రూ.8.70 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
- ఎస్కేయూలో పాలకమండలి సమావేశం
ఎస్కేయూ:
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సమావేశం సోమవారం వీసీ కె.రాజగోపాల్ అధ్యక్షతన వర్సిటీలో నిర్వహించారు. సమావేశంలో పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. పరీక్షల విభాగం అదనపు నూతన భవన నిర్మాణానికి రూ. 5 కోట్లు, మెకానికల్ విభాగంలో షెడ్ నిర్మాణానికి రూ.50 లక్షలు , పాలిమర్ సైన్సెస్ విభాగంలో తరగతి గది నిర్మాణానికి రూ. 26.50 లక్షలు, మహిళా వసతి గృహం నూతన భవన నిర్మాణాకి రూ.2.81 కోట్లతో చేపడుతున్న పనులకు పాలకమండలి ఆమోదం తెలిపింది. హాస్టల్స్‌లో ఎలక్ట్రికల్ వైరింగ్‌కు రూ. 10.70 లక్షలు ఖర్చుపెట్టాలని ప్రతిపాదించగా పాలకమండలి సమ్మతించింది. 21 మంది ఆఫీస్ అసిస్టెంట్‌లకు సంబంధించి నోషన్ ఇంక్రిమెంట్స్, 2010 రీవైజ్డ్ పే స్కేలు అందివ్వడానికి అభ్యంతరాలు ఏమీలేవని పాలకమండలి సభ్యులు అభిప్రాయపడ్డారు.
వీరితో పాటుగా నలుగురు సూపరింటెండెంట్‌లకు నోషన్ ఇంక్రిమెంట్స్ జారీ చేయనున్నారు. ఇదిలాఉండగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పర్యటించి సేవ చేయడానికి మార్కులు కేటాయించాలని రెక్టార్ హెచ్.లజిపతిరాయ్ పాలకమండలి సభ్యలకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఆయా సబ్జెక్టుకు సంబంధించిన అంశాలను ఎంచుకొని విద్యార్థులను– సమాజానికి అనుసంధానం చేస్తే వర్సిటీ లక్ష్యం నెరవేరుతుందన్నారు. రిజిస్ట్రార్ సుధాకర్ బాబు పాలకమండలి సభ్యులు ప్రొఫెసర్ ఏ.మల్లిఖార్జునరెడ్డి, ఎండ్లూరి ప్రభాకర్, ప్రొఫెసర్ బి.ఫణీశ్వర రాజు, ముచ్చుకోట బాబు, ఎం. రామయ్య, బి.నాగజ్మోతిర్మయి తదితరులు పాల్గొన్నారు.