కృష్ణా తీరాన.. అభివృద్ధి పతాక  | Huge Development At NTR District Andhra Pradesh | Sakshi
Sakshi News home page

కృష్ణా తీరాన.. అభివృద్ధి పతాక 

Published Sun, Jan 7 2024 4:36 AM | Last Updated on Sun, Jan 7 2024 4:39 PM

Huge Development At NTR District Andhra Pradesh - Sakshi

ఓబుల్‌రెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి ప్రతినిధి, విజయవాడ
విజయవాడ.. ఇప్పుడు పేరెన్నికగన్న నగరాలకు దీటుగా రూపుదిద్దుకుంటోంది. ఓ వైపు ఫ్లైఓవర్లు.. మరోవైపు బైపాస్‌ రహదారుల నిర్మాణంతో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. వాణిజ్యపరంగా పేరెన్నికగన్న ఈ నగరంలో కేవలం నాలుగేళ్లలోనే ఊహించని అభివృద్ధి కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిత్యం కృష్ణానది వరదనీటి ప్రవాహం వల్ల ముంపుతో బాధ పడుతున్న నగరవాసులకు రక్షణ గోడతో పూర్తి స్థాయి ఉపశమనం లభించింది. వరద వస్తే చాలు.. తట్టా బుట్టా చేత పట్టుకుని ఎగువ ప్రాంతానికి పరుగులు తీసే దుస్థితి తప్పింది. నగర నడిబొడ్డున ఠీవీగా నిలిచిన అంబేడ్కర్‌ విగ్రహం.. అభివృద్ధి అంటే ఇదీ.. అన్నట్లు మనందరికీ చూపిస్తోంది. మెట్రోపాలిటన్‌ నగరాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో రూపు రేఖలు మారిపోయాయి.   


బెజవాడకు మణిహారం ఫ్లైఓవర్‌లు.... 
నగరవాసులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం చూపేలా కొత్తగా నిర్మించిన జంట ఫ్లైఓవర్లు బెజవాడకు మణిహారంగా నిలుస్తున్నాయి. జెంజి సర్కిల్‌–1 ఫ్లైఓవర్‌ 48 స్పాన్లతో 1.470 మీటర్ల వెడల్పుతో(అప్రోచ్‌రోడ్డు సహా) 2.27 కిలోమీటర్ల పొడవుతో రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించారు.  

► రెండోఫ్లైఓవర్‌ ఏడాదిన్నరలో పూర్తి చేయాలన్నది టార్గెట్‌. కానీ ఏడాదిలోనే అది అందుబాటులోకి వచ్చింది. దీని పొడవు 1.703 కిమీలు, స్పాన్లు 55, వెడల్పు 12.5 మీటర్లు. నిర్మాణానికి అయిన ఖర్చు రూ.96 కోట్లు.  
► దీంతో పాటు బెంజిసర్కిల్‌ ఫ్లైఓవర్‌ వెస్ట్, ఈస్ట్‌ సైడ్‌ సర్వీస్‌ రోడ్డు పనులకు  అడ్డంకిగా నిలిచిన భూసేకరణ సమస్య పరిష్కారమైంది. పశ్చిమం వైపు 2.47 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న సర్వీస్‌రోడ్డుకు రూ. 25కోట్లు ఖర్చు చేస్తున్నారు. తూర్పువైపు పెండింగ్‌లో ఉన్న 860మీటర్ల సర్వీస్‌రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి.  
► బెంజి సర్కిల్‌నుంచి పోరంకి వరకు 6 కిలోమీటర్ల మేర డ్రైనేజీ పనులు రూ. 15కోట్లతో చేపడుతున్నారు. ఇంకా గుణదల ఫ్లైఓవర్, రామవరప్పాడు రింగ్‌ రోడ్డు వద్ద ఫ్లైఓవర్‌ పనులకు మార్గం సుగమం అవుతోంది.  
► గన్నవరం విమానాశ్రయం వద్ద హాఫ్‌ ఫ్లైఓవర్‌ను రూ. 23.77 కోట్లతో నిర్మించారు. హైదరాబాద్‌ హైవే నిర్మాణానికి అవరోధంగా నిలిచిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, అసంపూర్తి పనులను రూ17కోట్లతో చేపట్టారు.  
► గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే(విజయవాడ–ఖమ్మం)కు సంబంధించి భూసేకరణ ప్రక్రియ తుది దశకు చేరింది. త్వరలో పనులు ప్రారంభమవుతాయి. కనకదుర్గ ఫ్లైఓవర్‌కు సంబంధించి అసంపూర్తిగా ఉన్న పనులను ఈ మధ్యనే ప్రారంభించారు. 

బైపాస్‌లతో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ 
నగరానికి వచ్చే వాహనాలకు ఇక ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా వెస్ట్, ఈస్ట్‌ బైపాస్‌ నిర్మాణాలు ఉపకరించనున్నాయి. విజయవాడ వెస్ట్‌ బైపాస్‌కు సంబంధించి 30 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల రహదారి(చిన్న అవుటపల్లి నుంచి– గొల్లపూడి)ని రూ1148 కోట్లతో 2021 ఫిబ్రవరిలో ప్రారంభించారు. పనులు దాదాపు పూర్తయ్యాయి. 


