Palamaneru
-
కుంకీలతో కట్టడి సాధ్యమేనా
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్‌ఫెన్సింగ్‌ను 40 కి.మీ మేర ట్రెంచ్‌లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్‌ఫెన్సింగ్‌ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్‌లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్‌ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు.... పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్‌లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.క్యాంప్ పనులు సాగుతున్నాయి పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్‌వో, చిత్తూరుకుంకీలతోనైనా సమస్య తీరితే చాలు.. గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది. – ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
ఆత్మీయ నేస్తాలు.. పుంగనూరు పొట్టి దూడలు
మూడడుగుల ఎత్తుంటాయి.. చూడముచ్చటగా కనిపిస్తాయి. మార్కెట్లో ధర మాత్రం లక్షల్లో పలుకుతాయి. ప్రపంచంలోనే అరుదైన ఈ పుంగనూరు పొట్టి దూడలను పోటీపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. అదృష్ట చిహ్నంగా భావించే ఈ దూడలను పెంచుకునేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలో ఔత్సాహిక రైతులు చిట్టి ‘పొట్టి’ నేస్తాలను ప్రత్యేకంగా ఉత్పత్తి చేయిస్తున్నారు. అపురూప దూడలను విక్రయించి లాభాలను ఆర్జిస్తున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఈ విశిష్ట జాతిని మరింతగా పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగా పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోపొట్టి దూడల సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. పలమనేరు : పుంగనూరు పొట్టిరకం దూడల పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. పుట్టిన సమయంలో ఈ దూడ కేవలం అడుగు ఎత్తు మాత్రమే ఉంటుంది. జీవితకాలంలో కేవలం మూడడుగులు మాత్రమే పెరుగుతుంది. తోక నేలను తాకేలా ఉండే ఈ రకం దూడలకు ప్రస్తుతం భలే డిమాండ్ వచ్చింది. ఫస్ట్ క్వాలిటీ రకం దూడలు రూ.2 నుంచి 4 లక్షలు పలుకుతున్నాయి. రెండో క్వాలిటీ దూడలు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు రేటుకు అమ్ముడవుతున్నాయి. ఈ దూడలు ఇంట్లో ఇంటే ఆరోగ్యంతో పాటు అదృష్టం వరిస్తుందనే మాట వినిపిస్తోంది. వీటిని కొనేందుకు వందలాదిమంది నిత్యం పశువుల సంతలు, రైతుల వద్దకు తిరుగుతున్నారు. సాధారణంగా ఇళ్లలో పెంపుడు జంతువులైన కుక్కలు, పిల్లుల జాబితాలో ఇప్పుడు పొట్టిదూడలు సైతం చేరిపోయాయి. వీటికి పేరు పెట్టి ఆ పేరుతో పిలిస్తే వెంటనే వచ్చేస్తాయి. 15 సెం.మీ నుంచి 50 సెం.మీ మాత్రమే ఎత్తు కలిగిన ఈ దూడలు ముద్దులొలుకుతుంటాయి. పొట్టి ఆవులు 85 సెం.మీ నుంచి 110 సెం.మీ ఎత్తు పెరుగుతాయి. పలమనేరు ప్రాంతంలో కొందరు రైతులు వీటిని ఫామ్స్‌లో మేపి పొట్టి జాతిని ఉత్పత్తి చేయిస్తూ వాటిని రూ.లక్షలకు విక్రయిస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పొట్టి రకం దూడల వ్యాపారం ఊపందుకోవడం విశేషం. ఇందుకే అంత డిమాండ్ పుంగనూరు పశువులు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంటి యజమానులపై విశ్వాసం ప్రదర్శిస్తాయి. æ పొట్టి దూడలు ఇంట్లో తిరుగుతుంటే చాలా మంచిదని జనం నమ్ముతారు. పొట్టి ఆవులు ఇచ్చే పాలలో రోగనిరోధకశక్తి అధికంగా ఉంటుంది. ఈ పాలను సేవిస్తే అనారోగ్యం దరిచేరదని విశ్వాసం.తక్కువ మేత.. అధిక పాల దిగుబడిపలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రం ప్రారంభమైంది. ఇది 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. మేలైన పుంగనూరు ఎద్దుల వీర్యాన్ని పుంగనూరు రకం పొట్టి ఆవులను పెంచుతున్న రైతులకు అందిస్తోంది. వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు ఆర్కేవీవై కృషి చేస్తోంది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి పశువులు 700 దాకా ఉండగా, ఇందులో 277 వరకు పలమనేరులోని పశు పరిశోధన కేంద్రంలోనే ఉన్నాయి. ఈ పశువులు తక్కువ మేతతో ఎక్కువ వెన్నశాతం కలిగిన పాల దిగుబడినిస్తాయి. వీటి మూత్రంలో సైతం ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.రైతులకు అందిస్తున్నాం పలమనేరు పరిశోధన కేంద్రంతోపాటు ఏపీ ఎల్డీఏ ద్వారా కూడా ఈ జాతి వీర్యాన్ని రైతులు పొందవచ్చు. ఆవు ఎదకొచ్చిన తర్వాత స్థానిక వెటర్నరీ వైద్యుడి పర్యవేక్షణలో సెమన్ అందిస్తున్నాం. పుంగనూరు పొట్టిజాతిని అభివృద్ధికి కృషి చేస్తున్నాం. ఈ వీర్యం అవసరమైన రైతులు క్యాటిల్‌ఫామ్‌లో కూడా తీసుకోవచ్చు. –వేణు, శాస్త్రవేత్త, ఎస్వీ వెటర్నరీ వర్సిటీ, తిరుపతి మూడేళ్లుగా పెంచుతున్నా మూడేళ్లుగా పుంగనూరు రకం పొట్టి దూడలు పెంచుతున్నా. దేశవాళీ రకం పుంగనూరు ఆవుల ద్వారా దూడలను ఉత్పత్తి చేయిస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలామంది పొట్టి దూడలు పెంచుతున్నారు. వీటికి భారీ డిమాండ్ ఉంది. ఆసక్తి ఉంటే రైతులకు ఇది ఎంతో లాభదాయకం. – మణి, రైతు, మారేడుపల్లె, గంగవరం మండలం -
సచివాలయం, ఆర్బీకే, ఆస్పత్రికి తాళమేసిన టీడీపీ నేతలు!
పలమనేరు: టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనేందుకు గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆస్పత్రి సిబ్బందిని బలవంతంగా బయటకు పంపి.. ఆయా కార్యాలయాలకు తాళాలు వేసిన ఘటన అద్దం పడుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని జగమర్లలో గురువారం సాయంత్రం చోటుచేసుకోగా.. శుక్రవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ప్రజల సౌకర్యార్థం రచ్చబండ వద్ద వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించింది. ఈ కార్యాలయాల్లో మొత్తం 16మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. గతంలో ఈ కార్యాలయాలకు దారితోపాటు.. సీసీ రోడ్డును సైతం గత ప్రభుత్వమే నిర్మించింది. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు పక్కనే ఉన్న వైఎస్సార్సీపీకి చెందిన రెడ్డెప్పరెడ్డి సోదరుల పట్టా భూమిలో నుంచి దారి ఇవ్వాలంటూ గురువారం వాగ్వాదానికి దిగారు. ఇప్పటికే దారి ఉన్నప్పటికీ తన పట్టా భూమిలో ఎందుకు దారి వదలాలని సంబంధిత రైతు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన పచ్చనేతలు దుర్భాషలాడుతూ.. కార్యాలయాల్లోని సిబ్బందిని బయటకు పంపి.. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆస్పత్రికి తాళాలు వేశారు. కోరినచోట దారి కల్పిస్తేనే కార్యాలయాలు తెరుస్తామంటూ హెచ్చరించారు. దీనిపై గ్రామ సర్పంచ్ విజయ్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
చిగురిస్తున్న ‘టమాటా’ ఆశలు
పలమనేరు: ధరలుంటే సరుకుండదు... సరుకుంటే ధరలుండవు... ఇదీ కొన్నేళ్లుగా చిత్తూరు జిల్లా, పలమనేరు ప్రాంతంలో టమాటా రైతుల దుస్థితి. ఈనెల మొదటివారంలో 14కిలోల బాక్స్ ధర రూ.200 నుంచి రూ.250 దాకా ఉండగా, గడచిన రెండ్రోజుల నుంచి ఆ ధర క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మంగళవారం నాటికి బాక్స్ ధర రూ. 500కు చేరింది. ప్రస్తుతం బయటి రాష్ట్రాలనుంచి వ్యాపారులు టమాటా కొనుగోలు నిమిత్తం పలమనేరు మార్కెట్‌కు వస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కోత కోస్తున్న స్థానిక టమాటా తగ్గుతోంది. ఇప్పటికే కోతలు ముగిసిన తోటలు వడిగిపోతున్నాయి. ప్రస్తుతం కోతదశలో ఉన్న తోటలకు గిరాకీ తగిలే అవకాశాలున్నట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.బయటి రాష్ట్రాల్లో తగ్గిన పంట బయటి రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రల్లో టమాట పంట తగ్గింది. కర్ణాటకలో వైరస్ కారణంగా పంట దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో డిమాండ్ పెరగడంతో పలమనేరు టమాటాధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో సరుకు లేనందున ఈ రెండు వారాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
టీడీపీ మైనింగ్ మాఫియా అరాచకం.. క్వారీలో దారుణ హత్య
సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో టీడీపీ మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లో పలమనేరులో అనధికారికంగా క్వారీల నిర్వహణ జరుగుతోంది. అంతేకాకుండా అక్కడ పనిచేస్తున్న వారిపై దాడులు కూడా జరుగుతున్నాయి.వివరాల ప్రకారం.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పలమనేరు నియోజకవర్గంలో టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాజాగా పలమనేరు మండలం కొలమాసనపల్లిలో శరత్ కుమార్ అనే వ్యక్తి క్వారీని టీడీపీ నేత ఆక్రమించుకున్నారు. ఇక, అక్కడ క్వారీలో పనిచేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా వారిని వేధింపులకు గురిచేస్తున్నాడు సదరు టీడీప నేత. అంతేకాకుండా క్వారీలో పనిచేస్తున్న చిన్నస్వామి అనే యువకుడిని క్వారీలో చంపిపడేయటం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, ఈ హత్య విషయం పలమనేరు పోలీసు స్టేషన్‌కు చేరింది. పోలీసు స్టేషన్లో టీడీపీ నేతలు పంచాయతీ పెట్టారు. ఇక, మృతుడు చిన్న స్వామి డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతుడి కుటుంబీకులు, వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి రూ.50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అతడిని హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. -
పలమనేరు: ఉప్పొంగిన అభిమాన సంద్రం (ఫొటోలు)
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)
-
మాకొద్దీ మాయదారి మద్యం
పలమనేరు/బైరెడ్డిపల్లి (చిత్తూరుజిల్లా) : చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం మేకల మాగిరెడ్డిపల్లి గ్రామస్తులు మద్యం తాగకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఎవరు అతిక్రమించినా జరిమానాతో పాటు గ్రామ బహిష్కరణ చేయాలని సర్పంచ్‌తో కలిసి నిర్ణయం తీసుకున్నారు. మేకల మాగిరెడ్డిపల్లిలో మొత్తం 270 కుటుంబాలు, రెండు వేల దాకా జనాభా ఉన్నారు. దాదాపు అందరికీ కూలీనాలీయే జీవనాధారం. అయితే కొన్నాళ్లుగా కొందరు కర్ణాటక టెట్రాప్యాకెట్లను తెచ్చి గ్రామంలో అమ్ముతున్నారు. దీంతో యువకులు మద్యానికి బానిసలై కుటుంబాలకు భారంగా మారారు. దీన్ని గమనించిన సర్పంచ్ బాలకృష్ణ గ్రామ పెద్దలతో చర్చించి వారం రోజుల కిందట పంచాయితీ పెట్టించారు. తమ గ్రామం బాగుపడాలంటే ఊర్లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. మద్యం తాగినా, కర్ణాటక నుంచి ఎవరైనా మద్యం తెచ్చి అమ్మినా వారికి రూ.20 వేల జరిమానాతో పాటు, గ్రామ బహిష్కరణ చేయాలని తీర్మానించారు. ఫలితంగా గ్రామంలో వారం నుంచి మద్య పానం ఆగిపోయింది. అమ్మకాలు నిలిచిపోయాయి. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం.. మా గ్రామంలో చాలామంది మద్యానికి బానిసలైపోవడంతో కలత చెందాం. దీంతో పాటు కర్ణాటక నుంచి టెట్రా ప్యాకెట్లను తెచ్చి విక్రయించేవాళ్లు ఎక్కువయ్యారు. దీంతో గ్రామంలో యువకులు చెడిపోవడంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. – బాలకృష్ణ, సర్పంచ్, ధర్మపురి పంచాయతీ -
ప్రభవించిన పుంగనూరు
పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి చేస్తున్న పుంగనూరు జాతి ఆవు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైన బ్రీడ్ కన్జర్వేషన్ అవార్డు–2022కు ఎంపికైంది. ఈ నెల 23న కిసాన్ దివస్ సందర్భంగా హరియాణాలోని కర్నాల్‌లోగల జాతీయ జన్యు వనరుల కేంద్రం(యానిమల్ జెనటిక్ రిసోర్స్ సెంటర్)లో ఈ అవార్డును అందించనున్నారు. దీనికి సంబంధించిన సమాచారం రిసోర్స్ సెంటర్ చీఫ్ సైంటిస్ట్ ఏకే మిశ్రా నుంచి ఇప్పటికే అందిందని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ వీసీ డా.పద్మనాభరెడ్డి చెప్పారు. ప్రపంచంలోనే అరుదైన రకం పశువులుగా పుంగనూరు పొట్టి పశువులకు పేరుంది. వీటి ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్న నేపథ్యంలో వీటిని మరింత ఉత్పత్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్కేవీవై ద్వారా కృషిచేస్తోంది. ఇందులో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ నిధుల ద్వారా పలమనేరు పశు పరిశోధన కేంద్రంలో ఐవీఎఫ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కృత్రిమ పిండోత్పత్తి ద్వారా పుంగనూరు జాతి పశువులను ఎక్కువగా ఉత్పత్తి చేసే అవకాశం ఏర్పడింది. – పలమనేరు పొట్టి పశువుల పరిశోధన కేంద్రం లక్ష్యం ఇదీ పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ వద్ద 1953లో సంకర జాతి ఆవుల ఉత్పత్తి, పరిశోధన కేంద్రంగా ఈ పశు పరిశోధన సంస్థ ప్రారంభమైంది. 1995 నుంచి పుంగనూరు పొట్టి రకం పశువుల ఉత్పత్తి కేంద్రంగా మారింది. 20 పొట్టి రకం పశువులతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు.. 268 పశువులు వరకూ చేరింది. అయితే నూతన సాంకేతిక పద్ధతుల ద్వారా వీటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో స్థానిక పరిశోధన కేంద్రంలో ఆర్కేవీవై, ఐకార్ నిధులు రూ.2.85 కోట్లతో పిండమార్పిడి కేంద్రాన్ని(ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ల్యాబ్), ఐవీఎఫ్(ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్)ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో పుంగనూరు జాతి ఎద్దు నుంచి సెమన్‌ను తీసి ఎదకొచ్చిన ఆవుకు ఇచ్చేవారు. దీంతో ఆవుకు ఓ దూడ మాత్రమే పుట్టేది. అయితే ఐవీఎఫ్ ద్వారా ఎద్దు సెమన్ నుంచి ఎక్కువ కణాలను తీసుకుని సరోగసి పద్ధతిలో ఎదకొచ్చిన ఎక్కువ ఆవులకు ఇంప్లాంట్ చేస్తారు. దీంతో ఒకే ఏడాదిలో ఈ జాతి పశువులను ఎక్కువ ఉత్పత్తి చేసేందుకు వీలవుతుంది. ఈ విధానం ద్వారా ఏటా వందల సంఖ్యలో పొట్టి రకం పశువుల ఉత్పత్తి జరగనుంది. వచ్చే ఐదేళ్లలో వీటి సంఖ్యను 500కు పెంచే లక్ష్యంతో పశు పరిశోధన కేంద్రం కృషి చేస్తోంది. అధిక వెన్న, పోషక విలువలు పుంగనూరు ఆవులు మూడడుగుల పొడవు మాత్రమే ఉంటాయి. తోకలు దాదాపుగా నేలను తాకుతుంటాయి. ఇవి సగటున 1 నుంచి 2 లీటర్ల వరకు మాత్రమే పాలిస్తాయి. ఈ పాలలో ఎక్కువ వెన్నతో పాటు.. పోషక విలువులు, రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటాయి. తక్కువ మేతతోనే జీవించగలుగుతాయి. ఇవి మనిషిని అత్యంత ప్రేమగా నమ్మి విశ్వాసంగా ఉంటాయి. తనకు పరిచయం లేని వారిని దరిదాపులకు కూడా రానివ్వవు. ఒక్కో ఆవు ధర రూ.10 లక్షల దాకా ఉంది. -
స్కాట్లాండ్లో పలమనేరు విద్యార్థి మృతి
సాక్షి, చిత్తూరు(పలమనేరు): కీలపట్లకు చెందిన విద్యార్థి స్కాట్లాండ్లో ఈనెల 19న మృతి చెందగా, మృతదేహాన్ని తెప్పించేందుకు బాధిత కుటుంబం అవస్థలు పడుతోంది. గంగవరం మండలం కీలపట్లకు చెందిన గ్రంది సుబ్రమణ్యం బెంగళూరులోని గంగానగర్‌లో కాపురముంటూ అక్కడే గ్లాస్‌వర్క్ షాపు నడుపుకుంటున్నాడు. ఇతని కుమారుడు గిరీష్‌కుమార్ లండన్‌లోని లీసెస్టర్ విశ్వవిద్యాలయంలో ఎంఎస్ చదువుతున్నాడు. ఇతనితోపాటు హైదరాబాద్‌కు చెందిన బాశెట్టి పవన్, చిలకమర్రి సాయివర్మ అక్కడే చదువుతున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మోడపల్లి సుధాకర్ సైతం లీసెస్టర్‌లోనే ఉద్యోగం చేస్తున్నాడు. వీరందరూ కలసి పంద్రాగస్టు వేడుకలను లండన్‌లో చేసుకున్నారు. ఆపై విహారం కోసం ఈనెల 19న స్కాట్లాండ్కు కారులో బయలు దేరారు. వెస్ట్రన్ స్కాట్‌ల్యాండ్‌లోని ఏ–8–27 రోడ్డులో వెళుతుండగా వీరి కారు ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో గిరీష్(23) పవన్(22), సుధాకర్(30) మృతిచెందారు. సాయివర్మ అక్కడి గ్లాస్కో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్కాట్‌ల్యాండ్ పోలీసులు అక్కడి ఇండియన్ డిప్లమాటిక్ ఆఫీసర్‌కు సమాచారం ఇచ్చారు. ఇక్కడినుంచి భారతవిదేశీ వ్యవహారాల శాఖ స్కాట్‌ల్యాండ్ అధికారులతో మాట్లాడింది. అయితే మృతదేహాలను ఇండియాకు రప్పించే ప్రయత్నాలు ఆలస్యమవుతున్నట్టు గిరీష్‌కుమార్ కుటుంబీకులు తెలిపారు. ఇదే విషయమై ఇప్పటికే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, బెంగళూరు గంగానగర్ ఎమ్మెల్యే శివకుమార్ భారత విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్టు బాధితులు తెలిపారు. కర్ణాటక మఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మైని సైతం కలిసినట్టు తెలిసింది. మృతుని స్వగ్రామమైన కీలపట్లలో విషాదచాయలు అలుముకున్నాయి. స్వగ్రామంలోని సుబ్రమణ్యం తల్లిదండ్రులు రామచంద్రయ్య, మునెమ్మ మనవడులేదన్న విషయం తెలిసి కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. -
స్మార్ట్‌ఫోన్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నారా? అయితే, ఇది మీకోసమే..
8 పలమనేరు పట్టణంలో అద్దెగది తీసుకొని ఇంజనీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్‌ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్ (smart phone addiction)కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకొని ఇటీవలే మృతి చెందాడు. పట్టణంలోని పదోతరగతి చదివే బాలికకు మొబైల్ కొనివ్వలేదని తన చేతిని బ్లేడ్‌తో కోసుకొని ఆస్పత్రి పాలైంది. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి. ఒకప్పుడు ‘అరచేతిలో ప్రపంచం’ అనే నినాదంతో స్మోర్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పుడు సెల్ చేతిలో జీవితమే బందీగా మారిపోయింది. రోజురోజుకూ పెరుగుతున్న మొబైల్ ఫోన్ల వినియోగం అనర్థాలకు దారితీస్తోంది. ఈ ఫోన్ చిన్న, పెద్ద, ఆడ, మగా తేడా లేకుండా, అందరి జీవితాలను అరచేతిలోకి తీసుకుంది. పదుల సంఖ్యలో కంపెనీలను మార్కెట్ నుంచి తరిమేసింది. మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. తక్కువ శాతం మంది మాత్రమే అవసరాలకు వినియోగిస్తున్నారని పలు సర్వేల్లో తేలింది. ఎక్కువ శాతం మంది కాలక్షేపం కోసం ఫోన్ చూస్తుండడం పరిపాటిగా మారింది. అలాంటి వారిని క్రమంగా మొబైల్ బానిసలుగా మార్చేస్తోంది. పలమనేరు (చిత్తూరు): శరీరానికి కాసేపు రక్తం అందకపోయినా, ముక్కుకు శ్వాస ఆడకపోయినా పర్వాలేదుగాని నిమిషం పాటైనా చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు నేటి యువత. డ్రగ్స్‌కు బానిసైనట్లు స్మార్ట్‌ఫోన్ బందీఖానాలో జనం బందీలుగా మారారు. ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం ఎక్కువైంది. మొబైల్ లేకుంటే బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకనే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పదిలక్షల ఫోన్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990లో కీప్యాడ్ ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లె వంటి పట్టణాల్లో మాత్రమే రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్‌వర్క్‌ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 8వేల సెల్‌ఫోన్ టవర్లున్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 44 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు వాడేవారి సంఖ్య ప్రస్తుతం 10 లక్షలకు చేరింది. నాలుగేళ్ల నుంచి సెల్ఫోన్ల వాడకం ఏటా 15 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలీఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. ఈ ట్రాయ్ గణాంకాలను పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. అన్ని రంగాలపై ప్రభావం విద్యార్థులు సెల్‌ఫోన్ వాడకంతో విలువైన సమయాన్ని వృథా చేసుకొని చదువుల్లో వెనుకబడడం, ఫెయిల్ కావడం జరుగుతోంది. ఇక ప్రైవేటు సెక్టార్లలో పనిచేసేవారు ఈ మొబైల్ కారణంగా పనులన్నీ సకాలంలో పూర్తి చేయడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు సెల్‌తోనే రోజంతా గడిపేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్పాదక రంగంలోనూ దీని ప్రభావం కనిపిస్తోంది. ప్రధానంగా ఈ మొబైల్ అధికంగా వినియోగించే వారిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లు్యహెచ్‌ఓ)తెలిపింది. ఎన్ని రకాల సమస్యలు ఎదురవుతున్నాయో డబ్లు్యహెచ్‌ఓ సర్వే వివరించింది. రాత్రి పూటే ప్రమాదకరం ప్రధానంగా రాత్రిపూట నిద్రపోకుండా సెల్చూడడం వల్ల కొన్ని రోజుల తర్వాత నిద్రరాని పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. చీకట్లో సెల్‌ఫోన్ చూడడంతో దాని నుంచే వచ్చే బ్లూ కిరణాలు రెటీనాను బలహీనం చేసే కార్ట్‌డాక్ సమస్యలు తప్పవు. రాత్రుల్లో ఫోన్ చూసే పిల్లలకు తలనొప్పి, చూపు మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. దీంతోపాటు మెడనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ సమస్యలు: ► నిద్రలేమి, తలనొప్పి ► భుజం, మెడ నొప్పి ► బరువు పెరగడం ► చూపు తగ్గిపోవడం ► జ్ఞాపకశక్తి కోల్పోవడం ► ఏకాగ్రత దెబ్బతినడం ► డిప్రెషన్లోకి వెళ్లడం అనర్థాలపై అవగాహన అవసరం మితిమీరిన సెల్‌ఫోన్ వాడకంతో కలిగే అనర్థాలపై కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నాం. ఈమధ్య కాలంలో యూట్యూబ్‌లో పలు రకాల చోరీలు, నేరాలను చూసి వాటిని ప్రయోగాత్మకంగా చేస్తున్నారు. ఇలాంటి వారికి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ఏదేనా అవసరం ఉంటే తప్ప ఫోన్ వాడకం తగ్గించాలి. దీంతో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. – గంగయ్య, డీఎస్పీ, పలమనేరు మానసిక ఇబ్బందులు తప్పవు పాలు తాగే పసిపిల్లల నుంచి సెల్ ఉంటేనే అన్నట్లుగా తయారైంది నేటి సమాజం. పిల్లలు ఏడుస్తుంటే బొమ్మలిచ్చే కాలం పోయింది. చేతికి సెల్ ఇస్తేనే వారు ఏడుపు ఆపుతారు. అధికంగా సెల్ వాడడం వలన మెడనొప్పి, కళ్లు కనిపించకపోవడం, తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ. ఇక నిద్రపోకుండా రాత్రుల్లో సెల్ చూసేవారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు తప్పవు. మనిషికి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. – మమతారాణి, ప్రభుత్వ చిన్నపిల్లల వైద్య నిపుణులు -
పార్లమెంట్ చెంత.. పలమనేరు బొమ్మ!
పలమనేరులో తయారయ్యే మట్టి బొమ్మలు దేశ పార్లమెంట్లో కొలువుదీరనున్నాయి. ఈ మేరకు కేంద్ర హస్తకళాభివృద్ధి సంస్థ నుంచి సమాచారం వచ్చింది. దీంతో పలు డిజైన్లను పరిశీలించి.. వాటిలో 12 డిజైన్లను నూతన పార్లమెంట్ భవనంలో ఉంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతో ఇక్కడి కళాకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పలమనేరు మట్టితో తయారైన వస్తువులు దేశ, విదేశాలకు సైతం చేరుతుండటం విశేషం. – పలమనేరు(చిత్తూరు జిల్లా) అందరూ కళాకారులే.. పలమనేరు పట్టణ సమీపంలోని గంటావూరు టెర్రకోట కాలనీలో వంద కుటుంబాలున్నాయి. వీరందరూ మట్టితో రకరకాల బొమ్మలు, కళా ఖండాలను తయారు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. అందువల్లే వీరు తయారు చేస్తున్న బొమ్మలను టెర్రకోట బొమ్మలు అని కూడా అంటారు. 15 ఏళ్ల కిందటి దాకా ఇక్కడ కుండలు మాత్రమే తయారు చేసేవారు. అయితే పెద్దగా వ్యాపారం జరగకపోవడంతో.. కుండల తయారీతో పాటు ఆకర్షణీయమైన బొమ్మలను తయారు చేయడం మొదలెట్టారు. ఈ టెర్రకోట బొమ్మలు ఇప్పుడు ఎంత ప్రసిద్ధి చెందాయంటే.. దేశ విదేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంది. అంతేకాదు పాత పద్ధతులకు స్వస్తిపలికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి యంత్రాల ద్వారా బొమ్మలను తయారుచేస్తున్నారు. మట్టికుండల తయారీకి వినియోగించే కుమ్మరిసారెకు బదులు ఎలక్ట్రికల్ వీల్ మెషీన్‌ను వాడుతున్నారు. గతంలో బంకమట్టిని కాళ్లతో తొక్కి మెత్తగా చేసేవారు.. ఇప్పుడు ప్లగ్‌మిల్ మిక్చర్ అనే యంత్రం వచ్చి వారి పనిని మరింత సులువుగా మార్చింది. గతంలో మట్టి వస్తువులను బట్టీలో కాల్చేవారు.. ఇప్పుడు కరెంట్‌తో కాలే కిలన్ వచ్చింది. వీటితో పాటు ప్లగ్ వీల్, బాల్ వీల్, ఫిల్టర్లు, కట్టర్లు ఇలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో బొమ్మల తయారీ సాగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం టెర్రకోట కళ అంతరించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కళాకారులకు మరింత చేయూతనందించే ఉద్దేశంతో గంటావూరు సమీపంలో రూ.2 కోట్లతో టెర్రకోట హబ్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ హబ్‌లో టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దీంతో పాటు సీఎఫ్‌సీ(కామన్ ఫెసిలిటీ సెంటర్) ఉంది. ఏపీఎస్‌డీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్), టెర్రకోట హస్తకళాకారుల ఎయిడెడ్ సంస్థ, రీచ్ సంస్థల ఆ«ధ్వర్యంలో ఇక్కడ తరచూ శిక్షణ ఇస్తున్నారు. కోల్‌కతా, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి స్పెషలిస్ట్ ట్రైనర్స్ వచ్చి శిక్షణ ఇస్తుంటారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తున్నారు. అలాగే ఇక్కడ తయారవుతున్న డిజైన్లకు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తయారవుతున్న డిజైన్లను జోడించి.. విభిన్న కళాకృతులతో టెర్రకోట కళను అభివృద్ధి చేస్తున్నారు. ఫొటో ఫ్రేమ్‌లు సైతం మట్టితోనే.. ఇళ్ల ముందు మొక్కలను పెంచే మట్టి కూజాలు, దాబాలపై మొక్కలు పెంచుకునేందుకు వీలుగా వేలాడే మట్టి కూజాల వంటివి తయారు చేస్తున్నారు. ఇక వేసవిలో ఫ్రిజ్‌లుగా ఉపయోగపడే మట్టి కూజాలకు ట్యాప్‌లు అమర్చి మరీ రకరకాల పరిమాణాల్లో విభిన్న రూపాల్లో తయారు చేస్తున్నారు. ఏదేని ఫంక్షన్లలో బహుమతులుగా ఇచ్చేందుకు వందలాది మోడళ్లతో పాటు రాజకీయ నాయకుల ముఖ చిత్రాలనూ రూపొందిస్తున్నారు. ఫొటోఫ్రేమ్ల సైతం మట్టితోనే తయారు చేయడం విశేషం. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు వీరు తయారు చేసిన మట్టి బొమ్మలు, వస్తువులు, వివిధ రకాల కళాకృతులతో ఇప్పటికే బెంగళూరుకు చెందిన పలు కంపెనీలు ఆన్లైన్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. ఆన్లైన్లో బుక్ అయిన వెంటనే వాటిని బెంగళూరుకు పంపి అక్కడి నుంచి దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. ఇటీవలే అమెరికాకు చెందిన కొందరు ఇక్కడికి వచ్చి ఇక్కడి వస్తువులను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. పార్లమెంట్ భవనానికి ఆర్డర్ రావడం సంతోషం పలమనేరు మట్టితో తయారైన టెర్రకోట కళాకృతులు భారత పార్లమెంట్లో కొలవుదీరనుండటం మాకెంతో సంతోషంగా ఉంది. పలు డిజైన్లను వారు పరిశీలించి కొన్నింటిని ఎంపిక చేశారు. ప్రస్తుతం వాటిని తయారు చేసే పనుల్లో ఉన్నాం. అమెరికా, ఫ్రాన్స్, చైనాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఆన్‌లైన్‌లోనూ కొన్ని ఏజెన్సీల ద్వారా వ్యాపారం చేస్తున్నాం. – రామకృష్ణ, టెర్రకోట హస్తకళాకారుల సంఘ నేత, పలమనేరు టెర్రకోట వస్తువుల తయారీపై శిక్షణ తీసుకున్నా.. మాది గంటావూరు గ్రామం. టెర్రకోట బొమ్మలపై నెల రోజుల శిక్షణ తీసుకున్నా. ట్రైనర్స్ బాగా నేర్పారు. ఇప్పుడు అన్ని బొమ్మల చేయడం నేర్చుకున్నా. ఇంటి వద్దే పీస్ వర్క్ చేసుకుంటున్నా. ఇక్కడ శిక్షణ తీసుకుని ఉపాధి పొందడం చాలా ఆనందంగా ఉంది. ఉన్న చోట ఉపాధి దొరికింది. డీఆర్డీఏ వాళ్లు టెర్రకోట కళకు జీవం పోస్తూ ఎందరికో పని కల్పిస్తున్నారు. – సాకమ్మ, గంటావూరు -
ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌లకు అలవాటుపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, చిత్తూరు: పలమనేరు పట్టణంలోని గుడియాత్తంరోడ్డు బజంత్రీ వీధిలో నివాసముంటున్న బీటెక్ విద్యార్థి దిలీప్‌రెడ్డి(20 ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల కథనం మేరకు, అన్నమయ్య జిల్లా చినమండ్యం గ్రామానికి చెందిన దిలీప్‌రెడ్డి పట్టణ సమీపంలోని ప్రైవేటు కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. బజంత్రీవీధిలోని ఓ ఇంట్లో మరో ఇద్దరు విద్యార్థులతో కలసి అద్దెకుంటున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం గదిలో ఫ్యానుకొక్కీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి విచారిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా దిలీప్ ఆన్లైన్లో బెట్టింగ్ గేమ్‌లకు అలవాటుపడ్డట్లు పోలీసులు తెలిపారు. గేమ్‌లకోసం అప్పులు చేసినట్లు, చివరికి మొబైల్ కూడా తాకట్టు పెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
ఆరేళ్లక్రితం వివాహం.. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి
సాక్షి, పలమనేరు: వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బుధవారం గంగవరం మండలంలోని మబ్బువారిపేటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు, గ్రామానికి చెందిన శివతో పలమనేరు మండలం గుండ్లపల్లికి చెందిన రేఖకు ఆరేళ్లక్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. శివ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవడేవాడు. దీనికితోడు వరకట్న వేధింపులు మొదలైనట్లు బాధితురాలి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం వారి ఇంటిలోని హాలులో రేఖ(23) ఉయ్యాలకొక్కీకి ఉరేసుకొని మృతి చెందింది. భర్తే అత్తమామలకు ఫోన్‌చేసి రేఖ ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. అయితే ఆత్మహత్య చేసుకున్న తీరు అనుమానించేలా ఉండడంతో మృతురాలి కుటుంబీకులు అతడిపైనే ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో నిందితున్ని గంగవరం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా రేఖది హత్యా లేక ఆత్మహత్య అనే విషయం తెలుస్తుందని గంగవరం ఎస్ఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు. చదవండి: (3 Burnt Alive: హాసిని అంటే చాలా ప్రేమ.. డాడీ లేడన్న విషయం ఎలా చెప్పాలో) -
ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి కృషి ఫలితం.. దశాబ్దాల కల సాకారం
సాక్షి, పుంగనూరు: పలమనేరు–పుంగనూరు బైపాస్ రోడ్డు కోసం సుమారు ముప్పై ఏళ్లుగా స్థానికులు ఎదురుచూస్తున్నారు. పూర్తిగా సిద్ధమైన ఈ రహదారిని 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. కీలకపాత్ర పోషించిన ఎంపీ మిథున్‌రెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి 2017లోనే పుంగనూరు–పలమనేరు బైపాస్ రోడ్డు నిర్మాణానికి నడుంబిగించారు. కేంద్రమంత్రి నితిన్గడ్కరీతో పలుమార్లు చర్చించి రోడ్డు నిర్మాణానికి రూ.309 కోట్లు విడుదల చేయించారు. అనంతరం 55 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించారు. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నేతలు మామూళ్ల కోసం కాంట్రాక్టర్లను ముప్పుతిప్పలు పెట్టి రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహకారంతో ఎంపీ మిథున్‌రెడ్డి త్వరితగతిన బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయించేందుకు చర్యలు చేపట్టారు. నేషనల్ హైవే అథారిటీ అధికారులను పరుగులు పెట్టించి మరీ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈ క్రమంలో దశాబ్దాల కల నెరవేరుతున్నందుకు ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. చదవండి: (చిరంజీవికి సీఎం అత్యంత గౌరవమిచ్చారు) ఇదీ మార్గం పలమనేరు రోడ్డులోని అరబిక్ కాలేజీ నుంచి పుంగనూరు బైపాస్ ప్రారంభమవుతుంది. చదళ్ల సమీపంలోని తిరుపతి రోడ్డు మీదుగా ఎంబీటీ రహదారిలోని భీమగానిపల్లె వద్ద కలుస్తుంది. పెంచుపల్లె, బండ్లపల్లె, బాలగురప్పపల్లె, మేలుపట్ల, భగత్‌సింగ్‌కాలనీ, రాగానిపల్లె, రాంపల్లె, దండుపాళ్యం మీదుగా రోడ్డు సాగుతుంది. బైపాస్ రోడ్డు నిర్మాణంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరకు రెక్కలు రావడంతో రియల్ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. పుంగనూరుకు తలమానికం ఎంపీ మిథున్‌రెడ్డి అవిరళ కృషితోనే బైపాస్ నిర్మాణం పూర్తయింది. గత టీడీపీ ప్రభుత్వం ఈ రోడ్డు పనులు ముందుకు సాగకుండా ఏళ్ల తరబడి అడ్డుకుంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ రహదారి ప్రజలకు ఎంతో ఉపయోగకరం. – ఎస్.ఫకృద్ధీన్ షరీఫ్, పుంగనూరు -
త్వరలోనే ఆ జిల్లాలో జెట్ స్పీడ్ బుల్లెట్ రైళ్లు..
అబ్బురపరిచే వేగం.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. అద్భుతమైన నిర్మాణాలు.. అత్యుత్తమ సౌకర్యాలు.. అలసట తెలియని ప్రయాణం.. అతితక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేర్చేందుకు గంటకు 350 కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్లే బుల్లెట్ రైళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. ప్రత్యేకంగా నిర్మించనున్న ట్రాక్‌పై చెన్నై– మైసూరు మధ్య పరుగులు తీయనున్నాయి. జర్మన్ టెక్నాలజీతో దేశంలోనే ఆరో కారిడార్‌గా ఈ మార్గాన్ని అభివృద్ధి పరిచేందుకు సర్వే పనులు సాగుతున్నాయి. ఇందుకోసం వివిధ విభాగాల వారీగా పలు కంపెనీలు టెండర్లు దక్కించుకున్నాయి. జిల్లా మీదుగా సాగే ట్రాక్ ఏర్పాటుకు సంబంధించి బెంచిమార్క్లు నిర్మాణమవుతున్నాయి. పలమనేరు (చిత్తూరు): జపాన్, జర్మనీ దేశాల్లో కనిపించే జెట్ స్పీడ్ బుల్లెట్ రైళ్లను త్వరలోనే జిల్లాలోనూ చూడబోతున్నాం. గంటకు 350 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లడం బుల్లెట్ ట్రైన్ ప్రత్యేకత. ఇప్పటి వరకు దేశంలోనే అత్యంత వేగంగా నడిచే శతాబ్ది ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై నుంచి 320 కిలోమీటర్ల దూరంలోని బెంగళూరుకు ప్రయాణించాలంటే గంటకు 70 కి.మీ సగటున దాదాపు ఐదు గంటల సమయం పట్టేది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ద్వారా అయితే ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండు గంటలే. ఇప్పటికే దేశంలో ముంబై–అహ్మదాబాద్, ఢిల్లీ–వారణాసితో పాటు మరో మూడు మార్గాల్లో బుల్లెట్ ట్రైన్ కారిడార్లున్నాయి. ఆరో మార్గంగా చెన్నై–మైసూర్ కారిడార్‌ను జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించనున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2018లోనే జర్మన్ ప్రభుత్వంతో సంప్రదింపులు చేసింది. 2020 జూన్‌లో చెన్నై–మైసూర్ రైల్యే కారిడార్ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ప్రస్తుతం జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నుంచి తమిళనాడు సరిహద్దు వరకు ప్రాథమిక సర్వేతోపాటు బెంచిమార్క్ల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఖరారైన టెండర్లు కేంద్ర రైల్యేశాఖ ఎన్హెచ్ఆర్ఆర్సీఎల్ (నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్)ద్వారా చెన్నై–మైసూరు బుల్లెట్ ట్రైన్ పనులు చేపడుతోంది. 2019లోనే ఇందుకు సంబందించి డీపీఆర్ (డీటైల్ ప్రాజెక్టు రిపోర్ట్) సిద్ధం చేసింది. ఈ మార్గానికి సంబంధించిన ఇప్పటికే టెండర్ల పక్రియను సైతం పూర్తి చేసింది. అందులో భాగంగా సర్వే పనులను ఇంజినీరింగ్ మాగ్నిట్యూడ్ కంపెనీ దక్కించుకుంది. ట్రాఫిక్‌కు సంబంధించిన పనులను పీకే ఇంజనీర్స్కంపెనీ, జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్‌ను ట్రాన్స్‌లింక్ కంపెనీ, ఫైనల్ అలైన్‌మెంట్‌ను ఆర్వీ అసోసియేట్స్, ఓవర్‌హెడ్, అండర్‌గ్రౌండ్ పనులను సుబుది టెక్నాలజీస్ కంపెనీ చేపడుతోంది. ఆర్ఏపీ ( రీసెటిల్మెంట్ యాక్షన్‌ప్లాన్)ని ఓవర్సీస్ మిన్–టెక్ కన్సల్టెంట్స్, ఎన్విరాల్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్ట్‌ను మరో కంపెనీ చేపట్టనున్నట్టు ప్రస్తుతం ఇక్కడ పనులు చేస్తున్న కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. స్టాపింగ్ స్టేషన్లు తొమ్మిదే.. చెన్నై నుంచి మైసూరు మార్గంలో కేవలం తొమ్మిది స్టాపింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడులో చెన్నై, పూనమలై, అరక్కోణం, కర్ణాటకలో బంగారుపేట, బెంగళూరు, చెన్నపట్న, మండ్య, మైసూరు, జిల్లాలో కేవలం చిత్తూరులో మాత్రమే బుల్లెట్ రైళ్లు ఆగనున్నాయి. కారిడార్‌కు సమీపంలోనే చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌హైవే ఉండేలా మార్గంలో అలైన్మెంట్ చేశారు. ఈ ప్రాజెక్టులో అండర్‌గ్రౌండ్ ( సొరంగమార్గం), ఎలివేషన్ వయాడక్ట్, ఓవర్‌హెడ్, ఫ్లైఓవర్ వంతెనలతో ట్రాక్ నిర్మాణం సాగనుంది. బెంగళూరులో రెండు అండర్‌గ్రౌండ్ రైల్యే స్టేషన్లు సైతం నిర్మించేలా ప్రణాళికలో పొందుపరిచారు. తక్కువ సమయంలోనే గమ్యస్థానం చెన్నై–మైసూర్ మధ్య 435 కిలోమీటర్ల దూరం ఉంది. బుల్లెట్ ట్రైన్ గంటకు 350 కిలోమీటర్లు ప్రయాణిస్తే దాదాపు ఒకటిన్నర గంటలో చేరుకోవచ్చు. సగటు వేగం గంటకు 320 కిలోమీర్లు అయితే సుమారు రెండు గంటలు పట్టొచ్చు. 9 స్టేషన్లలో ఆపిన సమయాన్ని లెక్కగడితే మరో 45 నిమిషాలు మాత్రమే అదనంగా పరిగణించవచ్చు. ఆ లెక్కన 2.45 నిమిషాల్లో గమ్యస్థానాన్ని చేరుకొనే అవకాశం ఉంటుంది. జిల్లాలో ప్రారంభమైన సర్వే కర్ణాటక సరిహద్దుల నుంచి జిల్లాలోని వి.కోట, బైరెడ్డిపల్లె, పలమనేరు మండలాల మీదుగా తమిళనాడు సరిహదులోని గుడిపాల మండలం వరకు ట్రాక్ నిర్మాణం కోసం శరవేగంగా సర్వే సాగుతోంది. ముఖ్యంగా పలమనేరు మండలంలోని సాకేవూరు, బేలపల్లె, కొలమాసనపల్లె, కూర్మాయి. పెంగరగుంట, సముద్రపల్లె సమీపంలో బెంచిమార్కులను ఏర్పాటు చేస్తున్నారు. భూకంపాలను తట్టుకొనే సామర్థ్యం బుల్లెట్ ట్రైన్ ట్రాక్‌ను అత్యాధుని పరిజ్ఞానంతో భూకంపాలను సైతం తట్టుకునేలా నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆటోమేటిక్ బ్రేకింగ్ సిస్టం ఉంటుందని సర్వే చేస్తున్న కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బుల్లెట్ ట్రైన్, ట్రాక్ ప్రత్యేకతలు ►రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు ►ఆపరేషన్ స్పీడ్ గంటకు 320 కిలోమీటర్లు ►ట్రాక్గేజ్ : స్టాండర్డ్ (1435 mm) ►డీఎస్– ఏటీజీ సిగ్నలింగ్ ►ట్రైన్ కెపాసిటీ : 750 మంది ప్రయాణికులు ►చెన్నై–మైసూర్ మధ్య దూరం 435 కిలోమీటర్లు ►రైలు స్టాపింగ్ స్టేషన్లు : 9 -
సులభంగా డబ్బు సంపాదించాలని.. యూట్యూబ్ చూసి ఏం చేశారంటే..
పలమనేరు(చిత్తూరు జిల్లా): యూట్యూబ్‌లో చూసి ఏటీఎంలలో డబ్బు చోరీ చేసేందుకు ప్రయత్నించిన నలుగురు నిందితులను పలమనేరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెనుమూరు మండలం చిన్నమరెడ్డి కండ్రిగ అనే అడవిపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి(41), పొలకల నరేష్(29), మాధవరెడ్డి (25), గుడుపల్లి మండలం యామిగానిపల్లికి చెందిన హరి(21) తిరుపతిలో ఉంటూ స్నేహితులయ్యారు. సులభంగా డబ్బు సంపాదించాలని భావించారు. ఏటీఎంలలో చోరీ ఎలా చేయాలో యూట్యూబ్ చూసి తెలుసుకున్నారు. చదవండి: మొండెం దొరికింది.. తల మిస్టరీ వీడింది అనంతరం చెన్నై వెళ్లి పరికరాలను కొనుగోలు చేశారు. ఎట్టేరిలో రిహార్సల్స్ చేశారు. ఈ నెల 5న నెల్లూరు జిల్లా వేదపాళెం ఏటీఎంలో చోరీకి యత్నించారు. సైరన్ శబ్దం రావడంతో పరారయ్యారు. మరుసటి రోజు పలమనేరులో ఏటీఎంలో చోరీకి యత్నించి విఫలమయ్యారు. మళ్లీ ఈ నెల 7వ తేదీ రాత్రి పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయతి్నంచారు. సైరన్ రాకుండా చూసుకున్నారు. ఏటీఎంలో రహస్యంగా అమర్చిన చిప్, మైక్రో కెమెరా ద్వారా సమాచారం ముంబయిలోని ఎస్బీఐ కార్యాలయానికి చేరింది. అధికారులు ఏటీఎం లొకేషన్ ఆధారంగా పలమనేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఏటీఎం వద్దకు వెళ్లేలోపు అక్కడినుంచి ఉడాయించారు. డీఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందం విచారణ వేగవంతం చేసింది. వాహనాల తనిఖీతోపాటు సీసీ కెమెరా పుటేజీలను పరిశీలించారు. దుండగులు వెళ్లిన వాహనాన్ని గుర్తించారు. ఈ క్రమంలోనే ఈ నెల 13న పలమనేరు సమీపంలోని గంటావూరు ప్ల్రైఓవర్ వద్ద పోలీసులు వాహనాలు తనికీ చేస్తుండగా కారు వేగంగా వెళ్లింది. పోలీసులు కారును వెంబడించి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు నేరం అంగీకరించారు. వారిని సీఐ భాస్కర్, ఎస్ఐ నాగరాజు గురువారం అరెస్టుచేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితులు ఉపయోగించిన కారు, గ్యాస్ కట్టర్, పరికరాలు, గ్లౌజులను సీజ్ చేశారు. ఈ కేసులో నిందితులను త్వరగా పట్టుకున్న స్థానిక ఐడీ పార్టీ పోలీసులు శ్రీనివాసులు, అల్లాఉద్దీన్, ప్రకాష్, శశి, ప్రభాకర్, బాలాజీకి డీఎస్పీ రివార్డులు అందజేసి అభినందించారు. -
క్లీనర్లుగా వచ్చి.. మామూళ్లు తేల్చి!
సమయం : శనివారం వేకువజామున 1.55 కావొస్తోంది. ప్రదేశం : చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిలోని నరహరి ఆర్టీఓ చెక్‌పోస్ట్ గుడిపాల : ‘ఆ సమయంలో మంచు దట్టంగా కురుస్తోంది. చలి వణికిస్తోంది. నలిగి, మాసిపోయిన ఖాకీ చొక్కాలు, లుంగీలు కట్టుకుని, హవాయి చెప్పులు ధరించి ఉన్న ముగ్గురు చెక్‌పోస్టులోకి వెళ్లారు. వాళ్లను లారీ క్లీనర్లని విధుల్లో ఉన్న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శివకుమార్, కంప్యూటర్ ఆపరేటర్ భాస్కర్ భావించారు. వారి చేతిలో ఆ క్లీనర్లు కొంత నగదు ఇచ్చి రోడ్డెక్కారు. ఇది తమకు ‘మామూలే’అన్నట్టు చూసి ఆర్టీఓ చెక్‌పోస్టు సిబ్బంది తిరిగి విధుల్లో మునిగిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ఆ ముగ్గురు లారీ క్లీనర్లతో పాటు మరికొందరు అదే చెక్‌పోస్టుకు వచ్చారు. కాకపోతే ఈసారి గెటప్ మారింది. చెక్‌పోస్టు సిబ్బందికి గుండె జారింది. వారి ముఖంలో ఒకింత ఆందోళన! సీన్ కట్ చేస్తే– లారీ క్లీనర్ల గెటప్‌లో వచ్చింది ఎవరో కాదు.. సాక్షాత్తు ఏసీబీ అధికారులే..!! ఆ గెటప్ బాగానే వర్కౌట్ అయినట్లు ఉదయం 6.30 వరకూ విస్తృతంగా చేసిన తనిఖీలు చెప్పకనే చెప్పాయి. చెక్‌పోస్టులో అక్రమంగా 71,970 రూపాయలు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వారిపై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. ఇక, ఉదయం వరకూ తనిఖీలు కొనసాగిస్తున్న సమయంలోనే అడపాదడపా కొందరు లారీ క్లీనర్లు, డ్రైవర్లు వచ్చి, చెక్‌పోస్టు సిబ్బంది అనుకుని నేరుగా ఏసీబీ అధికారులకే మామూళ్లు ఇవ్వడం కొసమెరుపు! అవినీతి నిరోధకశాఖ ఇన్స్పెక్టర్లు ఈశ్వర్, వెంకట్‌నాయుడు, ఏఎస్ఐ నాగరాజు, హెడ్‌కానిస్టేబుళ్లు రవి, జ్యోతిప్రసాద్, బాబూసాహెబ్ ఈ దాడులు చేశారు. ఏసీబీ డీఎస్పీ జనార్ధన్ నాయుడు ఈ వివరాలు వెల్లడించారు. పలమనేరులో... పలమనేరు: పలమనేరు సమీపంలోని క్యాటిల్‌ఫామ్ ఆర్టీఓ కార్యాలయంపై తిరుపతి అవినీతి నిరోధకశాఖ అధికారులు శనివారం దాడులు చేశారు. వేకువజాము నుంచి ఉదయం 8 గంటల వరకూ నాలుగు గంటలపాటు కార్యాలయంలోని రికార్డులు, కంప్యూటర్లోని డాటాను పరిశీలించారు. డ్యూటీలోని ఎంవీఐలు శ్రీనివాసులు, ఆంజనేయప్రసాద్, సిబ్బందిని విచారణ చేశారు. అనధికారికంగా ఏదైనా సొమ్ము ఉన్నట్టు గుర్తించారా? అని ఏసీబీ డీఎస్పీ కంజక్షన్ను విలేకరులు సంప్రదించగా.. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము ఇక్కడ రికార్డులు మాత్రమే పరిశీలించామని, దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించేది లేదన్నారు. -
ఆ గ్రామాల్లో వింత శబ్ధాలు.. వణికిపోతున్న ప్రజలు.. ఎందుకిలా..?
పలమనేరు: పల్లెల్లో ఎన్నడూ లేనివిధంగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. అవి వచ్చిన కాసేపటికి భూమి అదిరినట్లు అవుతోంది. దీంతో ఎప్పుడేమి జరుగుతుందోననే భయంతో గ్రామీణ ప్రజలు సమీపాల్లోని అడవుల వద్ద ఉన్న వెడల్పాటి బండలపై గడుపుతున్నారు. పలమనేరు, బైరెడ్డిపల్లి మండలాల సరిహద్దుల్లో కౌండిన్య అడవికి ఆనుకుని ఉన్న ఆ ప్రాంతంలోనే ఎందుకు శబ్దాలు వస్తున్నాయనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. చదవండి: నమ్మకం మాటున మోసం.. శ్రీశైలం వెళ్తున్నామంటూ.. తొలుత కరిడిమొడుగులో.. నాలుగు రోజుల క్రితం పలమనేరు మండలం కరిడిమొడుగు, సంబార్‌పూర్, నలగాంపల్లి ప్రాంతాల్లో వింతశబ్దాలు వినపడినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆపై తల తిరిగినట్లైందని, ఇళ్లలోని వస్తువులు కిందపడినట్లు అధికారులకు తెలిపారు. ఈ ప్రాంతానికి సమీపంలోని బైరెడ్డిపల్లి మండలంలో నెల్లిపట్ల పంచాయతీ కౌండిన్య అడవికి ఆనుకుని ఉంటుంది. రెండురోజుల క్రితం ఓటేరుపాళెం, నల్లగుట్లపల్లి, తిమ్మయ్యగారిపల్లి, ఎస్సీకాలనీ గ్రామాల్లోనూ వింత శబ్దాలు వచ్చాయి. గంటకోసారి, అరగంటకోసారి శబ్దాలు రావడంతో ఇంటి గోడలకు బీటలు పడడం, కళ్లు తిరిగినట్లు కావడంతో ఆ గ్రామాల ప్రజలు సమీపాల్లోని బండలపైకి వెళ్లారు. మండలంలోని పలుశాఖల అధికారులు గ్రామాల్లో పర్యటించి వెళ్లాక కూడా శబ్దాలు వస్తుండడంతో విధి లేక గ్రామీణులు గురువారం రాత్రి సైతం బండలపైనే జాగారం చేశారు. చదవండి: వైరల్: ఆవులపై పోలీసులకు ఫిర్యాదు.. ఇదేందిరా నాయనా.. ఈ ప్రాంతంలోనే ఎందుకిలా.. కౌండిన్య అడవికి సమీపంలోని ఏడు గ్రామాల్లోనే ఇలా శబ్దాలు వస్తున్నాయి. అయితే ఈ ప్రాంతంలో ఏడాది క్రితం 700 నుంచి 1200 అడుగుల దాకా వ్యవసాయబోర్లు డ్రిల్ చేస్తే గానీ గంగ జాడ కనిపించేంది కాదు. ఇటీవల ఈ ప్రాంతంలోనే వర్షాలు ఎక్కువ కురిశాయి. దీంతో భూగర్భజలాలు భారీగా పెరిగాయి. దీంతో గతంలో భూమిలోపల ఖాళీగా ఉన్న పొరల మధ్య నీరు చేరడంతో అక్కడ ఏర్పడే ప్రకంపకనలతో భూమిలో నుంచి వచ్చే శబ్దాలు పైకి భయంకరంగా వినిపిస్తున్నాయని కొందరు చెబుతున్నారు. సంబంధిత శాఖలైన భూగర్భజలాలు, భూకంపాలను పరిశీలిందే సిస్మోగ్రాఫర్లు ఈ ప్రాంతానికి వచ్చి స్పష్టత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈవిషయమై పలమనేరు తహసీల్దార్ కుప్పుస్వామిని వివరణ కోరగా ఆ గ్రామాల్లో శబ్దాలు వస్తున్న మాట వాస్తవమేనన్నారు. అయితే భూమిలోపలి పొరల్లో నుంచి ఈ శబ్దాలు వస్తున్నాయని, సంబంధిత నిపుణులు పరిశీలించాక గానీ దీనిపై ఓ స్పష్టత రాదన్నారు. -
పలమనేరు అసలు పేరు తెలుసా..?
సాక్షి, చిత్తూరు: ఈతరం పిల్లలకు ఉంటున్న ఊరు పేరెందుకొచ్చిందో తెలియని వారు చాలామంది ఉన్నారు. కనీసం ఊరి పేరు ఎందుకొచ్చిందో గూగూల్ తల్లిని అడిగినా పెద్దక్లారిటీ ఉండదు. అందుకే పలమనేరుకు ఆపేరెలా వచ్చిందో తెలిపే ప్రయత్నం చేద్దాం. పూర్వం పలమనేరు ప్రాంతాన్ని పల్లవులు పరిపాలించే వారు. పట్టణానికి పడమటి వైపు ఓ చెరువును తవ్వించి దానికి పల్లవన్ ఏరి అనే నామకరణం చేసినట్లు తెలుస్తోంది. పల్లవన్ ఏరి అంటే చెరువు వద్ద ఉన్న గ్రామమని అర్ధం. ఈ పల్లవనేరే కాలక్రమేణ పల్నేరు ఆపై పలమనేరుగా రూపాంతరం చెందింది. పలమనేరు పట్టణ వ్యూ ఈ ప్రాంతం సముద్ర మట్టానికి 2244 అడుగుల ఎత్తున ఉండడంతో ఇక్కడ వేసవిలోనూ వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే ఈ పట్టణాన్ని పేదవాని ఊటిగా పిలుస్తారు. పలమనేరు పట్టణం మూడు రాష్ట్రాల కూడలిగా ఉండడంతో ఇక్కడ తెలుగు,తమిళం, కన్నడ భాషలను మాట్లాడుతారు. ఇప్పటికీ ఈ మూడు సాంప్రదాయలు, సంస్కృతులు ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి గుడియాత్తం, క్రిష్ణగిరి, మదనపల్లె, కుప్పం, బెంగుళూరులకు రోడ్డు మార్గాలున్నాయి. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణానికి పులకించిన అప్పటి యూరోపియన్, బ్రిటిష్ అధికారులు దీన్ని వారి వేసవి విడిదిగా ఉపయోగించారు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు దానికి సంబంధించిన విడిది గృహము ఇప్పటికీ ఉపయోగంలో ఉంది. (ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయం). వీటితో పాటు పీర్ల రహదారి, సర్కెట్ హౌస్, వైట్ సైడ్ అతిథి గృహాల పేర్లు ఉన్నాయి. దీంతో పాటు అమెరికన్ ఆర్కాడ్ మిషన్‌చే ఓ అతిథి గృహం 1932లోనే నిర్మితమైంది. అప్పట్లోనే నెలకు దీని అద్దె రూ.40గా వసూలు చేసేవారట. ఇక ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌తో పాటు క్రిస్టియన్లకు సంబంధించిన పలు సుందరమైన పురాతన భవనాలు నేటికీ చెక్కుచెదరలేదు. పలమనేరులోని నాటి బ్రిటీష్భవనాలు ఇక్కడి సీఎస్ఐ ప్రాంగణంలో గాంధీ మహాత్ముడు సేద తీరిన మర్రి చెట్టు ఉంది. ప్రతి శుక్రవారం పట్టణంలో జరిగే వారపు సంత, పశువుల సంత అనాదిగా జరుగుతోంది. పలమనేరు టమోటా, పట్టు, చింతపండు, పాలుకు ప్రసిద్ది చెందింది. జిల్లాలోనే టమోట, పట్టు సాగులో పలమనేరు ద్వితీయ స్థానంలో ఉంది. ఇక్కడ పాల ఉత్పత్తి ఎక్కువ. దీన్ని మిల్క్ సిటీగా కూడా పిలుస్తారు. చదవండి: అంతరిస్తున్న ఆదిమానవుడు -
తల్లిని కాపాడేందుకు చెరువులో ఐదేళ్ల చిన్నారి సాహసం
పలమనేరు: బట్టలు ఉతుకుతూ కాలుజారి చెరువులో పడి తల్లి మునకలేసింది. తల్లిని చూసి కాపాడేందుకు ధైర్యం చేసి చెరువులోకి దిగిన చిన్నారి తానూ మునిగిపోతూ కేకలేసింది. ఇది విన్న స్థానికులు పరుగున అక్కడికి చేరుకుని చిన్నారిని రక్షించారు. తల్లి మాత్రం తిరిగిరాని లోకాలకు చేరుకుంది. శుక్రవారం ఈ సంఘటన మండలంలో పకీరుపల్లె వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలప్ప కుమార్తె సుజాత (40) తన తండ్రి వద్దే ఉంటోంది. ఆమె తన కుమార్తె లక్ష్మి (5)తో కలసి గ్రామ సమీపంలోని కూర్మాయిచెరువులో బట్టలు ఉతికేందుకు వెళ్లింది. దుస్తులు ఉతుకుతుండగా కాలుజారి చెరువులో పడి మునిగిపోయింది. ఇది చూసి లక్ష్మి గట్టిగా కేకలు వేసినా ఎవరూ రాకపోయేసరికి తల్లిని కాపాడేందుకు తానే చెరువులోకి దిగడంతో బాలిక సైతం మునిగింది. ఆ బాలిక కేకలు విన్న సమీపంలోని రైతులు అక్కడికి చేరుకుని కాపాడారు. బాలికను ఆస్పత్రికి తరలించారు. సుజాత కోసం గాలించినా ఫలితం లభించలేదు. సమాచారం అందుకున్న స్థానిక అగ్నిమాపక కేంద్రం అధికారి బాబు తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గంటపాటు గాలించి సుజాత మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
చిత్తూరు : పలమనేరు ప్రాంతంలో ఏనుగుల సంచారం
-
ఉసురు తీసిన ప్రేమ
పలమనేరు(చిత్తూరు జిల్లా): ప్రియురాలిని కలవడానికి వెళ్లిన ఓ యువకుడు ఆమె తండ్రి చేతిలో దారుణహత్యకు గురయ్యాడు. రాత్రి వేళ తన ఇంట్లో కూతురితో కలిసి ఉన్న యువకుడిని చూసిన తండ్రి ఆగ్రహంతో అతన్ని కర్రతో కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. డీఎస్పీ గంగయ్య శుక్రవారం మీడియాకు వివరించారు. పలమనేరు మండలం పెంగరగుంట కు చెందిన ఈశ్వరగౌడ్ కుమారుడు ధనశేఖర్ (23) బెంగళూరులో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా ఈ నెల 22న స్వగ్రామానికి వచ్చాడు. అదేరోజు రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వెళ్లి కనిపించకుండా పోయాడు. దీనిపై అతని తండ్రి ఈనెల 26న స్థానిక పోలీసులకు పిర్యాదు చేయగా వారు మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుని ఫోన్ కాల్స్ ఆధారంగా ఆఖరి కాల్‌ను ట్రేస్ చేసి పెం గరగుంటకు చెందిన బాబును విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. బాబు కుమార్తె (16), ధనశేఖర్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. బాలిక 22వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేయడంతో అతను బాలిక ఇంటికి వెళ్లాడు. పొలంవద్దకు వెళ్లిన బాబు రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చి వసారాలో పడుకున్నాడు. ఇంట్లోని ఓ గది నుంచి మాట లు వినిపించడంతో వెళ్లి చూడగా తన కుమార్తెతో పాటు ధనశేఖర్ కనిపించాడు. ఆగ్రహించిన బాబు ధనశేఖర్‌ను కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం గోతాంలో మూటకట్టి చిన్నకుంట సమీపంలోని ఓ బావిలో పడేసి ఇంటికొచ్చేశాడు. రెండు రోజుల తరువాత బావివద్దకు వెళ్లి చూడగా శవం తేలి కనిపించింది. హత్య విషయం బయటకు తెలియకుండా ఉండేందుకు కొందరి సాయంతో మృతదేహాన్ని మల్బరీ ఆకులు కత్తిరించే కట్టర్ సాయంతో ముక్కలు ముక్కలుగా చేసి సమీపంలోని అటవీప్రాంతంలో పూడ్చిపెట్టాడు. పోలీసులు శుక్రవారం మృతదేహాన్ని వెలికితీశారు. -
గ్రామాల వైపు.. గజరాజుల చూపు!
పలమనేరు: కౌండిన్య అభయారణ్యంలో ఆహారం, నీటి లభ్యత తక్కువగా ఉండటంతో చిత్తూరు జిల్లా పలమనేరు పరిధిలోని కౌండిన్య ఎలిఫేంట్ శాంచ్యురీ నుంచి ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయి. రైతులు వన్యప్రాణుల నుంచి పంటలకు రక్షణగా కరెంటు తీగలను అమర్చుతుండటంతో అవి విద్యుత్ షాక్‌కు గురై మరణిస్తున్నాయి. కౌండిన్యలోకి రెండు రాష్ట్రాల ఏనుగులు.. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే అక్కడ తమిళనాడు అటవీ శాఖ సిబ్బంది రబ్బరు బుల్లెట్లతో కాల్పులు జరుపుతున్నారు. దీంతో తమిళనాడు ప్రాంతంలోని ఏనుగులు సైతం కౌండిన్య వైపునకు వచ్చి చేరుతున్నాయి. ఇక కర్ణాటక నుంచి ఏనుగులు గుడుపల్లి, కుప్పం మీదుగా ఇదే అడవిలోకి వచ్చి చేరుతున్నాయి. ప్రస్తుతం పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో మూడు గుంపులుగా 36 ఏనుగులు సంచరిస్తున్నాయి. తమిళనాడు మోర్థన అభయారణ్యం నుంచి 26 ఏనుగులు తరచూ వచ్చి వెళుతున్నాయి. ఇక 24 ఏనుగులు కర్ణాటక నుంచి కుప్పం ఫారెస్ట్‌లోకి 2 నెలల క్రితం రాగా అటవీ సిబ్బంది వాటిని తిరిగి కర్ణాటక అడవుల్లోకి మళ్లించారు. మేత కోసం అటవీ శాఖ ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్, ఎలిఫేంట్ ట్రెంచ్‌లను ధ్వంసం చేసి మరీ ఏనుగులు బయటకు వచ్చేస్తున్నాయి 16 గజరాజుల మృత్యువాత.. అడవిని దాటి మేత కోసం వచ్చిన 16 ఏనుగులు ఇప్పటిదాకా కరెంట్ షాక్‌లకు గురవడం, నీటికొలనుల్లో పడిపోవడం, మదపుటేనుగుల దాడి చేయడంతో మృతి చెందాయి. ఇక గుంపులను వీటి ఒంటరిగా సంచరించే మదపుటేనుగులను అడవిలోకి మళ్లించేందుకు రైతులు వాటిపైకి టైర్లను కాల్చి వేస్తున్నారు. ఒక్కో సందర్భంలో రాళ్లు విసరడం, బాణాసంచా పేల్చడంతో అవి మనషులపై కోపాన్ని పెంచుకుని దాడులు చేస్తున్నాయి. జీపీఎస్ సిస్టంతో గజరాజులకు చెక్.. కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ. మేరకు వ్యాపించి ఉంది. దీంతో ఏనుగుల జాడను గుర్తిం చేందుకు జీపీఎస్ చిప్ సిస్టంను ఏర్పాటు చేస్తున్నట్లు అటవీ శాఖ గతంలో తెలిపింది. ఇందుకోసం కౌండిన్యలో నెట్వర్క్ పనిచేసేలా శక్తివంతమైన టవర్లను నిర్మించాల్సి ఉంటుంది. ఆపై ఎలిఫేంట్ ట్రాకింగ్ యాప్‌ను తయారు చేసి దీన్ని అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, ట్రాకర్ల స్మార్ట్ఫోన్లలో ఇన్స్టాల్ చేసుకుంటే ఏనుగులు ఏ ప్రాంతంలో ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏనుగుల గుంపును వెంటనే ఎలిఫెంట్ ట్రాకర్స్ వాటిని అడవిలోకి మళ్లించవచ్చు. అలాగే, కౌండిన్య అభయారణ్యం 3 రాష్ట్రాల పరిధిలో ఉండటంతో 3 రాష్ట్రాలు కలసి ఎలిఫేంట్ కారిడార్ ఏర్పాటు చేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. -
యువకుడిని తొండంతో కొట్టి చంపిన ఏనుగు
పలమనేరు(చిత్తూరు జిల్లా): పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ యువకుడిని ఒంటరి ఏనుగు తొండంతో కొట్టి చంపిన ఘటన పలమనేరు మండలంలోని కాలువపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన త్యాగరాజు కుమారుడు జానకిరామ(27) తమ పొలం సమీపంలోని ఓ ఆలయంలో రాత్రిపూట పడుకుంటూ వరిపొలానికి నీరు పెట్టేవాడు. ఇదే క్రమంలో మంగళవారం రాత్రి పది గంటల సమయంలో త్రీఫేస్ కరెంట్ రావడంతో సెల్‌ఫోన్ టార్చ్ వేసుకుంటూ పొలానికి బయలు దేరాడు. ఏదో అలికిడి కావడంతో స్మార్ట్‌ఫోన్ టార్చ్‌తో చూశాడు. టార్చ్ కాంతి పొలం సమీపంలో పొదల చాటునున్న ఒంటరి ఏనుగు కళ్లలో పడింది. దీంతో ఆగ్రహించిన ఏనుగు తొండంతో అతన్ని తలపై బలంగా కొట్టింది. దీంతో మెదడుకు దెబ్బ తగిలి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కొంత సేపటికి సమీపంలోని అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు సిబ్బంది గమనించి పోలీసులు, ఫారెస్ట్ సిబ్బందికి తెలిపారు. మృతుడికి ఇంకా పెళ్లి కాలేదు. పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన బిడ్డ ఏనుగు దాడిలో మృతి చెందడంతో వారి కుటుంబీకులు కన్నీరు మున్నీరై రోధించారు. ( చదవండి: కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు వీడియో తీస్తూ.. ) -
దారుణం: బాత్రూమ్ గుంతలో మొండెం, కాళ్లు..
పలమనేరు(చిత్తూరు జిల్లా): దాదాపు నెల కిందట జరిగిన ఓ హత్య శుక్రవారం వెలుగు చూసింది. భర్తను భార్య, వరుసకు ఆమె సోదరుడు కలిసి చంపేశారనే విషయం పోలీసుల దర్యాప్తులో బయటపడింది. హతుడు పలమనేరు మండలం పందేరుపల్లె వడ్డూరుకు చెందిన పసల నాగరాజు(38) కాగా ఈ కేసులో నిందితులు ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. పలమనేరు డీఎస్పీ గంగయ్య శుక్రవారం మీడియాకు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం మేరకు పసల నాగరాజు, భాగ్యలక్ష్మి (34) కూలి పనులు చేసి జీవించేవారు. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గత నెల 26న బంగారుపాళెం మండలం అండరెడ్డిపల్లెకు చెందిన పసల గోపి తన తమ్ముడు పసల నాగరాజు 13 రోజులుగా కనిపించలేదని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం భాగ్యలక్ష్మి కి వరుసకు సోదరుడు, మండలంలోని క్యాటిల్ ఫామ్‌కు చెందిన నవీన్ (30) తానే నాగరాజును హత్య చేసినట్టు మొరం వీఆర్వో సిద్ధేశ్వర్ ముందు లొంగిపోయాడు. మృతదేహాన్ని ముక్కలుచేసి... నవీన్‌కు కుమార్తెనిచ్చి పెళ్లి చేసేందుకు నాగరాజు నిరాకరించాడు. అంతేగాక అనుమానంతో తరచూ భార్యను హింసించేవాడు. ఈ నేపధ్యంలో భర్తను అంతమొందించాలని నవీన్ ద్వారా ఆమె స్కెచ్ వేసింది. గత నెల 12వ తేదీ రాత్రి ఇంట్లో నాగరాజు మద్యం మత్తులో ఉండగా, నవీన్ వెళ్లి అతడి తలపై బండరాయితో బాది చంపేశాడు. అతడు తీసుకెళ్లిన కత్తితో మొండెం, కాళ్లు, చేతులు, శరీర భాగాలను ముక్కలు చేశాడు. బాత్రూమ్ గుంతలో పూడ్చేశాడు. సైకిల్‌పై తిరిగి స్వగ్రామానికి వెళ్లిపోయాడు. శుక్రవారం నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ జయరామయ్య, ఎస్ఐలు నాగరాజు, ప్రియాంక, వెంకటసుబ్బమ్మ, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. చదవండి: చిన్నారుల హత్య కేసులో విస్తుపోయే నిజాలు.. చిన్నారులను చెరబట్టాడు.. కోరిక తీర్చుకుని.. -
అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా?..
పలమనేరు(చిత్తూరు జిల్లా): అవ్వా బాగున్నావా! నేనెవరో తెలుసా? నీ కొడుకు ఫ్రెండ్‌ని.. అంటూ మాటలు కలిపి నగలు, నగదును దోచుకుంటున్న సంఘటనలు ఇటీవల జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సంఘటనే పలమనేరులోనూ వెలుగుచూసింది. ఎస్ఐ నాగరాజు కథనం... గంగవరం మండలం కలిమిచెట్లపెంటకు చెందిన మునిరత్నమ్మ(65) సొంతపనిపై పలమనేరుకు మంగళవారం వచ్చింది. బజారువీధిలో వెళుతుండగా ఓ అపరిచితుడు ఆమెతో మాటలు కలిపాడు. తనది చిత్తూరని, మీ కొడుకు ఫ్రెండ్‌నంటూ చెప్పాడు. అంతేకాకుండా అర్జెంట్‌గా తన తల్లి మునిరత్నమ్మ వద్ద రూ.20 వేలు తీసుకుని రావాలని తనను పంపాడంటూ చెప్పుకొచ్చాడు. (చదవండి: కారుతో గుద్ది చంపేస్తాం) మనవరాలికి ఆరోగ్యం బాగాలేక ఆమె కొడుకు చిత్తూరుకు వెళ్లిఉండడంతో ఆమె నిజమేనని భావించింది. డబ్బులు లేవని చెప్పి, తన చెవిలోని కమ్మల్ని అక్కడే ఉన్న కుదువ దుకాణంలో రూ.25వేలకు తాకట్టు పెట్టింది. రూ.5వేలను తాను ఉంచుకుని రూ.20 వేలను అతనికిచ్చి పంపింది. సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుక్కి ఈ విషయం చెప్పింది. అవాక్కైన అతడు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణకు దిగిన పోలీసులు గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన వ్యక్తుల ఫొటోల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన సెంధిల్‌కుమార్(35) పనేనని తేలింది. అతడిని బుధవారం అరెస్టు చేసి రూ.20 వేలను స్వాధీనం చేసుకున్నారు. పరిచయం లేని వ్యక్తుల మాటలు నమ్మి డబ్బులు, ఏటీఎం కార్డులు, నగలు లాంటివి ఇవ్వరాదని ఎస్ఐ నాగరాజు తెలిపారు.(చదవండి: పిల్లుల కోసం వల వేసినట్లు నటిస్తూ..) -
ఫేస్బుక్ ప్రియురాలు పెళ్లికి నిరాకరించిందని..!
సాక్షి, పలమనేరు(చిత్తూరు): ఫేస్బుక్లో పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ఆన్లైన్ చాటింగ్‌తో దగ్గరయ్యారు. కేవలం ఫేస్‌బుక్‌లోని ప్రొఫైల్ ఫొటోలు మినహా ప్రత్యక్షంగా చూసుకోకనే వ్యవహారం పెళ్లివరకూ వచ్చింది. అయితే పెళ్లికి ప్రేమికురాలు నిరాకరించడంతో మనస్తాపం చెందిన ప్రేమికుడు ఉరితాడుతో సెల్ఫీ తీసుకొని మరీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన పట్టణ సమీపంలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో బుధవారం వెలుగు చూసింది. ఎస్ఐ నాగరాజు కథనం...స్థానిక పల్లె వీధికి చెందిన హరిక్రిష్ణ(22) ఎస్టేట్‌లోని ఈ మగ్గాల పరిశ్రమలో కూలికి వెళ్లేవాడు. కొన్నాళ్ల క్రితం ఫేస్‌బుక్‌లోని ఓ అమ్మాయితో స్నేహం చేశాడు. వీరిద్దరి మధ్య ఆన్లైన్ చాటింగ్ కొనసాగింది. అది ప్రేమగా మారి హరిక్రిష్ణ ప్రియురాలికి పెళ్లి చేసుకుంటానని మెస్సేజ్ పంపాడు. దీనిపై కొన్నాళ్లకు స్పందించిన ప్రియురాలు ఇటీవలే కుదరదని తేల్చి చెప్పింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన అతడు మంగళవారం రాత్రి తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీ నుంచే లైవ్‌చాట్ చేస్తూ మెడకు ఉరి వేసుకోవడాన్ని సైతం సెల్ఫీ తీసి ప్రియురాలికి పంపాడు. అయినప్పటికీ ఆమె స్పందించకపోవడంతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఉదయం కార్మికుల ద్వారా ఇది వెలుగులోకి వచ్చింది. కుటుంబీకులకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి తన సిబ్బంది ఎస్ఐ చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సీఐ జయరామయ్య మాట్లాడుతూ, ఫేస్బుక్లో అందమైన అమ్మాయిల ఫొటోలు పెట్టి, ఒరిజినల్ ఫేస్‌ను చూపెట్టకుండా సాగే ప్రేమాయణాలపై యువత జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. (చదవండి: రిక్వెస్ట్ పెట్టి దోచేస్తారు.. ఇది ఆ గ్యాంగ్ పనేనా) -
కరోనా కాదంటూ రోదించినా...
పలమనేరు(చిత్తూరు జిల్లా): కోవిడ్–19 వైరస్ భయం మానవత్వాన్ని మింగేస్తోంది. చావుబ్రతుకుల్లో ఉన్నవారిని చూసి.. సాయం అందించడానికి ఎవరూ ముందుకురాని సంఘటనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా.. కరోనా వ్యాధిగ్రస్తులుగానే భావించి, సాయమందించడానికి జనం జంకిపోతున్నారు. ఈ భయమే ఓ వృద్ధుడి ప్రాణాన్ని తీసింది.. కుతురి ఆర్తనాదాలను నిరుపయోగం చేసింది. ఈ విచారకర ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో బుధవారం చోటుచేసుకుంది. (వైరస్ గుట్టు తెలిసింది! ) వివరాల్లోకి వెళితే.. గంగవరం మండలం కలగటూరుకు చెందిన వెంకటరామయ్య(73) శనివారం రాత్రి తన ఇంటిముందు పడుకుని ఉండగా పక్కంటికి చెందిన ఆవు అతని గుండెలపై కాలుపెట్టి తొక్కింది. దీంతో అతని పక్కటెముకలు విరిగి అస్వస్థకు గురయ్యాడు. బాధితునికి వైద్యం చేయించాలని ఆవు యజమానిని బాధిత కుటుంబ సభ్యులు అడిగినా పట్టించుకోలేదు .ఆదివారం ఉదయం అతని కుమార్తె హేమలత తండ్రిని పలమనేరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చింది. వారు అతన్ని పరిశీలించి స్కానింగ్ చేయాలని, తమవద్ద స్కానింగ్ సౌకర్యం లేదని చెప్పి వెనక్కి పంపించారు. పేదరాలైన ఆమె చేసేదిలేక తన తండ్రిని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చూపెట్టి ఇంటికి తీసుకెళ్లింది. బుధవారం ఆయనకు ఊపిరి తీసుకోవడం కష్టం కావడంతో మళ్లీ ఆటోలో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చింది. అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని భావిస్తుండగా వృద్ధుడు ఆటోలోనే ప్రాణం వదిలాడు. దీన్ని గమనించిన ఆటోడ్రైవర్ శవాన్ని రోడ్డుపై వదిలి వెళ్లిపోయాడు. కరోనా కాదంటూ రోదించినా.. ‘అయ్యా మా తండ్రి ఆవుతొక్కి చనిపోయాడు. కరోనా కాదు. సాయం చేయండి’ అని శవం ముందు మృతుని కుమార్తె ఆర్తనాదాలు చేసినా అక్కడి మనుషుల మనసులు కరుగలేదు. మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆమెను విచారించి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. -
అక్క పెళ్లికి బట్టలు కొనేందుకెళుతూ..
పలమనేరు : తన అక్క పెళ్లికి కొత్త బట్టలు కొనేందుకు బంధువుతో కలసి బైక్‌పై వస్తున్న యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలోని టి.వడ్డూరు వద్ద జరిగింది. కాలువపల్లె గ్రామానికి చెందిన వెంకటాద్రి సోదరి వివాహం ఈ నెల 13న జరుగనుంది. టుంబీకులు కొత్త బట్టలు కొనుక్కోమని చెప్పడంతో వెంకటాద్రి (17) తన బంధువు కర్ణాటకు చెందిన ప్రశాంత్ (23)తో కలసి బైక్‌పై పలమనేరు వైపు వస్తుండగా ఎదురుగా వెళ్లిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటాద్రి తలకు బలమైన గాయమైంది. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. ప్రశాంత్(23) తీవ్రంగా గాయపడ్డాడు. ఇతడిని చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పట్టణ సీఐ జయరామయ్య కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
స్టేషన్లో పోలీసుల విందు.. మత్తులో చిందులు
పలమనేరు: అసలే కరోనా మహమ్మారితో ఇబ్బందులు పడుతున్న తరుణంలో బాధ్యత కలిగిన పోలీసు కానిస్టేబుళ్లు స్టేషన్లోనే పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. మద్యం మత్తులో అర్ధనగ్నంగా నృత్యాలు చేశారు. విచారించిన ఎస్పీ నలుగురిని బదిలీచేశారు. బైరెడ్డిపల్లి పీఎస్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బైరెడ్డిపల్లి పోలీసుస్టేషన్లో పనిచేసే కానిస్టేబుల్ బలరాం పుట్టిన రోజు సందర్భంగా సిబ్బంది స్టేషన్లోనే పార్టీ చేసుకున్నారు. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న కర్ణాటక మద్యంతో జల్సా చేసుకున్నారు. అంతటితో ఆగక బట్టలు విప్పుకుంటూ నృత్యం చేశారు. వాటిని తమ స్మార్ట్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియోలను కానిస్టేబుళ్ల గ్రూపులో పోస్ట్ చేశారు. స్టేషన్లో కానిస్టేబుళ్ల అరుపులు, కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారమచ్చారు. దీనికితోడు వీడియోలు వైరల్ అయి పోలీసు ఉన్నతాధికారులకు చేరాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్పీ వెంటనే వివారణ జరిపి నివేదిక సమర్పించాలని పలమనేరు డీఎస్పీ అరీఫుల్లాను ఆదేశించారు. ఆయన పంపిన నివేదిక ఆధారంగా కానిస్టేబుళ్లలో బలరాంను మదనపల్లెకి, కార్తీక్‌ను ఐరాలకు, లోకేష్‌ను కేవీబీ పురానికి, హెడ్‌కానిస్టేబుల్ రెడ్డిశేఖర్‌ను సత్యవేడుకు బదిలీచేస్తూ ఎస్పీ సెంథిల్‌కుమార్ ఉత్తర్వులిచ్చారు. -
కనిపెంచిన తల్లిని అడవిలో వదిలేశారు
సాక్షి, చిత్తూరు : ఆ తల్లి బిడ్డలకు భారమైందేమో తీసుకొచ్చి అడవిపక్కన వదిలేశారు. మానవత్వం మంటగలపిన ఈ సంఘటన శనివారం పలమనేరు మండలంలోని పెంగరగుంట సమీపంలో వెలుగులోకి వచ్చింది. పలమనేరు–గుడియాత్తం అంతర్రాష్ట్ర రహదారిలోని పెంగరగుంట సమీప అడవికి ఆనుకుని 90 ఏళ్ల వయసున్న ఓ వృద్ధురాలిని ఎవరో వదిలిపెట్టివెళ్లారు. ఆమె ఆహారం లేక శరీరం నీరసించి, కదలకుండా పడి ఉండగా స్థానికులు గమనించి రోడ్డు పక్కనున్న కుంటిగంగమ్మ ఆలయం వద్ద వదిలిపెట్టారు. మూడు రోజులుగా రాత్రిపూట కురుస్తున్న వర్షానికి తడుస్తూనే ఉంది. శనివారం ఈ విషయం గ్రామంలో తెలిసింది. గ్రామ వలంటీర్లు అక్కడికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆమెకు భోజనం, నీటిని అందించారు. వానకు తడవకుండా ప్లాస్టిక్ పేపర్‌తో అక్కడ చిన్నపాటి గుడెసె ఏర్పాటు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. ఇలా ఉండగా ఈమె వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా ఆమె మాట్లాడడం లేదు. కన్నవారికి ఆ వృద్ధురాలు భారమై ఇలా వదిలించుకున్నారేమోనని కొందరు భావిస్తున్నారు. కరోనా సోకిందని భావించి తమిళనాడుకు చెందిన వారు ఇక్కడ వదిలేశారా? అన్న అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంపై తెలుసుకున్న పలమ నేరు తహసీల్దార్ శ్రీనివాసులు ఆమెను పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌కు తరలించి వసతి, భోజన సౌకర్యాలు కల్పించారు. వృద్ధురాలికి సంబంధించిన వారి వివరాలు తెలిశాక వారికి అప్పగిస్తామన్నారు. -
పేదవాళ్లైతే పరిస్థితేంటి ?
పలమనేరు: ‘నేను ప్రభుత్వ ఉద్యోగి గనుక ఎలాగో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటా.. ఇదే పరిస్థితుల్లో పేదవాళ్లెవరైనా ప్రభుత్వాస్పత్రి మీద నమ్మకంతో వస్తే వారి పరిస్థితేంటి ?’ అని పలమనేరు మండలంలోని కొలమాసనపల్లి హాస్టల్ వార్డెన్ మధుసూధన్‌రెడ్డి స్థానిక ఏరియా ఆస్పత్రి వైద్యుల తీరుపై స్పందించిన తీరు. శనివారం ఉదయం పలమనేరులో ఉంటున్న మధుసూదన్‌రెడ్డి భార్య నేత్రకు ప్రసవనొప్పులు రావడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ఆమెను పరిశీలించిన వైద్యులు తొలికాన్పు సిజేరియన్ కావడంతో రెండోకాన్పు ఆపరేషన్ చేయాల్సిందేనని చెప్పారు. అందుకు అతను సరే అన్నాడు. అయితే ఆపరేషన్ చేసేందుకు తమవద్ద రక్తం లేదని చెప్పారు. అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో చేసేదిలేక అతను తన భార్యను హుటాహుటిన హొసకోటలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌హోంకు తీసుకెళ్లగా అక్కడి వైద్యులు సిజేరియన్ చేశారు. అందుకుగానూ రూ.లక్ష దాకా ఖర్చు అయినట్లు బాధితుడు మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి మరో పేదవాడికి రాకుండా చూడాలని ఆయన మీడియాకు తెలిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ వీణాకుమారిని సాక్షి వివరణ కోరగా వాళ్లు ఆస్పత్రికి రాగానే కరోనా టెస్ట్ చేయాలన్నారని, దీంతో కాదన్నామని తెలిపారు. తమ ఆస్పత్రిలో రక్తం లేదని అందుకే డ్యూటీ డాక్టర్ చిత్తూరుకు రెఫర్ చేశారన్నారు. ప్రసవ నొప్పులతో ఈ ఆస్పత్రికి వచ్చేవారికి రెఫర్లు మాత్రం తప్పడం లేదు. డీసీహెచ్ఎస్, జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ సైతం ఈ విషయమై ఇక్కడి వైద్యులను పలుమార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకుండా పోతోంది. -
సముద్రపల్లికి సు‘రాజ్యం’ వచ్చింది!
(సుబ్రమణ్యం, పలమనేరు) ► అడవికి ఆమడ దూరంలో ఉంటుంది ఆ గ్రామం. దక్షిణం, పడమట వైపు నుంచి విస్తరించిన కౌండిన్య అభయారణ్యం. రక్షణ కోసం ప్రత్యేకంగా తవ్విన ఆరుఅడుగుల ట్రెంచ్‌లు సైతం తెలివిగా దాటి ఏనుగుల గుంపులు అప్పుడపుడు దాడి చేస్తాయి. చెరకు, మామిడి తోటల్లో విధ్వంసం సృష్టిస్తాయి. ఊరు పేరు సముద్రపల్లి . చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండల కేంద్రానికి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉంటుంది.అయినా, బస్సు సౌకర్యం లేదు. ‘సాక్షి’ ఉదయం 11 గంటలకు గ్రామం చేరేనాటికి సచివాలయం వద్ద సందడిగా ఉంది. ► గతంలో ఏపని కావాలన్నా టౌన్‌కి వెళ్లాల్సిందే. కూలి పనులు చేసుకునే వారు ఏదేని పనికోసం పలమనేరుకు వెళ్లితే – ఆరోజు కూలి పోగొట్టుకున్నట్టే. వృద్ధులు,, వికలాంగులు సైతం పింఛన్ కోసం ప్రతినెలా నాలుగు కిలోమీటర్లు దూరంలోని పెంగరగుంట పోస్టాఫీసుకు వెళ్లేవారు. ఏ అధికారిని కలవాలన్నా, రైతులు 10(1), అడంగల్ పొందాలన్నా ఇదే పరిస్థితి. ఏనుగుల గుంపు పంట నష్టం చేసినా పట్టించుకునే వారే ఉండేవారు కాదు. ఇప్పుడు సముద్రపల్లిలో గ్రామ సచివాలయం వచ్చాక అన్ని పనులు ఇక్కడే జరుగుతున్నాయని స్ధానికుడు పెంచలయ్య చెప్పారు. ప్రతివీధి శుభ్రంగా ఉంది దిగువవీధికి చెందిన మంగమ్మ మాట్లాడుతూ మాఊరి వీధులన్నీ చక్కగా బాగున్నాయన్నారు. . సచివాలయ సిబ్బంది ఊర్లో తిరుగుతూ కరోనాపై, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. దీంతో జనం చెత్తను వీధులలో వేయడం మానుకున్నారని తెలిపింది. ఏ ఇంటికి ఎవరు కొత్తగా వచ్చినా వెంటనే సమాచారం సచివాలయ సిబ్బందికి తెలుస్తోందని, అధికారులు వారిని గుర్తించి తగు చర్యలు తీసుకుంటున్నారని తెలిపింది. తీరిన పదేళ్ల సమస్య సముద్రపల్లి నుంచి క్రిష్ణాపురం గ్రామానికి అడ్డదారినే ప్రజలు ఉపయోగిస్తున్నారు. కొంత దూరం దారి అధ్వానంగా కనీసం నడిచి వెళ్లేందుకు కూడ కష్టంగా ఉండేది. గత పదేళ్లుగా ఇదే పరిస్ధితి. ఇప్పుడు 330 మీటర్ల మేర సీసీ రోడ్డు వేశారు. దీంతో దారి సమస్య తీరింది. ఇంగ్లిష్ మీడియం పెట్టాలి గ్రామంలోని ఉత్తరం వైపు సర్కారు బడి ఉంది. అక్కడ సుబ్బన్న, రామ్మూర్తి నాయుడు తదితరులు కనిపించారు. కరోనా కారణంగా బడి మూసి ఉంది. వారు పిల్లల చదువు గురించి మాట్లాడుతూ ఇంగ్లిషు మీడియంలో చదివిస్తేనే భవిష్యత్తు ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఏడాదికి పది వేల వరకు ఫీజులు కట్టి పలమనేరులోని ప్రైవేటు స్కూల్లో చదివించడం తమ లాంటి వాళ్ళకు చాలా కష్టంగా ఉందన్నారు. మంచినీటి సమస్య తీరింది గ్రామంలోని ప్రధానమైన వినాయకుని గుడి వీధిలోకి వెళ్ళగా కొళాయి వద్ద మంచినీళ్ళు పట్టుకుంటున్న లలితమ్మ, జయమ్మలను పలుకరిస్తే ...గతంలో తాగు నీటికి చాలా ఇబ్బందిగా ఉండేదని సచివాలయ ఉద్యోగుల చొరవతో నీటి సమస్య తీరిందని తెలిపారు. కొన్ని ఇళ్ల వద్ద నీటిని మోటార్లు వేసి సంప్‌లలో అక్రమంగా నింపేవారని సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి నీటి సరఫరా ఆరాతీసి అందరికీ మంచి నీరందేలా చర్యలు తీసుకున్నారని వారు చెప్పారు. విత్తనాల ఇబ్బందికి చెక్.. గ్రామంలోని రేషన్‌షాపు వీధిలోకి వెళ్ళగానే బాబు, ఉదయ్, తిరుమలేష్ అనే రైతులు వేరుశెనగ విత్తనాలను వలుస్తూ కనిపించారు. గతంలో విత్తనాలు కావాలంటే పలమనేరుకు వెళ్లి రెండు..మూడు రోజులు క్యూలో ఉండి తెచ్చుకోవలసి వచ్చేదని ఇప్పుడు స్ధానికంగానే విత్తనాలను పంపిణీ చేయడంతో ఎటువంటి ఇబ్బంది లేదన్నారు. ఏ పని ఉన్నా సచివాలయానికి వెళ్తాం.. ఊరిలోని ఎగువ వీధిలో ధనమ్మ, భాగ్యమ్మ అనే మహిళలను పలకరించగా గతంలో ఏ సమస్య వచ్చినా టౌన్‌కు వెళ్ళేవారమని.. ఇప్పుడు సచివాలయంలో సిబ్బందితో మాట్లాడితే పరిష్కారం దొరుకుతోందన్నారు. అమ్మఒడి కొందరి పేర్లు రాకుంటే సచివాలయ సిబ్బందిని కలవగా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ కాలేదని చెప్పారన్నారు. దీంతో బ్యాంకుకు వెళ్లి సమస్య పరిష్కరించుకున్నారని తర్వాత పేర్లు జాబితాలో వచ్చాయన్నారు. సున్నా వడ్డీ కింద 15 వందలు దిగువవీధిలో మంజుల, లక్ష్మీ ఇంకా కొంతమంది మహిళలు కనిపించారు. తమ పొదుపు సంఘంలో ప్రతి సభ్యురాలికి సున్నా వడ్డీ కింద రూ.1500 వచ్చిందని తెలిపారు. కరోనా కష్టకాలంలో ఆ డబ్బులు ఉపయోగపడ్డాయని చెప్పారు. అర్హులందరికీ పింఛన్లు.. గతంలో గ్రామంలో 162 మందికి మాత్రమే వివిధ రకాల పింఛన్లు వచ్చేవి. ఇంకా అర్హులైన వారు ఉండేవారు. ఇప్పుడు 203 మందికి పింఛను ఇంటి వద్దకే వస్తోంది. అంతకు ముందు పింఛను దారులు 5 కి.మీ. దూరంలోని పెంగరగుంటకు వెళ్ళి పడిగాపులు పడుతూ తీసుకొనేవారు. ముఖ్యంగా దివ్యాంగులు, వృద్ధులు చాలా కష్టాలు పడేవారు. ఇప్పుడు ఆ సమస్యలేదు. మహిళల సమస్యలకు సత్వర పరిష్కారం.. గ్రామానికి చెందిన ఒక మహిళకు అత్తగారు, బంధువుల నుంచి వేధింపులు తలెత్తాయి. ఈ విషయం గ్రామ పోలీసుకు తెలిసింది. ఆమె కౌన్సెలింగ్ చేసి సమస్యను తీర్చారు. ఎస్టీకాలనీకి చెందిన మహిళను భర్త తాగి వేధిస్తుంటే ఫోన్ చేసిన వెంటనే మహిళా పోలీసు స్పందించి సమస్యను పరిష్కరించారు. రూ. 5 వేలు పింఛన్ ఇస్తున్నారు.. ఆరు ఏళ్ల క్రితం పొలం వద్ద బోరు మోటారు వైర్లను రిపేరు చేస్తూ ఫ్యూజు వేసేందుకు ప్రయత్నిస్తుండగా కరెంట్‌షాక్‌కు గురయ్యాను. దీంతో శరీరంలో నరాలు దెబ్బతిన్నాయి.వైద్యం చేయించినా లాభంలేక మంచానికే పరిమితమయ్యాను. వేలూరు సీఎంసీలో వైద్యం కోసం ప్రతినెలా పదివేలు ఖర్చవుతోంది. దివ్యాంగ పింఛను రూ.5 వేలు ఇస్తున్నారు. అదీ ఎక్కడికి వెళ్లకుండా ఇంటివద్దకే వచ్చి ఇస్తున్నారు. – జయచంద్రనాయుడు వేరుశెనగ విత్తనాలకు టౌన్‌కి వెళ్లే వాళ్లం.. వేరుశనగ విత్తనాలు కావాలంటే టౌన్‌కి వెళ్ళి క్యూలైన్లో ఉండి తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు మా ఊరిలోనే విత్తనాలు ఇచ్చారు. రవాణా చార్జీలు, పనులు వదులుకొని పోయే బాధ తప్పింది. మా పల్లెలోనే ఏ పని కావాలన్నా ఇట్టే చేసుకుంటున్నాం. – రంగమ్మ, మహిళా రైతు పది వేల సాయం సంతోషం పల్లెల్లో టైలరింగ్‌కు ఆదరణ తగ్గుతోంది. ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో పదివేల రూపాయల సాయం మా కు ఎంతో చేదోడుగా ఉంటుంది. – రవికుమార్, టైలర్ -
కరోనా రాకుండా.. స్టీమ్ బూత్
సాక్షి, పలమనేరు: విధుల్లో ఉండేవారు కరోనా వైరస్ బారిన పడకుండా ‘కరోనా స్టీమ్ బూత్’ పేరిట ఓ యంత్రాన్ని రూపొందించాడు.. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరం గ్రామానికి చెందిన పవన్. చదివింది పదో తరగతే అయినా.. ఇప్పటికే పలు ప్రయోగాలు చేసి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా అతడు తయారు చేసిన స్టీమ్ బూత్‌లోకి వెళితే నాలుగు నిమిషాల్లోనే శరీరమంతా శానిటైజేషన్ చేసుకోవచ్చు. దీంతో శరీరం, గొంతుతో సహా తల వెంట్రుకల్లో ఉండే వైరస్ మొత్తం నశిస్తుందని చెబుతున్నాడు. పబ్లిక్ టెలిఫోన్ బూత్‌లా ఉండే దీని తయారీకి కేవలం రూ.8 వేలు మాత్రమే ఖర్చు కావడం మరో విశేషం. వీటిని క్వారంటైన్ సెంటర్ల వద్ద లేదా ఎక్కువ జన సమూహాలుండే చోట అమర్చితే ఎంతో మేలుగా ఉంటుందని అంటున్నాడు పవన్. చిత్తూరును రెడ్ జిల్లాగా ప్రకటించిన కేంద్రం -
స్మార్ట్‌గా వ్యభిచారం.. కాలేజీ యువతులు కూడా!
సాక్షి, పలమనేరు : నియోజకవర్గంలో హైటెక్ వ్యభిచారం జోరందుకుంది. స్మార్ట్ ఫోన్ల ద్వారానే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు తెలుస్తోంది. కొంతమంది వ్యభిచార నిర్వాహకులు సంఘంలో మంచివారిలా చెలామణి అవుతూ రహస్యంగా హైటెక్ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్టు సమాచారం. వీరి మాయమాటలను నమ్మి పలువురు కళాశాలకు వచ్చే విద్యార్థులు సైతం ఈ ఊబిలో పడినట్టు భోగట్టా. తొలుత సోషల్ మీడియా ద్వారా అమ్మాయిలతో సంబంధాలను ఏర్పరుచుకుని ఆపై ఈజీ మనీ కోసం ఈ ఊబిలోకి వారిని దించుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడైనా ఇలాంటి వ్యవహారాలు వెలుగుచూస్తే తప్ప అసలు విషయం ఎవరికీ తెలియకుండా సాగుతోంది. తాజాగా నియోజకవర్గంలోని వీకోట పట్టణంలోని ఓ లాడ్జిలో వ్యభిచార ముఠా గుట్టును అక్కడి పోలీసులు రట్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో అక్కడి ఓ టీడీపీ నాయకుని బంధువు ఉన్నట్టు సమాచారం. గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారంలో మూలాలు పలమనేరు, కేజీఎఫ్, బెంగళూరులో ఉన్నట్టు తెలిసింది. తొలుత సోషల్ మీడియా ద్వారా..... ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్ అవసరంగా మారింది. వయసుతో తేడా లేకుండా ఫేస్బుక్, టిక్‌టాక్, హలో, వాట్సాప్ వాడుతున్నారు. ఇందులోని మహిళలు, అమ్మాయిలతో కొందరు వ్యభిచార నిర్వాహకులు ఫ్రెండ్ షిప్ చేసుకుని చాటింగ్‌లు మొదలు పెడుతున్నారు. వీరితో పరిచయం పెరిగి కాల్స్, లైవ్ కాల్స్‌కు చేరుతోంది. వారి వ్యక్తిగత వివరాలే కాకుండా ఆర్థిక పరిస్థితులను తెలుసుకుని వారికి ఉపాధి ఉద్యోగాల పేరిట తొలుత బుట్టలో వేసుకోవడం జరుగుతోంది. ఇంకొందరు స్థానికంగా ఉద్యోగాలు ఉన్నాయంటూ సంప్రదించాలని వల వేయడం సాగుతోంది. స్థానికంగా ఉన్న అమ్మాయిలు, మహిళలను ఇళ్లకు పిలిపించుకోవడం.. వారికి అండగా ఉంటామంటూ నమ్మకాన్ని కల్పిస్తున్నారు. మెల్లమెల్లగా వ్యభిచార కూపంలోకి దించుతున్నారు. ఒక్కసారి ఇందులోకి దిగినవారు మళ్లీ బయటకు రావడం కష్టమే. ఆపై డేటింగ్ యాప్‌లలోకి... వ్యభిచార కూపంలోకి దించిన యువతులను డేటింగ్ యాప్‌లోకి అడ్మిట్ చేయిస్తారు. డేటింగ్ యాప్స్‌లో ముఖ్యమైన ఇన్‌స్ట్ర్రాగం, ఊ ది డేటింగ్ యాప్( రెడీ టూ మీట్ న్యూగర్ల్స్ ఫ్రం యువర్ ఏరియా), జస్ట్ ఫ్రెండ్స్, క్వాక్ క్వాక్, వీ మేట్, జిల్, స్నాప్‌చాట్, విగో, టిండర్, క్రస్‌లాంటి వాటిలోకి వెళితే వందలు కాదు వేలాదిమంది స్నేహితులుగా మారుతారు. ఇందులో నియర్ బై అనే ఆప్షన్ ద్వారా ఈ ప్రాంతంలోకి వారిని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా లైవ్ కాల్స్ నుంచి డైరెక్ట్‌గా మీటింగులు జరుగుతుంటాయి. కళాశాల విద్యార్థినులు, ఒంటరి మహిళలు సైతం.. వ్యభిచార ఊబిలో పడిన వారిలో కళాశాల విద్యార్థినులు, బాలికలు, ఒంటరి మహిళలు ఉన్నారు. ఆర్థిక అవసరాలు, విలాసాల కోసం జీవితాన్ని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇదో లాభసాటి వ్యాపారం కావడంతో నిర్వాహకులు పెరుగుతూనే ఉన్నారు. పలమనేరులోని గంటావూరు, వీకోట, కర్ణాటకలోని కేజీఎఫ్, బెంగళూరుకు చెందిన పలువురు వ్యభిచార నిర్వాహకులు రింగుగా ఏర్పడి విటులను స్మార్ట్ ఫోన్ల ద్వారా బుక్ చేస్తున్నట్టు సమాచారం. విటులు సైతం నిర్వాహకుల ఖాతాలకు గూగూల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే చాలు అన్నీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. కొన్ని లాడ్జిలు, అద్దె ఇళ్లు వ్యభిచారానికి అడ్డాలు నియోజకవర్గంలోని కొన్ని లాడ్జిలు, పట్టణాల్లోని అవాసప్రాంతాల్లోని ఖరీదైన ఇళ్లు హైటెక్ వ్యభిచారానికి అడ్డాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇళ్లకు బంధువులు వచ్చినట్టుగా వస్తుంటారని, ఇక లాడ్జిల్లో ప్రత్యేక గదులే ఉన్నాయని సమాచారం. విటుల వద్దకు అమ్మాయిలను చేర్చేందుకు పట్టణంలోని కొందరు అద్దెకు కార్లను సైతం సిద్ధం చేస్తుంటారట. ఈ వ్యవహారంలో సూత్రధారులు చాలామందే ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా వ్యభిచార నిర్వాహకుల ధనాశకు ఎందరో మహిళలు, యువతులు, విద్యార్థినుల జీవితాలు నాశనమవుతున్నా యి. ఇప్పటికైనా సంబంధిత ప్రాంతాల్లోని పోలీసులు దీనిపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉంది. -
'నా టైమ్ వస్తే మిమ్మల్ని కాలితో తొక్కేస్తా'
చేసేదంతా చేసి నెపాన్ని ఇతరులపై నెట్టేయడంలో రాటుదేలిన టీడీపీ నాయకులతో కలసి మాజీమంత్రి ఆడిన నాటకం రక్తికట్టలేదు. గంగవరం మండలంలో నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి పలమనేరులో శనివారం హైడ్రామా నడిచింది. ఏమి చేసినా తమ పప్పులు ఉడక్కపోవడంతో ఆ బాధనంతా పోలీసులపై చూపారు మాజీ మంత్రి అమరనాథరెడ్డి. జరిగిన సీన్‌ను తమకు అనుకూలంగా మలచుకునేందుకు వైఎస్సార్సీపీ కుట్రేనంటూ పోలీసులుపై నడివీధిలో విరుచుకుపడ్డారు. సాక్షి, పలమనేరు: గంగవరం మండలం కంచిరెడ్డిపల్లికి చెందిన సోమశేఖర్‌రెడ్డి భార్య కామాక్షమ్మ మామడుగు సెగ్మెంట్‌కు ఎంపీటీసీగా టీడీపీ తరఫున నామినేషన్ వేసింది. కుటుంబ సభ్యుల సూచనతో ఆమె తన నామినేషన్‌ను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించుకుంది. పట్టణంలోని మాజీమంత్రి ఇంటికి సమీపంలో తన బంధువుల ఇంటి వద్ద ఆమె ఉండగా, గంగవరం మండల టీడీపీ నాయకులు మాజీమంత్రితో కలసి ఆమెను విత్‌డ్రా చేయవద్దంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే ఏఆర్ డీఎస్పీ లక్ష్మీనారాయణ రెడ్డి, సీఐ శ్రీధర్ సిబ్బందితో కలసి అభ్యర్థిని ఉన్న ఇంటి వద్దకెళ్లి టీడీపీ నాయకులను బయటకు పంపారు. ఆమెను బయటకు పిలిపించి, విచారించారు. తాను స్వచ్ఛందంగా నామినేషన్ విత్‌డ్రాకు వెళుతుంటే టీడీపీ నాయకులు వద్దంటూ ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. దీంతో ఆమెకు రక్షణ కల్పించి గంగవరం పోలీసుల ద్వారా ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు. పోలీసులపై అక్కసు వెళ్లగక్కుతూ వస్తున్న అమరనాథ రెడ్డి, నాయకులు పోలీసులపై మాజీ మంత్రి ప్రతాపం తాము అనుకున్న పథకం సాగకపోవడంతో మంత్రి అక్కడున్న పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా టైమ్ వచ్చినప్పుడు కాలితో తొక్కేస్తా, ఇది పనికిమాలిన రాజకీయం’ అంటూ పోలీసులపై తన ప్రతాపాన్ని చూపారు. పత్రికల్లో రాయలేని భాషలో దూషించారు. ప్రజలు చూస్తుండగానే పోలీసులు, ప్రభుత్వంపై తన అక్కసును వెళ్లగక్కారు. పోలీసులను దూషించిన విషయాలను అప్పటికప్పుడే ఎస్పీకి డీఎస్పీ స మాచారమిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పోలీసులు భద్రం చేశారు. చదవండి: మద్యం, డబ్బు పంపిణీపై ఉక్కుపాదం మరో డ్రామాకు సిద్ధం జరిగిన సంఘటనను టీడీపీకి సానుభూతి దక్కేలా చేసే ప్రయత్నంలో భాగంగా మాజీ మంత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తమ ఎంపీటీసీ అభ్యర్థిని వైఎస్సార్సీపీ వారే బలవంతంగా విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నించారని, తాను వెళ్లి ఆమెకు రక్షణగా నిలిచానని తెలపడం విశేషం. పోలీసులే ఆమెతో విత్‌డ్రా చేయించారని బురదచల్లే ప్ర యత్నం చేశారు. పోలీసులకు అభ్యర్థిని ఫిర్యాదు జరిగిన సంఘటనపై అభ్యర్థిని కామాక్షమ్మ గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను టీడీపీ వారే విత్‌డ్రా చేయవద్దంటూ బలవంతం చేశారని, దీంతో పలమనేరు పోలీసులు తనను కాపాడారని తెలిపారు. తాను కుటుంబ సభ్యుల సూచన మేరకు స్వచ్ఛందంగా నామినేషన్‌ను విత్‌డ్రా చేశానని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మాజీ మంత్రి నాటకం బట్టబయలైంది. -
పది రోజుల్లో పెళ్లి.. యువకుడి ఆత్మహత్య
పలమనేరు: మరో పదిరోజుల్లో పెళ్లి చేసుకోవాల్సిన ఆ యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. పెళ్లి సరుకులు తీసుకొస్తానని బుధవారం వెళ్లిన ఆ యువకుడు యోగేశ్ ఆదివారం అటవీ ప్రాంతంలో శవమై కనిపించడం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరులో విషాదం నింపింది. గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ వేమన్నకు అశోక్, యోగేశ్ కుమారులు. పదేళ్ల కిందట అశోక్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీన్ని తట్టుకోలేని అతడి తల్లి రాజమ్మ కూడా అదేరోజు పురుగుమందు తాగి ప్రాణాలు తీసుకుంది. తరువాత వేమన్న రెండో వివాహం చేసుకున్నారు. అన్న, తల్లి మృతితో మానసికంగా ఇబ్బందిపడిన యోగేశ్.. తరువాత బెంగుళూరు వెళ్లి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇటీవల అతడికి వి.కోట మండలం తోటకనుమ గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఇంటికి వచ్చి పెళ్లిపనుల్లో నిమగ్నమైన యోగేశ్‌కు, అతడి సవతితల్లికి ఇంటి పెయింటింగ్ విషయమై గత బుధవారం వివాదం జరిగింది. దీంతో తీవ్రంగా కలత చెందిన అతడు అదేరోజు తన తండ్రితో బెంగళూరులో పని ఉందని చెప్పి కొత్తగా కొన్న బుల్లెట్ మీద వెళ్లాడు. గ్రామానికి సమీపంలోని కొత్త చెరువు వద్ద నల్లక్కబాయి అటవీ ప్రాంతంలో బుల్లెట్‌ను, విషపుగుళికలను ఆదివారం గుర్తించిన పెంగరగుంట వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు పరిశీలించి సమీపంలో యోగేశ్ మృతదేహాన్ని గుర్తించారు. అతడు నాలుగు రోజుల కిందటే ప్రాణాలు తీసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుప్తనిధుల వేట.. నరబలికోసమేనట..!
పలమనేరు: గుప్తనిధుల కోసం వెళితే కరెంటు షాక్ కొట్టి లబోదిబోమన్నారు. పక్కాగా స్కెచ్ వేసినా వన్యప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్ల అమర్చిన కరెంటు తీగల కారణంగా ప్లాన్ బెడిసి కొట్టింది. ఎనిమిదిమంది ముఠాలో ముగ్గురు కరెంటు షాక్ కొట్టింది. చివరకు తేలుకుట్టిన దొంగల్లా ఆస్పత్రిలో చేరారు. అయితే ఇంటిమీద కరెంటు షాక్ కొట్టిందంటూ కహానీలు చెప్పినా పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు బైటపడ్డాయి. బుధవారం ఆలస్యంగా ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు, స్థానికులు, ప్రస్తుతం పోలీసుల అదుపులోఉన్న వారు తెలిపిన వివరాల మేరకు... పకీర్పల్లె, చెన్నుపల్లె సమీపాన దొడ్డిపల్లె బీట్‌లోని లక్ష్మప్ప చెరువులో గుప్తనిధులున్నాయని ఎప్పటినుంచో పుకార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలమనేరు మండలం కూర్మాయికి చెందిన హరీష్‌రెడ్డి, పట్టణంలోని గడ్డూరు కాలనీకి చెందిన మెకానిక్ గణేష్, ఇతని బంధువు పకీర్పల్లెకు చెందిన ఆటోడ్రైవర్ రమేష్, కాబ్బల్లికి చెందిన గంగిరెడ్డి, బైరెడ్డిపల్లె మండలం చప్పిడిపల్లెకు చెందిన గురు, చౌడేపల్లె, అంగళ్లు ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరితోపాటు తమిళనాడు రాష్ట్రం చెన్నెకి చెందిన జయరామ్ స్వామీజీ గుప్తనిధుల కోసం స్కెచ్ వేశారు. దీనికయ్యే ఖర్చును హరీష్రెడ్డిపై మోపడంతో అతను వారం రోజులుగా స్థానిక మదనపల్లె రోడ్డులోని ఓ లాడ్జిలో స్వామీజీని దింపాడు. గత గురువారం ఈ ముఠా అడవిలోకి గుప్తనిధులున్న ప్రాంతానికి వెళ్లి రెక్కీ నిర్వహించింది. ఆపై పక్కాగా ప్లాన్ చేసుకుని శనివారం రాత్రికి అక్కడ ప్రత్యేక పూజలు చేసి నిధుల కోసం తవ్వకం పనులకు పూనుకోవాలని నిర్ణయించారు. శనివారం రాత్రి 8 గంటలకు ఆపరేషన్ ఇలా.... ఆటోడ్రైవర్ రమేష్ ఆటోలో గణేష్ గునపం, పార వేసుకుని రెక్కమాను సర్కిల్లో నలుగురిని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆపై స్వామీజీ జతకలిశాడు. వీరు స్థానిక పెద్దచెరువు కట్టపైకి రాగానే స్కూటీలో ఇదే ముఠాలోని ఇద్దరు కలిశారు. ఆ తర్వాత అందరూ అడవి సమీపంలోకి రాత్రి 9.30కు చేరుకున్నారు. ఆటో వెళ్లేందుకు దారిలేకపోవడంతో అక్కడి మామిడితోపులో ఆటోను ఆపి కాలినడకను వీరు బయలుదేరారు. అడవికి దగ్గర్లోనే వన్యప్రాణులను హతమార్చేందుకు వేటగాళ్లు కరెంటు తీగలను అమర్చిన విషయం తెలియక ముందువెళుతున్న గణేష్, అతని వెనుకనున్న జయరామ్, స్వామీజీ కరెంటు షాక్‌కు గురై గాయపడినట్టు తెలిసింది. ఇందులో గణేష్‌కు ఎక్కువగా గాయాలయ్యాయి.దీంతో ముఠా అదే ఆటోలో పలమనేరుకు చేరుకుంది. విషయం తెలిసి గణేష్ అన్న సురేష్ వీరిని స్థానిక ఆస్పత్రిలో చేర్చాడు. వారు ఇంటిపై కరెంట్ షాక్ కొట్టిందంటూ ట్రీట్మెంట్ పొందారు. శనివారం రాత్రే తిరుపతి రుయా ఆస్పత్రికి వెళ్లి, అక్కడ కూడా ఇదే స్టోరీ చెప్పి, చికిత్స పొందారు. అయితే స్వామీజీ మాత్రం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ప్రస్తుతం తమిళనాడులో చికిత్స పొందుతున్నట్టు సమాచారం. నరబలికోసమేనట..! తనకే పాపం తెలియదని, తనను పార, గునపం తీసుకురమ్మంటే తీసుకుని వారితో వెళ్లానని, అడవిలోకి వెళ్లాక తనకేమైందో అర్థం కాలేదని గడ్డూరుకు చెందిన గణేష్ మీడియాకు తెలిపాడు. గుప్తనిధులకోసం పూజలు చేసేటపుడు తనను కావుగా బలిచ్చేందుకు తీసుకెళ్లి ఉంటారని, తనపై యాసిడ్ పోశారని కూడా పేర్కొనడం గమనార్హం! మిస్టరీగా మారిన వైనం ఇదే విషయం పలమనేరు ఎస్ఐ నాగరాజును వివరణ కోరగా.. సంబంధిత వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ముగ్గురి నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామన్నారు. కరెంటు షాక్‌కు గురవడంతోనే తాము వారిని వెనక్కి తీసుకొచ్చామని నిందితులు ప్రాథమిక విచారణలో చెప్పినట్టు ఎస్ఐ తెలిపారు. గణేష్ మాటల్లో వాస్తవం లేదని కొట్టిపారేశారు. సంఘటన స్థలానికి 300 అడుగుల దూరంలో వ్యవసాయ మోటార్లున్నాయని, అక్కడినుంచి కరెంటు తీగలను లాగారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మిస్టరీని త్వరలోనే ఛేదిస్తామని ధీమాగా తెలిపారు. -
రోడ్డున పడిన జీవితం!
పలమనేరు: తన భర్త, అత్తమామలు తనతో గొడవ పడి ఇంటి నుంచి గెంటేశారని ఓ మహిళ తన పసిబిడ్డతో విలపిస్తోంది. తలదాచుకునేందుకు స్థలం లేక తన సామగ్రితో అంగన్వాడీ కేంద్రం వద్దకు చేరింది. గురువారం ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలోని నీళ్లకుంటలో వెలుగుచూసింది. తన గోడును బాధితురాలు అంగన్వాడీ వర్కర్ రాధకు నివేదించడంతో ఆమె మీడియా దృష్టికి తీసుకువచ్చింది. వివరాలు..పట్టణ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద కాపురమున్న శోభతో బొమ్మిదొడ్డికి చెందిన గోవిందురాజులతో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఏదాడి వయస్సున్న బాబున్నాడు. అయితే తల్లిమాట వింటూ భర్త తరచూ తనను వే«ధిస్తున్నాడని శోభ తెలిపింది. ఈనేపథ్యంలో రెండ్రోజుల క్రితం ఇంటినుంచి బయటకు పంపేశారని, దీంతో ఏం చేయాలో అర్థంగాక అంగన్వాడీ ముందు తలదాచుకుంటున్నానని తనకు పోలీసులు న్యాయం చేయాలని కోరుతోంది. -
ఓ అనామిక కథ!
ఆ చిన్నారి ఐదేళ్ల వయసులో ఒడిశాలో తప్పిపోయింది. తల్లిదండ్రులు అప్పట్లో వెతికినా బిడ్డ ఆచూకీ దొరకలేదు. ఆశలు వదులుకుని వారు స్వగ్రామానికి వచ్చేశారు. ఆ బాలికను ఒడిశా ప్రభుత్వం సంరక్షించి చదివిస్తోంది. ఎప్పటికైనా తన తల్లిదండ్రులను చూడకపోతానా అని ఆశతోనే ఉండేది. అధికారుల సాయంతో తన స్వస్థలం వీకోట మండలంలోని బోడిగుట్టపల్లెగా తెలుసుకుంది. అయితే తల్లిదండ్రులు మృతి చెందారని తెలిసి కన్నీరుమున్నీరవుతోంది. సాక్షి, పలమనేరు:చిన్న తనంలో ఒడిశాలో తప్పిపోయిన బాలికకు పదేళ్ల తర్వాత తన పుట్టిన నేల గురించి తెలిసినా.. ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. పూర్తి వివరాలు తెలుసుకునే సరికి కన్నవారు లేరన్న నిజం జీర్ణించుకోలేకపోతోంది. కనీసం తన కుటుంబీకులను కలుసుకోవాలని ఆరాటపడుతోంది. పదేళ్ల తర్వాత ఆమెకు తన వివరాలు ఎలా లభించాయి. అసలు ఏం జరిగిందంటే.. వీకోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన పరమేష్, లక్షమ్మ భార్యాభర్తలు. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. బతుకుదెరువు కోసం పదేళ్ల క్రితం చిన్న కూతురితో పాటు ఒడిశా రాష్ట్రం పూరి సమీపంలోని కనాస్ ప్రాంతానికి వలసకూలీలుగా వెళ్లారు. అక్కడ బిడ్డ తప్పిపోయింది. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. ఫిర్యాదు చేసేందుకు పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. బాలిక ఫొటో కావాలన్నారు. తమవద్ద లేదని చెప్పడంతో కేసు కూడా నమోదుచేయలేదు. కొన్నాళ్లు తప్పిపోయిన ప్రాంతంలో వెతికి చేసేదిలేక స్వగ్రామానికి తిరిగొచ్చేశారు. ఇక్కడ కూలిపనులు చేసుకుంటూ ఉండిపోయారు. వికోట మండలం బోడిగుట్టపల్లిలో బాలిక కుటుంబ సభ్యులను విచారిస్తున్న అధికారులు బాలికను చేరదీసిన స్వచ్ఛంద సంస్థ ఒడిశాలోని కనాస్లో అనాథగా తిరుగుతున్న చిన్నారిని నిలాచల్ సేవా ప్రతిష్టాన్ అనే స్వచ్ఛంద సంస్థ గుర్తించింది. అక్కడి ఐసీపీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్) అధికారులకు అందజేసింది. వారు అక్కడి ప్రభుత్వ చిల్డ్రన్ హోమ్(దయావిహార్)కు అప్పగించారు. ఆ సంస్థ నిర్వాహకులు ఆ బాలికకు అనామిక అని పేరు పెట్టి అక్కడే చదివిస్తున్నారు. బాలిక పెరిగి పెద్దయ్యాక రెండేళ్ల క్రితం తమది ఆంధ్రరాష్ట్రం చిత్తూరు జిల్లాలోని బోడిగుట్టపల్లె అని చెప్పింది. అక్కడి అధికారులు చిరునామా కనుగొనేందుకు బాలిక 8వ తరగతి ఫొటోను చిత్తూరు ఐసీడీఎస్ అధికారులకు పంపారు. బోడిగుట్టపల్లి పేరిట పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో రెండు, మూడు గ్రామాలుండడంతో స్థానిక సీడీపీఓలు రెండేళ్లుగా చిరునామా కోసం విచారిస్తున్నానే ఉన్నారు. ఇలా ఉండగా వికోట మండలం బోడిగుట్టపల్లెకు చెందిన ఓ బాలిక ఒడిశాలో తప్పిపోయిందని స్థానికుల ద్వారా సీడీపీఓ రాజేశ్వరికి సమాచారం అందింది. ఆమె నాన్ ఇన్స్టిట్యూషన్ కేర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శివకు ఆ విషయం తెలిపారు. ఆయన బోడిగుట్టపల్లికి చేరుకుని బాలికకు సంబంధించిన ఫొటో, వివరాలను చెప్పారు. కుటుంబ సభ్యుల ఫొటోలను ఒడిశాలో బాలిక ఉంటున్న చైల్డ్‌హోమ్‌కు వాట్సాప్‌లో పంపారు. వారిని చూసిన బాలిక తన అన్న, అక్కలుగా గుర్తించింది. అంతలోనే కన్నీరుమున్నీరు తన వారిని గుర్తించిన బాలిక తల్లిదండ్రులు ఎలా ఉన్నారో చూపాలని ఆత్రుతగా అడిగింది. వారు మృతి చెందారనే సమాచారం తెలుసుకుని బాలికకు చెప్పారు. దీంతో అనామిక కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. కనీసం తన బంధువుల వద్దకు వెళతానని బాలిక కోరింది. దీంతో జిల్లా ప్రొటెక్షన్ ఆఫీసర్, స్థానిక సీడీపీఓలు మంగళవారం బోడిగుట్టపల్లెలోని కుటుంబ సభ్యులను విచారించారు. వీడియో కాల్ ద్వారా బాలికతో మాట్లాడించారు. ఈ వివరాలతో నివేదికను ఒడిశా ప్రభుత్వానికి పంపి ఆపై బాలికను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు సీడీపీఓ రాజేశ్వరి తెలిపారు. కాగా అనామిక ప్రస్తుతం అక్కడి పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. పరీక్షలు పూర్తయ్యాక ఇక్కడికి పంపనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారని విచారణకు వచ్చిన అధికారి శివ తెలిపారు. 10 ఏళ్ల క్రితం తప్పిపోయిన బిడ్డ బతికే ఉందని, ఆ బాలిక ఇప్పుడెలా ఉందో చూడాలని వారి కుటుంబ సభ్యులే కాదు.. ఆ గ్రామస్తులంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. -
అమ్మపై అలిగి.. సన్యాసినులుగా మారదామని
సాక్షి, పలమనేరు(చిత్తూరు) : తల్లి మందలించిందని అలిగిన కవల బాలికలు.. కశ్మీర్ వెళ్లి అక్కడ ఆశ్రమంలో సన్యాసినులుగా బతకాలని భావించి, అక్కడకు వెళ్లే ప్రయత్నంలో పోలీసులకు చిక్కారు. సీఐ శ్రీధర్ వెల్లడించిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన విశ్వనాథ్‌కు కవల పిల్లలున్నారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. సంక్రాంతి సెలవులకు ఇంటికొచ్చిన పిల్లలను తల్లి మందలించడంతో వారు తల్లిపై అలిగారు. దీంతో తండ్రి వారిని తమిళనాడులోని కాట్పాడిలో ఉంటున్న బంధువుల ఇంటికి మూడు రోజుల కిందట తీసుకెళ్లాడు. వారిని అక్కడి వదిలి పనిమీద బయటకెళ్లాడు. ఇదే అదునుగా భావించిన కవల పిల్లలు అక్కడి రైల్వేస్టేషన్‌కెళ్లి రైలెక్కి కర్నూలు వైపునకు వెళ్లిపోయారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న తండ్రి.. పిల్లలు కనిపించకపోవడంతో భార్యకు సమాచారమిచ్చాడు. ఆపై ఎక్కడ వెదికినా వారి ఆచూకీ లభించలేదు. వారి వద్దనున్న సెల్‌ఫోన్ సైతం స్విచాఫ్‌లో ఉంది. దీంతో తల్లిదండ్రులు మంగళవారం పలమనేరు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పిల్లలు అదృశ్యమైంది తమిళనాడులోని కాట్పాడి కావడంతో సీఐ శ్రీధర్ జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసి కేసును కాట్పాడికి బదిలీచేశారు. కవలలు బుధవారం సాయంత్రం సెల్ ఆన్‌చేయడంతో.. టవర్ లొకేషన్ ఆధారంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రాంతంలో వారున్నట్టు గుర్తించారు. పోలీసులు అక్కడికి చేరుకుని గురువారం వారిని పలమనేరుకు తెచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. స్నేహితురాలి సలహాపై దేశముదురు సినిమాలో హీరోయిన్లా సన్యాసినులుగా మారదామనుకున్నామని కవలలు పోలీసులతో చెప్పారు. -
నువ్.. మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా
చిత్తూరు, పలమనేరు: సినిమాను తలపించేలా ఓ యువకుడు తన ప్రేయసి కోసం దుస్సాహసానికి తెగబడ్డాడు. ‘నువ్..మగాడివైతే అర్ధరాత్రి హాస్టల్‌కి రా..ఫోన్ చెయ్ వస్తా..’ అని బంపర్ ఆఫర్ ఇవ్వడంతో గాల్లో తేలిపోయాడు. తానో స్పైడర్ మాన్ లెవెల్లో గోడలు ఎగబాకి హాస్టల్లోకి ప్రవేశించాడు. ఆపై, ప్రేయసికి ఫోన్‌చేసే ప్రయత్నంలో పడ్డాడు. అయితే ఆగంతకుడి రాకను గమనించిన వాచ్ ఉమెన్ పోలీసులకు సమాచారమిచ్చింది. విద్యార్థినులు అతగాడిని చూసి భయంతో కేకలు వేశారు. అంతే కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే..స్థానిక మదనపల్లె రోడ్డులోని ఓ మహిళా ప్రైవేటు హాస్టల్లోకి గురువారం అర్ధరాత్రి ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. హాస్టల్ గోడకు ఉన్న పైపుల ద్వారా ఎగబాకి రెండో అంతస్తుకు చేరుకున్నాడు. అక్క డ చీకటి ప్రదేశం నుంచి సెల్ఫోన్లో మాట్లాడుతుండగా వాచ్మెన్ గమనించింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపింది. దీంతో అప్రమత్తమైన సీఐ శ్రీధర్ మహిళా ఎస్ఐ ప్రియాంక, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే హాస్టల్లోని విద్యార్థులు బిగ్గరగా కేకలు పెట్టడం.. కింద సైరన్ మోతతో పోలీసు వాహనం చేరుకోవడం చూసి ఆగంతకుడు చమటలు పట్టాయి. పైపుల నుంచి మళ్లీ జారుతూ కిందకు దూకాడు. అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో అతని పేరు భానుప్రసాద్(22) అని, పట్టణంలో పెయింటర్ పనిచేసే వాడని తేలింది. హాస్టల్లో ఉంటున్న ఇంటర్ చదివే బాలిక అర్ధరాత్రి లోనికి ఎలాగైనా రమ్మందని, అందుకే ఈ ప్రయత్నం చేసినట్లు అతడు వెల్లడించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ద్వారా సీఐ బైండోవర్ చేయించారు. అసలు మేటరేమిటంటే ఆ విద్యార్థిని ఇంట వారం పాటు ఇతగాడు పెయిటింగ్ పనులు చేశాడట! దీంతో ఆ బాలిక ప్రేమ పల్లవి అందుకుందట!! -
‘టెర్రకోట’ ఉపాధికి బాట
