
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రి ఘాట్‌రోడ్డుపై ఆలయ అధికారులు ఆంక్షలు విధించారు. ఈ నెల 6, 7, 8 తేదీల్లో దుర్గగుడి ఘాట్‌రోడ్డు మూసివేయనున్నారు. మరమ్మతుల దృష్ట్యా ఘాట్‌రోడ్డు మూసివేయాలని అధికారులు నిర్ణయించారు. భక్తులు కనకదుర్గానగర్ మార్గం నుంచి వెళ్లాలని సూచించారు. పున్నమి ఘాట్‌లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
కాగా, ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను సాధారణ రోజుల్లో నిత్యం 30 వేల మందికిపైగా, శుక్ర, శని, ఆదివారాల్లో 60 వేల మందికిపైగా భక్తులు దర్శించుకుంటారు. అయితే ఆలయంలో భద్రతా వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. కొండపైకి గత నెల11వ తేదీన ఉత్తరాదికి చెందిన ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి వేళ కాలినడకన చేరుకోవడంతో పెద్ద దుమారమే రేగింది.
గత నెలలోనే ఘాట్ రోడ్డులోని ఓంకారం మలుపు వద్ద నిలిపిన కారులో 272 గ్రాముల బంగారం చోరీకి గురైంది. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు పని చేయకపోవడం గమనార్హం. కొండపైన కింద 220 సీసీ కెమెరాలు ఉన్నా అవి సరిగా పనిచేయడం లేదు. వాటిని పర్యవేక్షించే పరిస్థితిలేదు. దీన్నిబట్టే అధికారులకు అమ్మవారి భద్రతపై ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం అవుతోంది. కొంత మంది దేవాలయ అధికారులే దర్శనాల దందా చేస్తున్నా పట్టించుకోవడం లేదు. మొత్తం మీద రెగ్యులర్ ఈఓ లేకపోవడంతో పర్యవేక్షణ కొరవడింది.