జనాభా ప్రాతిపదికన ఏ, బీ, సీ కేటగిరీలుగా సచివాలయాలను వర్గీకరిస్తూ ఉత్తర్వులు జారీ
2,500 లోపు జనాభా ఉన్నచోట్ల ఇప్పటిదాకా 9 మంది.. ఇకపై ఆరుగురు ఉద్యోగులే
10 కి.మీ. మించి దూరంగా ఉండే చిన్న గ్రామాలను సమీప సచివాలయాల్లో కలిపేందుకు అనుమతి
అవసరమైతే గిరిజన ప్రాంతాల్లో కొత్తవి ఏర్పాటు.. మిగులు సిబ్బంది అందులోకి
సాక్షి, అమరావతి: రేషనలైజేషన్ పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందిని కుదించాలని నిర్ణయించిన కూటమి సర్కారు ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయాల ఉద్యోగులను మల్టీ పర్పస్, టెక్నికల్, ఆస్పిరేషనల్ అనే మూడు కేటగిరీలుగా వర్గీకరించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసి గ్రామ స్వరాజ్యానికి సిసలైన అర్ధం చెబుతూ ఐదేళ్ల క్రితం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం దేశంలో తొలిసారిగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలతో విప్లవాత్మక వ్యవస్థకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
తాజాగా సచివాలయాల సిబ్బందిని జనాభా ప్రాతిపదికన తగ్గించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 2,500 కంటే జనాభా తక్కువ ఉండే చోట ‘ఏ’ కేటగిరీ గ్రామ సచివాలయాలుగా పరిగణించి ఆరుగురు ఉద్యోగులను కేటాయిస్తారు. 2,500–3,500 జనాభా ఉండే ‘బీ’ కేటగిరీ గ్రామ సచివాలయాలలో ఏడుగురు చొప్పున, అంతకు మించి జనాభా ఉంటే ‘సీ’ కేటగిరీగా పరిగణించి కనీసం 8 మంది చొప్పున సచివాలయాల ఉద్యోగులను పరిమితం చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
⇒ డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఐఓటీ తదితర సాంకేతిక విధానాలపై అవగాహన ఉన్న ఉద్యోగులను ఆస్పిరేషనల్ ఫంక్షనరీస్ పేరుతో ఆయా సచివాలయాల్లో కొనసాగిస్తారు.
⇒ రేషనలైజ్ తర్వాత మిగులు ఉద్యోగులుగా గుర్తించే వారిని ఇతర ప్రభుత్వ శాఖలలో వినియోగించుకోవటంపై కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు.
⇒ ఏదైనా గ్రామం సంబంధిత సచివాలయానికి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే పంచాయతీకి ఇబ్బంది లేకుండా సమీప సచివాలయం పరిధిలో చేర్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే గిరిజన ప్రాంతాల్లో కొత్తగా గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి మిగులు ఉద్యోగులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
⇒ గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పంచాయతీ కార్యదర్శి, వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు వార్డు అడ్మిన్ సెక్రటరీ హెడ్‌గా కొనసాగుతారు.
⇒ సచివాలయాల పర్యవేక్షణకు కొత్తగా మండల లేదా మున్సిపల్ స్థాయితో పాటు జిల్లా స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మిగులు సిబ్బందిని వినియోగించుకోవాలని పేర్కొన్నారు.
⇒ ఆస్పిరేషనల్ ఉద్యోగుల ద్వారా సచివాలయాల స్థాయిలో స్కిల్ డెవలప్‌మెంట్, డిజిటల్ అక్షరాస్యత, ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు అందించనున్నారు.
వీఆర్వో కోసం వెతుక్కోవాల్సిందే..!
ఇటీవల ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు రేషనలైజేషన్ అనంతరం చాలా సచివాలయాల్లో ప్రజలతో నిత్యం సంబంధాలు నెరిపే ఉద్యోగులు అందుబాటులో ఉండని పరిస్థితి ఉత్పన్నం కానుంది. ప్రస్తుతం సచివాలయాల్లో ప్రజలు వెళ్లగానే వారి నుంచి వినతులు స్వీకరించి అప్పటికప్పుడే కంప్యూటర్‌లో అప్‌లోడ్ చేసి రశీదు అందించే డిజిటల్ అసిస్టెంట్లు ఇకపై చాలా చోట్ల ఉండరు. 2,500 లోపు జనాభా ఉండే సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్య ఆరుకు కుదింపు కారణంగా ఆయా చోట్ల పంచాయతీ కార్యదర్శి లేదా డిజిటల్ అసిసెంట్లలో ఎవరో ఒకరు మాత్రమే పని చేస్తారు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో భూములకు సంబంధించి ప్రజలకు అవసరమయ్యే వివిధ రకాల సరి్టఫికెట్ల జారీలో కీలకమైన వీఆర్వోలు రేషనలైజేషన్ అనంతరం దాదాపు అన్ని చోట్ల ప్రతి రెండు సచివాలయాల్లో ఒకరు చొప్పున మాత్రమే విధులు నిర్వహించే అవకాశం ఉంది. వ్యవసాయ సహాయకుడు, పశు సంరక్షక సహాయకుడు, ఎనర్జీ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిసెంట్లు సైతం రెండు సచివాలయాలకు ఒకరు చొప్పున మాత్రమే పని చేస్తారు. వార్డు సచివాలయాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉత్పన్నం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment