
సాక్షి, విజయవాడ: ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలో ఓ అధికారి రాసలీలల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత సదరు అధికారి.. ఓ మహిళతో ఏకాంతంగా గడిపిన విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఆఫీసులో సీసీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు.
వివరాల ప్రకారం.. విజయవాడలోని బందరురోడ్డు వెంబడి లైలా కాంప్లెక్స్‌లో ఏపీటీడీసీ డివిజనల్ కార్యాలయంలోని కీలక విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగి రాసలీలల వ్యవహారం బయటకు వచ్చింది. సదరు ఉద్యోగి.. ఆఫీసు వేళలు ముగిసిన తర్వాత ప్రతీ రోజూ రాత్రిపూట తన ద్విచక్రవాహనంపై ఓ మహిళను తీసుకుని ఆఫీసుకు రావడం పలు అనుమానాలకు తావిచ్చింది. అయితే, పర్యాటకాభివృద్ధి సంస్థ ఉద్యోగి కావటంతో సెక్యూరిటీ సిబ్బంది.. ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు.
రోజూ ఇలాగే చేస్తున్న క్రమంలో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది విషయాన్ని ఏపీటీడీసీ అధికారులకు తెలియజేశారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు.. ఆఫీసులో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం, ఆఫీసులో ఉన్న సీసీ ఫుటేజీని పరిశీలించగా వారిద్దరూ అడ్డంగా దొరికిపోయారు. రాత్రి సమయంలో ఉద్యోగి బైకుపై ఓ మహిళ రావడం రికార్డు అయ్యింది. ఆఫీసు వద్ద బైక్ పార్కు చేసి ఆమెను లోపలికి తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కార్యాలయం తాళం తెరిచి, ఆ మహిళను లోపలికి తీసుకెళ్లి తిరిగి తలుపులు వేయడం, అరగంట తర్వాత బయటకు రావడాన్ని అధికారులు గుర్తించారు. అనంతరం, వారిద్దరూ బైక్‌పై వెళ్లిన ఆధారాలను సీసీ ఫుటేజీ ద్వారా సేకరించారు. దీంతో, ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.
ఇదిలా ఉండగా.. గతంలోనూ సదరు అధికారిపై ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. హరిత బెర్మ్‌పార్క్‌లోని స్టాఫ్ రూమ్‌లో కూడా ఇలాంటి వ్యవహారమే నడిపినట్టు తెలిసింది. పార్క్‌లో వాకింగ్ కోసం వచ్చిన మహిళను తరచూ స్టాఫ్‌రూమ్‌లోకి తీసుకెళ్లేవాడు. సిబ్బందిని బయటకు పంపేసి రాసలీలలు సాగించేవాడని సిబ్బంది చెప్పుకొచ్చారు. అనంతరం, సీక్రెట్ కెమెరా పెట్టి మరీ ఈ విషయాన్ని సిబ్బందే వెలుగులోకి తెచ్చారు. ఇక, ఈయన విషయంలో ఇంత జరుగుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.