
రాత్రివేళ గంట స్క్రీన్ చూస్తే నిద్రలేమిప్రమాదం 59 శాతం పెరుగుదల
దీనివల్ల 24 నిమిషాలు తగ్గుతున్న నిద్ర
నార్వే శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడి
సాక్షి, అమరావతి: వ్యసనంగా మారిన సెల్‌ఫోన్ స్క్రీనింగ్ నిద్రలేమికి కారణమవుతోంది. రాత్రివేళ సెల్‌ఫోన్‌లో ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్‌లు, సినిమాలు చూడటం నిద్రా సమయాన్ని మింగేస్తున్నాయి. ఓ ఐదు నిమిషాలు సెల్‌ఫోన్‌తో కాలక్షేపం చేద్దామని మొదలుపెట్టి అరగంట.. గంట.. రెండు గంటలవుతున్నా నిద్రపట్టదు. ఈ సమస్య ప్రస్తుతం ఎందరినో వేధిస్తోంది.
ఇందుకు ప్రధాన కారణం నిద్ర సమయంలో సెల్‌ఫోన్ వినియోగమేనని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇదే అంశాన్ని ఇటీవల నార్వే శాస్త్రవేత్తలు సైతం వెల్లడించారు. నిద్ర సమయంలో గంటసేపు స్క్రీన్ చూడటం వల్ల నిద్రలేమి ప్రమాదం 59 శాతం పెరుగుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. గంటసేపు స్క్రీన్ చూస్తూ గడపటం వల్ల నిద్ర సమయం సైతం 24 నిమిషాలు తగ్గుతోందని గమనించారు.
బ్లూ రేస్‌తో మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావం
మొబైల్, ల్యాప్‌ట్యాప్స్, ఇతర డిజిటల్ స్క్రీన్స్ నుంచి వెలువడే బ్లూ రేస్ నిద్రకు తోడ్పడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు తెలిపారు. అలా స్క్రీన్ చూస్తూ ఉండటంతో హార్మోన్ ఉత్పత్తి ఆలస్యమై మేల్కోనే సమయం పెరిగి నిద్రలేమి సమస్యలకు దారితీస్తున్నట్టు వివరించారు.
నిద్రకు ఉపక్రమించడానికి ముందు 30 నిమిషాల పాటు సామాజిక మాధ్యమాలను చూసే వయోజనులు నిద్రలో కలత, అంతరాయం వంటి సమస్యలు ఎదుర్కొంటారని, గతంలో అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పరిశోధకులు గుర్తించారు. నిద్రలేమి సమస్యలు 1.62 రెట్లు ఎక్కువయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇది ఆరోగ్యంపైనా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. భావోద్వేగాల నియంత్రణ, జ్ఞాపకశక్తి, మెదడు పనితీరుపై ప్రభావం పడుతుందన్నారు. బీపీ, షుగర్, ఊబకాయం వంటి సమస్యలు దీర్ఘకాలంలో తలెత్తుతాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
45 వేల మందిపై అధ్యయనం
నిద్రలేమి సమస్యపై అధ్యయనంలో భాగంగా నార్వే శాస్త్రవేత్తలు 45వేల మంది విద్యార్థులపై పరిశోధన చేపట్టారు. వీరి వయసు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉంది. వీరిని మూడు విభాగాలుగా విభజించి అధ్యయనం చేసినట్టు వెల్లడైంది. ఈ క్రమంలో రాత్రిపూట నిద్రకు ఉపక్రమించే సమయంలో ఎక్కువగా స్క్రీన్ చూస్తుండటంతో నిద్రపోయే సమయం తగ్గడం, పేలవమైన నిద్ర వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా స్క్రీన్ వాడకం నిద్ర అంతరాయంలో కీలక కారకమని సూచించారు.