ఆత్మీయ నేస్తాలు.. పుంగనూరు పొట్టి దూడలు | Punganur short calves are worth lakhs | Sakshi
Sakshi News home page

ఆత్మీయ నేస్తాలు.. పుంగనూరు పొట్టి దూడలు

Published Mon, Jan 6 2025 6:05 AM | Last Updated on Mon, Jan 6 2025 6:05 AM

Punganur short calves are worth lakhs

యజమానులపై ప్రేమ.. విశ్వాసం వీటి సొంతం 

రూ.లక్షల ధర పలుకుతున్న అరుదైన జాతి         

దేశవ్యాప్తంగా పెరిగిన డిమాండ్‌

మూడడుగుల ఎత్తుంటాయి.. చూడముచ్చటగా కనిపిస్తాయి. మార్కెట్‌లో ధర మాత్రం లక్షల్లో పలుకుతాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ పుంగనూరు పొట్టి దూడలను పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. అదృష్ట చిహ్నంగా భావించే ఈ దూడలను పెంచుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. 

ఈక్రమంలో ఔత్సాహిక రైతులు చిట్టి ‘పొట్టి’ నేస్తాలను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయిస్తున్నారు. అపురూప దూడలను విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విశిష్ట జాతిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోపొట్టి దూడల సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. 

పలమనేరు : పుంగనూరు పొట్టిరకం దూడల పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పుట్టిన సమయంలో ఈ దూడ కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. జీవితకాలంలో కేవలం మూడడుగులు మాత్రమే పెరుగుతుంది.  తోక నేలను తాకేలా ఉండే ఈ రకం దూడలకు ప్రస్తుతం భలే డిమాండ్‌ వచ్చింది. ఫస్ట్‌ క్వాలిటీ రకం దూడలు రూ.2 నుంచి 4 లక్షలు పలుకుతున్నాయి. రెండో క్వాలిటీ దూడలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రేటుకు అమ్ముడవుతున్నాయి. 

ఈ దూడలు ఇంట్లో ఇంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం వరిస్తుందనే మాట వినిపిస్తోంది. వీటిని కొనేందుకు  వందలాదిమంది నిత్యం పశువుల సంతలు, రైతుల వద్దకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల జాబితాలో ఇప్పుడు పొట్టిదూడలు సైతం చేరిపోయాయి. వీటికి పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి. 

15 సెం.మీ నుంచి 50 సెం.మీ మాత్రమే ఎత్తు కలిగిన ఈ దూడలు ముద్దులొలుకుతుంటాయి. పొట్టి ఆవులు 85 సెం.మీ నుంచి 110 సెం.మీ  ఎత్తు పెరుగుతాయి. పలమనేరు ప్రాంతంలో కొందరు రైతులు వీటిని ఫామ్స్‌లో మేపి పొట్టి జాతిని ఉత్పత్తి చేయిస్తూ వాటిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. సోషల్‌ మీడియాలోనూ పొట్టి రకం దూడల వ్యాపారం ఊపందుకోవడం విశేషం. 

ఇందుకే అంత డిమాండ్‌ 
పుంగనూరు పశువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి యజమానులపై విశ్వాసం ప్రదర్శిస్తాయి. æ పొట్టి దూడలు ఇంట్లో తిరుగుతుంటే చాలా మంచిదని జనం నమ్ముతారు. పొట్టి ఆవులు ఇచ్చే పాలలో రోగనిరోధకశక్తి అధికంగా ఉంటుంది. ఈ పాలను సేవిస్తే అనారోగ్యం దరిచేరదని విశ్వాసం.

తక్కువ మేత.. అధిక పాల దిగుబడి
పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్‌ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. ఇది 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది.  మేలైన పుంగనూరు  ఎద్దుల వీర్యాన్ని పుంగనూరు రకం పొట్టి ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తోంది.   వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు ఆర్‌కేవీవై కృషి చేస్తోంది. 

ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, ఇందులో 277 వరకు పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోనే ఉన్నాయి. ఈ పశువులు తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాల దిగుబడినిస్తాయి. వీటి మూత్రంలో సైతం ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

రైతులకు అందిస్తున్నాం 
పలమనేరు పరిశోధన కేంద్రంతోపాటు ఏపీ ఎల్‌డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని రైతులు పొందవ­చ్చు. ఆవు ఎదకొచ్చిన తర్వాత స్థా­నిక వెటర్నరీ వైద్యు­డి పర్యవేక్షణలో సె­మ­న్‌ అందిస్తున్నాం. పుంగనూరు పొట్టి­జాతిని అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఈ వీర్యం అవసరమైన రైతులు క్యాటిల్‌ఫామ్‌లో కూడా తీసుకోవచ్చు.               –వేణు, శాస్త్రవేత్త, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, తిరుపతి 

మూడేళ్లుగా పెంచుతున్నా 
మూడేళ్లుగా పుంగనూరు రకం పొట్టి దూడలు పెంచుతున్నా. దేశవాళీ రకం పుంగనూరు ఆవుల ద్వారా దూడలను ఉత్పత్తి చేయిస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలామంది పొట్టి దూడలు పెంచుతున్నారు. వీటికి భారీ డిమాండ్‌ ఉంది. ఆసక్తి ఉంటే రైతులకు ఇది ఎంతో లాభదాయకం. – మణి, రైతు, మారేడుపల్లె, గంగవరం మండలం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement