Metrorail
-
Hyderabad Metro Phase 2: కేంద్రం అనుమతే కీలకం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రెండో దశకు(Hyderabad Metro Phase 2) కేంద్రం అనుమతే కీలకం! కేంద్రం అనుమతి కీలకంగా మారింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు వివిధ మార్గాల్లో మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టనున్న రెండో దశ ప్రాజెక్టులో 5 కారిడార్లకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ సంస్థ డీపీఆర్‌ను సైతం రూపొందించింది. రెండు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో కేంద్రం అనుమతి కోసం పంపించారు. ఈ రెండో దశలోనే ఫోర్త్‌సిటీతో పాటు ఉత్తరం వైపు మరో రెండు కారిడార్లను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు కారిడార్ల డీపీఆర్ కోసం అధికారులు తాజాగా కసరత్తు ప్రారంభించారు. మరోవైపు పాతబస్తీలో భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు చురుగ్గా సాతున్నాయి. ఈ క్రమంలో త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం మెట్రో రెండోదశకు పచ్చజెండా ఊపుతుందా? లేక మొండిచేయి చూపుతుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్రం వాటా 18 శాతం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ప్రతిపాదించిన రెండో దశలో మొదట 5 కారిడార్లలో మొత్తం 54 స్టేషన్లు, 76.4 కిలోమీటర్ల వరకు విస్తరించనున్నారు. ఇందుకోసం రూ.24,269 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులను అంటే రూ.7,313 కోట్లు వెచ్చిస్తుంది. రూ.4,230 కోట్లతో కేంద్రం 18 శాతం నిధులను అందజేస్తుంది. మిగతా 48 శాతం నిధులను అంటే రూ.11,693 కోట్లను ప్రాజెక్ట్ రుణాలుగా సేకరించాలనేది ప్రతిపాదన. మరో 4 శాతం (రూ.1033కోట్లు) పీపీపీ పద్ధతిలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో(Budget) కేంద్రం తన వాటాగా ఏ మేరకు నిధులను కేటాయిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దశలవారీగా ప్రాజెక్టు విస్తరణ పనులు కొనసాగనున్న దృష్ట్యా 18 శాతం వాటాలో ఈ బడ్జెట్లో కొద్ది మేరకైనా నిధులు లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల నగరానికి వచి్చన కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్తోనూ సీఎం రేవంత్‌రెడ్డి సంప్రదింపులు జరిపారు. మెట్రోతోపాటు మూసీ ప్రక్షాళన, నగర అభివృద్ధి కోసం నిధులను అందజేయాలని కోరారు. ఈ మేరకు మెట్రోకు కేంద్రం నుంచి సముచితమైన నిధులు లభించవచ్చని మెట్రో అధికారులు అంచనా వేస్తున్నారు.పూచీకత్తు ఎంతో ముఖ్యం.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుగా ఇచ్చే ‘సావరిన్ గ్యారంటీ’ కూడా మెట్రో రెండో దశకు కీలకంగా మారింది. సావరిన్ గ్యారంటీ ఉంటేనే జైకా, మలీ్టలేటర్ డెవలప్మెంట్ బ్యాంకులు రుణాలను అందజేసేందుకు ముందుకొస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసే నిధుల కంటే బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి సేకరించే రూ.వేల కోట్ల రుణాలపైనే ఈ ప్రాజెక్టు ఆధారపడి ఉంది. 48 శాతం నిధులను రుణాలుగా సేకరించాలని ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇచ్చే పూచీకత్తు ఎంతో ముఖ్యం. ప్రస్తుతం పాతబస్తీలో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్లలో రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఇందుకోసం భూసేకరణ, నిర్మాణాల కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి అనుమతి వస్తేనే రెండో దశ పనులు ముందుకు సాగుతాయి. -
విశాఖ మెట్రో రైలు పనులకు ఆమోదం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం మెట్రోరైల్ నిర్మాణం మొదటి దశ పనులకు ప్రభుత్వం పరిపాలనా ఆమోదం తెలిపింది. రూ.14,309 కోట్లతో 4 కారిడార్లలో 76.90 కి.మీ మేర రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. తొలిదశలో భాగంగా రూ.11,498 కోట్లతో 46.23 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు.పీపీపీ విధానంలో చేపట్టే ఈ పనులకు ఆమోదం తెలుపుతూ సోమవారం పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి కె. కన్నబాబు ఉత్తర్వులిచ్చారు. ఇందులో స్టీల్‌ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది వరకు 34.40 కి.మీ., గాజువాక నుంచి ఓల్డ్ పోస్టాఫీస్ వరకు 5.05 కి.మీ., తాటిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కి.