సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రెండో దశకు(Hyderabad Metro Phase 2) కేంద్రం అనుమతే కీలకం! కేంద్రం అనుమతి కీలకంగా మారింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న రెండో దశ ప్రాజెక్టులో 5 కారిడార్‌లకు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోరైల్ సంస్థ డీపీఆర్‌ను సైతం రూపొందించింది.
రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రం అనుమతి కోసం పంపించారు. ఈ రెండో దశలోనే ఫోర్త్‌సిటీతో పాటు ఉత్తరం వైపు మరో రెండు కారిడార్‌లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు కారిడార్‌ల డీపీఆర్ కోసం అధికారులు తాజాగా కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పాతబస్తీలో భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు చురుగ్గా సాతున్నాయి. ఈ క్రమంలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో కేంద్రం మెట్రో రెండోదశకు పచ్చజెండా ఊపుతుందా? లేక మొండిచేయి చూపుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కేంద్రం వాటా 18 శాతం..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదించిన రెండో దశలో మొదట 5 కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, 76.4 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.24,269 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను అంటే రూ.7,313 కోట్లు వెచ్చిస్తుంది. రూ.4,230 కోట్లతో కేంద్రం 18 శాతం నిధులను అందజేస్తుంది. మిగతా 48 శాతం నిధులను అంటే రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా సేకరించాలనేది ప్రతిపాదన. మరో 4 శాతం (రూ.1033కోట్లు) పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
ఈ మేరకు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో(Budget) కేంద్రం తన వాటాగా ఏ మేరకు నిధులను కేటాయిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దశలవారీగా ప్రాజెక్టు విస్తరణ పనులు కొనసాగనున్న దృష్ట్యా 18 శాతం వాటాలో ఈ బడ్జెట్‌లో కొద్ది మేరకైనా నిధులు లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నగరానికి వచి్చన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తోనూ సీఎం రేవంత్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. మెట్రోతోపాటు మూసీ ప్రక్షాళన, నగర అభివృద్ధి కోసం నిధులను అందజేయాలని కోరారు. ఈ మేరకు మెట్రోకు కేంద్రం నుంచి సముచితమైన నిధులు లభించవచ్చని మెట్రో
అధికారులు అంచనా వేస్తున్నారు.
పూచీకత్తు ఎంతో ముఖ్యం..
మరోవైపు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే ‘సావరిన్ గ్యారంటీ’ కూడా మెట్రో రెండో దశకు కీలకంగా మారింది. సావరిన్ గ్యారంటీ ఉంటేనే జైకా, మలీ్టలేటర్ డెవలప్‌మెంట్ బ్యాంకులు రుణాలను అందజేసేందుకు ముందుకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధుల కంటే బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సేకరించే రూ.వేల కోట్ల రుణాలపైనే ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉంది. 48 శాతం నిధులను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చే పూచీకత్తు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇందుకోసం భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి వస్తేనే రెండో దశ పనులు ముందుకు సాగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment