8 వేల స్కూళ్లకు మంగళం
* రేషనలైజేషన్‌తో విలీనం కానున్న ప్రాథమిక పాఠశాలలు
* యూపీ, హైస్కూళ్లకూ హేతుబద్ధీకరణ ముప్పు
* గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ముఖ్యమంత్రి
* 8న టీచర్ల బదిలీల షెడ్యూల్?
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు ముందు పాఠశాలలను హేతుబద్ధీకరించాలన్న ప్రభుత్వ ఆలోచనతో రాష్ట్రంలోని ఎనిమిది వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు మూతపడనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం జాబితాను సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హేతుబద్ధీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఇక రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైల్‌పై సంతకం చేయగానే స్కూళ్లు మూతపడనున్నాయి. ఇందులో ఇప్పటికిప్పుడు విలీనం చేసే పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలుగా మార్పు చేసేందుకు వీలుగా ఉన్న పాఠశాలల జాబితాను ఫార్మాట్-ఏలో చూపించారు. ఫార్మాట్- బీలో మలిదశ విలీన పాఠశాలలను చూపించింది. ఇలా ప్రభుత్వ, ఎంపీపీ స్కూళ్లకు ఒక ప్రతిపాదనను, మున్సిపల్ స్కూళ్లకు మరో ప్రతిపాదనను సిద్ధం చేశారు.
తొలిదశ విలీన జాబితాలో ప్రభుత్వ, ఎంపీపీ పాఠశాలలు 4,854 ఉండగా 507 మున్సిపల్ పాఠశాలలు ఉన్నాయి. మలిదశ జాబితాలో ప్రభుత్వ, ఎంపీపీ పాఠశాలలు 2,762 ఉండగా, మున్సిపల్ పాఠశాలలు 95 ఉన్నాయి. తొలిదశలో ఆదర్శ పాఠశాలలుగా మారే స్కూళ్లు ప్రభుత్వ, ఎంపీపీ విభాగంలో 3,544, మున్సిపాలిటీల్లో 355గా ఉన్నాయి. మలిదశలో ప్రభుత్వ, ఎంపీపీ విభాగంలో 1,353 మున్సిపాలిటీల్లో 46గా ఉన్నాయి. హేతుబద్ధీకరణను కేవలం ప్రాథమిక పాఠశాలలకే పరిమితం చేయరాదని, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలనూ రేషనలైజేషన్ పరిధిలోకి ఇప్పుడే తీసుకువస్తే మంచిదని ప్రభుత్వంలోని పెద్దలు అధికారులకు సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను రేషనలైజేషన్లోకి తీసుకువస్తే అనేక సమస్యలు ఎదురవుతాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందు ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని పూర్తిచేశాక తదుపరి దశలో మిగతా పాఠశాలలకు హేతుబద్ధీకరణ చేపట్టవచ్చని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. హేతుబద్ధీకరణలో విలీనమయ్యే పాఠశాలల జాబితాను సిద్ధం చేసినందున మంత్రి దానిపై సంతకం చేసిన వెంటనే ఈ నెల 8వ తేదీన టీచర్ల బదిలీల షెడ్యూల్‌ను విడుదల చేయాలని భావిస్తున్నారు. బదిలీల వెబ్ కౌన్సెలింగ్‌పై అనుమానాల నివృత్తికి ఈ నెల 7వ తేదీన నమూనా వెబ్ కౌన్సెలింగ్‌ను ఆయా యూనియన్ ప్రతినిధుల ముందు నిర్వహించనున్నారు. అంతకు ముందు పాఠశాలల విలీన ప్రక్రియకు జిల్లాల విద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ఈ అంశాలపై మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.