rationalization
-
మే నుంచి హేతుబద్ధీకరణ!
సాక్షి. హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మే నుంచి చేపట్టి వచ్చే విద్యా సంవత్సరం ఆరంభానికల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలనే లక్ష్యంతో విద్యాశాఖ ఉంది. కొత్త జిల్లాలకు ఉద్యోగుల కేటాయింపు చేపట్టిన తర్వాత టీచర్ పోస్టులపై ఓ స్పష్టత వచ్చిందని అధికారులు అంటున్నారు. ఎక్కడ టీచర్ల నియామకం చేపట్టాలి? ఎక్కడ అవసరం లేదనే విషయాలపై సమగ్ర సమాచారం సేకరించినట్టు చెబుతున్నారు. కొన్ని జిల్లాల్లో అవసరమైన దానికంటే ఎక్కువమంది టీచర్లు ఉంటే, కొన్ని జిల్లాల్లో తక్కువగా ఉన్నారు. విద్యార్థుల సంఖ్యతో పోల్చుకుంటే మొత్తంగా దాదాపు 7 వేల మంది టీచర్లు ఎక్కువగా ఉన్నట్టు తెలుసోంది. వీరిని విద్యార్థులు ఎక్కువ ఉండే పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని భావిస్తున్నారు. అదే విధంగా ప్రవేశాలు తక్కువ ఉండే స్కూళ్లను సమీపంలోని స్కూళ్లలోకి మార్చాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం విద్యను క్షేత్ర స్థాయి నుంచి అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వరంగల్ జిల్లాలో ప్రతి 12 మందికి ఒక టీచర్! రాష్ట్రంలో 26 వేలకు పైగా ప్రభుత్వ స్కూళ్లున్నాయి. వీటిల్లో దాదాపు 1.03 లక్షల మంది ఉపాధ్యాయులున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండాలి. అయితే తాజాగా విద్యాశాఖ సేకరించిన గణాంకాల ప్రకారం సగటున ప్రతి 23 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నట్టు తేలింది. 0–5వ తరగతి వరకు అయితే సగటున ప్రతి 20 మందికీ ఒక ఉపాధ్యాయుడు ఉన్నారు. 20 జిల్లాల్లో విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగానే టీచర్లు కూడా ఉన్నారు. అయితే అన్ని జిల్లాల్లోనూ ఈ తరహా సగటు కన్పించడం లేదు. వరంగల్ జిల్లాలో ప్రతి 12 మందికి ఒక టీచర్ ఉంటే, జోగుళాంబ గద్వాల జిల్లాలో మాత్రం 32 మందికి ఒక టీచర్ ఉన్నారు. ఈ వివరాలన్నీ పరిశీలిస్తే ఎక్కువమంది టీచర్లు ఉన్నారని అర్థమవుతోందని విద్యాశాఖ పేర్కొంటోంది. సబ్జెక్టు టీచర్లే సరిపడా లేరు జాతీయ విద్యావిధానం ప్రకారం మొత్తంగా టీచర్ల సంఖ్య ఎక్కువగా ఉన్నా.. హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత రెండేళ్లుగా కరోనా విసిరిన సవాళ్ల నేపథ్యంలో ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల చేరికలు 2.5 లక్షల వరకు పెరిగాయి. దీనివల్ల కూడా హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు టీచర్ల కొరత ఎక్కువగా కన్పిస్తోంది. కుమురం భీం జిల్లాలో 65 మందికి, వికారాబాద్‌లో 55 మందికి, జోగుళాంబ గద్వాల జిల్లాలో 48 మందికి, నాగర్ కర్నూల్లో 58 మందికి ఒక టీచర్ మాత్రమే ఉన్నట్టు తేలింది. విద్యాశాఖ గణాంకాలను పక్కన పెడితే రాష్ట్రవ్యాప్తంగా 18 వేల మంది టీచర్ల కొరత ఉందనేది అనధికార అంచనా కాగా ఇందులో సింహభాగం 6 నుంచి 10 వరకు బోధించే సబ్జెక్టు టీచర్ల కొరతే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సబ్జెక్టు టీచర్ల భర్తీ విషయంలో విద్యాశాఖ ప్రభుత్వానికి పలు సిఫారసులు చేస్తోంది. నియామకాలా? సర్దుబాటా? డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష నియామకం చేపట్టడం మొదటిదైతే, ఇప్పటికిప్పుడు ఇది సా«ధ్యం కానప్పుడు కనీసం విద్యా వాలంటీర్లనైనా తీసుకోవాలని చెబుతోంది. ఇందులో కూడా సబ్జెక్టులు బోధించే వారికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంటోంది. హేతుబద్ధీకరణ చేపడితే స్కూళ్లు, టీచర్ల సర్దుబాటు పూర్తవుతుందని, అప్పుడు వాస్తవంగా ఎంత మంది టీచర్ల అవసరం ఉంటుందనేది నిర్ధారించే వీలుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. మే నుంచి ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమయ్యే వీలుందని అధికారులు చెబుతున్నారు. -
జీఎస్టీ రేటు హేతుబద్దీకరణ
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రేట్ల హేతుబద్దీకరణ ప్రభుత్వ అజెండాలో ప్రధానమైనదని కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) కేవీ సుబ్రమణియన్ పేర్కొన్నారు. హేతుబద్దీకరణ త్వరలో వాస్తవరూపంలోకి వస్తుందన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. జీఎస్టీ మూడు రేట్ల వ్యవస్థకు మార్చడం కీలకాంశమని ఆయన పేర్కొన్నారు. ఇండస్ట్రీ బాడీ– అసోచామ్ నిర్వహించిన మరో వెర్చువల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 2017 జూలై నుంచీ అమల్లోకి వచ్చిన జీఎస్టీ ప్రస్తుతం ఐదు రేట్ల వ్యవస్థతో (0.25 శాతం, 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం) అమలు జరుగుతున్న సంగతి తెలసిందే. దీనితోపాటు జీఎస్టీకి సంబంధించినంతవరకూ స్థిర ఇన్వర్టెడ్ సుంకం వ్యవస్థ కూడా అవసరమని సుబ్రమణియన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పెద్ద బ్యాంకుల ఏర్పాటు అవశ్యం... ఎకానమీలో ఫైనాన్షియల్ రంగం ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావిస్తూ, భారత్‌లో ప్రపంచ స్థాయిలో పెద్ద బ్యాంకులు ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో భారత్ ఐదవ అతిపెద్ద ఎకానమీ అయినప్పటికీ, అంతర్జాతీయంగా టాప్ 50 బ్యాంకుల జాబితాలో లేదన్నారు. 55వ స్థానంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్–100 బ్యాంకుల జాబితాలో ఉందన్నారు. టాప్–100 జాబితాలో చైనా బ్యాంకులు 18 ఉండగా, అమెరికా బ్యాంకులు 12 ఉన్నాయని వివరించారు. సమావేశంలో పాల్గొన్న సెబీ హోల్ టైమ్ మెంబర్ జీ మహాలింగమ్ మాట్లాడుతూ, కార్పొరేట్ బ్యాంక్ మార్కెట్ విస్తరణకు ప్రభుత్వం, మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పలు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ద్రవ్యలోటు లక్ష్యం దాటదు ఆదాయాల విషయంలో ఒత్తిడులు ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ద్రవ్యలోటు లక్ష్యాల మేరకు నమోదవుతుందన్న విశ్వాసాన్ని మరో కార్యక్రమంలో సుబ్రమణియన్ వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయాలకు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2021–22లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతంగా ఉండాలన్నది బడ్జెట్ లక్ష్యం. కాగా 2022–23లో జీడీపీ 6.5 శాతం నుంచి 7 శాతం శ్రేణిలో పురోగమిస్తుందన్న సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. తరువాతి ఆర్థిక సంవత్సరాల్లో ఇది 8 శాతానికి చేరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంస్కరణలు ఇందుకు దోహదపడతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీఏఎస్ఈ విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయం, కార్మిక రంగాల్లో సంస్కరణలు, ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు, సూక్ష్మ, లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిర్వచనం మార్పు, బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలు దీర్ఘకాలంలో వృద్ధి పురోగతికి దోహదపడతాయని అన్నారు. అలాగే మౌలికంసహా వివిధ రంగాలపై ప్రభుత్వ వ్యయాలు వృద్ధికి దారితీస్తాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం దిగివస్తుంది... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలసీ విధానానికి కీలకమైన వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం నిర్దేశిత శ్రేణికి దిగివస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. సరఫరాల వ్యవస్థ మెరుగుపడ్డం ఇందుకు కారణమవుందని ఫిక్కీ నిర్వహించిన ఒక వెర్చువల్ కార్యక్రమంలో విశ్లేషించారు. కేంద్రం నిర్దేశాల ప్రకారం ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 నుంచి 6 శాతం శ్రేణిలో కట్టడి చేయాల్సి ఉంది. రిటైల్ ద్రవ్యోల్బణం మేలో 6.3 శాతంకాగా, జూన్‌లో స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను వరుసగా ఆరు ద్వైమాసిక సమావేశాల నుంచి ఆర్బీఐ పరపతి విధాన కమిటీ యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. మార్చి 2020 తర్వాత 115 బేసిస్ పాయింట్లు రెపోను తగ్గించిన ఆర్బీఐ, కరోనా కష్ట కాలం దేశానికి ప్రారంభమైన తర్వాత యథాతథ రేటును కొనసాగిస్తూ వస్తోంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.1 శాతంగా కొనసాగుతుందని ఆర్బీఐ అంచనావేసింది. రిటైల్ ద్రవ్యోల్బణం మొదటి, రెండవ, మూడవ, నాల్గవ త్రైమాసికాల్లో వరుసగా 5.2 శాతం, 5.4 శాతం, 4.7 శాతం, 5.3 శాతంగా కొనసాగుతాయన్నది ఆర్బీఐ అంచనా. ఈ కారణంగా వృద్ధికి దోహదపడే సరళతర ఆర్థిక విధానాల కొనసాగింపునకు ఆర్బీఐ మొగ్గుచూపుతోంది. -
వర్సిటీ పోస్టులన్నీ 'రీ రేషనలైజేషన్'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పునఃప్రారంభించడంపై ఉన్నత విద్యామండలి దృష్టి సారిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ఈ పోస్టుల భర్తీకి జారీ చేసిన జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం ఇటీవల రద్దు చేయడంతో కొత్తగా ప్రక్రియను ప్రారంభించనున్నారు. గత సర్కారు ఇష్టానుసారంగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టడంతో న్యాయవివాదాల్లో చిక్కుకున్నాయి. ఆ లోపాలను సవరించి వర్సిటీల వారీగా పోస్టుల హేతుబద్ధీకరణ చేపట్టాలని మండలి భావిస్తోంది. రేషనలైజేషన్, రిజర్వేషన్లు, రోస్టర్ విధానం, వయోపరిమితి తదితర అంశాలపై న్యాయస్థానం మార్గదర్శకాల ప్రకారం వ్యవహరిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రక్రియను చేపట్టనున్నామన్నారు. నిబంధనల ప్రకారం హేతుబద్ధీకరణ వర్సిటీ పోస్టుల హేతుబద్ధీకరణపై యూజీసీ మార్గదర్శకాలతో పాటు ప్రభుత్వ నిబంధనలను పాటించనున్నారు. వర్సిటీలకే బాధ్యత అప్పగించనున్నారు. హేతుబద్ధీకరణ ముగిశాక కొత్తగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మెరిట్ అభ్యర్థులను గుర్తించేందుకు స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని భావిస్తున్నారు. వర్సిటీ పోస్టులను పూర్తి పారదర్శకంగా, మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలిని ఆదేశించారు. కమిటీ సిఫార్సులంటూ క్యాడర్ మార్పు రాష్ట్రంలోని 14 యూనివర్సిటీల్లో 1,385 బోధనా సిబ్బంది పోస్టుల భర్తీ ప్రక్రియలో గత ప్రభుత్వం అక్రమాలు, అవకతవకలకు తావిచ్చింది. వర్సిటీల స్వయం ప్రతిపత్తిని పక్కన పెట్టి కమిటీ ద్వారా పోస్టుల హేతుబద్ధీకరణ చేసింది. కమిటీ సిఫార్సులంటూ నిబంధనలకు విరుద్ధంగా 570 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా క్యాడర్ మార్పు చేసింది. ఒక విభాగం పోస్టును మరో విభాగానికి తరలించింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లను కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తమ సామాజిక వర్గానికి ప్రొఫెసర్ పోస్టులు ప్రొఫెసర్ పోస్టులను తమ సామాజికవర్గం వారితో గత ప్రభుత్వ పెద్దలు భర్తీ చేయించారు. అనంతపురం జేఎన్టీయూలో 9 ప్రొఫెసర్ పోస్టులలో ఏడింటిని ఒకే సామాజికవర్గం వారితో భర్తీ చేశారు. కృష్ణా వర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులు, రాయలసీమ వర్సిటీలో 4 ప్రొఫెసర్ పోస్టులతోపాటు మరికొన్ని వర్సిటీల్లో కూడా తమ వారితో భర్తీ చేశారు. రేషనలైజేషన్ జీవోలు, నోటిఫికేషన్లను న్యాయస్థానం రద్దు చేసినందున ఈ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు కూడా రద్దు కానున్నాయి. -
రైల్వే చార్జీల హేతుబద్ధీకరణ
న్యూఢిల్లీ: ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను హేతుబద్ధీకరించేందుకు రైల్వేశాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వై.కె.యాదవ్ గురువారం వెల్లడించారు. అయితే, ఛార్జీలు పెరుగుతాయా? అన్నదానిపై సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు. ఇది చాలా సున్నితమైన విషయమని విస్తృత చర్చల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తగ్గుతున్న ఆదాయాన్ని పెంచేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టామన్నారు. సరుకు రవాణా చార్జీలు ఇప్పటికే ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోడ్డు ప్రయాణికులను రైల్వే వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఆర్థిక మందగమనం కారణంగా రైల్వే ఆదాయంలో తగ్గుదల నమోదవడం తెల్సిందే. రైల్వే నిర్వహణకు ఐదు విభాగాలు రైల్వేలలో ఇకపై యూపీఎస్సీ తరహాలో ఐదు ప్రత్యేక విభాగాలకు నియామకాలు జరుగుతాయని రైల్వే బోర్డు చైర్మన్ యాదవ్ తెలిపారు. యూపీఎస్సీ మాదిరిగానే ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీసెస్ (ఐఆర్ఎంఎస్) కోసం ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని అందులో విజయం సాధించిన వారు ఐదు విభాగాల్లో ఒకదాన్ని ఎంచుకుంటారని ఆయన వివరించారు. ఈ ఐదు ప్రత్యేక విభాగాల్లో నాలుగు సివిల్, మెకానికల్, టెలికామ్, ఎలక్ట్రికల్ వంటి ఇంజినీరింగ్ సేవలు కాగా, మిగిలిన నాన్ టెక్నికల్ విభాగం కింద అకౌంట్స్, పర్సనెల్, ట్రాఫిక్ వంటివి ఉంటాయని చెప్పారు. చివరి విభాగంలో ఉద్యోగం కోసం హ్యుమానిటీస్ చదువుకున్న వారూ అర్హులేనని, అందరికీ ఒకేసారి పదోన్నతులు దక్కుతాయని తెలిపారు. రైల్వే బోర్డు చైర్మన్ ఇకపై రైల్వేల సీఈవోగా ఉంటారు. ఇండియన్ రైల్వే సర్వీస్ అధికారే ఈ పదవి చేపట్టనున్నారు. సీనియారిటీకి ఢోకా లేదు: పీయూష్ గోయెల్ రైల్వేలోని వివిధ విభాగాలను ఒక్కటిగా చేయడం వల్ల అధికారుల సీనియారిటీకి ఇబ్బంది కలగబోదని రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. ప్రతిభ, సీనియారిటీల ఆధారంగా రైల్వే బోర్డులో సభ్యులయ్యేందుకు అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన వివరించారు. -
డీఎస్సీ పోస్టులపై ప్రభుత్వం తకరారు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ షెడ్యూల్‌ను ప్రకటించినా ఖాళీలపై ఇంకా తర్జనభర్జన పడుతోంది. ఉపాధ్యాయ ఖాళీలను సాధ్యమైనంత మేర తగ్గించడానికి క్షేత్రస్థాయిలో పోస్టులను కుదింపు చేస్తోంది. ఈ నెల 6న ప్రభుత్వం డీఎస్సీ ప్రకటన చేస్తూ 12,370 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాల విద్యా శాఖ పరిధిలో 10,313 పోస్టులు, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు 860, మోడల్ స్కూళ్లలోని పోస్టులు 1197 కలుపుకొని 12,370 ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 15న డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రకటిస్తామని, ఏపీపీఎస్సీ ద్వారా నియామకాలు చేపడతామని షెడ్యూల్ విడుదల సందర్భంగా మంత్రి గంటా చెప్పారు. అయితే ఏపీపీఎస్సీకి అప్పగించే అంశం తేలకపోవడం, జిల్లాల వారీగా ఖాళీలపై ఇంకా స్పష్టత రాకపోవడంతో నోటిఫికేషన్ వెలువడలేదు. వాస్తవానికి టీచర్ పోస్టుల ఖాళీలు భారీగా ఉన్నా ప్రభుత్వం కుదించి చూపిస్తోంది. రెండు నెలల క్రితం మంత్రి గంటా 22,814 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. రేషనలైజేషన్, విద్యార్థుల సంఖ్యను కుదించి చూపుతూ తగ్గింపు టీడీపీ అధికారంలోకి వచ్చాక పాఠశాల విద్యాశాఖలో హేతుబద్ధీకరణ విధానాన్ని తెరపైకి తెచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి వాటిని మూసేయించి వేరే స్కూళ్లలో విలీనం చేసే చర్యలు చేపట్టింది. ఇలా 2015–16లో 1500 స్కూళ్లు మూత వేయించింది. ఫలితంగా పాఠశాలల సంఖ్య కుదించుకుపోయి మూతపడ్డ ఆయా స్కూళ్లలోని టీచర్లు అదనపు టీచర్లుగా మిగిలిపోతున్నారు. వీరిని ఇతర పాఠశాలల్లో ఖాళీ పోస్టుల్లో నియమిస్తున్నారు. ఫలితంగా ఖాళీ పోస్టుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. మరోవైపు చైల్డ్ఇన్ఫో పేరిట కూడా పాఠశాలల్లో టీచర్ల సంఖ్యకు కోతవేస్తోంది. 2014 తర్వాత ఒక్కటే డీఎస్సీ ఈ మూడున్నరేళ్లలో ప్రభుత్వం ఒకే ఒక్క డీఎస్సీని నిర్వహించింది. 10,313 పోస్టులతో ఆ డీఎస్సీని ప్రకటించి దాన్ని రెండేళ్లు సాగదీసి 2016లో ఎంపికలు పూర్తిచేశారు. అలా ఎంపికైనవారిలో ఇంకా రెండు వేల మందికి పోస్టింగ్‌లు ఇవ్వకుండా డీఈవో కోటాలోనే ఉంచారు. ఖాళీలు భారీగా ఉన్నా వారిని ఆయా పోస్టుల్లో నియమించకుండా హేతుబద్ధీకరణతో మిగిలిన పోస్టుల్లో నియమిస్తున్నారు. ఫలితంగా ఖాళీల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. రెండేళ్ల క్రితం సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికల్లో టీచర్ పోస్టుల ఖాళీల సంఖ్యను ప్రభుత్వం 19,468 ఉన్నట్లు చూపింది. ఆ తర్వాత డీఎస్సీని నిర్వహించకపోవడం, ఈ మూడేళ్లలో రిటైర్ అయిన వారి సంఖ్యను కలుపుకొంటే ఆ సంఖ్య మరింత పెరుగుతుంది. అయినా ప్రభుత్వం పోస్టుల సంఖ్యను తగ్గించి డీఎస్సీని ప్రకటించడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
‘ప్రాథమిక’ కోత
– జిల్లాలో రెండు ప్రాథమిక పాఠశాలలు మూత – 40 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయి తగ్గింపు – ముగిసిన హేతుబద్ధీకరణ ప్రక్రియ – జిల్లాలో మిగిలిన పోస్టులు 1044 కర్నూలు (సిటీ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టిన హేతుబద్ధీకరణ దాదాపు పూర్తి అయింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ జిల్లాలో ఏయే పాఠశాలలు మూత పడుతాయి, స్థాయి తగ్గే స్కూళ్ల వివరాలను ఆన్లైన్లో పొందు పరిచారు. ఈ ప్రక్రియ పూర్తయితే దానిపైనే ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తు కొంతమేరకు ఆధారపడి ఉంది. జిల్లాలో ఆత్మకూరు మండలంలోని రెండు ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్లో ఉండటంతో వాటికి సమీపంలో ఉండే స్కూళ్లలో విలీనం చేశారు. దీంతో కేవలం ఆ రెండు స్కూళ్లు మాత్రమే హేతుబద్ధీకరణ వల్ల మూతపడనున్నాయి. అదేవిధంగా 40 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పదిలోపు ఉండటం, స్కూలుకు, స్కూలుకు మధ్య ఉన్న దూరం 3కి.మీ మించి ఉండడంతో వాటి స్థాయిని ప్రాథమిక పాఠశాలగా తగ్గించారు. అయితే వీటిపై అభ్యంతరాలకు విద్యాశాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది. మిగిలిన పోస్టులు ఇవే.. జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన హేతుబద్ధీఖరణతో 1044 పోస్టులు మిగలనున్నాయి. వాస్తవానికి జిల్లాలో 3వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ మిగులు పోస్టులు ఖాళీలలో భర్తీ చేసిన తర్వాతనే క్లియర్ వేకెన్సీ లిస్టును విద్యాశాఖ అధికారులు ప్రదర్శించనున్నారు. ఈ జాబితా ఆధారంగానే ఉపాధ్యాయులు బదిలీల కోసం ఆప్షన్లు ఇచ్చుకుంటారు. అయితే ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు శనివారం చివరి రోజు కావడంతో క్లియర్ వేకెన్సీ పొజిషన్ తెలియక.. కొంతమంది ఆప్షన్లు ఇచ్చుకోవడంలో గందరగోళానికి గురవుతున్నారు. మిగులు ఇలా.. పాఠశాల మిగులు ఉపాధ్యాయుల సంఖ్య ప్రాథమిక 237 ప్రాథమికోన్నత 52 ఉన్నత 755 మిగిలిపోయిన పోస్టులు ఇవే.. ప్రాథమికోన్నత పాఠశాలల్లో గణితం 5పోస్టులు, సామాన్య శాస్త్రం 10 పోస్టులు, సాంఘిక శాస్త్రం 16 పోస్టులు, గ్రేడ్–1 తెలుగు 12, గ్రేడ్–1 హిందీ–9 పోస్టులు మిగిలాయి. ఉన్నత పాఠశాలల్లో గణితం కన్నడ మీడియం 3 పోస్టులు, తెలుగు మీడియం 90, ఉర్దూ మీడియం 4, భౌతిక శాస్త్రం కన్నడ మీడియం 1, తెలుగు మీడియం 119, ఉర్దూ మీడియం 6, బయోలజికల్ సైన్స్ తెలుగు మీడియం 65, కన్నడ 1, ఉర్దూ 5, సోషల్ కన్నడ మీడియం 1, తెలుగు మీడియం 55, ఉర్దూ 5, ఇంగ్లిష్ 115, గ్రేడ్–1 తెలుగు 15, హిందీ 3, ఫిజికల్ డైరెక్టర్ 60, పీఈటీ 2, ఇతర పోస్టులు 114, తెలుగు భాష పండిత పోస్టులు 60, హిందీ భాషా పండిత పోస్టులు 4 మిగలనున్నాయి. -
262 స్కూళ్లకు మంగళం !
మూతపడనున్న 50 ప్రాథమిక, 150 ప్రాథమికోన్నత, 4 ఉన్నత పాఠశాలలు మరో 58 సక్సెస్ స్కూళ్లదీ అదేబాట కొలిక్కి వచ్చిన రేషనలైజేషన్ టీచర్ పోస్టుల బదలాయింపుపై తెగని పేచీ అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లాలో మొత్తం 262 స్కూళ్లు కనుమరుగుకానున్నాయి. ఏళ్ల తరబడి వేలాది మందికి చదువులు నేర్పిన ఆ స్కూళ్లు ఇక కనిపించవు. ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల రేషనలైజేషన్ (హేతుబద్దీకరణ) ప్రక్రియ కొలిక్కి వచ్చింది. షెడ్యూలు ప్రకారం ఈ నెల 8 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా.. ఎట్టకేలకు ముందడుగు పడింది. ప్రతిబంధకంగా మారిన పలు అంశాల్లో స్పష్టత రావడంతో ఓ కొలిక్కి వచ్చింది. జిల్లాలో మొత్తం 50 ప్రాథమిక పాఠశాలలు మూతపడనున్నాయి. వీటిలో 25 స్కూళ్లలో ‘0’ విద్యార్థుల సంఖ్య ఉంది. 20 లోపు విద్యార్థులున్న మరో 25 స్కూళ్లను మూసివేయనున్నారు. 19 మందిలోపు విద్యార్థులు ఉండి కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల లేకపోతే అలాంటి స్కూళ్లను కొనసాగించనున్నారు. అలాగే 150 ప్రాథమికోన్నత పాఠశాలలు రద్దుకానున్నాయి. 6, 7 తరగతుల్లో 30 మందిలోపు విద్యార్థులు, 6,7,8 తరగతుల్లో 40 మంది విద్యార్థులున్న పాఠశాలలకు మంగళం పాడారు. అయితే 3 కిలోమీటర్ల పరిధిలో మరో స్కూల్ లేకపోతే వాటిని కొనసాగించనున్నారు. ఇలా మరో 150 యూపీ పాఠశాలలు మూత పడకుండా కొనసాగనున్నాయి. ఇక ఉన్నత పాఠశాలలకు సంబంధించి 50 మందిలోపు విద్యార్థులున్న 4 పాఠశాలలు మూతపడనున్నాయి. అలాగే సక్సెస్ స్కూళ్లపైనా హేతుబద్ధీకరణ ప్రభావం పడింది. 50 మందిలోపు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులున్న ఉన్న 50 స్కూళ్లను తెలుగు మీడియం పాఠశాలల్లోకి విలీనం కానున్నాయి. మరో 8 సక్సెస్ స్కూళ్లు కూడా మూతపడాల్సి ఉన్నా... స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)లు తీర్మానాలు చేయడం వల్ల కొనసాగించాలని పట్టుపడుతున్నారు. అయితే ఆ 8 స్కూళ్లలో ఉపాధ్యాయ పోస్టులు కొనసాగించే వీలు లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పోస్టుల బదలాయింపుపై తెగని పేచీ మూతపడిన పాఠశాలల్లోని ఉపాధ్యాయ పోస్టుల బదలాయింపుల్లో పేచీ నెలకొంది. నిర్ధేశించిన కిలోమీటర్ల పరిధిలో ఇతర స్కూళ్లు ఉంటే తక్కువ విద్యార్థులున్న స్కూళ్లను అందులో విలీనం చేస్తారు. విద్యార్థులతో పాటు టీచర్లను అదే స్కూళ్లకు సర్దుతారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి నిర్ధేశించిన కిలోమీటర్ల పరిధిలో మరో స్కూల్ లేనిపక్షంలో తప్పనిసరిగా కొనసాగిస్తారు. ఉదాహరణకు ఓ స్కూల్లో 10 మంది విద్యార్థులుంటే నలుగురు టీచర్లు పని చేస్తుంటారు.. వారిలో ఎంతమందిని తీస్తారు, ఎక్కడికి పంపుతారనే దానిపై స్పష్టత మాత్రం లేదు. ముఖ్యంగా యూపీ స్కూళ్లలో ఈ సమస్య అధికంగా ఉంది. స్కూల్ అసిస్టెంట్లను బయటకు పంపి అక్కడ ఎస్జీటీలనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. అయితే అధికారులు మాత్రం దీనిపై స్పష్టత కోసమే ప్రభుత్వానికి లేఖ రాశామని పైకి చెబుతున్నారు. -
సబ్ ట్రెజరీల్లో రేషనలైజేషన్
మారుతున్న పరిధులు ఇంతవరకూ విద్యాశాఖలో అమలు చేసిన రేషనలైజేషన్ ఇప్పుడు ట్రెజరీల పరమైంది. దీంతో సబ్ ట్రెజరీల పరిధిలోని మండలాలను మార్పు చేశారు. దీనివల్ల సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని, ప్రజలకు మరింత అందుబాటులోకి ట్రెజరీ సేవలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. రాయవరం (మండపేట): ఖజానా శాఖలో రేషనలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం జీఓ-65ను ప్రభుత్వం గత నెల 25న విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లాలో ఉన్న సబ్‌ట్రెజరీల పరిధిలో ఉండే మండలాలను మార్పు చేశారు. కొన్ని సబ్‌ట్రెజరీల పరిధిలోని మండలాలను యధాతథంగా ఉంచగా, మరికొన్నింటిలోని మండలాలను సమీపంలోని సబ్‌ట్రెజరీలకు బదిలీ చేశారు. దీని వల్ల ఖజానా సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయని, సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త జీఓ ప్రకారం డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ (డీడీవో)లు, గ్రామ పంచాయతీలు ఒక సబ్‌ట్రెజరీ పరిధిలోకి వస్తారు. జిల్లాలో కాకినాడ కేంద్ర సబ్ట్రెజరీతో కలిపి 20 సబ్‌ట్రెజరీలు ఉన్నాయి.............. సబ్‌ట్రెజరీల పరిధిలోని మండలాలను యధాతథంగా ఉంచి, మిగిలిన సబ్‌ట్రెజరీల పరిధిలోని మండలాలను మార్పు చేశారు. రేషనలైజేషన్ కారణంగా రాయవరం సబ్‌ట్రెజరీ కార్యాలయం రామచంద్రపురంలో కలుస్తుంది. ఇక్కడి సిబ్బందిని రావులపాలెం సబ్‌ట్రెజరీకి బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాయవరం సబ్‌ట్రెజరీలో కేవలం రాయవరం మండలం మాత్రమే ఉంది. రాయవరం సబ్‌ట్రెజరీలో రాయవరం, అనపర్తి, బిక్కవోలు మండలాలు ఉండగా గతంలోనే అనపర్తి, బిక్కవోలు మండలాలకు అనపర్తిలో సబ్ట్రెజరీని ఏర్పాటు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే.. పరిపాలనా సౌలభ్యం కోసమే సబ్‌ట్రెజరీల రేషనలైజేషన్ జరుగుతోంది. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మారుతున్న సబ్‌ట్రెజరీల స్వరూపంపై డీడీవోలు, గ్రామ పంచాయతీలకు సమాచారం ఇస్తున్నాం. వారి వద్ద నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నాం. -పీవీ భోగారావు, జిల్లా ట్రెజరీ అధికారి, కాకినాడ -
హేతుబద్ధీకరణ విరమించుకోవాలి
విద్యారణ్యపురి : ప్రభుత్వం ఉపాధ్యాయులు, పాఠశాలల హేతుబద్ధీకరణ చేపట్టాలనే యోచనను విరమించుకోవాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర కార్యదర్శి ఎస్.సదానంద్ డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండలోని ప్రభుత్వ మార్కజీ హైస్కూల్లో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈవిద్యాసంవత్సరంలో విద్యార్థుల నమోదు పెరిగిందన్నారు. ఈ క్రమంలో రేషనలైజేషన్ చేస్తే ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారడం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో డైట్ కళాశాల, బీఈడీ కళాశాలలో, డిప్యూటీ డీఈవో, ఎంఈవో, కార్యాలయాల్లో ఇంకా పనిచేస్తున్న టీచర్ల డిప్యూటేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, జిల్లా కోశాధికారి ఎం.సదాశివరెడ్డి, సీహెచ్.రవీందర్‌రాజు, ఎ.విద్యాదేవి, కె.కళ, పెండెం రాజు, కుమారస్వామి, రమేష్, లింగారావు, సత్యనారాయణ, సృజన్ప్రసాద్ పాల్గొన్నారు. -
హేతుబద్ధీకరణ సరికాదు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: ఆగస్టు నెలలో రేషనలైజేషన్ చేయాలనే విద్యాశాఖ నిర్ణయం సరికాదని ఏఐటీఓ సెక్రటరీ జనరల్ పి.వెంకట్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10మంది విద్యార్థులున్న పాఠశాలలను విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తర్వాత ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని, కొన్ని పాఠశాలలను మూసి వేయాలని నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు విద్యకు దూరమై డ్రాపౌట్స్ పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం రేషనలైజేషన్ చేస్తూపోతే ప్రభుత్వ పాఠశాలలు మూతపడతాయని, ప్రైవేటు పాఠశాలలు బలోపేతమవుతాయని తెలిపారు. ప్రజాప్రతినిధులు గ్రామాల్లోని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేరే విధంగా ప్రోత్సహించాలని కోరారు. -
లెక్కలేత్తాండ్రు
టీచర్లకు రేషనలైజేషన్ గండం వివరాల సేకరణలో విద్యా శాఖ త్వరలో ఉపాధ్యాయులకు స్థానచలనం ఖమ్మం : విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని.. అలా లేని పాఠశాలల వివరాలు.. విద్యార్థుల సంఖ్యకు మించి ఉన్న టీచర్ల వివరాలు ఇవ్వాలని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు.. జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ కోసం జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్యను లెక్కిస్తున్నారు. ఎక్కువగా ఉన్న ఉపాధ్యాయుల సంఖ్యను లెక్కించడంతోపాటు ఎక్కువ మంది టీచర్లు పనిచేస్తున్న పాఠశాలల వివరాలను కూడా సేకరిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అధికంగా.. ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా.. పట్టణం, పరిసరాల్లో ఉన్న పాఠశాలల్లో విద్యార్థులు తక్కువ.. ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నట్లు అధికారులు సేకరించిన సమాచారం ద్వారా తెలిసింది. దీంతో మరోసారి వివరాలు సేకరించి.. తుది జాబితా అందజేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 142 మంది టీచర్లకు స్థానచలనం సేకరిస్తున్న వివరాల ప్రకారం.. 142 మంది ఉపాధ్యాయులకు తాము పనిచేస్తున్న పాఠశాలల నుంచి స్థానచలనం తప్పేట్టు లేదని విద్యాశాఖ అధికారులు 2,059 ఖాళీలు ఉన్నాయి. పలు పాఠశాలల్లో 261 మంది ఉపాధ్యాయులు అవసరం ఉన్న చోట లేకపోగా.. 16 మంది ఉపాధ్యాయులు విద్యార్థుల సంఖ్యకు తగినట్లు కాకుండా అధికంగా పనిచేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని లోకల్‌బాడీ పాఠశాలల్లో 3,782 మంది ఉపాధ్యాయులకు.. 3,315 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 465 ఖాళీలుండగా.. ఇందులో 350 మంది ఉపాధ్యాయులు తక్కువగాను.. 10 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన సంఖ్యకంటే ఎక్కువగా ఉన్నారు. మైదాన ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 67 మంది, ఏజెన్సీ ప్రాంతంలో 49 మంది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కాకుండా ఎక్కువగా ఉపాధ్యాయులు ఉన్నట్లు అధికారులు లెక్కలు సేకరించారు. గిరిజన ఆవాస ప్రాంతాలు, పట్టణాలకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ఉండాల్సిన ఉపాధ్యాయులకంటే.. 521 మంది ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారని, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, మణుగూరు, భద్రాచలం, మధిర, వైరా వంటి పట్టణ ప్రాంతాలు, సమీపంలోని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లేకపోయినా 142 మంది ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఈ వివరాల ప్రకారం రేషనలైజేషన్‌లో 142 మంది ఉపాధ్యాయులు తాము పనిచేస్తున్న పాఠశాలల నుంచి మరోచోటుకు వెళ్లక తప్పదని అధికారులు అంటున్నారు. ఇలా ప్రతి 30 మందికి ఒక్కో ఉపాధ్యాయుడు పెరుగుతారు. అలాగే 151 నుంచి ప్రతి 30 మంది విద్యార్థుల పెరుగుదలకు ఎస్జీటీతోపాటు ఒక ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ పోస్టు ఉంటుంది. ఇలా 211 నుంచి 245 మంది విద్యార్థులుంటే.. మ్యాథ్స్ 3, సోషల్, ఇంగ్లిష్ ఒక్కొక్కటి, ఎల్పీ1-2, ఎల్పీ2-1.. మొత్తం 8 పోస్టులు. 246 నుంచి 280 మంది విద్యార్థులుంటే.. మ్యాథ్స్ 3, సోషల్-2,ఇంగ్లిష్ 1, ఎల్పీ1-2, ఎల్పీ2-1.. మొత్తం 9 పోస్టులు. 281 నుంచి 315 వరకు మ్యాథ్స్ 4,సోషల్ 2, ఇంగ్లిష్ 1, ఎల్పీ1-2, ఎల్పీ2-1.. మొత్తం 10. 316 నుంచి 350 వరకు మ్యాథ్స్ 4, సోషల్ 2, ఇంగ్లిష్ 1, ఎల్పీ 4.. మొత్తం 11 పోస్టులు. 351 నుంచి 385 మంది విద్యార్థులకు మ్యాథ్స్ 5, సోషల్ 2, ఇంగ్లిష్ 1, ఎల్పీ 4.. మొత్తం 12 మంది ఉపాధ్యాయులుంటారు. హైస్కూళ్లు(6 నుంచి 10 వరకు) 220 మంది విద్యార్థులకు ఒక హెచ్ఎం, మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, ఇంగ్లిష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్, పీఈటీ ఒక్కొక్కరు చొప్పున 9 మంది ఉపాధ్యాయులు. 221 నుంచి 250 వరకు అన్ని ఎస్ఏ పోస్టులతోపాటు మ్యాథ్స్ ఇద్దరు, 251 నుంచి 280 మంది విద్యార్థులకు మిగతా వాటితోపాటు మ్యాథ్స్, ఇంగ్లిష్‌కు ఇద్దరు ఎస్ఏలు ఉంటారు. 281 నుంచి 310 వరకు విద్యార్థులుంటే.. మిగతా ఉపాధ్యాయులతోపాటు మ్యాథ్స్ 2, ఇంగ్లిష్ 2, సోషల్ 2.. ఇలా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉంటే స్కూల్ అసిస్టెంట్ల సంఖ్యను కూడా పెంచనున్నారు. -
మే నెలలో టీచర్ల హేతుబద్ధీకరణ!
♦ కసరత్తు చేస్తున్న విద్యాశాఖ ♦ నెలాఖరుకల్లా ప్రక్రియను ముగించేందుకు ప్రణాళికలు ♦ ఆ తరువాతే టీచర్ల భర్తీకి చర్యలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై విద్యాశాఖ దృష్టి సారించింది. ఈనెల చివరి వారంలో ప్రక్రియ ప్రారంభించి మే నెలాఖరుకల్లా పూర్తి చేయాలని భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యార్థుల్లేని స్కూళ్లను కొనసాగించడం విద్యాశాఖకు భారంగా మారింది. విద్యార్థులు తక్కువున్న స్కూళ్లలో ఎక్కువ టీచర్లు ఉండటం, ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట తక్కువ మంది టీచర్లు ఉండటం నాణ్యమైన విద్యకు ప్రధాన ఆటంకంగా మారింది. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. అలాగే ఒక్కో గ్రామంలో ఉన్న ఐదారు స్కూళ్లను విలీనం చేసి, ఒకే స్కూల్‌ను కొనసాగించడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు, ఎక్కువ మంది టీచర్లను ఇచ్చి నాణ్యమైన విద్యా బోధన అందించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నిర్వహించిన సమీక్ష సమావేశంలోనూ వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆ తరువాత ఏర్పడే ఖాళీల సంఖ్యను బట్టి టీచర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని అనేక పాఠశాలల్లో విద్యార్థులు ఉన్నా టీచర్లు లేరు.. విద్యార్థులు లేని చోట టీచర్లు ఉన్నారు. 4 వేల వరకు పాఠశాలల్లో 20 మందిలోపే విద్యార్థులు ఉండగా. వాటిల్లో అధిక సంఖ్యలో టీచర్లు ఉన్నారు. మరోవైపు ఒకే గ్రామంలో ఐదారు స్కూళ్లు కొనసాగతున్నవి వందల సంఖ్యలో గ్రామాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కో గ్రామంలో ఒక్కటే స్కూల్ ఉండేలా విధానాన్ని రూపొందించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. కాగా, పాఠశాలల హేతుబ ద్ధీకరణ చేస్తున్నారంటే చాలు కొంత మంది ఉపాధ్యాయులు తమ పోస్టులు ఎక్కడ పోతాయోనని తప్పుడు లెక్కలు చూపించడం పరిపాటిగా మారింది. దీంతో ఇలాంటి తప్పిదాలకు ఈసారి చెక్ పెట్టేలా ఏర్పాట్లు చేయాలని యోచిస్తున్నారు. హేతుబద్ధీకరణ తరువాతే టీచర్ల భర్తీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు వచ్చే నాటికి టీచర్ల హేతుబద్ధీకరణను పూర్తి చేస్తామని, ఆ తరువాత ఉపాధ్యాయ నియామకాలకు చర్యలు చేపడతామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 1న జరిగే టెట్ ఫలితాలను మే 10 -13 తేదీల మధ్య ప్రకటించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల హేతుబద్ధీకరణ తర్వాత ఏర్పడే ఖాళీల్లో టీచర్లను నియమించేందుకు అవసరమైన చర్యలను వేగంగా చేపట్టవచ్చని భావిస్తున్నారు. -
హేతుబద్ధీకరణతోనే మేలు
♦ విద్యా విధానంపై చర్చలో కడియం ♦ గ్రామ పంచాయతీకి ఒకే ప్రాథమిక పాఠశాల ♦ చుట్టు పక్కల స్కూళ్లను అందులో విలీనం చేస్తాం ♦ విద్యార్థుల రవాణా బాధ్యత ప్రభుత్వానిదే.. ♦ త్వరలో డీఎస్సీ ప్రకటన.. ♦ వర్సిటీల్లో వీసీలు, చాన్స్లర్లను నియమిస్తాం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణతోనే ఉపయోగమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టంచేశారు. ‘‘అసలే విద్యార్థులు లేనివి, 10 మంది, 20 మంది లోపు విద్యార్థులున్న పాఠశాలలూ ఉన్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీలోని గ్రామాలు, జన ఆవాసాలు, తండాల్లో 4,5,10 వరకు ప్రాథమిక పాఠశాలలున్నాయి. ఈ బడులన్నింటినీ ఒకే ప్రాథమిక పాఠశాల లో విలీనం చేస్తాం. పరిపాలన సౌలభ్యంతో సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయలు ఉంటారు. బడులను మూసివేసే ప్రయత్నం కాదు.. బడుల సంరక్షణకే ఈ ఆలోచన. చుట్టు పక్కల తండాలు, గ్రామాల నుంచి విద్యార్థులను ప్రాథమిక పాఠశాలకు చేర్చే బాధ్యతలను అవసరమైతే ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్టీసీతో మాట్లాడి పాఠశాలల వేళల్లో విద్యార్థులకు రవాణా ఏర్పాట్లు చేస్తుంది. విద్యార్థులకు ఇబ్బంది కలగకుం డానే హేతుబద్ధీకరణ జరుగుతుంది’’ అని ఆయన ప్రకటించారు. విద్యా విధానంపై బుధవారం అసెం బ్లీలో జరిగిన చర్చలో అధికార, విపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలకు కడియం సమాధానమిచ్చారు. త్వ రలో డీఎస్సీని ప్రకటిస్తామన్నారు. ఒక ప్రాథమిక పా ఠశాలలో 100 మంది విద్యార్థులు, ఐదారు మంది ఉపాధ్యాయులు ఉంటేనే బాగుంటుందన్నారు. 6,7వ తరగతులను బోధించేందుకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లు లేక ఆ పాఠశాలల పరిస్థి తి నిరాశజనకంగా మారిందన్నారు. ప్రాథమికోన్నత బడుల నుంచి 6,7 తరగతులను వేరు చేసి ఉన్నత పాఠశాలలకు బదిలీచేసే ఆలోచన ఉందన్నారు. మూడు నెలల్లో నివేదిక నూతన విద్యావిధానంపై నిపుణులతో కమిటీ వేసి మూడు నెలల్లో నివేదిక తెప్పించుకుంటామని కడియం చెప్పారు. విద్యా రంగానికి నిధుల కొరత ఉండదని, అవసరమైతే ప్రత్యేక నిధి నుంచి నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరణను పరిశీలిస్తామని వివరిం చారు. కొత్త ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలకు పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామన్నారు. 2,753 అధ్యాపకుల పోస్టుల్లో 1,149 మంది మాత్రమే పనిచేస్తున్నారన్నారు. ఉస్మానియా వర్సిటీలోని 80 శాతం ప్రొఫెసర్లు 2018 నాటికి పదవీ విరమణ చేస్తారని, ఆలోగా నియామకాలు చేయకపోతే వర్సిటీ న్యాక్ గుర్తింపును సైతం కోల్పోయే ప్రమాదముందన్నారు. త్వరలోనే వర్సిటీల్లో చాన్స్లర్లు, వైస్ చాన్స్లర్లను నియమిస్తామని చెప్పారు. 2016-17 బడ్జెట్ కేటాయింపుల్లో ప్రణాళిక రంగానికి కేటాయించిన రూ.1,600 కోట్లను ప్రస్తుత విద్యా వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకే వినియోగిస్తామని కడియం చెప్పారు. -
విద్యా శాఖ ఉరుకులు..పరుగులు
► తాజా లెక్కల ప్రకారమే.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యా శాఖ చర్యలు ► పనిలో పనిగా రేషనలైజేషన్ ప్రక్రియ కూడా.. ► విద్యార్థులు - ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం పోస్టులు ► జిల్లాల వారీగా ఖాళీలపై ఈ నెల 7 నాటికి స్పష్టత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా జిల్లాలవారీగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి విద్యా శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల సేకరించిన క్షేత్ర స్థాయి(డైస్ డాటా) సమాచారం ఆధారంగా హేతుబద్ధీకరణ చేస్తోంది. తద్వారా పాఠశాలలకు అవసరమైన పోస్టులను భర్తీ చేసేలా కసరత్తు చేస్తోంది. గత శనివారం జరిగిన కేబినెట్ సమావేశంలో 15,628 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలోని స్కూళ్లలో 10,927 ఉపాధ్యాయ పోస్టులు, మరో 1,215 ఉర్దూ మీడియం పోస్టులు ఉన్నట్లు తెలిసింది. అయితే గతంలో సేకరించిన డైస్ డాటా ప్రకారం విద్యా శాఖ ఈ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చింది. గతంలో హైకోర్టుకు కూడా ఇవే లెక్కలు చూపించింది. అయితే తాజా డీఎస్సీ నోటిఫికేషన్లో మాత్రం తాజా లెక్కల ప్రకారం విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టేలా కసరత్తు చేస్తోంది. పనిలో పనిగా హేతుబద్ధీకరణ కూడా చేస్తోంది. ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఉన్న పాఠశాలల సంఖ్య, వాటిలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం ఉన్న టీచర్లు, అదనంగా అవసరమైన టీచర్ల సంఖ్యను తేల్చే చర్యలు చేపట్టింది. మరోవైపు అదనంగా సబ్జెక్టు టీచర్లు అవసరమని కూడా భావిస్తోంది. ఉన్నత పాఠశాలల్లో కనీస విద్యార్థుల సంఖ్యను తీసుకుని ఒక్కో స్కూల్లో ఉండాల్సిన పోస్టులను తేల్చే పనిలో నిమగ్నమైంది. తద్వారా ఖాళీగా ఉన్న సబ్జెక్టు టీచర్ పోస్టులతోపాటు అదనంగా కొన్ని సబ్జెక్టు టీచర్ పోస్టులను సృష్టించాల్సి వస్తుందన్న భావన నెలకొంది. మరోవైపు మీడియం వారీగా స్కూళ్లపైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో ప్రస్తుతం ఉన్న టీచర్ల పరిస్థితిపైనా లెక్కలు తీసుకుంది. చాలా స్కూళ్లలో సబ్జెక్టు టీచర్ల కొరత ఉన్నట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలోని 2 వేలకుపైగా ఇంగ్లిష్ మీడియం సక్సెస్ స్కూళ్లకు సబ్జెక్టు టీచర్లను ఇచ్చే అంశంపైనా దృష్టి పెట్టింది. రేషనలైజేషన్‌లో భాగంగా అర్హతలు ఉన్న టీచర్లను ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు పంపేలా కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా ఈ ప్రక్రియ మరో రెండు మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నెల 7 నాటికల్లా జిల్లాలవారీగా, కేటగిరీలవారీగా, మీడియంవారీగా ఖాళీలపై పూర్తిస్థాయిలో స్పష్టత వస్తుందని విద్యా శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. కొత్త రోస్టర్ కమ్ రిజర్వేషన్! కొత్తగా రాష్ట్రం ఏర్పడినందునా ఉపాధ్యాయ నియామకాల్లో కొత్త రోస్టర్ కమ్ రిజర్వేషన్ విధానాన్ని అవలంభించాలని విద్యాశాఖ భావిస్తోంది. ప్రభుత్వం కూడా కొత్త రోస్టర్ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టాలని సూచించడంతో అధికారులు దానిపై దృష్టిసారించారు. సాధారణంగా పాత రోస్టర్ కమ్ రిజర్వేషన్‌ను అమలు చేస్తే.. ఒక కేటగిరీ పోస్టుల భర్తీలో గతంలో ఏ రోస్టర్ పాయింట్ వద్ద(వంద పాయింట్లలో) ఏ రిజర్వేషన్ అభ్యర్థికి పోస్టింగ్ ఇచ్చారో.. ఆ తర్వాత పాయింట్లో ఏ రిజర్వేషన్ అభ్యర్థికి కొత్తగా పోస్టింగ్ ఇవ్వాలనేది నిర్ణయించి నియామకాల్లో రిజర్వేషన్లను అమలు చేస్తారు. అయితే ఇకపై రోస్టర్ పాయింట్‌ను 1 నుంచే ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. -
7 వేల టీచర్ పోస్టులకు కోత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా ఉద్యోగాలివ్వడం మాట అటుంచి ఉన్న పోస్టులకూ ప్రభుత్వం ఎసరు పెడుతోంది. ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) ఫలితాలు విడుదలై నెలలు దాటుతున్నా నియామకాలు చేపట్టని ప్రభుత్వం.. అంతకుముందే రేషనలైజేషన్ పేరిట ఏడువేలకుపైగా సెకండరీగ్రేడ్ టీచర్(ఎస్జీటీ) పోస్టులకు కోత పెట్టబోతోంది. జిల్లాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికే దీనిపై కసరత్తు పూర్తిచేశారు. రేషనలైజేషన్‌లో భాగంగా.. పాఠశాలల రేషనలైజేషన్‌లో భాగంగా కిలోమీటర్ పరిధిలో 30 మందికన్నా తక్కువమంది ఉన్న ప్రాథమిక పాఠశాలల్ని ఇతర పాఠశాలల్లో విలీనం చేస్తున్నారు. అలా దాదాపు 3,500కుపైగా పాఠశాలల్ని ఇతర పాఠశాలల్లో విలీనం చేయాలని భావించారు. రాజకీయ నేతలనుంచి అభ్యంతరాలొచ్చిన నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ కాలనీలు, రైల్వేట్రాక్‌లు, వాగులు, నదులు దాటి వెళ్లాల్సినచోట మినహాయిస్తున్నారు. అయినప్పటికీ మూతపడే స్కూళ్ల సంఖ్య 2 వేలకుపైగానే. ఫలితంగా పలు విలీన స్కూళ్లల్లోని టీచర్ పోస్టులు మిగులు పోస్టులుగా మారుతున్నాయి. ఆ మేరకు ప్రతి జిల్లాలో వందలాది ఎస్జీటీపోస్టులు అదనంగా ఉన్నట్లు తేల్చారు. ఉదాహరణకు రాష్ట్రంలో అతిచిన్న జిల్లా అయిన విజయనగరం జిల్లాలో 441 ఎస్జీటీ పోస్టులు మిగులు ఉన్నట్లుగా చూపించారు. సీఎం చంద్రబాబునాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరులో 877 పోస్టులు, కృష్ణా జిల్లాలో 720 పోస్టులు, కర్నూలులో 234.. ఇలా ప్రతి జిల్లాలో సగటున 500 వరకు ఎస్జీటీ పోస్టులు అదనంగా ఉన్నట్లు లెక్కగట్టారు. ఈ పోస్టులన్నిటికీ కోతపెడుతున్నారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 7వేలకుపైగా టీచర్‌పోస్టులు రద్దు కానున్నాయి. కోత పెరిగే చాన్స్.. ఏడు వేల టీచర్ పోస్టుల లెక్క కేవలం పంచాయతీరాజ్ పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ప్రైమరీ తరగతుల వరకు మాత్ర మే.మున్ముందు జెడ్పీ ఉన్నత పాఠశాలల్లోని పోస్టుల్నీ రేషనలైజేషన్ చేస్తే కోత పెరగనుంది. మున్సిపల్, ప్రభుత్వ ఎయిడెడ్, విభాగాల స్కూళ్లూ కలిపితే ఒక్క విద్యాశాఖలోనే 10 వేలకుపైగా పోస్టులు మిగులు జాబితాలో చేరిపోనున్నాయి. ఉపాధ్యాయ సంఘాల ఆందోళన.. తాజా వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. మిగులు పోస్టుల్లో ఉన్న టీచర్లను ఇతర శాఖల్లోకి మళ్లించే ప్రమాదముందని భయపడుతున్నాయి. పంచాయతీరాజ్‌శాఖ పరిధి స్కూళ్లలోని అదనపు టీచర్లను పంచాయతీ కార్యదర్శులుగా నియమించే యోచనుందని, దీనిపై నివేదిక సమర్పించాలని ఆ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు అధికారుల్ని ఆదేశించడం గమనార్హం. ఈ పరిణామాలు అందరిలో కలకలం రేపుతున్నాయి. -
8 వేల స్కూళ్లకు మంగళం
* రేషనలైజేషన్‌తో విలీనం కానున్న ప్రాథమిక పాఠశాలలు * యూపీ, హైస్కూళ్లకూ హేతుబద్ధీకరణ ముప్పు * గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి * 8న టీచర్ల బదిలీల షెడ్యూల్? సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు ముందు పాఠశాలలను హేతుబద్ధీకరించాలన్న ప్రభుత్వ ఆలోచనతో రాష్ట్రంలోని ఎనిమిది వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జాబితాను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హేతుబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైల్‌పై సంతకం చేయగానే స్కూళ్లు మూతపడనున్నాయి. ఇందులో ఇప్పటికిప్పుడు విలీనం చేసే పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలుగా మార్పు చేసేందుకు వీలుగా ఉన్న పాఠశాలల జాబితాను ఫార్మాట్-ఏలో చూపించారు. ఫార్మాట్- బీలో మలిదశ విలీన పాఠశాలలను చూపించింది. ఇలా ప్రభుత్వ, ఎంపీపీ స్కూళ్లకు ఒక ప్రతిపాదనను, మున్సిపల్ స్కూళ్లకు మరో ప్రతిపాదనను సిద్ధం చేశారు. తొలిదశ విలీన జాబితాలో ప్రభుత్వ, ఎంపీపీ పాఠశాలలు 4,854 ఉండగా 507 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. మలిదశ జాబితాలో ప్రభుత్వ, ఎంపీపీ పాఠశాలలు 2,762 ఉండగా, మున్సిపల్ పాఠశాలలు 95 ఉన్నాయి. తొలిదశలో ఆదర్శ పాఠశాలలుగా మారే స్కూళ్లు ప్రభుత్వ, ఎంపీపీ విభాగంలో 3,544, మున్సిపాలిటీల్లో 355గా ఉన్నాయి. మలిదశలో ప్రభుత్వ, ఎంపీపీ విభాగంలో 1,353 మున్సిపాలిటీల్లో 46గా ఉన్నాయి. హేతుబద్ధీకరణను కేవలం ప్రాథమిక పాఠశాలలకే పరిమితం చేయరాదని, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలనూ రేషనలైజేషన్ పరిధిలోకి ఇప్పుడే తీసుకువస్తే మంచిదని ప్రభుత్వంలోని పెద్దలు అధికారులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను రేషనలైజేషన్లోకి తీసుకువస్తే అనేక సమస్యలు ఎదురవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందు ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని పూర్తిచేశాక తదుపరి దశలో మిగతా పాఠశాలలకు హేతుబద్ధీకరణ చేపట్టవచ్చని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. హేతుబద్ధీకరణలో విలీనమయ్యే పాఠశాలల జాబితాను సిద్ధం చేసినందున మంత్రి దానిపై సంతకం చేసిన వెంటనే ఈ నెల 8వ తేదీన టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. బదిలీల వెబ్ కౌన్సెలింగ్‌పై అనుమానాల నివృత్తికి ఈ నెల 7వ తేదీన నమూనా వెబ్ కౌన్సెలింగ్‌ను ఆయా యూనియన్ ప్రతినిధుల ముందు నిర్వహించనున్నారు. అంతకు ముందు పాఠశాలల విలీన ప్రక్రియకు జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ అంశాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు. -
కటాఫ్ జూలై 1
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలు, హేతుబద్ధీకరణకు సంబంధించిన మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ చిరంజీవులు సోమవారం విడుదల చేశారు. బదిలీలకు జూలై 1వ తేదీని కటాఫ్‌గా తీసుకోవాలని, ప్రతి పాఠశాలలో కనీసం ఒక టీచర్ ఉండేలా హేతుబద్ధీకరణ చేపట్టాలని అందులో పేర్కొన్నారు. బదిలీల కోసం టీచర్లు దరఖాస్తు చేసుకునేందుకు గడువును జూలై 1 వరకు పొడిగించారు. ఈ విషయాన్ని సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో డీఈవోలకు తెలియజేశారు. మార్గదర్శకాలు.. 1. హేతుబద్ధీకరణలో గుర్తించిన అదనపు ఎస్జీటీ పోస్టులను ఏకోపాధ్యాయ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు ఆధారంగా అవరోహణ క్రమంలో కేటాయించాలి 2. ప్రాథమిక పాఠశాలల్లో సర్దుబాటు కాగా మిగిలిన ఎస్జీటీ పోస్టులను ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ లేదా పండిట్ల స్థానంలో కేటాయించాలి 3. ఉన్నత పాఠశాలల్లో సర్దుబాటు చేయగా మిగిలిన స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇటీవల అప్‌గ్రేడై పోస్టులు మంజూరవని పాఠశాలలకు కేటాయించాలి. ఇంకా మిగిలితే ప్రాథమికోన్నత పాఠ శాలలకు, తర్వాత అధికంగా విద్యార్థులున్న పాఠశాలలకు ప్రాధాన్యత క్రమంలో కేటాయించాలి 4. స్కూల్ అసిస్టెంట్ (లాంగ్వేజ్) లేకుంటే భాషా పండితుల పోస్టులనే కొనసాగించాలి 5. ఉన్నత పాఠశాలలకు సరిపడినంత మంది సబ్జెక్ట్ టీచర్లను ఇవ్వలేనపుడు అక్కడి ఎస్జీటీ పోస్టులను అక్కడే కొనసాగించాలి 6. ప్రాథమికోన్నత పాఠశాలల్లోని ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం పోస్టును ప్రాథమిక పాఠశాలలకు తరలించాలి 7. హెచ్ఆర్ఏలో మార్పుల వల్ల స్కూళ్ల కేటగిరీలు మారితే ఆ దామాషాలోనే ఉపాధ్యాయులకు పాయింట్లను లెక్కించాలి 8. సక్సెస్ స్కూళ్లగా మారిన బాలికోన్నత పాఠశాలలు కో-ఎడ్యుకేషన్‌గానే మార్చాలి. 9. భాషలు మినహా మిగతా ఉపాధ్యాయులందరికీ బదిలీల కౌన్సెలింగ్‌ను మీడియంవారీగా నిర్వహించాలి 10. ఆన్లైన్లో నమోదు చేయని దరఖాస్తులను అంగీకరించరు 11. బదిలీలకు ఖాళీలు చూపి, టీచర్లు చేరే సమయంలో ఖాళీలు లేవని పేర్కొంటే బాధ్యులపై క్రమశిక్షణ చర్యలుంటాయి 12. పాఠ్యపుస్తకాల రచయితలను రాష్ట్రస్థాయి రిసోర్స్ పర్సన్లుగా గుర్తించి పాయింట్లు కేటాయించాలి 13. సెప్టెంబర్ 5న జాతీయ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు పొందిన వారికే అవార్డు పాయింట్లివ్వాలి 14. గతేడాది డైస్లో విద్యార్థుల సంఖ్య పొరపాటుగా నమోదై ఉంటే హాజరు రిజిస్టర్లు, వార్షిక పరీక్షాపత్రాలను డీఈవోలు పరిశీలించి డీఎస్‌ఈకి నివేదించాలి 15. ఏజెన్సీ ప్రాంతంలో పదోన్నతులను జీవో నంబరు 3 ప్రకారం ఇవ్వాలి 16. ప్రతి స్కూల్లో కనీసం ఒక రెగ్యులర్ ఉపాధ్యాయుడుండేలా చూడాలి 17. 2011లో అదనంగా ఉన్న ఫిజికల్ సైన్స్ టీచర్లను గణితం బోధనకు తరలించారు. ప్రస్తుతం ఆ స్కూళ్లకు గణితం పోస్టు అవసరమైతే అక్కడ వారినే కొనసాగించాలి 18. అదనంగా ఉన్నట్లు తేలి ఖాళీగా ఉన్న ఎస్జీటీ పోస్టులను డీఈవో కార్యాలయంలో రిజర్వ్ చేయాలి. వాటిని తదుపరి పాఠశాలలకు ప్రాధాన్యత ఇవ్వాలి 19. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైతే సమీప స్కూలును కోరుకోవాలి. ఇద్దరూ టీచర్లై తప్పనిసరిగా బదిలీ అవుతుంటే ఒకరు ఎక్కడికైనా కోరుకోవచ్చు. రెండోవారు మాత్రం మొదట బదిలీ అయిన వారికి సమీపంలో కోరుకోవాలి 20. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపున్న ఆసుపత్రుల్లో చికిత్సకు సంబంధిత వైద్యులిచ్చిన ధ్రువపత్రాలను ప్రాధాన్యతా కేటగిరీ బదిలీలకు అనుమతించాలి 22. 610 జీవో ప్రకారం ఇతర జిల్లాలకు బదిలీ అయి రిలీవ్ కాకుండా కొనసాగుతున్న టీచర్లను ప్రస్తుత బదిలీల్లో అనుమతించాలి 23. బదిలీల కౌన్సెలింగ్ రోజు హాజరైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ఆన్‌డ్యూటీగా పరిగణించాలి 24. తప్పనిసరి బదిలీల్లో ఉండి కౌన్సెలింగ్‌కు హాజరవని టీచర్లు, హెచ్ఎంలను కౌన్సెలింగ్ తర్వాత మిగిలిపోయిన ఖాళీలకు బదిలీ చేయాలి 25. బదిలీ ఉత్తర్వులు పొందిన టీచర్లు వెంటనే రిలీవై మర్నాడే కొత్త స్కూళ్లలో చేరాలి. ఏవిధమైన వెయింటింగ్ పీరియడ్ ఇవ్వరు. -
త్వరలో హేతుబద్ధీకరణపై స్పష్టత!
► సీఎంతో సమావేశం కానున్న కడియం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత రానుంది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో చర్చించాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి భావిస్తున్నారు. ఈ మేర కు సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలిసింది. ఒకవేళ హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే అవే ఉంటాయి తప్ప పాఠశాలల హేతుబద్ధీకరణ ఉండదని, మూసివేత ఉండదని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో గురువారం విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య, పాఠశాల విద్యా డెరైక్టర్ చిరంజీవులుతో మంత్రి శ్రీహరి చర్చించారు. పదోన్నతులు, బదిలీలపై సీఎంతో చర్చించి శుక్రవారం లేదా శనివారం నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. -
టీచర్ల సర్దుబా(ట)టు పట్టేనా!
నెల్లూరు(విద్య) : విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించి, ఉపాధ్యాయుల కొరత లేకుండా ఆయా పాఠశాలలను సకాలంగా పనిచేసేలా చూసేందుకు తాత్కాలిక పద్ధతిపై సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ ముందడుగు వేస్తుందా లేదా అనే అనుమానాలు నెలకున్నాయి. ఈ ప్రక్రియ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహిస్తారా..? లేదా సీనియార్టీ జాబితా ఆధారంగా అవసరమైన చోటకు తాత్కాలికంగా నియామకాలు జరుగుతాయా అనే అంశంపై ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతోంది. ఉపాధ్యాయులను రేషనలైజేషన్‌లో సర్దుబాటు చేసేందుకు సీనియార్టీ జాబితాలను తయారు చేయాల్సి ఉంది. జిల్లాలో ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. జిల్లా స్థాయిలో సీనియార్టీ జాబితా లను తయారు చేసి దాని ద్వారా ఉపాధ్యాయులను దూర ప్రాంతాలకు బదిలీ చేస్తారా అని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. సర్దుబాటు చేసే క్రమంలో జిల్లా స్థాయిలోనే కాకుండా మండల స్థాయిలో సర్దుబాటు చేయాలని మరో వాదన వినిపిస్తుంది. జిల్లాలోని 4,313 పాఠశాలల్లో ఏ ఒక్క పాఠశాలలో విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి ఉపాధ్యాయులు లేరు. అడ్డంకిగా జీఓ 55 విద్యాహక్కు చట్టం ప్రకారం 19 మంది విద్యార్థులకు ఒక టీచర్, 35 మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్లు ఉండాలని నిబంధన ఉంది. ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి నుంచి 40 మందికి ఒక సెక్షన్ చొప్పున ఒక టీచర్‌ను ఇవ్వాలనే నిబంధన ఉంది. 40 మంది కంటే అధికంగా పిల్లలు ఉంటే మరో సెక్షన్‌ను మంజూరు చేసి మరో టీచర్‌ను ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇందుకు విరుద్ధంగా 2011 ఏప్రిల్‌లో ప్రభుత్వం జీఓ 55ను విడుదల చేసింది. ఈ జీఓ ప్రకారం ఉన్నత పాఠశాలలో ఆయా తరగతుల విద్యార్థుల సంఖ్యను కాకుండా పాఠశాలలో మొత్తం ఉన్న విద్యార్థుల సంఖ్యను ఆధారంగా చేసుకుని ఉపాధ్యాయులను కేటాయించాలనే నిబంధన విధించింది. విద్యాహక్కు చట్టానికి, జీఓ 55కు పొంతన లేకపోవడంతో ప్రస్తుతం సర్దుబాటు ప్రక్రియ సందిగ్ధంలో పడింది. జిల్లాలో నాలుగేళ్ల క్రితం రేషనలైజేషన్ ప్రక్రియతో బదిలీలు జరిగాయి. అప్పటిలో బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. సీనియార్టీ జాబితాను సిద్ధం కాకపోవడంతో ఈ ప్రక్రియ జరిగే పరిస్థితి కనిపించడంలేదు. విద్యార్థుల సంఖ్య ముఖ్యం పని సర్దుబాటు ప్రక్రియలో తరగతి గదిలో కచ్చితమైన విద్యార్థుల సంఖ్య ముఖ్యం. యు-డైస్ వివరాలు అందితే విద్యార్థుల సంఖ్య స్పష్టమవుతుంది. సీనియార్టీ జాబితాను పరిశీలించాల్సి ఉంది. ఈ రెండింటిపై స్పష్టత ఏర్పడితే ప్రభుత్వ నిబంధనల మేరకు వర్క్ అడ్జస్ట్మెంట్ చేయవచ్చు. -డి.ఆంజనేయులు, డీఈఓ -
డీఎస్సీ పోస్టులకు కోత
విశాఖ రూరల్: అనుకున్నట్టే జరిగింది. డీఎస్సీ పోస్టుల్లో ప్రభుత్వం కోత విధించింది. జిల్లా విద్యా శాఖ నోటిఫై చేసిన వాటి కంటే 131 పోస్టులను తగ్గించింది. 1056 పోస్టులను భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 232 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. సబ్జెక్టులు వారీ వివరాలు మాత్రం మరో రెండు, మూడు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. జిల్లాలో ఉపాధ్యాయల పోస్టుల ఖాళీల అధికంగా ఉన్నప్పటికీ తక్కువ సం ఖ్యలో భర్తీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో డీఎస్సీ అభ్యర్థుల్లో అసంతృప్తి నెలకొంది. జిల్లాలో 2500 పోస్టులు వరకు ఖాళీలు ఉన్నట్లు ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. అయితే రేషనలైజేషన్ చర్యలతో పోస్టులను కుదించి 1714 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో కూడా కోత విధిస్తూ విద్యా శాఖ అధికారులు 1187 పోస్టులను నోటిఫై చేస్తూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లో 131 పోస్టులను తగ్గిస్తూ 1056 పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. విద్యా శాఖ నోటిఫై చేసిన వాటిలో ఎస్జీటీలో 117 పోస్టులు, లాంగ్వేజ్ పండిట్లో 11, పీఈటీలో 3 పోస్టులను తగ్గించింది. ప్రస్తుతం భర్తీ చేయనున్న 1056 పోస్టుల్లో ఏజెన్సీలోనే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు 232 ఉండగా ప్రస్తుతం 824 పోస్టులు ఉన్నాయి. అయితే రోస్టర్ విధానం, సబ్జెక్టుల వారీ ఖాళీలు, ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో పోస్టుల వివరాలపై మరో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
బీఈ‘డీలా’..!
శ్రీకాకుళం: ఎంతో కాలంగా ఊరించి.. ఎట్టకేలకు ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ బీఈడీ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా సైన్స్ అభ్యర్థుల పూర్తిగా డీలా పడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మొత్తం 719 పోస్టులు నోటిఫై చేయగా వాటిలో 375 ఎస్జీటీ, 93 పండిట్, 21 పీఈటీ, 230 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో బయోలాజికల్, ఫిజికల్ సైన్స్ పోస్టులు ఒక్కటీ లేవు. గత డీఎస్సీల్లోనూ సైన్స్ అభ్యర్థులకు అరకొర పోస్టులే కేటాయిం చారు. ఈసారి అవి కూడా లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఇప్పటికే అభ్యర్థులు వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ తీసుకున్నా నిరుపయోగమేనంటున్నారు. మొదటి నుంచీ అదే తంతు టీడీపీ, ఆ ప్రభుత్వం డీఎస్సీకి సంబంధించి మొదటి నుంచీ గోడ మీద పిల్లి వాటం ప్రదర్శిస్తున్నాయి. ఎన్నికలకు ముందు ఆ తర్వాత ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలయ్యాయి. 2012 నుంచి డీఎస్సీ జరగలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి.. ఇప్పుడు తొమ్మిదివేల పైచి లుకు పోస్టులతో మినీ డీఎస్సీని ప్రకటించడం విమర్శలకు తావిస్తోంది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీలను అర్హులను చేస్తామని చెప్పిన ప్రభుత్వం, కేంద్రం అభ్యంతరం చెబుతోందన్న సాకుతో దానికీ నీళ్లొదిలేసింది. జిల్లాలో 98 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతి ప్రవేశపెట్టారు. మున్సిపల్ పాఠశాలలకు గత ప్రభుత్వం 1284 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేసింది. మోడల్ స్కూళ్లలో స్కూల్ అసిస్టెంట్స్థాయి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ డీఎస్సీలో నోటిఫై చేస్తే 500కుపైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం లభించేది. అలాగే అడహాక్ రూల్స్ ద్వారా ఎంఈవోలుగా పదోన్నతులు కల్పిస్తే రాష్ట్రవ్యాప్తంగా మరో 527 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉండేది. ఇలా ఖాళీలను భర్తీ చేయడం, కొత్త పోస్టులు మం జూరు చేయడం వంటివి చేస్తే డీఎస్సీలో 14 వేల పోస్టులను నోటిఫై చేసే అవకాశముండేది. బీఈడీలకు కూడా న్యాయం జరిగేది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చెప్పినట్లు 10,500 పోస్టులను కాకుండా వెయ్యికిపైగా పోస్టులను కుదించడం అభ్యర్థులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీల అభ్యర్థన మేరకు అదనంగా 1252 మున్సిపల్ టీచర్ పోస్టులను నోటిఫై చేస్తూ ప్రభుత్వం శుక్రవారం మరో జీవో జారీ చేసినా.. దీనివల్ల జిల్లా జరిగే మేలు స్వల్పమే. జిల్లాలో 15, 20 పోస్టులు మాత్రమే పెరుగుతాయి. జిల్లాల నుం చి రెండు రకాల వివరాలు తెప్పించుకున్న ప్రభుత్వం వాటిలో తక్కువ పోస్టులు ఉన్న వివరాలతో డీఎస్సీని నోటిఫై చేయడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. జిల్లాల స్థాయిలో రేషనలైజేషన్ జరపకుండానే జరిపినట్లు చెబుతోంది. విద్యాశాఖ రికార్డుల ప్రకారమే సుమారు 30వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలుస్తోంది. -
హేతుబుద్ధీకరణ!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘దున్నపోతు ఈనింది అంటే దొడ్లో కట్టెయ్యండి’ అనే వానాకాలం చదువులకు కేసీఆర్ సర్కార్ ఫుల్స్టాప్ పెడుతోంది. పక్కా ప్రణాళికతో అందుబాటులో ఉన్న విద్యా వనరులను హేతుబద్ధీకరణతో వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్కార్ శుక్రవారం అసెంబ్లీలోనూ ఓ ప్రకటన చేసింది. నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించింది. మరోవైపు విద్యార్థులు లేని పాఠశాలలను కిలోమీటర్ దూరంలోని మరో పాఠశాలలో కలిపి మెరుగైన వసతులు, నాణ్యమైన విద్య అందిస్తామని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వెల్లడించారు. దీంతో విద్యాశాఖ అధికారులు జిల్లాలో విద్యార్థులు లేని పాఠశాలలను గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్లేని ప్రాథమిక పాఠశాలలు 69 ఉన్నట్లు ఇప్పటికే గుర్తించారు. అధికారిక ఉత్తర్వులు అందిన వెంటనే ఈ పాఠశాలలను సమీప పాఠశాలల్లో విలీనం చేయడానికి అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 1,974 ప్రాథమిక పాఠశాలలు, 423 ప్రాథమికోన్నత పాఠశాలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 2.75 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఉమ్మడి రాష్ట్ట్రంలో ఉన్నప్పుడు అప్పటి ప్రభుత్వాలు పాఠశాలలకు ఇష్టానుసారంగా ఉపాధ్యాయుల కేటాయింపు చేశారు. సచివాలయంలో పని చేసే ఆంధ్రప్రాంత అధికారులు వారి పలుకుబడిని ఉపయోగించుకుని తమ భార్యలకు, బంధువులకు హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న పటాన్చెరు, రామచంద్రాపురం, తూప్రాన్, గజ్వేల్ మండలాల్లోని పాఠశాలల్లో పోస్టింగులు ఇప్పించుకున్నారు. ఫలితంగా కొన్ని పాఠశాలల్లో 20 మంది విద్యార్థులు ఉంటే 10 మంది టీచర్లు, ఇంకొన్ని పాఠశాలల్లో 5 మంది విద్యార్థులు లేకున్నా ముగ్గురు, నలుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు ఆ మేరకు లేరు. మరి కొన్ని పాఠశాలలకు పక్కా భవనాలు లేకపోగా, ఇంకొన్ని పాఠశాలల్లో నిరుపయోగంగా భవనాలు ఉన్నాయి. ఎస్ఎస్ఏ ఏం చెబుతోందంటే... సర్వశిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) నిబంధనల ప్రకారం పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. 21 నుంచి 60 లోపు విద్యార్థులుంటే ఇద్దరు టీచర్లు, 61 నుంచి 90 లోపు విద్యార్థులుంటే ముగ్గురు ఉపాధ్యాయులు, 91 నుంచి 120 లోపు విద్యార్థులు నలుగురు ఉపాధ్యాయులు, 120 నుంచి 150 లోపు విద్యార్థులుంటే 5 మంది టీచర్లు, హెడ్మాస్టర్ కూడా ఉండాలి. కానీ జిల్లాలో ఇది ఎక్కడా అమలు కావడం లేదు. అందువల్లే ప్రభుత్వం ఇపుడు హేతుబద్ధీకరణ ద్వారా విద్యావనరులపై అధ్యయనం చేసి మెరుగైన వసతులతో ప్రైవేటు బడుల కంటే మెరుగ్గా విద్యాబోధన జరిగేలా చర్యలు చేపట్టింది. 20 మంది కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను పరిగణలోకి తీసుకుంటే జిల్లాలో 225 ప్రాథమిక పాఠశాలు ఉన్నట్లు అంచనా. ఇక కిలోమీటర్ దూరాన్ని పరిగణలోకి తీసుకొని విలీనం చేస్తే మరికొన్ని పాఠశాలలు కూడా పోయే అవకాశం ఉంది. అయితే దీన్ని అంతసులువుగా ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించే అవకాశం లేదు కాబట్టి క్రమంగా హేతుబద్ధీకరించే అవకాశం ఉంది. -
‘సావిత్రి’ వద్దు
ఉపాధ్యాయుల కొరత తీర్చకపోతే పోరాటమే టిఎస్‌యూటీఎఫ్ దోమలగూడ: రేషనలైజేషన్ పేరు చెప్పి పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకపోవడం శోచనీయమని, ఉపాధ్యాయులను నియమించకపోతే పోరాటం తప్పదని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.నర్సిరెడ్డి, చావ రవిలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దోమలగూడలోని యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలల్లో స్వీపర్, అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. తక్షణమే సర్వీస్ రూల్స్ రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి సిలబస్, పరీక్షల విధానం మారిందని గుర్తు చేశారు. వీటిపై ఉపాధ్యాయులకు అవగడాహన కల్పించాలని, మారిన పాఠ్యపుస్తకాలపై శిక్షణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్స్ సౌకర్యం కల్పించాలన్నారు. 10వ పీఆర్సీని వెంటనే అమలు చేయాలని కోరారు. ఎంఈఓ, డిప్యూటీ ఈఓ, డైట్ లెక్చరర్ల ఖాళీలను అడ్‌హక్ రూల్స్‌లో పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలన్నారు. ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించాలని కోరారు. ‘సావిత్రి’ వద్దు ‘సావిత్రి’ పేరుతో రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన సినిమా పోస్టరును రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర యూటీఎఫ్ అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయులను కించపరిచే విధంగా ఉన్న పోస్టర్లు ముద్రించవద్దని, అసలు సినిమా నిర్మాణమే వద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు మానవ హక్కుల క మిషనర్‌ను, నగర పోలీసు క మిషనర్‌ను కోరుతూ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం తీర్మానించినట్టు చెప్పారు. -
460 స్కూల్స్ క్లోజ్
ఆదిలాబాద్ టౌన్ : రేషనలైజేషన్ ఫలితం వల్ల జిల్లాలో 460 పాఠశాలలు మూతపడనున్నాయి. దసరా సెలవుల తర్వాత వీటికి తాళాలు వేయనున్నారు. ఇందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ రెండు రోజుల క్రితం జీవో 6 విడుదల చేశారు. రేషనలైజేషన్ ప్రక్రియ అమలుకు షెడ్యూల్, మార్గదర్శకాలు, సూచన లు జారీ చేయాలని పాఠశాల విద్య కమిషనర్‌ను ఉత్తర్వుల్లో ఆదేశించారు. మరో రెండు మూడు రోజుల్లో మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉందని విద్యాశాఖ భావిస్తోంది. ఇది అమల్లోకి రాగానే ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులకు స్థానచలనం కలగనుంది. ఈ జీవో ప్రకారం 19 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను కిలోమీటరు పరిధిలోని ఇతర పాఠశాలలో విలీనం చేస్తారు. 460 పాఠశాలలకు తాళం.. జిల్లాలో ప్రస్తుతం 3,017 ప్రాథమిక పాఠశాలలు, 419 ప్రాథమికోన్నత పాఠశాలలు, 428 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 17 వేల మంది ఉపాధ్యాయులు పాఠాలు బోధిస్తున్నారు. కా గా ఉత్తర్వుల సంఖ్య 6, రేషనలైజేషన్ ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 19 కంటే తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేయనున్నారు. ఈలెక్కన జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 290, ప్రాథమికోన్నత పాఠశాలలు 120 వరకు మూత పడనున్నాయి. అలాగే ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సం ఖ్య 75 కంటే తక్కువగా ఉంటే ఆ పాఠశాల మూత పడనుంది. జిల్లాలో పది ఉన్నత పాఠశాలలు, 40 సక్సెస్ ఉన్నత పాఠశాలలు మూత పడనున్నాయి. వెయ్యి మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ (రేషనలైజేషన్) ఉత్తర్వుల ప్రకారం 460 పాఠశాలల్లో పనిచేస్తున్న దాదాపు వెయ్యి మంది ఉపాధ్యాయులకు స్థాన చలనం కలగనుంది. వీరి పోస్టులు విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు మార్చుతారు. దీంతో ఈ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు పది వేల మంది విద్యార్థులు సమీపంలోని పాఠశాలలకు వెళ్లాల్సిందే. ఇందులో కొంత మంది విద్యార్థులు దూర భారం ఉండడంతో డ్రాపౌట్‌గా మారే అవకాశం ఉంది. కాగా రేషనలైజేషన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ జీవో ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణరెడ్డిని వివరణ కోరగా జిల్లాలో 460 వరకు పాఠశాలలు ఇతర సమీప పాఠశాలల్లో విలీనం కానున్నాయని తెలిపారు. ప్రభుత్వం జీవో 6ను విడుదల చేసిందని దీనికి సంబంధించిన మార్గదర్శాలు రావాల్సి ఉందన్నారు. -
మూత‘బడి’
ఖమ్మం : ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఏటా కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. ప్రైవేటుకు ధీటుగా విద్యాబోధన చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తున్నారు. అందుకు తగిన శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో బోధన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సంతృప్తి పర్చడం లేదు. దీంతో ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో నిబంధనల ప్రకారం రేషనలైజేషన్ ద్వారా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలకు మూసివేత గండం తప్పడం లేదు. ఇలా సంవత్సరాల తరబడి చరిత్ర ఉన్న పాఠశాలలు ఎత్తివేసే ప్రమాదం ఉందని జిల్లా విద్యాశాఖ అధికారులే చెపుతున్నారు. పొంచి ఉన్న రేషనలైజేషన్ గండం... తక్కువ మంది విద్యార్థులు ఉన్న చోట పాఠశాల నిర్వహించడం ఎందుకు ? అందుకోసం ఉపాధ్యాయులను, నిధులను కేటాయించి ప్రయోజనం ఏమిటి..? అని ప్రభుత్వం ఆలోచించింది. దీంతో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల జాబితాను తయారు చేసి పంపాలని ఉన్నతాధికారులు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 2013-14 విద్యాసంవత్సరంలో విద్యార్థులు లేని ప్రాథమిక పాఠశాలలు 9, 1 నుంచి 20 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 297, ప్రాథమికోన్నత పాఠశాలు 4, 21నుంచి 40 మంది లోపు విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలలు 862, ప్రాథమికోన్నత పాఠశాలలు 37 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక 75 మందిలోపు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలు 12 ఉన్నాయని అధికారులు చెపుతున్నారు. ప్రభుత్వం ఇటీవల సూచన ప్రాయంగా ప్రకటించిన లెక్కల ప్రకారం 20 మంది లోపు విద్యార్థులు ఉన్న పీఎస్‌లు, 6,7 తరగతులు కలిపి 40 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న యూపీఎప్లు, 75 మంది విద్యార్థులకంటే తక్కువగా ఉన్న హైస్కూళ్లు, సక్సెస్ స్కూళ్లను మూసివేయనున్నట్లు తెలిసింది. ఇదే అమలైతే జిల్లాలో సుమారు 600 ప్రభుత్వ పాఠశాలకు మూసివేత గండం ఉండే ప్రమాదం నెలకొంది. ఉపాధ్యాయుల్లో ఆందోళన... రేషనలైజేషన్ గండంతో జిల్లాలో పలు పాఠశాలలు మూసివేతకు దగ్గరలో ఉండటంతో ఆయా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో అందోళన నెలకొంది. ప్రధానంగా ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, సత్తుపల్లి, మధిర వంటి పట్టణాల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నట్లు తెలిసింది. దీనికి తోడు అయా ప్రాంతాలకు హెచ్ఆర్ఏ ఉండటం, రవాణా ఇబ్బందులు లేకపోవడంతో సాధ్యమైనంత వరకు ఆ పాఠశాలల్లోనే ఉండాలని పలువురు ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నారు. అయితే పలు పాఠశాలల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కన్నా ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో అక్కడి నుంచి బదిలీ తప్పదని ఆందోళన చెందుతున్నారు. కొద్దొగొప్పో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే పరిసర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులను బతిమిలాడి పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేయడంతో పాటు స్థానిక అధికారుల సహకారంతో రికార్డుల్లో విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనిచేస్తున్న 463 మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేయలేదు. దీనికి తోడు ఇప్పుడు రేషనలైజేషన్ ద్వారా మరో 800 ఉపాధ్యాయుల పోస్టులను సర్దుబాటు చేయాల్సి వస్తుంది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాలి: డీఈవో ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోబోమని డీఈవో రవీంద్రనాధ్‌రెడ్డి తెలిపారు. గత సంవత్సరం డైస్ ప్రకారం జాబితాను తయారు చేశామని, ప్రస్తుత పరిస్థితి చూసి విద్యార్థుల సంఖ్యలో తప్పులుంటే సరిదిద్ది పంపాలని ఎంఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.