ప్రజలకు ఉపాధి కల్పించడం ప్రభుత్వ బాధ్యత. చేపలను ఇవ్వడం కన్నా.. వాటిని పట్టే వలను అందించి ప్రోత్సహించడం మిన్న. సరిగ్గా ఈ విధానానికే ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఎందరికో స్వయం ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. దీనికోసం ఇతర రాష్ట్రాల నుంచి ప్రత్యేక శిక్షకులను రప్పించి స్థానికులకు శిక్షణ ఇప్పిస్తోంది. అలాగే వారు తయారు చేసే వస్తువులను అంతర్జాతీయ విపణిలో ఉంచేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే ‘టెర్రకోట’ కళను ప్రోత్సహించడం ద్వారా పలువురి ఉపాధికి నడుం బిగించింది. పలమనేరు: జిల్లాలో టెర్రకోట కళాకారులకు పలమనేరు ప్రసిద్ధి. పట్టణానికి సమీపంలోని టెర్రకోట కాలనీలో సుమారు వంద కుటుంబాలకు ఈ కళే జీవనోపాధి. వీరికి మరింత చేయూతనందించడమే లక్ష్యంగా గంటావూరు సమీపంలో రూ.2కోట్లతో డీఆర్డీఏ ‘టెర్రకోట హబ్’ను ఏర్పాటు చేసింది. ఇందులో టెర్రకోట కళాకారులు ఇప్పటి వరకు తయారు చేస్తున్న వస్తువులకు పశ్చిమ బెంగాల్, ఒడిశా డిజైన్లను జోడించి విభిన్న ఆకృతులను సృష్టించేందుకు శిక్షణ ఇస్తున్నారు. అలాగే అధిక సంఖ్యలో యువతీయువకులను టెర్రకోట కళలో నిపుణులుగా తీర్చిదిద్ది వారికి ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నారు. నెలరోజుల శిక్షణ.. టెర్రకోట హబ్‌లో టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ట్రాన్స్ఫర్ సెంటర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే ఏపీఎస్‌డీసీఎల్ (ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్), సీఎఫ్‌సీ (కామన్ ఫెసిలిటీ సెంటర్), టెర్రకోట హస్తకళాకారుల ఎయిడెడ్, రీచ్ సంస్థల ఆధ్వర్యంలో యువతకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్, ఒడిశా నుంచి ప్రత్యేకంగా శిక్షకులను రప్పించారు. వీరి పర్యవేక్షణలో 50మంది నెల రోజులపాటు శిక్షణ పొందారు. తొలి బ్యాచ్‌కు టెర్రకోట హబ్‌లోనే ఉపాధి కల్పించారు. కావాలనుకుంటే వారు ఇళ్ల వద్ద కూడా కళాకృతులను తయారు చేసుకుని ఉపాధి పొందవచ్చు. విభిన్న ఆకృతులకు డిమాండ్.. నూతన సాంకేతికతను అందిపుచ్చుకున్న టెర్ర కోట కళాకారులు విభిన్న ఆకృతులను తయా రు చేస్తున్నారు. వాటికి ప్రస్తుత మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ముఖ్యంగా కొళాయి అమర్చిన మట్టి కూజాలు, వేలాడే కుండీలతోపాటు శుభకార్యాల్లో బహుమతులు గా ఇచ్చేందుకు పలు కళాకృతులను రూపొందిస్తున్నారు. చివరకు ఫొటోఫ్రేమ్‌లను సైతం మ ట్టితో తయారుచేయడం విశేషం. పాత పద్ధతులకు స్వస్తి.. గతంలో మట్టికుండలు తయారీలో వినియోగించే కుమ్మరిసారెకు బదులు ఎలక్ట్రిక్ వీల్ మెషీన్ వచ్చింది. బంకమట్టిని కాళ్లతో తొక్కాల్సిన అవసరం లేకుండా ప్లగ్‌మిల్ మిక్చర్ అనే యంత్రం అందుబాటులో ఉంది. మట్టి వస్తువులను బట్టీ్టలో కాల్చే పనిలేకుండా విద్యుత్‌లో నడిచే సిలన్ వచ్చింది. దీంతోపాటు బాల్మిల్, ఫిల్టర్లు, కట్టర్లు.. ఇలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో మట్టి బొమ్మల తయారీకి యంత్రాల వాడకంపై హస్త కళాకారులకు టెర్రకోట హబ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ అమ్మకాలు... టెర్రకోట హబ్‌లో తయారైన కళాకృతులను బెంగళూరుకు చెందిన పలు కంపెనీల ద్వారా ఆన్లైన్లో దేశ విదేశాలకు విక్రయిస్తున్నారు. అయితే టెర్రకోట కళాకారులే ఆన్లైన్లో విక్రయించుకునేలా డీఆర్డీఏ ప్రయత్నిస్తోంది. ఏదేమైనా పలమనేరు మట్టి విదేశాలకు సైతం చేరుతుండడం విశేషం. ఎవరైనా ఉచితంగా నేర్చుకోవచ్చు.. ప్రభుత్వం నెలకొల్పిన శిక్షణ కేంద్రంలో టెర్రకోట కళను ఉచితంగానే నేర్చుకోవచ్చు. చేతిలో పని ఉంటే ఎక్కడైనా బతకవచ్చు. హబ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఇక్కడే ఉపాధి కల్పిస్తున్నాం. ఆసక్తిగలవారు సంప్రదించవచ్చు. -రామకృష్ణ, టెర్రకోట హస్తకళాకారుల సంఘం, పలమనేరు టెర్రకోట వస్తువుల తయారీపై శిక్షణపొందా.. మాది గంటావూరు గ్రామం. ఉపాధి కోసం ఇక్కడ శిక్షణ పొందా. ఇప్పుడు కొంతవరకు పని నేర్చుకున్నా. ఇందులో చాలా వస్తువులను తయారు చేయవచ్చు. ఇంటి వద్దే పీస్ వర్క్ చేసుకుంటున్నాం. -స్నేహ, గంటావూరు చాలా చక్కగా నేర్చుకుంటున్నారు... మట్టిబొమ్మల తయారీపై కొత్త టెక్నిక్‌లతో శిక్షణనిస్తున్నా. ఇక్కడి వారు చాలా ఫాస్ట్‌గా నేర్చుకుంటున్నారు. నెలరోజుల శిక్షణ పూర్తయితే ఇక్కడే పీస్ వర్క్ చేసుకోవచ్చు. సొంతవూర్లోనే ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ తయారైన వస్తువులకు మంచి గిరాకీ ఉంటుంది. -గణేష్పాల్, శిక్షకుడు, కలకత్తా చేతిలో పని ఉంటే ఎలాగైనా బతకవచ్చు ఊరికే ఇంట్లో ఉండే బదులు ఇక్కడ శిక్షణ తీసుకుని ఉపాధి పొందడం ఆనందంగా ఉంది. పని నేర్చుకున్నాక పీస్ వర్క్ చేసుకున్నా చాలు. ప్రభుత్వం మాలాంటి వాళ్లకు మంచి అవకాశం కల్పించింది. -లలిత, గంటావూరు -
ప్రాజెక్ట్ పేరిట కుచ్చుటోపీ
పలమనేరు: ప్రాజెక్టు వర్క్ ఇస్తామంటూ తెలివిగా నమ్మించి సాఫ్ట్వేర్ ఇంజినీర్ నుంచి లక్షలు దండుకున్నారు. ఈ ఘటన బుధవారం పలమనేరులో వెలుగుచూసింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం..పట్టణంలోని శ్రీనగర్‌కాలనీకి చెందిన తేజ సాఫ్ట్వేర్ ఇంజినీర్. బజారువీధిలో మా బ్రాండ్ టెక్నాలజీస్( మా సలహాలతో మీ వ్యాపారం రెట్టింపు)అనే సాఫ్ట్వేర్ సంస్థను ప్రారంభించాడు. ఇందులో సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు, పర్సనల్ లోన్లు, వెబ్సైట్లు, యాప్స్ సేవలుంటాయని బోర్డు పెట్టాడు. దీంతో నెల్లూరుకు చెందిన దినేష్‌మూర్తి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ వీరితో వ్యాపార లావాదేవీలు మాట్లాడారు. తమ వద్ద యూఎస్ కంపెనీకి చెందిన ప్రాజెక్టు వర్క్ ఉందని, దానిని నెల్లూరులో చేసి తమకు పంపితే ఖాతాకు డబ్బులేస్తామంటూ తేజ ఒప్పందం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన యూసర్ ఐడీ, పాస్వర్డ్, ఎక్స్ఎల్ షీట్లను పంపాడు. ఈ పనులు చేసినందుకు దినేష్‌మూర్తికి డబ్బులు ఆన్లైన్లో వేస్తూ నమ్మకం కలిగించాడు. ఆపై మరో ప్రాజెక్టు ఇస్తానంటూ రూ.7.60లక్షలు దినేష్‌మూర్తి నుంచి తీసుకున్నాడు. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించిన ఒరిజినల్ ఐడీలు కాకుండా డూప్లికేట్ ఐడీలను తేజ ఇవ్వడంతో మోసపోయామని బాధితుడు తెలుసుకుని పలమనేరుకు వచ్చి అతడిని నిలదీశాడు. త్వరలో సెటిల్ చేస్తానన్న తేజ ఆ తర్వాత డబ్బుల్వికపోవడంతో బాధితుడు బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట తేజ, అతని అన్న చంద్ర, సాఫ్ట్వేర్ డెవలపర్ హయాత్, డాటా ట్రాన్స్ఫరర్ బాలాజీతో కలసి తమను మోసం చేశాడని పోలీసులకు బాధితుడు వివరించాడు. ఆధారాలను పరిశీలించిన ఎస్ఐ ప్రియాంక కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా బాధితులు ఎందరున్నారో దర్యాప్తులో తేలాల్సి ఉంది. -
ఘాట్ రోడ్డులో ఘోరం:10మంది దుర్మరణం
బంగారుపాళ్యం (చిత్తూరు జిల్లా): సమీప బంధువు ఒకరు మరణించడంతో పరామర్శించేందుకు వెళ్లిన వారిని విధి వెక్కిరించింది. మృతుడి కుటుంబసభ్యుల్ని ఓదార్చి తిరిగి గ్రామానికి బయల్దేరిన వారికి అదే చివరి రోజైంది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలి ఘాట్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి చెందారు. ఘాట్ రోడ్డులో డీజిల్ ఆదా చేసేందుకు కంటైనర్ డ్రైవర్ ఇంజిన్ ఆఫ్ చేయడమే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుల్లో 9 మంది చిత్తూరు జిల్లా గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాద చాయలు అలముకున్నాయి. బెంగళూరు నుంచి వాటర్‌బాటిళ్ల లోడ్‌తో విజయవాడకు వెళ్తున్న కంటైనర్ బంగారుపాళ్యం సమీపంలోని మొగిలి ఘాట్ వద్ద డివైడర్‌ను ఢీకొట్టి.. ఎదురుగా వస్తున్న ఓమ్ని వాహనం, ద్విచక్రవాహనంపై బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓమ్ని వాహనంలో ప్రయాణిస్తున్న 9 మంది, ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. కంటైనర్ డ్రైవర్ ఆచూకీ తెలియలేదు. అతను సంఘటన జరిగిన వెంటనే పరారై ఉంటాడని కొందరు చెబుతుండగా.. మరికొందరు మాత్రం అతను కూడా మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు10 మంది మృతులను గుర్తించగా.. వారిలో డ్రైవర్ అక్షయ్ లేడు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణం సాయంగా రూ.50 వేలు, వైఎస్సార్ భరోసా కింద రూ.7 లక్షలు అందజేయాలని అధికారుల్ని ఆదేశించారు. అసలేం జరిగింది..? చిత్తూరు జిల్లా గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన వెంకటమ్మ చెల్లెలి భర్త శ్రీనివాసులు శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతుడిది తవణంపల్లె మండలం తెల్లగుండ్లపల్లె కావడంతో శ్రీనివాసులు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెంకటమ్మతో పాటు బంధువులు, మర్రిమాకులపల్లె గ్రామస్తులు తెల్లగుండ్లపల్లెకు వెళ్లారు. అంత్యక్రియలు శనివారం కావడంతో తిరిగి వాహనంలో మర్రిమాకులపల్లెకు పయనమయ్యారు. అదే సమయంలో వాటర్ బాటిళ్లతో విజయవాడ వైపు వెళ్తున్న కంటైనర్ బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద అతి వేగం వల్ల అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. మర్రిమాకులపల్లెకు చెందిన గ్రామస్తులు ప్రయాణిస్తున్న ఓమ్ని వాహనంతో పాటు వెనుకనే వస్తున్న ద్విచక్రవాహనంపై కంటైనర్ బోల్తాపడింది. దీంతో ఓమ్నిలో ప్రయాణిస్తున్న రామచంద్ర (39), రాము (38), సావిత్రమ్మ (50), ప్రమీల(37), సుబ్రహ్మణ్యం(40), శేఖర్ (45), వెంకటమ్మ(70), పాపన్న (43) రాణెమ్మ (45)తో పాటు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బంగారుపాళ్యం మండలం బలిజపల్లెకు చెందిన నరేంద్ర (40) అక్కడిక్కడే మరణించారు. కంటైనర్ క్లీనర్ రాజేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆటో త్రుటిలో పక్కకు తప్పుకోవడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. మంటల్లో సజీవ దహనమైన ద్విచక్రవాహనదారుడు పలమనేరు–చిత్తూరు మధ్యలో బంగారుపాళ్యం సమీపంలోని మొగిలి వద్ద ఘాట్ సుమారు 30 అడుగుల కిందకు ఉంటుంది. డీజిల్ ఆదా చేసేందుకు డ్రైవర్ వాహనాన్ని న్యూట్రల్ చేయడంతో దీంతో ఒక్కసారిగా వేగం పెరిగింది. చీకట్లో సరిగా కనిపించకపోవడంతో వేగంగా దూసుకుపోతున్న వాహనాన్ని స్లో చేసేందుకు బ్రేక్ వేశాడు. అయితే బ్రేక్ పనిచేయకపోవడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ఆ తర్వాత కంటైనర్ ఓమ్ని వాహనంపై బోల్తాపడటంతో భారీ శబ్దం రావటంతో పాటు వాహనంలో నుంచి మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో ఆ మార్గంలో ద్విచక్రవాహనం నడుపుతూ వెళ్తున్న నరేంద్ర సజీవ దహనమయ్యాడు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిలో తొమ్మిది మంది గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. మృతుల్లో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలున్నారు. మాంసపు ముద్దలు.. తెగిన శరీర భాగాలు చిత్తూరు అర్బన్: ప్రమాద స్థలి వద్ద మృతదేహాలు గుర్తుపట్టలేనంత మాంసపు ముద్దలుగా మారిపోయాయి. వ్యాను నుంచి పెట్రోలు లీకై మంటలు రావడంతో కొన్ని మృతదేహాలు పాక్షికంగా కాలిపోయాయి. వ్యానుపై కంటైనర్‌లోని వాటర్‌బాటిళ్లు పడడంతో శరీర భాగాలు చెల్లచెదురైపోయాయి. ఓ మృతదేహం మొండెం నుంచి తల వేరుపడి వంద అడుగుల దూరంలో పడింది. ఓ చేయి పూర్తిగా తెగిపోయింది. దీంతో ప్రమాద స్థలం వద్ద భయానక వాతావరణం కనిపించింది. ఈ ఘటనను చూసినవారు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. మృతదేహాలపై దుస్తులు, ముఖాల్ని చూసి చనిపోయినవారిని గుర్తించగలిగారు. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలు ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగలిఘాట్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ద్రిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సంఘటన సమాచారం తెలిసిన వెంటనే పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడతో ఫోన్లో మాట్లాడారు. వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలను పరామర్శించాలని ఎమ్మెల్యేకు సూచించారు. తక్షణ సాయం కింద రూ.50 వేలు, వైఎస్సార్ భరోసా కింద రూ.7 లక్షలు అందజేయాలని ఆదేశించారు. కొంపముంచిన అనుభవలేమి! చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్‌లో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి కారణం.. కంటైనర్ యజమాని అక్షయ్‌కు డ్రైవింగ్‌లో అనుభవం లేకపోవడమేనని తెలుస్తోంది. డ్యూటీకి రావాల్సిన డ్రైవర్ సెలవులో ఉండటంతో అక్షయ్ డ్రైవింగ్ చేసి 10 మంది మృతికి కారణమయ్యాడు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ క్లీనర్ రాజేశ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. విజయవాడ పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన అక్షయ్ (26) ఏపీ39 ఎక్స్ 7902 కంటైనర్ వాహనాన్ని అద్దెకు నడుపుతున్నాడు. హైదరాబాద్‌లో ఉన్న కంటైనర్‌ను తీసుకురావాల్సిందిగా డ్రైవర్‌కు చెప్పాడు. అయితే.. తనకు సెలవు కావాలని, తాను వెళ్లనని చెప్పి డ్రైవర్ ఇంటికెళ్లిపోయాడు. దీంతో క్లీనర్ గుంజా రాజేశ్ (27)తో అక్షయ్ హైదరాబాద్ వెళ్లాడు. అక్కడ ఐరన్ పైపుల బాడుగ దొరకడంతో బెంగళూరు వెళ్లి పైపులు అన్లోడ్ చేశారు. తర్వాత విజయవాడకు కిన్లే వాటర్ బాటిళ్ల బాడుగ దక్కడంతో లోడ్ చేసుకొని శుక్రవారం ఉదయం విజయవాడకు బయలుదేరారు. వారు ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి పలమనేరు చేరుకునేలోపు ఐదుసార్లు టైర్లకు పంక్చర్లు పడ్డాయి. ఇవేమి అపశకునాలనుకుంటూనే వారిద్దరూ బయలుదేరారు. పలమనేరు చేరుకోగానే తాను నిద్రపోతానంటూ అప్పటివరకు డ్రైవింగ్ చేసిన క్లీనర్ రాజేశ్ పడుకున్నాడు. మొగిలి ఘాట్‌కు చేరుకున్నాక కంటైనర్‌కు బ్రేకులు పడటం లేదని, వాహనం నడుపుతున్న యజమాని అక్షయ్ చెప్పాడు. అయితే.. మళ్లీ డ్రైవింగ్ అప్పగించేందుకు అక్షయ్ అబద్ధం చెబుతున్నాడని భావించిన క్లీనర్ రాజేశ్ అలాగే ఉండిపోయాడు. అంతలోనే అక్షయ్.. ‘రాజేశ్ దూకేయ్.. దూకేయ్’ అంటూ అరవడంతో తేరుకున్న రాజేశ్ కంటైనర్ నుంచి దూకేశాడు. అతడిపై వాటర్ బాటిళ్లు పడిపోయాయి. సమీపంలో ఉన్నవారు అతడిని బయటకు లాగి ఆస్పత్రికి తరలించారు. డీజిల్ ఆదా చేయాలని.. మొగిలి ఘాట్‌లో డౌన్లో డీజిల్ ఆదా చేయాలని కంటైనర్‌ను న్యూట్రల్ చేయడంతో వేగం అందుకుంది. వేగాన్ని నియంత్రించాలని బ్రేకులు వేయగా పడలేదు. దీంతో కంటైనర్ అదుపు తప్పింది. మోటార్ బైక్‌ను ఢీకొని ఓమ్ని వ్యాన్‌పై పడింది. దీంతో వ్యాన్‌లో ఉన్న 9 మంది, బైకు నడుపుతున్న వ్యక్తి మృత్యువాత పడ్డారు. నిమిషం ఆలస్యమైతే.. మొగిలి ఘాట్ సమీపంలోనే శ్రీని ఫుడ్స్ ఫ్యాక్టరీ ఉంది. ఇందులో పలమనేరు టౌన్ గంటావూరుకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. వీరిని రోజూ ఒక ఆటో తీసుకెళ్లి.. తీసుకొస్తుంది. శుక్రవారం కూడా 13 మంది కూలీలను ఫ్యాక్టరీ నుంచి తీసుకెళ్తుండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న కంటైనర్‌ను ఆటో డ్రైవర్ గమనించాడు. ఆటో వెళ్లిన ఒక్క నిమిషంలోనే కంటైనర్ డివైడర్‌ను ఢీకొని ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. ఒక్క నిమిషం ఆలస్యమై ఉంటే ఆటోలో ఉన్న కూలీలు కూడా మృత్యువాత పడేవారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. ఏ సమయానికి ఏం జరిగింది.. శుక్రవారం సాయంత్రం 6.20 గంటలు : బెంగళూరు నుంచి విజయవాడకు వెళ్తున్న కంటైనర్ మొగిలి ఘాట్ రోడ్డు వద్దకు చేరుకుంది. డ్రైవర్ అచ్చయ్య గేరు వేయకుండా వాహనాన్ని న్యూట్రల్ చేశాడు. దీంతో వాహన వేగం ఒక్కసారి పెరిగింది. 6.24 గంటలు: బ్రేక్ వేసేందుకు డ్రైవర్ ప్రయత్నించగా.. అది ఫెయిలైనట్లు గుర్తించాడు. దీంతో గట్టిగా అరుస్తూ క్లీనర్ రాజేష్‌ను కిందకి దూకేయమంటూ గట్టిగా అరిచాడు. 6.25 గంటలు: వాహనం ఒక్కసారిగా డివైడర్‌ను ఢీకొట్టి చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళ్లే రోడ్డుమీదకు వచ్చేసింది. 6.26 గంటలు: ఓమ్ని వ్యానులో గంగవరం మండలం మర్రిమాకుçపల్లెకు చెందిన తొమ్మిది మంది బయలుదేరారు. వ్యాను ఘాట్ రోడ్డు ఎక్కుతుండగా... క్షణాల్లో కంటైనర్ డివైడర్ దాటుకుని వ్యానుపై బోల్తా పడింది. 6.28 గంటలు: ట్రక్కు చక్రాల కింద ఓమ్ని వ్యాన్ ఇరుక్కుని దాదాపు 300 మీటర్ల వరకు తోసుకుంటూ వెళ్లింది. అదే సమయంలో మొగిలి నుంచి పలమనేరుకు ద్విచక్రవాహనంపై వెళ్తున్న నరేంద్రను సైతం ట్రక్కు లాగేసింది. మారుతీ వ్యానులోంచి ఒక్కసారిగా పెట్రోలు లీకై మంటలు అంటుకున్నాయి. 6.43 గంటలు : ప్రమాదం జరిగిన 15 నిమిషాల అనంతరం శ్రీని ఫుడ్స్ ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది మంటలు చూసి.. ఫ్యాక్టరీలోని అగ్నిమాపక పరికరాలు తీసుకొచ్చి మంటలు ఆర్పారు. అప్పటికే వ్యాను 30 శాతం కాలిపోయింది. ట్రక్కు నుంచి బాడీ, క్యాబిన్ వేర్వేరుగా ఊడిపోయాయి. 6.50 గంటలు: పోలీసులు శ్రీని ఫుడ్స్ నుంచి క్రేన్ తెప్పించి వాహనాలను బయటకు తీశారు. తెగిపడ్డ శరీర భాగాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది. మొత్తం సచ్చిపోయినారు సామీ! సంఘటన స్థలంలో విలపిస్తున్న మృతుల బంధువులు ‘ఫోన్లు పనిచేయడం లేదని పలమనేరు నుంచి వెనక్కి వచ్చి చూస్తే మొత్తం సచ్చిపోయినారు సామీ’ అంటూ మర్రిమాకులపల్లి మృతు లకు పెద్ద దిక్కు అయిన రెడ్డి శేఖర్ సంఘటనా స్థలంలో రక్తపుముద్దలా మారిన కుటుంబీ కులను చూసి బోరున విలపించాడు. శేఖర్ చిన్నాన్న తెట్టుగంట్లపల్లిలో మృతి చెందడంతో కుటుంబీ కులంతా అక్కడకు వెళ్లారు. అంత్యక్రియల కార్యక్రమం ముగిశాక శుక్రవారం సాయంత్రం ఓమ్నీ వ్యాన్‌లో బయలుదేరారు. వారి వెనుకనే రెడ్డి శేఖర్ మరో కారులో వస్తున్నాడు. మొగిలి ఘాట్‌లో ఈ ప్రమాదాన్ని చూసినా ఎవరో అనుకుని పలమనేరుకు వచ్చేశాడు. అయితే.. తన కంటే ముందే బయలుదేరిన తన కుటుంబీకులు ఇంకా రాకపోవడంతో పలమనేరు నుంచి వెనక్కి వచ్చి ప్రమాదం జరిగిన చోట చూడగా మృతులంతా కుటుంబీకులే కావడంతో నిశ్చేష్టుడయ్యాడు. -
ఒకే కళాశాలలో 23 మందికి సచివాలయ ఉద్యోగాలు
ఎంటెక్, బీటెక్ చదివినవారికి దక్కని అవకాశం ప్రభుత్వ కళాశాలలో చదువుకున్న విద్యార్థులకు దక్కింది. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో వృత్తి విద్యా కోర్సుగా సెరికల్చర్ పూర్తి చేసిన 23 మందికి సచివాలయ పోస్టుల్లో ఉద్యోగాలొచ్చాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ కోర్సు చదివి ఒకే కళాశాలకు చెందిన ఇంతమందికి ప్రభుత్వ కొలువులు వరించడం నిజంగా ఓ రికార్డే. సాక్షి, పలమనేరు : పలమనేరు పట్టణంలోని తీర్థం కృష్ణయ్యశెట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెరికల్చర్ కోర్సు పూర్తి చేసిన 23మందికి సచివాలయ ఉద్యోగాలు లభించాయి. ఒకేషనల్ కోర్సులో చేరేందుకే ఆసక్తి చూపని నేటి రోజుల్లో అవే కోర్సులు వీరికి కొలువులు తెప్పించాయి. దీంతో కొత్తగా ఉద్యోగాల్లో చేరినవారంతా కళాశాలకెళ్లి అధ్యాపకులు, ప్రిన్సిపల్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. అధ్యాపక బృందం వారిని అభినందించారు. తొలినుంచి ఈ కళాశాలకు మంచి పేరుంది. సంప్రదాయ కోర్సులతోపాటు ఇక్కడ తొమ్మిది రకాల వృత్తి విద్యా కోర్సులు అన్ని వసతులతో ఉన్నాయి. ఈ కోర్సుల్లో సెరికల్చర్‌కి సంబంధించి ఏటా 20మంది విద్యార్థులు ఈ కోర్సులో విద్యనభ్యసించే అవకాశం ఉంది. గత పదేళ్లుగా ఇక్కడ సెరికల్చర్ కోర్సును పూర్తి చేసుకున్నవారు వందమంది వరకు ఉన్నారు. వీరిలో పలువురు పట్టుపరిశ్రమ శాఖకు సంబంధించి ప్రైవేటు రంగంలో ఉపాధి పొందుతున్నారు. మరికొందరు సొంతంగా మల్బరీని సాగుచేసి పట్టుగూళ్ల పెంపకం సాగిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు అవకాశం కల్పించింది. దీంతో తాజాగా కోర్సు పూర్తి చేసుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు సెరికల్చ ర్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు. సమయం తక్కువగా ఉండడం, కనీసం సిలబస్ ఎలా ఉంటుందో తెలియక, ఈ కోర్సుకు సంబంధించిన మెటీరియల్ కూడా దొరక్క ఇబ్బందులు పడ్డారు. ఈసమయంలో ఈ కళాశాలలో సెరికల్చర్ అధ్యాపకురాలిగా ఎంతో అనుభవం కలిగిన రాజేశ్వరి ప్రత్యేక చొరవచూపారు. ఆమె ఈ పరీక్షలకు అవసరమైన మెటీరియల్‌ను తయారు చేసి విద్యార్థులకు పంపి తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. సచివాలయ పరీక్షల్లో ఈ కళాశాలకు చెందిన 23మంది ఉద్యోగాలకు ఎంపిౖకై రికార్డు సృష్టించారు. చాలా ఆనందంగా ఉంది.. నేను అధ్యాపకురాలిగా ఇక్కడ 29 ఏళ్లుగా పనిచేస్తున్నా. సిరికల్చర్ కోర్సు చేసిన పూర్వ విద్యార్థులు, తాజాగా కోర్సు చేసిన వారు సచివాలయ ఉద్యోగాలకు సంబంధించి నన్ను సంప్రదించారు. ఎలా చదవాలి, సిలబస్, మెటీరియల్ అందుబాటులో లేదన్నారు. దీంతో నేనే తయారు చేసిచ్చా. 23మంది నా వద్ద శిక్షణ పొందిన పిల్లలకు ఉద్యోగాలు రావడం చాలా ఆనందంగా ఉంది. –రాజేశ్వరి, సెరికల్చర్ అధ్యాపకురాలు, పలమనేరు రాష్ట్రంలోనే రికార్డేమో.. ఇక్కడి ప్రభుత్వ కళాశాలలో ఒకే కోర్సు చదివిన 23మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం రాష్ట్రంలోనే ఓ రికార్డుని నేననుకుంటున్నా. చాలా సంతృప్తిగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. గతంలో ఏ ప్రభుత్వంలో లేని విధంగా ఉద్యోగాలివ్వడంతోనే మా వద్ద శిక్షణ పొందిన వారు ఎంపికయ్యారు. –రామప్ప, సెరికల్చర్ ల్యాబ్ అసిస్టెంట్ సెరికల్చర్ కోర్సు జీవితాన్ని మార్చేసింది నేను ఇక్కడ 2011లో సెరికల్చర్ కోర్సు పూర్తి చేశా. ఈ కోర్సుకు ఇంటర్ క్వాలిఫికేషన్‌తో ఏం ఉద్యోగాలు వస్తాయిలేనని ఆశలు వదులుకున్నా. కానీ ఈ ప్రభుత్వ నిర్ణయంతో నాకు గవర్నమెంటు ఉద్యోగం దక్కింది. నా ఫ్రెండ్స్ అప్పట్లో బైపీసీ, ఎంపీసీ చేరితే నేను సెరికల్చర్ చేరా. ఇప్పుడు అదే కోర్సు నా జీవితాన్ని మార్చేసింది. –మునీశ్వరి, గ్రామ సచివాలయ ఉద్యోగి నిజంగా నమ్మలేకున్నా.. సెరికల్చర్ అసిస్టెంట్‌గా ఎంపికై ఇటీవల పోస్టింగ్‌లో చేరా. స్థానికంగానే ఉద్యోగం దొరికింది. మా కళాశాలలో చదువుకున్న వారికి 23మందికి నిజంగా అదృష్టమే. సెరికల్చర్ చదివితే ఏం ఉద్యోగవకాశాలుంటాయనుకొనే వారికి మేమే సాక్ష్యం. చాలా హ్యాపీగా ఉంది. ఇందుకు కారణమైన మా అధ్యాపకులకు ఎన్నటికీ మరువం. –వై.శ్రీనివాసులు. గ్రామసచివాలయ ఉద్యోగి -
గత ప్రభుత్వ పాపం.. ఎంబీసీలకు శాపం
గత టీడీపీ ప్రభుత్వ పాపం ప్రస్తుతం ఎంబీసీ(మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్)లకు శాపంలా మారింది. వృత్తి రుణాలు తీసుకుని చిన్నపాటి వ్యాపారం చేసుకుని బాగుపడదామని భావించిన ఎంబీసీలకు ఆ నిరాశే మిగిలింది. అందరితో పాటు దరఖాస్తు చేసుకున్నా కొందరికి మంజూరు చేయకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సాక్షి, పలమనేరు(చిత్తూరు) : జిల్లాలో 32 కులాలను ప్రభుత్వం అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించింది. వీరు చేసుకునే వృత్తులను బట్టి రూ.30 వేలు (90శాతం రాయితీ) రుణాలను నాన్‌బ్యాంకింగ్, ఆపై లక్షదాకా రుణాలను బ్యాంకింగ్ ద్వారా ఇచ్చేందుకు ఆదేశాలిచ్చింది. అప్పట్లో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఎలాగైనే బీసీ ఓటర్లను ఆకర్షించేందుకు నాటి సీఎం చంద్రబాబునాయుడు మంచి పథకాన్నే ఎంచుకున్నారు. ప్రభుత్వ ప్రకటనతో జిల్లాలోని 1,800 మంది ఎంబీసీలు ఈ రుణాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి ఈ రుణాలు ఇవ్వకుండా అప్పటి ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు మళ్లీ దరఖాస్తు అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ గతంలో జరిగిన అక్రమాలు, ఆపై ఎన్నికల్లో బీసీలను ప్రలోభ పెట్టేందుకు జరిగిన తతంగాలను గమనించి వాటిని రద్దు చేసింది. ఎంబీసీ రుణాల కోసం అవసరమైన ధ్రువపత్రాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఫలితంగా జిల్లాలోని ఎంబీసీలు మళ్లీ అన్ని ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకునే పనిలో పడ్డారు. భారీగా పెరిగిన రుణం ఈ ప్రభుత్వంలో ఎంబీసీ రుణాలను రూ.30 నుంచి రూ.50 వేలకు పెంచారు. ఈ రుణాలను 90 శాతం రాయితీతో అందిస్తున్నారు. ఈ రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబరు 30వ తేదీ వరకు గడువు పెట్టారు. ఆసక్తి గలవారు ఈ రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తమ ప్రభుత్వంలో దరఖాస్తు చేసుకున్న రుణాలను కావాలనే ప్రభుత్వం రద్దు చేసిందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అది నిజం కాదని, నిజమైన అర్హులకు రుణాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. -
యువకుడితో ఇద్దరు యువతుల పరారీ!
సాక్షి, చిత్తూరు(పలమనేరు) : ఇరువురు యువతులు ఓ యువకుడితో పరారైన సంఘటన పలమనేరు మండలంలో బుధవారం వెలుగుచూసింది. పట్టణ సీఐ శ్రీధర్ కథనం మేరకు.. మండలంలోని పందేరుపల్లి ఒడ్డూరుకు చెందిన నాగమ్మ కుమారుడు రాజశేఖర్(20) గ్రామంలో ఉండేవాడు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు అతనితో స్నేహంగా ఉండేవారు. వారిమధ్య ప్రేమ వ్యవహారమో.. ఏమో తెలియదు గానీ ఈనెల 1న ఇంట్లోని రూ.12వేలు తస్కరించిన రాజశేఖర్ తన బైక్‌తో సహా కనిపించకుండా పోయాడు. దీంతో అతని తల్లి బంధువులు గ్రామాల్లో వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు సైతం గ్రామంలో కనిపించకుండా పోయారు. ఆరా తీయగా, ఆ ఇరువురు యువతులు రాజశేఖర్‌ను తీసుకెళ్లినట్టు అనుమానంగా ఉందంటూ యువకుని తల్లి నాగమ్మ బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసునమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నట్టు సీఐ శ్రీధర్ తెలిపారు. -
కోట్లు దండుకుని బోర్డు తిప్పేశారు!
సాక్షి, పలమనేరు : ప్రజల నుంచి డిపాజిట్ల రూపేణా కోట్లాది రూపాయలు వసూలు చేసి ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. పలమనేరులో మంగళవారం ఇది వెలుగుచూసింది. స్థానిక ఏజెంట్ల మాయమాటలతో మోసపోయామని తమకు న్యాయం చేయాలంటూ పలువురు బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం...హెచ్బీఎన్, అసూర్ అనే ప్రైవేటు సంస్థల పేరిట పలమనేరుతోపాటు జిల్లాలోని పలుచోట్ల కార్యాలయాలను రెండేళ్ల క్రితం నిర్వాహకులు ప్రారంభించారు. ఆయా మండలాల్లో ఏజెంట్లను నియమించారు. తమ వద్ద రూ.500 నుంచి ఎంత మొత్తమైనా డిపాజిట్ కడితే ఆపై రుణాలిస్తామంటూ ప్రచారం చేయించారు. దీంతో స్థానిక ఏజెంట్లు తమకు తెలిసిన వారి నుంచి లక్షలాది రూపాయలను డిపాజిట్లుగా కట్టించారు. అయితే హెచ్బీఎన్లో కంటే అసూర్ కంపెనీలో బాగా లాభాలున్నాయంటూ ఇందుకు సంబందించిన ముఖ్య ఏజెంట్లు హరినాథ్‌రెడ్డి, దేవరాజులు స్థానిక ఏజెంట్లను నమ్మించారు. అయితే ఆ తర్వాత ఆ కార్యాలయాలు బోర్డు తిప్పేశాయి. దీంతో డబ్బులు కట్టిన జనం ఏజెంట్లను నిలదీశారు. వారు తమకేమీ సంబంధం లేదని చెప్పడంతో బాధితులు, ఏజెంట్లు కలసి డీఎస్పీ ఆరీఫుల్లా, సీఐ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశారు. జిల్లాలో ఇలా డిపాజిట్ల రూపంలో ఇలా వసూలు చేసిన డబ్బు రూ.3కోట్లకుపైగా ఉంటుందని ఏజెంట్లు చెబు తున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ మాటలు నమ్మి, లక్షలు కట్టించి, మోసపోయామని జరావారిపల్లెకు చెందిన ఏజెంట్ కళావతి వాపోయింది. తాను రూ.50లక్షలు డిపాజిట్ల రూపేణా కట్టించానని, నిర్వాహకులు అదృశ్యం కావడంతో అందరూ తనను నిలదీస్తుండడంతో తనకు దిక్కుతోచడం లేదని తొరిడి గ్రామానికి చెందిన ఏజెంట్ రుక్మిణి కన్నీటిపర్యంతమైంది. తాను ఏజెంట్‌గా వీ.కోట మండలంలో రూ.20లక్షల వరకూ కట్టించానని, మమ్మల్ని నమ్మించి మోసం చేశారంటూ దొడ్డిపల్లెకు చెందిన మోహన్ ఆక్రోశించాడు. -
బోగస్ పట్టాల కుంభకోణం
పలమనేరు పట్టణంలో ఖాళీ జాగాలకు రెక్కలు వచ్చాయి. కబ్జాదారులు ముఠాగా ఏర్పడి ఖాళీ స్థలాలను గుర్తిస్తున్నారు. రెవెన్యూ అధికారుల సహకారంతో వాటికి బోగస్ పట్టాలు సృష్టించి, సదరు స్థలాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికే రూ.4 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. సాక్షి, పలమనేరు(చిత్తూరు) : పలమనేరు పట్టణంలో బోగస్ ఇంటి పట్టాలు కలకలం రేపుతున్నాయి. 400 వరకు బోగస్ ఇంటి పట్టాలు (ఇంటి నివేశ పట్టాలు, అనుభవ ధ్రువపత్రాలు) చెలామణిలో ఉన్నాయని సమాచారం. ఈ పట్టాలతో పలువురు ఇందిరమ్మ కాలనీలు, పట్టణంలోని ప్రభుత్వ స్థలాల్లో పక్కా ఇళ్లను కూడా నిర్మించుకున్నారు. ఇప్పటికీ బోగస్ పట్టాలు అంగట్లో సరుకుల్లా దొరుకుతున్నాయని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయం నిజమేనని గతంలో రెవెన్యూ అధికారుల విచారణలో తేలింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ ఫైలును ఎవరు తొక్కిపెడుతున్నారు.. ఎందుకు తొక్కిపెడుతున్నారన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నలా మారింది. ఇప్పటివరకు బోగస్ పట్టాలతో ప్రభుత్వానికి చెందిన రూ.4 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైనట్లు తెలుస్తోంది. పక్కాగా బోగస్ పట్టాలు తయారు చేశారు ఇందిరమ్మ కాలనీల్లోని ఖాళీస్థలాలు, అప్పటికే పట్టాలు పొంది ఇల్లు కట్టని స్థలాలు, పునాదులో ఆగిన వాటిని లక్ష్యంగా చేసుకుని ఈ అక్రమాలు సాగాయి. కాలనీల స్కెచ్లను రెవెన్యూ సర్వేయర్ల నుంచి బోగస్ పట్టాల ముఠా పొందింది. ఆ మేరకు లే అవుట్లో ఖాళీ ఉన్న బ్లాక్‌లను గుర్తించి, అక్కడ ఏ, బీ అనే సబ్ డివిజన్ నంబర్ల ద్వారా ఒరిజినల్ హద్దులనే పెట్టి పట్టాలు తయారు చేశారు. నకిలీ పట్టాలను తయారు చేసి అమ్మడంతో ప్లాట్లు స్థలాన్ని స్వాధీనం చేయించడం, ఇంటి నిర్మాణం దాకా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఈ ముఠానే దగ్గరుండి చూసుకుంటుందనే ఆరోపణలున్నాయి. ఇదెలా సాగుతోందంటే.. గతంలో పలమనేరు తహసీల్దార్లుగా పనిచేసిన నాగమణి, మునాఫ్, రవిచంద్రన్ హయాంలో అప్పటి సర్వేయర్లు, ఆర్ఐలు, వీఆర్వోల ద్వారా తహసీల్దార్ కార్యాలయం, తహసీల్దార్ల సీళ్లను కొందరు సంపాదించినట్లు తెలిసింది. కార్యాలయంలోని ఖాళీ ఇంటి అనుభవ నివేశపత్రాలు, పట్టాలను భారీగా జిరాక్స్ చేయిం చుకుని పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఐదేళ్లుగా రెవెన్యూ కార్యాలయంలోని కాలనీ స్కెచ్‌ల ఆధారంగానే బోగస్ పట్టాల తయారీ జోరుగా సాగినట్టు తెలుస్తోంది. ఈ ముఠాలోని కొందరు సభ్యులు ఇప్పటికీ ఈ దందా కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఇంటి పట్టాగాని, అనుభవ ధ్రువపత్రాన్ని మంజూరు చేస్తే కార్యాలయంలోని వీహెచ్ఎస్(విలేజ్ హౌస్‌సైట్ రిజిస్టర్)లో నమోదు కావాలి. కానీ ఇక్కడ అవేమీలేనట్లు సమాచారం. ఇందులో రెండు ప్రధాన ముఠాలు ఈ కుంభకోణంలో ఓ రిటైర్డ్ కరణం, ఓ వీఆర్వో, సర్వేయర్ వద్ద పనిచేసిన వెలుగు సర్వేయర్, ఓ ఆర్ఐ, నలుగురు బదిలీ అయిన వీఆర్వోలు, నలుగురు మాజీ కౌన్సిలర్లు, పదిమంది రెవెన్యూ బ్రోకర్లు కీలకంగా ఉన్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలం రెండు సెంట్లు కనిపిస్తే వీళ్లు రంగంలోకి దిగి.. దానికి నకిలీ పట్టా తయారు చేయడం జరిగిపోతోంది. సర్వే సైతం వాళ్లే చేసి, హద్దులు చూపి, కొన్న వారికి ఇంటి స్థలాన్ని మూడు రోజుల్లో చేతికిచ్చేస్తున్నారు. ఇప్పటికే మున్సిపాలిటీలో స్థలాలపై అనుభవం కలిగి పట్టాలు లేని వారికి సైతం దొంగపట్టాలను తయారు చేసినట్లు తెలిసింది. రెవెన్యూ కార్యాలయంలో ఉండాల్సిన ఎఫ్ఎంబీ బుక్కులే ఈ ముఠా చేతుల్లో ఉన్నాయంటే వీరు ప్రత్యామ్నాయంగా ఓ తహసీల్దార్ కార్యాలయాన్నే నడుపుతున్నట్లు ఉంది వ్యవహారం. అధికారుల విచారణలో బయటపడినా.. ఇందిరమ్మ కాలనీలో నకిలీ పట్టాలపై దినప్రతికల్లో పలు కథనాలు గతంలో ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన కలెక్టర్ విచారణ జరిపించారు. ఇందులోనూ ఈ విషయం బయటపడింది. దీంతోవారు ఓ నివేదికను సైతం సిద్ధం చేశారు. తమ గుట్టు ఎక్కడ రట్టు అవుతుందోనని గ్రహించిన కొందరు కీలక వ్యక్తులు దీన్ని ఎన్నికలకు ముందే తొక్కిపెట్టినట్లు సమాచారం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినా ఈ నివేదిక విషయం మాత్రం బయటకు రాలేదు. దీనిపై కలెక్టర్, ఉన్నతాధికారులు స్పందిం చాలని స్థానికులు కోరుతున్నారు. -
హ్యాచరీల దందాకు చెక్
కోళ్లరైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేటు హ్యాచరీల దందాకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. బ్రాయిలర్ కోళ్ల రైతుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీ క్షేత్రస్థాయిలో పలు అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలు, నిబంధనలను అమలు చేసే యోచనలో ఉంది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కదలిక వచ్చింది. ఫలితంగా జిల్లాలో కోడిపిల్లలను పెంచే రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. సాక్షి, పలమనేరు(చిత్తూరు): జిల్లాలో బ్రాయిలర్ కోడిపిల్లల ధరలను హ్యాచరీస్ వారు ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారు. కోళ్లకు సంబంధించిన వ్యాధుల నివారణకు కంపెనీలు పంపిణీ చేసే మందుల ధరలను వారే నిర్ణయిస్తున్నారు.కోళ్లదాణా విషయంలో నాణ్యతలేని దాణాను కంపెనీలు రైతులకు అందిస్తున్నాయి. బ్రాయిలర్ కోడిపిల్లలకు వేసే టీకాలైన లసోట, వీబీడీ, జెంటామైసిన్‌లను ప్రైవేటువారు నిపుణుల చేత వేయించడం లేదు. వాటిని రైతులకిచ్చి వెళుతుండడంతో.. అనుభవం లేని రైతులు టీకాలు సక్రమంగా వేయక కోడిపిల్లలకు వ్యాధుల బాధ తప్పడంలేదు. హ్యాచరీలు రైతులకు సరఫరా చేసే కోడిపిల్లల్లో కొంతశాతం బలహీనమైన వాటిని ఇచ్చేస్తున్నారు. నాణ్యత లేమితో నష్టపోతున్న రైతులు.. సాధారణంగా నాణ్యమైన కోడిపిల్ల 40 గ్రాముల బరువు ఉండాలి. అయితే కంపెనీ అందించే కోడిపిల్లల్లో 30శాతం పిల్లల బరువు 30 నుంచి 35 గ్రాములుగానే ఉంటోది. దీంతో కోళ్లపెంపకం రైతులకు నష్టం తప్పడం లేదు. ఫలితంగా కోళ్ల మరణాల శాతం పెరిగి ఎఫ్‌సీఆర్ (ఫీడ్ కన్వర్షన్ రేషియో) పెరగడంతో రైతులకు కంపెనీలు చెల్లించే ధరలు తగ్గుతున్నాయి. 40 నుంచి 50 రోజుల పాటు రైతు కోడిపిల్లలను పెంచినందుకు కిలోకు రూ 5కు పైగా అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కిలోకు రూ.4 కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇలా.. జిల్లాలోని కోళ్ల రైతుల సమస్యలపై బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడను కలిసి విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెటర్నరీ డైరెక్టర్ సోమశేఖర్ చిత్తూరు పశుసంతతి పరిశీలన పథక సహాయసంచాలకులు డా.షేక్ అసీఫ్‌తో ఏకసభ్య కమిటీని నియమించారు. ఆయన జిల్లాలోని బ్రాయిలర్ కోడిపిల్లల పెంపకదారులైన రైతుల బాధలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు ప్రైవేటు హ్యాచరీల వ్యవహారాలను గమనించి నివేదికను పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి రెండ్రోజుల క్రితం సమర్పించారు. వారు ప్రభుత్వానికి ఈ నివేదికను పంపారు. సమస్యలకు పరిష్కారం ఇలా... ప్రైవేటు హ్యాచరీల ధరల నిర్ణయంపై ప్రభుత్వ అజమాయిషీ నాణ్యమైన దాణాను వెటర్నరీ శాఖ నుంచి పంపిణీ చేయడం దాణా నాణ్యతను నిర్ణయించేందుకు తిరుపతిలోని వెటర్నరీ కళాశాల న్యూట్రీషియన్ శాఖకు అప్పగించడం కోళ్లకు సోకే వ్యాధులపై జంతువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ద్వారా పరీక్షలు కోడిపిల్లలను ఇచ్చే కంపెనీలే వాక్సినేటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం వంటి సూచనలను నివేదికలో పొందుపరిచారు. మా పోరాటం ఇన్నాళ్లకు ఫలించనుంది.. కోళ్ల రైతుల కష్టాలపై చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసినపుడు ఆయనకు సమస్యను విన్నవించాం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి సమస్యను తెలుపగా ప్రభుత్వం కమిటీని వేసింది. – విశ్వనాథరెడ్డి, జిల్లా కోళ్లరైతు సంఘ నాయకులు, పలమనేరు హ్యాచరీల చేతుల్లో రైతులు కీలుబొమ్మలే.. హ్యాచరీలు నాణ్యతలేని కోడి పిల్లలనిచ్చినా, దాణా బాగా లేకున్నా రైతులు తీసుకోవాల్సిందే. కాదూ కూడదంటే పిల్లలను ఇవ్వరు. ఈ ప్రభుత్వం మా సమస్యలను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. – మల్లికార్జునరెడ్డి, కోళ్లరైతు, కీలపల్లి, గంగవరం మండలం -
అమ్ము, పూర్విక.. ఓ మంచి నాన్న
తమ ఇంట ఉన్న ఆవు..దూడకు జన్మనివ్వడంతో ఓ చిట్టితల్లి దాని సంరక్షణ చూసుకుంటూ అనుబంధం పెంచుకుంది. అయితే పాల ఆదాయం తగ్గిపోతోందని ఆ చిట్టితల్లి తండ్రి ఆ దూడను ఓ కసాయికి అమ్మేశాడు. ఎంతగా ఏడ్చి మొత్తుకున్నా తండ్రి నిర్దయగా వ్యవహరించడంతో ఆ చిట్టితల్లి పొగిలి..పొగిలి ఏడ్చింది. అయినా తండ్రి కరకగపోవడంతో అన్నపానీయాలు ముట్టకుండా గాంధీగిరితో నిరసన వ్యక్తం చేసింది. దీంతో ఊరంతా కదిలి ఆ ఇంటి ముందు వాలింది. తలో మాట అనడంతో ఇక లాభం లేదని ఆ చిట్టితల్లి తండ్రి కసాయి వద్దకు పరుగులు తీశాడు. దూడతో చిట్టితల్లి ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతే..ఆ చిట్టితల్లి కళ్లల్లో వెలుగులు! గ్రామస్తుల మోముల్లో నవ్వులు!! సాక్షి, పలమనేరు : మండలంలోని పెంగరగుంటకు చెందిన నారాయణప్ప పాడి ఆవులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కుమార్తె గ్రామ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి, చిన్నకుమార్తె పూర్విక 3వ తరగతి చదువుతున్నారు. ఇంట ఉన్న రెండు ఆవుల్లో ఒక ఆవు 5 నెలల క్రితం ఓ లేగదూడకు జన్మనిచ్చింది. రెండు పూటలా కలిపి ఈ ఆవు 14 లీటర్ల పాలిచ్చేది. ఈ పాలను నారాయణప్ప ఒక ప్రైవేటు డెయిరీకి పోసేవాడు. ఇక దూడ పుట్టినప్పటి నుంచి పూర్వికకు దానితోటే లోకం. స్కూలుకు వెళ్లి వస్తే సాయంత్రం నుంచి దానితోనే ముచ్చట్లు. గడ్డి పెట్టడం, నీళ్లు పట్టడం..ఆడుకోవడం చేసేది. ఇలా దానితో అనుబంధం బాగా పెంచుకుంది. దీనికితోడు మూడో తరగతి తెలుగు వాచకంలోని ‘పెంపుడు జంతువులు’ పాఠం ప్రభావం కూడా ఆ చిట్టితల్లిపై పడింది. పెంపుడు జంతువులు కూడా కుటుంబ సభ్యులతో సమానమని, పెంపుడు జంతువుల్లో ఆవు–దూడ గురించి కూడా టీచర్ చెప్పి ఉండడంతో దూడ కూడా తమ కుటుంబంలో ఒకదానిగా పూర్విక భావించింది. దానికో ముద్దు పేరు కూడా పెట్టుకుంది ‘అమ్ము’ అని! ఇక పాడి ఆవు రెండు పూటలా కలిపి 14 లీటర్ల పాలు ఇచ్చేది. ఉదయం, సాయంత్రం రెండేసి లీటర్ల చొప్పున దూడ తాగేస్తుండడంతో పాల ఆదాయం పడిపోతోందని నారాయణప్ప భావించాడు. దీనిని అమ్మేస్తే నెలకు మూడు వేల రూపాయల వరకు పాల ఆదాయం నష్టపోయే పరిస్థితి ఉండదని తలచాడు. అనుకున్నదే తడవుగా 5 నెలల వయసున్న దూడను పలమనేరులోని ఓ కసాయి అమ్మేయడంతో అతనొచ్చి దూడను పట్టుకుపోతుంటే పూర్విక అడ్డుకుంది. అమ్మును అమ్మడానికి వీల్లేదంటూ గొడవ చేసింది. అవేవీ పట్టించుకోకుండా ఆ చిట్టితల్లి తండ్రి ఉదయం 9 గంటల సమయంలో కసాయికి అప్పగించడంతో దానిని పట్టుకుపోయాడు. దీంతో కడుపు మండిన ఆ చిన్నారి ఉదయం నుంచి అన్నం తినకుండా ఏడవడం మొదలు పెట్టింది. ఎవరూ సముదాయించినా ఏడుపు మానలేదు. దీంతో ఊరి జనం కూడా ఇంటి ముందు గుమిగూడారు. ఓవైపు కన్నకూతురి ఏడుపు, మరోవైపు దూడ కనిపించక ఆవు దీనంగా అరుస్తుండడంతో ఆ చిన్నారి తల్లి లక్ష్మి మనసు కరిగింది. బిడ్డ కోసం దూడను తీసుకురమ్మంటూ భర్తను ప్రాధేయపడింది. ఇక గ్రామస్తులు కూడా హితోక్తులు పలకడంతో నారాయణప్ప ఇక లాభం లేదని పలమనేరుకు వెళ్లాడు. సాయంత్రం 4.30 గంటలకు లగేజి ఆటోలో తెచ్చిన దూడతో ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు. అంతే! ‘అమ్మూ...అని గట్టిగా అరుస్తూ పూర్విక దాని దగ్గరకు పరుగులు తీసింది. గ్రామస్తులు కూడా ‘అబ్బా! ఈ చిన్నపిల్లకు దూడ అంటే ఎంతిష్టమో..ఎంత ప్రేమో. భలే గట్టిది..మొత్తానికి సోమవారం టౌనులో పండక్కి దూడ కోతకు కాకుండా కాపాడింది’’ అని మెచ్చుకుంటూ గ్రామస్తులు వెనుదిరిగారు. ‘అమ్ము’ను భారమనుకుంటే ఎవరికైనా ఇచ్చేద్దామంటూ స్థానిక అంజనాద్రి ఆలయం వద్దనున్న గోసంరక్షణా కేంద్రానికి తండ్రిని తీసుకెళ్లి పూర్విక తనే అప్పగించింది. నేను అప్పుడప్పుడూ వస్తాననంటూ దూడకు టాటా చెబుతూ సంతోషంగా ఇంటికి చేరింది. -
‘పరువు హత్యలపై చట్టం చేయాలి’
సాక్షి, చిత్తూరు : దళితుల పేరుతో ఓట్లు పొందిన వారు..ఇంతవరకు వారిని ఎందుకు చూడటం లేదని సీపీఐ(ఎం) కేంద్ర నాయకురాలు బృందా కారత్ మోదీ సర్కారును ప్రశ్నించారు. మంగళవారం పలమనేరులో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా స్క్రూటినీ లేకుండానే మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును పాస్ చేసిందని విమర్శించారు. పరువు హత్యలపై తాను గతంలో ప్రైవేటు బిల్లు పెట్టినా.. ఇప్పటికీ చట్టం జరుగలేదని తెలిపారు. ఇందుకు గల కారణాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని.. పరువు హత్యలపై కచ్చితంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
ఇళ్లు అద్దెకు కావాలని వచ్చింది.. కానీ అంతలోనే
సాక్షి, పలమనేరు(చిత్తూరు) : స్థానిక లాల్‌బహుదూర్ నగర్లో ఓ వివాహిత దారుణహత్యకు గురైన ఘటన సోమవారం పలమనేరులో సంచలనం సృష్టించింది. పలమనేరు డీఎస్పీ గిరిధర్ కథనం.. మండలంలోని నక్కపల్లెకు చెందిన సుశీల(48)కి ఇద్దరు పిల్లలున్నారు. ఈమె భర్త నారాయణ రెడ్డి గతంలో మృతిచెందారు. ఇలా ఉండగా ఆదివారం రాత్రి సుశీల, మరో వ్యక్తితో కలసి లాల్‌బహుదూర్ నగర్లో చెంగమ్మ ఇంటికెళ్లారు. ఇల్లు అద్దెకు కావాలని అడిగారు. అయితే ఇల్లు అద్దెకు లేదని చెప్పడంతో వారిరువురూ రాత్రయిందని, తాము ఈ పూటకి ఇక్కడే తలదాచుకుని ఉదయాన్నే వెళతామని అక్కడి వరండాలో పడుకున్నారు. ఉదయం లేచి చూసేసరికి సుశీల రక్తపు మడుగులో పడి ఉంది. ఈమె తలపై నిందితుడు బండరాయితో మోది హతమార్చినట్లు ఆనవాళ్లు బట్టి తెలుస్తోంది. ఇలా ఉండగా హత్య జరగడానికి ముందే చెంగమ్మ నిద్రించిన ఇంటితలుపుకు గడి పెట్టి∙ఉంది. ఉదయం ఆమె ఇతరులకు ఫోన్‌చేసి ఇంటిలోంచి బయటకు వచ్చిన తర్వాతే హత్యోదంతం వెలుగుచూసింది. ఇలా హతురాలు, నిందితుడు ఇద్దరూ గతంలో పట్టణంలోని ఓ క్వార్టర్స్‌లో ఉంటూ తరచూ గొడవలు పడుతుండేవారని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలంలో మద్యం సీసా కూడా ఉన్నట్టు తెలిసింది. సంఘటన స్థలాన్ని పలమనేరు డీఎస్పీ, పట్టణ సీఐ శ్రీధర్ పరిశీలించారు. సీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాస్త పొట్టిగా ఉన్న నిందితుడు హిందీ మాట్లాడుతాడని పోలీసులు తెలుసుకున్నారు. అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
ముగిసిన హేమావతి, కేశవ ప్రేమకథ
సాక్షి, పలమనేరు: దొమ్మరపాపమ్మ తల్లి సాక్షిగా చిన్ననాటి నుంచి వారిరువురూ ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని కష్టాలను ఎదుర్కొన్నారు. చివరికి అదే ఆలయం వద్ద వారి బంధానికి తెరపడింది. మండలంలోని ఊసరపెంటకు చెందిన కేశవ, హేమావతిల ప్రేమ, పెళ్లి సినిమా కథను పోలినట్టు సాగింది. ఈ గ్రామం విసిరేసినట్టు అడవిలో ఉంటుంది. చుట్టూ చెట్లుచేమలు తప్ప, జనసంచారం పెద్దగా కనిపించదు. మొన్నటి దాకా ఆ గ్రామానికి అధ్వాన మట్టిరోడ్డు మాత్రమే దిక్కు. దీంతో వాహన సౌకర్యం లేదు. గ్రామస్తులు దొమ్మరపాపమ్మ గుడిదాకా నడిచివెళ్లి, ఆపై అటు పలమనేరు.. ఇటు గుడియాత్తం పట్టణాలకు వెళ్లేవారు. ఈ ప్రాంతం తమిళనాడుకు ఆనుకునే ఉంటుంది. ప్రజల ఆచార వ్యవహారాలు, భాషలో కూడా తమిళమే ఎక్కువ. 40 దాకా ఉన్న ఎస్సీ కుంటుంబాలకు కూలినాలే దిక్కు. పిల్లలను చదివించాలన్నా కష్టమే. ఈ పరిస్థితుల్లో కేశవ పట్టణంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ దాకా చదివాడు. హేమావతి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పది వరకు చదివింది. వీరు దొమ్మరపాపమ్మ గుడిదాకా రోజూ కలసిమెలసి నడిచి వెళ్లి, ఆపై సైకిళ్లపై వెళ్లేవారు. హేమావతి కుటుంబీకులు, వారి బంధువుల వ్యవసాయ పనులకు కేశవ కుటుంబీకులు వెళ్లేవారు. దీంతో చనువుగా ఉండే వీరి మధ్య అప్పటికే ప్రేమ వికసించి పెళ్లిదాకా వెళ్లింది. ఈ విషయం హేమావతి కుటుంబానికి తెలియడంతో పలుమార్లు గొడవలు, పంచాయతీలు జరిగాయి. హేమావతిని కుటుంబీకులు తిరుపతిలోని ఓ ప్రైవేటు కళాశాలలో చేర్చారు. విషయం తెలుసుకున్న కేశవ సైతం తిరుపతికెళ్లి అక్కడ పనిచేసుకుంటూ వారి ప్రేమను కొనసాగించాడు. ఆపై కులాంతర వివాహానికి ఆటంకాలు రావడంతో.. పరారై, కుప్పంలో పెళ్లి చేసుకున్నారు. రెండున్నరేళ్ల తర్వాత హేమావతి గర్భిణి కావడంతో కాన్పుకోసం ఇక్కడికి వచ్చారు. ఆస్పత్రి నుంచి బస్సు దిగగానే అదే దొమ్మరిపాపమ్మ గుడివద్ద బాలింత హేమావతిని తల్లిదండ్రులు బంవంతంగా లాక్కెళ్లి ఉరివేసి చంపి, బావిలో పడేశారు. ఇన్ని కష్టాలు పడ్డ తనకు హేమావతి దక్కకుండా పోయిందని భర్త కేశవ రోదించాడు. పలమనేరు ఆస్పత్రి మార్చురీలో శనివారం తన భార్య మృతదేహాన్ని తీసుకుని.. విలపిస్తూనే ఆటోలో ఎక్కించడం అక్కడున్న వారిని కలచివేసింది. -
ఆక్రోశం..ఆవేశం..ఆవేదన..
సాక్షి, పలమనేరు(చిత్తూరు) : మండలంలోని ఊసరపెంటలో హేమావతి పరువుహత్య జరిగిన నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ఆక్రోశంతో ఆందోళనలు చేశారు. ఆగ్రహంతో రగిలిపోయారు. పలమనేరు ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిగినా శవాన్ని తీసుకెళ్లడంలో గందరగోళం, ఆపై పోలీసుల చొరవతో శవాన్ని గ్రామానికి తరలింపు, అక్కడ శవం ముందే నిరసనలతో శనివారం ఉదయం నుంచి సాయంత్రం దాకా గందరగోళం నెలకొంది. ఎట్టకేలకు సబ్‌కలెక్టర్ చొరవతో వివాదం సద్దుమణిగింది. సాయంత్రానికి భర్త పొలాల్లో భార్య హేమావతి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిగాయి. ఆస్పత్రి నుంచే టెన్షన్.. టెన్షన్ కులాంతర వివాహం చేసుకుందనే కసితో కన్నకూతురినే చంపిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో జిల్లాస్థాయి దళిత సంఘాల నేతలు శనివారం పలమనేరుకు చేరుకున్నారు. హేమావతి మృత దేహానికి పోస్టుమార్టం పూర్తి అయినా నిందితులను అరెస్టు చేసే వరకు శవాన్ని తీసుకెళ్లమంటూ బాధితులు మొండికేశారు. ఏదో జరుగుతుందని ముందుగానే గ్రహించిన పోలీసులు ఆస్పత్రితోపాటు గ్రామంలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రి వద్ద భర్త అతడి కుటుంబ సభ్యులను ఒప్పించి, భారీ భద్రత నడుమ ఊసరపెంటకు మృతదేహాన్ని తరలించారు. భర్త కేశవ ఇంటి ముందు ఉంచారు. భర్త బంధువుల ఆందోళన అప్పటికే పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న దళిత సంఘాల నాయకులు, హేమావతి భర్త బంధువులు ఆందోళన చేశారు. విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో దళితులపై అగ్రవర్ణాలు సాగిస్తున్న మారణహోమాన్ని రూపమాపాలన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాలు ప్రస్తుతం పసలేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులందరినీ అరెస్టు చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించమంటూ భీష్మించుకున్నారు. దీంతో పోలీసులు బాధితులతో శనివారం సాయంత్రం వరకు మంతనాలు జరిపినా ఫలించలేదు. దీనిపై అగ్రహించిన వారు శవాన్ని పలమనేరుకు తీసుకెళ్లి అంబేద్కర్ విగ్రహం ముందు ధర్నా చేయడానికి ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ పరిస్థితి గందరగోళంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్ నారాయణ భరత్ గుప్త ఆదేశాలతో మదనపల్లె సబ్‌కలెక్టర్ చేకూరి కీర్తి వస్తున్నారని చెప్పడంతో వారు శాంతించారు. పసికందుకు రూ.5 లక్షల పరిహారం బాధితుల డిమాండ్లను ఆలకించిన సబ్‌కలెక్టర్ చేకూరి కీర్తి వారిని శాంతిపజేశారు. తల్లికి దూరమైన పసికందును ఎత్తుకుని కాసేపు బాధపడ్డారు. తల్లికి దూరమైన ఆ బిడ్డకు ప్రభుత్వం ద్వారా రూ.5 లక్షల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. భర్త కేశవకు ఔట్ సోర్సింగ్ ద్వారా ఉపాధి, నిందితులను అరెస్టు చేసి, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచారణ జరపడంతోపాటు మిగిలిన సాయాలపై ప్రభుత్వానికి నివేదికను సమర్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన బాధితులు హేమావతి మృతదేహానికి భర్త కేశవ్ పొలాల్లోనే అంత్యక్రియలు జరిపారు. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామంలో కర్ఫ్యూ విధించారు. స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బలగాలను మొహరించారు. దాదాపు 80 మంది పోలీసులు గ్రామాన్ని వారి అదుపులోకి తీసుకున్నారు. పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు, స్థానిక సీఐ ఈద్రుబాషా, సత్యవేడు, మదనపల్లె సీఐలు రాజేంద్రప్రసాద్, మురళీకృష్ణ తదితరులు విధులను నిర్వహించారు. -
పరువు హత్యపై ఆగ్రహం
పలమనేరు (చిత్తూరు): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పరువు హత్య ఉదంతంపై ప్రజా, దళిత సంఘాలు భగ్గుమన్నాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలంటూ ఆందోళనలు చేశాయి. చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని ఊసరపెంట గ్రామంలో కులాంతర వివాహం చేసుకుందనే కసితో పచ్చి బాలింత అన్న కనికరం లేకుండా కన్నకూతురినే కుటుంబం అంతా కలసి కిరాతకంగా చంపేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత, ప్రజా సంఘాల నేతలు శనివారం పలమనేరు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. రాష్ట్రంలో దళితులపై అగ్రవర్ణాలు సాగిస్తున్న మారణహోమాన్ని రూపుమాపాలని, పరువు హత్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్టు చేసేదాకా అంత్యక్రియలు నిర్వహించమంటూ బాధితులు, బంధువులు భీష్మించుకున్నారు. వారితో పోలీసులు జరిపిన మంతనాలు ఫలించలేదు. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కలెక్టర్ నారాయణ గుప్త ఆదేశాలతో మదనపల్లి సబ్ కలెక్టర్ చేకూరి కీర్తి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల డిమాండ్లను విని వారికి ప్రభుత్వం ద్వారా రూ. 5 లక్షల పరిహారం, భర్త కేశవకు ఔట్సోర్సింగ్ ద్వారా ఉపాధి, నిందితులను వెంటనే అరెస్టు చేసి కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో శాంతించిన బాధితులు హేమావతికి అంత్యక్రియలు పూర్తి చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలమనేరు డీఎస్పీ యుగంధర్‌బాబు, స్థానిక సీఐ ఈద్రుబాష, సత్యవేడు, మదనపల్లి సీఐలు రాజేంద్రప్రసాద్, మురళీకృష్ణ తదితరులు చర్యలు తీసుకున్నారు. కేసులో కీలకంగా మారిన వీడియో రికార్డింగ్ పరువు హత్య కేసులో బాధితుని బంధువులు పోలీసులకు పంపిన వీడియో ఇప్పుడు కీలకంగా మారింది. సంఘటన జరిగిన రోజు హేమావతి, ఆమె భర్త కేశవులు వారి వారం రోజుల పసిబిడ్డతో కలసి దొమ్మరిపాపమ్మ ఆలయం వద్ద బస్సు దిగారు. అప్పటికే అక్కడ ఉన్న హేమలత తల్లిదండ్రులు భాస్కర్ నాయుడు, వరలక్ష్మి, సోదరులు భానుప్రకాష్, చరణ్, సోదరి నిఖిలలు ఒక్కసారిగా వారివద్దకొచ్చి హేమలతను బలవంతంగా బైక్‌పైకి ఎక్కించుకున్నారు. వారిని అడ్డుకునేందుకు భర్త ప్రయత్నించగా దౌర్జన్యం చేశారు. అక్కడే ఉన్న కేశవులు మామ తన మొబైల్లో జరుగుతున్న తంతును వీడియో తీసి స్థానిక పోలీసులకు వాట్సాప్ ద్వారా పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొనే లోపే హత్య జరిగిపోయింది. ఈ కేసులో హతురాలి తల్లి, సోదరి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా తండ్రి, సోదరులు పరారీలో ఉన్నారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నిస్తున్నారు. -
పలమనేరు పరువు హత్యపై స్పందించిన డిప్యూటీ సీఎం
సాక్షి, తిరుపతి: చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలో జరిగిన పరువు హత్య ఘటన బాధాకరమని ఉపముఖ్యమంత్రి, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమకు కుల,మతం లేదని, ప్రేమ పవిత్రమైనది ఆయన పేర్కొన్నారు. కులాంతర వివాహం చేసుకుంటే చంపడం చాలా తప్పు అని ఆయన పేర్కొన్నారు. హేమావతిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పష్టం చేశారు. పలమనేరులో పరువు హత్య.. కూతురు కులాంతర వివాహం చేసుకుందని.. ఆమెను తండ్రి కిరాతకంగా చంపేసిన ఘటన ఈ చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ఉసిరిపెంట గ్రామంలో జరిగిన సంగతి తెలిసిందే. ఉసరిపెంటకు చెందిన భాస్కర్ నాయుడు కూతురు హేమవతి అదేగ్రామానికి చెందిన దళితుడైన కేశవులును రెండేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు చంపేస్తామని బెదిరించడంతో ఆ దంపతులు బంధువులకు దూరంగా ఉంటూ కాపురం చేస్తున్నారు. వారంరోజుల క్రితం హేమవతి పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో వారు తిరిగి గ్రామంలోకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న భాస్కర్ నాయుడు కుటుంబం భరించలేకపోయింది. పుట్టిన బిడ్డకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెల్లి వస్తుండగా అప్పటికే మాటువేసిన అమ్మాయి తరపు బంధువులు అడ్డుకున్నారు. ఆ పసికందును కేశవులుకు అప్పగించి.. హేమవతిని బలవంతంగా బైక్‌పై ఎక్కించుకొని లాక్కెళ్లిపోయారు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాక తండ్రి భాస్కర్‌నాయుడు హేమవతిని చిత్రహింసలకు గురిచేశారు. సొంత కూతురని మరిచి గొంతుకు ఉరిబిగించి హతమార్చి.. పక్కనే ఉన్న బావిలో పడేసి వెళ్లిపోయారు. ఏడు రోజుల పసిపాప తల్లిలేని అనాధగా మిలిగింది. (చదవండి: చిత్తూరులో పరువు హత్య కలకలం) -
జాతరకు వెళుతూ మృత్యుఒడికి
సాక్షి, పలమనేరు : గంగజాతరకు వెళ్తున్న వారిని మృత్యువు ఐచర్ వాహన రూపంలో కబళించింది. షేర్ ఆటోను ఐచర్ ఢీకొనడంతో నలుగురు దుర్మరణం చెందారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన బుధవారం పలమనేరు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వివరాలు.. బైరెడ్డిపల్లె మండలం మిట్టకురప్పల్లె, కామినాయునిపల్లె, గంగవరం మండలం దండపల్లె కురప్పల్లె, కీలపట్ల కొత్తపల్లె, నాగిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన వారు బంగారుపాళెం మండలం టేకుమందలో గంగజాతరకు వెళ్లడానికి పలమనేరుకు వచ్చారు. ఇక్కడి నుంచి ఒక షేర్ ఆటోను మాట్లాడుకుని 14మంది బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో ఆంజనేయస్వామి ఆలయం వద్ద వెళుతుండగా ఎదురుగా వస్తున్న ఐచర్ వాహనం మితిమీరిన వేగంతో దూసుకువచ్చి ఆటోను ఢీకొంది. దీంతో ఆటో ముందరి భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. ఈ ప్రమాదంలో కురప్పల్లెకు చెందిన క్రిష్ణప్ప(53) ఆటోలోనే మృతి చెందాడు. మిగిలిన వారంతా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బంగారుపాళెం 108లో క్షతగాత్రులకు పలమనేరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కామినాయునిపల్లె వాసి వెంకటప్ప(70), మిట్టకురప్పల్లెకు చెందిన రెడ్డెమ్మ అలియాస్ దేవమ్మ(36), క్రిష్ణమ్మ(45) కన్నుమూశారు. గాయపడిన వారిలో నాగిరెడ్డిపల్లెకు చెందిన శ్రీనివాసులు(35) అతని భార్య అమరమ్మ(28), మిట్టకురప్పల్లెకు చెందిన నందీష్(2), భాగ్య(15), మంగమ్మ(40), కీలపట్ల కొత్తపల్లెకు చెందిన కుమారి(30), ఆమె కుమార్తె ఇందు(8), దండపల్లె కురప్పల్లెకు చెందిన పద్మమ్మ(40), బంగారుపాళెంకు చెందిన ఆటోడ్రైవర్ నిషార్ అహ్మద్(37) ఉన్నారు. వీరిలో శ్రీనివాసులు, నందీష్ల పరిస్థితి విషమంగా ఉంది. ప్రథమ చికిత్స అనంతరం వారిని చిత్తూరు, కుప్పంలోని ఆస్పత్రులకు తరలించారు. కొంపముంచిన హైవే డైవర్షన్ ప్రమాదం జరిగిన చోట ఓ ఫ్లైఓవర్, దానికి ఇరువైపులా వన్‌వే, ఓ సర్వీసు రోడ్డుంది. ఆటోడ్రైవర్ ఆటో సర్వీసు రోడ్డు మీదుగా వెళ్లి ఉన్నపక్షంలోఈ ప్రమాదం తప్పేదే. మరోవైపు వన్‌వే రోడ్డు మరమ్మతుల కారణంగా ఒకే మరో రోడ్డుకి డైవర్షన్ చేశారు. దీంతో వేగంగా వస్తున్న ఐచర్ ఆటోకు వ్యతిరేక దిశలో వెళ్లి దానిని ఢీకొంది. ఐచర్ డ్రైవర్ సింగిల్ రోడ్డనుకుని వాహనాన్ని వేగంగా నడపడం ప్రమాదానికి దారితీసింది. మృతులంతా పేదలే దండపల్లెకు చెందిన క్రిష్ణప్ప పట్టణంలోని ఓ సిమెంటు దుకాణంలో పనిచేసేవాడు. కామినేపల్లెకు చెంది న వెంకటప్ప చిన్నపాటి పనులు చేసుకునేవాడు. మిట్టకురప్పల్లెకు చెందిన రెడ్డెమ్మ అలియాస్ దేవమ్మ భర్త మోటార్ మెకానిక్‌గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గాయపడిన వారు వేర్వేరు ఊర్లయినప్పటికీ ఒకే సామాజిక వర్గానికి చెందిన పేద కుటుంబాలకు చెందినవారే. టేకుమందలో బంధువుల ఆహ్వానం మేరకు జాతరకెళుతూ ప్రమాదం బారిన పడ్డారు. పలమనేరు ఆస్పత్రి మృతుల కుటుంబీకులు, బంధువుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. -
ఓటు వేసేందుకు వస్తూ.. తిరిగిరాని లోకాలకు..
సాక్షి, గంగవరం: సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహంగా బయల్దేరిన వ్యక్తి తన కోరిక తీరకనే రోడ్డు ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఈ విషాద సంఘటన బుధవారం మండలంలో పలమనేరు–చిత్తూరు బైపాస్ రహదారిలోని నడింపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలు..తవణంపల్లె మండలం వెంగంపల్లె గ్రామానికి చెందిన గోవిందయ్య కుమారుడు మురళి(40) కొంత కాలంగా బెంగళూరులో కూలి పని చేస్తున్నాడు. ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు బెంగళూరు నుంచి స్వగ్రామానికి మోటార్ సైకిల్లో బయల్దేరాడు. మార్గమధ్యంలో నడింపల్లె బైపాస్ ఫ్లైఓవర్‌పై వెళ్తుండగా తమిళనాడు వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ ఓవర్టేక్ చేస్తూ మురళి బైక్‌ను వెనుక వైపు ఢీకొంది. కింద పడిన అతని తల మీదుగా లారీ వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారకుడైన లారీ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. మురళి మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. -
కొండెక్కిన ప్రాజెక్టులు!
పలమనేరు నియోజకవర్గంలోని ముఖ్యమైన రెండు ప్రాజెక్టులు కొండెక్కాయి. పాలకులు, పాలితుల నిర్లక్ష్యంతో ఏటా నదుల్లోని వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథరెడ్డి పలమనేరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా సముద్రం పాలవుతున్న నీటికి అడ్డుకట్టవేయలేకపోతున్నారు. చిత్తూరు , పలమనేరు: జిల్లాలోని పడమటి ప్రాంతమైన పలమనేరు కరువుకు నిలయం. పంటల సాగుకు నీటి కష్టాలు తప్పడం లేదు. ఇక్కడి పల్లెల్లో తాగునీటికి ఇబ్బందులే. ఈ ప్రాంతంలో ఎక్కువ మందికి వ్యవసాయమే జీవనాధారం. నియోజకవర్గంలోని కౌండిన్య, ఎగినేరి, కైగల్, దుర్గమ్మ చెరువు నదులు ముఖ్యమైనవి. వర్షాకాలంలో ఈ నదులు ప్రవహించినపుడు 200 నుంచి 250 ఎంసీఎఫ్‌టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)ల నీరు వృథాగా తమిళనాడు రాష్ట్రంలోని బంగాళాఖాతంలోకి చేరుతోంది. ఈ పనులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఈ ప్రాంతవాసులకు శాపంలా మారింది. ఆగిన గంగనశిరస్సు పనులు.. కౌండిన్యా నది పలమనేరు మీదుగా తమిళనాడులోకి పయనిస్తోంది. వైఎస్ హయాంలో దీనిపై పలమనేరు మండలంలోని కాలువపల్లె వద్ద రూ.55 కోట్లతో వైఎస్ఆర్ జలాశయం ప్రాజెక్టును తాగునీటి అవసరాల కోసం నిర్మించారు. దీనికి అనుసంధానంగా చేపట్టాల్సిన గంగన శిరస్సు ప్రాజెక్టు పనులు అటవీ శాఖ అభ్యంతరాలతో పెండింగ్ పడ్డాయి. గతేడాది ఇక్కడికి వచ్చిన ప్రజారోగ్య శాఖ, ఇరిగేషన్ ఉన్నతాధికారులు రూ.25కోట్లతో పనులకు రివైజ్డ్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులందక పనులు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతులకు సైతం ఇంకా నష్టపరిహారమందలేదు. కైగల్ ఎత్తిపోతలు ఉత్తికోతలే.. బైరెడ్డిపల్లె మండలంలోని కైగల్ నది కర్ణాటకలోని ముళబాగల్ సమీపంలో గల కురుడుమళై ప్రాంతంలో పుట్టి బైరెడ్డిపల్లె మండలం మీదుగా తమిళనాడు సరిహద్దు నుంచి కౌండిన్యా నదిలో కలుస్తోంది. కర్ణాటకలో భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఈ నది ప్రవహిస్తోంది. గతంలో ఈ నదిపై కైగల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం రెండేళ్ల క్రితం అంచనాలు సిద్ధం చేసింది. అవన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాజెక్టు వెంటనే ప్రారంభిస్తామన్న మంత్రి అమరనాథరెడ్డి మాటలు నీటి మూటలయ్యాయి. ఈ మధ్య ఇక్కడికి వచ్చిన సీఎం చంద్రబాబు సైతం ఈ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేస్తామంటూ మళ్లీ అదే మాటలు చెప్పి వెళ్లారు. ఈ నదిపై ప్రాజెక్టును నిర్మించి ఆ నీటిని బైరెడ్డిపల్లి చెరువులకు అనుసంధానం చేసుంటే ఆ మండలం మొత్తం సస్యశ్యామలమయ్యేది. దుర్గమ్మ బాధ ఇదే.... వీకోట మండలంలోని దుర్గమ్మ చెరువు వద్ద పుట్టే దుర్గమ్మ చెరువు నది నీరు సైతం తమిళనాడుకు చేరుతోంది. ఈ మండలంలోని అటవీ ప్రాంతంలో ప్రాజెక్టును నిర్మిస్తామని గతంలో వీకోటకు విచ్చేసిన చంద్రబాబు మాటనిచ్చినా ఈ ప్రాజెక్టు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఏటా ఇక్కడి నీళ్లు సముద్రంపాలు నియోజకవర్గంలోని కైగల్, దుర్గమ్మ చెరువు నదులు బత్తలపల్లి మీదుగా పలమనేరు నియోజకవర్గంలోని కౌండిన్యనదిలో మోర్ధనవద్ద కలుస్తుంది. అక్కడి నుంచి కౌండిన్య తమిళనాడులోని గుడియాత్తం, వేలూరు మీదుగా పొన్ని నదిలో కలసి బంగాళాఖాతంలోకి ఏటా వర్షాకాలంలో సుమారు 120 ఎంసీఎఫ్‌టీల నీరు ప్రవహిస్తోంది. తమిళనాడు ప్రభుత్వం గతంలో తాగునీటి కోసమని మోర్ధనవద్ద ప్రాజెక్టును కట్టింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి వెళ్లే నీరు మోర్ధనకు చేరి అక్కడి వారికి ఉపయోగంగా మారింది. ఇదే పని మన పాలకులు, పాలితులు స్థానికంగా ఎందుకు చేపట్టలేదని జనం ప్రశ్నిస్తున్నారు. మంత్రి అనుకుని ఉంటే ప్రాజెక్టు జరగదా.. మంత్రి అనుకుని ఉంటే గంగనశిస్సు ప్రాజెక్టు ఎప్పుడో జరిగేది. ఇది పూర్తయి ఉంటే పలమనేరులో తాగునీటికి సమస్య లేకుండా ఉండేది. మా గ్రామాలకు సాగునీటి బాధలు తప్పేవి. ఏమి చేద్దాం ఈ ప్రభుత్వాలు ఇలా ఉంటే రైతులు ఎలా బాగుపడేది. –బాలాజీనాయుడు, మండిపేటకోటూరు, పలమనేరు మండలం కైగల్ ఎత్తిపోతలు ఉట్టిమాటలే.. మంత్రి అమరనాథరెడ్డి ముడేళ్లుగా కైగల్నదిపై ప్రాజెక్టు కడతామని ఇప్పటికీ హామీలు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు ఈ ప్రాంతానికి ఎప్పుడొచ్చినా కైగల్ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూనే ఉంటారు. అదిగో అంచనాలు ఇదిగో పనులు అని ఉట్టిమాటలు చెప్పారేగానే ఇక్కడ చేసిందేమీలేదు. – మొగసాల కృష్ణమూర్తి, బైరెడ్డిపల్లి భూమి తీసుకుని ఎక్కడా లేకుండా చేశారు... గంగనశిరస్సు ప్రాజెక్టు కోసమని నా భూమిని తీసుకున్నారు. దానికి ఇంతవరకు పరిహారం కూడా ఇవ్వలేదు. ఉన్న భూమిని పోగొట్టుకుని జీవనధారం లేకుండా పోయింది. పోనీ ప్రాజెక్టు అయినా నిర్మించారా అంటే అదీలేదు. ఇట్టా చేస్తే జనం ఎలా నమ్మేది.– వనజమ్మ, మండిపేటకోటూరు ప్రాజెక్టు కట్టుంటే బోర్లలో నీళ్లు వచ్చేవి.. గంగనశిరస్సు ప్రాజెక్టును కట్టుంటే పట్టణానికి మంచినీటి సమస్య తీరిండేది. మాకు ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి బోర్లవద్ద సేద్యాలు చేసుకునేవాళ్లం. ఇక్కడికి సమీపంలో తమిళనాడు వాళ్లు కట్టిన మోర్ధనలో నీళ్లున్నాయి. మన దౌర్భాగ్యం మనకు లేవే.–మురుగన్, చెత్తపెంట, పలమనేరు మండలం -
నవవధువు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె సిటీ: పెళ్లైన రెండు నెలలకే భర్త రైలు ప్రమాదంలో మృతి చెందడంతో తట్టుకోలేక ఓ నవ వధువు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బి.కొత్తకోటలో చోటుచేసుకుంది. బాధితుల కథనం..బి.కొత్తకోటకు చెందిన భరత్, శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన లావణ్య(25) గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న ఇద్దరూ మూడు రోజుల క్రితం టెక్కలి నుంచి బి.కొత్తకోటకు వచ్చేందుకు నౌపడ రైల్వేస్టేషన్లో రైలు ఎక్కుతూ ప్రమాదశాత్తు జారి పడి భరత్ మృతి చెందాడు. భర్త కర్మకాండలకు బి.కొత్తకోటలో ఉన్న లావణ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో టాయిలెట్ క్లీనర్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబసభ్యులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మహామహులు ఏలిన పెనమలూరు
సాక్షి, కృష్ణా : పెనమలూరు నియోజకవర్గం విలక్షణమైనది. జిల్లాలో అత్యధిక ఓటర్లు గల నియోజకవర్గాల్లో రెండోది. 2009లో చేపట్టిన నియోజకవర్గ పునర్విభజనలో ఏర్పాటైన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకూ రెండు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. నియోజకవర్గంలో పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలు ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 41 గ్రామాలు, ఒక మున్సిపాలిటి, ఉయ్యూరు నగర పంచాయతీలు ఉన్నాయి. నియోజకవర్గం మొత్తం విస్తీర్ణం 68,208 ఎకరాలు. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారికి ఇరువైపులా విస్తరించి ఉన్న నియోజకవర్గం. 41 గ్రామాలు, 1 మున్సిపాలిటీకి అన్నింటికీ రహదారి మార్గం, రవాణా సౌకర్యాలు ఉన్నాయి. నిత్యం విజయవాడ–మచిలీపట్నం, విజయవాడ–ఏలూరు, అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ ప్రాంతాలకు రవాణా సదుపాయాలు ఉన్నాయి. నియోజకవర్గం మీదుగా ప్రధానంగా బందరు, రైవస్ కాలువలు, వాటికి అనుబంధ కాలువలు ప్రవహిస్తున్నాయి. కృష్ణానది ఏటిపాయ కూడా పెనమలూరు, కంకిపాడు మండలాల్లోని ఐదు గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది. సాగునీరు వ్యవస్థ అం దుబాటులో ఉంది. ప్రధానంగా బోర్లు, కాలువ నీటిపై ఆధారపడి సాగు జరుగుతుంది. వ్యవసాయాధారిత గ్రామాలు ఎక్కువ. పెనమలూరు మండలం సెమీ అర్బన్ ప్రాంతం. పట్టణీకరణ వాతావరణం. ఉద్యోగులు, కార్మికులు ప్రధానంగా ఉన్నారు. రాజధా ని అమరావతి, విజయవాడకు కూతవేటు దూరంలోనే నియోజకవర్గ గ్రామాలు ఉన్నాయి. ప్రతి పనికీ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్తుంటారు. మూడవ పర్యాయం.. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొలుసు పార్థసారథి, టీడీపీ అభ్యర్థి చలసాని వెంకటేశ్వరరావు (పండు)పై 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మంత్రివర్గంలో స్థానం పొంది అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో పార్థసారథి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్, వైఎస్సార్సీపీ అభ్యర్థి కుక్కల విద్యాసాగర్‌పై 31,448 మెజారిటీతో గెలుపొందారు. రద్దయిన కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా రెండో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న కంకిపాడు, ఉయ్యూరు నియోజకవర్గాలు పునర్విభజనతో రద్దయ్యాయి. పెనమలూరు, కంకిపాడు, ఉయ్యూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. గతంలో ఉయ్యూరు నియోజకవర్గంలో ఉన్న పమిడిముక్కల, తోట్లవల్లూరు పామర్రు నియోజకవర్గంలో కలిశాయి. విజయవాడ రూరల్, అర్బన్ డివిజన్లు మైలవరం, విజయవాడ పరిధిలోకి వెళ్లాయి. కంకిపాడు నియోజకవర్గంలో... తొలి రోజుల్లో ఇక్కడ కమ్యూనిష్టులదే ప్రభావం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక కంకిపాడు టీడీపీకి పెట్టని కోట అయ్యింది. 13 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. ఇక్కడి నుంచి ఐదు పర్యాయాలు అసెంబ్లీకి ఎన్నికైన నేత మాత్రం దేవినేని రాజశేఖర్ (నెహ్రూ). రాజకీయంగా కోనేరు రంగారావుకు విజయాన్ని అందించింది కూడా కంకిపాడు నియోజకవర్గమే. రద్దయిన ఉయ్యూరు నియోజకవర్గంలో సమరయోధుడు కాకాని వెంకటరత్నం మూడు సార్లుగెలిచారు. ఉయ్యూరుకు తలమానికం చక్కెర కర్మాగారం ఆసియా ఖండంలోనే అతిపెద్ద చెక్కర కర్మాగారాల్లో ఉయ్యూరు కేసీపీ కర్మాగారం కూడా ఒకటి. కర్మాగారం పరిధిలో 20 మండలాల్లో 26 వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతోంది. 16 వేల మంది రైతులు కర్మాగారంలో 700 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు మొత్తం జనాభా : 3,55,277 మొత్తం ఓటర్లు : 2,58,586 పురుషులు: 1,26,239 మహిళలు : 1,32,324 ఇతరులు : 23 -
చంద్రబాబు ఐదేళ్ల పాలన అవినీతిమయం
-
బూత్ లెవల్ .. అంతా హడల్!
జిల్లాలో బీఎల్వోల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. ఒకపక్క అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లు .. మరో వైపు అధికారుల ఆదేశాలు వారిని మానసికంగా కుంగదీస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వేధింపుల పర్వం ఎక్కువవుతోంది. సమావేశాలు.. విచారణల పేరుతో ఆర్థికంగానూ చితికిపోవాల్సి వస్తోంది. గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల ఛీదరింపులు.. అధికారుల చివాట్లతో మరింత ఆందోళనకు గురికావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. సాక్షి,పలమనేరు(చిత్తూరు) : రాబోవు సార్వత్రిక ఎన్నికల కోసం విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో బూత్‌లెవల్ అధికారుల పాత్ర అత్యంత కీలకం. ఎన్నికల సంఘానికి సంబంధించిన పనులు చేయాలనే గౌరవంతో విధులు నిర్వహిస్తున్న వీరికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఈదఫా అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు తప్పడం లేదు. వారిమాట విని ఏదేనీ తప్పుచేస్తే ఉన్న ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు అధికారుల ఆదేశాలను పాటిస్తూ విధులు ఎప్పటికప్పుడు పూర్తిచేయాలి. ఈమధ్య భారీగా వస్తున్న ఫామ్–7 క్లయిమ్‌ల విచారణ వీరికి తలనొప్పిగా మారింది. క్షేత్రస్థాయిలో బీల్వోలే అత్యంతకీలకం ఎన్నికల నిర్వహణలో బీఎల్వోలే అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఓటర్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి 6–క్లయిమ్‌ల స్వీకరణ, వీటిపై విచారణ, ప్రస్తుతం 7–క్లయిమ్‌ల స్వీకరణ, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, వీటికి సంబంధించిన చెక్‌లిస్ట్, ఫామ్–13, 14 నోటీసుల జారీ వీటిపై విచారణలు చేయడం నిత్యకృత్యంగా మారుతోంది. ఓటర్ల జాబితాలో అక్రమాలను గుర్తించడం, బూత్లెవల్లో సౌకర్యాలు, మార్పులు తదితరాలపై సమాచారాన్ని ఉన్నతాధికారుకు ఇస్తూ వారి ఆదేశాలను పాటించాలి. ఇందుకోసం అంగన్వాడీ వర్కర్లు, వీఆర్వోలు, వీఆర్ఏలు, సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు, మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు తదితరులను ఎంపిక చేశారు. వీరు వారిశాఖలతో పనిలేకుండా ఎన్నికల ప్రక్రియ ముగిసేదాకా బూత్‌లెవెల్ అధికారులుగా విధులు నిర్వర్తిస్తారు. అధికారపార్టీ ఒత్తిళ్లు గతంలో ఎన్నడూలేని విధంగా ఈదఫా ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ నాయకులు వీరిని తమదారిలోకి తెచ్చుకుంటున్నారు. తాము చెప్పినట్టు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా ఒత్తిళ్లు తెస్తున్నట్టు తెలుస్తోంది. నయానా, భయానా కాకుంటే పలు రకాల ప్రలోభాలకు గురిచేసి కొందరిని ఇప్పటికే వారి దారికి తెచ్చుకున్నట్టు సమాచారం. గ్రామాల్లో అయితే అక్కడి అధికార పార్టీ నేతలు, సాధికార మిత్రలు వీరి వెంటే ఉంటున్నారనే ఆరోపణలున్నాయి. చిన్నస్థాయి ఉద్యోగులు కాబట్టి స్థానిక నేతల మాటలు వినకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉంటాయోనని కొందరు వారు చెప్పినట్టే చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. పచ్చ నేతల నుంచి తనకు ఇలాంటి ఒత్తిళ్లున్నాయని వారు అధికారులకు చెప్పుకున్నా లాభం లేకుండా ఉంది. ఎందుకంటే అధికారులు సైతం నాయకుల మాట వినేవాళ్లే ఎక్కువగా ఉన్నారనేది నిజం. ఈ విధుల్లోకి ఎందుకొచ్చామా..? అని బయటకు చెప్పుకోలేక బీఎల్వోలు లోలోన మదనపడేవారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో బీఎల్వోలు విచారణలో తప్పని తిప్పలు అర్హులైన ఓటర్లను సైతం కొందరు ఫామ్ –7 ద్వారా తొలగింపునకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అభ్యంతరాలు జిల్లాలో వేలల్లోనే ఉండడంతో వీటిని మళ్లీ విచారించాల్సిన పరిస్థితి నెలకొంది. క్షేత్రస్థాయిలో వీరు అవరసమైన ధ్రువపత్రాలను అడిగితే ఓటర్లు ఎన్నిసార్లు విచారిస్తారంటూ బీఎల్వోలను ప్రశ్నిస్తున్నారు. వారిని ఒప్పించి నేర్పుగా పనులు చేయాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు టార్గెట్లపేరిట అధికారుల నుంచి ఆదేశాలు తప్పడం లేదు. వీరు మానసికంగా వేధింపులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. కష్టం ఎక్కువ.. ఫలితం తక్కువ ఇంత కష్టపడినా బీఎల్వోలకు మూడు నెలలకు ఎన్నికల సంఘం నుంచి అందే గౌరవ వేతనం మూడు వేలు మాత్రమే. దీనికోసం ఎన్నో కష్టాలు పడాల్సి వస్తోందని బీఎల్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ఈ విధుల కారణంగా బీపీలు, షుగర్ లాంటి జబ్బులు వస్తున్నాయని వాపోతున్నారు. జిల్లా అధికారులు వీరికి అధికార పార్టీ నుంచి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉంది. -
జనం ‘గజ..గజ’
చిత్తూరు, పలమనేరు: ఈ మధ్యనే కాలువపల్లె అడవిలో ఎలి ఫెంట్ ట్రాకర్స్‌పై ఏనుగులు దాడిచేయడంతో నలు గురు ట్రాకర్స్ గాయపడ్డారు. అంతకుముందు ఇదే అడవిలో అటవీ సిబ్బందిపై ఏనుగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. రెండేళ్ల క్రితం పి.వడ్డూరుకు చెందిన చిన్నబ్బను తొక్కి చంపాయి. ఏడాది క్రితం చెత్తపెంటకు చెందిన రైతు మునీంద్రను బలిగొన్నాయి. తాజాగా పొలం వద్ద పడుకుని ఉన్న ముగ్గురిపై ఏనుగు దాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల కాలంలో పలమనేరు, కుప్పం ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఆరుగురి ప్రాణాలు గజరాజుల కారణంగా గాల్లో కలిసాయి. ఏనుగులు దాడులకు అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలొస్తున్నాయి. దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న సమస్య జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాలలో దశాబ్దాలుగా ఏనుగులు దాడుల మూలాన పంట, ప్రాణ నష్టాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. పలమనేరు మండలంలోనే రెండేళ్ల కాలంలో ఏనుగుల దాడులు నాలుగైదు జరిగాయి. ప్రజల ప్రాణాలకు దినదిన గండంగా ఈ సమస్య మారినా పరిష్కారం విషయంలో పాలకుల అలసత్వం శాపంగా మారింది. అడవి నుంచి జనావాసాల్లోకి.. అడవిలో మేత, నీరు కరువై తరచూ ఈ ఏనుగులు గ్రామాల వైపు వస్తున్నాయి. ఇప్పటికి ఏడు ఏనుగులు సైతం మృత్యువాత పడ్డాయి. ఏనుగులను దారి మళ్లించేందుకు ప్రజలు టపాసులు పేల్చడం, టైర్లను కాల్చడం, పెద్దపెట్టున శబ్దాలను చేస్తుండడంతో కొన్ని సందర్భాల్లో ఏనుగులు రెచ్చిపోతున్నాయి. ఏనుగులు మూడు గ్రూపులుగా విడిపోయి, రెండు మాత్రం ఒంటరిగా మారి ఎటుపడితే అటువెళుతూ పంటలు, ప్రజలపై దాడులు చేస్తున్నాయి. తమిళనాడు పాపం–మనకు శాపం ఒక ఏనుగుకు సగటున రోజుకు 900 లీటర్ల నీరు, 10 హెక్టార్లలో మేత అవసరముంది. దీంతో అవి మేతకోసం మైళ్లదూరం వెళుతుంటాయి. మన రాష్ట్ర సరిహద్దు నుంచి ఏనుగులను తమిళనాడు అడవిలోకి వెళ్లగానే అక్కడి అటవీశాఖ వాటిని తిరిగి ఇక్కడికి మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు అడ్డొచ్చిన వారిపై విరుచుకుపడుతున్నాయి. నీరుగారిన లక్ష్యం పంటలను ధ్వంసం చేసే ఏనుగులను కట్టడి చేయాలనే ఉద్దేశంతో 1984లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీ పూర్తి స్థాయిలో ప్రయోజనం లేకుండా పోతోంది. లక్షలాది రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేసిన సోలార్ ఫెన్సింగ్ ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. దీనికి తోడు సోలార్ ఫెన్సింగ్ సక్రమంగా పనిచేయడం లేదు. ఈ మధ్యనే (ఎలిఫెంట్ ఫ్రూఫ్ ట్రెంచెస్) పనులను చేపట్టారు. వీటిని సైతం దాటి ఏనుగులు పంటల వైపు వస్తుండటంతో రైతులకేమీ పాలుబోవడం లేదు. ఏనుగుల సమస్యకు మూడు రాష్ట్రాల్లో కారిడార్ నిర్మాణం ఒక్కటే మార్గంగా కనిపిస్తోంది. గజదాడుల ఘటనలు ♦ 2013లో ఏనుగుల గుంపు గుడిపల్లె మండలంలోని పెద్దపత్తికుంట గ్రామంలోకి చొరబడి ఓ రైతును పొట్టన పెట్టుకున్నాయి. ♦ 2014లో వి.కోట మండలంలోని నాయకనేరి ప్రాంతంలో ఓ రైతు ఏనుగు దాడిలో మరణించాడు. ♦ 2014 డిసెంబర్లో రామకుప్పం మండలం లోని ననియాల అటవీ ప్రాంతంలో వాచర్ మునెప్పను ఏనుగుల గుంపు తొక్కి చంపాయి. ♦ 2015లో గుడుపల్లె మండలంలో ఇద్దరు రైతులు గాయపడ్డారు. ♦ 2016లో బైరెడ్డిపల్లె మండలం వెంగంవారిపల్లెకు చెందిన పెరుమాళప్ప అడవిలో ఉండగా ఏనుగులు తొక్కి చంపాయి. ♦ 2017 జూన్‌లో పలమనేరు అటవీశాఖ కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బందిపై మదపుటేనుగు దాడి చేసింది. వీరిలో ఒకరు ఇప్పటికీ చికిత్స పొందుతున్నారు. ♦ 2017 ఆగస్టులో పలమనేరు మండలం పి. వ డ్డూరుకు చెందిన రైతును తొక్కి చంపేశాయి. ♦ 2018లో ఇద్దరు అటవీ ఉద్యోగులపై ఏనుగు లుదాడిచేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. ♦ తాజాగా ఏనుగు కారణంగా గొబ్బిళ్లకోటూరుకు చెందిన హరికృష్ణ, ఉదయ్‌కుమార్, సోమశేఖర్ గాయపడ్డారు. ప్రాణాలు పోతున్నా పట్టించుకోని ప్రభుత్వం ఏ క్షణంలో ఏనుగులు దాడులు చేస్తాయో తెలియదు. రైతుల ప్రాణాలకు రక్షణ కరువైంది.అటవీశాఖ అధికారులు తీసుకుంటున్న చర్యలు ఫలించడం లేదు. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్న ప్రభుత్వం పట్టించుకోకుంటే ఎలా?– మురుగన్, రైతు, చెత్తపెంట ప్రతిరోజూ డ్రైవ్ చేస్తూనే ఉన్నాం కౌండిన్య అడవిలో ప్రస్తుతం ఏనుగులు మూడు గుంపులుగా సంచరిస్తున్నాయి. వీటిలో రెండు వేర్వేరుగా తిరుగుతున్నాయి. వేరుగా తిరిగే రెండు ఏనుగులు జనాన్ని చూస్తే దా డులకు పాల్పడుతున్నాయి. ప్రజలే కాదు మా సిబ్బంది, ఎలిఫెంట్ ట్రాకర్స్ కూడా గా యపడ్డారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం. –ఎఫ్ఆర్వో మదన్‌మోహన్‌రెడ్డి, పలమనేరు. -
ఓటర్ల జాబితా ప్రక్షాళన..!
చిత్తూరు కలెక్టరేట్: వంద శాతం పారదర్శకత ఓటర్ల జాబితా కోసం జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. అలసత్వం వహిస్తున్న ఎన్నికల అధికారులకు కలెక్టర్ ప్రద్యుమ్న షోకాజ్ నోటీసులు జారీచేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా షోకాజ్ నోటీసులు సంఖ్య మంగళవారం నాటికి 33 కు చేరింది. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న ముసాయిదా ఓటర్ల జాబితా వివరాలను ఈ నెల 14వ తేది నాటికి ఈఆర్వో నెట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. అందులో భాగంగా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, బీఎల్వోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు, అప్లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ప్రక్రియలో అలసత్వం వహించిన కుప్పం, గంగాధరనెల్లూరు, చంద్రగిరి, పలమనేరు నియోజకవర్గాల ఈఆర్వోలకు, ఏఈఆర్వోలకు (తహసీల్దార్) లకు షోకాజ్ నోటీసులు జారీచేసిన విషయం విధితమే. ఈ నెల 10న తాజాగా పలమనేరు నియోజకవర్గం ఈఆర్వో (ప్రభాకర్‌రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖాధికారి)కి, అదే నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, వి.కోట, పెద్దపంజాణి తహసీల్దార్లకు రెండోసారి షోకాజ్ నోటీసులను జారీ చేశారు. త్వరలో ముగ్గురిపై వేటు ఎన్నికల ప్రక్రియలో అలసత్వం వహించిన ముగ్గురు అధికారులపై త్వరలో కలెక్టర్ వేటు వేయనున్నారని విశ్వసనీయ సమాచారం. అందులో ఇప్పటి వరకు నోటీసులు ఎక్కువ అందినవారే ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి నాటికి అందిన ఓటరు దరఖాస్తులు, క్లైమ్లు, చిరునామా మార్పుల దరఖాస్తుల నమోదులో అధికంగా తప్పులు దొర్లాయని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న గుర్తించారు. అలాగే జిల్లాలో 3,42,961 బోగస్ ఓట్లు ఉన్నట్లు సాక్షి వరుస కథనాలను గతంలో ప్రచురించింది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న జిల్లా కలెక్టర్ ముసాయిదా ఓటర్ల సవరణ జాబితాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఓటర్ల క్షేత్ర స్థాయి తనిఖీలను రెండు సార్లు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియలో జిల్లాలో ఉన్న 3,42,961 బోగస్ ఓట్లను ఇంటింటి పరిశీలన చేయించారు. అందులో 16,246 ఓట్లు అనుమానిత ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. వారందరికి నోటీసులు జారీచేశారు. ఈ నెల 14వ తేది లోపు మరోసారి నోటీసులు అందజేసిన ఓట్లపై విచారణ చేసి వాటిని తొలగించనున్నారు. ఆమోదించిన ఓట్లను ఈఆర్వో నెట్ లో అప్లోడ్ చేయనున్నారు. ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేస్తాం జిల్లాలో ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడమే లక్ష్యం. జిల్లాలో 3.42 లక్షల అనుమానిత ఓట్లు ఉన్నట్లు సమాచారం. ఇంటింటి తనిఖీలు చేయించడం జరిగింది. డోర్ నంబర్లు లేకపోవడం, సరైన పేర్లు నమోదు చేసుకోకపోవడం, నమోదు చేసుకున్న చిరునామాలో లేకపోవడం తదితర అంశాలపై 16,246 అనుమానిత ఓట్లుగా గుర్తించడం జరిగింది. వారికి నోటీసులు ఇచ్చాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా చేస్తాం. జిల్లాలో ప్రక్రియ ఆలస్యంగా చేయడం, రాజకీయపార్టీలతో సమావేశాలు నిర్వహించకపోవడం, అప్లోడ్ ప్రక్రియలో వెనుకబడడం కారణాలపై నోటీసులు జారీచేయడం జరిగింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే ఎవరికైనా చర్యలు తప్పవు. – ప్రద్యుమ్న, కలెక్టర్ -
పల్లె రుచులు
చిత్తూరు నుంచి బెంగళూరుకి వెళ్లే మార్గంలో, పలమనేరు ప్రాంతం దగ్గర పడుతుండగా ప్రయాణికులను పల్లె రుచులు కట్టిపడేస్తాయి. ఎంత హడావుడిగా ప్రయాణిస్తున్నవారైనా ఒకసారి రుచి చూద్దాంలే అనుకుంటూ ఆ హోటల్లోకి ప్రవేశిస్తారు. ఒక్కసారిగా వారి వారి పల్లెలు వారికి గుర్తుకువస్తాయి. అమ్మమ్మ చేతి భోజనం తిన్నంత తృప్తిగా కడుపు నింపుకుని, ఆరోగ్యంగా బయటకు వస్తారు. వ్యవసాయ అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తి వినూత్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ ‘పల్లెరుచులు’. పూరిగుడిసెలోనే, రోలులో రుబ్బుతూ, కట్టెల పొయ్యిపై 64 రకాల రుచులను తయారుచేయిస్తున్నారు. బైరొడ్ల బియ్యపు అన్నం, రాగి సంగటి, కూరాకు పులగూర, గొజ్జు, చింతనీళ్ళు, ఎరినూగుల ఊరి బిండి (చట్నీ)... చాలామంది ఈ వంటకాల పేర్లు కూడా విని ఉండరు. పలమనేరుకి చెందిన అమర్నాథ్ రెడ్డి ఇలాంటి సంప్రదాయ వంటకాలను తయారుచేసి ప్రజలకు రుచి చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలో బొమ్మిదొడ్డి క్రాస్ దగ్గర ఈ వంటకాలు దొరుకుతున్నాయి. కాస్త కొత్తగా ఉండాలనే.... అమర్నాథ్ రెడ్డి సొంతవూరు పెద్ద పంజాణి మండలం గోనుమాకుల పల్లి. ఆయనది వ్యవసాయ కుటుంబం కావడంతో, పల్లెవాసనలు ఒంటబట్టాయి. పుంగనూరులో డిగ్రీ దాకా చదువుకొని ప్రైవేటు చక్కెర కర్మాగారంలో వ్యవసాయ అధికారిగా పనిచేశారు అమర్నాథ్ రెడ్డి. సమాజానికి ఉపయోగపడేలా ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో, చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, ఏపీ టూరిజం హోటల్లో పనిచేశారు. అక్కడి ఫాస్ట్‌ఫుడ్ విధానం, తద్వారా ప్రజలకు వస్తున్న ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ఊబకాయ సమస్యలపై ఆయన చలించిపోయారు. ఆహారపు అలవాట్లతోనే యువత రుగ్మతల బారిన పడుతోందని గ్రహించారు. గ్రామీణ వంటల వల్ల అక్కడి ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకుని, ‘పల్లెరుచులు – మిల్లెట్ రెస్టారెంట్’ ప్రారంభించి అందరికీ ఆరోగ్యం అందించడం కోసం ఆ రుచులను పరిచయం చేస్తున్నారు. పల్లె జీవనం ఉట్టిపడేలా.... ముగ్గులు, మామిడి తోరణాలతో పల్లెవాతావరణాన్ని తలపించేలా హోటల్‌ను రూపొందించారు. హోటల్ ముందు రుబ్బురోలు, కట్టెల పొయ్యి, మట్టి పాత్రలు ఏర్పాటుచేశారు. పల్లె పడుచులతో వంటలు చేయించడం ప్రారంభించారు. కొర్రలు, సామలు, సజ్జలు, జొన్నల వంటి చిరుధాన్యాలతో వంటలు చేయిస్తున్నారు. తాడిపత్రి, కదిరి, అనంతపూర్, నంద్యాల, కర్ణాటక ప్రాంతాల నుంచి వీటిని తెప్పించి వండిస్తున్నారు. అరటి ఆకులలో మాత్రమే వడ్డిస్తున్నారు. పాత వంటకాలను పరిచయం చేస్తున్నారు.. ప్రస్తుతం మేము బైరొడ్ల అన్నం, కొర్రలు, సామలన్నం, రాగి, సజ్జ, జొన్న రొట్టెలు, ఎర్రినూగుల చట్నీ, సెనగ కాయల ఊరిబిండి, ఎర్రగారం, పచ్చిగొజ్జు, ఉలవచారు, నాటుకోడి పులుసు, చేపల పులుసు, అలసంద బోండా, వడ, కూరాకు పులగూరలు, చిట్టిముత్యాల బిర్యానీ, కొర్ర పాయసం, ఎర్రగడ్ల చట్నీ వంటివి తయారు చేస్తున్నారు. సాయంకాలం శొంఠితోను, అల్లంతోను టీ తయారుచేసి, పంచదార బదులు బెల్లం ఉపయోగించి అందిస్తున్నారు. మధుమేహంతో బాధపడుతున్నవారు రాగిసంగటి కోసం ఇక్కడకు వస్తుంటారు. ఇక్కడకు వచ్చి ఈ ఆహారం తిన్నవారు, ‘ఆరోగ్యప్రదాతా సుఖీభవ!’ అని ఆయనను ప్రశంసిస్తున్నారు. ఆరోగ్య సమాజం కోసం... పలు ప్రాంతాలను సందర్శించినప్పుడు, అక్కడి ఫాస్ట్çఫుడ్ కల్చర్‌ను గమనించాను. ఆ తిండి ఒంటికి మంచిదికాదని తెలుసుకున్నాను. ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రజలకు అందచేయాలనుకున్నాను. ఆ ఆలోచన నుంచి పుట్టినదే ‘పల్లె రుచులు’. ఈ వ్యాపారం వల్ల నష్టం వస్తుంది, వద్దని స్నేహితులు వారించినా, ధైర్యం చేశాను. దేశంలో 80 శాతం మంది పల్లెలలో పుట్టినవారే, పల్లె రుచులను తప్పక ఆదరిస్తార నే నమ్మకంతో ఈ హోటల్ ప్రారంభించాను. పల్లె ప్రజల వేషధారణలో హోటల్‌కి వస్తాను. మా కుటుంబీకులు నాకు పూర్తిగా సహకరిస్తున్నారు. మూడు సంవత్సరాలుగా నడుస్తోంది. పి. సుబ్రహ్మణ్యం, పలమనేరు, సాక్షి -
జింకను కాపాడిన అగ్నిమాపక శాఖ
చిత్తూరు,పలమనేరు: నీటికోసం వచ్చి మెట్లు లేని బావిలో పడిన జింకను స్థానిక అగ్ని మాపకశాఖ సిబ్బంది రక్షించారు. పట్టణ సమీపంలోని టీఎస్ అగ్రహారంలో బావిలో జింక పడిన విషయాన్ని గమనించిన గ్రామానికి చెందిన హనుమంతురెడ్డి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 60 అడుగుల లోతు ఉన్న ఈ బావిలోకి అగ్నిమాపక సిబ్బంది దిగి జింకను సురక్షితంగా బయటకు తీసుకొచ్చి, అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. జింక బావిలో పడిందని తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. -
ఏటీఎం క్లోనింగ్ ముఠా అరెస్టు
వారంతా బాగా చదువుకున్నారు. వారి బుద్ధి వక్రమార్గం పట్టింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని సులువుగా డబ్బు సంపాధించాలని భావించారు. సెక్యూరిటీ లేని ఏటీఎంలను టారెŠగ్ట్గా చేసుకుని క్లోనింగ్ పరికరాలను ఏర్పాటుచేసి డబ్బులు డ్రా చేసుకుంటున్నారు. ఈ ముఠాను పలమనేరు పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.12,12,619 నగదు, క్లోనింగ్‌కు ఉపయోగించే ౖస్కైమర్, కార్డు రీడర్లు, డాటా మేనేజర్ సాఫ్ట్వేర్, మైక్రో సీసీ కెమెరాలు, డమ్మీ ఏటీఎం కార్డులు, ఇన్నోవా కారును సీజ్ చేశారు. పలమనేరు : ఏటీఎం నుంచి నగదును నిమిషాల్లో మాయం చేసే చెన్నైకి చెందిన ముఠాలోని ఐదుగురిని పలమనేరు పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ రాజశేఖర్‌బాబు శని వారం పలమనేరు పోలీస్‌స్టేషన్‌లో విలేకరులకు వివరాలు వెల్లడించారు. గత అక్టోబరు 20వ తేదీ నుంచి 22 వరకు 22 మంది ఎస్బీఐ ఖాతాదారులకు చెందిన ఏటీఎం కార్డులు వారివద్దే ఉండగా నగదు మాయమైంది. దీనిపై పోలీసులకు పిర్యాదులందాయి. డీఎస్పీ చౌడేశ్వరి కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఐడీపార్టీ పోలీసులతో కలిసి పలమనేరులో అమర్చిన సీసీటీవీ పుటేజీలు, కాల్‌డేటా ద్వారా నేరస్తులను గుర్తించారు. సెల్‌టవర్ లొకేషన్ ద్వారా వీరి కదలికలను పసిగట్టారు. శనివారం పలమనేరు ఏఎంసీ చెక్‌పోస్టు వద్ద దుండగులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు తమిళనాడు రాష్ట్రం కనత్తూరుకు చెం దిన నిరంజన్(37), మొహిద్దీన్(25), మాఘపూర్‌కు చెందిన ఎంఎస్కే రక్షిత్ అలియాస్ శ్యామ్(28), శాలిగ్రంకు చెందిన సురేష్(26), క్రిష్ణగిరికి చెందిన తమిళరసన్(25)గా తేలింది. వీరితో పాటు శ్రీలంకకు చెందిన ఆల్ఫ్రెడ్ బాలకుమార్, ముంబయికి చెందిన ఉమేష్ ప్రమేయం ఉందని గుర్తించారు. వీరు పలమనేరులోని ఎస్బీఐ ఏటీఎంతో బాటు తమిళనాడులోనూ ఇలాంటి చోరీలు చేసినట్టు ఎస్పీ తెలిపారు. ఎలా నేరం చేశారంటే దండగులు సెక్యూరిటీలేని ఏటీఎంలలోకి ప్రవేశించి ఏటీఎం యంత్రాన్ని విప్పి అందులో స్కైమర్ అనే యంత్రాన్ని అమర్చుతారు. ఇందులో కార్డు రైడర్ ఉంటుంది. ఏటీఎం పిన్ కనిపించేలా క్యాబిన్లో ఓ మైక్రోసీసీ కెమెరాను ఏర్పాటు చేస్తారు. స్కైమర్ ద్వారా ఏటీఎం కార్డు డేటా వీరి ల్యాప్‌ట్యాప్‌లకు చేరుతుంది. వీరి వద్ద ఉన్న డూప్లికేట్ ఏటీఎం కార్డులకు ఖాతాదారుల వివరాలను జోడించి సీసీ కెమెరాలో కనిపించిన ఏటీఎం పిన్ ద్వారా స్వైపింగ్ మిషన్లతో నగదును డ్రా చేస్తారు. రాష్ట్రంలో మొదటి క్లోనింగ్ కేస్.... దేశంలో ఢిల్లీలో గతేదాడి ఇదే తరహా క్రైమ్ జరిగింది. అనంతరం హైదరాబాద్‌లో జరిగింది. మన రాష్ట్రంలో మాత్రం ఇదే తొలి కేసు. ఎస్సీ ఆదేశాలతో స్థానిక డీఎస్పీ చౌడేశ్వరి, సీఐ వెంకట్వేర్లు ఐడీ పార్టీతో కలిసి కేసును సవాల్‌గా తీసుకున్నారు. రెండు నెలల వ్యవధిలో ముఠాను పట్టుకుని రికార్డు సృష్టించారు. దీంతో ఎస్పీ వీరిని మెచ్చుకున్నారు. కేసు ఛేదించడంలో కృషి చేసిన దేవ, జయక్రిష్ణ, శీన, ప్రకాష్, ఎల్లçప్ప, పయణి, శివ, అల్లాఉద్దీన్, ప్రకాష్‌కు రివార్డులను అందించారు. సాక్షి కథనం నిజమైంది ఈ చోరీలకు సంబందించి సాక్షి దినపత్రికలో అక్టోబరు 29న పలమనేరులో ఏటీఎం క్లోనింగ్ అన్న శీర్షికన కథనం ప్రచరితమైంది. అందులో చెప్పినట్టు చెన్నైకి చెందిన ముఠానే ఇందుకు పాల్పడడం గమనార్హం. కథనంలో ఎలా చోరీ చేశారని వచ్చిందో అదే తరహాలో చోరీ చేసినట్టు పోలీసులు తెలపడం విశేషం. పరారీలో కీలక వ్యక్తులు ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్న వారేకాక మరో ఇద్దరు కీలకమైన నిందుతులు ఉన్నట్టు తెలిసింది. ముఖ్యంగా క్లోనింగ్ చేశాక డమ్మీ ఏటీఎం కార్డులను వీరు ఎక్కడి నుంచి తెచ్చారనేది తేలాల్సి ఉంది. శ్రీలంకు చెందిన ఆల్ఫ్రెడ్, ముంబయికి చెందిన ఉమేష్ బయటి దేశాల నుంచే వీటిని సంపాదించినట్టు తెలుస్తోంది. వీరురువురూ చిక్కితే మరింత సమాచారం లభిస్తుందని ఎస్పీ తెలిపారు. -
పాదయాత్ర అడ్డుకోవడం ఎవరివల్లా కాదు
-
పలమనేరులో ఏటీఎం క్లోనింగ్!
ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతోంది. దాన్ని కొందరు దుండగులు తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారు. ఏటీఎం యంత్రాలను క్లోనింగ్ చేసి ఏటీఎం కార్డు లేకపోయినా రూ.లక్షలు డ్రా చేస్తున్నారు. పలమనేరులో ఇప్పటి వరకు 12 మంది ఖాతాల్లో నుంచి రూ.లక్షలు రూ.20 లక్షలకు పైగా నగదు స్వాహా చేశారు. బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పలమనేరు: గంగవరం మండలం కీలపల్లికి చెందిన జేసీబీ యజమాని హరినాథ్ రెడ్డి ఈ నెల 21న పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో 4 వేలు డ్రా చేశాడు. తాజాగా శనివారం వేకువజామున అతని మొబైల్‌కు ఆరు ఎస్ఎంఎస్లు వచ్చాయి. అందులో రూ.40 వేలు రెండు సార్లు, రూ.20 వేలు నాలుగు సార్లు మొత్తం రూ.1.60 లక్షలు చెన్నైలో డ్రా చేసినట్టు ఉంది. ఏటీఎం కార్డు జేబులోనే ఉన్నా డబ్బు డ్రా కావడంపై ఆందోళన చెందిన అతను వెంటనే కార్డును బ్లాక్ చేయించాడు. మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే విధంగా పట్టణంలోని వాసీం అక్రం, శివకుమార్‌తోపాటు మరో పదిమంది ఖాతాలనుంచి నాలుగు రోజు ల్లో డబ్బు డ్రా అయినట్టు గుర్తించారు. వీరంతా గంగవరం ఎంపీడీవో కార్యాలయం ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో డ్రాచేశాకే ఇలా జరిగినట్టు గుర్తించారు. పట్టణంలోని వినాయకనగర్‌కు చెందిన వికలాంగురాలైన షాజిదాఖానం గత నెల 20న డబ్బు డ్రా చేసి ఇవ్వాలని పొరుగింటికి చెందిన వ్యక్తికి కార్డు ఇచ్చింది. అతను రూ.2 వేలు డ్రా చేసి కార్డు ఇచ్చేశాడు. ఇలా ఉండగా అదే రోజు రాత్రి 12 గంటల నుంచి 3 వరకు ఆమె సెల్‌కు డబ్బులు చెన్నైలో డ్రా చేస్తున్నట్టు ఎస్ఎంఎస్లు వచ్చాయి. ఏటీఎం కార్డు తనవద్దే ఉన్నప్పటికీ రూ.1.58 లక్షల నగదు ఎలా డ్రా అయిందో అర్థంగాక ఆమె ఆందోళన చెందింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇలా ఈ నెలలోనే రూ.20 లక్షలకు పైగా ఏటీఎం కార్డుల్లో నగదు ఖాళీ అయింది. మెయిన్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం హ్యాకింగ్ పలమనేరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఏటీఎం రెండు నెలల క్రితం హ్యాకింగ్ చేశారు. దుండగులు ఏటీఎం యంత్రం ఐడీని సాప్ట్‌వేర్‌ను ఇతరత్రా సమాచారాన్ని క్లోనింగ్ చేసి చిప్ రీడర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ జరిగే లావాదేవీలకు సంబందించిన వివరాలు హ్యాకర్‌కు చేరుతున్నాయి. ఈ వివరాల ఆధారంగా దుండగులు డమ్మీ కార్డులకు చిప్‌లను అమర్చి నగదును డ్రా చేస్తున్నారు. రాష్ట్రంలో ఇదే తొలి హ్యాకింగ్ రకరకాల ఏటీఎం సైబర్ నేరాలు జరుగుతున్నా క్లోనింగ్ ద్వారా హ్యాకింగ్ చేసిన సంఘటన రాష్ట్రంలోనే తొలిసారి ఇక్కడ జరిగిందని తెలిసింది. గతంలో హైదరాబాద్‌లో ఇలాంటి హ్యాకింగ్ జరిగింది. ఏటీఎంలకు రక్షణలేకే.... ఎస్బీఐ కొన్ని ఏటీఎంలను తన పర్యవేక్షణలో ఉంచుకుంది. చాలా ఏటీఎంలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించింది. ఏజెన్సీలు నిర్వహించే ఏటీఎంల వద్ద సెక్యూరిటీ లేదు. ఇదే హ్యాకర్లకు వరంలా మారింది. పలమనేరు ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉన్న ఏటీఎంలోనూ సెక్యూరిటీ లేకపోవడంతోనే హ్యాకింగ్ జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చెన్నై ముఠా పనేనా.. రెండు నెలలుగా చెన్నై, పాండిచేరిలోని ఏటీఏం కార్డుల నుంచి డబ్బు డ్రా అవుతున్నట్టు బాధితుల మొబైల్‌కు ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. దీంతో హార్డ్‌వేర్‌లో నైపుణ్యం ఉన్న వారు మాత్రమే ఇలాంటి చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా హ్యాకర్స్ తాము డ్రా చేసే ఏటీఎంలలో సీసీ కెమెరాలకు బబుల్గమ్ అంటించినట్టు తెలిసింది. దీంతో డ్రాచేసిన ఏటీఎం సెంటర్లో నిందితుల సీసీ పుటేజీలు దొరకే అవకాశం లేదని సమాచారం. ఏదైమైనా ఏటీఎం కార్డుల్లో డబ్బులు డ్రా అవుతున్న సంఘటనలతో జనం ఆందోళన చెందుతున్నారు. త్వరలోనే ముఠాను పట్టుకుంటామని స్థానిక పోలీసులు చెబుతున్నారు. -
ఆ ఏటీఎంలో డబ్బు డ్రా చేస్తే ఇక అంతే...
చిత్తూరు(పలమనేరు) : చిత్తూరుజిల్లా పలమనేరులోని ఓ ఏటీఎంను హ్యాకర్స్ క్లోన్ చేశారు. దీంతో ఆ ఏటీఎంలో డ్రా చేసుకునే ఖాతాదారుని వివరాలు వెంటనే హ్యాకర్స్‌కు చేరుతున్నాయి. వారి వద్ద ఉన్న డమ్మీ కార్డుకు చిప్‌ను ఏటీఎంలో అమర్చి వారున్నచోటునుంచే ఖాతాదారుని అకౌంట్ నుంచి నగదును ఖాళీ చేస్తున్నారు. రెండు నెలలుగా ఈ తంతు సాగుతోంది. రెండ్రోజులుగా ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ఈ విషయం శనివారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికి 12మందికిపైగా బాధితులు ఇలా రూ.20 లక్షలకు పైగా నష్టపోయారు. గంగవరం మండలం కీలపల్లికి చెందిన జేసీబీ యజమాని హరినాథ్ రెడ్డి (ఎస్బీఐ ఖాతా నెం:30887905462) ఈనెల 21న స్థానిక ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో రూ.4వేలు డ్రా చేశాడు. తాజాగా శనివారం వేకువజామున అతని మొబైల్‌కు ఆరు ఎస్ఎంఎస్లు వచ్చాయి. ఇందులో రూ.40వేలు చొప్పున రెండుసార్లు, రూ.20వేలు చొప్పున నాలుగుసార్లు మొత్తం రూ.1.60లక్షలు చెన్నైలో డ్రా అయినట్లు ఆ మెసేజ్‌లలో ఉంది. దీంతో అతను తన ఏటీఎం కార్డును బ్లాక్ చేయించాడు. జరిగిన మోసంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదేవిధంగా పట్టణంలోని వాసీం అక్రం, శివకుమార్‌లతోపాటు మరో పదిమంది ఖాతాల్లోంచి గత నాలుగు రోజుల్లో డబ్బు డ్రా అయింది. వీరంతా కూడా అదే ఏటీఎంలో గతంలో డ్రా చేశాకే ఈ మోసాలు జరిగాయి. పట్టణంలోని వినాయకనగర్‌కు చెందిన వికలాంగురాలైన షాజిదాఖాన్ ఒంటరిగా ఉంటోంది. స్థానిక స్టేట్‌బ్యాంకు ఎటీఎం కార్డుతో ఈనెల 20న పొరుగింటికి చెందిన ఓ వ్యక్తి చేతికిచ్చి రూ.2వేలను డ్రా చేసుకురమ్మని చెప్పింది. దీంతో అతను ఆ నగదును ఎంపీడీవో కార్యాలయం వద్దనున్న ఏటీఎంలో డ్రా చేసి నగదును, ఏటీఎం కార్డును ఆమెకి ఇచ్చేశాడు. ఇలా ఉండగా అదే రోజు రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 గంటల దాకా చెన్నైలో డబ్బులు డ్రా చేస్తున్నట్టు ఆమె సెల్‌కు ఎస్ఎంఎస్లు వచ్చాయి. ఏటీఎం కార్డు తనవద్దే ఉన్నప్పటికీ చెన్నైలో రూ.1.58లక్షలు ఎలా డ్రా అయ్యాయో అర్థంకాక ఆందోళన చెందారు. మెయిన్ రోడ్డులోని ఎస్బీఐ ఏటీఎం హ్యాకింగ్ ఎంపీడీవో కార్యాలయానికి ఎదురుగా ఉన్న ఏటీఎం రెండు నెలలుగా హ్యాకింగ్‌కు గురైంది. ఇలాంటి చోరీల్లో మంచి అనుభవం ఉన్నవారు ఈ ఏటీఎంలోకి ప్రవేశించి ఏటీఎం యంత్రం ఐడీని, సాప్ట్‌వేర్‌ను ఇతరత్రా సమాచారాన్ని క్లోనింగ్ చేసి చిప్రైడర్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక్కడి ఏటీఎంలో డబ్బులు డ్రా అవ్వగానే ఆ లావాదేవీలకు సంబంధించిన వివరాలు హ్యాకర్‌కు చేరుతుంటాయి. ఈ వివరాల ఆధారంగా డమ్మీ కార్డులకు చిప్‌లను అమర్చి వారు నగదును డ్రా చేస్తున్నారు. ఈ హ్యాకర్స్ వేకువజామున డబ్బులు డ్రా చేస్తుండడంతో ఖాతాదారులకు తెలియడంలేదు. సెల్ స్విచ్ ఆఫ్‌లో ఉంటే ఆ సమాచారం రాదు. క్లోనింగ్ ద్వారా హ్యాకింగ్ ఏపీలో తొలిసారి ఇక్కడ జరిగిందని తెలిసింది. గతంలో హైదరాబాద్‌లో ఇలాంటి హ్యాక్ జరిగింది. చెన్నై ముఠాపనేనా? రెండు నెలలుగా ఏటీఏం కార్డుల్లో డ్రా అవుతున్న నగదు చెన్నై, పాండిచేరిలలోనే జరుగుతున్నట్టు బాధితుల సెల్‌లకు ఎస్ఎంఎస్లొస్తున్నాయి. దీంతో హార్డ్‌వేర్‌లో చేయితిరిగిన వారు మాత్రమే ఇలాంటి చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పైగా హ్యాకర్స్ తాము డ్రా చేసే ఏటీఎంలలో సీసీ కెమెరాలకు బబుల్‌గమ్‌ను అంటించి వ్యవహారం నడుపుతున్నట్టు తెలిసింది. దీంతో డ్రా చేసిన ఏటీఎం సెంటర్లో నిందితుల సీసీ పుటేజీలు దొరకవు. -
తక్కువ ధర: పెట్రోల్, డీజిల్ కోసం క్యూ!
కర్ణాటకలో లీటరుపై రూ.6.70 నుంచి రూ.7దాకా తక్కువ ధర ఏపీలో అమరావతి నిర్మాణం పేరిట 4శాతం అదనపు పన్నులు దీంతో సరిహద్దుల్లోని బంకులకు వెళుతున్న జనం పలమనేరు: పలమనేరు ప్రాంతపు వాహనదారులు పెట్రోలు, డీజల్ కోసం పొరుగున ఉన్న కర్ణాటకపై ఆధారపడుతున్నారు. వీలున్నప్పుడల్లా కర్ణాటకకు వెళ్లి తమ వాహనాల ట్యాంకుల నిండా పెట్రోల్, డీజిల్ పోయించుకుంటున్నారు. ఇందుకు కారణం ఆంధ్రప్రదేశ్ కంటే.. కర్ణాటకలో డీజల్, పెట్రోలు ధరలు తక్కువగా ఉండటమే.. ఇక్కడి కంటే కర్ణాటకలో లీటరు డీజిల్, పెట్రోల్ రూ.6.70 నుంచి రూ.7 దాకా తక్కువగా లభిస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రభుత్వం నిర్ణీత పన్ను నాలుగు శాతానికి అదనంగా 4శాతం (మొత్తం 8శాతం) వసూలు చేస్తుండటంతో ధరల్లో ఈ వ్యత్యాసం ఏర్పడింది. ఫలితంగా సరిహద్దుల్లో కర్ణాటకలో ఉన్న పెట్రోలు బంకుల్లో కళకళలాడుతుండగా స్థానిక బంకులు మాత్రం వెలవెలబోతున్నాయి. పలమనేరులో శుక్రవారం పెట్రోలు లీటరు రూ.70.80 కాగా కర్ణాటకలో రూ.64.10. ఇక ఏపీలో డీజల్ లీటరు రూ.62.63 కాగా కర్ణాటకలో రూ. 55.93. మొత్తం మీద రూ. 6.75 వరకు అక్కడ తక్కువకు పెట్రోల్, డీజిల్ లభిస్తున్నాయి. ఏడాదిగా తగ్గిన అమ్మకాలు.. పలమనేరు నియోజకవర్గంలోని పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లి, పెద్దపంజాణి మండలాలకు కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది. ఇక్కడ 90 పంచాయితీలుండగా సగం పల్లెలకు నియోజకవర్గ కేంద్రం కంటే కర్ణాటక రాష్ట్ర సరిహద్దే దగ్గరగా ఉంది. వీకోట పట్టణానికి ఆనుకునే కర్ణాటక సరిహద్దు ఉంది. దీంతో స్థానికంగా అధిక ధరతో కొనే బదులు కర్ణాటకలో కొంటే డబ్బు ఆదా అవుతుందని ప్రజలు పొరుగురాష్ట్రం బాటపడుతున్నారు. నియోజకవర్గంలో 15 పెట్రోలు బంకులున్నాయి. గతంలో ధరల వ్యత్యాసం లేనపుడు ఇక్కడ రోజుకు సగటున 80వేల లీటర్ల చమురు విక్రయాలు సాగుతుండేవి. ప్రస్తుతం ధరల వ్యత్యాసంతో రోజుకి 40 వేల లీటర్లకు పడిపోయింది. సరిహద్దుల్లో బోర్డులు పెట్టుమరీ అమ్మకాలు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లోని నంగిళి, ముళభాగిలు, తిమ్మరాజుపల్లి, వీకోట సరిహద్దు, రాజుపల్లిలో సరిహద్దుల అటువైపు ఉన్న పెట్రోల్ బంకులు బోర్డులు పెట్టి మరీ విక్రయాలు సాగించడం విశేషం. దీంతో వాహనదారులు తమ వాహనాలను అక్కడికి తీసుకెళ్ళి ఫుల్ట్యాంకు చేయించుకుంటున్నారు. జీఎస్టీ అమలైనా లాభమేమి? నిత్యావససరాలైన పెట్రోలు, డీజల్‌పై జీఎస్టీ లేకపోవడంతో రాష్ట్రాలు ఇస్టానుసారంగా పన్నులను పెంచుకునే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం సెంట్రల్ టాక్స్ 11.80శాతం, ఎక్సైజ్ డ్యూటీ 9.75శాతం, వ్యాట్ సెస్ 4శాతం, స్టేట్ టాక్స్ 8శాతంగా ఉన్నాయి. దీనికితోడు ఏపీలో అదనపు పన్నుల కారణంగానే ధరల్లో వ్యత్యాసం ఏర్పడింది. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ధరలు అదుపులోకి వస్తాయని చెప్పిన కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో దీనిని అమలుచేయకపోవడమేమిటని వాహనదారులు నిలదీస్తున్నారు. -
డబ్బులు కట్టించుకొని వాహనాలు ఇవ్వలేదు
చిత్తూరు: మెగా ఆఫర్ కింద ద్విచక్రవాహనాలు ఇవ్వడానికి డబ్బులు కట్టించుకొని ఒక్కరికీ వాహనం ఇవ్వలేదని పులవురు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిత్తూరు నగరంలోని పలమనేరు రోడ్డులో గల హీరో షోరూమ్ వద్ద వందలాది కొనుగోలుదారులు షోరూమ్ సబ్బందితో శనివారం వాగ్వాదానికి దిగారు. భారత్ స్టేజ్-3 వాహనాలపై మార్చి 31న నగదు డిస్కౌంట్ ప్రకటించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు నగదు చెల్లించి వాహనాలను బుక్ చేసుకున్నారు. అయితే నిర్వాహకులు మాత్రం వాహనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మళ్లీ ఆడపిల్ల పుట్టిందని..
⇒పసికందును చంపేందుకు కసాయిగా మారిన కన్నతండ్రి ⇒కుటుంబసభ్యులు బతిమలాడినా కరగని మనసు ⇒పోలీసులకు, ఐసీడీఎస్‌కు సమాచారం ఇచ్చిన 108 సిబ్బంది ⇒తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చి స్టేట్మెంటు రాసుకున్న పోలీసులు ⇒పలమనేరులో సంచనలం రేపిన ఘటన పలమనేరు: రెండో బిడ్డకూడా ఆడపిల్లే పుట్టిందని చంపేందుకు సిద్ధమయ్యాడో కసాయి తండ్రి. భార్య, కుటుంబసభ్యులు ఎంత వారించినా మనసు కరగలేదు. విషయం పోలీసులు, స్త్రీ–మహిళాసంక్షేమశాఖకు చేరడంతో వారు కౌన్సెలింగ్ ఇచ్చి బిడ్డకు హాని తలపెట్టనంటూ వాంగ్మూలం తీసుకున్నారు. ఈసంఘటన శుక్రవారం పలమనేరు ఏరియా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాలు.. గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన శంకరప్ప(30), నాగమ్మ(24)కు ఐదేళ్ల క్రితం వివాహమైంది. మూడేళ్ల ఆడపిల్ల ఉంది. శంకరప్ప తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నాగమ్మ మళ్లీ గర్భం దాల్చింది. రెండోబిడ్డ అయినా మగబిడ్డే కావాలని శంకరప్ప కలలుగన్నాడు. ఈనెల14న నాగమ్మకు ప్రసవనొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. వారు ఆమెను పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రెండో కాన్సులోనూ ఆడపిల్ల జన్మించింది. దీన్ని తట్టుకోలేని తండ్రి అప్పుడే శిశువు గొంతు నులిమి చంపేందుకు యత్నించా డు. దీంతో భార్య అడ్డుకుంది. ఈ విషయం తెలిసిన నాగమ్మ తండ్రి బిడ్డను తాను సంరక్షిస్తానని ముందుకొచ్చాడు. అయినా ఖాతరుచేయని తండ్రి తాను బిడ్డను చంపేయాలని నిర్ణయించుకున్నానని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా బతిమలాడారు. అయినా అతని మనసు కరగలేదు. గురువారం ఆమెను ఆస్పత్రినుంచి డిశ్చార్చి చేయగా నాగమ్మ ఇంటికెళ్లలేదు. ఇంటికెళితే తనభర్త అన్నంత పనిచేస్తాడంటూ ఆస్పత్రిలోనే ఉండిపోయింది. ఈ విష యం తెలుసుకున్న 108 సిబ్బంది కిశోర్, బాబా జాన్ స్థానిక ఉమెన్ అండ్ జువనైల్వింగ్కు సమాచారం ఇచ్చారు. సీడీపీవో రాజేశ్వరి, గ్రామ అంగ న్ వాడీ వర్కర్ సరసమ్మ, మహిళా పోలీస్‌స్టేషన్ ఏఎస్ఐ కీరీమున్నీసా సిబ్బందితో కలసి ఆస్పత్రికి చేరుకున్నారు. శంకరప్పకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బిడ్డ ప్రాణానికి ఏం జరిగినా బాధ్యత తండ్రిదేనని వాగ్మూలం తీసుకున్నారు. అంగన్వాడీ వర్కర్ పర్యవేక్షిస్తూ ఉండాలని ఆదేశించారు. వీరి వెంట సూపర్వైజర్ ప్రసన్న, షీ టీం సిబ్బంది కవిత తదితరులు పాల్గొన్నారు. -
లారీ హైజాకింగ్ ముఠా అరెస్టు
– రూ.20 లక్షల సొత్తు రికవరీ – దోపిడీకి పాల్పడింది తమిళనాడు అంతరాష్ట్ర ముఠా పలమనేరు: పలమనేరు పట్టణంలో డ్రైవర్‌పై దాడి చేసి పైపుల లారీని హైజాక్ చేసిన కేసులో నిందితులను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. లారీతోపాటు అందులోని స్టీల్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ శంకర్, సీఐలు సురేందర్ రెడ్డి, రవికుమార్ ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన డ్రైవర్ కమ్ ఓనర్ బాబు లారీలో కోల్‌కతా నుంచి స్టీల్ పైపులను బెంగళూరుకు బయలుదేరాడు. గతనెల 12న పలమనేరులో లారీని ఆపి ఇంటికి వెళ్లాడు. క్లీనర్ రాకపోవడంతో ఆ రాత్రి లారీలోనే నిద్రించాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు లారీలోకి ప్రవేశించి డ్రైవర్‌పై కత్తులతో దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేసి మొగిలి సమీపంలోని అడవిలో పడేసి లారీని అపహరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మండలంలోని కాలువపల్లె అటవీ ప్రాంతంలో శనివారం తమిళనాడు రాష్ట్రం కేవీ కుప్పం గ్రామానికి చెందిన పళని(29), కోలైనాడుకు చెందిన దయానిధిని అదుపులోకి తీసుకున్నారు. వారు తమ స్నేహితులు అదే ప్రాంతానికి చెందిన గోవిందరాజన్, ప్రవీణ్, గౌతమ్ కలిసి ఇండికా కారులో పలమనేరు వచ్చి డ్రైవర్ బాబుపై దాడి చేసి లారీని తీసుకెళ్లినట్టు అంగీకరించారు. అనంతరం లారీని తమిళనాడులోని క్రిష్ణగిరిలో వదిలేసి పైపులను మరో చోట దాచిపెట్టినట్టు పేర్కొన్నారు. పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని 550 స్టీల్ పైపులను స్వాధీనం చేసుకున్నారు. టైర్లను సైతం రకవరీ చేశారు. ఈ కేసులో మరో ముగ్గురిని త్వరలోనే పట్టికుంటామని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో చొరవ చూపిన సీఐలు సురేందర్ రెడ్డి, రవికుమార్, ఎస్ఐ లోకేష్, ఐడీపార్టీ దేవ తదితరులను ఆయన అభినందిచారు. వీరికి రివార్డుల కోసం ఎస్పీ శ్రీనివాస్‌కు సిపారసు చేస్తున్నట్టు తెలిపారు. పోలీసులను స్థానిక లారీ అసోసియేషన్ వారు ఘనంగా సన్మానించారు. -
డ్రైవర్‌ను చితక్కొట్టి..లారీ చోరీ
పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరులో పైపుల లోడుతో వెళ్తున్న లారీ చోరీకి గురైంది. స్థానికంగా నివాసముంటున్న రమేష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో కోల్‌కతా నుంచి బెంగళూరుకు పైపుల లోడు లారీ తీసుకెళ్లుతూ.. ఆదివారం అర్ధరాత్రి దాటాక పలమనేరు చేరుకున్నాడు. లారీలో క్లీనర్ లేకపోవడంతో.. స్థానికులు ఎవరైనా వస్తారేమోనని కనుక్కునేందుకు పలమనేరు శివారులో లారీ ఆపాడు. ఇది గుర్తించిన నలుగురు దొంగలు డ్రైవర్ పై కత్తులతో దాడిచేసి లారీతో సహా ఉడాయించారు. కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ మృతి చెందిఉంటాడని భావించి అడవిలో పడేశారు. అడవిలో పడిఉన్న లారీ డ్రైవర్‌ను గుర్తించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. దుండగులు తమిళంలో మాట్లాడారని తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
గుండె పోటు వచ్చినా..
* బస్సును ఆపి 50 మందిని * రక్షించిన బస్సు డ్రైవర్ * ఆస్పత్రికి తరలించేటప్పటికే మృతి పలమనేరు: తనకు గుండెనొప్పి రావడంతో బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను క్షేమంగా కాపాడి తన ప్రాణాలకంటే ప్రయాణికుల ప్రాణాలే మిన్న అని భావించాడో డ్రైవర్. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వి. కోటలో గురువారం జరిగింది. కుప్పం నుంచి సాయంత్రం 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఓ ప్రైవేటు బస్సు తమిళనాడులోని పేర్నంబట్‌కు బయలుదేరింది. డ్రైవర్ వెంకటేశ్ (45) బస్సును నడుపుతూ వి. కోటకు చేరుకోగానే గుండెనొప్పి వచ్చింది. దీంతో బస్సును పక్కన నిలిపివేసి కుప్పకూలాడు. దీన్ని గమనించిన ప్రయాణికులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా అతను మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. గుండెపోటు వచ్చినా తమ ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్ వెంకటేశ్ మృతదేహాన్ని చూసి ప్రయాణికులు సైతం క ంటనీరు పెట్టుకున్నారు. డ్రైవర్ తన ప్రాణాలకన్నా ప్రయాణికుల ప్రాణాలకే విలువనిచ్చాడని, అతని వల్ల తమ ప్రాణాలు దక్కాయని అన్నారు.