మీ. మేర మూడు కారిడార్లలో పనులు చేపట్టనున్నారు. ఫేజ్–2 కింద కొమ్మాది నుంచి భోగాపురం వరకు 30.67 కి.మీ పనులు చేపడతారు. ఈ ప్రాజెక్టును కేంద్రం 40 శాతం, ప్రైవేటు డెవలపర్స్ 60 శాతం వాటా భరిస్తాయి. విజయవాడ లైట్ మెట్రో రైలు డీపీఆర్‌కు కూడా..విజయవాడ కేంద్రంగా అమరావతి, గన్నవరం తదితర ప్రాంతాలను కలుపుతూ నిర్మించ తలపెట్టిన లైట్ మెట్రో రైలు ప్రాజెక్టు డీపీఆర్‌కు కూడా ప్రభుత్వం ఆమోద ముద్రవేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు. ఫేజ్–1లో 1ఏ, 1బీ కారిడార్ల కింద 38.30 కి.మీ మేర నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో రూ.11,009 కోట్లతో నిర్మాణ పనులు, మరో రూ.1,152 కోట్లతో భూసేకరణ చేపట్టనున్నారు. ఫేజ్–2లో 27.75 కి.మీ మేర నిర్మాణం చేపడతారు. కారిడార్ 1ఏ గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్, 1బీ కారిడార్ పనులు పీఎన్బీఎస్ నుంచి పెనమలూరు వరకు, కారిడార్–3 పనులు పీఎన్బీఎస్ నుంచి అమరావతి (రిజర్వాయర్ స్టేషన్) వరకు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
Video: మెట్రోలో సీటు ఇవ్వలేదని.. యువతిపై వృద్దుడి దౌర్జన్యం
చైనాలో ఓ మెట్రోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతి తనకు కూర్చోవడానికి సీటు ఇవ్వలేదన్న కోపంలో 50 ఏళ్ల వృద్దుడు ఆమెపై కర్రతో దాడి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.బీజింగ్ సబ్వేలైన్ 10లో ఈ ఘటన వెలుగుచూసింది. మెట్రోలో ఒక వృద్ధుడు తన కోసం సీటు ఇవ్వాల్సిందిగా యువతిని అడిగాడు. అయితే తన సీటును వెరొకరికి ఇస్తాను కానీ.. అతనికి మాత్రం ఇవ్వనని చెప్పింది. దీంతో ఆగ్రహించిన వృద్ధుడు ఆమెపై అరవడం ప్రారంభించాడు. అంతేగాక ఆమె మీద మీదకు వచ్చి ఆయన చేతిలోని, కర్రతో యువతిని ఇబ్బంది పెట్టాడు. తన చేతులతోనే ఆమె భుజం మీద కొట్టాడు. అక్కడితో ఆగకుండా.. తన సీటు అడగడంలో తప్పేముందని చెప్పాడు. పోలీసులకు కాల్ చేయండి, మేము పోలీస్ స్టేషన్‌కి వెళ్తాము. నేను నిన్ను వేధిస్తున్నానని చెప్పు. నాకేం భయం లేదు అంటూ దబాయించడం వీడియోలో కనిపిస్తుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వృద్ధుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన జూన్ 24 న జరిగినట్లు తెలిపారు.Beijing China 🇨🇳- Young woman refused to give her seat to the old man. pic.twitter.com/ybCgv8oY6j— Githii (@githii) June 26, 2024 -
TS: భారీ అవినీతి తిమింగలం @500 కోట్లు!
సాక్షి, హైదరాబాద్: భవన అనుమతులు, టౌన్‌ప్లానింగ్‌లో అడ్డగోలుగా అవినీతికి పాల్పడి, వందల కోట్లు అక్రమంగా కూడబెట్టిన తిమింగలం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కింది. హైదరాబాద్ నగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మాజీ డైరెక్టర్, ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్ ఆర్ఎంఎల్) డైరెక్టర్‌గా ఉన్న శివబాలకృష్ణ నివాసం, కార్యాలయాలు, ఆయన బంధువుల ఇళ్లలో ఏసీబీ అధికారులు బుధవారం విస్తృతంగా సోదాలు చేపట్టారు. ఆయన తన పదవిని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. బుధవారం సా యంత్రం వరకు స్వాదీనం చేసుకున్న ఆస్తుల విలువే బహిరంగ మార్కెట్లో రూ.వంద కోట్లకుపైగానే ఉంటుందని చెప్తున్నారు. ఇంకా నిర్ధారించి, విలువ తేల్చాల్సిన ఆస్తులు భారీగానే ఉన్నాయని అంటున్నారు. హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 17 చోట్ల ఏకకాలంలో సోదాలు శివ బాలకృష్ణ హెచ్ఎండీఏలో భూమార్పిడి వినియోగం, హైరైజ్ భవనాలకు అనుమతులు, కీలకమైన పట్టణ ప్రణాళిక (టౌన్‌ప్లానింగ్)కు సంబంధించిన పోస్టుల్లో పనిచేశారు. ఈ క్రమంలో ఆయన ఉన్నతాధికారుల అండదండలతో కీలక పోస్టుల్లో ఏళ్లతరబడి పాతుకుపోయి భారీగా అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారన్న సమాచారం మేరకు ఏసీబీ దాడులకు దిగింది. అధికారులు బుధవారం ఉదయం హైదరాబాద్ శివార్లలోని పుప్పాలగూడలో ఉన్న శివబాలకృష్ణ ఇల్లు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లు కలసి మొత్తం 17 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఇంట్లో అయితే ఏకంగా 20 మంది అధికారులు అన్ని మూలలా జల్లెడపట్టినట్టు తెలిసింది. ఈ సందర్భంగా భారీగా స్థిర, చరాస్తులను గుర్తించారు. పెద్ద సంఖ్యలో ప్లాట్లు, ఫ్లాట్లు, బినామీల పేరిట పెట్టిన ఇతర స్థిరాస్తుల డాక్యుమెంట్లు, రూ.40 లక్షల నగదు, భారీగా బంగారు, వజ్రాభరణాలు, వెండి, పదిహేను వరకు ఐఫోన్లు, పదుల సంఖ్యలో వాచ్‌లను స్వాదీనం చేసుకున్నట్టు