► గొల్లపూడి నుంచి చినకాకాని వరకు 17.88కి.మీ పొడవున రహదారి పనులు, కృష్ణా నదిపై ఐకానిక్‌ వంతెన పనులు వేగంగా సాగుతున్నాయి. విజయవాడ తూర్పు వైపు నిర్మించతలపెట్టిన బైపాస్‌ రోడ్డుకు దాదాపు పూర్తి కావచ్చింది.  

► కృష్ణా జిల్లా పొట్టి పాడు నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు 49.3 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. కృష్ణానదిపైన 3.750 కిలోమీటర్ల పొడవుతో ఐకానిక్‌ వంతెన నిర్మించనున్నారు. దీనికోసం రూ4607.80కోట్లు వెచ్చించనున్నారు. 

ముంపు నుంచి ఉపశమనం 
నగరంలోని కృష్ణానదీతీరవాసులు ఎన్నో దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యనుంచి ఉపశమనం కలిగించారు. కనకదుర్గమ్మ వారధి నుంచి కోటినగర్‌Š వరకూ రక్షణగోడ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం వారధినుంచి పద్మావతి ఘాట్‌ నుంచి రక్షణ గోడ పనులు సాగుతున్నాయి. మొదటి దశలో రూ.93,22 కోట్లు, రెండో దశలో రూ. 180.24 కోట్లు, మూడో దశలో రూ. 120.81 కోట్లు కలిపి మొత్తమ్మీద రూ394.27 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రిటైనింగ్‌ వాల్‌ వెంబడి రెండు దశల్లో రూ.33.39కోట్లతో బ్యూటిఫికేషన్‌ పనులు జరగనున్నాయి. గ్రీనరీ, పార్కులు, వాకింగ్, సైకిల్‌ ట్రాక్‌తో అందంగా తీర్చిదిద్దుతున్నారు. కాలువలపై రూ. 31కోట్లతో ఏడు వంతెనలు నిర్మించారు.  

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిమస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు.  


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బెజవాడ స్వరాజ్య మైదానంలో నిర్మిస్తున్న అంబేడ్కర్‌ స్మృతి వనం పనులు తుది దశకు చేరుకున్నాయి. ప్రపంచస్థాయి పర్యాటకులను సైతం ఆకర్షించేలా 125 అడుగుల భారీ అంబేడ్కర్‌ విగ్రహం ఠీవిగా నిలిచింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా ఈ ప్రాజెక్టును పర్యవేక్షించారు. జనవరి19న 
ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్నారు.  

అందాల వాడగా తీర్చిదిద్దాం  
బెజవాడను అందాల వాడగా తీర్చిదిద్దాం. నగరంలో జలకాలుష్యం తగ్గించేందుకు మూడు ప్ర«ధాన కాలువలను శుభ్రం చేశాం. కెనాల్‌ బండ్స్‌ను సుందరీకరించాం, ప్లాస్టిక్‌ వినియోగం తగ్గేలా చేశాం. విజయవాడలో రోడ్లు, గ్రీనరీ, పార్కులను అభివృధ్ది చేశాం. 
– స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, కమిషనర్, వీఎంసీ 

ట్రాఫిక్‌ కష్టాలను గట్టెక్కించాం 
నగర వాసులకు ట్రాఫిక్‌ కష్టాల నుంచి ఉపశమనం కలిగించేలా ఫ్లైఓవర్‌లు నిర్మించాం. జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చాం. నగరంలో రోడ్లు, పచ్చదనం చేపట్టాం. కృష్ణానది వెంబడి రక్షణ గోడ నిర్మించాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. 
– ఎస్‌.ఢిల్లీరావు, కలెక్టర్, ఎన్టీఆర్‌ జిల్లా 

నగరాభివృద్ధిపై మహానేత చెరగని ముద్ర 
విజయవాడ నగర అభివృద్ధిపై మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి చెరగని ముద్ర వేశారు. ఆయన ఐదేళ్ల పాలనలో నగరాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. పేదలకు జేఎన్‌యూఆర్‌ఎం కింద గృహాలు నిర్మించి అందజేశారు. నగర శివారులో వైఎస్సార్‌ కాలనీ నిర్మించారు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి చనమోలు వెంకట్రావు పేరుతో మిల్క్‌ ప్రాజెక్టు వద్ద ఫ్లై ఓవర్‌ నిర్మించారు. రైల్వే స్టేషన్‌ రోడ్డు, గుణదల పడవల రేవును కలుపుతూ 6 కిలో మీటర్ల మేర బీఆర్టీఎస్‌ రోడ్డు నిర్మించారు. అజిత్‌సింగ్‌ నగర్‌ బుడమేరు వరద నివారణకు కట్ట నిర్మించారు.  

సీఎం వైఎస్‌ జగన్‌ హయాంలో... 
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలందరికీ ఇళ్లు పేరుతో ఎన్టీఆర్‌ జిల్లాలో తొలి విడతలో 1.07లక్షల మందికి ఇళ్లు మంజూరు చేశారు. వాటిలో 14,995 ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహ ప్రవేశాలు చేశారు. కాల్వ గట్లు, ప్రభుత్వ స్థలాల్లో , రోడ్ల పక్కన ఆవాసం ఉంటున్న వారిని తొలగించి వాంబే కాలనీలో ఇళ్లు కేటాయించారు. పటేల్‌ నగర్‌ ప్రకాష్‌ నగర్, సుందరయ్య నగర్, నేతాజీ కాలనీ, రాధానగర్, రాజీవ్‌నగర్, వడ్డెర కాలనీ, నందా వారి కండ్రిక ప్రాంతాల్లో గతంలో కార్పొరేషన్‌ 13,915 ఇళ్లు నిర్మించి కొన్నింటినే రిజి్రస్టేషన్‌ చేశారు. 

టీడీపీలో గ్రాఫిక్స్‌తోనే సరి... 
టీడీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధిపై శీత కన్నేసింది. అమరావతి రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌తోనే ప్రజలను మభ్య పెట్టి కాలయాపన చేసింది. విజయవాడకు సంబంధించి ప్రధాన ఫ్లై ఓవర్లు, రోడ్లు, ట్రాఫిక్‌ సమస్య గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. టీడీపీ హయాంలో ప్రారంభమైప కనకదుర్గ ఫ్లై ఓవర్‌ç పూర్తి చేయకుండా కాలం వెళ్లదీసింది.

బెంజిసర్కిల్‌ ఫ్లై ఓవర్‌ పూర్తి చేయాలనిగానీ, నగరానికి నలువైపుల నుంచి పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీకి అనుగుణంగా రోడ్లను జాతీయ రహదారులను అభివృద్ధి చేయాలన్న ఆలోచనే చేయలేదు. ఐదేళ్ల పాటు గ్రాఫిక్స్‌తో ప్రజల కళ్లకు గంతలు కట్టారు. ఈవెంట్లతో పబ్బం గడుపుకున్నారు.  గత టీడీపీ హయాంలో అభివృద్ధి పేరుతో మాయ చేసిన వైనాన్ని, ఈ ప్రభుత్వం  ఫ్లై ఓవర్లు, వెస్ట్, ఈస్ట్‌ బైపాస్, నగరంలో రోడ్లు, కాల్వల ప్రక్షాళన, పచ్చదనం వంటి పనులు చేపట్టిన తీరు చూసి నిజమైన అభివృద్ధి అంటే ఇది అని చర్చించుకుంటున్నారు.  

సరికొత్తగా ఇంద్రకీలాద్రి 
ఇప్పటికే సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్న ఇంద్రకీలాద్రిపై మరిన్ని అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌  ఇటీవలే ప్రారం¿ోత్సవాలు, కొత్తవాటికి శంకుస్థాపన చేశారు. కనకదుర్గానగర్‌ గోశాల వద్ద రూ. 216.05 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ. 23.145కోట్లతో పూర్తయిన పనులను ప్రారంభించారు.  

ఆధ్యాత్మిక విహారం 
కృష్ణా నదిలో జల విహారానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నదీ తీరంలోని  అలయాలు, పర్యాటక ప్రదేశాలను కలుపుతూ టెంపుల్‌ టూరిజంకు రూపకల్పన చేశారు. కృష్ణా నదిలో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ జలవిహారం చేస్తూ 82 కిలోమీటర్ల వరకూ ప్రయాణం చేయటం ద్వారా ఎనిమిది ప్రాంతాలను కవర్‌ చేసే విధంగా ఇన్‌ ల్యాండ్‌ వాటర్‌ వేస్‌ సంస్థ చర్యలు తీసుకొంటోంది.

ఇందుకోసం దుర్గఘాట్‌నుంచి అమరావతి వరకు ఐదు ప్రదేశాలను కలుపుతూ ఓ సర్క్యూట్‌ ఏర్పాటు చేస్తున్నారు. ముక్త్యాల నుంచి అమరావతికి నాలుగు ప్రదేశాలను కలుపుతూ ఇంకో సర్క్యూట్‌ ఏర్పాటు చేస్తున్నారు.  జెట్టీలలోనే భోజనం, అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకొంటున్నారు. పిల్లలకోసం ఆట పరికరాలు, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కులు, ఓపెన్‌గేమ్స్, ఎడ్వంచర్‌ గేమ్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. 

ప్రతిపాదనలు  ఇలా... 
రెండు యాంత్రీకరణ బోట్లు  
కొనుగోలుకు : రూ.22 కోట్లు 
ఏడు ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణం, 
సౌకర్యాలకోసం : రూ. 24 కోట్లు 
రూఫ్‌ టాప్‌ సోలార్‌ పవర్‌ 
చార్జింగ్‌ స్టేషన్ల కోసం: రూ.4 కోట్లు 
మొత్తం అయ్యే ఖర్చు : రూ .50 కోట్లు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement