
పోతేపల్లిలో శక్తి వైన్‌షాపును వెంటనే తొలగించాలంటూ ఆందోళన చేపట్టిన మహిళలు, గ్రామస్తులు
ఇళ్ల మధ్య వైన్‌షాపు వెంటనే తొలగించాలంటూ ఆందోళన
పోతేపల్లిలో రోడ్డెక్కిన మహిళలు, గ్రామస్తులు, పెద్దలు
మంత్రి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదంటూ మండిపాటు
దిగొచ్చిన అధికారులు, వైన్‌షాపులో అమ్మకాలు నిలుపుదల
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మారుమూల గ్రామాల్లోనూ ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌లు ఇస్తామని చెప్పిన నాయకులు అధికారంలోకి వచ్చాక వీధివీధికి బెల్టుషాపులు మాత్రం పెట్టిస్తున్నారని కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామానికి చెందిన మహిళలు మండిపడ్డారు. పోతేపల్లి గ్రామం జ్యూయలరీ పార్కు సమీపంలో నివాస గృహాల మధ్య ఏర్పాటుచేసిన శక్తి వైన్‌షాపును వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. వైన్‌షాపు ఎదుట బైఠాయించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. షాపు వల్ల మందుబాబులు అల్లరి చేష్టలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడెక్కడి నుంచో కొత్త వ్యక్తులు వచ్చి గొడవలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
పర్మిట్ రూంకు అనుమతి లేనప్పటికీ షాపు నిర్వాహకులు చుట్టూ పరదాలు కట్టి మరీ మందుబాబులతో వైన్‌షాపు వద్దే తాగిస్తున్నారంటూ ఆరోపించారు. గృహాల మధ్య వైన్‌షాపునకు అనుమతి ఇవ్వొద్దంటూ సాక్షాత్తూ ఎక్సైజ్‌శాఖ మంత్రికి పిటిషన్ పెట్టినా ఫలితం లేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదిహేను రోజుల్లో షాపును తొలగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన మంత్రి పత్తా లేకుండా పోయారంటూ మండిపడ్డారు. హోంమంత్రి అనితను కలిసి సమస్య విన్నవించినా ఫలితం లేకపోయిందన్నారు. కలెక్టర్ కూడా అదే ధోరణిలో వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైన్‌షాపు వెంటనే తొలగించకుంటే ఎలాంటి పోరాటానికైనా తాము సిద్ధమని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో షాపు నిర్వాహకులు, పోతేపల్లి గ్రామస్తులకు మధ్య కొద్దిపాటి వాగ్వాదం జరిగింది. విషయం తెలుసుకున్న బందరు రూరల్ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇరుపక్షాలతో చర్చలు జరిపారు. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో నిర్వాహకులు షాపునకు తాళం వేసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. ధర్నాలో పోతేపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు పిప్పళ్ల నాగబాబు, అంజి, కిషోర్, అనిల్, నాగబాబు, స్థానిక మహిళలు పాల్గొన్నారు.