బలవంతంగా సిబ్బందిని బయటకు పంపిన వైనం
ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సర్పంచ్
పలమనేరు: టీడీపీ నేతల అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయనేందుకు గ్రామంలోని సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆస్పత్రి సిబ్బందిని బలవంతంగా బయటకు పంపి.. ఆయా కార్యాలయాలకు తాళాలు వేసిన ఘటన అద్దం పడుతోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలంలోని జగమర్లలో గురువారం సాయంత్రం చోటుచేసుకోగా.. శుక్రవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ప్రజల సౌకర్యార్థం రచ్చబండ వద్ద వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ భవనాలను నిర్మించింది.
ఈ కార్యాలయాల్లో మొత్తం 16మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. గతంలో ఈ కార్యాలయాలకు దారితోపాటు.. సీసీ రోడ్డును సైతం గత ప్రభుత్వమే నిర్మించింది. అయితే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు పక్కనే ఉన్న వైఎస్సార్‌సీపీకి చెందిన రెడ్డెప్పరెడ్డి సోదరుల పట్టా భూమిలో నుంచి దారి ఇవ్వాలంటూ గురువారం వాగ్వాదానికి దిగారు.
ఇప్పటికే దారి ఉన్నప్పటికీ తన పట్టా భూమిలో ఎందుకు దారి వదలాలని సంబంధిత రైతు ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన పచ్చనేతలు దుర్భాషలాడుతూ.. కార్యాలయాల్లోని సిబ్బందిని బయటకు పంపి.. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, ఆస్పత్రికి తాళాలు వేశారు. కోరినచోట దారి కల్పిస్తేనే కార్యాలయాలు తెరుస్తామంటూ హెచ్చరించారు. దీనిపై గ్రామ సర్పంచ్ విజయ్‌రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment