‘ప్రాథమిక’ కోత
‘ప్రాథమిక’ కోత
Published Fri, Jun 16 2017 11:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:47 PM
– జిల్లాలో రెండు ప్రాథమిక పాఠశాలలు మూత
– 40 ప్రాథమికోన్నత పాఠశాలల స్థాయి తగ్గింపు
– ముగిసిన హేతుబద్ధీకరణ ప్రక్రియ
– జిల్లాలో మిగిలిన పోస్టులు 1044
కర్నూలు (సిటీ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా చేపట్టిన హేతుబద్ధీకరణ దాదాపు పూర్తి అయింది. దీంతో జిల్లా విద్యాశాఖ అధికారులు ఏ జిల్లాలో ఏయే పాఠశాలలు మూత పడుతాయి, స్థాయి తగ్గే స్కూళ్ల వివరాలను ఆన్‌లైన్‌లో పొందు పరిచారు. ఈ ప్రక్రియ పూర్తయితే దానిపైనే ఉపాధ్యాయుల బదిలీల దరఖాస్తు కొంతమేరకు ఆధారపడి ఉంది. జిల్లాలో ఆత్మకూరు మండలంలోని రెండు ప్రాథమిక పాఠశాలలు విద్యార్థుల సంఖ్య సింగిల్ డిజిట్‌లో ఉండటంతో వాటికి సమీపంలో ఉండే స్కూళ్లలో విలీనం చేశారు. దీంతో కేవలం ఆ రెండు స్కూళ్లు మాత్రమే హేతుబద్ధీకరణ వల్ల మూతపడనున్నాయి. అదేవిధంగా 40 ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పదిలోపు ఉండటం, స్కూలుకు, స్కూలుకు మధ్య ఉన్న దూరం 3కి.మీ మించి ఉండడంతో వాటి స్థాయిని ప్రాథమిక పాఠశాలగా తగ్గించారు. అయితే వీటిపై అభ్యంతరాలకు విద్యాశాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయ వర్గాల నుంచి కొంత వ్యతిరేకత వస్తోంది.
మిగిలిన పోస్టులు ఇవే..
జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో చేపట్టిన హేతుబద్ధీఖరణతో 1044 పోస్టులు మిగలనున్నాయి. వాస్తవానికి జిల్లాలో 3వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఈ మిగులు పోస్టులు ఖాళీలలో భర్తీ చేసిన తర్వాతనే క్లియర్ వేకెన్సీ లిస్టును విద్యాశాఖ అధికారులు ప్రదర్శించనున్నారు. ఈ జాబితా ఆధారంగానే ఉపాధ్యాయులు బదిలీల కోసం ఆప్షన్లు ఇచ్చుకుంటారు. అయితే ఉపాధ్యాయులు బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు శనివారం చివరి రోజు కావడంతో క్లియర్ వేకెన్సీ పొజిషన్ తెలియక.. కొంతమంది ఆప్షన్లు ఇచ్చుకోవడంలో గందరగోళానికి గురవుతున్నారు.
మిగులు ఇలా..
పాఠశాల మిగులు ఉపాధ్యాయుల సంఖ్య
ప్రాథమిక 237
ప్రాథమికోన్నత 52
ఉన్నత 755
మిగిలిపోయిన పోస్టులు ఇవే..
ప్రాథమికోన్నత పాఠశాలల్లో గణితం 5పోస్టులు, సామాన్య శాస్త్రం 10 పోస్టులు, సాంఘిక శాస్త్రం 16 పోస్టులు, గ్రేడ్–1 తెలుగు 12, గ్రేడ్–1 హిందీ–9 పోస్టులు మిగిలాయి. ఉన్నత పాఠశాలల్లో గణితం కన్నడ మీడియం 3 పోస్టులు, తెలుగు మీడియం 90, ఉర్దూ మీడియం 4, భౌతిక శాస్త్రం కన్నడ మీడియం 1, తెలుగు మీడియం 119, ఉర్దూ మీడియం 6, బయోలజికల్ సైన్స్ తెలుగు మీడియం 65, కన్నడ 1, ఉర్దూ 5, సోషల్ కన్నడ మీడియం 1, తెలుగు మీడియం 55, ఉర్దూ 5, ఇంగ్లిష్ 115, గ్రేడ్–1 తెలుగు 15, హిందీ 3, ఫిజికల్ డైరెక్టర్ 60, పీఈటీ 2, ఇతర పోస్టులు 114, తెలుగు భాష పండిత పోస్టులు 60, హిందీ భాషా పండిత పోస్టులు 4 మిగలనున్నాయి.
Advertisement
Advertisement