
మెట్రో సేవల్లో మార్పులు చేస్తున్నట్లు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి ప్రకటించారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుంచే కర్ఫ్యూ నిబంధలను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మెట్రో సేవల్లో మార్పులు చేస్తున్నట్లు ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి మంగళవారం ప్రకటించారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లోకి ఉండటంతో.. రాత్రి 7.40 గంటల వరకే మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి అని తెలిపారు.
ఇక ప్రతి రోజు ఉదయం 6.30 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతాయని.. మాస్క్ లేని వారికి మెట్రోలోకి అనుమతి లేదన్నారు. కోవిడ్ 19 సేఫ్టీ గైడ్‌లైన్స్ ప్రకారం భౌతిక దూరం పాటించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్లు అందుబాటులో ఉంచామని ఎన్‌వీఎస్ రెడ్డి తెలిపారు.
నేటి నుంచి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. అత్యసవర సేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఇక రాత్రి 8 గంటల వరకే బార్లు, రెస్టారెంట్లు, థియేటర్స్ నిర్వహణకు అనుమతినిచ్చింది.