లికార్జున ఏఐఎస్‌ఎఫ్ జాన్సన్ , కాంగ్రెస్ నగరాధ్యక్షుడు దాదాగాంధీ తదితరులు పాల్గొన్నారు.
సీఎం దిష్టిబొమ్మ దగ్ధం
అనంతపురం న్యూసిటీ: విశాఖ ఎయిర్‌పోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంపై విద్యార్థి విభాగం నేతలు ఫైర్ అయ్యారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో స్థానిక సప్తగిరి సర్కిల్‌లో సీఎం చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సలాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేంద్రరెడ్డి, జిల్లా అధ్యక్షులు బండి పరుశురాం మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రుల గౌరవాన్ని తాకట్టు పెట్టారనీ, రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. అనంతరం పోలీసులు విద్యార్థి విభాగం నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మదిరెడ్డి నరేంద్రరెడ్డి, నాయకులు లింగారెడ్డి, రఫి, మారుతీనాయుడు, లోకేష్‌శెట్టి, నాగమునీంద్ర తదితరులున్నారు.
ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్
సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేసినందుకు సలాంబాబా, నరేంద్రరెడ్డి, బండిపరుశురాం, లింగారెడ్డి, నాగమునీంద్ర, రఫిలపై యుఎస్ 153(ఏ) ఆర్‌డబ్ల్యూ 34ఐపీసీ కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.