
కంపెనీల్లో డైరెక్టర్, మేనేజ్‌మెంట్ పదవుల్లో పెరుగుతున్న మహిళల సంఖ్య
బోర్డు డైరెక్టర్లుగా 2017లో 4.47 లక్షల మంది.. 2025కి 9.08 లక్షలకు పెరుగుదల
సీనియర్ మేనేజ్‌మెంట్ స్థానాల్లో 23 వేల నుంచి 38 వేలకు పెరిగారు
ఇతర నిర్వహణ పోస్టుల్లో 4.32 లక్షల నుంచి 8.83 లక్షలకు పెరిగారు
మహిళలు, పురుషులు 2024 నివేదికలో కేంద్రం వెల్లడి
తరాలు మారాయి. అంతరాలు పోతున్నాయి. ఒకప్పుడు మహిళలంటే.. వంటింటికే పరిమితమని.. నాయకత్వ బాధ్యతలకు పనికిరారని ఉండేవన్నీ అపోహలే అని తేలిపోతోంది. ‘ముదితల్ నేర్వగరాని విద్య గలదే.. ముద్దార నేర్పించినన్..’ అన్నది రుజువవుతోంది. పదుగురికీ ఉపాధి కల్పించే సంస్థల్లో నాయకత్వ బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తిస్తున్నారు. ఒకరు ఇద్దరుగా.. ఇద్దరు నలుగురిగా.. మొదలైన మహిళల ప్రస్థానం నేడు అక్షరాలా లక్షల్లోకి చేరింది.
సాక్షి,అమరావతి: దేశంలో అన్ని రంగాల్లోని కంపెనీల్లో మహిళల విశిష్ట పాత్ర పెరుగుతోంది. కంపెనీల్లో మేనేజర్ నుంచి కంపెనీ డైరెక్టర్లు, అత్యున్నత స్థాయిలోనూ రాణిస్తున్నారు. 2017 నుంచి 2025 వరకు దేశంలోని కంపెనీల కీలక స్థానాల్లో మహిళల పాత్ర పెరుగుదలను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విశ్లేíÙంచింది. ‘మహిళలు–పురుషులు–2024’ నివేదికలో ఆ వివరాలు వెల్లడించింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల పదవుల్లో 2017లో 4.47 లక్షల మంది మహిళలుండగా, 2025 నాటికి ఈ సంఖ్య 9.08 లక్షలకు పెరిగినట్లు ఈ నివేదిక తెలిపింది.
సీనియర్ మేనేజ్‌మెంట్ పదవుల్లో 2017లో 23 వేల మంది మహిళలుండగా 2025 నాటికి 38 వేలకు పెరిగారు. ఇతర నిర్వహణ పదవుల్లో 2017లో 4.32 లక్షల మంది మహిళలుండగా 2025 నాటికి 8.83 లక్షలకు పెరిగారు. ఇతర సీనియర్ నిర్వహణ పదవుల్లో పురుషులు, మహిళల నిష్పత్తి 2017లో 1:0.36 ఉండగా 2025 నాటికి 0.41కి పెరిగింది. బోర్డు డైరెక్టర్ల పదవుల్లో మహిళల నిష్పత్తి 0.35 నుంచి 0.40కి పెరిగింది. ఈ పదవుల్లో మహిళల నిష్పత్తి 0.16 నుంచి 0.20 మాత్రమే పెరిగింది. ఇక్కడ లింగ అంతరాలను మరింత తగ్గించాల్సి ఉందని నివేదిక పేర్కొంది.
ఈ ఎంఎస్‌ఎంఈలకు మహిళలే మహారాణులు
దేశంలోని ఎంఎస్‌ఎంఈల్లో ‘ఉద్యమ్’ పోర్టల్‌లో నమోదైన వాటిలో 2020 జులై 1 నుంచి 2024 సెప్టెంబరు 31 నాటికి.. మహిళలు యజమానులుగా ఉన్నవి 66,61,675. వీటిలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులు 4.05 కోట్లకుపైనే. మహిళా శక్తికి ఇదొక నిదర్శనం. ఈ ఎంఎస్‌ఎంఈల్లో 25 లక్షలకు పైగా ఉద్యోగులు ఉన్న రాష్ట్రాలు 7 మాత్రమే. అందులో దక్షిణాది రాష్ట్రాలే 4 ఉండటం విశేషం.