తెలిసింది. ఆయనకు పెద్ద సంఖ్యలో బ్యాంకు లాకర్లు ఉన్నట్టు సమాచారం. వాటిని తెరిస్తే మరింత భారీగా ఆస్తుల బయటపడవచ్చని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. గురువారం కూడా సోదాలు జరిపే అవకాశం ఉందని, తనిఖీలు పూర్తయ్యే సరికి ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ రూ.500 కోట్ల వరకు తేలవచ్చని అంటున్నారు. సహకరించని కుటుంబ సభ్యులు, బంధువులు ఏసీబీ అధికారులు సోదాలు చేసిన సమయంలో శివ బాలకృష్ణ, ఆయన కుటుంబ సభ్యులు ఏమా త్రం సహకరించలేదని అధికారులు అంటున్నారు. బినామీ ఆస్తుల పత్రాలకు సంబంధించి ప్రశ్నిస్తే శివ బాలకృష్ణ సమాధానం ఇవ్వనట్టు తెలిసింది. ఆయన కారును కూడా అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. శివబాలకృష్ణ పెద్ద ఎత్తున పెండింగ్ ఫైల్స్‌ను పురపాలక శాఖ ఉన్నతాధికారి అండదండలతో క్లియర్ చేశారని.. పలు నిర్మాణ సంస్థల యజమానుల నుంచి భారీగా సొమ్ము తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. శివ బాలకృష్ణ వ్యవహారశైలితో నష్టపోయిన కొందరు బిల్డర్లు ఏసీబీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఆయనపై ఏసీబీ దాడి నేపథ్యంలో కొందరు టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో ఆందోళన కనిపిస్తోంది. బ్యాంకు లాకర్లను తెరవాల్సి ఉంది ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు ఫిర్యాదులు అందడంతో శివబాలకృష్ణపై దాడులు చేపట్టినట్టు ఏసీ బీ జాయింట్ డైరెక్టర్ సు«దీంద్ర బుధవారం సాయంత్రం వెల్లడించారు. ‘‘బాలకృష్ణ 2018–2023 మధ్య హెచ్ఎండీఏ డైరెక్టర్‌గా కొనసాగారు. మొత్తం 17 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నాం. భారీ ఎత్తున అతి విలువైన భూముల పత్రాలు దొరికాయి. అవన్నీ బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటిని పరిశీలిస్తున్నాం. బాలకృష్ణ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వా«దీనం చేసుకున్నాం. బుధవారం అర్ధరాత్రి వరకు, అవసరమైతే గురువారం కూడా సోదాలు కొనసాగిస్తాం. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది..’’అని ఏసీబీ డీజీ తెలిపారు. శివ బాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశామని, గురువారం ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెడతామని తెలిపారు. ఓ సీనియర్ ఐఏఎస్ భాగస్వామ్యంపై ఆరా! శివబాలకృష్ణ ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహితంగా మెలిగారని, ఆయన కనుసన్నల్లో అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. సదరు ఐఏఎస్ అధికారికి ఈ అవినీతిలో భాగస్వామ్యంపైనా ఆరా తీస్తున్నట్టు చెప్తున్నారు. పురపాలక శాఖలోని అధికారులు సైతం.. సదరు సీనియర్ ఐఏఎస్ అధికారి లక్ష్యంగా దాడులు జరిగాయని చర్చించుకుంటున్నారు. శివబాలకృష్ణ భారీగా ముడుపులు తీసుకోవడమేకాక, కొందరి నుంచి ఆస్తులను రిజిస్టర్ చేయించుకున్నట్టుగా ఏసీబీ అధికారులకు కచ్చితమైన సమాచారం లభించిందని.. ఈ క్రమంలోనే దాడులు జరిగాయని అంటున్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను కొత్త సర్కారు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా నియమించాక ఈ కేసుపై ఫోకస్ పెట్టడం గమనార్హం. -
రైతు రుణమాఫీపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతోపాటు ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం శాసనసభకు వచ్చి న కేసీఆర్‌ను కలిసేందుకు సీఎం చాంబర్ వద్ద ఎమ్మెల్యేలు బారులు తీరడంతో సందడి నెలకొంది. రూ.19 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేస్తూ, సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు.అలాగే హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనంతోపాటు నోటరీ ఆస్తుల క్రమబద్దికరణ వంటి నిర్ణయాలపట్ల కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ను రైతుబాంధవుడిగా పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, కొప్పుల, గంగుల, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా సంబంధిత జిల్లా మంత్రులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి రైతు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలాచారి, ఆంజనేయ గౌడ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రైతన్నల మధ్య వాత్సల్యానికి అద్దంపట్టే క్యారికేచర్‌ను ఈ సందర్భంగా సీఎంకు అందజేశారు. -
మెట్రో స్టేషన్ విషాదం: అనాథలా బతకడం ఇష్టం లేకనే..
అక్షర్ధామ్ మెట్రో సూసైడ్ కేసు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. చెవిటి-మూగ అయితే ఆ యువతి మెట్రో స్టేషన్ నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే అదృష్టం కొద్దీ బతికింది అనుకునేలోపు.. చికిత్స పొందుతూ ఆమె కన్నుమూసింది. జీవితం మీద ఆమెకు అంతలా విరక్తి కలగడానికి వెనక కారణాలు తెలిస్తే అయ్యో పాపం అనకమానరు. పాతికేళ్లకే జీవితాన్ని ముగించాల్సిన అవసరం ఏంటన్న కోణంలో దర్యాప్తు చేసిన పోలీసులకు.. ఒక్కో విషయం తెలుస్తోంది. పంజాబ్ హోషియాపూర్‌కు చెందిన బాధితురాలు.. గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ జీవనం కొనసాగించింది. అయితే ఆమె తల్లిదండ్రులు సహా ఇంట్లో వాళ్లంతా ఎప్పుడో మరణించారు. ప్రస్తుతం ఒక్క బామ్మ మాత్రమే బతికి ఉంది. ఆ పెద్దావిడ కూడా ఇవాళో రేపో అన్నట్లు ఉంది. ఈ తరుణంలో.. ఆవిడ కూడా చనిపోతే.. అనాథగా మిగిలిపోతానేమోనని ఆమె ఆందోళన చెందుతోంది. ఈ విషయమై చాలాకాలంగా ఆలోచిస్తూ డిప్రెషన్లో కూరుకుపోయిన ఆమె.. ఆఫీస్‌లోనూ ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటోందని, కౌన్సెలింగ్ కోసం కూడా సహకరించలేదని ఆమెతో పని చేసిన కొలీగ్స్ చెప్పారు. ఇక ఒంటరితనం గురించి ఆలోచించి.. ఆలోచించి.. చివరకు ఈమధ్యే ఆ యువతి ఉద్యోగం కూడా మానేసిందట. ఆపై అనాథగా మిగిలిపోతానేమోనని ఆందోళనతో.. ఇలా తీవ్ర నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు వెల్లడించారు. Saving Lives... Prompt and prudent response by CISF personnel saved life of a girl who jumped from Akshardham Metro Station. #PROTECTIONandSECURITY #Humanity @PMOIndia@HMOIndia@MoHUA_India#15yearsofCISFinDMRC pic.twitter.com/7i9TeZ36Wk — CISF (@CISFHQrs) April 14, 2022 కాపాడే ప్రయత్నంలో.. నలభై అడుగుల ఎత్తు నుంచి దూకడంతో.. తీవ్రంగా గాయాలపాలై శుక్రవారం ఆమె మృతి చెందినట్లు లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తూర్పు ఢిల్లీ అక్షరధామ్ మెట్రో స్టేషన్ బ్లూ లైన్ మెట్రో ప్లాట్ఫారం చివర నుంచి ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అక్కడే ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది.. ఆమెను నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. పైన ఒక బృందం ఆమెను బతిమాలి ఆత్మహత్య ప్రయత్నం విరమించే దిశగా కృషి చేయగా.. కింద మరో టీం దూకితే గనుక బ్లాంకెట్ సాయంతో ఆమెను పట్టేసుకోవాలని రెడీగా ఉన్నారు. ఈలోపు ఆమె దూకేయగా.. బ్లాంకెట్‌లో పట్టేసుకున్నారు. అయితే తీవ్రంగా గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసిందామె. చదవండి: మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నైట్ కర్ఫ్యూ: మెట్రో సేవల్లో మార్పులివే..
-
నైట్ కర్ఫ్యూ: మెట్రో సేవల్లో మార్పులివే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచే కర్ఫ్యూ నిబంధలను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో సేవల్లో మార్పులు చేస్తున్నట్లు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి ఉండటంతో.. రాత్రి 7.40 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు. ఇక ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని.. మాస్క్ లేని వారికి మెట్రోలోకి అనుమతి లేదన్నారు. కోవిడ్ 19 సేఫ్టీ గైడ్‌లైన్స్ ప్రకారం భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నేటి నుంచి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్ నిర్వహణకు అనుమతినిచ్చింది. చదవండి: తెలంగాణలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ -
రాత్రి 9.30 దాటితే మెట్రో బంద్, మరి ఎలా?
సాక్షి, సిటీబ్యూరో: ట్రాఫికర్ నుంచి గ్రేటర్ వాసులకు విముక్తి కల్పించేందుకు పట్టాలెక్కిన మెట్రో రైలు వేళలు పొడిగించకపోవడం నగరవాసులకు శాపంగా పరిణమించింది. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మూడు రూట్లలో ఉదయం 6 నుంచి రాత్రి 9.30 గంటల వరకు మాత్రమే మెట్రో సర్వీసులు రాకపోకలు సాగిస్తున్నాయి. చివరి రైలు గమ్యస్థానాలకు రాత్రి 10.30 గంటలకు చేరుకుంటుంది. కానీ గ్రేటర్లో అదే సమయంలో వివిధ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ముగించుకొని రాత్రి పొద్దుపోయాక ఇళ్లకు చేరుకోవడం సర్వసాధారణం. ఈనేపథ్యంలో మెట్రో రైలు సరీ్వసులను అర్ధరాత్రి 12 గంటల వరకు నడపాలన్న డిమాండ్లు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. కోవిడ్ కలకలకం నుంచి అన్ని రంగాలు ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న నేపథ్యంలో రైళ్ల వేళలు పొడిగించడం అనివార్యమని ప్రజారవాణా రంగ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. నాడు నాలుగు..నేడు రెండు లక్షలే.... నగరంలో మూడు మార్గాల్లో 69 కి.మీ మార్గంలో మెట్రో రైలు సరీ్వసులు అందుబాటులో ఉన్నాయి. ఈ రూట్లలో గతేడాది మార్చికి ముందు (లాక్‌డౌన్‌కు)నిత్యం నాలుగు లక్షల మంది ప్రయాణించేవారు. సెలవులు, ఇతర పర్వదినాల సందర్భంగా రద్దీ మరో 50 వేల మేర పెరిగేది. కానీ ప్రస్తుతం మూడు రూట్లలో కేవలం 2 లక్షల మంది మాత్రమే మెట్రోను వాడుతున్నారు. ఇటీవల ఎండల తీవ్రత స్వల్పంగా పెరగడంతో రద్దీ 5 శాతం మేర పెరిగినట్లు తెలుస్తోంది. కాగా ఐటీ కారిడార్‌లో వందలాది ఐటీ, బీపీఓ, కేవీపీ కంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది డిసెంబరు వరకు వర్క్ ఫ్రం హోంకు అనుమతించడంతో మెట్రో రద్దీ అనూహ్యంగా పడిపోయిన విషయం విదితమే. మరోవైపు మెట్రో స్టేషన్లలో పార్కింగ్ బాదుడు, స్టేషన్ల నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయించి ప్రయాణీకులు జేబులు గుల్ల చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో మెట్రోకు అనుకున్న స్థాయిలో ఆదరణ పెరగకపోవడం గమనార్హం. నాటి అంచనా 16 లక్షలు..? మెట్రో ప్రాజెక్టు నిర్మాణ ఒప్పందం(2010) ప్రకారం ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం రూట్లలో మెట్రో ప్రయాణీకుల సంఖ్య సుమారు 16 లక్షలు ఉంటుందని అంచనా వేయడం గమనార్హం. కానీ నిర్మాణ సంస్థ అంచనాలు లెక్క తప్పాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కనీసం లాక్డౌన్ కంటే ముందు స్థితి..అంటే 4 లక్షల మార్కును ఎప్పుడు చేరుకుంటుందా అన్నది సస్పెన్స్‌గా మారింది. కింకర్తవ్యం మూడు మార్గాల్లో మెట్రో సర్వీసుల వేళలను ఉదయం 6 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు పొడిగించాలి. గతంలో ప్రకటించినట్లుగా టిక్కెట్లు, స్మార్ట్‌కార్డులపై రాయితీని అమలు చేయాలి. అన్ని స్టేషన్ల వద్ద ఫ్రీ పార్కింగ్ ఏర్పాటు చేయాలి. స్టేషన్ల నుంచి సమీప కాలనీలు,బస్తీలకు ఆర్టీసీ మినీ బస్సులను విరివిగా నడపాలి. అన్ని స్టేషన్లలో కూరగాయలు, నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలి. -
మూడో వారంలో మెట్రో పరుగు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మెట్రో రైళ్లు ఈనెల మూడోవారం నుంచి మళ్లీ కూతపెట్టే అవకాశాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలను క్రమంగా సడలిస్తోన్న క్రమంలో త్వరలో వీటి రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నట్లు మెట్రోరైలు వర్గాలు తెలిపాయి. ఎల్బీనగర్ – మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్ – రాయదుర్గం రూట్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మూడు బోగీలు గల మెట్రో రైలులో పూర్తిస్థాయిలో వెయ్యిమంది ప్రయాణించవచ్చు. కరోనా నేపథ్యంలో విధిగా భౌతికదూరం పాటించాల్సి ఉండడంతో 50 – 60 శాతం ప్రయాణికులతోనే ఇవి రాకపోకలు సాగించే అవకాశముంది. అంటే ఒక్కో రైలులో 500 నుంచి 600మందిని మాత్రమే అనుమతిస్తారు. బోగీల్లో భౌతికదూరం పాటించేందుకు వీలుగా తెల్లటి రౌండ్ సర్కిల్స్ ఏర్పాటుకు యోచిస్తున్నారు. కాలివేళ్లతో టచ్ చేస్తే చాలు! మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్టుల బటన్లను చేతితో తాకే అవసరం లేకుండా కాలివేళ్లతో టచ్‌చేస్తే పనిచేసే ఆధునిక టెక్నాలజీ వినియోగించాలని యోచిస్తున్నారు. ఇప్పటికే చెన్నై మెట్రో ప్రాజెక్టులో చేతితో లిఫ్టు బటన్లను తాకే అవసరం లేకుండా కాలివేళ్లతో టచ్‌చేసేలా సాంకేతికత అందుబాటులో ఉంది. ఇక్కడా అటువంటి ఏర్పాట్లు చేయనున్నట్టు సమాచారం. మరోవైపు బోగీల్లో ప్రయాణికులు పట్టుకొని నిల్చునే హ్యాండిల్స్‌ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయనున్నారు. స్టేషన్లోకి వచ్చే ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోలకే పరిమితమైన రైళ్లకు రోజువారీగా స్పీడ్, లోడ్, ఇతర నిర్వహణ సామర్థ్యపరమైన మరమ్మతులు, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మెట్రో రైలు వర్గాలు తెలిపాయి. -
మెట్రోలో ప్రయాణించిన మోదీ
న్యూఢిల్లీ : ఉగ్రస్థావరాలపై వైమానిక దాడులకు అనుమతిచ్చి జాతి మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన మోదీ.. మరో సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇస్కాన్ మందిరంలో నిర్వహిస్తున్న గీతా ఆరాధన కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ మెట్రోలో ప్రయాణించారు. ఇస్కాన్ అధ్వర్యంలో నిర్వహించిన భారీ భగవద్గీత ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవ్వడం కోసం మోదీ ఇలా మెట్రోలో ప్రయాణించి అందరిని ఆశ్చర్యపరిచారు. 670 పేజీలు, 800 కిలోల బరువైన అతి భారీ భగవద్గీతను మోదీ ఆవిష్కరించారు. ప్రస్తుతం మోదీ మెట్రో జర్నీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వయొలెట్ లైన్ లోని ఖాన్ మార్కెట్ మెట్రో స్టేషన్లో ప్రధాని మోదీ మెట్రో రైలు ఎక్కారు. అనంతరం కోచ్‌లో ఉన్న ప్రయాణికులతో మాట కలిపారు. అయితే మోదీ పక్కన అందరూ ముస్లిం కూర్చుని ఉండటం గమనార్హం. మోదీని చూసిన ఆనందంలో ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. తర్వాత ప్రధాని నెహ్రూ ప్లేస్ మెట్రో స్టేషన్లో దిగారు. ప్రధాని మెట్రో ప్రయాణం దృష్ట్యా ఆ మార్గం అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు చెప్పారు. Let this video speak for itself! 👍 pic.twitter.com/dNHOoEs4cr — Aman Sharma (@AmanKayamHai_ET) February 26, 2019 -
సర్వం సిద్ధం
-
మెట్రోరైల్లో బ్లాక్‌బాక్స్‌లు
సాక్షి ప్రతినిధి, చెన్నై: మెట్రోరైల్ ప్రయాణం ఇక మరింత సురక్షితం. ప్రమాదాలను నమోదు చేయగల విమాన తరహా బ్లాక్‌బాక్స్‌లను చెన్నై మెట్రోరైళ్లలో అమర్చారు. సుందర చెన్నైని మరింత సుందరంగా మారుస్తూ నిర్మితమైన మెట్రోరైల్ గత ఏడాది జూన్ 29న ప్రారంభమైంది. మొత్తం 45.1 కిలోమీటర్ల దూరం కారిడార్‌కు గాను తొలిదశగా 10 కిలోమీటర్లను ప్రారంభించారు. కోయంబేడు-ఆలందూర్ మధ్య మాత్రమే తిరిగే ఈ మెట్రో రైళ్లకు అధిక చార్జీలు వసూలు చేయడం వల్ల ఆశించినంత ఆదరణ లభించలేదు. మెట్రోరైలు ఆర్థిక ఒడిదుడుకులను అధిగమించేందుకు అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ఈ 9 నెలల కాలంలో ఓ మోస్తరుగా పుంజుకోవడంతో యాజమాన్యం కొత్త అంశాలపై దృష్టి పెట్టింది. బ్లాక్‌బాక్స్‌ల అమరిక: విమానం తరహాలో చెన్నైలో పరుగులు తీసే మెట్రోరైళ్లలో బ్లాక్‌బాక్స్‌లను ఇటీవలే అమర్చారు. విమానంలోని బ్లాక్‌బాక్స్‌ల వలెనే ఇవి కూడా ప్రమాదానికి గల కారణాలను గుర్తిస్తాయి. విమానాల్లో డేటా రికార్డర్ అనే బ్లాక్‌బాక్స్‌ల ఏర్పాటు ఉంటుంది. విమానానికి సంబంధించిన అన్ని వ్యవహారాలను ఆ బ్లాక్బ్లాక్స్లు తనంత తానుగా రికార్డు చేస్తుంటాయి. విమానం ప్రమాదానికి గురైన పక్షంలో ఆ బ్లాక్‌బాక్స్‌ను సేకరించి దానిలో రికార్డయిన అంశాలద్వారా కారణాలను విశ్లేషిస్తారు. ఇలా విమానాల్లోని బ్లాక్‌బాక్స్ మాదిరే మెట్రోరైళ్లలో ఈవీఆర్ అనే ఈవెంట్ రికార్డర్ అనే సాధనాన్ని అమర్చారు. ఈ సాధనం మెట్రోరైల్ కంట్రోలు రూమ్, నిర్వాహకుల నెట్వర్క్ సిస్టమ్‌తో అనుసంధానమై ఉంటుంది. రైలు ప్రయాణించే సమయంలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే వాటిని ఈవీఆర్ వెంటనే కనుగొని డ్రైవర్ దృష్టికి తీసుకెళుతుంది. అలాగే మెట్రో రైలులో అమర్చిన సీసీ కెమెరాల పుటేజీని సైతం ఒకటిగా సేకరించి నెట్వర్క్ వీడియో రికార్డరు అనే సాధనంలోకి చేరుస్తుంది. ఇన్ని కోణాల్లో ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణాన్ని కల్పిస్తుంది. ఏదేని కారణాల చేత ప్రమాదం చోటుచేసుకున్న పక్షంలో ఈ రికార్డు ద్వారా అందే సమాచారంతో అదే రకమైన తప్పిదాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. చెన్నై మెట్రోరైల్ లిమిటెడ్ సహాయ మేనేజర్ ఆర్ శ్రుతిశాంభవి తెలిపారు. -
విశాఖలో కూడా మెట్రోరైలు
హైదరాబాద్: హైదరాబాద్ తరహాలో విశాఖపట్టణంలో సైతం మెట్రోరైల్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది . ఇందుకు సంబంధించి నాలుగు కారిడార్లుగా విశాఖపట్టణాన్ని విభజించారు. ఒక్కో కారిడార్‌లో 20 కిలోమీటర్ల చొప్పున మొత్తం 80 కిలోమీటర్ల మేర మెట్రోరైల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్దం చేశారు. ఈ ప్రాజెక్టు పరిశీలనకు ప్రభుత్వం ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. ఈ మెట్రోరైలు ప్రణాళికకు ఎపి మంత్రి మండలి ఆమోదం కూడా తెలిపింది. ఢిల్లీ టెక్నికల్ ఇంజనీర్ టీమ్ ఆధ్వర్యంలో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి సర్వే చేయిస్తున్నట్లు ఎపి ప్రభుత్వం తెలిపింది. విజయవాడ - గుంటూరు - మంగళగిరి-తెనాలిలను కలుపుతూ మెట్రోరైలు ఏర్పాట్లకు ఏపి ప్రభుత్వం త్వరలోనే టెక్నికల్ టీమ్ ఏర్పాటు చేయనుంది. -
మరో 4 ఫ్లై ఓవర్లు
సనత్‌నగర్, న్యూస్‌లైన్ : సిటీలో మరో నాలుగు ఫ్లైఓవర్లు రానున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్ కారిడార్‌లోని కీలక జంక్షన్లలో నిర్మించే వీటికి ఆర్థికసాయం హైదరాబాద్ మెట్రోరైల్ (హెచ్ఎంఆర్) సంస్థ చేస్తుండగా... నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతల్ని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ (ఆర్ అండ్ బీ) చేపడుతోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లలో భాగంగా అంచనాలు, నివేదికలు తయారు చేసేందుకు సంస్థను ఎంపిక చేయడానికి ఆర్ అండ్ బీ సీల్డ్ టెండర్లను ఆహ్వానించింది. వీటి దాఖలు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. నగరంలో ఉన్న ప్రధాన, కీలక జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ, జామ్స్‌ను తగ్గించేందుకు సమాయత్తమైన హెచ్ఎంఆర్ అధికారులు ఫ్లైఓవర్ల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, నివేదికలు పక్కాగా రూపొందించేందుకు సమర్థమంతమైన సంస్థ కోసం అన్వేషణ ప్రారంభించారు. దీనికోసం సీల్డ్ బిడ్స్ ఆహ్వానిస్తూ ఆర్ అండ్ బీ రూరల్ సర్కిల్ ఇటీవలే టెండర్ నోటీసు జారీ చేసింది. పనుల తీరిదీ... సంస్థల నుంచి సేకరించిన బిడ్స్ పరిశీలన అనంతరం ఆమోదం పొందిన వాటికి ఈపీసీ ద్వారా పనులు అప్పగించాలి. ముందుగా ఆయా ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తారనే దానిపై ఆయా కన్స్ట్రక్షన్ సంస్థల నుంచి టెక్నికల్ బిడ్, ఎంత వ్యయంలో పూర్తి చేస్తారనే అంశంపై ఫైనాన్షియల్ బిడ్లను ఆహ్వానిస్తారు. ఇదే క్రమంలో ఆయా సంస్థలకున్న అనుభవం, గతంలో అవి చేపట్టిన ప్రాజెక్టులు తదితర అంశాలకూ ప్రాధాన్యం ఇస్తూ పరిగణన లోనికి తీసుకుంటారు. ఆయా నిర్మాణ సంస్థల నుంచి ఫ్లై ఓవర్ నిర్మాణానికి తయారు చేసిన మూడు నాలుగు రకాల ప్లాన్లను పరిశీలించి ఉత్తమమైనది ఎంపిక చేస్తారు. ఈ డిజైన్‌తో పాటు ఇతర అంశాలనూ ఆర్ అండ్ బీ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్ ఆమోదం కోసం పంపిస్తారు. ఇదంతా టెక్నికల్ బిడ్‌లో ఉంటుంది. ఈ టెక్నికల్ బిడ్‌కు ఆమోదముద్ర పడిన తరవాత ఆర్థికపరమైన అంశాలతో కూడిన ఫైనాన్షియల్ బిడ్స్‌ను తెరుస్తారు. ఎవరైతే తక్కువ ఖర్చు కోట్ చేసినవారికి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాజెక్టును అప్పగిస్తారు. సోమవారం ప్రారంభమైన బిడ్స్ ప్రక్రియ ఈ నెల 24 వరకు కొనసాగించి, అదే రోజు టెక్నికల్ బిడ్స్ ఓపెన్ చేస్తారు. దరఖాస్తు ఫారాలు బల్కంపేట్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో లేదా (aproads.cgg.gov.in) వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. వీటిని పూర్తి చేసి బల్కంపేట్‌లోని కార్యాలయంలో సమర్పించాలి. -
భవనాలను కూల్చొద్దు.. భూసేకరణకు ఓకే
సాక్షి, హైదరాబాద్: మెట్రోరైల్ నిర్మాణంలో భాగంగా అమీర్‌పేటలో సేకరించ తలపెట్టిన భూముల్లో ఉన్న భవనాలను కూల్చవద్దని హైకోర్టు శుక్రవారం అధికారులను ఆదేశించింది. భూసేకరణ ప్రక్రియను మాత్రం యథాతథంగా కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రోరైల్ నిర్మాణంలో భాగంగా అమీర్‌పేటలో రోడ్డు విస్తరణకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను సవాలు చేస్తూ గ్రీన్‌ల్యాండ్స్, అమీర్‌పేట, మధురానగర్, కృష్ణానగర్ సంయుక్త కార్యాచరణ కమిటీ, మరికొందరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని న్యాయమూర్తి విచారించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ, అధికారులు నిబంధనలకు విరుద్ధంగా భూసేకరణ చేస్తున్నారని, దీనివల్ల పిటిషనర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి... మెట్రోరైల్ ప్రాజెక్టు కోసం చేస్తున్న భూ సేకరణ ప్రక్రియను యథాతథంగా కొనసాగించుకోవచ్చని, అయితే ఏ ఒక్క భవనాన్నీ కూల్చవద్దని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ వ్యాజ్యాలను ఇప్పటికే మెట్రోరైల్ వ్యవహారంలో ధర్మాసనం ముందు విచారణలోనున్న వ్యాజ్యాలతో జత చేయాలని రిజిస్ట్రీకి సూచించారు.